ʹఆమెʹని ఎలా అర్థం చేసుకోవాలి?

| సంపాద‌కీయం

ʹఆమెʹని ఎలా అర్థం చేసుకోవాలి?

- పి.వరలక్ష్మి | 17.03.2019 09:22:56am

ఆదివారం
చర్చీ బయట
రామున్ని అటూ ఈటూ తచ్చాడుతూ
తిరగటం చూసాను

రాముడు
తను పారేసుకున్న హదయాన్ని
తన చేజారిపోయిన జీవితాన్ని వెతుకుతూ
చర్చీ ముందే
చర్చీ ముందే
చెమటలు కక్కుతున్న రైలుబండిలా
తిరగటం చూసాను

చర్చీలోకి రమ్మని
తనకి కావలసిందేదో లోపలే ఉందని
క్రీస్తు ప్రేమగా చేతులు చాచి పిలుస్తున్నాడు

ఎలా వెళ్లాలో తెలియని రాముడు
చర్చీ గుమ్మం దగ్గరే వేలాడుతున్నాడు

చర్చీ ప్రార్థనలు ముగిసాయి
రాముడి భార్య
చర్చిలోంచి ముసుగుతో బయటికొచ్చింది

ʹʹఅనుమాన పడ్డానని అమ్మగారింటికిపోక
ఏమిటే నువు చేస్తున్నది
దిక్కుమొక్కు లేని బ్రహ్మచారి క్రీస్తు దగ్గరకొస్తావా అన్నాడు

ఆమె ఏమీ మాట్లాడలేదు
యేసుకు స్తోత్రం చెబుతూ
ప్రభువు నిన్ను క్షమించుగాక అని వెళ్లిపోయింది

భార్యలకు అడవులు కొత్త కాదు
అతడిప్పుడు
భార్యకోసం ఏ గొప్ప స్వర్గం నిర్మిస్తాడో??

ఈ చిన్న కవిత పెద్ద దుమారాన్నే రేపింది. హిందూ మతవాదుల దగ్గరి నుండి హేతువాదులు, మార్క్సిస్టుల దాకా ఎవరి దృక్పథం నుండి వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఇందులో హిందుత్వవాదులు వారికి తెలిసిన ఏకైక బాషలో దూషణలు, బెదిరింపులతో ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. ఒక రచన మీద చర్చ చేయడం, విమర్శ చేయడం ఒక ఎత్తు. అభిప్రాయాలు ప్రకటించడం, అభ్యంతరాలు తెలపడం ఒక ఎత్తు. బూతులు తిట్టడం, చంపుతాం అనడం ఏమిటి? ఈ స్థితి వచ్చినప్పుడు ఏ రచయిత అయినా దాడికి గురవుతున్న రచయిత పక్షం ఉండటం మొట్టమొదటి సాహిత్య, సామాజిక ప్రయోజనం. ఇలా టార్గెట్‌ అయిన రచయిత పక్షం ఉండటానికి ఆయన/ఆమె రచనను నూటికి నూరు శాతం ఆమోదించనక్కర్లేదు. ఒక్క శాతమైనా అంగీకరించకుండా కూడా ఆ పని చేయొచ్చు. ఆ తర్వాత దానిని హేతుబద్ధంగా చర్చించడం, విమర్శించడం జరగాలి. అప్పుడు సాహిత్య ప్రయోజనం పూర్తిగా నెరవేరగలదు.

చాలా సరళమైన పదాలతో గాఢమైన భావాలను వ్యక్తం చేసిన కవిత ఇది. రామున్ని చర్చీ బైట చూసానని మొదలు పెడుతుంది. రాముడు, చర్చీ మతాలపరంగా రెండు విరుద్ధ భావాలు. రాముడు తన హృదయాన్ని పారేసుకున్నాడు. దాన్ని వెతుక్కుంటున్నాడు. ఎలా వెతుకుతున్నాడు? చమటలు కక్కుతున్న రైలు బండిలా. అంటే అలసిపోయాడు, విసిగిపోయాడు, ఆగ్రహంతో ఉన్నాడు. కవి ఇక్కడ థర్డ్‌ పర్సన్‌. ఏం జరుగుతోందో చూస్తున్నది. ఆ ఆసక్తి పాఠకుల్లో కూడా కలుగుతుంది. రాముడు, చర్చి అనగానే ఉలిక్కిపడేలా హిందూ మతవాదులను లేదా విశ్వాసులను ప్రొవోక్‌ చేసే లక్షణం ఇక్కడ ఉంది. కవిత్వానికి అనుభూతి ప్రధానం కాబట్టి దానికి రెచ్చగొట్టే లక్షణం కూడా ఉంటుంది. అరేయ్‌, ఒరేయ్‌ అని రాసిన కవితలనూ మనం ఎన్ని చూడలేదు? ఇక్కడ భాష సున్నితం, భావాలు కరకు. కొన్ని వస్తువులు ఎలా ఉంటాయంటే భాష ఎంత సరళంగా వాడితే భావం అంత గాఢమవుతుంది. చర్చీ ముందే, చర్చీ ముందే అని నొక్కి చెప్పడం వెనక ఉన్నది ఇదే. అవును, రాముడు చర్చీ దగ్గరికే వచ్చాడు, కానీ చర్చీ లోపలికి పోవడానికి కాదు. చర్చీ ఆహ్వానిస్తుంది. చర్చీ ఎవరినైనా ఆహ్వానిస్తుంది. దానికి స్త్రీ పురుష, కులమత బేధాలు లేవు. (చర్చీల్లో కూడా కుల వివక్ష ఉందన్న ప్రాక్టికాలిటీతో ఇక్కడ సంబంధం లేదు. అంటరానివాళ్లను గుడిలోకి రానివ్వరు. చర్చీకి ఆ గొడవ లేదు.) క్రీస్తు ప్రేమను పంచుతానంటున్నాడు. ఆ ప్రేమను తీసుకొని నీవు పాపప్రక్షాళన పొందుదువు గానీ అనే అర్థాన్ని వాక్యాల మధ్య ఊహించవచ్చు. రాముడు వెళ్లలేడు. రాముడు కాబట్టి వెళ్లలేడు. వెళ్లాల్సిన అవసరం ఏముంది? లోపల సీత ఉంది. సీతను దొరకబుచ్చుకోవాలి. అవమానపడ్డానని అక్కడికొచ్చిందామె. నిజానికి కవితలో ʹసీతʹ అని ఎక్కడా చెప్పలేదు. ʹరాముడి భార్యʹ అనే ఆమెను ప్రస్తావిస్తుంది. అసలు సీతకు వ్యక్తిత్వం ఏమున్నది గనక? కనక రాముడి భార్య అనగానే పాఠకులు చప్పున సీతనే గుర్తుచేసుకుంటారు.

సీతకు రాముడి చేతిలో జరిగిన అవమానం చెప్పక్కర్లేదు. అగ్గిలోకి దూకమని అవమానించాడు. రాజప్రాసాదం నుండి బహిష్కరించి అవమానించాడు. బహిష్కృతురాలిగా సీత అక్కడికొచ్చింది. పితృస్వామ్యం నూటికి నూరు శాతం మూర్తీభవించిన పాత్ర రాముడు. అందుకని రాముడు, రాముడి చేతిలో బాధితురాలైన సీత అనగానే రామాయణంలో పాత్రలు తప్ప వేరొకటి తలంపుకు వచ్చే ప్రసక్తే లేదు. ఈ రెండు పాత్రలను ప్రతీకలుగా తీసుకొని మనకు ఎంతో సాహిత్యం వచ్చింది. ముఖ్యంగా స్త్రీవాదం బలంగా ముందుకు వచ్చాక సీతవైపు నుండి పితృస్వామ్యాన్ని సవాలు చేయడం చాలా మామూలైపోయింది. ఈ కవిత దాన్ని కూడా దాటుకొని వేరొక ప్రతీకను తీసుకొస్తుంది. ఈ దేశంలో వేల సంవత్సరాలుగా అవమానాలకు, వెలివేతలకు గురవుతున్న దళితులకు ప్రతీక సీత. బ్రాహ్మణీయ ఆధిపత్యం దళితులను ఉత్పత్తి నుండి, ఉత్పత్తి సాధనాల నుండి మాత్రమే కాదు, గుడి నుండీ, బడి నుండీ వెలివేసింది. వాళ్లను చర్చీ ఆహ్వానించింది. బహిష్కృతురాలైన సీత చర్చీలోకి పోతుంది. వీల్లేదంటాడు రాముడు. తనింట్లోకి రానివ్వడు. ఆమెకిష్టమైన చోటికి వెళ్లొద్దంటాడు. ʹʹఅనుమాన పడ్డానని అమ్మగారింటికిపోక ఏమిటే నువు చేస్తున్నదిʹʹ అంటాడు. భర్త వెళ్లగొడితే పుట్టింటికి పోయి ఏడుస్తూ కూచోవాలిగాని తన స్వేచ్ఛ తను చూసుకోకూడదు. అలా చూసుకుంటే మరింత అవమానిస్తారు. ʹʹదిక్కుమొక్కు లేని బ్రహ్మచారి క్రీస్తు దగ్గరకొస్తావాʹʹ అనడం అందుకే. ఇక్కడ మరో అంశం కూడా ఉంది. రాముడు పురుషుడు, బ్రాహ్మణవర్గ ప్రతినిధి మాత్రమే కాదు. రాముడు సంఘపరివార్‌ కూడా. మతం మారడానికి వీల్లేదంటాడు. ఆరెస్సెస్‌ రాజకీయాలు పబలమైపోయాక రాముడు హిందూ బ్రాహ్మణీయ పితృస్వామ్య ప్రతినిధిగా కూడా విస్తరించాడు. దీనికి ధిక్కారంగా ఇవతలివైపు నుండి రావణుడిని దళిత బహుజన సాహిత్యం ముందుకు తీసుకొచ్చింది. సీత రావణుడిని చేరుకున్న ఇతివృత్తంతో కూడా కథలు వచ్చాయి.

ఇక్కడ సీత క్రీస్తు దగ్గర సాంత్వన పొందుతుంది, ఈ దేశంలో దళితులు పొందుతున్నట్లే. ఆమె అక్కడ స్థిమిత పడుతుంది. అందుకే చివరికి ఏమీ మాట్లాడకుండా ʹʹయేసుకు స్తోత్రం చెబుతూ ప్రభువు నిన్ను క్షమించుగాకʹʹ అని వెళ్లిపోతుంది. నిజానికి కవిత ఇక్కడ పూర్తైపోయింది. చివరి రెండు వాక్యాలు కవివి. కానీ అవి ప్రత్యేకంగా చెప్పకుండానే ముందరి పక్తుల్లో సీత స్వరంలో వినబడ్డాయి. చివరికేంటి అంటే రాముడు ఆమెను బెదిరించి, శిక్ష విధించి లొంగదీసుకోలేడు. ఎన్నో కష్టాలు పడ్డ ఆమెకు అడవులు కొత్త కాదు. పోనీ, బుజ్జగిస్తాడా? భార్య కోసం స్వర్గం నిర్మించలేడు. ఎందుకంటే స్త్రీలకు స్వర్గప్రవేశం నిషిద్ధం కాబట్టి. ఈ కవిత ఏ కొంచెం కవిత్వ వాసన తెలిసిన పాఠకులకైనా అర్థమయ్యేది. పాఠకుల వివేచన వల్ల కూడా పొరలు విచ్చుకుంటూ పోతాయి.

హిందూ మతాన్ని దళిత క్రైస్తవ స్త్రీగా ఆమె విమర్శించింది. ఈ దేశంలో బ్రాహ్మణ్యం వెలివేస్తే దళితులకు సాంత్వననిచ్చింది, చదువులు చెప్పించింది క్రైస్తవమే. యూరోపియన్‌ క్రిష్టియన్‌ మిషనరీలది మత ప్రయోజనం, తద్వారా సామ్రాజ్యవాద మార్కెట్‌ ప్రయోజనమే కావొచ్చు. కానీ వారి వల్ల దళితులు మనుషులుగా గుర్తించబడ్డారు. తిండి, బట్ట, చదువు, ఉద్యోగం ఎంతో కొంత కలిగాయి. అందువల్ల దళితులు క్రైస్తవానికి దగ్గరయ్యారు. అది వారికి భౌతిక, మానసిక అవసరం. (భౌతిక అవసరాల కోసం అగ్రకులాలు కూడా క్రైస్తవాన్ని తీసుకున్నాయి. అది వేరే విషయం.) కవిత పరిధి, కవి పరిధి అంతవరకే.

ఇప్పుడు కవిత్వ పరిధి దాటి మతం ఎలా పనిచేస్తుందో చూద్దాం.

క్రైస్తవం దళితుల్ని విముక్తి చేసేదేమీ కాదు. ఒక మతంగా హిందూ మతానికి ఎంతవరకు అది ప్రత్యామ్నాయం అని ప్రశ్న వేసుకుంటే క్రిస్టియానిటీ కులవ్యవస్థను ఏ మాత్రం కదిలించలేకపోగా అది కూడా కులవ్యవస్థలోపలే ఒదిగిపోయింది. ఉదాహరణకు వై.యస్‌.విజయమ్మకు, మెర్సీకి చర్చీ ఒకటే హోదానివ్వదు. అట్లాగే విద్యావంతురాలైన పట్టణ మహిళకు, నిరక్షరాస్యురాలైన గ్రామీణ స్త్రీకి ఒకటే హోదానివ్వదు. అది దానికి సాధ్యం కూడా కాదు. కులం, మతం, జెండర్‌ అన్ని ఆధిపత్య వ్యవస్థలూ ఇక్కడ పనిచేస్తాయి. మరోవైపు నుండి ఒక మతంగా క్రైస్తవాన్ని, బ్రాహ్మణ్యాన్ని ఎదురుబొదురుగా నిలబెడితే రెండూ అవి పుట్టి పెరిగిన సమాజాల్లో భయంకరమైన అణచివేతను ప్రయోగించాయి. రెండూ పితృస్వామ్యాన్నే బోధించాయి. కానీ క్రైస్తవం యూరోపియన్‌ సమాజంలో అణచివేతను ప్రయోగిస్తే, ఇండియాలో దాని పాత్ర పూర్తిగా వేరే. అయితే మౌలికంగా ఏ మతమైనా ఆధిపత్యవర్గ ప్రతినిధిగా తన ప్రజలను అదుపు చేస్తుంది. మెజారిటీ మతంగా ఉన్నప్పుడు అది ఇతర మతాల మీద కూడా దాష్టీకాన్ని ప్రయోగిస్తుంది. ఇండియాలో క్రైస్తవం మైనారిటీ మతం కాబట్టి బాధితురాలి స్థానంలో ఉంటుంది. కానీ తన విశ్వాసులను అది బ్రహ్మాండంగా అదుపు చేస్తుంది. పితృస్వామిక కుటుంబ వ్యవస్థను పరిరక్షించడం దాని విధి. భారతదేశంలో క్రైస్తవం మీద హిందూమత ప్రభావం కూడా బలంగా ఉంది. ఉన్న జాడ్యాలకు తోడు ఇవి కూడా దానికి అంటుకున్నాయి. మైనారిటీ మతం ఇంకో పని కూడా చేస్తుంది. అది పీడిత ప్రజలను నిరాయుధులను చేస్తుంది. పోరాటాలవైపు, విముక్తి వైపు పోకుండా కట్టడి చేస్తుంది. ఆధ్యాత్మిక భావనకు ఈ లక్షణం ప్రధానమైనది. ఈ విషయంలో మెజార్టీ మతం కన్నా మైనార్టీ మతం ఎక్కువే పనిచేస్తుంది. ఆ సమూహానికి చెందిన ప్రజలు ఎంతగా దాడులకు, హింసకు గురవుతుంటే అంతగా అది దేవుడి మీద నమ్మకం ఉంచమంటుంది. విశ్వాసులుగా ఉండటం వేరు, విశ్వాసులుగా మాత్రమే ఉండటం వేరు. క్రైస్తవం ఏం చేస్తున్నదంటే పీడిత ప్రజలను రాజకీయాలకు దూరంగా, కనీస చైతన్యం ఏ మాత్రం అంటకుండా చర్చీలకే పరిమితం చేస్తున్నది. ఇది దళితుల ప్రతిఘటనను ఎంత బలహీనపరుస్తుందో చెప్పనక్కర్లేదు. ఇక్కడ అప్రస్తుతమేమో గానీ ఇస్లామిక్‌ తీవ్రవాద ప్రతిఘటనను చూసినా అది మరో అంచు నుండి ప్రగతిశీల ప్రజాస్వామిక ఉద్యమాల స్థానాలను ఆక్రమించి అభివృద్ధి నిరోధక పాత్ర వహిస్తుంది.

కమ్యూనిస్టులు దీనిని అర్థం చేసుకుంటూనే పీడిత మైనారిటీ మత అస్తిత్వాల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. నీ మతంలో ఏ పరిష్కారం లేదు అని చెప్పినంత మాత్రాన జనం నీ వెంట రారు. అసలెందుకు రావాలి అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఇక్కడే హేతువాదులకు, కమ్యూనిస్టులకు మధ్య ఆచరణలో తేడా ఉంటుంది. హేతువాదం ప్రగతిశీలమైనదనడంలో అనుమానం లేదు. అది జనంతో ఎలా ఎంగేజ్‌ అవుతుంది అనేదే ప్రశ్న. హేతువాదం శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయడం వల్ల మరికొంత మంది హేతువాదుల్ని తయారు చేయగలదు. కమ్యూనిస్టులు విశ్వాసుల్ని, అవిశ్వాసుల్ని కూడా పోరాటాల్లోకి ఆర్గనైజ్‌ చేయాలి. ఎంత మత మౌఢ్యంలో ఉన్నా ఆకలితో, అవమానాలతో దిక్కులేకుండా ఉండే ప్రజలే పోరాటాలు చేస్తారు. అవి సరైన మార్గంలో కమ్యూనిస్టులు నడిపిస్తారు. ఆ క్రమంలోనే వారు అశాస్త్రీయ భావాల తుప్పు వదిలించే పని కూడా చేస్తారు. అయితే అది అంత సులభంగా పూర్తయ్యే పని కూడా కాదు. ఇది పూర్తిగా వేరే అంశం కాబట్టి దానికి జోలికి ఇప్పుడు వెళ్లలేం. ఈ దేశంలో కమ్యూనిస్టుల ఆచరణ, లోటుపాట్ల గురించిన చర్చ కూడా ఇక్కడ అప్రస్తుతం.

మళ్లీ కవిత దగ్గరికొస్తే కవిగా మెర్సీ మార్గరెట్‌కు ఒక దృక్పథం ఉంటుంది. అది నాస్తికత్వమే అయి ఉండనక్కర్లేదు. ఆమె ఫలానా విధంగానే ఆలోచించాలనే డిమాండ్‌ అటు హేతువాదుల నుండి ఇటు మార్క్సిస్టుల నుండి కూడా వస్తోంది. ఆమె ఒక క్రైస్తవ విశ్వాసి అన్న విషయం మొదట గుర్తించాలి. ముందే చెప్పినట్లు ఆధిపత్య బ్రాహ్మణీయ హిందూ మతాన్ని దళిత క్రైస్తవ స్త్రీగా ఆమె ప్రశ్నిస్తున్నది. అక్కడ లేని సానుకూల అంశాలేవో ఆమెకు క్రైస్తవంలో కనిపించి ఉండవచ్చు. ఉదాహరణకు చాలా పాపులర్‌గా అందులో చెప్పబడే ప్రేమ భావన. దాని హేతుబద్ధత ఏమిటి అనేది తర్వాతి విషయం. క్రైస్తవ మిషనరీల గురించి దళితులు ʹవాళ్లు మమ్మల్ని ముట్టుకున్నారుʹ అని కదిలిపోయేంతగా బ్రాహ్మణీయ అమానుషత్వం కింద నలిగిపోయిన నేపథ్యాన్ని గుర్తిస్తే వాళ్లెలా కనెక్ట్‌ అయ్యారో అర్థమవుతుంది. కాబట్టి మతాన్ని మూఢత్వంగానే చూస్తే, ఒక భావజాలంగా అది మనుషుల దైనందిన జీవితంలో ఎంత గాఢంగా పెనవేసుకొని పోయిందో అర్థం చేసుకోలేం. చరిత్రలో, వర్తమానంలో చర్చి దుర్మార్గాల గురించి ఎంత చెప్పినా అది ఒకవైపు నుండి ఆ వ్యవస్థ మీద విమర్శ అవుతుందే కానీ (అది హేతుబద్ధ విమర్శే, కాదనడం లేదు) మనుషుల సాంస్కృతిక, మానసిక ప్రపంచంలోపలి నుండి దాన్ని అర్థం చేసుకోవడంలో వెలితి అలాగే ఉండిపోతుంది. ఇది ఒక్క క్రైస్తవానికే కాదు, అన్ని మతాలకూ వర్తిస్తుంది. అందుకే విశ్వాసాలకు సంబంధించిన ప్రతిస్పందన అంత తీవ్రంగా ఉంటుంది. ఒక రకంగా సంఘపరివార్‌ అక్కడే విజయం సాధిస్తుంది. అటువైపు నుండి ఈ కవిత మీద వచ్చిన రియాక్షన్‌ దగ్గరికి తర్వాత వస్తాను.

ఏ దృక్పథంతో రచన చేసినా, అందులోని మానవ జీవిత అనుభవాలను, వ్యక్తీకరణను సహేతుకంగా చర్చించవచ్చు. ఆ చర్చించడంలో అనివార్యంగా రచయిత దృక్పథం నుండి ఆ రచనను అంచనా వేయడం ఉంటుంది. ఇక్కడ విమర్శకుడి/ విమర్శకురాలి దృక్పథం కూడా పనిచేస్తుందన్నది నిర్వివాదాంశం. ఇంత మౌలిక విషయాలు ఇక్కడ ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే కేవలం అభిప్రాయాలు చెప్పడం, అభ్యంతరాలు చెప్పడమే విమర్శగా చలామణిలో ఉంది గనక. అట్లాగే మనకు భిన్నమైన దృక్పథం ఉంటే అది సాహిత్యమే కాదు పొమ్మనడం ఎంత మాత్రమూ సరైనది కాదు. సరిగ్గా ఈ వైపు నుండే కొందరు ప్రగతిశీల రచయితలుగా, విమర్శకులుగా పేరున్న వారు కూడా విప్లవ సాహిత్యాన్ని నిరాకరించడం జరిగింది, జరుగుతున్నది. ఆ పొరపాటు మార్క్సిస్టులు చేయకూడదు. అలాగని దృక్పథంతో సంబంధం లేకుండా విమర్శ చేయమనడం కుదరదు.

ʹఆమె నిర్ణయంʹ ఏమిటి అన్నది కవితలో విస్పష్టమే. ఆమె క్రైస్తవాన్ని ఎంచుకోవడం అన్నది కవి దృక్పథం నుండి వచ్చిన పరిష్కారం. ʹʹరాముడి భార్య చర్చిలోంచి ముసుగుతో బయటికొచ్చిందిʹʹ. అయితే ముసుగు దేనికి చిహ్నం? కచ్చితంగా ఒక స్త్రీ ఆత్మగౌరవానికి విరుద్ధమైన ప్రకటన ఇది. ʹరాముడిʹని ధిక్కరించాల్సిన ʹఆమెʹ కదా, ఇలా ఉన్నదేమిటి అని అనిపించకమానదు. ఇది మతం మారడం గురించిన సమస్య కన్నా ʹస్త్రీʹ ప్రకటించాల్సిన ధిక్కారం ఏమైందనే ప్రశ్న ఎదురవుతుంది. కాబట్టి పోయెమ్‌

అక్కడ బలహీనమైపోయింది. ఇది ఎందువల్ల జరిగింది అంటే ఒక విశ్వాసం నుండి తిరిగి వేరొక విశ్వాసంలోకి వెళ్లిపోవడం వల్ల. ఇది ఆమె ఇష్టం అనవచ్చు. కానీ స్వేచ్ఛ అనే భావన కేవలం ఇంతవరకే ఉండిపోదు. ఎందుకంటే ఇక్కడ విశ్వాసాలకు సంబంధించిన స్వేచ్ఛ కన్నా ఒక అణచివేత నుండి, పీడన నుండి స్వేచ్ఛ కోరుకుంటున్నట్లుగా అర్థమవుతున్నది గనక, వాటికి పరిష్కారం పితృస్వామ్యంతో, కులవ్యవస్థతో ముడిపడి ఉంది. అందువల్ల ఆ వ్యవస్థలను ధ్వంసం చేయకుండా వాటిని ఏ మాత్రం చెక్కుచెదరనివ్వని మతంతో ప్రయోజనం ఉండదు.

ʹʹయేసుకు స్తోత్రం చెబుతూ ప్రభువు నిన్ను క్షమించుగాక అని వెళ్లిపోయిందిʹʹ. ఇది రాముడి భార్య చివరి వ్యక్తీకరణ. ప్రభువు పాపుల్ని క్షమిస్తాడని, అటువంటి క్షమాగుణంతో, ఆ భావన పట్ల విశ్వాసంతో మిగిలిపోవడం వారి దు:ఖానికి సాంత్వననిస్తుంది కావచ్చు. కానీ ʹఆమెʹ దు:ఖం, అవమానం ఆమెకు సంబంధించింది మాత్రమే కాదు. అది ఒక సమూహ దు:ఖం. మతం వ్యక్తికి తాత్కాలికంగా మానసిక ఓదార్పునిస్తుందేమోగానీ అది సమూహంతో, వ్యవస్థతో ముడిపడిన సమస్యల నుండి బైట పడవెయ్యదు.

ఈ కవితలోని ʹరాముడుʹ, ʹరాముడి భార్యʹ కేవలం వ్యక్తులు కారు. అసలు ʹరాముడుʹ అన్న పేరే ప్రతీకాత్మం.

అయితే ఇది రాస్తున్నప్పుడే మెర్సీ మార్గరెట్‌ తన కవితలోని అంతరార్థం చెప్పారు. ఈ కవిత మతానికి సంబంధించినది కాదని, రాముడు ఒక సాధారణ వ్యక్తి పేరేనని, కుటంబంలో ఎవరికీ చెప్పకుండా మతం మారిన ఒక స్త్రీ (ఇక్కడ ʹరాముడుʹ అన్న వ్యక్తికి భార్య) భయం భయంగా చర్చికి రావడాన్ని గురించి రాసానని అంటారామె. ఇది నిజమే కావొచ్చు. అయితే రాముడు, రాముడి భార్య, అనుమాన పడడం, అడవి ఇవన్నీ తప్పనిసరిగా విస్పష్టమైన ప్రతీకలగా పాఠకులకు అర్థమవుతాయి. మామూలుగా ఏ రచన అయినా రచయిత అర్థవ్యాఖ్యానం లేకుండానే పాఠకులకు చేరుతుంది. ఆధునిక సాహిత్య సృజన ఉద్దేశం ఇదే.

దీనికి హిందూ తీవ్రవాదుల నుండి వచ్చిన రియాక్షన్‌ సహజమైనదే. వాళ్లు వాళ్ల భావజాలాల పట్ల, లక్ష్యాల పట్ల స్పష్టంగా ఉన్నారు. ఇలాంటి దాడులను ఎదుర్కోవాల్సిందే. దేనినైనా విమర్శించే హక్కును పదే పదే భిన్నాభిప్రాయాలు ప్రకటించడం ద్వారా నిలబెట్టుకోవాల్సిందే. అయితే సమాజంలో మతోన్మాదులు కాకుండా మతవిశ్వాసులు అసంఖ్యాకంగా ఉన్నారు. వారంత ఉన్మాదంతో మాత్రం ఉండరు. సమూజంలో సీత కష్టాల పట్ల సానుభూతి ఉన్నట్లే రాముడిని ప్రశ్నించి సీతను ఆత్మగౌరవ ప్రతీకగా నిలబెట్టడం పట్ల ఎంతో కొంత సానుకూల వాతావరణం ఉంది. దీనినీ దెబ్బతీసే పని వేగంగా జరుగుతోంది. అదలా ఉంచితే అంబేద్కర్‌, పెరియార్‌, చలం, రంగనాయకమ్మ వంటి అనేకులు రామాయణం మీద తీవ్రమైన విమర్శ పెట్టారు. వీరంతా హిందూ మత విశ్వాసులుగా ఒప్పుకోకపోయినా పుట్టుకతో ఆ మత చట్రం నుండి వచ్చిన వారే. అంటే లోపలి నుండి విమర్శ చేసిన వారే. అంబేద్కర్‌ బౌద్ధం స్వీకరించినా దానినీ బైటి మతంగా అనుకోరు. ఇటువంటి విమర్శకు ఎక్కువ ప్రభావం ఉండటమే కాదు, సనాతనుల నుండి తప్ప సాధారణంగా ప్రతిక్రియలు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో పీడన, అణచివేత అనే వాస్తవాలు ఎరుకలోకి వచ్చే కొద్దీ విశ్వాసాలను అధిగమించగలిగిన చైతన్య స్థితి సమాజానికి వస్తుంది. అట్లని జనం రాముడి గుడికి పోవడం మర్చిపోతారని కాదు. ఇక్కడ మనుషుల సాంస్కృతిక జీవనంలోని సంక్లిష్టత కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దానిలోపలే దేవున్ని కూడా ప్రశ్నించడం అనే ధిక్కారం ఒక అనుకూల (పాజిటివ్‌) ప్రభావం వేస్తుంది.

అదే వేరొక మత విశ్వాసం నుండి ఈ ప్రశ్నలు వేస్తే ప్రతికూల ప్రభావం వేసే అవకాశం ఉంటుంది. వేరెవరో వచ్చి మా దేవున్ని విమర్శిస్తున్నారనే భావన కలిగితే అది మతోన్మాదులకు కలిసి వచ్చే అంశమవుతుంది. ఈ కవిత మత పరిధిలో ప్రత్యామ్నాయం మాత్రమే కాదు పీడన, అణచివేత అనే వాస్తవాల ఎరుక కలిగించి, ఎదిరించే ధిక్కారాన్ని చూపించలేకపోయింది. కారణం కవిత్వంలో వ్యక్తమైన దృక్పథమే. అలాగని విమర్శించడానికి ఆ మతంవారే అయి ఉండాలా, వేరేవాళ్లకు ఆ అర్హత లేదా అంటే కాదు. ఎవరైనా విమర్శించవచ్చు. రెండింటి మధ్య తేడా ఎలా ఉంటుంది అనే చర్చ కోసమే ఇదంతా. అయితే ఈ కవితకు హేతువాదులు, కమ్యూనిస్టులు కూడా ఒకింత అసహనంగా రియాక్ట్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

సుమారు వారం రోజుల పాటు ఫేస్‌బుక్‌లో ఈ కవిత చుట్టూ రేగిన వివాదం తెలుగు సాహిత్యంలో కనుమరుగవుతున్న విమర్శా సంస్కారాన్ని సీరియస్‌గా గుర్తు చేస్తోంది. సాహిత్య రంగంలోనే కాదు, సామాజిక అంశాల మీద చర్చ కూడా పరస్పర ఆరోపణలు, దూషణలు, ఏకపక్ష నిర్ధారణలు చేసే విధంగా ఉంది. సమాజంలో ఆలోచన, చర్చ లేకుండా చేయడం పాలకవర్గ పన్నాగం. దానికది సామ, దాన, బేధ, దండోపాయాల్ని ప్రయోగిస్తుంది. సోషల్‌ మీడియా మనకు తెలీకుండానే మనల్ని సంఘపరివార్‌ మార్గం పట్టిస్తోందా? ఫేస్‌ బుక్‌ లేదా సోషల్‌ మీడియా వల్ల వ్యాపించిన రుగ్మత ఏమిటంటే వెంటవెంటనే భావోద్వేగాలను పారబోసుకొని ఆ తర్వాత దాన్ని మర్చిపోవడం. ఇందులో ఎవరికివారు ఒక అభిప్రాయ ప్రకటన చేసేసి అవతలివారి అభిప్రాయాలను దుమ్మెత్తిపోసేయ్యడం ఇంకో విపరీత మానసికత. ఇలాంటి వ్యక్తీకరణలలో శత్రువైరుధ్యానికి, మిత్రవైరుధ్యానికీ మధ్య తేడా మర్చిపోవడం వల్ల ప్రగతిశీల శిబిరం ముక్కచెక్కలయ్యే ప్రమాదం ఉంది. నిజానికి సమాజంలో నెలకొన్న ఏ అసహనం గురించి మాట్లాడుతున్నామో మనమూ దానికి లోనవుతున్నాం. ఈ ధోరణి ఒక సమాజ పురోగతికి అవసరమైన భావసంఘర్షణకు విఘాతం కలిగిస్తుంది.

తనకు భిన్నమైన ఒక అభిప్రాయం పట్ల సంఘపరివార్‌ ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. చర్చకు, వాదనకు అది విరుద్ధం. అబద్ధాలు, విద్వేషాలు ప్రచారం చేయడం, భావోద్రేకాలు రెచ్చగొట్టడం దాని లక్ష్యం. ఆ రకంగా అది సోషల్‌ మీడియాను బ్రహ్మాండంగా వాడుకుంటోంది. అది జనంలో ఆలోచన లేకుండా చేస్తుందిగాని దానికి స్పష్టమైన దురాలోచనలు. దూరాలోచనలు ఉంటాయి. కాబట్టి ʹతనదాకా వస్తేʹ అని కాకుండా ఏ అభిప్రాయాన్నైనా చర్చించే ప్రజాస్వామిక వాతావరణాన్ని నిలబెట్టడం సమాజంలో బాధ్యతగలవారి కర్తవ్యం.

No. of visitors : 1196
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •