కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు

| సంభాషణ

కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు

- పి.వరలక్ష్మి | 02.03.2019 04:40:40pm

ప్రజా సాహిత్యం, గానం, చిత్రకళ నిషేధిత కాలపు ఆరాటాలను హత్తుకున్నాయి. దేశ నలుమూలలూ, సరిహద్దులు కూడా దాటి రచయితలు, కళాకారులు రేపటి స్వప్నాలను ఆవిష్కరించారు. అలా బస్తర్‌ సాలిడారిటీ నెట్‌వర్క్‌, కలకత్తా ఛాప్టర్‌ ఆధ్వర్యంలో 2018 మార్చ్‌లో ప్రజా సాహిత్య ఉత్సవాలు ఎంతో ఉత్తేజాన్నిస్తూ ప్రారంభమయినప్పుడు మనం కూడా ఇట్లా ప్రభుత్వ, కార్పొరేట్‌ సాహిత్య ఉత్సవాలకు ప్రత్నామ్నాయంగా పీపుల్స్‌ లిటరరీ ఫెస్ట్‌ నిర్వహించాలి అని వివి అన్నారు. అందులో పాల్గొని వచ్చి ఆ విశేషాలను ఉత్సాహంగా పంచుకున్నారు. రెండవ సంవత్సరం సభల నాటికి పరిస్థితులు ఎంత వేగంగా మారిపోయాయంటే గత ఏడాది ఆ వేదిక మీద తమ అనుభవాలను పంచుకున్న రచయిత, చిత్రకారుడు అరుణ్‌ ఫేరేరా, రచయిత వెర్నన్‌ గొంజాల్వెజ్‌తో సహా వివి ఇవాల జైల్లో ఉన్నారు. అయినా ఖైదులోనూ సడలని విశ్వాసంతో ఉన్న రచయితల స్ఫూర్తిని కూడా నింపుకుని ఈ ఏడాది మళ్లీ మ్యూజిక్‌, ఆర్ట్‌, లిటరేచర్‌ బృందాలు కలకత్తాలో కలుసుకున్నాయి. అక్కడ కలిసి, కలబోసుకొని వచ్చిన కొంత మంది రచయితల గురించి రాయాలనిపించింది.

మొట్టమొదట ఫాసిస్టు మొరటు వ్యక్తీరణగా రాజ్యం ఇద్దరు కవుల్ని దేశసరిహద్దులు దాటకుండా ఆపేసింది. పాకిస్తాన్‌ నుండి రావలసిన తన్వీర్‌ అంజుమ్‌, బంగాదేశ్‌ నుండి రావలసిన అఫ్జల్‌ అహ్మద్‌ సయ్యద్‌ల వీసా నిరాకరించడం ద్వారా వారి అద్భుతమైన ఉర్దూ కవిత్వాన్ని వినబడకుండా చేసే ప్రయత్నమా అది? కాకతాళీయంగా అది సరిహద్దు యుద్ధ ఉద్రికతలు అప్పుడప్పుడే మొదలవుతున్న సమయం. కానీ మేం మీతోనే ఉన్నాం అని ఇద్దరూ తమ వీడియో సందేశాలను, వాటి ద్వారా తమ కవిత్వాన్ని పంపిస్తే ఇక్కడ మేమంతా కూర్చొని విన్నాం. అది ఎంత ఉద్వేగపూరిత సందర్భమో చెప్పనక్కర్లేదు. ఇక ఒక్కో రచయితా, కళాకారుడూ/ కళాకారిణీ మొదటి పరిచయంతోనే గాఢమైన ముద్రలు వేయగలవారు.

బెంగాలీ కవి మహదేబ్‌ నస్కర్‌ కవిత్వం పచ్చిపుండులా ఉంటుందట. ఉద్రిక్తంగా ఉంటుందట. ఆయన ఎన్నడూ స్కూలుకు పోయినవాడు కాదు. గొప్పవాళ్ల ఇళ్లలో పనిచేస్తూ వాళ్ల పిల్లలు వల్లెవేసే పాఠాలు చెవులు రిక్కించి వినేవాడు. 70ల నాటి విప్లవ రాజకీయాలు ఆయనకు నిజమైన పాఠాలు నేర్పాయి. అప్పుడాయన రిక్షా కార్మికుడిగా పనిచేసేవాడు. తర్వాత పూర్తికాలపు విప్లవ కార్యకర్త అయ్యాడు. ఆయన అరెస్టయ్యాక జైల్లో మొదటి అక్షరం దిద్దడంతో మొదలై అద్భుతమైన కవిగా లోకం గుర్తింపులోకి వచ్చాడు కానీ సహజసిద్ధంగానే భావుకుడని సన్నిహితులు చెప్తారు. అల్పనా మండల్‌ ఇలానే నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి పుస్తకం కొనివ్వనందుకు అలిగి చిన్నప్పుడే స్కూలు నుండి కలకత్తా పారిపోయిందట. ఇళ్లలో పనిచేస్తూ తన జీవితానుభవాలను చండాలినీ బ్రిత్తాంతో పేరుతో పుస్తకంగా రాసింది. కలకత్తా పీపుల్స్‌ లిటరరీ ఫెస్టివల్‌ ఈ ఇద్దరినీ ఆహ్వానించి సిసలైన ప్రజా సాహిత్య వేదిక అనిపించుకుంది. (అల్పనా మండల్‌ వ్యక్తిగత ఇబ్బందులవల్ల రాలేకపోవడం కాస్త నిరాశ కలిగించింది) పైన చెప్పిన విధంగా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుండి ఉర్దూ కవిత్వాన్ని, కశ్మీర్‌, అస్సాం, నాగాలాండ్‌ల దాచేస్తే దాగని గాధలను, బాధలను, పోరాటాలను వినిపించింది.

తమిళ రచయిత్రి బామా ʹకరకుʹ ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె తన జీవిత, రచనానుభవాల్ని చెబుతూ ఈ వేదికపై కథలు చదివి వినిపించారు. అంజుమ్‌ జమరుద్‌ హబీబ్‌ కశ్మీర్‌కు చెందిన రచయిత్రి. కశ్మీర్‌లో అతి సాధారణమైపోయిన అసాధారణ మృత్యు భీభత్సం ఒక నిలువనీయని స్థితిలో, దశాబ్దాల ఆక్రందనలు మూసిన తలుపుల మాటున విస్ఫోటించుతున్న ఒత్తిడిలో రూపొందిన ఎందరో రచయితల్లానే ఆమె కూడా తన పోరాట, నిర్బంధాల నుండి రచన చేసారు. ʹఅవర్‌ విడోస్‌ʹ పేరుతో భర్తలు కోల్పోయిన స్త్రీల కథలను, అనాధలైపోయిన బిడ్డల కథనాలను బైటికి ప్రపంచంలోకి తీసుకొచ్చారు. ఆజాదీ నినాదాన్నే కాదు, అందులో మహిళల ఆజాదీని గురించి మాట్లాడారు. 2003లో తీవ్రవాద ఆరోపణలతో భారత ప్రభుత్వం చేత నిర్బంధించబడి ʹఖైదీ నెంబర్‌ 100ʹగా అయిదేళ్ల జైలు అనుభవాలను అక్షరీకరించారు. కాకతాళీయం అందామా, కవితాత్మకం అందామా, ఇదే పుస్తకాన్ని నక్సలైట్‌ ఖైదీగా నాలుగేళ్ల జైలు జీవితం గడుపుతున్న అనూరాధ చదివారు. జైలు నుండే దానిపై విమర్శనాత్మక విశ్లేషణ రాసారు. విడుదలయ్యాక ఆమె రాసిన ʹజైలు కథలుʹ తెలుగు పాఠకులకు సుపరిచితమే. ఇప్పుడు ఈ ఇద్దరు రచయిత్రులు కలకత్తా పీపుల్స్‌ లిటరరీ ఫెస్టివల్‌ వేదికగా కలిసారు. తమ సాహిత్య, సామాజిక, ఉద్యమ అనుభవాలను పంచుకున్నారు.

హఫీజ్‌ అహ్మద్‌ అస్సాంలో మియా సాహిత్య స్వరానికి తొలి మార్గనిర్దేశకుడు. ఆస్సాంలో బెంగాలీ సంతతికి చెందిన మియా ముస్లింల పట్ల వివక్షను, విద్వేషాన్ని స్వయంగా అనుభవించినవాడు గనక ఆయన కవిత్వంలోని పదును సర్రున తాకుతుంది.

ʹరాసుకో/ నేను ʹమియాʹను/ ఎన్‌.ఆర్‌.సిలో నా క్రమ సంఖ్య 200543/ నాకిద్దరు పిల్లలు/ వచ్చే వేసవిలో/ మరొకరు కూడా రాబోతున్నారు/ నాలాగే వాడినీ ద్వేషిస్తావా?/ రాసుకో/ నేను మియాను/ నేను బీళ్లను, చిత్తడి నేలలను/ వరిమళ్లుగా మారుస్తాను/ నీకు తిండి పెట్టడానికి/ ఇటుకలు మోస్తాను/ నీ భవంతుల నిర్మాణానికి/ కారు నడుపుతాను/ నీ సౌకర్యానికి/ పాయఖానా కడుగుతాను/ నిన్ను ఆరోగ్యంగా ఉంచడానికి/ అయినా నువ్వు/ అసంతృప్తితోనే ఉంటావు/ రాసుకో/ నేను మియాను/ ఏ హక్కులూ లేని/ లౌకిక ప్రజాసామ్య గణతంత్ర పౌరుడిని.. ఇలా సాగుతుంది ఆయన కవిత్వం.

ʹనాగాలాండ్‌ పేజ్‌ʹ సంపాదకురాలు, ప్రచురణకర్త మోనాలీసా చంకిజా ఈశాన్య రాష్ట్రాల్లో ఏకైక మహిళా ఎడిటర్‌. తన నేలలోని హింస, రక్తపాతం, ప్రతిఘటన గురించి సూటిగా రాస్తారు. తన తెగ ʹహోʹ లోపలి పితృస్వామ్యం గురించి రాసినందుకు ఆమె పుస్తకాన్ని ఆ సమాజం బహిష్కరించింది. విస్తృతంగా కవిత్వం, కథలు, వ్యాసాలు రాసిన మోనాలీసా సాహిత్యం సామాజిక రుగ్మతలను ప్రతిబింబించడం మాత్రమే కాదు, అటువంటి సమాజంపై తప్పనిసరిగా ʹనేరంʹ చేయాలని అంటారు.

ఒడిసాకు చెందిన ఆదివాసీ కవి హేమంత్‌ దళపతి తన తాత్విక దృక్పథంలో ఫెమినిజం భాగం కావడం గురించి చెప్తుంటే ఆసక్తికరంగా ఉంటుంది. తనను తాను ఫెమినిస్ట్‌ అని ఆయన చెప్పుకుంటాడు. బ్రాహ్మణీయ పితృస్వామ్యాన్ని, పెట్టుబడిదారీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించే హేమంత్‌ వృత్తిరిత్యా టీచర్‌. అడవిని, వనరులను కబళించే కార్పొరేట్‌ శక్తులపై జరుగుతున్న ఆదివాసీ పోరాటాల్లో మమేకమైనందుకు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ʹనీ పేరును నా బాణంపై రాస్తున్నానుʹ అనే కవితా సంకలనాన్ని ప్రచురించాడు. స్త్రీ లైంగికతపై సంప్రదాయ భావాలను బద్దలు కొడుతూ, మతోన్మాద జాతీయవాదం, మీడియా సెన్సార్‌షిప్‌పై పదునైన విమర్శలు చేసే లీనా మణిమేకలై (తమిళనాడు) తన కవిత్వం ద్వారా పితృస్వామిక భాషా పరిధుల్ని సవాలు చేస్తుంది. ప్రయోగాత్మక సినిమా దర్శకత్వం, డాక్యుమెంటరీ, నటన, కవిత్వ రచన, వీడియో కవిత్వం వంటి భిన్న సృజన ప్రకియల్లో పనిచేస్తున్న లీనా కరడుగట్టిన ఫెమినిస్ట్‌ అని ఎవరైనా అంటారేమో. ఆమె జెండర్‌, లైంగికత పరిధుల్ని తుడిచేసి తనను తాను బైసెక్సువల్‌ అని చాటుకుంటుంది. విశేషం ఏమిటంటే ఆమె కమ్యూనిస్టులతో తీవ్రంగా విబేధిస్తూ మాట్లాడిన చర్చలోనే తెలుగులో కారంచేడు, చుండూరు హత్యాకాండపై నవలలు రాసిన నల్లూరి రుక్మిణి నక్సల్బరీయే నాకు జ్ఞానాన్ని, వ్యక్తిత్వాన్ని, సృజనాత్మకతను అందించిందని మాట్లాడారు. ట్రాన్స్‌జెండర్‌ ఆత్మగౌరవాన్ని చాటుతూ, ప్రజాఉద్యమాలతో స్వరాన్ని కలుపుతూ, అటు ఉద్యమాలకు మూడో చూపు ఉండాలని, ఇటు అస్తిత్వాలకు విశాల ప్రజాఉద్యమ దృక్పథం ఉండాలని మాట్లాడుతున్న మీరా సంఘమిత్ర ఇదే చర్చలో పాల్గొన్నారు.

డాక్టర్‌ షా ఆలం ఖాన్‌ రాసిన ʹద మాన్‌ విత్‌ ద వైట్‌ బియర్డ్‌ʹ మన కాలపు, మన సమాజపు నవల. అది 1984 నుండి 2002, 2008 మీదుగా రక్తం చిమ్మిన గుర్తుల్ని దేశపటం మీద గీస్తూ పోతుంది. ఆ తెల్ల గడ్డపు మనిషి సిక్కు కావచ్చు, ముస్లిం కావచ్చు, దేశద్రోహ జాబితాలో ఇమడగల ఏ సమూహపు వ్యక్తి అయినా కావొచ్చు. ఆ వెంటాడే రూపం మనల్ని నిద్రపోనివ్వదు. ఎయిమ్స్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ షా ఆలం ఖాన్‌ ఢిల్లీ ప్రజారోగ్యం- సామాజిక రాజకీయార్థిక మూలాల మీద ఎన్నో విశ్లేషణా వ్యాసాలు రాసాడు. ఎయిమ్స్‌కు కుప్పలు తెప్పలుగా జనం వచ్చి పడుతున్నారని, బీహార్‌ నుండి చిన్న చిన్న ఫిర్యాదులతో వచ్చే రోగుల్ని తిప్పిపంపమని చెప్పిన కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రికి ఏడాదిన్నర క్రితం వైద్యవృత్తిలో ఉండవలసిన నైతికత గురించి ఘాటుగా సమాధానం ఇస్తూ బహిరంగ లేఖ రాసాడు. ఉమా చక్రవర్తి సుదీర్ఘకాలంగా ప్రజాఉద్యమాలలో పని చేస్తూ ఎన్నో నిజనిర్ధారణలు డాక్యుమెంట్‌ చేసారు. ʹఎ కశ్మీర్‌ డైరీ: సెవెన్‌ డేస్‌ ఇన్‌ ఎ ఆర్మ్‌డ్‌ పారడైజ్‌ʹ, ʹఢిల్లీ రాయిట్స్‌: త్రీ డేస్‌ ఇన్‌ ద లైఫ్‌ ఆఫ్‌ ఎ నేషన్‌ʹ (నందినీ హక్సర్‌తో కలిసి రాసిన పుస్తకం) వంటి కథనాలు రాసారు. బ్రాహ్మణీయ పితృస్వామ్యా భావనను ʹజెండరింగ్‌ కాస్ట్‌ త్రూ ఎ ఫెమినిస్ట్‌ లెన్స్‌ʹ ద్వారా విశ్లేషించారు. ఫాసిస్టు సన్నివేశంలో అసంఖ్యాక హింసాత్మక ఘటనలను రాయాలంటే ఎన్ని గ్రంధాలూ చాలవంటున్న ఉమా చక్రవర్తి ప్రస్తుతం మహిళా రాజకీయ ఖైదీల గురించి డాక్యుమెంటరీలు తీస్తున్నారు. ఈ ఇద్దరు తలలు పండిన ఆలోచనాపరులు, సామాజికవేత్తల పక్కన సామ్రాజ్యవాద, ఫాసిస్టు వ్యతిరేక సాహిత్యం గురించిన చర్చలో నేను పాల్గొనడం, అది కూడా నా మొదటి అఖలభారత సమ్మేళనం కావడం మర్చిపోలేని అనుభవం.

ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌, మొహాలీలో సైన్స్‌ చరిత్రను బోధిస్తున్న మీరా నందా సైన్స్‌పై హిందుత్వ, పోస్టు మాడరన్‌ ప్రభావాలను, సూడో సైన్స్‌, వేదిక్‌ సైన్స్‌ విజృంభణను నిరసిస్తూ రచనలు చేస్తారు. సనాతన సైన్స్‌ను వైభవీకరించి హిందుత్వవాదులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ ʹకాషాయ సైన్‌: హిందుత్వ సైన్స్‌ చరిత్రపై ప్రశ్నలుʹ (సైన్స్‌ ఇన్‌ సాఫ్రాన్‌: స్కెప్టికల్‌ ఎస్సేస్‌ ఆన్‌ ద హిందుత్వ హిస్టరీ ఆఫ్‌ సైన్స్‌) పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. భువనేశ్వర్‌ నుండి సామాజిక కార్యకర్త, రచయిత రంజన పధి ఒడిసాలో కార్పొరేట్‌ కంపెనీల కొరకు భూముల నుండి విస్థాపనకు గురవుతున్న ప్రజల పక్షాన విస్తృతంగా రాసారు. నక్సలైట్‌ ఉద్యమ ప్రేరణతో ఉద్యమంలా ముందుకు వచ్చిన వీధి నాటకరంగంలో కృషి చేస్తున్న మలయ్‌ కాంతి దే, కవి, విమర్శకుడు సబ్యసాచి దేబ్‌, చిత్రకారుడు సోంశంకర్‌, కవి, రచయిత, ఏకకాలంలో ఇంగీషు, బెంగాలీ భాషల్లో పత్రికలు వెలువరిస్తున్న సంపాదకుడు, సామాజిక కార్యకర్త, సునందన్‌ రాయ్‌ చౌదరి వంటివాళ్లు పాల్గొని రెండు రోజల ప్రజాసాహితీ ఉత్సవాలలో అర్థవంతమైన, ఆశావహమైన చర్చలు చేసారు.

ముర్షీదాబాద్‌ నిరుపేద కూలీల కుటుంబాల నుండి వచ్చిన అద్భుతమైన దోహర్‌ కళాకారులు గోకుల్‌ హజ్రా, ప్రనేష్‌ పాల్‌ తదితరుల బృందం గంటపాటు నిరాఘటంగా ఇచ్చిన ప్రదర్శన మరో అనుభూతి. స్థానిక కళాబృందాలు సరేసరి. భాష తెలియకపోయినా ఒకే ఉమ్మడి భావనలో కరిగిపోయాం. ఇక దేబబ్రత ముఖోపాధ్యాయ్‌, సైలా చక్రబర్తి, అర్క ఆలం, అభిజిత్‌ సేన్‌ గుప్త, సోంశంకర్‌ రాయ్‌, వేసిన చిత్రాలు ప్రాంగణమంతా సృజనాత్మకం చేసాయి. ప్రత్యేకించి దేబబ్రత ముఖోపాధ్యాయ్‌ చిత్రాల మీద సోంశంకర్‌ విశ్లేషణ చేసాడు. ఆయన వేసిర బొమ్మలు ప్రొజెక్టర్‌ ద్వారా చూపెడుతూ వాటిని పరిచయం చేసాడు.

ఇట్లా విభిన్న సామాజిక, భౌగోళిక, సాంస్కృతిక, రాజకీయ నేపథ్యాలు గల సృజనకారులను ఒక్క వేదిక మీదికి చేర్చిన పీపుల్స్‌ లిటరరీ ఫెస్టివల్‌ ప్రభుత్వ, కార్పొరేట్‌ ప్రాయోజిత సాహిత్య వేడుకలకు ప్రత్యామ్నాయంగా నిజమైన ప్రజా సాహిత్య, సాంస్కృతిక సమ్మేళనంగా జరిగింది. ఈ ఫిబ్రవరి 15, 16 తేదీల్లో అది తన రెండవ సాహితీ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించుకుంది. ఇది నిజంగానే ఉత్సవం అనవచ్చా? ఎందుకంటే సృజనపై, సున్నిత భావాలపై విచ్చుకత్తులు విసురుతున్న సందర్భంలో జైళ్ల నుండి ప్రవహిస్తున్న రుధిరాక్షరాలతో కరచాలనం చేస్తూ ఈ సభలు ప్రారంభమయ్యాయి. వరవరరావు, అరుణ్‌ ఫేరేరా, వెర్నన్‌ గొంజాల్వెజ్‌ మరో తొమ్మిది మంది మేధావులు భీమా కోరేగావ్‌ కుట్ర కేసులో నిర్బంధించబడి ఉండటం ఒకటైతే రెండు సంవత్సరాలుగా ఒంటరి చీకటి ఖైదులో ఉన్న సాయిబాబా, ఆరోగ్యం క్షీణించి చావుబతుకుల మధ్య ఉన్నాడు. ఆయన అండాసెల్‌ కవిత్వం, వివి కవితా పాదాలు ఇక్కడ గోడల మీద పరుచుకోగా, ఇటువంటి ఉద్వేగాల కలబోతలో భిన్న స్రవంతులు కలిసి వినిపించిన బృందగానం ఒక రకంగా సాహిత్య సాంస్కృతికోత్సవమే. సమరోత్సాహమే.

No. of visitors : 396
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •