శిథిల ప్రజాస్వామ్యానికి ప్రతీక : నాగపూర్ జైల్లో చావుబతుకుల మధ్య ప్రొఫెసర్ సాయిబాబా

| సాహిత్యం | వ్యాసాలు

శిథిల ప్రజాస్వామ్యానికి ప్రతీక : నాగపూర్ జైల్లో చావుబతుకుల మధ్య ప్రొఫెసర్ సాయిబాబా

- పి.వరలక్ష్మి | 25.03.2019 05:54:30pm

నాలుగున్నర సంవత్సరాల క్రితం ఆయన్ని నిర్బంధించారు. సాక్ష్యాల కన్నా కేవలం ఆరోపణల మీదనే ఆయనకు జీవితఖైదు విధించారు. జైలు శిక్ష అంటే సమాజానికి, కుటుంబానికి దూరంగా, రోజువారీ సామాజిక కార్యకలాపాలు రద్దైపోయి, చలనరహిత జీవితాన్ని గడపడం. ఇది మాత్రమే మనకు తెలుసు. కాని ప్రొ.సాయిబాబా విషయంలో అంత మాత్రమే కాదు. ఆయన్ని క్షణక్షణం మరణానికి దగ్గర చేస్తున్నారు. చక్రాల కుర్చీలో తప్ప కదలలేని అతని శారీరక వైకల్యంతో అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. 19 రకాల జబ్బులతో బాధపడుతున్న మనిషికి వైద్యం నిరాకరించి ఆయన్ను మెల్లగా హత్య చేస్తున్నారు. ఎందుకింత కక్ష?

ప్రొఫెసర్‌, ప్రజామేధావి, సామాజిక కార్యకర్త

ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబా అరెస్టయ్యేనాటికి రెవల్యూషనరీ డెమాక్రెటిక్‌ ఫ్రంట్‌ అఖిల భారత సహాయ కార్యదర్శి. ఈ దశకు ముందు ఆయన చేసిన ప్రయాణం విస్తారమైనది. సాధారణ పేద రైతు కుటుంబంలో పుట్టిన సాయిబాబా ఐదేళ్ళ వయసులోనే పోలియో బారిన పడి తన నడుము కింది భాగమంతా చచ్చుబడిపోయినప్పటి నుండి జీవన పోరాటం మొదలుపెట్టి తన పరిధుల్ని, పరిమితుల్ని దాటి ఎంతో దూరం ప్రయాణం చేశాడు. అమలాపురం దగ్గర పల్లెటూరులో మట్టిరోడ్లపై తన రెండు చేతులతో శరీరాన్ని ఈడ్చుకుంటూ మొదలుపెట్టిన ప్రయాణం కాలేజీ చదువునాటికి మలుపు తిరిగింది. తన అనారోగ్యం తనకు పరిమితుల్ని విధించినట్టే దేశానికున్న రుగ్మతలు అసంఖ్యాక జన సమూహాల్ని సాంఘికంగా, ఆర్థికంగా అణచివేస్తున్నాయని గ్రహించాడు. నిజానికి శారీరక అనారోగ్యం కన్నా దేశాన్ని పట్టి పీడించే దోపిడి, అసమానతలు ఎన్నో రెట్లు తీవ్రమైనవని అర్థం చేసుకున్నందుకే ఆయన తన చక్రాల కుర్చీలో దేశమంతా పీడితుల వెంట తిరిగాడు. ఇంగీషు, తెలుగు భాషల్లో ఎన్నో రచనలు చేశాడు. ఆలిండియా పీపుల్స్‌ రెసిస్టెన్స్‌ ఫోరం(ఎఐపిఆర్‌ఎఫ్‌) ఆంధ్రప్రదేశ్‌ కమిటీ కార్యదర్శిగా, ఆ తర్వాత జాతీయ కార్యదర్శిగా సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పనిచేశాడు. వివిధ ప్రజాసంఘాల ఐక్యవేదిక నిర్మాణంలో కృషి చేశాడు. సామ్రాజ్యవాదులతో ఎన్జీవోల పొత్తును బహిర్గతం చేస్తూ విప్లవ దృక్పథంతో పీడిత ప్రజల పోరాటాలను సమర్థించాడు. అంతర్జాతీయ వేదికల్లో పోరాడే ప్రజలకు బాసటగా నిలిచాడు. ఫోరం అగెనెస్ట్‌ ఇంపీరియలిస్ట్‌ గ్లోబలైజేషన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీ రాంలీలా మైదానం వద్ద జరిగిన ర్యాలీపై పోలీసులు దాడి చేసినప్పుడు ప్రజాసంఘాల కార్యకర్తలతో పాటు సాయిబాబాను కూడా విపరీతంగా కొట్టారు. ఆయన కష్టాలను లెక్క చేయలేదు. నిర్బంధాలకు వెరవలేదు. అప్రజాస్వామిక రాజ్యాన్ని ప్రశ్నించకుండా విశ్రమించలేదు. ఢిల్లీ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, మేధావిగా ఆయనకు సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంది. కానీ ఆయన ఈ దేశాన్ని ప్రేమించాడు. అది జాత్యహంకారంతో కూడిన కుహనా దేశభక్తి కాదు. పీడిత ప్రజల కోసం కష్టాలకు, బాధలకు, త్యాగాలకు సిద్ధపడే ప్రేమ. అందుకే యూనివర్సిటీలో నిజమైన జ్ఞానం కోసం భావ సంఘర్షణ చేస్తూ, ప్రజలకు బాధ్యత పడే చదువులకు, చర్చలకు కూడలి అయ్యాడు. ప్రగతిశీల విద్యార్థి, ఉపాధ్యాయ ఉద్యమాలకు దన్నుగా నిలిచాడు. ఆయన కొద్ది రోజులు వైద్యం కోసం బైయిల్‌పై బైటికి వచ్చినప్పుడు జెఎన్‌యూ విద్యార్థులు కన్నయ్య కుమార్‌, ఉమర్‌ ఖలీద్‌, అనిర్బన్‌ బట్టాచార్యపై దేశద్రోహ ఆరోపణల వివాదం నడుస్తోంది. ఒక ఇంటర్వ్యూలో సాయిబాబాను ఈ విద్యార్థుల గురించి అడినప్పుడు నా విద్యార్థులను చూసి నేను గర్వపడుతున్నానన్నాడు. ఇరవై ఏళ్లగా విద్యార్థులకు పాఠాలు చెప్తున్నానని, నాలాగే నా విద్యార్థులు కూడా దేశాన్ని, ప్రజలను ప్రేమించేవాళ్లని చెప్పాడు. ʹఆ చక్రాల కుర్చీని చూసి బంగారపు కుర్చీ భయపడిందనిʹ ఒక హిందీ కవి రాసినట్లు ఆయన వ్యక్తిత్వం, ఆచరణ రాజ్యానికి కంటగింపు అయ్యాయి.


మధ్య, తూర్పు భారతదేశంలో సామ్రాజ్యవాద మార్కెట్‌ అవసరాల కోసం అడవిని చెరబట్టి ఆదివాసులపై ప్రభుత్వం యుద్ధానికి తెగబడ్డాక ప్రజలపై యుద్ధానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా వివిధ ప్రజాసంఘాలతో ఏర్పడిన వేదికలో (ఫోరం అగెనెస్ట్‌ వార్‌ ఆన్‌ పీపుల్‌), విస్థాపన వ్యతిరేక ఆందోళనల్లోనూ సాయిబాబా క్రియాశీలకంగా ఉంటూ వచ్చాడు. రాజకీయ ఖైదీల హక్కుల కోసం గొంతెత్తాడు. ఆయన సహాయ కార్యదర్శిగా ఉన్న విప్లవ ప్రజాస్వామిక వేదిక (రెవల్యూషనరీ డెమాక్రటిక్‌ ఫ్రంట్‌-ఆర్‌డిఎఫ్‌)పై తీవ్ర నిర్బంధం మొదలైంది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్న వివిధ బృందాలను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చి ఎక్కడ ప్రజా ఉద్యమాలు జరిగినా కలిసి కట్టుగా ప్రజల పక్షాన నిలిచే లక్ష్యంతో 2005లో ఆర్‌.డి.ఎఫ్‌ ఏర్పడింది. కశ్మీర్‌ ప్రజల స్వయం నిర్ణయాధికారంతో సహా జాతుల, ప్రాంతాల ఆకాంక్షలకు ఆర్‌.డి.ఎఫ్‌ మద్దతు ఇస్తుంది. 2013 జులై 4న ఆ సంఘం ఉపాధ్యక్షుడు గంటి ప్రసాదంను నెల్లూరులో పట్టపగలే హత్య చేశారు. ఒక వైపు పోలీసులు, పారామిలిటరీ ఆదివాసులపై అత్యాచారాలు, గృహదహనాలు, హత్యలకు పాల్పడుతూ, ఈ దుర్మార్గాలను ప్రపంచానికి చాటే మేధావులను, ప్రజాసంఘాలను వేధించడం, కేసులు పెట్టడం తీవ్రతరమైంది. సల్వాజుడుం పేరుతో, అనంతరం ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ పేరుతో జరగుతున్న ఈ మారణకాండను నిరసిస్తూ, ఆదివాసుల పక్షాన దేశవిదేశాల్లో ప్రచారం చేయడం ప్రభుత్వం ఓర్వలేకపోయింది. పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల దాకా మావోయిస్టుల పేరుతో వేలాది మందిని చంపుతున్న ప్రభుత్వ దుర్మార్గాన్ని సాయిబాబా సుమారు 40 దేశాల్లో ప్రచారం చేసాడు.

అరెస్టుకు కుట్రరచన

2013 ఆగస్టు 20న జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి, డెమాక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ సభ్యుడు, సాంస్కృతిక కార్యకర్త హేమ్‌ మిశ్రాను ఆగస్టు 20న మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి మూడు రోజలు చిత్రహింసలు పెట్టి మెజిస్ట్రేటు ముందు హాజరుపరిచారు. అతను తన ఎడమచేతి చికిత్స కోసం బామ్రాగడ్‌లోని డా. ప్రకాష్‌ ఆమ్టే నడుపుతున్న హాస్పిటల్‌కు వెళ్ళే మార్గంలో పోలీసులు అరెస్టు చేశారు. (గతంలో రెండుసార్లు అతని చేతికి సర్జరీ జరిగి నొప్పితో బాధపడుతున్నాడు) అతని మీద మావోయిస్టు కొరియర్‌ అని ఆరోపణ చేసి ఊపాతో పాటు కుట్రకేసు మోపి మళ్ళీ పోలీసు కస్టడీకి పంపారు. అనేక రోజులపాటు చిత్రహింసలు పెట్టారు. సెప్టెంబరు 1న ఉత్తరాఖండ్‌కు చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు ప్రశాంత్‌ రాహీని రాయ్‌పూర్‌ (చత్తీస్‌ఘడ్‌)లో అరెస్టు చేసి 2వ తేదీన హేమ్‌ మిశ్రాను కస్టడీలో ఉంచిన పోలీస్‌స్టేషన్‌కు తెచ్చి అతన్ని కూడా అదే కేసులో ఇరికించారు. వీరిద్దరినీ 14 రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచారు. ప్రశాంత్‌ రాహీ ఐదేళ్ళ క్రితం ఊపా, తదితర కేసుల్లో జైలుపాలై 2011 ఆగస్టులో బెయిల్‌ మీద విడులయ్యాడు. చత్తీస్‌ఘడ్‌ జైళ్ళలో ఉన్న రాజకీయ ఖైదీలను కలిసే క్రమంలో అతన్ని అరెస్టు చేశారు. అతన్ని రాయ్‌పూర్‌లో అరెస్టు చేసి గడ్చిరోలి(మహారాష్ట్ర)లో అరెస్టయినట్లుగా చూపించారు.

అదే ఏడాది సెప్టెంబరు 12 తెల్లవారుఝామున 3గంటలకు ప్రొఫెసర్‌ సాయిబాబా ఇంటిపై ఢిల్లీ పోలీసులు, గడ్చిరోలి పోలీసులు, నేషనల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ ఏజెన్సీ సహా మొత్తం 50మంది రైడ్‌ చేసారు. ఎక్కడో దొంగతనం జరిగిందని, ఆయన ఇంట్లో దొంగ సొత్తు ఉందని సమాచారం వచ్చినట్లుగా వారెంట్‌ తెచ్చుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అయినా 2014 జనవరి 7వ తేదీ మరోసారి రైడ్‌ చేశారు. మావోయిస్టు సంబంధాల గురించి ప్రశ్నలు వేశారు. మీకే సమాచారం కావాలన్నా సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని సాయిబాబా అన్నారు. ఆరు గంటల పాటు ఆయన్ని ఇంటరాగేట్‌ చేశారు. లాప్‌టాప్‌, హార్డ్‌ డిస్కులు, పెన్‌డ్రైవ్‌లు పట్టుకొని పోయారు. సీజ్‌ చేసిన వాటి జాబితా కూడా సరిగ్గా రాయలేదు.

అరెస్ట్‌ కాదు, కిడ్నాప్‌

2014 మే 9వ తేదీన ప్రొఫెసర్‌ సాయిబాబా కాలేజీలో పరీక్షలు నిర్వహించి వస్తున్న సమయంలో సివిల్‌ డ్రస్సుల్లో ఉన్న పోలీసులు దారికడ్డం పడి ఆయనను బలవంతంగా కారు నుండి దింపి కళ్ళకు గంతలు కట్టి ఎత్తుకుపోయారు. డ్రైవర్‌ సమాచారంతో విషయం తెలుసుకున్న సహచరి వసంత పోలీస్‌ స్టేషన్‌కు వెళితే ఆక్కడి పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. తర్వత తెలిసిందేమిటంటే ఆయనను వీల్‌ చైర్‌తో సహా ఫ్లైట్‌ ఎక్కించి మహారాష్ట్ర గడ్చిరోలికి తీసుకెళ్లారని. ఇట్లా కిడ్నాప్‌ చేసి తీసుకెళ్ళిన సాయిబాబాను అంతకు ముందే నక్సలైట్‌ కేసులో ఇరికించబడ్డ హేమ్‌ మిశ్రా, ప్రశాంత్‌ రాహిలతో కలిసి కుట్ర చేశాడని ఆరోపిస్తూ కేసులు పెట్టారు. తీవ్రమైన నేరారోపణలున్నాయని చెప్పి బెయిల్‌ విజ్ఞప్తిని తిరస్కరించి పిట్ట కూడా కనిపించని ఒంటరి ఇరుకు గదిలో నిర్బంధించారు.

అండాసెల్‌లో ఒంటరి ఖైదు

అది నాగపూర్‌ కేంద్ర కారాగారంలో గాలీ వెలుతురు సోకని అండా సెల్‌. చక్రాల కుర్చీలో తప్ప కదలని మనిషి అయితేనేం, కేవలం తన ఆలోచనలతో కదలికలు పుట్టించేవాడని రాజ్యం ఆరోపించింది. మావోయిస్టులతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నాడని చెప్పి బోనులో జంతువును బంధించినట్లుగా నాగపూర్‌ సెంట్రల్‌ జైల్లో పడవేశారు. ఆయనపై పెట్టిన సెక్షన్లు రాజకీయ విశ్వాసాలను, అసమ్మతిని నేరంగా పరిగణిస్తాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద నేరం నిరూపించి ముద్దాయికి శిక్ష నిర్ణయించడం కాకుండా, నేరం ఆరోపించబడిన వ్యక్తే నిర్దోషినని నిరూపించుకునేవరకూ శిక్షను అమలుచేయవచ్చు. ఈ అప్రజాస్వామిక చట్టం కింద దేశవ్యాప్తంగా వేలాది ఆదివాసులను మావోయిస్టులని చెప్పి జైల్లో పెట్టారు. ముస్లింలను తీవ్రవాదులని చెప్పి శిక్షించారు. ఆ శిక్ష కూడా ఎంత అమానుషంగా ఉంటుందో సాయిబాబా కేసే ఉదాహరణ.

ఆయనకు శారీరక వైకల్య సమాన అవకాశాల చట్టం ప్రకారం చక్రాల కుర్చీ కదలికలకు కావల్సిన సౌకర్యాలు ఇవ్వలేదు. మనిషి సహకారం లేనిదే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని పట్టించుకోకుండా ఒంటరి ఖైదులో ఉంచారు. 90 శాతం అంగవైకల్యంతో పాటు తీవ్ర రక్తపోటు, గుండె జబ్బు, భుజాల నరాల క్షీణత, వెన్నెముక నొప్పితో ఆయన బాధపడుతున్నారు. జైల్లో మందులు, ఆహారం నామమాత్రంగా కూడా లేవు. బైటి నుండి కుటుంబ సభ్యులు, మిత్రులు పంపించినా నిరాకరిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన రోజువారీ వాడాల్సిన మందులు జైల్లోకి అనుమతించరు. జైలు డాక్టర్‌ పెయిన్‌ కిల్లర్స్‌ తప్ప వేరే మందులు ఇవ్వడు. ఆయన ప్రత్యేక పరిస్థితి దష్టిలో పెట్టుకునైనా బెయిల్‌ ఇవ్వమని న్యాయవాదులు పలుమార్లు చేసిన విజ్ణప్తిని ప్రభుత్వం, పోలీసుల ఒత్తిడి వల్ల హైకోర్టు కూడా నిరాకరించింది. రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణించడం గురించి బెయిల్‌ దరఖాస్తు విచారణలో ఉన్నప్పుడల్లా ప్రస్తావనకు వస్తుంది. అప్పడు మాత్రమే తాత్కాలికంగా జైలు అధికారులు ప్రత్యేక ఆహారం అందించడం, వైద్య పరీక్షలకు పంపడం చేస్తారు. బెయిల్‌ తిరస్కరించగానే వెంటనే వాటిని తొలగిస్తారు. చివరికి ఆరోగ్యం దిగజారుతున్న స్థితిలో సాయిబాబా, ఆయనకు చట్టపరంగా అందవలసిన కనీస సౌకర్యాలు, మందులు, వైద్యం కోసం జైల్లోనే నిరాహార దీక్ష చేసిన సందర్భాలున్నాయి. అప్పుడాయన మరింత నీరసించి స్పహ కోల్పోతాడు. ఇట్లా పరిస్థితి పూర్తిగా దిగజారుతున్నప్పుడు ఆయనకు బలవంతంగా సెలైన్‌ ఎక్కించి భారీ బందోబస్తు నడుమ నాగపూర్‌ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపిస్తారు. కుటుంబసభ్యులు, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తే కోర్టు ఆయనకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని ఆదేశిస్తుంది. ఆసుపత్రిలో ఒక్క రోజు ఉంచి మళ్లీ అండా సెల్‌కు పంపిస్తారు. ఈ తంతు ఆయన జైల్లో ఉన్న మొదటి సంవత్సరంలోనే పలుమార్లు జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం


సాయిబాబా ఇంటి మీద సోదా పేరుతో మొట్టమొదట పోలీసులు దాడి చేసిన దగ్గరి నుండి ఢిల్లీ యూనివర్సిటీ, జెఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లు మొదలుకొని వివిధ విద్యార్థి సంఘాలు, దేశవ్యాప్తంగా హక్కుల సంఘాలు, మేధావులు, ప్రజాసంఘాలు ఆయనకు సంఘీభావం తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కుల వేదికలతో పాటు బ్రిటన్‌, అమెరికా, కెనడా, బ్రెజిల్‌, గ్రీస్‌, స్వీడన్‌ మొదలైన దేశాల నుండి పార్లమెంట్‌ సభ్యులు మొదలుకొని ప్రొఫెసర్లు, మేధావులు, రచయితలు భారత ప్రభుత్వానికి లేఖలు రాసారు. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ముందు నిరసనలు తెలిపారు. ముఖ్యంగా ఆయన ఆరోగ్యపరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేసారు. జెనీవా నుండి ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కౌన్సిల్ సభ్యులు 2018 జూన్ లో సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలని భారత ప్రభుత్వానికి లేఖ రాసారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ మహారాష్ట్ర గవర్నర్ కు, భారత రాష్ట్రపతికి సాయిని విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తికి చేసాడు. సాయిబాబా విడుదల కోసం ప్రొ.హరగోపాల్‌ ఛైర్మెన్‌గా, జస్టిస్‌ రాజేంద్ర సచార్‌, అరుంధతిరాయ్‌, ఆనంద్‌ తేల్తుంబ్డే, అమిత్‌ బాదురి మొదలైన ప్రముఖ మేధావులు, ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్‌ యూనియన్‌కు చెందిన వాళ్లు సభ్యులుగా ʹడిఫెన్స్‌ కమిటీ ఫర్‌ రిలీజ్‌ ఆఫ్‌ సాయిబాబాʹ ఏర్పడింది. రాజకీయ ఖైదీల విడుదల కోసం పనిచేస్తున్న ʹకమిటీ ఫర్‌ రిలీజ్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌ʹ సమన్వయంతో డిఫెన్స్‌ కమిటీ సాయిబాబా విడుదల కోసం దేశవ్యాప్తంగానూ, వివిధ దేశాల్లోనూ ప్రచారం చేసింది.

తాత్కాలిక స్వేచ్ఛ

అనేక వైపుల నుండి అనేక ప్రయత్నాల వల్ల, తీవ్రమవుతున్న అనారోగ్యం వల్ల 2015 జూన్‌ 30న బాంబే హైకోర్టు సాయిబాబాకు మూడు నెలల తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. తర్వాత డిసెంబర్‌ వరకు దానిని పొడిగించారు. ఆయన అనారోగ్యానికి వైద్యం జరుగుతూ ఉండగానే గడువు ముగిసి, రెగులర్‌ బెయిల్‌ కోసం పెట్టుకున్న పిటిషన్లు కొట్టివేసాక డిసెంబర్‌ 31న మళ్లీ ఆయనను అదే అండాసెల్‌కు పంపించారు. మళ్లీ చాలా ప్రయత్నాల తర్వాత చివరికి ఏప్రిల్‌ 4, 2016న సుప్రీం కోర్టు ఆయనకు షరతులు లేని బెయిల్‌ మంజూరు చేసి విడుదల చేసింది. ఇక విముక్తి లభించినట్లేనని అందరూ ఊరట చెందారు. ఆయన మీద ఆరోపణలకు ఏ ఒక్కదానికీ సాక్ష్యాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో కేసు వీగిపోతుంది. ప్రజాసంఘాల నాయకుల మీద పెట్టిన కేసులన్నీ కోర్టుల్లో నిలవక కొట్టేసినవే.

హైదరాబాద్‌ కేర్‌ హాస్పిటల్‌లో వైద్యం చేయించుకొని తిరిగి ఉద్యోగంలో చేరడానికి సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లాడు. యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు. బైటి నుండి వచ్చిన సంఘపరివార్‌, ఎబివిపి శక్తులు ఆయనపై దాడి చేస్తే అందరూ కలిసి ఆయన్ని కాపాడారు. సంఘపరివార్‌ మొదటి నుండి సాయిబాబాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఆయన తీవ్రవాది అని ఆయనకు మరణశిక్ష విధించాలని ఊరేగింపులు తీసింది. సోషల్‌ మీడియాలో ప్రచారం చేసింది. ఎన్‌ఐఎ, పోలీసు అధికారులు కూడా ఆయన కరడుగట్టిన మావోయిస్టు అనే భావన కలిగించడానికి శక్తివంతంగా పనిచేశారు. ఢిల్లీలో ఆయన్ని కిడ్నాప్‌ చేసి, కళ్లకు గంతలు కట్టి విమానం ఎక్కించి, నాగపూర్‌ తీసుకెళ్లాక, విమానాశ్రయం నుండి గడ్చిరోలి జిల్లా అహేరి కోర్టుకు తీసుకుపోడానికి సి 60 కమెండోలతో, రెండు వేల మంది భద్రతా సిబ్బందితో భారీ బందోబస్తు పెట్టారు. రోడ్లన్ని దిగ్బంధించారు. దారిలో ఆయుధాలతో కూడిన మిలిటరీ వాహనాలు, 20 మైన్‌ ప్రూఫ్‌ వాహనాలు (మందుపాతర పెట్టినా పేలనివి), ఇవి మాత్రమే కాక హెలికాప్టర్లతో వైమానిక భద్రతను కూడా ఏర్పాటు చేసారు. చాలా హాస్యాస్పదంగా కనిపించే ఈ వ్యవహారమంతా సాయిబాబాపై ఎటువంటి ప్రచారం చేయడానికి నడిపించారో ఆలోచిస్తే, ʹమేధో ఉగ్రవాదులుʹ అని సంఘపరివార్‌ నడిపే క్యాంపెయిన్‌ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనంతో నడిచే ఈ ప్రహసనం అర్థమవుతుంది. మామూలుగా సంవత్సరాల తరబడి వాయిదాలు పడుతూ కేసులు నడుస్తుంటాయి. కానీ సాయిబాబా బెయిల్‌పై విడుదయ్యాక ఆఘమేఘాల మీద కేసు నడిపించారు. 2017 మార్చి7న కేసు హియరింగ్‌కు వచ్చింది.

జీవిత ఖైదు

ఇది ఎట్లాగూ నిలిచేదికాదని, తప్పకుండా కొట్టేస్తారని ఆయనే కాదు, ఆ కేసు గురించి తెలిసినవాళ్లందరూ అనుకున్నారు. ఆ సమయానికి సాయిబాబా ప్యాంక్రియాస్‌ సమస్య వల్ల రాక్‌ఫీల్డ్‌ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సకు తయారవుతూ ఉన్నారు. అందుకోసం ఆహారం, మందులు విశ్రాంతి ఎంతో అవసరమని వైద్యులు చేప్పారు. తిరిగొచ్చి హాస్పిటల్‌లో జాయిన్‌ అవుతానని చెప్పి సంపూర్ణ విశ్వాసంతో కోర్టుకెళ్లాడు. ఎందుకంటే ఈ కేసులో సాక్షులందరూ పోలీసులే. పోలీసుల సాక్ష్యం చెల్లదు. ఇక ఎలెట్రానిక్‌ డివైజుల ఆధారంగా (పెన్‌ డ్రైవ్‌లు, హార్డ్‌ డిస్కులు, మెమొరీ కార్డులు, సి.డి.లు వంటివి) తీర్పు చెప్పకూడదని సుప్రీం కోర్టు చెప్పింది. ఎందుకంటే వాటిలో ఏ డేటా అయినా పోలీసులు చొప్పించే అవకాశం ఉంది. గట్టిగా నిలిచే సాక్ష్యం ఒక్కటి కూడా లేనందున, అప్పటి వరకు వాదనలన్నీ అనుకూలంగా ఉన్నందున అందరూ చాలా మమూలుగా తీసుకున్నారు. కానీ అప్పటి వరకు జరిగిన వాదనలకు ఏ మాత్రం సంబంధం లేకుండా పైనుండి ఊడి పడినట్లుగా అనూహ్యమైన తీర్పు వచ్చింది.

ʹఆయన శారీరకంగా బలహీనుడు కావొచ్చు, కానీ ఆలోచనాపరంగా చురుగ్గా ఉన్నాడు.ʹ ఆయన ఆలోచించగలడు. భావాలు ప్రచారం చేయగలడు. ప్లాన్లు వేయగలడు. మావోయిస్టులకు సహకరించగలడు. ఢిల్లీ యూనివర్సిటీ, జె.ఎన్‌.యూలో పోరాటాలు చేసే విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఊరికే క్లాస్‌ రూం పాఠాలు కాదు. హిందూ జాతీయవాదాన్ని కాదని ప్రజాస్వామ్యమని చెప్తూ దేశద్రోహానికి పాల్పడే పాఠాలవి. సుమారు ఈ అర్థం వచ్చేలా న్యాయమూర్తి మాట్లాడాడు. సాయిబాబాతో పాటు ఉత్తరాఖండ్‌కు చెందిన జర్నలిస్టు, రచయిత ప్రశాంత్‌ రాహి, జె.ఎన్‌.యూ పరిశోధక విద్యార్థి, సాంస్కతిక కార్యకర్త హేమ్‌ మిశ్రా, మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన ఆదివాసులు విజయ్‌ టిర్కి, పాండు నరోత్‌లకు గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మార్చి 7న తీర్పు వెలువరించింది. ఇదే కేసులో మరో ఆదివాసీ మహేశ్‌ టిర్కికి పదేళ్ళ శిక్ష విధించింది. వీళ్ళందరినీ వేరు వేరు చోట్ల అరెస్టులు చేసి కుట్ర కేసు రాసేశారు.

సాయిబాబా మావోయిస్టులతో ఉత్తరాల ద్వారా సంప్రదింపులు జరిపాడని, ఆయన కంప్యూటర్‌ లో మావోయిస్టు పార్టీ వాళ్ళు ఇచ్చిన స్టేట్‌ మెంట్లు ఉన్నాయని, ఆయన ఆర్‌.డి.ఎఫ్‌ నాయకుడని, ఆ సంఘాన్ని నిషేధించారని (రెండు రాష్ట్రాల్లో విధించిన నిషేధం చెల్లదని కోర్టులో వేసిన కేసు పెండింగ్‌ లో ఉంది) ఇట్లా ఆయనెంత ప్రమాదకరమైన వ్యక్తో 827 పేజీల తీర్పులో చెబుతూ వచ్చారు. సాయిబాబా రెవల్యూషనరీ డెమాక్రటిక్‌ ఫ్రంట్‌ (ఆర్‌.డి.ఎఫ్‌) నాయకుడు. ఆర్‌.డి.ఎఫ్‌ ప్రణాళికకు, మావోయిస్టు రాజకీయాలకు సామ్యం ఉంది. మావోయిస్టులు ఈరోజు అతి పెద్ద ప్రమాదంగా తయారై దేశంలోకి పెట్టుబడులు రానివ్వకుండా అభివద్ధిని అడ్డుకుంటున్నారు కాబట్టి, ఆ మావోయిస్టులను వీళ్ళు సమర్థిస్తున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలా వీళ్ళకు అతి పెద్ద శిక్ష విధించాలి. దురదష్టవశాత్తూ ఊపా (యుఎపిఎ) కింద జీవితఖైదు మాత్రమే విధించగలం. అందువల్ల కానీ లేకపోతే మరణశిక్ష వేసేయాలి. ఇవీ జడ్జి మాటలు. దేశ చరిత్రలో ఇంత కక్షపూరితంగా న్యాయమూర్తి మాట్లాడటం చూసామా? అది కూడా నిందితులు కేవలం భావాలు కలిగి ఉన్నందుకు.

కేసు నమోదు చేయడం దగ్గరి నుండి జడ్జిమెంటు దాకా సమాధానం చెప్పవలసిన అనేక ప్రశ్నలున్నాయి. మొదట సాయిబాబా ఇంటిని సోదా చేయడానికి పోయినప్పుడు పై కారణాలేవీ చెప్పకుండా దొంగ సొత్తు ఉందని వారెంట్‌తో రావలసిన అవసరం ఏముంది? సొంతంగా ఎక్కడికీ పోలేని మనిషిని కాలేజీ నుండి ఇంటికి పోయేదారిలో మఫ్టీలో వచ్చి కిడ్నాప్‌ చేయాల్సిన అవసరం ఏమిటి? బెయిల్‌ పిటిషన్‌పై వాయిదాల మీద వాయిదాలు వేసి తీర్పు మాత్రం అంత హడావుడిగా ఇవ్వడం ఏమిటి? జైల్లో ఏ ఖైదీకైనా ఉండాల్సిన కనీస మానవహక్కులు కూడా నిరాకరిస్తూ కక్షపూరితంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమిటి? వైద్యం కూడా అందించకుండా ఆయనను చావుకు దగ్గర చేస్తున్నదెందుకు?

చట్టబద్ధంగా అడిగే ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. ఎందుకంటే అది తన చట్టాన్ని తానే ఉల్లంఘిస్తోంది. అయితే ఈ ప్రశ్నలకు సంఘీయుల ప్రతినిధిగా, పెట్టుబడిదారులకు ప్రతినిధిగా న్యాయమూర్తి సమాధానం చెప్తాడు. 1982 నుండి అభివృద్ధికి వ్యతిరేకంగా జరిగిన విధ్వంసాలన్నీ సాయిబాబా వంటివాళ్ల కారణంగానే జరిగాయట. ఛత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయిడు కూడా ఇట్లాంటి ప్రకటనే చేసారు.

మరింత క్షీణించిన ఆరోగ్యం, వాయిదాలతో కాలం గడుపుతున్న న్యాయస్థానాలు

గడ్చిరోలి షెషన్స్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించేనాటికే సాయిబాబా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రయాణం చేసే స్థితిలో కూడా లేడు. అయితే తీర్పు వెలువడనుండటంతో, తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితుల్లోనే ఆయన మహరాష్ట్ర వెళ్లాడు. కోర్టు శిక్ష విధించడంతో అప్పటికప్పుడే పోలీసులు ఆయనను జైలుకు తరలించారు.

అప్పటి నుండి అనేక మార్లు ఆయన తన చికిత్స కోసం పలు కోర్టుల్లో అప్పీల్‌ చేస్తూనే ఉన్నారు. వీటితో పాటు, సెషన్స్‌ కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ 2017 ఆగస్టులో మహరాష్ట్ర హైకోర్టు నాగపూర్‌ బెంచ్‌కి అప్పీల్‌ చేశారు. కానీ ఇప్పటికీ ఈ అప్పీలు హియరింగ్‌కి రాలేదు. శిక్ష వేయడంలో ఆఘమేఘాల మీద కదిలిన న్యాయవ్యవస్థ, సాయిబాబా పెట్టుకున్న ఏ అపీల్‌కు కూడా స్పందించడం లేదు. చివరికి తనను కనీసం తెలంగాణ జైలుకు బదిలీ చేయాలని సాయిబాబా 2017 జులైలో తొలిసారి విజ్ఞప్తి చేశారు. తర్వాత సాయిబాబా తల్లి, సహచరి పలు మార్లు ఆయన్ను హైదరాబాద్‌ లోని సెంట్రల్‌ జైలుకు బదిలీ చేయాలని అప్పీల్‌ చేసుకున్నారు. దీనిపై పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, విచారణా అధికారులు అనేక సాకులు చూపిస్తూ అడ్డుకుంటున్నారు.

ఇదిలా ఉండగా సాయిబాబాతో పాటు జీవిత ఖైదు పడిన ప్రశాంతి రాహి, పదేళ్లు జైలుశిక్ష పడిన మహేశ్‌ టిర్కిల బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు నాగపూర్‌ బెంచ్‌ తిరస్కరించింది. అందువల్ల తీర్పును పైకోర్టుల్లో సవాలు చేసే అంశాలు అలా ఉండగానే, కనీస వైద్య సదుపాయంకోసం, కనీసంగా బ్రతికి ఉండే అవకాశం కోసం అప్పీల్‌ చేసుకోవాల్సిన పరిస్థితి. తొలిసారి 2018 ఫిబ్రవరిలో బొత్తిగా చెయ్యి కూడా కదప లేని స్థితిలో బెయిల్‌ కోసం నాగపూర్‌ హైకోర్టు బెంచ్‌ ముందు పిటిషన్‌ వేస్తే, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాయిబాబా ఆరోగ్యం బాగానే ఉందని, ఏవో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని పేర్కొంది. తర్వాత అనేక ఒత్తిళ్ల వల్ల స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేవు. బైట వైద్యం చేయించుకోడానికి బెయిల్‌ ఇవ్వరు. చివరికి ఆయనకు ప్రభుత్వ ఆస్పత్రిలో చేసిన వైద్య పరిక్షల రిపోర్టులు కుటుంబ సభ్యులకివ్వడానికి కూడా అనేక ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అనేక వాయిదాలు తీసుకుని కాలం వెళ్లబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చిట్ట చివరికి కోర్టు సాయిబాబా కుటుంబం తమ స్వంత డాక్టర్ల బృందంతో నాగపూర్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవచ్చని చెప్పింది. దీంతో డిసెంబర్‌ 26, 2018న డాక్టర్లు సాయిబాబాను పరీక్షించేందుకు నాగపూర్‌ వెళ్లారు. దీనికి సంబంధించిన ఫైనల్‌ ఆర్గ్యుమెంట్‌ ఫిబ్రవరి11, 2019న కోర్టు వినాల్సి ఉండగా మళ్ళీ వాయిదా వేసింది.

ఇది సాయిబాబాతో ఆగేది కాదు


ప్రొఫెసర్‌ సాయిబాబాపై అక్రమ కేసులు, నిరాధార ఆరోపణలతో విధించిన జీవిత ఖైదు, ఆయనను చిత్రహింసలకు గురిచేస్తున్న తీరు ఈ దేశంలో బుద్ధిజీవులకు రాజ్యం చేయదలచుకున్న ఒక హెచ్చరిక. స్వయంగా సాయిబాబా కేసును చూస్తున్న సురేంద్ర గాడ్లింగ్‌ ఇప్పుడు భీమా కోరేగావ్‌ కేసులో అరెస్టయి, అది విచారణలో ఉండగానే వరవరరావుతో పాటు మరొక కేసులో ఇరికించబడ్డారు. సురేంద్ర గాడ్లింగ్‌ రాజకీయ ఖైదీల మీద మోపబడిన తప్పుడు కేసుల్ని సమర్థవంతంగా వాదించి న్యాయాన్ని గెలిపించినవాడు. ఆయనతోపాటు ఇదే కేసులో జైల్లో ఉన్న సుధాభరద్వాజ్‌, అరుణ్‌ ఫెరేరాలు కూడా న్యాయవాదులు, ఇండియన్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ లాయర్స్‌ (ఐఎపిఎల్‌) సభ్యులు. ఇక వరవరరావు, రోనా విల్సన్, ఆనంద్‌ తెల్తుంబ్డే తదితరులు కూడా సాయిబాబా విడుదల కోసం కృషి చేస్తున్నవాళ్లే. రోనా విల్సన్ కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ ప్రధాన బాధ్యుల్లో ఒకరిగా సాయిబాబా విడుదల కమిటీలో క్రియాశీలంగా పని చేస్తున్నారు. సాయిబాబాకు దేశవ్యాప్తంగా వచ్చిన సంఘీభావం ప్రభుత్వాన్ని ఏ మాత్రం కదిలించలేదు. పైగా తన దుర్మార్గానికి కొనసాగింపుగా వరుస పెట్టుకొని అరెస్టులు చేస్తోంది. ఈ వరుసలో ఇంకెంతమందైనా ఉండొచ్చు.

డిసెంబర్‌ 2018 నాటికి సాయిబాబా పరిస్థితి

2018 డిసెంబర్‌ 26న న్యాయస్థానం అనుమతి తీసుకొని ప్రొఫెసర్‌ సాయిబాబాని ఆయన సహచరి వసంత, సోదరుడు రామ్‌దేవ్‌ కలిశారు. అప్పటికి నేరుగా ఆయన్ని చూడక చాలా కాలమైపోయింది. నాగ్‌పూర్‌ జైలులో ములాఖత్‌ కిటికీ గుండా మనిషి నీడ స్పష్టంగా కనిపించదు. అట్లా అవతలివైపు నిలబడి ఇరువైపులా పోలీసులుండగా ఫోన్లోనే మాట్లాడాలి. చాలా కాలం తర్వాత నాగ్‌పూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆయన్ని నేరుగా చూడగలిగారు. ఆయన పరిస్థితి చూసి దాదాపు షాక్‌కు గురయ్యారు. వసంత మాటల్లో చెప్పాలంటే ʹʹతన పరిస్థితి ఊహించినదానికంటే ఘోరంగా ఉంది. దాదాపు కదల్లేని స్థితిలో ఉన్నారు. చేతులు వణుకుతున్నాయి. బరువు బాగా తగ్గాడు. ఇప్పుడు తనను కుర్చీలోంచి పడకమీదికి మార్చాలంటే కనీసం ఇద్దరు మనుషుల సహాయం అవసరం. డిసెంబర్‌ 26న వైద్య పరీక్షల సమయంలో కూడా సాయి సోదరుడు, ఒక పోలీసు కలిసి తనను అనేక సార్లు చేతుల మీద ఎత్తుకుని మార్చాల్సి వచ్చింది.ʹʹ ఆ దశ్యాల వీడియో చూసి సాయి పరిస్థితి అర్థం చేసుకోవాలని న్యాయమూర్తులకు ఆమె విన్నవించుకుంటున్నది.

ʹʹఈ రెండేళ్ల కాలంలో సాయిబాబకు జైల్లో మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ప్రాణాంతకంగా మారిన గుండె సమస్య, కిడ్నీల్లో రాళ్లు, యూరిన్‌ ఇన్ఫెక్షన్‌ వంటి 19 రకాల ఆరోగ్య సమస్యలు తనను వెంటాడుతున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా మూత్రాశయంలో రాళ్లను మాత్రం శస్త్ర చికిత్సతో తీసేస్తామని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. అంతే కాక వైద్యులు సిఫార్సు చేసిన పలు పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేవు. అందుకే తనను సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చాలని కూడా వైద్యులు సూచించారు. సాయి ఉంటున్న సెల్‌ ఓపెన్‌గా ఉండటంతో తనకు తీవ్రంగా చలివేస్తోంది. దీంతో తన కాళ్లు స్తంభించిపోయాయి. అండా సెల్‌ లోపల ఉష్ణోగ్రత మరింత తక్కువ కావడంతో తను నరకం అనుభవిస్తున్నట్లే లెక్క. ఎడమ భుజం స్తంభించిపోయినందున వెంటనే ఆయనకు థెరపీ చికిత్స చేయించాలని న్యూరాలజీ విభాగాధిపతి రాశారు. తనకు నిత్యం ఫిజియోథెరపీ అవసరం. కుటుంబ సభ్యుల తోడు లేకుండా అది అసాధ్యం. తీవ్రమైన నొప్పిని అనుభవిస్తూ సాయి జీవిత చరమాంకంలో లాగా గడుపుతున్నాడు.

సాయిని జైల్లో ఉంచి రెండేళ్లయింది. తనకు మెడికల్‌ బెయిల్‌ కోసం అప్లై చేసి ఏడాది దాటింది. ఈలోగానే తన ఆరోగ్య స్థితి విషమంగా మారింది. ఘన ఆహారం స్వీకరించలేనంత బలహీనంగా ఉన్నారు. 90 శాతం వైకల్యంతో ఉన్న సాయి హక్కులకు తీవ్రంగా భంగం కలుగుతోంది. తరచుగా స్పహ కోల్పోతున్న సాయిబాబాది అక్షరాలా ఇప్ప్రుడు చావుబతుకుల సమస్య.ʹʹ

తాజా పరిస్థితి - బెయిల్ తిరస్కరణ

తన పరిస్థితి గురించి స్వయంగా సాయిబాబా మార్చి 19న జైలు నుండి ఒక లేఖ రాసాడు. వేగంగా క్షీణిస్తున్న తన ఆరోగ్యం, మరిన్ని క్లిష్ట సమస్యలు వచ్చి పడుతున్న స్థితిలో నాగపూర్ జైలుకు చెందిన ప్రధాన వైద్య అధికారి, ప్రభుత్వ మెడికల్ కాలీజీ డీన్, తదితర డాక్టర్లను సంప్రదించి ఆయన్ను గుండె, నరాలు, నాడీ శస్త్ర చికిత్సకు సంబంధించిన విభాగాలకు వెంటనే పంపించాలని నిర్ణయించారట. అయితే సదరు నాగపూర్ వైద్య కళాశాల ఆసుపత్రికి గానీ నాగపూర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి గానీ ఆ సదుపాయాలేవీ లేవని, ఈ విషయాన్ని 2014లో ఒకసారి, 2018లో ఒకసారి వాళ్ళే స్వయంగా చెప్పారని ఆ లెటర్ లో ఆయన గుర్తుచేశారు. అయినా ఎమర్జెన్సీ అని చెప్పి అందుబాటులో ఉన్న వైద్యం కోసం తనను అక్కడికే పంపిస్తారని, ప్రస్తుతం ఎడమ చేతి కండరాలు క్షీణించడం వల్ల విపరీతమైన నొప్పిని అనుభవిస్తున్నానని, అందువల్ల నిద్ర పట్టదని, ఎప్పుడూ కళ్ళు తిరుగుతుంటాయని, తనకు మత్తు ఇచ్చే మందులేవీ కూడా పనిచేయడం లేదని రాశారాయన. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ʹఇప్పుడు నేను సగం చచ్చిపోయానుʹ.

మొదటి నుండీ ఆయన, ఆయన లాయర్లు, కుటుంబసభ్యులు చెప్తున్నదేమిటంటే తను ఏమాత్రం కోలుకోవాలన్నా హైదరాబాద్ లేదా డిల్లీ ఆసుపత్రుల్లోనే అది సాధ్యమని. ఇప్పటికిప్పుడు తనకు గాల్ బ్లాడర్ సర్జరీ చేయడానికి నాగపూర్ వైద్యులు సిద్దంగా ఉన్నారని, తాను మాత్రం ఏ సౌకర్యాలు లేని ఆ ఆసుపత్రిలో వైద్యానికి సిద్ధపదలేనని సాయి అంటున్నారు. ఏమాత్రం కదలలేని తనను సెక్యూరిటీ సిబ్బంది ఎత్తి బెడ్ పైకి, వీల్ చైర్ లోకి మార్చడం ఇంకా సమస్యాత్మకం అవుతోందని, ఎందుకంటే తన వంటి పేషంట్ ను ఎలా పట్టుకోవాలో వాళ్లకు తెలీదని పదేపదే చెప్తున్నారు. ఇలాంటి స్థితిలో మెడికల్ బెయిల్ కోసం పెట్టుక్కున పిటిషన్ను నాగపూర్ హైకోర్టు బెంచ్ ఏడాదికి పైగా వాయిదాలు తీసుకుని చివరికి మార్చి 25న కొట్టేసింది. అంటే ఆయనను ఇక జైల్లోనే అంతం చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నింది.

ప్రజాస్వామ్యానికి లిట్మస్‌ టెస్ట్‌

ఒక్క చెయ్యి మాత్రమే పనిచేస్తున్న సాయిబాబా కేవలం మానసిక స్థైర్యంతోనే జీవించి ఉన్నాడు. రాజీలేని ఉద్యమ స్ఫూర్తితో ఏకకాలంలో ఆయన రాజ్యంతో, చావుతో పోరాడుతున్నాడు. ప్రపంచంలోనే అతి పెద్దదైన, ఘనమైన ప్రజాస్వామ్యాన్ని ఆయన పరీక్షకు పెట్టాడు. అదొక రాజకీయ భిన్నాభిప్రాయంతో ఎలా వ్యవహరిస్తుంది? ఒక బందీతో, శారీరక వైకల్యం ఉన్న మనిషితో ఎలా వ్యవహరిస్తుంది? ఇందులో అది కనీస మానవ స్పందనలు కూడా లేనంత మొద్దుబారి ఘోరంగా ఫెయిలయ్యంది. 2014 మే 9వ తేదీన కాలేజీలో పరీక్షలు నిర్వహించి వస్తున్న ప్రొఫెసర్‌ను రాజ్యం ఎత్తుకుపోతే, ఆ రోజు నుండే ఆయన ప్రభుత్వాన్ని పరీక్షకు పెట్టాడు, నీవు డెమాక్రసీ సర్టిఫికెట్‌కు అర్హురాలివా, కాదా అని. సమాధానం చెప్పగలదా?

(ʹఇప్పుడు కావాల్సింది అర్బన్ మావోయిస్టులేʹ పుస్తకంలోని వ్యాసం కొంత అప్డేట్ చేసి)

No. of visitors : 1312
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌

బ‌ల్లా ర‌వీంద్ర‌నాథ్‌ | 03.11.2017 04:10:37pm

ఈ అమ్మను చూడగానే మహాశ్వేతదేవి ʹఒక తల్లి కథʹ కళ్ళముందు కదిలింది ఆ ఆదివాసీ అమ్మ పేరు ʹరిజో టిర్కిʹ. వయస్సు 55 సం.లు ఉంటుంది. అమె కొడుకే ʹవిజయ్ టిర్కిʹ దేశ వ్య...
...ఇంకా చదవండి

నాదయిన మంచు గురించి

జి.లక్ష్మీనరసయ్య | 02.11.2017 12:06:48pm

నేనెన్నో భ్రమల్ని పుట్టిస్తూ ఉంటా పుట్టించే ముందు వాటిని శ్రద్దగా చంపుతూ ఉంటా నావెనక రాజ్యం నడుస్తుందో రాజ్యం వెనక నేను నడుస్తున్నానో నాలో రాజ్యం ఉందో నేను ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •