306

| సాహిత్యం | క‌థ‌లు

306

- ఎం.కె. కుమార్‌ | 02.03.2019 04:29:14pm


తిరప్తి రుయా హాస్పిటల్ బర్నింగ్ వార్డు ముందర జీపు దిగిన ఎస్ఐ మునిరెడ్డికి కానిస్టేబుల్ పరమశివం లోపలికి దారి చూపిస్తున్నాడు. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. తిరప్తి చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఏ అఘాయత్యం జరిగినా బతికేదానికి రుయాహాస్పిటల్‌కే రావాల. ఒళ్లు కాల్చుకున్నోళ్లు ఈ బర్నింగ్ వార్డులోనే సేదతీరాల. తమషాగా వార్డు ముందర పొడుగ్గా పెరిగిన చెట్లలో ఒక్క పిట్టగాని, కాకిగాని వుండదు. ఆ చెట్లు ఎప్పుడూ శోకదేవతల్లాగా ఊసూరుమంటుంటాయి. రోజులో కనీసం రెండు, మూడు సార్లన్నా అదే చెట్లకింద జనాలు గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటారు. బర్నింగ్ వార్డులో చనిపోయిన తమ వారి కోసం హృదయవికారకంగా ఏడ్వడం ఇక్కడ నిత్యం జరిగే తంతే.

పోలీసు జీపు బర్నింగ్‌వార్డు ముందర ఆగింది. ఎస్ఐ మునిరెడ్డికి 30 ఏళ్ల వయస్సు వుంటుంది. గ్రూప్ వన్ రాసి, రాసి విరక్తి చెంది, ఒడ్డు పొడుగు వున్నాకదా అనే ధైర్యంతో ఈ ఎస్ఐ పోస్టుకు వచ్చినాడు. నానా హైరానాపడి, ఎట్టకేలకి అన్నీ నెగ్గాడు. 5 లక్షలు లంచమిచ్చి మరీ తిరప్తి, ఈస్ట్‌పోలీస్ స్టేషన్‌లో పోస్టింగ్ వేయించుకున్నాడు. ఇక్కడైతే దండిగా పిండుకోవచ్చని అతని మిత్రులు ఉచిత సలహా ఇచ్చినారు. ఇదే అతని మొదటి బర్నింగ్ కేసు.

ʹʹ ఏం జరిగింది ʹʹ కానిస్టేబుల్‌తో ఎస్ఐ పొడిగా అన్నాడు.

ʹʹ ఈ రోజు మధ్యాహ్నం ఈమె కిరోసిన్ పోసుకుని కాల్చుకుందంట సార్. ఒళ్లంతా క్యార్బరీ చాక్లెట్‌లా నల్లగా అయిపోయింది సార్ ʹʹ నోటితో పబ్లిగం నములుతూ క్యాజువల్‌గా చెప్తున్నాడు కానిస్టేబుల్ పరమశివం. కానిస్టేబుల్ ఈజీనెస్ చూస్తుంటే ఒళ్లుమండుతోంది ఎస్‌ఐకి. అది కనబడనీయకుండా వుండేదానికి ప్రయత్నిస్తున్నాడు.

ʹʹ ఇక్కడే సార్ ʹʹ ఓ రూమ్‌లోకి దారిచూపిస్తూ మూడో బెడ్ వద్ద ఎస్‌ఐని ఆపాడు. ఆ రూమ్‌లో చాలా బెడ్‌లున్నాయి. ప్రతి బెడ్‌చుట్టూ దోమతెర కప్పినట్టు పేషెంట్‌ను కనిపీకుండా కవర్ చేశారు. చర్మం కాలిన వాసన గుప్పని కొడతా వుంటే, ఎస్ఐ ప్యాంటు జేబులో నుంచి తెల్లని ఖర్చీఫ్‌ని ముక్కుకి ఆనిచ్చుకున్నాడు. కానిస్టేబుల్ ఒక బెడ్ దగ్గర నిలబడి దుప్పటిని సగం తొలగించాడు. ఆమె మెడనుండి ఆకుపచ్చ వస్త్రం కప్పున్నారు. ఆ వస్త్రాన్ని కానిస్టేబుల్ నిదానంగా తీశాడు. శరీరమంతా బాగా కాలిపోయింది. మొహం నల్లగా మాడిపోయింది. అక్కడక్కడా మొహం మీద చర్మం మచ్చలుగా వుంది. కనురెప్పలు పూర్తిగా కాలిపోయాయి. కళ్లు మూసుకోనుంది. బహుశా తెరవలేదేమో. పెదాలు అంటుకుపోయినట్టున్నాయి. ఎస్‌ఐకి కడుపులో దేవినట్టు అయింది. చూడలేక మొహం పక్కకి తిప్పాడు. కానిస్టేబుల్ ఎస్‌ఐని గమనిస్తూ, వస్త్రం కప్పేశాడు. పాపం కొత్త కదా అనుకుంటూ, ఇంకా బెదరగొట్టాలని,

ʹʹ ఏమ్మా, ఎస్ఐ గారొచ్చారు. కళ్లు తెరువు ʹʹ అన్నాడు.

ఆమె కనుగుడ్లు కొంచెం కదపబోయింది.

ʹʹ ఫర్లేదమ్మా, ఇబ్బంది పడద్దు, ప్రశాంతంగా వుండండి, కళ్లు తెరవద్దు ʹʹ ఎస్ఐ చిన్నగా అన్నాడు, కానిస్టేబుల్ వైపు చురాచురా చూస్తూ.

ʹʹ వీళ్ల బంధువలెవరన్నా వచ్చారా ʹʹ ఎస్త్సై చుట్టూ చూస్తూ అన్నాడు.

ʹʹ లేద్సార్ ఈమె భర్త ఇప్పుడే డాక్టరు మందులు రాసిస్తే, తెచ్చేదానికి బయటకెళ్లాడు ʹʹ కానిస్టేబుల్ చెప్పాడు.

ʹʹ ఈమె మాట్లాడుతుందా ʹʹ ఎస్ఐ మళ్లీ అడిగాడు.

ʹʹ లక్షణంగా, ఏమ్మా నీ పేరు చెప్పు ʹʹ గట్టిగా అరిచాడు కానిస్టేబుల్. ʹʹ యో, బెదరగొట్టదయ్యా ఆమెని. కొంచెం నెమ్మదిగా మాట్లాడు ʹʹ ఏస్ఐ కానిస్టేబుల్‌ని విసుక్కున్నాడు.

మళ్లీ ఎస్ఐ ʹʹ మనం కోర్టుకు లెటరు పెట్టాం కదా. మెజిస్ట్రేట్ వచ్చి ఈమె దగ్గర మరణ వాంగ్మూలం తీసుకున్నారా. అప్పుడు మన ఏఎస్ఐ వున్నాడా ʹʹ ఆరా తీశాడు.

ʹʹ వున్నారు సార్, కరెక్ట్‌గా సాయంత్రం 4 గంటలకి మెజిస్ట్రేట్ గారు మరణ వాంగ్మూలం తీసుకున్నార్ సార్ ʹʹ

ʹʹ ఏమ్మా నీ పేరేంపేరు ʹʹ మెత్తగా అడిగాడు ఎస్ఐ.

ʹʹ మీనా సార్ ʹʹ సమాధానం స్పష్టంగా వచ్చింది.

ఎస్ఐ భావాల్ని కనిపెట్టిన కానిస్టేబుల్ ʹʹ సార్, కాలినోళ్లు చాలా యాక్టివ్‌గా వుంటారు. ఆరే దీపానికి వెలుగెక్కువన్నట్టు బాగా మాట్లాడుతారు, లేచి తిరుగుతారు కూడా సార్ ʹʹ అతని అనుభవాన్ని రంగరిస్తూ చెప్పాడు.

ʹʹ సర్లేవయ్యా, పేషెంట్ ముందర ఆ మాటలెందుకు ʹʹ ఎస్ఐ కసురుకున్నాడు.

ʹʹ డాక్టర్ సార్ చెప్పారండి ʹʹ మీనా చిన్నగా అంది.

ʹʹ ఏమని ʹʹ విస్తుపోతూ అడిగాడు ఎస్ఐ

ʹʹ నేను బాగా కాలిపోయినానంట, దాదాపుగా 70 శాతం కాలిందంట, బతికే ఛాన్సు తక్కువంట, కాని ప్రయత్నిస్తామన్నారు. ఎవరన్నా చూడాల్సినోళ్లుంటే తొందరగా పిలిపించుకోమన్నారు ʹʹ మీనా చెప్పుకుపోతూ వుంది. ʹʹ డాక్టర్లు ఇంత పనికిమానోళ్లా, పేషెంట్‌కే చస్తావని చెపుతారా ʹʹ ఎస్ఐ కానిస్టేబుల్‌తో అన్నాడు. ʹʹ దానిదేముంది సార్, చచ్చేముందరే కదా సార్, మనం కూడా మరణ వాంగూల్మం తీసుకునేది ʹʹ డాక్టరు, పోలీసు ఇద్దరూ వెధవలే అన్నట్టుంది కానిస్టేబుల్ వాదన.

ఎస్‌ఐకి సందేహం వచ్చి ʹʹ ఏమ్మా నీకు మాట్లాడేటప్పుడు నొప్పిగా వుంటే చెప్పు, నేను బాగయినాక వచ్చి మాట్లాడతా ʹʹ అనునయంగా అన్నాడు.

ʹʹ లేదండి ʹʹ అంటూ మీనా చిన్నగా కళ్లు తెరిచింది. మీనా కళ్లల్లో తను అనుభవించే బాధకన్నా, తను చచ్చిపోతానన్న భయం స్పష్టంగా తెలుస్తోంది. ఇంతలో నర్సొచ్చి ఆమెకి తగిలించిన సెలైన్ బాటిల్లోకి ఇంజెక్షన్ మందు వేసి, మళ్లీ టకటక వెళ్లిపోయింది. ఒక పెద్దాయన మీనా మంచం దగ్గరకి మందులు సంచితో వచ్చాడు. ఎస్‌ఐని చూడంగానే భయంగానే చేతుల్తో నమస్కారం పెట్టాడు.

ʹʹ సార్ ఇతనే ఈమె భర్త, వీడి పేరు మూర్తిʹʹ అలాగే మూర్తి వైపు తిరిగి ʹʹఎస్ఐ సారు, నీ పెళ్లాన్ని ఇంటరాగేషన్ చేస్తున్నాడు, నువ్వు బయట నిలబడు, పిలిచినపుడు రా ʹʹ కానిస్టేబుల్ హూంకరించాడు. ముసలాయన తడబడే అడుగులతో బయటకెళ్లాడు. ఎస్ఐ కానిస్టేబుల్ని కూడా బయటుండమని సైగ చేశాడు.

ʹʹ ఏమ్మా, ధైర్యంగా నిజం చెప్పు, నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను ʹʹ ఎస్ఐ సానుభూతిగా అన్నాడు.

ʹʹ నిజం చెపితే అన్యాయం చేస్తార్ సార్ ʹʹ

ఏస్‌ఐకి అర్ధం కాక ʹʹ ఎందుకలా ʹʹ

ʹʹ తెల్లార్తోనే మా ఆయన తాగివచ్చినాడు సార్. నేను గొడవపడ్డా, ఆయన కొట్టాడు. దానికి కోపమొచ్చి, కిరోసిన్ పోసుకుని అగ్గిపుల్లతో అంటించుకున్నా సార్ ʹʹ చెప్పేటప్పుడు మీనా గొంతు కొంచెం వణికింది.

ʹʹ చూడు మీనా, నీవు ఆత్మహత్య చేసుకున్నా, దానికి కారణం అయిన వాళ్ల మీద ఐపిసి 306 కింద, అంటే ఆత్మహత్యకు ప్రేరేపించిన దానికి కేసు పెట్టక తప్పదు, కాబట్టి నిజం చెప్పు ʹʹ ఎస్ అన్నాడు.

మీనా గమ్మునుంది. ఎస్ఐ మళ్లీ ʹʹ సరే మీ అమ్మ, నాన్న లేరా, వారింకా రాలేదెందుకనిʹʹ.

ʹʹ వాళ్లు రారు సార్, వాళ్లేప్పుడో నీళ్లొదిలేసినారు ʹʹ మీనా బాధగా అంది.

ఆ కాలిన మొహంలో ఫీలింగ్స్ ఎస్‌ఐకి అసలు అర్ధం కావట్ల.

ʹʹ ఏమన్నా గలాటాలా ʹʹ

ʹʹ లేద్సార్ నేను చేసిన వెధవ పని వల్లే, వాళ్లు రారు సార్ ʹʹ మీనా కళ్లు పక్కకి తిప్పుతుంటే, ఎస్ఐ ʹʹ ఏంకావాలి ʹʹ అని అడిగాడు.

ʹʹ నీళ్లు సార్ ʹʹ ఎస్ఐ లేచి మంచం కిందనున్న నీళ్ల బాటిల్ మూత తీసి, ఆమె తెరిచిన నోటిలో కొంచెం, కొంచెంగా పోశాడు.
ఇతర పేషెంట్ల పక్కనున్నోళ్లు ఎస్ఐ అంతటోడు నీళ్లు పోస్తుంటే విడ్డూరం చూసినట్టు చూస్తా వున్నారు. నీళ్లు తాగి మీనా చెప్పసాగింది.

ʹʹ సార్, నాకు మా అమ్మ తమ్ముడుతో 18 ఏళ్లు వచ్చేనాటికే పెళ్లి చేసినారు. వాడొట్టి తాగుబోతు. చీటికి మాటికి కొట్టేవాడు. ఏ పని చేసేటోడు కాదు. ఏదో మూడెకరాల మాగాణుందని మా వోళ్లు ఇచ్చినారు ʹʹ కొంచెం సేపు ఆగింది. ʹʹ నేనప్పటికే ఇంటర్ పాసయినా, నర్సు ఎగ్జామ్స్ రాయిచ్చమని మా అమ్మని తెగ పోరుపెడుతుంటే, తిరప్తిలో చేర్చేదానికి ఎలబారినారు. మా ఆయన ఆరోజు చేసిన గలాటా అంతా ఇంతా కాదు. నన్ను జుట్టుపట్టి ఇంట్లో నుండి ఈడ్చుకొచ్చి రోడ్డులో పడేసి మరీ తన్నాడు. ఆయన పదో క్లాసు కూడా పాసవలా. నాకు లేని సదువు నా పెళ్లాంకెందుకని చావబాదాడుʹʹ. మీనా వెల్లకిలా పనుకుని మాడ్లాడుతోంది. చిన్న కన్నీటిచుక్క కంటి నుండి దూరమై బుగ్గమీద తామరాకు మీద నీటి బొట్టుమల్లే నిలిచింది. ఏ క్షణమైనా అది జారి పగలొచ్చు. ఆ నీటి బొట్టును చూస్తూ ఎస్ఐ మునిరెడ్డి వింటున్నాడు.

ʹʹ దానితో మా పుట్టింటోళ్లు, నన్ను చదవనంపేదానికి పంపియ్యల, ఆ పక్కరోజు నేనింటి నుండి ఎవరికి చెప్పకుండా తిరప్తి కొచ్చినాʹʹ మీనా ఆగింది. మునిరెడ్డి లేచి ఫ్యాను గాలి కొంచెం పెంచాడు.

ʹʹ వచ్చి ఎన్నాళ్లైంది ʹʹ ఎస్ఐ అడిగాడు.

ʹʹ మూడు సంవత్సరాలు ʹʹ.

ʹʹ మరి నర్సింగ్ చేశావా ʹʹ

ʹʹ లేద్సార్, ఆ పంతంతోనే ఇంటి నుండొచ్చినా, తిరప్తిలో ఎవ్వరూ తెల్వక, కొండమీద కర్ణాటక సత్రాల్లో చేరినా. అక్కడే ఈ పెద్దాయన నన్ను చేరదీశాడు. నాకు అన్నీ తానై నిలిచాడు. నన్ను నర్సింగ్ చదివిస్తా నన్నాడు. కాని షరుతుగా నన్ను తనతోనే వుండమన్నాడు. గత్యంతరం లేక ఒప్పుకున్నాను సార్ ʹʹ. మీనా కళ్లు తెల్లగా మల్లిపువ్వు మాదిరున్నాయి.
ʹʹమీదే వూరు ʹʹ

ʹʹ మదనపల్లె కాడ చిన్న పల్లెసార్ ʹʹ

ʹʹ మీ అమ్మవాళ్లు, నీ మాజీ భర్త రారా ʹʹ

ʹʹ ఏంటికొస్తార్ సార్, నేను వాళ్లని కాదని వచ్చేసి, ఇంకోడితో కాపురం చేస్తావుంటే ఎట్టొస్తార్ సార్ ʹʹ.

ʹʹ సరే ఇంతకీ నీకు జరిగిన విషయం చెప్పి, మీ బంధువలకు ఫోన్ చేశారాʹʹ ఎస్ఐ అడిగాడు.

ʹʹ అన్నీ అయినాయ్, ఛస్తే శవాన్ని కూడా చూసేదానికి కూడా రామన్నారు ʹʹ మీనా గొంతు పూడకపోయింది.
ఎస్ఐ మునిరెడ్డి కొంచెం సేపు మౌనంగా వున్నాడు.

ʹʹ సరే మీనా నేనొస్తాను, డాక్టరుతో మాట్లాడి నిన్ను జాగ్రత్తగా చూసుకోమంటాను. నువ్వు ఖచ్చితంగా కోలుకుంటావ్. ఇదే హాస్పిటల్లో నిన్ను నర్సుగా జాయిన్‌్ చేస్తాను, సరేనా ʹʹ ఎస్ఐ ఆమెను ఊరడించడానికి నవ్వుతూ అన్నాడు.

మీనా కళ్లు చిన్నగా నవ్వాయి. కళ్లు కూడా నవ్వుతాయ్ అని మునిరెడ్డికి అప్పుడే తెలిసింది.

ʹʹ ఏం నవ్వుతున్నావ్ʹʹ

ʹʹ నర్సు కోర్సు పూర్తయితే కదా సార్ నర్సయ్యేదిʹʹ

ʹʹ అదేంటి మూర్తి (పెద్దాయన) నిన్ను నర్సు కోర్సు చదివిస్తానంటే కదా నీవు కాపురం జేసింది ʹʹ ఎస్ఐ అన్నాడు.

ʹʹ అది ఒక ఆర్నెల్లే సార్, ఆ తరువాత ఆయనికి అనుమానం మొదలైంది, అతనికి నలభై, బాగా బలహీనంగా వుంటాడు. నా వెనకాలే కాలేజీకి వచ్చేవాడు. రోడ్డులో తలదించుకొని నడవమంటాడు. ఎవ్వరితో నవ్వుతూ మాట్లాడొద్దంటాడు. ఎవరన్నా నాతో మాట్లాడితే నన్ను బండమూతులు తిడుతూ, సంబంధాలంట గడతాడు. చివరకు కాలేజీ మాన్పించి నన్ను కూడా అతనితో పాటు పనికి తీసుకెలడానికి మల్లుకున్నాడు. నాకు తెలీకుండానే నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. జీవితంలో పోరాడే ఓపిక లేక యాడకిపోయినా ఇదే బతుకని ఈడ్సుకొస్తున్నా ʹʹ మీనా కొంచెం సేపు ఆగింది.

ʹʹ మూడ్నెళ్ల కిందే కొడుకు పుట్టినాడు సార్. వాడు పుట్టిన కాడ్నుంచి, వాడెవడు కొడుకని అడుగుతున్నాడు సార్ ʹʹ మీనా ధారాపాతంగా ఏడుస్తోంది. మనిషి అదుర్తోంది. ఎస్ఐ మునిరెడ్డి కళ్లెంట నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. తన ఖర్చీఫ్‌ని తీసి మీనా కళ్లకింద మెత్తగా అద్దాడు. తెలీకుండానే మీనాతో అతనికి తెలియని ఆత్మీయత ఏర్పడింది.

కొంచెం సేపటికి మీనా తేరుకుంది. ʹʹ వీడితో ఏగలేక క్షణం క్షణం చావడం కంటే ఒక్కసారే చావడం మేలని పించింది. అప్పుడే రేషన్ షాపు నుండి తెచ్చిన కిరోసిన్ మీద పోసుకుని అగ్గిపుల్ల ʹʹ మాటలు రాక మీనా ఆగిపోయింది. ఎస్ఐ కళ్లు తుడుచుకున్నాడు. ఐదు నిమిషాలు భారంగా గడిచాయి. ఇంతలో అదే గదిలో ఒక పేషెంటు దగ్గరకి డాక్టరు, నర్సులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పేషెంట్‌కు కరెంట్ షాకిచ్చారు. అయినా లాభం లేదనుకుని వెనుదిరిగినట్టున్నారు. పెద్ద పెట్టున బంధువులు ఏడ్వడం మొదలుపెట్టారు. వార్డుబాయ్స్ చనిపోయిన పేషెంట్‌ను స్ట్రెచర్‌లో పడుకోబెట్టి, పైన తెల్ల బ్లాంకెట్ పెట్టి బయటకు తీసుకెళ్లారు. వెనకాలే ఏడుపులతో పేషెంట్ తాలూకా వాళ్లు వెళ్లారు. ఎస్ఐ అక్కడుండలేక మీనాకి ధైర్యం చెప్పి, ఓదార్చాడు. సూటిగా చూస్తున్న ఆమె చూపులో భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ బయటకొచ్చాడు.

తిరప్తి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ తన ఛాంబర్‌లో కూర్చోనున్నాడు. బయట జనాలు చిన్న, చిన్న గ్రూపులుగా మాట్లాడుకుంటున్నారు. కొట్టుకున్నోళ్లు, వస్తువు పోగొట్టుకున్నోళ్లు, వ్యభిచారం చేసే వాళ్లు, రకరకాలోళ్లు ఆడనే వున్నారు. కేసు కట్టకుండానే సిఐ పరిధిలోనే ఇవన్నీ సెటిలై పోతుంటాయి. న్యాయస్ధానాన్ని కన్నా పోలీసు స్టేషన్నే సామాన్యులు ఎక్కువ విశ్వసిస్తారు. ఇక్కడ రేడీమేడ్ అన్యాయం అమ్మబడుతుంది. న్యాయ, అన్యాయాల కన్నా తొందరగా విషయం సెటిలైపోవడమే ప్రజలకు కావల్సింది. ఏఎస్ఐ రూమ్‌లోకి వచ్చి ఎస్‌ఐకి సెల్యూట్ చేశాడు. ʹʹ బయట ఎవరున్నా ఒక అరగంట తర్వాత పంపించు. చిన్నవి నీవే సెటిల్ చెయ్యి ʹʹ ఎస్ఐ గంభీరంగా అన్నాడు. ఏఎస్ఐ సన్నగా నవ్వాడు. ఎందుకంటే సెటిల్‌మెంట్ డబ్బు తన జేబులోకే పోతుంది. ఎస్ఐ మునిరెడ్డి మరీ కక్కుర్తి మనిషి కాదు. అట్లని మంచోడేం కాదు. పెద్ద కేసుల్లోనే జోక్యం చేసుకుంటాడు. చిన్న, చితకాకు ఆశపడడు. ఇంకా ముదర్లేదనే చెప్పచ్చు. అయినా ఈ కాలంలో ఏదో ఒక సున్నాకు మనిషి తన వ్యకిత్వాన్ని కోల్పోవాల్సిందే. ఒకటి పక్కన ఎన్నిసున్నాలకు పడిపోతే వాడంతా కాస్ట్‌లీ వెథవన్నమాట. కానిస్టేబుల్ పరమశివం లోపలికొచ్చాడు. అతని వెనకాలే మీనా భర్త మూర్తి లోపలకి వచ్చాడు.

ʹʹ పరమశివం, వాడి గుడ్డలిప్పతీసి కింద కుర్చోపెట్టు ʹʹ ఎస్ఐ హుంకరించాడు.

ʹʹ సార్ డ్రాయర్ లేద్సార్ ʹʹ నసిగాడు మూర్తి.

ఎస్ఐ ఒక్కదుటున లేచి కుడికాలితో మూర్తి గుండెల మీద ఎగిసి తన్నాడు. మూర్తి శరీరం గోడకి ధబేలున తాకింది. కిందపడ్డోడు మూలుగుతూ పైకి లేవబోయాడు. ʹʹ సార్ చెప్పినప్పుడు ఎదురు మాట్లాడకు, తింగర వేషాలు వేయక, ఆ చొక్కావిప్పు ʹʹ పరమశివం కొంచెం నెమ్మదిగా, కొంచెం కుటువుగా మూర్తితో చెప్పాడు. ఎస్ఐ మునిరెడ్డికి కోపంతో నరాలు పొంగుతున్నాయి. మీనాను ఆ పరిస్థితుల్లో చూసినప్పటినుండి ఎందుకో మనిషి ఊగిపోతున్నాడు. ʹʹ నీ పెళ్లాన్ని కిరోసిన్ పోసి అంటించావ్ కదా, మిగిలిన కిరోసిన్, అగ్గిపెట్టె తీసుకురా. నీతో పాటు మా కానిస్టేబుల్‌ను తీసుకుపో , ఐదు నిమిషాల్లో ఈడుండాలి, కొడకాʹʹ ఎస్ఐ పళ్లు కొరుకుతూ అరిచాడు.

ʹʹ సార్ ʹʹ మూర్తికి మాటలు రావడం లేదు. మనిషి మొత్తం సన్నగా వణుకుతున్నాడు. కాళ్లు తెలియకుండానే వంగిపోయినాయ్, మధ్యలో పరమశివం కల్పించుకుని ʹʹ సార్, వీడి పెళ్లాం ఆత్మహత్య చేసుకునే ముందర బాగా తాగివుందట సార్, దానికి ఎవడితోనో సంబంధం కూడా వుండిందంట సార్, అందుకే వీడు బాగా కొట్టాడంటʹʹ.
ʹʹ అందుకే ఈ నా కొడుకు చంపాడాʹʹ ఎస్ఐ అరిచాడు.

ʹʹ అబ్బే లేద్సార్ , ఆ అమ్మాయి కిరోసిన్ పోసుకుని నిప్పటించుకునేటప్పుడు వీడు లేడు సార్, అన్నం బాగా లేదని, బయట హోటళ్లో తెచ్చేదానికి పూడ్సినాడు సార్ ʹʹ పరమశివం అన్నాడు.

ʹʹ రేయ్ ఇట్లా రారా ʹʹ ఎస్ఐ మార్తిని పిలిచాడు. చలికి ముడుక్కున్నట్టు ముడుక్కుని చిన్నంగా ఎస్ఐ దగ్గరికి వచ్చాడు మూర్తి. ʹʹ ఇప్పుడేం చెయ్యాలనుకున్నావ్, ఇంకో పెళ్లి చేసేనా నీకు ʹʹ ఎస్ఐ వాడి కళ్లలోకి సూటిగా చూస్తూ అన్నాడు.

ʹʹ సార్ సార్, మీరొదిలేస్తే, దాని దగ్గరికెళ్లి సేవ చేసుకుంటా సార్, నా కనుమానమే గాని, అదంటే ప్రేమ సార్, ఇప్పుడు దానికి నేను తప్తే, ఎవ్వరూ లేరు సార్, పాపం పిచ్చిది, నా మీద కోపంతో కిరోసిన్..ʹʹ మూర్తి ఏడుస్తూ గొణుగుతున్నాడు.

ʹʹ పరమశివం వీడి దగ్గర స్టేట్‌మెంట్ తీసుకుని వీడ్ని సెల్‌లో వెయ్యి ʹʹ ఎస్ఐ కుర్చీలో వెనక్కి వాలుతూ కళ్లు మూసుకున్నాడు. పది నిమిషాల తర్వాత పరమశివం లోపలికి వచ్చాడు. ఎస్ఐ కళ్లు తెరిచాడు. ʹʹ ఎంత తీసుకున్నావ్, వాడి దగ్గర ʹʹ పరమశివం జేబు చూస్తూ అడిగాడు. ప్యాంట్ జేబులో బైటకొచ్చిన నోట్లను లోపలికి కుక్కుకుంటూ పరమశివం ఒక వెకిలినవ్వు నవ్వాడు.
ఎస్ఐ కంటి సైగతో పరమశివం కుర్చీలో కుర్చొన్నాడు. పరమశివానికి 55 సంవత్సరాలుంటాయి. అతని అనుభవానికి, సర్వీసుకి గుర్తుగా తలపైన వున్న పది వెంట్రుకలు విజయగర్వంతో ఊగుతున్నాయ్.

ʹʹ సార్ మీకు తెలియంది కాదు. అయినా చిన్న మనవి ʹʹ నసిగాడు పరమశివం.
ʹʹ ఏంటి ʹʹ

అది చాలు పరమశివానికి అల్లుకుపోవడానికి.

ʹʹ ఇదేమంత పెద్ద కేసు కాద్సార్, ఆడోళ్లు చీటికి మాటకి ఏదో ఒకటి సేసుకుంటార్ సార్, ఆ తర్వాత బలయ్యేది, వాళ్ల పిల్లలు, మొగుళ్లే సార్ ʹʹ. ఎస్ఐ గమ్మునుండటంతో పరమశివం ఇంకా తగులుకున్నాడు. ʹʹ ఇప్పుడు మీనా వుంది, అదేమన్నా పతివ్రతా. కాదు. మదనపల్లిలో ఒక మొగుడ్ని వదిలేసింది. కన్న అబ్బా, అమ్మను వదిలేసి సెప్పాపెట్టకుండా తిరప్తి వచ్చేసింది. ఇక్కడేమో వీడ్ని తగుల్కుంది. వీడైతే ముసలోడు కాబట్టి, తను ఆడిందాటగా సాగుతుందనుకుంది. వీడూ మొగాడే కద్సార్, ఎన్నాళ్లు గమ్మునుంటాడు. వీడు కొట్టడం మొదలెట్టాడు. అది ఎదురుతిరిగింది. అయినా వీడు పట్టు వదల్ల. ఇంక లాభం లేదనుకుని, వీడ్ని భయపిద్దామనుకుంది. వీడు బయట్నిండి వచ్చే టయానికి కిరోసిన్ నెత్తిమీద పోసుకుని, అగ్గిపెట్టె తీసుకుని బెదరించబోయింది. చివరికి తను తీసుకున్న గోతిలో అదే ధబీమని పడింది. తగలబడిపోయిందిʹʹ ఆయాసం తీర్చుకునేదానికి పరమశివం కొంచెంసేపు ఆగాడు.

ʹʹ సోదాపి, మూర్తిగాడి మీద 306 కింద కేసు కట్టి, కోర్టుకు పంపించమని ఏఎస్ఐ కి చెప్పు. కావాల్సినన్ని ఆధారాలున్నాయి. కేసు నిలబడేదానికి. అట్లనే పిల్లోడ్ని ప్రభుత్వం అధీనంలో వుంచేదానికి కోర్టుకు అప్పీలు చెయ్యాల ʹʹ ఎస్ఐ ముగించాడు.
ʹʹసార్.. మూర్తిగాడు జైలుకు పూడిస్తే, మీనాను ఎవరు కాపెట్టుకుంటార్ సార్ʹʹ పరమశివం అడిగాడు.
ఎస్ఐ గమ్మునున్నాడు.

ʹʹ మీనా ఖచ్చితంగా రెండ్రోజుల్లో చచ్చిపోద్ది, మెజిస్ట్రేట్ కిచ్చిన మరణవాంగ్మూలంలో కూడా తన మొగుడి తప్పు లేదని, వంట చేస్తుంటే చీర అంటుకుందని చెప్పింది. మరీ కేసు నిలస్తదా సార్, ఇదంతా పక్కన పెడితే 6 నెలల పసికందును ఎవరు చూసుకుంటార్ సార్ ʹʹ

ʹʹ అందుకని ʹʹ ఎస్ఐ వెటకారంగా అన్నాడు.

ʹʹ ఏం లేద్సార్, మూర్తిగాడ్ని వదిల్తే, వాడే పెళ్లాన్ని దగ్గరుండి చూసుకుంటాడు. కడసారి సూపుచుసుకుంటూ, తను చేసిందానికి కొంచెంమైనా కరుగుతాడ్సార్, మీనాకి కూడా భర్తపై నమ్మకం ఏర్పడతది. తన బిడ్డను బాగా చూసుకుంటాడనే భరోసాతో పోతుంది. మీనా చనిపోయినాంక దానికి గుర్తుగా పిల్లాడ్ని పెద్డాడ్ని చేసి మూర్తిగాడు మీనా రుణం తీర్చుకుంటాడ్సార్ʹʹ పరమశివం నెమ్మదిగా, సూటిగా చెప్పాడు.

7 సంవత్సరాల కేసును 2 నిమిషాల్లో సెటిల్ చేయాలని ప్రయత్నిస్తున్న పరమశివం కేసి ఎస్ఐ మౌనంగా చూస్తూ ఆలోచనలో పడ్డాడు. ఇక తన పనైపోయిందని పరమశివం బయకెళ్లాడు. ఎస్ఐ మునిరెడ్డికి మీనా తెల్లని కళ్లలోని సన్నని ఎర్రజీరే గుర్తుస్తోంది. తన కళ్లల్లో భావన ఇప్పుడిప్పుడే ఎస్‌ఐకి అర్ధమౌతావుంది. ఒక సంతృప్తికరమైన చిర్నవ్వు ఎస్ఐ పెదాల మీద తొంగిచూసింది.

No. of visitors : 489
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....
  జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •