దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం

| సాహిత్యం | వ్యాసాలు

దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం

- పాణి | 02.03.2019 04:33:01pm

ఫిబ్రవరి 9, 10 తేదీల్లో నల్గొండలో జరిగిన సాహిత్య పాఠశాల కీనోట్ పేపర్లోని ఒక భాగం..

విప్లవ రచయితల సంఘం సాహిత్య పాఠశాలకు వచ్చిన మిత్రులందరికీ స్వాగతం. ఈసారి పాఠశాల ఇతివృత్తం దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం. ఈ మౌలిక పత్రంలోని ప్రధాన విషయాల్లోకి వెళ్లేముందు కొన్ని విషయాలు చెప్పాలి.

ప్రగతిశీల విప్లవ సాహిత్య శిబిరంలో దేశీ సాహిత్యం గురించి చాలా విస్తారమైన చర్చ ఉన్నది. వేర్వేరు సందర్భాల్లో విలువైన పరిశీలనలు చేశారు. ప్రగతిశీల భావజాలాన్ని, విలువలను సాహిత్యంలో, తద్వారా సమాజంలో ప్రవేశపెట్టేందుకు దేశీ వరవడిని గుర్తించారు. వేర్వేరు అర్థాల్లో దాన్ని స్వీకరించారు. దాని ప్రాధాన్యత చెబుతూ తమ నూతన సామాజిక, సాంస్కృతిక అంశాలను ప్రతిపాదించారు. అసలు ఈ నూతన విలువల ప్రతిపాదనకు దేశీ సాహిత్య విలువల దగ్గరే బయల్దేరారు. లేదా వాటిని ఆలంబన చేసుకున్నారు.

ఈ కృషి వెనుక చారిత్రక, సామాజిక నేపథ్యం ఉన్నది. ఆధునికత పునాదిపై తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలను పునర్నిర్మించాల్సిన కర్తవ్యం ఆ తరం ముందుకు వచ్చింది. దీని కోసం అప్పటికి కొనసాగుతుండిన సంస్కృత అనువాద సాహిత్యాన్ని, వివిధ రూపాల్లో సాగుతుండిన సాహిత్య గారడీని పక్కకు తోసేయాల్సి వచ్చింది. ఈ పని చేయకుండా తమ యుగకర్తవ్యాన్ని వారు నిర్వర్తించడం సాధ్యం కాదు. అలా తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలను ఆధునికతా పునాదిపై నిర్మించతలపెట్టిన తొలి నాళ్లలోనే జాను తెనుగు, దేశీ పలుకుబళ్లు, జానపదాలను వాళ్లు తీసుకొచ్చారు. ఆధునికత, సామాజిక చైతన్యం, జీవన వాస్తవికత, సాహిత్య ప్రయోజనం అనే గీటురాళ్ల మీద ముందుకు పోవాలంటే తమ చుట్టూ ఉన్న భాషా క్షద్ర క్రీడలను నిర్మూలించాల్సిందే. ఈ మొత్తం కృషికి ఈ దేశంలో, అట్టడుగు కులాల, వర్గాల శ్రమ సంస్కృతి నుంచి అవిచ్ఛిన్న ధారగా కొనసాగుతున్న దేశీ ఒరవడి ఒక గొప్ప ఆలంబన అయింది.

ఆ వివరాలన్నీ ఇక్కడ చెప్పలేం కాని, విప్లవ సాహిత్యోద్యమం తొలి రోజుల్లో లిఖిత ప్రక్రియలను కూడా.. ముఖ్యంగా భాష, శిల్పం మొదలైన విషయాల్లో దేశీ కళా సాహిత్య రూపాలే ప్రేరేపించాయి. నిజానికి ఇది ఎంత సహజమంటే ఆరోజుల్లోనే దీన్ని ప్రత్యేక విషయంగా భావించలేదు. చాలా మామూలు విషయంగా ఈ మార్గంలోకి వచ్చారు. ప్రజల నుంచి ప్రజలకు అనే స్ఫూర్తిని తీసుకొచ్చిన విప్లవ సాహిత్యోద్యమానికి ఇది చాలా మామూలు విషయం. మరీ ముఖ్యంగా మౌఖిక, ప్రదర్శనా ప్రక్రియల్లో విప్లవాన్ని తీసుకొచ్చిన జననాట్యమండలి కృషికి పునాది దేశీ కళా సాహిత్యాలే. అంటరాని కులాల, ఉత్పత్తి కులాల శ్రమ నుంచి, సృజనాత్మకత నుంచి పుట్టిన కళలు అవి. వాటిని అపార గౌరవంతో విప్లవ సాహిత్య కళా ఉద్యమం తొలినాళ్లలోనే గుర్తించింది.

విప్లవ సాహిత్యోద్యమానికి దిశా నిర్దేశం చేసిన సాహిత్య విమర్శలో కూడా దీన్ని చూడవచ్చు. దీనికి ఇక్కడ రెండు ఉదాహరణలు మాత్రమే చెబుతాను. కామ్రేడ్ త్రిపురనేని మధుసూదనరావు సాహిత్యం కుట్ర కాదు.. రచయితలు కుట్రదారులు కాదు అనే సుప్రశిద్ధ వ్యాసంలో సంస్కృత అనువాద సాహిత్యంలోని నీచ విలువలను చెబుతూ అసలు సిసలైన సాహిత్యం జానపద, దేశీ సాహిత్యమని ప్రతిపాదిస్తారు. జీవిత చిత్రణ, పాత్రల వ్యక్తిత్వం, ముఖ్యంగా స్త్రీల చిత్రణ, వాళ్ల వ్యక్తిత్వం మార్గ సాహిత్యంలో, దేశీ సాహిత్యంలో ఎలా ఉంటాయో ఉటంకిపులతో సహా వివరించారు. అలాగే కామ్రేడ్ చలసాని ప్రసాద్ జానపద, దేశీ సంప్రదాయంలో ఉండే ప్రత్యేకతలను వివరించారు. ప్రగతిశీల సాహిత్యోద్యమం వాటిని ఎలా అందుకోవాలో చాలా తొలి రోజుల్లోనే రాశారు.

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీటన్నిటికంటే కూడా మొత్తంగా ఆధునిక ప్రగతిశీల సాహిత్యంలోనే దేశీ సంప్రదాయం గురించి చాలా ఆలోచనాత్మక పరిశీలనలు కామ్రేడ్ కళ్యాణరావు రాసిన తెలుగు నాటక మూలాలు అనే వ్యాసంలో కనిపిస్తాయి. నాటకం అనే ఆధునిక ప్రక్రియను విదేశీ నాటకం ప్రభావితం చేసి ఉండవచ్చుగాని, తెలుగు నాటకానికి మూలాలు ఈ నేలలో ఉన్నాయని ఆయన ఒక మంచి అన్వేషణ సాగించారు. అంటరాని కులాలు, బహుజన కులాల్లో సాధారణంగా కళా ప్రదర్శకులు ఉండటమేగాక, కళే వృత్తి అయిన కులాలు ప్రదర్శించే వీధి నాటకాలు, బయలు నాటకాలు, యక్షగానాల్లోకి వెళ్లి నాటకాన్ని కొత్తగా అంచనా వేశారు. దేశీ సాహిత్యం మీద విప్లవ శిబిరంలో జరిగిన కృషిని ఈ వ్యాసం ఒక మలుపు తిప్పింది. కవిత్వం విషయంలో అప్పటిదాకా ఈ కోణంలో జరిగిన కృషికి నాటకం వైపు నుంచి ఇది ఒక గొప్ప చేర్పు. ఇలాంటి పరిశీలన కథా ప్రక్రియలో కూడా చేయవచ్చు.

అస్తిత్వ చైతన్యాలు ముందుకు వచ్చాక దేశీ కళల గురించి చాలా ఆసక్తి పెరిగింది. చాలా పరిశోధనలు జరిగాయి. జాంబ పురాణం లాంటి అనేక వాచకాలు అందుబాటులోకి వచ్చాయి. మౌఖిక కళల సేకరణ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. దేశీ సాహిత్యంలోని లిఖిత ప్రక్రియలకు ప్రాధాన్యత పెరిగింది. పీడిత కులాల్లోని అద్భుత కళాకారులు గుర్తింపుపొందారు. సామాజిక స్థితిగతుల గురించి మన చైతన్యం పెరగడమే దీనికి కారణం.

స్థూలంగా ఈ పునాది మీది నుంచి మరోసారి దేశీ సాహిత్యాన్ని ఈ పాఠశాల పరిశీలిస్తుంది. అయితే ఇక్కడ కేవలం సాహిత్యాన్ని అకడమిక్ పద్ధతిలో వర్ణిస్తే సరిపోదు. లేదా దేశీ సాహిత్య వివరాలు క్రోడీకరణతో ముగిసేదీ కాదు. దేశీ సాహిత్య చరిత్ర నిర్మాణానికి అవసరమైన సామాజిక చరిత్ర గురించి కూడా పట్టించుకోవాలి. ఉత్పత్తి సంబంధాల చరిత్ర వలె ఇక్కడి ప్రత్యేకమైన సామాజిక వ్యవస్థలకు కూడా చరిత్ర ఉంటుంది. దాని ఆవరణలో దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర గురించి పరిశీలన విస్తరించాలి.

దీనికి ఇప్పుడు ఇంకో సందర్భం కూడా ఉంది.

ఇది మార్క్స్ 200 జయంతి సంవత్సరం. ఉత్పత్తి సంబంధాల చరిత్రను, వర్గాన్ని మాత్రమే మార్క్సిజం విశ్లేషిస్తుందనే దగ్గరి నుంచి అది యూరప్ కేంద్ర సిద్ధాంతమనే దాకా చాలా ఆరోపణలు ఉన్నాయి. మార్క్సిజంలోని చారిత్రక భౌతికవాదం మన సమాజంలోని సామాజిక వ్యవస్థల చరిత్రను కూడా అద్భుతంగా విశ్లేషించగల శాస్త్రీయ సిద్ధాంతమని మళ్లీ మళ్లీ నిరూపించాల్సి ఉంది. మార్క్స్ సిద్ధాంతాన్ని ఈ వైపు నుంచి కూడా పరిచయం చేయడం ఈ 21వ శతాబ్ది ప్రత్యేక చారిత్రక పరిస్థితుల్లో మార్క్సిస్టుల బాధ్యత. ఇవన్నీ కలుపుకొని ఈ పాఠశాల ఇతివృత్తాన్ని దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం అని నిర్ణయించాం.

ఈ సైద్ధాంతిక కోణంలో ఈ పేపర్ రెండు పనులు చేస్తుంది. ఒకటి: దేశీ సాహిత్య సామాజిక చరిత్రకు మార్క్సిస్టు పద్ధతిలో ఒక సిద్ధాంత భూమిక కల్పించే ప్రయత్నం. రెండు: చారిత్రక భౌతిక వాద సంవిధానంలోని శాస్త్రీయతను దేశీ సందర్భంలో నిరూపించడం. ఒకటిగానే కనిపించే దానికి ఉన్న రెండు పార్శ్వాలు ఇవి. ఈ పేపర్ చేయబోయే పనుల్లో ఇదీ ఒకటి. ఆ విషయంలో పాటించాల్సిన అప్రమత్తతను గుర్తు చేసుకొని ఆ తర్వాత దేశీ సాహిత్యంలోకి వెళదాం. అప్పుడే దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర గురించి మార్క్సిస్టు పద్ధతిలో ఆలోచించడానికి పునాది పడుతుంది. ఆదేమంటే..

***

సరైన చారిత్రక దృక్పథం లేపోతే గతం అనేది కేవలం గతించిపోయిన కాల విశేషాల క్రోడీకరణ అవుతుంది. వాటి తలపోత అవుతుంది. భవిష్యత్ కూడా కేవల ఆశావహమైన స్వప్నంగానే మిగిలిపోతుంది. మానవ ఆచరణ పునాదిగా గతాన్ని, భవిష్యత్తును చూడాలి. వర్తమానంతో సంబంధం లేకపోతే గతం గురించి ఆలోచించడం సాధ్యం కాదు. వర్తమానంలోని పోరాటాలు, సంఘర్షణల వల్ల ముందుకు వచ్చే కొత్త విలువలు, ప్రమాణాలు భవిష్యత్ ప్రయాణానికి ఎంత దారి చూపుతాయో, గతాన్ని నిర్మించుకోడానికి, పునర్నిర్మించుకోడానికీి ప్రేరేపిస్తాయి. ఏ విలువలతో, ఆదర్శాలతో కూడిని భవిష్యత్ను నిర్మించాలనుకుంటామో అదే గతాన్ని పునర్నిర్మించుకోడానికి అవసరమైన దృక్పథాన్ని ఇస్తుంది. అంటే వర్తమాన సామాజిక సందర్భాలు గతానికి కొత్త అర్థాలు ఇస్తాయి. కొత్తగా చూసే చూపును ఇస్తాయి. మరింత బాగా చెప్పాలంటే వర్తమానంలో మనుషుల ఆచరణ గతాన్ని నిర్మించుకోడానికి దారి చూపుతుంది.

మనుషులు అని వ్యవహారంలో అంటాం కాని, వాస్తవానికి వాళ్లు వర్గాలుగా ఉంటారు. కాబట్టి ప్రతి వర్గం తన ఆచరణ నుంచి, తానున్న సామాజిక పునాది నుంచి తన వర్తమాన స్థితిగతుల నుంచి తనకు సంబంధించిన గతాన్ని నిర్మించుకుంటుంది.

ఈ పని చేయడంలో పాలక వర్గం చాలా చురుకుగా ఉంటుంది. వాళ్లు పాలకులు కావడం వల్ల వాళ్ల చరిత్రే ఆ సమాజం మొత్తం చరిత్ర అని ప్రచారం అవుతుంది. ప్రజల చరిత్ర ఏమిటో ఎక్కడా ఎప్పుడూ ప్రస్తావనకు రాదు. వాళ్ల చరిత్రకే చోటు లేనప్పుడు వాళ్ల సృజనాత్మక కార్యకలాపాలకూ ఉండదు. మొత్తంగా ప్రజల గతం ఏమిటో, భవిష్యత్ ఏమిటో ఎన్నటికీ చర్చనీయాంశం కాదు. చరిత్రబద్ధం కాదు. దేనికంటే వర్తమానమే వాళ్లది కాకుండా పోవడం వల్ల ఈ స్థితి కలుగుతుంది.

అయితే వర్తమాన దుర్భర స్థితి మీద ప్రజలు తిరుగుబాట్లు చేసినప్పుడు వాళ్లకు గతం గురించిన ఎరుక కూడా కలుగుతుంది. ఇప్పుడున్న ఈ స్థితికి మూలాలు గతంలో ఎలా ఉన్నాయి? అనే అన్వేషణ ప్రారంభమవుతుంది. గతాన్ని వెతుక్కోవడమంటే ఎక్కడో తయారై ఉన్నదాన్ని తెచ్చుకోవడం కాదు. అనేక రూపాల్లో ఉన్న సరంజామా ఆధారంగా గతాన్ని నిర్మించుకోవడమే చరిత్ర. సాధారణంగా ప్రజలకు సంబంధించిన చారిత్రక ఆధారాలు, ఆనవాళ్లు చాలా వరకు అందకుండా మరుగునపడిపోయి ఉంటాయి. కొంతలో కొంత సాహిత్యం, కళల్లో దొరుకుతాయి. వాటిని కూడా విమర్శనాత్మకంగా చూసి చరిత్ర నిర్మాణంలో భాగం చేయాలి.

ఈ భౌతికవాద దృక్పథంతో చరిత్ర గోదాలోకి ప్రవేశించాలి. పైన చెప్పిన స్థూల పద్ధతికి మన దగ్గర బ్రాహ్మణ్య, ఆధిపత్య సంప్రదాయాలనే అతి ముఖ్యమైన విభజన ఉంది. దీని కింద చాలా చీకటి ఉంటుంది. ప్రజలు అనేక సమూహాలుగా చరిత్ర నిర్మాణంలో పాల్గొంటారు. మన దేశంలో ప్రజలు వేర్వేరు సామాజిక హోదాలతో, కుల గుర్తింపుతో ఉత్పత్తిలో, వినియమంలో పాల్గొంటారు. ఈ క్రమంలో వాళ్లు గడించే అనుభవానికి చరిత్రలో ప్రాధాన్యత ఉంటుంది.

అయితే అనుభవం మీద ఆధారపడి చరిత్ర రచన చేయడం కుదరదు. అనుభవం మీద కళలను అల్లవచ్చు. సాహిత్యం రాయవచ్చు. ఆ రకంగా వాటిలో వ్యక్తమైన మానవ అనుభవం నుంచి గ్రహించగల వాస్తవిక అంశాలు చరిత్ర రచనకు దోహదపడతాయి. లిఖిత ఆనవాళ్లు బొత్తిగా లేని సందర్భాల్లో మౌఖిక కళా సాహిత్యాలే ఈ పనికి దోహదం చేస్తాయి. అయినా అనుభవం దృష్టి మీద ఆధారపడటానికి లేదు. ఎందుకంటే మానవ సంకల్పంతో మాత్రమే చరిత్ర నిర్మాణం కాదు కాబట్టి. అందువల్ల చరిత్ర రచనా సంవిధానం కేంద్రంగా మానవ అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ రెంటి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందనేది కూడా వాస్తవ చరిత్రను చేరుకోడానికి దారి చూపుతుంది. ఇది ఎంత విస్మరిస్తూపోతే అంతగా కాల్పనిక తలం చేరుకున్నట్లు. అప్పుడు తయారయ్యే వాచకానికి సాహిత్య గౌరవం దక్కుతుంది. ఇది ఎంత వాస్తవమంటే - సాహిత్యమనే మానవోద్వేగ సంబంధమైన విభాగానికి కూడా ఒక చరిత్ర ఉంటుందని నమ్మితే, అప్పుడు కూడా సాహిత్య ప్రత్యేకతలను పరిగణలోకి తీసుకుంటూనే సాహిత్య చరిత్ర రచనకు కూడా సామాజిక చరిత్ర రచనా పద్ధతిని స్థూలంగా పాటించాల్సిందే. అంటే మొత్తం సమాజ చరిత్రలో భాగంగా సాహిత్య చరిత్ర రచనను చూడాల్సిందే.

కాబట్టి సాహిత్యానికి సంబంధించిన అనుభవం, వర్ణన, లేదా సాహిత్య సంబంధమైన వివరాల క్రమబద్ధ క్రోడీకరణ సాహిత్య చరిత్ర కాదు. అస్తిత్వవాదాల కంటే, సబాల్ట్రన్ అధ్యయనాల కంటే మౌలికంగా భిన్నమైన పద్ధతి మార్క్సిజంలో ఉందని అనేది ఇందు వల్లే. దేశీ సాహిత్యం, దాని చరిత్ర, మొత్తంగా దేశీ సామాజిక చరిత్ర గురించిన ప్రయత్నానికి పైన చెప్పిన అప్రమత్తత అవసరం. అందుకే కాస్త వివరంగా చెప్పాల్సి వచ్చింది.

ఈ అవగాహనతో దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం అనే ఇతివృత్తంపై ఈ కీనోట్ పేపర్ ఒక ఫ్రేం వర్క్ను మాత్రమే అందిస్తుంది. దీనికి మూడు నాలుగు ప్రాతిపదికలను తయారు చేసుకోవచ్చు. అవి ఇలా ఉంటాయి.

1. దేశీ సాహిత్య సంప్రదాయాలు - ప్రభావాలు

2. దేశీ సామాజిక చరిత్ర - మార్క్సిస్టు పద్ధతి

3. దేశీ సాహిత్య చరిత్ర - ప్రాతిపదికలు

4. బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమ సందర్భంలో దేశీ దృష్టి

***

1. దేశీ సాహిత్య సంప్రదాయాలు - ప్రభావాలు

దేశీ అనే మాట సాహిత్య పరిచయం లేని వాళ్లకు అర్థం కావడం కష్టమవుతుందని, ప్రజా సాహిత్యం అంటే సరిపోయేది కదా? అనే అభిప్రాయం ఈ కరపత్రం రాగానే కొందరు మిత్రుల నుంచి వచ్చింది. ఈ ఇతివృత్తంలో ఏ విషయం చర్చించాలో సరిగ్గా అక్కడికి నడిపించే ప్రశ్న అది. విరసం దేన్ని మరోసారి చర్చనీయాంశం చేయాలనుకున్నదో బహుశా అది నెరవేరుతుందని అనిపించింది. ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతోంటే ఈ కీలక పత్రంలోకి ప్రవేశం దొరికింది.

తెలుగు లిఖిత సాహిత్య చరిత్రలో సంస్కృత అనువాద రచనలు మొదలైన కాలంలోనే దేశీ సంప్రదాయం మొదలైంది. అంటే సుమారు 11, 12 శతాబ్దాల కాలంలో ముందుకు వచ్చింది. సంస్కృత మూల కథ లేని, ఆనువాదం కాని రచనా సంప్రదాయాన్ని, జాను తెనుగులో ద్విపద లాంటి సరళ ఛందస్సులో రాయడాన్ని దేశీ పద్ధతి అన్నారు. దేశీ కవులే తమది దేశీ సంప్రదాయమని పేరు పెట్టుకున్నారు. కేవలం వస్తువు, శిల్పం, భాషలోనే కాదు దృక్పథంలోనే అవతలి వైపు ఉండే శిష్ఠ లేదా మార్గ కవులకంటే పూర్తి భిన్నమైన మార్గాన్ని వీళ్లు ఎంచుకున్నారు.

ఇప్పుడు దేశీ అనే మాటకు చాలా స్థాయిల్లో అనేక అర్థాలు చెప్పుకోవచ్చు. గతంలో ఉన్న భావనలనే క్రోడీకరించి విస్తరించవచ్చు. దేశీ-శిష్ట పద్ధతులను బ్రాహ్మణ, బ్రాహ్మణేతర మార్గాలని చెప్పుకోవచ్చు. అప్పుడు మాత్రమే ఇందులో ఉండే సామాజిక శక్తి మనకు అర్థమవుతుంది. ఇందులో లోతైన భావజాల సంబంధమైన విభజన ఉంటుంది. అత్యధికులైన బ్రాహ్మణేతర కులాల అనుభవానికి, అత్యల్ప సంఖ్యాకులైన బ్రాహ్మణుల అనుభవ చిత్రణకు సంబంధించిన సాహిత్య సామాజిక చర్చ చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు ఏది అసలైన మానవ అనుభవం? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? అనే దిశగా ఈ చర్చ ముందుకు తీసుకెళ్లవచ్చు. ఇలాంటి అతి ముఖ్యమైన ఆలోచనాత్మకమైన సామాజిక, సాంస్కృతిక చర్చను దేశీ సందర్భంలో చేయవచ్చు.

భావజాలానికి భాషకు సంబంధం ఇప్పుడే కాదు. ఎప్పుడూ ఉండేదే. సంస్కృతం ఎప్పుడూ ప్రజల భాష కాదు. ఏ ప్రజలూ అందులో మాట్లాడుకోలేదు. కానీ అసంఖ్యాక ప్రజల మనసులపై పెత్తనం చేసే భావజాల ప్రభావాన్ని అది వేసింది. బ్రాహ్మణ భావజాలమంతా సంస్కృత రచనల్లోనే ఉంది. ఆధిపత్యానికి, అణచివేతకు, స్వీయ నియంత్రణకు సంబంధించిన విలువలు, తీర్పులు అన్నీ సంస్కృత సాహిత్యంలోనే ఉన్నాయి. అందుకే భూస్వామ్య భావజాల ప్రచారానికే సంస్కృత రచనలు వచ్చాయి.. ఇతర భాషల్లోకి అవి అనువాదమయ్యాయి. సంస్కృతాన్ని అందుకే ఒక భాషగానే చూడ్డానికి లేదు. ఒకానొక కాలంలోని ఉత్పత్తి వ్యవస్థకు, దాని ఉపరితలానికి సంబంధించిన వ్యక్తీకరణగా, దాని రక్షణ వలయంగా సంస్కృతం పని చేసింది. దేశీ సాహిత్యకారులు అందుకే సంస్కృత భాషనేకాదు, అలాంటి సాహిత్యంలోని మూల కథకు, పాత్రలకు, విలువలకు, విశ్వాసాలకు భిన్నంగా జాను తెనుగులో విప్లవాత్మక సాంఘిక దృక్పథంతో రచన చేశారు. కాబట్టి దేశీ-శిష్ట అనే చర్చను సంస్కృత, సంస్కృతేతర భాషల చర్చగా అభివృద్ధి చేయవచ్చు.

అలాగే స్థానీయ, స్థానీయేతర అనే విభజన కూడా ఇందులో ఉంటుంది. జీవితం, అనుభవం నిర్దిష్టంగా ఉంటుంది. సాధారణాంశాలు కూడా కొన్ని ఉండొచ్చుగాని, జీవితం ఎల్లప్పుడూ నిర్దిష్టతమీదే ఆధారపడి ఉంటుంది. అమూర్త మానవులను, ప్రవర్తనలను, విలువలను, ప్రయోజనాలను కేంద్రం చేసుకొని సమాజాన్ని అర్థం చేసుకోవడం కుదరదు. సాహిత్యంలో అలాంటి జీవన చిత్రణ నిర్జీవ ప్రేలాపనగానే మిగిలిపోతుంది. కాబట్టి నేటివ్.. అనే భావన కూడా ఎంతో కొంత దేశీలో భాగంగా ఉంటుంది.

మౌఖిక, లిఖిత అనే ద్వయాన్ని దేశీ-మార్గ చర్చలో కీలకంగా చర్చించవచ్చు. నిజానికి తెలుగు లిఖిత సాహిత్య చరిత్రలో భాగంగా, దానికి ప్రత్యామ్నాయంగా, సమాంతరంగా వచ్చిన దేశీ ఒరవడి అంత వరకే పరిమితం కాదు. లిఖిత సాహిత్యంలో వచ్చిన ఈ ధారను గుర్తిస్తూనే, దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూనే దాన్ని విస్తరించాలి. దేశీ అనేది లిఖిత సాహిత్యంలో ఏ విలువలను, ప్రత్యామ్నాయాలను తెచ్చిందో అవి అంతక ముందు నుంచి అట్టడుగు కులాల మౌఖిక, ప్రదర్శనా కళల రూపంలో కొనసాగుతూ వచ్చింది. ఆధునిక యుగంలో లిఖిత రూపం నాగరికతా వికాసానికి సంబంధించిన అతి ముఖ్యమైన మలుపు. అందుకే మౌఖిక రూపంలో ఉన్నవాటికి లిఖిత వాచక రూపం ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. మౌఖిక సంప్రదాయాల ఔన్నత్యాన్ని కూడా లిఖిత రూపంలోనే చాటవలసిన చారిత్రక యుగం ఇది. ఈ ప్రగతిదాయకమైన మలుపు మన ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేని సామాజిక, చారిత్రక వాస్తవం. దీన్ని గుర్తిస్తూనే దేశీ సంప్రదాయాల గురించి మాట్లాడుకునేటప్పుడు దాన్ని మౌఖిక, లిఖిత రూపాల చర్చగా విస్తరించవచ్చు.

ఆస్థాన, ఆస్థానేతర అనే విభజన చర్చను కూడా దేశీ సందర్భంలో చర్చించవచ్చు. దేనికంటే లిఖిత సాహిత్య సంప్రదాయం చిన్న చిన్న మినహాయింపులతో రాజాశ్రయం. సామ్రాజ్యాల, రాజ్యాల, రాజవంశాల ప్రయోజనాలకే లిఖిత సాహిత్యం ఎక్కువ సేవ చేసింది. అయితే దీనికి భిన్నంగా మౌఖిక సాహిత్యకారుల వలె కొందరు లిఖిత సాహిత్యకారులు రాజాశ్రయాన్ని ధిక్కరించి ప్రజల్లో కష్టం చేసుకొని బతుకుతూ తన సాహిత్య, కళా సృజన చేశారు. వాటి ద్వారా తమ భావాలు ప్రచారం చేశారు. కొందరు ఆస్థాన కవులుగా నియమితులు కాకపోయినప్పటికీ అప్పుడప్పుడు రాజాశ్రయం పొందినవాళ్లు ఉన్నారు. ఆ మేరకు ప్రభుత్వ అనుకూల రచనలు చేసిన వాళ్లూ ఉన్నారు. రాజాశ్రయం పొందకపోయినా రాజ్య భావజాలంతో పేచీ పెట్టుకోని వాళ్లు, పరోక్షంగా దానితో సహజీవనం చేసిన వాళ్లు కూడా ఉన్నారు. కాబట్టి దేశీ-శిష్ట సంప్రదాయాల చర్చను ఆస్థాన, ఆస్థానేతర చర్చగా విస్తరించవచ్చు.

దీన్నే ఇంకొంచెం సునిశితంగా కులీన-శ్రామిక విభజనగా కూడా చూడవచ్చు. విశ్రాంతి వర్గాలకు సేవ చేయడానికి, వినోదాన్ని పంచడానికి, రసానందం కల్పించడానికి రాసిన సాహిత్యం చాలా ముందు నుంచీ ఉన్నది. రాసే వాళ్లు కూడా సంపన్నులు పెట్టిన పెరుగన్నం తిని రచన చేసి, వాళ్లకు అంకితం చేసే వాళ్లు. అందులో అలాంటి కులీన జీవితమే ఉంటుంది. కానీ శ్రమను కేంద్రం చేసుకున్న రచయితలు తమ పొట్టపోసుకోడానికి శ్రమ చేస్తూ ప్రజల్లో కలిసి జీవించేవాళ్లు. అంటే ఒక జీవన విలువ, అదే సృజనకు విలువ..అనే ఒరవడిని దేశీ కవులు ఎందరో తమ జీవితాచరణ ద్వారా నిరూపించారు. కాబట్టి సాహిత్య వస్తువు, సాహిత్య లక్ష్యం, అది రాసే రచయిత జీవన శైలి మొదలైన విషయాల ఆధారంగా దేశీ చర్చను కులీన, శ్రామిక చర్చగా అభివృద్ధి చేయవచ్చు.

ఇంకో ముఖ్యమైన విభజన కూడా దేశీ-శిష్ట సంప్రదాయాల మధ్య చూడవచ్చు. అది పాలకులు, ప్రజలు. దేశీ సాహిత్యంలో కొన్ని అంశాలు ప్రజానుకూలం కాకపోయినా స్థూలంగా పాలక వ్యతిరేకంగా ఉంటాయి. నిజానికి ప్రజా అనేది చాలా విస్తారమైన, సాధారణీకరణ ఉండే భావన. ప్రపంచవ్యాప్తంగా అన్ని మానవ ఆవాసాలు పాలకులు, ప్రజలు అనే విభజనకు గురయ్యాయి. అది అతి పెద్ద, స్థూల విభజన. కళా సాహిత్యాలు, చరిత్రలు కూడా అలాగే విడిపోయి ఉంటాయి. ఆ విశాలమైన అర్థం ఉన్న ప్రజా అనే భావనలో దేశీని చూడవచ్చు. అయితే రెండూ ఒకటి కాదు. అట్లని వాటిని ఎదురెదురు నిలబెట్టాల్సిన పని లేదు. ప్రజా అనే మాట ఏ భూగోళంలోని ప్రజలనైనా సూచిస్తుంది. అక్కడి అట్టడుగు జీవన తలాన్ని స్ఫురిస్తుంది. దేశీ అనే మాట దీన్ని ఖండించదు కాని, మనదైన సామాజిక వాస్తవికతలోంచి ప్రజా జీవన తలాన్ని ఎత్తిపట్టే మాట అది. ప్రపంచమంతా పాలకులు, పాలితులు అనే విభజన జరగడానికి కారణం ఉత్పత్తి సాధనాల మీద యాజమాన్యం. అదనపు విలువ ఎవరి హక్కుభుక్తమవుతోందనే దాన్నిబట్టి జరిగే అతి కీలక విభజన ఇది. నేరుగా చెప్పాలంటే మానవజాతి చరిత్ర వికాసాన్ని అర్థం చేసుకోడానికి ఆధారమైన వర్గం దగ్గరికి మనల్ని తీసికెళుతుంది. అయితే ఏ మానవ సమాజంలో అయినా వర్గంలాగే సామాజిక వ్యవస్థలూ ఉంటాయి. మనుషుల నిత్య సంపర్కాలు ఈ సమాజిక ఆవరణలో జరుగుతుంటాయి. లేదా ఈ సామాజిక, భావజాల, సాంస్కృతిక మధ్యవర్తిత్వం ద్వారా జరుగుతుంది. ఇండియాలో ఇలాంటి సామాజిక సంబంధమైన చర్చ, అన్వేషణ నేరుగా కులం దగ్గరికి చేరుకుంటుంది. మన కులవ్యవస్థ పితృస్వామ్యంతో ముడిపడి, ఒక పకడ్బందీ నిర్మాణంగా తయారైంది. ఆ సమాజిక ఆవరణ దగ్గరి వెళ్లినప్పుడు పీడిత, పీడక కులాలనే అంతరాల వాస్తవానికి చేరుకుంటాం.

ఈ సామాజికతను పట్టుకోవాలంటే దేశీ భావన తప్పనిసరి. అది దేశీ లిఖిత సాహిత్యాన్ని పరిశీలించేందుకే కాదు. దానికి చాలా ముందు నుంచి ఉన్న మౌఖిక, దృశ్య కళా సాహిత్యధారనంతా దాని వాస్తవ స్వభావంలోంచి అర్థం చేసుకోవాలంటే ప్రజా అనే మాట కంటే దేశీ అనేదే సరిగా ఉంటుంది.

***

దేశీ అనే మాట దేశీ లిఖిత సాహిత్యానికంటే చాలా విస్తృతమైనది. అట్టడుగు కులాల, వర్గాల మౌఖిక, ప్రదర్శనా ప్రక్రియల్లోని కళా సాహిత్యానికంతా దేశీ అనే మాట వర్తిస్తుంది. అంటే ఉత్పత్తిదాయకమైన ప్రజల శ్రమ, అనుభవం, సృజనాత్మకతల ఫలితం ఇది. తరతరాలుగా మౌఖికంగా, శ్రమలో భాగంగా, కుల సామాజిక జీవితంలో అంతర్భాగంగా కొనసాగుతున్న కళా సాహిత్యాలు ఇవి.

ఈ మూలాల మీది నుంచి లిఖిత దేశీ సాహిత్య ప్రక్రియలను పరిశీలించాలి. అంటే దేశీ సాహిత్యంలో రెండు ఒరవడులు ఉంటాయి. అవి మౌఖిక, లిఖిత విభాగాలు. దేశీ లిఖిత సాహిత్యంలో కూడా బ్రాహ్మణ, బ్రాహ్మణేతర కులాల నుంచి వచ్చిన సాహిత్యాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలి.

మౌఖిక సాహిత్యం ఒక తరం నుంచి మరో తరానికి నోటి ద్వారా, వినికిడి ద్వారా కొనసాగుతూ ఉంటుంది. ప్రతి తరంలో, ప్రతి వ్యక్తి నోటెంట వాచకం మారిపోతుంది. ఆయా స్థల కాలాల, సమయ సందర్భాల ప్రభావాన్నిబట్టి మారుతూ ఉంటుంది. ఏకకాలంలో నిర్దిష్ట వ్యక్తికి, ఆ వ్యక్తి ఉండే సమూహానికి సంబంధించిన అనుభవం, నైపుణ్యం, కళా దృష్టి కూడా ఇందులో పని చేస్తుంది. ముఖ్యంగా వాళ్లలోని కాల్పనికశక్తి, జీవితానుభవంలోని వివేకం, దాన్నుంచి సంతరించుకున్న విలువలనుబట్టి మౌఖిక సాహిత్యం నిర్మాణమవుతుంది. మారుతూ ఉంటుంది.

ఇదంతా మళ్లీ స్థూలంగా ఆ యుగావధికి లోబడే ఉంటుంది. ఉదాహరణకు ఫ్యూడల్ యుగానికి సంబంధించిన లక్షణాలు ఏవీ లేకుండా ఆ కాలపు దేశీ మౌఖిక సాహిత్యాన్ని ఊహించలేం. అయితే అది శిష్ట సాహిత్యంలోలాగా ఉండదు. ఉదాహరణకు ఆధ్యాత్మికత, లేదా ప్రకృతి మార్మికత అనేవి శిష్ట సాహిత్యంలోలా మౌఖిక సాహిత్యంలో వ్యక్తం కావు. శిష్ట పౌరాణిక కథలోని కోర్ ఇతివృత్తమే సుమారుగా దేశీ మౌఖిక సాహిత్యంలో కూడా ఉండొచ్చు. కానీ శిష్ట సాహిత్యంలోలాగా ఆ కథ ఉండదు. ఆ పాత్రలు ఉండవు. ప్రజల భౌతిక జీవితంతో ముడిపడిన కథనం, పాత్రలు ఉంటాయి. జానపదాల్లోని రాముడు, సీత అనే పౌరాణిక పాత్రలు ఏ శిష్ట రామాయణంలోనూ ఉన్నట్లు ఉండవు. బహుశా వాళ్లు ఒక్కో జానపదంలో ఒక్కోలా కనిపిస్తారు కూడా. వాళ్ల స్వభావం, ప్రవర్తన నిజ మానవుల నేల మీది జీవితానికి దగ్గరగా ఉంటాయి. అందువల్ల శిష్ణ సాహిత్యంలోని విలువలకు భిన్నమైన వాటిని జానపద సాహిత్యం ప్రతిపాదిస్తుంది. ఆ రకంగా శిష్ట విలువల మీద విమర్శ కనిపిస్తుంది.

ఈ విమర్శనా దృష్టిని గుర్తించడం చాలా అవసరం. జీవిత వాస్తవికత, దానికి సంబంధించిన అనుభవం నుంచి ఇది పట్టుపడుతుంది. మొత్తం శిష్ట ప్రపంచం మీద విమర్శగా, ధిక్కారంగా కూడా దీన్ని చూడవచ్చు.

దీన్నంతా ఆ యుగావధిలో భాగంగా గుర్తించకపోతే మౌఖిక సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే దానికి ఇవాళ మన చిత్తం వచ్చినవన్నీ ఆపాదిస్తే దాని ఒరిజినాలిటీ అంగీకరించదు. ఆధునిక హేతుచింతనకు లొంగని ఆలోచనారీతులు ఆ సాహిత్యంలో కనిపిస్తాయి. ఈ మాటను సవ్యంగా కాక కేవలం ఆరోపణగా భావిస్తే.. మౌఖిక సాహిత్య లక్షణాన్ని, దాని యుగ స్వభావాన్ని గుర్తించనట్టే.

అలాగే ఏ ఉత్పత్తి వ్యవస్థ మీద ఆధారపడి మౌఖిక సాహిత్యం కొనసాగుతుందో ఆ ఉత్పత్తి వ్యవస్థే కీలకమైన మార్పులకు గురయ్యాక మౌఖిక, జానపద, ప్రజా సాహిత్యం కూడా మారిపోతుంది. అవి ఎలాంటి మార్పులో చాలా ప్రత్యేకంగా చర్చించుకోవాలిగాని, మార్పు క్రమాలనైతే తప్పక గుర్తించాల్సిందే. ఈ మార్పు లక్షణం వల్లే మౌఖిక సాహిత్యాన్ని అక్షరబద్ధం చేసే క్రమంలో అనేక వాచకాలు తయారవుతాయి. అసలు తరాలు, కులాలు, ఉప కులాలు, ప్రాంతాలనుబట్టి అంతక ముందే అనేక రూపాలుగా, అనేక పాఠాలుగా అవి వ్యవహారంలోకి వచ్చి ఉంటాయి. ఈ వైవిధ్యం కూడా అనేక వాచకాలకు కారణమవుతుంది. అందులోని విలువలు, ప్రశ్నలు, ధిక్కారాలు, విధేయతల్లో తేడాలు కూడా దీని వల్లే. వీటిని అంతిమంగా యుగ స్వభావం నిర్ణయిస్తాయి.

సరిగ్గా ఈ యుగస్వభావం లిఖిత సాహిత్యంలో కూడా ఉంటుంది. మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు పాల్కురికి సోమనాథుడి రచనలు కూడా భక్తిమయమే. మౌలికంగా అవి భక్తి రచనలే. అయితే భక్తి అనే భావనకు ఆయన ఇచ్చుకున్న అర్థం చాలా కీలకం. దాన్నిబట్టే ఆ రచనల్లో భక్తి, ఆధ్యాత్మికత ఉంటాయి. అయితే అందులోని పాత్రలు కూడా మౌఖిక సాహిత్యంలోలాగే ఉంటాయి. శిష్ఠ సాహిత్యంలోలా ఉండవు. అట్టడుగు కులాలకు చెందిన మామూలు మానవులు అందులో కనిపిస్తారు. వాళ్ల భక్తి కూడా ఆ పాత్రలకు తగినట్టే సహజంగా ఉంటుంది. దీనికి ఆ రచయిత దృక్పథం కారణం.

దేశీ లిఖిత సాహిత్యంలో ప్రధానమైన పాల్కురికి సోమనాథుడు విప్లవాత్మక సాంఘిక దృక్పథాన్ని ప్రకటిస్తాడు. మాదిగయె తొల్లి మహియెల్ల.. అనే నిర్ధారణ బ్రాహ్మణ్య పునాదులను మౌలికంగా ప్రశ్నిస్తుంది. బ్రాహ్మణీయ సాహిత్యానికి, సంస్కృత అనువాద సాహిత్యానికి భిన్నమైనది ఇది. నన్నయ్య ప్రవేశపెట్టిన సాహిత్యానికి ప్రత్యామ్నాయంగా అదే సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు దేశీ, జాను తెనుగు సంప్రదాయాన్ని తీసుకొచ్చారు.

వీళ్లు ఎంచుకున్న దృక్పథం వల్ల సహజంగానే వాళ్ల సాహిత్య రూపం కూడా మారిపోయింది. మార్గ సంప్రదాయమంతా సంస్కృత భాషలో, పండితుల తెలుగులో ఉంటుంది. ఆ కారణం వల్ల వీళ్లు జాను తెనుగును ఎంచుకున్నారు.

అయితే సంస్కృతంలో ఉన్నందు వల్లే దేశీ సాహిత్యకారులు శిష్ఠ సాహిత్యకారులు దాన్ని తిరస్కరించలేదు. సనాతన ధర్మానికి, కులవ్యవస్థకు, బ్రాహ్మణ్య భావజాలానికి, సంస్కృతికి అది ప్రాతినిధ్యం వహించింది. ఒక వర్గాన్ని కూడా సూచించేది. పాలక పక్షం వైపు నిలబడి శ్రమ దోపిడీని, అంటరానితనాన్ని సమర్థించే నీతి, కట్టుబాట్లు, భావజాలం, ఆలోచనారీతులన్నీ సంస్కృతంలో చెలామణి అయ్యాయి. సమాజంలో అవి పదే పదే పునర్జీవం పొందడానికి సంస్కృత భాష, సాహిత్యం, దాన్నుంచి అనువదించుకున్న తెలుగు కావ్యాలు, ఇతిహాసాలు కారణమయ్యాయి.

అందువల్ల సంస్కృత మూలం లేని స్వతంత్య్ర రచనలకు వాళ్లు ఆద్యులు. వస్తువును తాము కోరుకుంటున్న కచ్చితమైన ప్రయోజనానికి తగినట్లు స్వీకరించారు. సుమారుగా తెలుగు లిఖిత సాహిత్యం తొలి దశలోనే దాని మీద దండయాత్రగా దేశీ సంప్రదాయం ఆరంభమైంది. శిష్ట సాహిత్యానికి ప్రత్యామ్నాయమైన సామాజిక, ఉత్పత్తిదాయకమైన వైఖరిని ఇది సూచిస్తుంది.

12వ శతాబ్దంలో వీర శైవంపై తిరుగుబాటుగా బసవేశ్వరుడు తీసుకొచ్చిన లింగాయత మతం సామాజిక జీవితంలో విప్లవాత్మక భావాలను ప్రతిపాదించింది. అప్పటి దాకా భగవంతుడి పేరుతో జరిగిన వ్యవహారాన్ని బసవేశ్వరుడి ప్రవచనాలు పూర్వపక్షం చేశాయి. ఆధ్యాత్మిక చింతనగా, భగవదారాధనగా కనిపించే బసవేశ్వరుడి మార్గంలో రెండు ప్రధాన లక్షణాలు ఉన్నాయి. దీనికి కారణం మన బ్రాహ్మణీయ భావజాలం, కులవ్యవస్థ. సనాతన ధర్మంలో భగవంతుడనే భావనే మనిషిని క్రియారహితం చేసింది. బందీని చేసింది. ఇంకో పక్క అసంఖ్యాక ప్రజలకు ఆ దేవుడ్ని కూడా లేకుండా చేసింది.

సరిగ్గా ఈ సామాజిక వాతావరణంలో బసవేశ్వరుడు తన కొత్త భావాలు తీసుకొచ్చారు. భగవంతుడి నుంచి మనుషులను విముక్తి చేసే భావాలు ఆయనవి. ఈ పని చేయాలంటే బ్రాహ్మణ్య ఆధ్యాత్మికతపై పోరాడాలి. ఇందులో భాగంగా విభిన్న భక్తి మార్గంలో భగవంతుడ్ని ప్రజలకు చేరువ చేయాలి. ఈ రెండూ ఏకకాలంలో సాధించగల ఆలోచనలు చేశాడు. దీనికి భక్తి గురించిన ఆయన దృక్పథమే కారణం. కళ్ల ముందున్న కఠోర జీవన వాస్తవాన్ని, దాని అర్థాలను విస్మరించి ఆధ్యాతిక ప్రపంచాన్ని అందుకోవాలని భక్తి కవులు అనుకోలేదు. ఆధ్యాత్మిక ప్రపంచం గురించిన ఆలోచనలు ఉన్నా అది భౌతిక జీవితాన్ని విస్మరించకపోవడం వల్లే వాళ్లు చేసిన పనికి చారిత్రక స్వభావం వచ్చింది. వాళ్ల ఆచరణ అంతా భక్తి రూపంలో జరిగినా దాని సామాజిక పార్శ్వం చాలా ప్రభావం వేసింది. కుల సమాజంలోని అంతరాల వల్ల ఆత్మగౌరవం, శ్రమ ఫలితం మాత్రమే కాక భగవంతుడు కూడా లేని కింది కులాల ప్రజలను ఆయన బోధనలు కదిలించాయి. భక్తి రూపంలోనే కావచ్చు, వాళ్లను సామాజికంగా క్రియాశీలం చేశాయి.

యుగావధిని అర్థం చేసుకోడానికి ఇంతకంటే తార్కాణం అక్కర్లేదు. భక్తి మార్గంగానే ఇలాంటి సామాజిక భావాలు రాగల చారిత్రక ప్రత్యేకతలు, పరిమితులు అప్పుడు తప్పనిసరి. శిష్ట సాహిత్యానికి, అందులోని బ్రాహ్మణ్య, రాజాశ్రయ విలువలకు ప్రత్యామ్నాయంగా, సమాంతరంగా వచ్చిన దేశీ ఒవరడి భక్తి సాహిత్య రూపంలో వ్యక్తం కావడంలోనే ఈ ప్రత్యేకత ఉంది. మళ్లీ ఇందులో అనేక శాఖలు ఉన్నాయి. వాటి మధ్య ఎన్నో తేడాలు ఉన్నా ఉమ్మడి అంశం ఇది.

కూడలి సంగమదేవా.. అనే మకుటంతో ఉండే బసవేశ్వరుడి ప్రవచనాలు అపారమైన సామాజికశక్తిని ప్రదర్శించాయి. అవి కేవలం ఆధ్యాత్మిక సంబంధమైనవే కాదు. ఏ కులస్తుడైనా శివభక్తుడైతే సమానులు అనే కాదు, లింగధారి అయిన మానవుడు శివుడవుతాడు, కాబట్టి శివుడివి నీవే.. అని చెప్పడం ద్వారా బ్రాహ్మణ్య ఆధ్యాత్మికత నుంచి మనిషికి విముక్తి దారిని ప్రవచించే అంతరార్థం అందులో ఉంది. ఆ రకంగా బ్రాహ్మణ్య ఆధ్యాత్మికత నుంచి మనిషిని విముక్తి చేయడమనే వినూత్న భక్తి మార్గంలో సాంఘిక బంధనాల నుంచి వ్యక్తిని విముక్తి చేయడమనే అర్థం కూడా ఉంది.

ఇది ఆచరణలో ఎలా వ్యక్తమయిందో కూడా పరిశీలించవచ్చు. బసవేశ్వరుడి బోధనల వల్ల భక్తి సాహిత్య రచనలోకి మహిళలు, బ్రాహ్మణేతర కులాల వారు విరివిగా వచ్చారు. వీళ్లందరూ శ్రమ చేస్తూ దైవారాధన చేశారు. కవిత్వం రాశారు. కాబట్టి శ్రమ కేంద్రంగా, శ్రమే భగవదారాధన అనే దాకా ఈ సాహిత్యంలో భౌతిక వాద ఛాయలు కనిపిస్తాయి. దక్షిణ భారత దేశంలోని లింగాయత సంప్రదాయంలోనే కాదు, ఉత్తర భారతదేశంలో కూడా ఈ సంప్రదాయంలోకి తర్వాత్తర్వాత బ్రాహ్మణేత కులాల నుంచి రచయితలు వచ్చారు. అసలైన దేశీ సాహిత్య లక్షణాలను వారి సాహిత్యంలో చూడవచ్చు.

***

భక్తి కవులందరూ ఒకే ఒరవడికి చెందిన వాళ్లు కాదు. అందరూ ఆరాధనా పద్ధతుల్లో సనాతనత్వాన్ని ప్రశ్నించినవాళ్లే. ఇది వాళ్లలోని రెండో సారూప్యత. అయితే ఆధ్యాత్మిక నొక్కు ఎక్కువగా ఉన్న వాళ్లు ఉన్నారు. సామాజిక విముక్తి కాంక్ష బలంగా ఉన్న వాళ్లు ఉన్నారు.

ఈ ఒక్క కారణం వల్లే కాదు. ఇంకో అతిముఖ్యమైన అంశం వల్ల కూడా వీళ్లను వేర్వేరుగా చూడాలి. అదేమంటే వీళ్లందరూ ఆస్థానేతర సంప్రదాయానికి చెందినా సనాతనత్వంతో తెగతెంపులు చేసుకోవడం, చేసుకోకపోవడం అనే విభజన ఉంది. ఆస్థానానికి బయట ఉండటం రాజకీయం

No. of visitors : 692
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్ కు నివాళి
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •