అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !

| సంభాషణ

అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !

- ఇఫ్టూ ప్రసాద్ (పిపి) | 18.02.2019 09:45:37pm

రెండువైపులా రైతు బిడ్డల మధ్య ప్రభుత్వం సృష్టించిన అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !

ప్రియమైన మిత్రులారా,
తమని ఎంతో అల్లారు ముద్దుగా కనిపెంచిన తమ తల్లిదండ్రులకీ, తమని ప్రేమతో పెళ్లి చేసుకున్న భార్యలకీ, ఎన్నో ఆశలతో కన్న తమ పసిబిడ్డలకీ అతి దూరంగా జీవనోపాధి కోసం కొలువు చేస్తున్న సైనికుల వ్యధలు తెలిసిందే. దేశ సరిహద్దు ప్రాంతాలలో, ముఖ్యంగా గడ్డకట్టే మంచు కొండల్లో సైతం పనిచేస్తున్న సైనికుల బ్రతుకు బాధల పట్ల మన దేశ ప్రజల మనస్సులు "మంచు" వలె కరిగిపోవడం అత్యంత సహజమే. ప్రధానంగా నిరు పేదప్రజలు నివసించే మన పల్లెలూ, శ్రామిక వాడల పిల్లలే సైనికులలో అధిక సంఖ్యలో చేరడం ఒక నిజం. మన సాటి ఇరుగు పొరుగు ప్రజల కడుపున పుట్టి, మనమధ్యే ఆడుతూ పాడుతూ పెరిగిన మన తోటి పిల్లలే తమ బ్రతుకు దేరువుకోసం సైనికులుగా కొలువులలో చేరడం ఒక భౌతిక సత్యం! ఒక్కమాట లో చెప్పాలంటే ముఖ్యంగా నేడు చితికిపోతున్న మన దేశ గ్రామీణ వ్యవసాయ రంగమే మన దేశసైనిక రిక్రూట్మెంటు కి ప్రధాన క్షేత్రంగా ఉంది. "పెట్టుబడి" వివిధ రూపాలలో సాగించే వికృత దాడికి దెబ్బతింటూ వ్యవసాయరంగం బలి అవుతోంది. అది భూమి పుత్రులైన యువతను తన నుండి బయటకు గెంటి వేస్తున్నది. నిర్మాణాత్మక ప్రత్యామ్నాయ ఉపాధి లేకుండా బయటకు వెళ్ల గొట్ట బడుతున్న గ్రామీణ రైతు, కూలీల కుటుంబాల యువతే మన దేశ సైనిక రంగంలో ఇటీవల మరింత పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యం నుండి మొన్నటి దుర్ఘటనని పరిశీలిద్దాం.

మన తోనే బడిలో, కళాశాలలో చదివి బ్రతుకు దెరువుకై సైనికులుగా కొలువులో చేరిన జవాన్ల పట్ల మన ప్రజలకి ప్రేమాభిమానాలు మెండుగా ఉండటం సహజమే! వారిని ఆయా శ్రమ జీవుల పల్లెలూ, వాడలూ, బస్తీలూ తమ ప్రియతమ సంతతిగా గౌరవించడం కూడా సహజమే! అట్టితమ బిడ్డలు సుదూర ప్రాంతాల్లో "ఊరు కాని ఊరి"లో మృతి చెందిన (మరీ ముఖ్యంగా బలి కాబడ్డారని భావించిన) ప్రత్యేక సందర్భాల్లో వాళ్ళు పుట్టి పెరిగిన నేలలు కన్నీటి తో తడిసిపోవడం అత్యంత సహజమైనది. అందులో రాజకీయ, సైద్ధాంతిక, వర్గ, మానవీయ దృక్కోణాల విశ్లేషణల సంగతి ఎలా ఉన్నా, అలా విశేషంగా పౌర సమాజం స్పందించడం ఒక భౌతిక సత్యం. పైగా "విదేశి ఉగ్రవాద తండాల" చేతుల్లో తమ భూమిపుత్రులు బలి అయ్యారని తెలిసినప్పుడు మన పౌర సమాజం ఎంత తీవ్రస్థాయిలో ఆగ్రహిస్తుందో ఊహించుకోవచ్చు. సరిగ్గా 48గంటల క్రితం కాశ్మీరు లోయలో "ఉగ్రవాద దాడి" లో 40 మంది సైనికుల మృతి సంఘటనపై కూడా అలాంటి పెనుఆగ్రహావేశాలే వ్యక్తమయ్యాయి. అంత వరకూ ఒక పార్శ్వం. కానీ ఒకవేళ ప్రజల ఆగ్రహానికి కారణమైన పై "విశ్వాసం" నిజం కాకపోతే ఏమిటి? అదొక కొత్త ప్రశ్నగా మనకొక సవాలుని విసురుతుంది. మనదేశ ప్రజలలోని విశ్వాసానికీ వాస్తవానికీ మధ్య ఒకవేళ నిజంగానే వైరుధ్యం వుండి ఉంటే....?

నేడు మన దేశ ప్రజల "పరమ విశ్వాసం" ప్రకారం విదేశీ ఉగ్రవాద ముష్కర మూకల చేతుల్లో మన పిల్లలు (సైనికులు) అతి ఘోరంగా బలయ్యారు. కాశ్మీరులోయ విదేశీ ఉగ్రవాద తండాల అడ్డాగా మారింది. కాశ్మీరులోయని "మినీ పాకిస్తాన్"గా జమ కట్టి దానిపై భారీయుద్ధం ప్రకటించాలి. దానికోసం అయ్యే కర్చుకోసం మన ప్రజలపై మనసర్కార్ ఎన్ని వేల, లక్షలకోట్ల రూపాయల భారీ యుద్ధ సుంకాలని విధించినా చెల్లిద్దాం. ఇదీ మన గ్రామీణ రైతుకూలీల తో సహా పౌర సమాజం తరతమ స్థాయుల్లో నేడు స్పందించే తీరు! కానీ ఒకవేళ "భౌతిక వాస్తవం" మరొకటని రుజువైతే......?

ఇప్పుడు కాశ్మీరు లోయ పై స్వదేశీ, విదేశీ భూకబ్జా బడా కార్పొరేట్ కంపెనీల కన్ను పడింది. భూతల స్వర్గంగా పేరొంది, అంద చందాల ప్రకృతి శోభతో అలరారుతున్న వన్నెచిన్నెల కాశ్మీరు లోయ ని తమకి అప్పగించాలని కార్పొరేట్ కంపెనీలు నేడు ఎదురు చూస్తున్నాయి. ఈ దిశలో చట్టపర చర్యలని సర్కారు చేపడితే, అందుకు తగిన ప్రతిఫలంగా తమ చేతుల్లో గల కార్పొరేట్ మీడియాకి ఇదే సర్కారుని తిరిగి గద్దె పైకి తెచ్చే ప్రచార బాధ్యత ని కార్పొరేట్ కంపెనీలు అప్పగిస్తాయి. ఇంకా రేపటి ఎన్నికల అవసరాల కోసం పదులవేల కోట్లల్లో భారీ ఎన్నికల నిధిని సమకూర్చే బాధ్యతని కూడా అవి చేపడతాయి. నాలుగేళ్లుగా మోడీ సర్కారు ఈ దిశలో సాగించే "అప్పగింత ప్రక్రియ" ముందుకు సాగడంలేదు. అందుకు కారణం అడుగడుగునా కాశ్మీరు లోయ భూమి పుత్రులు సమరశీల ప్రతిఘటనా చైతన్యంతో అడ్డుకోవడమే. గత డెబ్భై ఏళ్ళ కాలంలో మిలిటెన్సీ ప్రధానంగా పాక్ సరిహద్దు ప్రాంతాలకే పరిమితం.గత నాలుగేళ్లుగా మొదటిసారి విస్తృతంగా దక్షిణ లోయలో వేళ్లూనుకోవడం జరిగింది. మోడీ సర్కారు భూముల అప్పగింత ప్రక్రియకు దిగిన తర్వాతే మొదటిసారి దక్షిణ లోయ కూడా మిలిటేన్సీ కి పెద్ద కేంద్రంగా మారింది. లోయలో శతాబ్దాలుగా, సహస్రాబ్దాలుగా జీవించిన స్థానిక రైతాంగాన్ని తమ భూముల నుండి వెల్లగొట్టి, అంబానీ, ఆదానీ వంటి సంపన్న కుటుంబాలకు పర్యాటక,వినోద, వ్యాపార, వాణిజ్య లాభదాహానికి అప్పగించే విధానం యొక్క పర్యవసానమిది. తర తరాలుగా తమకి అన్నం పెట్టిన సాగునేలని తమకి దక్కకుండా చేసే మోడీ సర్కారు దుష్ట లక్ష్యం నేడు అక్కడి భూమి తల్లి ప్రియ తమ బిడ్డలని అనివార్యగా తిరుగుబాటు దార్లుగా మారుస్తోంది. రక్తసిక్త మారణకాండతో వారి అణచివేత కోసం నేడు మన పిల్లలని మోడీ సర్కారు లోయలో మరింత కేంద్రీకరిస్తున్నది. అదే నేటి మారణకాండ నేపధ్యం!

సైనికదుస్తులు ధరించిన విశాల భారతదేశ బాధిత రైతుబిడ్డలు తుపాకులతో ఒకవైపు యుద్ధ సన్నద్ధులై మోహరించి ఉన్నారు. ఇది తాజా యుద్ధ నాణేనికి ఒకవైపు దృశ్యం! కాశ్మీరు లోయలో బడా కార్పొరేట్ రాబంధుల భూకబ్జా దాడి నుండి ఆకలి తీర్చే తమ పంట భూముల పరిరక్షణకై అనివార్యంగా మిలిటెంట్ దుస్తులు ధరించి తుపాకీ చేపట్టిన స్థానిక భూమి పుత్రులు మరోవైపు ఆయుధ సన్నద్ధులై నిలిచారు. ఈ విధంగా ఉభయ పక్షాల వైపు కూడా ప్రధానంగా రైతుబిడ్డల మధ్యే యుద్ధ సన్నద్ధస్తితి నెలకొనడం గమనార్హం. ఒక వైపు చితికిన వ్యవసాయ రంగం నుండి సృష్టించబడ్డ సాయుధుడైన సైనికుడు! మరోవైపు భూరాబంధుల చే అన్యాక్రాంతమవుతున్న కారణంగా సాయుధుడైన మిలిటెంట్! ఈ ఇద్దరు బాధిత, పీడిత రైతు, కూలీ సహోదరులని ముఖా ముఖి శత్రుశిబిరాలుగా సర్కార్ వ్యూహాత్మకంగా మోహరించింది. ఈ నేపధ్య రాజకీయస్థితి తాజా దాడికి పూర్వరంగంగా ఉంది. ఈ "యుద్ధోన్మాదం" కొనసాగితే రెండు వైపులా ప్రధానంగా మన రైతు, కూలీల బిడ్డలే సమిధలుగా మారతారు. అదే సమయంలో అటు పాకిస్తాన్, ఇటు భారత్ లూటీ సర్కార్లు మాత్రం "యుద్ధోన్మాదం" అనే లాభదాయక సరుకు తో "పునరధికారం" అనే రాజకీయ పెనులాభాలు పొందుతాయి. నిజానికి యుద్ధం ఒక అతి పెద్ద లాభదాయక పరిశ్రమ. అందులో తయారయ్యే అతివిలువైన సరుకే "యుద్ధోన్మాదం"! అది రేపటి 17వ లోక్ సభ ఎన్నికలకి అవసరమైనది. ఇలాంటి యుద్ధోన్మాద సృష్టి కోసం ఇప్పుడు "బడాకార్పొరేట్ భారత్" ఎదురు చూస్తోంది. ఈ అవగాహన, అంచనాలు మన భారత దేశ పౌరులకీ ఉండటం అవసరం. మన రైతు బిడ్డలు పాలకుల ఆర్ధిక, రాజకీయ ఉగ్రవాద విధానాలకు బలి కారాదు. అందుకై గుడ్డి విశ్వాసాలతో కాకుండా విజ్ఞత, విచక్షణ, వివేకతలతో స్పందిద్దాం-

No. of visitors : 288
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


భిన్నకోణంలో "పదేళ్ల ముంబై* *మారణ కాండ

పి. ప్రసాద్ (పిపి) ఇఫ్టూ | 06.12.2018 12:55:27am

IB అధికారుల వత్తాసుతో దేశంలో హిందుత్వ సంస్థలే పై బాంబు పేలుళ్ళని చేపట్టిన నేపద్యాన్ని నిర్ధారించిన పుస్తకమిది. IB శాఖ అలాంటి వ్యవస్తీకృత హిందుత్వ ఉగ్రవాద.....
...ఇంకా చదవండి

నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం

పొలారి, ఇప్టు | 20.01.2019 11:43:27am

నెల్లిమర్ల కార్మికోద్యమం ఆనాడు "మినీ చికాగో"గా అభివర్ణించబడింది. అది నాడు ప్రారంభమవుతున్న నూతన పారిశ్రామిక, ఆర్థిక విధానాలపై భారతదేశంలో తలెత్తిన తొలి సమర.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఆగస్టు 2019

  ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
  వేటగాడి వల
  పదునెక్కుతున్న కోరలు
  ఎదురుచూపులు
  యురేనియమం
  మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
  నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
  దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
  చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
  ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •