తెలుగు సాహిత్యంపై నక్సల్బరీ పతాకం. ఈ మాట ప్రతీకాత్మకం కాదు. వర్ణనామయం అంతకంటే కాదు. భారత సామాజిక చరిత్ర నక్సల్బరీలోకి ప్రవహించి విరసానికి జన్మనిచ్చింది. తెలుగు సాహిత్య కళా, మేధో రంగాల్లో నక్సల్బరీ చైతన్యానికి విరసం తల్లి వేరుగా నిలిచింది. శ్రీకాకుళ విస్ఫోటనలోంచి ప్రజ్వరిల్లిన ప్రత్యామ్నాయ పంథాను విరసం సాహిత్య రంగంలోకి తీసుకొని వచ్చి నక్సల్బరీకి సాంస్కృతిక ప్రతినిధి అయింది. సమూల మార్పు లక్ష్యంగా సాయుధపోరాటాన్ని స్వీకరించిన సామాజిక, రాజకీయ ఉద్యమంలో తాను అంతర్భాగమని సగర్వంగా ప్రకటించుకుంది. సాహిత్యంలో సాహసానికి, తిరుగుబాటుకు, ధిక్కారానికి చిరునామాగా నిలిచింది. అందువల్లే తీవ్ర అణచివేతను, నిర్బంధాన్ని, చివరికి నిషేధాన్ని ఎదుర్కొన్నది. ప్రజల మనిషిగా పునర్జీవమైంది.
నక్సల్బరీ శ్రీకాకుళ ఆదివాసీ విప్లవ శిశువుగా విరసం.. విప్లవోద్యమం వెనువెంట నడుస్తూ భారత పోరాట ప్రజల చరిత్రలో విస్తరిస్తోంది. సమాజంలోని ధిక్కారధారలన్నిటినీ ప్రభావితం చేస్తూ తాను వాటితో ప్రభావితమవుతోంది. విప్లవమంటే.. ప్రగతి దిశగా నేర్చుకోవడం, నేర్పించడం, మార్చడం, మార్పుకు లోనుకావడం అనే గతితర్క భావనకు సాహిత్య, మేధో రంగాల్లో తానే ఒక ఉదాహరణగా నిలిచింది. నిరంతరం సామాజిక వైరుధ్యాలను తట్టి లేపడం, వాటి బృహద్రూపాలను వెలికి తీయడం, వాటితో తలపడుతూ ప్రజలను పరిష్కర్తలుగా తీర్చిదిద్దడం, ప్రజల నేతృత్వంలో మార్పు దిశగా సాగడం.. అనే విప్లవాచరణలో విరసం ఎల్లవేళలా విద్యార్థి. తెలుగు నేల సరిహద్దులు దాటి సువిశాల మధ్య భారతదేశంమంతా, ఉత్తరాంధ్ర నుంచి ఒడిషా మీదుగా లాల్గడ్ అంతా విప్లవోద్యమం సాధించిన విస్తృతిని విరసం తన చైతన్యంలో అంతర్వాహినిగా మార్చుకున్నది. ప్రత్యామ్నాయ సామాజిక అభివృద్ధికి ప్రయోగశాలగా దండకారణ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న తరుణంలో విరసం తన సృజనశక్తినంతా ధారపోసి దాన్ని విశ్లేషిస్తున్నది. చిత్రిస్తున్నది. ఉత్పత్తి, వర్గపోరాటం, సాంఘిక విముక్తి లక్ష్యంగా సాగుతున్న దండకారణ్య విప్లవోద్యమంలోని సాహిత్య కళా వికాసాన్ని తెలుగు సాహిత్య సాంస్కృతికోద్యమంలో అంతర్భాగం చేస్తున్నది. ప్రజాసైన్యం, ప్రజాయుద్ధం అనే నుడికారం వాప్తవరూపం ధరించిన ఈ వర్తమానంలో ప్రజలపై భారత ప్రభుత్వం చేస్తోన్న యుద్ధంలో విప్లవం పక్షాన నిలబడదామని ఆలోచనాపరులతో చేయి కలపడమే విరసం తన ఏకైక సాంస్కృతిక కర్తవ్యంగా భావిస్తోంది.
నూరుపూలు వికసించనీ
వేయి ఆలోచనలు సంఘర్షించనీ
-----------
పతాక గీతం
-----------
ఎత్తినాం విరసం జెండా
అలలలలుగా వరదలొత్తు
పోరు పోరు జెండా
ఎత్తినాం విరసం జెండా
సుబ్బారావు పాణిగ్రాహి
సంధించిన కళలతోవ..
మా యెన్నెస్ ప్రకాశరావ్
మండించిన కథనంలో...
పరిటాలా రాములన్న
ప్రతిఘటనా పాదంల...
జ్ఞానేశ్వర్ జీవించిన
జానపదాల జాడల్లో...
కొ.కు. జగత్ పరిశీలన
కాగడాల కదలికలో...
మా చెర ఏతం బట్టిన
మంది పాట ఉరవడిలో..
మా శ్రీశ్రీ నినదించిన
విప్లవ గానంలో...
పదపదమున కదనభేరి మోగిస్తాం
గళగళమున క్రాంతి ఝంఝ
ఝులిపిస్తాం... IIఎత్తినాంII
వాడివాడిగా వీచిన
మా సలంద్ర వేడిలో
తూర్పు చలనమై రగిలిన
మా తిరుపాల్ బాటలో
అణచివేత కెదురీదిన
అబ్రహాం అలజడిలో
ప్రతీకార కెరటంలా
పొంగే ఈశ్వరి స్మృతిలో
చావునైన జ్వలియించిన
మా సముద్రు హోరులో
నూతన్ సహదేవరెడ్డి
ఎమ్మెస్సార్ దీక్షలో
కేవీఆర్ అందించిన
నాయకత్వ స్ఫూర్తితో
చలసాని అందించిన
అరుణతార వెలుగులలో..
పదపదమున కదనభేరి
మోగిస్తాం
గళగళమున క్రాంతి ఝంఝ
ఝుళిపిస్తాం ... IIఎత్తినాంII
జనం కాళ్లు చుట్టేసిన
సంస్కృతి సంకెలలు తెంచి.
చీకటి బతుకుల చేతికి
సూర్యుడ్నే అందించీ..
ప్రత్యూషం రెక్కలిప్పి
దిక్కుల నెగరేయుదాక
యువత జూలు విదిలించే
గర్జన హోరెత్తు దాక...
పదపదమున కదనభేరి మోగిస్తాం
గళగళమున క్రాంతి ఝంఝ
ఝుళిపిస్తాం ... IIఎత్తినాంII
కార్ఖానాల్లో కమిలే
కంకాళాల్ కదిలించీ..
కూలిదండు వెంట వెంట
కలం కవాతులు కలిపీ
నేలతల్లి చెరపీడన కూలేదాకా...
సమత పంట శ్రమ గూటికి నడిచేదాకా
పదపదమున కదనభేరి మోగిస్తాం
గళగళమున క్రాంతి ఝంఝ
ఝుళిపిస్తాం ... IIఎత్తినాంII
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |