భూమాట

| సాహిత్యం | క‌థ‌లు

భూమాట

- వడ్డెబోయిన శ్రీనివాస్‌ | 01.04.2019 01:53:44pm

డిసెంబరు నెల. చలికాలం. పైగా తుఫాను గాలి. తెలంగాణ యావత్తు ఫ్రిజ్జులో పెట్టినట్టుంది. తట్టుకోలేని చలి.

మాదిగవాడంతా గులాబి దుమ్ములేస్తోంది. ఆ గుంపులో ఎవరి జుట్టూ నల్లగా లేదు. తెల్లగా లేదు. గులాబి రంగులో తప్ప. ఆడా, మగా అందరి జుట్టూ అంతే.

ఆ దుమ్ములోకి, కంది కనుకమ్మ బల్మీటికి గుంజుకొచ్చిన... రంగం శివమ్మ కండ్లల్ల ఆ దుమ్ము పడ్డది. దాంతో శివమ్మ రొండు చేతుల్తో కండ్లు నులుపుకుంటోంది. కండ్లు నులుపుకుంటున్న శివమ్మ చుట్టూ దుడ్డెల గంగమ్మ, కంది కనుకమ్మ, నామ నాగమ్మ, పిల్లి సమ్మక్క ఇంకా చాలా మంది చేరిండ్రు. ఒకరు కండ్లల్ల ఊదిండ్రు. ఒకరు తమ చీరకొంగు నోట్లో పెట్టి... వేడి ఊది... కండ్లకు పెట్టిండ్రు. ఎవరికి తోచిన ఉపచర్యలు వారు చేస్తుండగానే... కనకమ్మే, పక్కనే ఉన్న జాలారు దగ్గరికి గుంజుకపోయింది శివమ్మను. అక్కడ గోళెం పక్కనే ఉన్న గుండుచెంబుతో నీళ్ళు ముంచి ఇచ్చింది. శివమ్మ కండ్లు కడుక్కుంది.

నలపడం వల్లా... రంగు పడడం వల్లా... ఆమె కండ్లు ఎర్రగా... చింత నిప్పుల్లా ఉన్నాయి. తలంతా... గులాబి దుమ్ముతో నిండి ఉంది. శివమ్మ చుట్టూ మళ్ళీ అందరూ చేరిండ్రు, చేతులకు పట్టిన గులాబి దుమ్ము దులుపుకుంటూ... ఉత్సాహంగా హుషారుగా...

ఏదో కల... ఏదో ఆశ... ఏదో ధైర్యం... చేజారిన అవకాశం చేతికంది వస్తదని. ఆకలే... ఆ ఆశే... వాళ్ళందర్నీ ఆడిస్తోంది. పాడిస్తోంది. తమది కాని విజయాన్ని... తామే సాధించిన ఆనందానికి గురిచేస్తోంది.

- - -

అదీ... మూడెకరాలు భూపంపిణీ స్కీం కింద భూములు కొనే కాలం. ఊల్లెకు రెవిన్యూ ఆఫీసర్లొచ్చిండ్రు. మాజీ పట్వారి... దొర... రంగారెడ్డింట్ల జొర్రిండ్లు. ఈ విషయం పిల్లిలా పసిగట్టిన అతని సహచర మాజీ పట్వారీలు రవీందర్‌రెడ్డి, కొక్కిరేణి చొక్కారావు, కన్నాల కిష్టయ్య మెల్లగా జమైండ్రు. వాల్లందర్నక్కడ కలిపింది, రెడ్డి చెరువు మీద వందెకరాలకు పైన్నే ఉన్న వారి పట్టా భూములు.

అట్లనే ఆ దొరల అడుగులకు మడుగులొత్తే కులాలోల్లకూ ఎంతో కొంత భూముందక్కడ. ఇది ఇట్లా ఉండగా -

చెరువు మీద భూములు పట్వారీలకు పట్టెట్లైనవన్న దాని మీద కతలు కతలుగా చెప్పుకుంటారు ఊల్లెజనం.

చిన్నతనం నుంచి కష్టపడి... చెమట చిందించి... ఆ భూములు పట్వారీలు సంపాదించారని ఒకరంటారు.

కాదు కాదు... వాళ్ళ తాత తండ్రుల ముత్తాతలు సంపాదించారని ఒకరు. అయ్యో! అట్లగాదు... అప్పటి తహశీల్దార్లు... ఆఫీసర్లకు... గుడ్లమీది కోళ్లు... ఆయిమన్న పుంజులు గోసి... బగ్గ తాపిచ్చి తినిపిచ్చి... బొత్త బల్గెటట్టు విందులిస్తే భూముల పట్టాలొచ్చినయని కొందరు.

ఓ పిచ్చి పుల్లయ్యలారా! పచ్చని నిజమిది... ఆఫీసర్లొచ్చినప్పుడల్లా ... పోశిని, మంగిని... మర్కసుశీలనీ... తోలి... పట్టాల మీద సంతకాలు జేపిచ్చిండ్రు. ఆ భూములకు ఆడోళ్ళను బలి ఇచ్చిండ్రని కొందరు వాదిస్తారు.

అట్ల కానే కాదు. మాటినని ఆఫీసర్లను గడివేసి... గుత్పందుకొని... పట్టాల్జేపిచ్చుకొన్నరని ఒకరంటరు. ఎవరికి తెల్సిన లేదా తోచిన కతను వారు చెప్పుకుంటారు.

కాని ఆ రెడ్డి చెరువు మీది భూములు... ఆ దొరలకెలా వచ్చాయన్నది, ఎవ్వరికీ తెలియదు. ఆ దొరలకు... ఆఫీసరు దొరలకు... తమ కనుసన్నల్లో నడిచేవాణ్ణే తమ నాయకునిగా... దొరలు గుర్తించిన ఎమ్మెల్యేకు తప్ప, మరో నరమానవుడికి ఆ పట్టా భూముల రహస్యం తెలియదు.

ఇంతలోనే... రంగారెడ్డి బంగ్లాలోంచి యాట కూరవాసనలు... కోడికూర వేపుడు... చేపల ఫ్రై... ఖరీదైన మందు వాసనలూ... ఊరిమీద వీర విహారం చేస్తున్నాయి. అక్కడేం జరుగుతోందో అర్థం గాక... ఊళ్ళో అక్కడక్కడ... గుంపులు గుంపులుగా చేరి... దొర బంగ్లాలోంచి వస్తున్న వాసనల చర్చే సాగుతోంది.

అదిగో... అప్పుడే... ఎందుకో ఏ పనో బయటకు వచ్చిన దొరగడి వంట మల్లయ్య... దొర బంగ్లాలోని దృశ్యాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాడు, దళితవాడ గుంపుకు.

ʹʹరంగారెడ్డిగారూ! ఈ ఊళ్లె మీ భూములే కొనడం ద్వారా దళితోద్ధరణకు తమ వంతు కృషి ఈ లోకానికి తెలియజేయాల్సిన బాధ్యత నా మీదున్నదిʹʹ గతంలో దొరవారికి తన చేసిన సేవలు గుర్తుకు వచ్చేలా వత్తి పలికాడు ప్రధాన ఆఫీసరు.

ʹʹఆఫీసరుగారూ! మీలాంటి గొప్ప మనుషులు ఇంకా ఈ భూమ్మీదున్నారు కాబట్టే... ఇంకా ఈ లోకం తెలవారుతోంది. చీకటి పడుతోంది. లేకుంటేనా...ʹʹ

ʹʹఏదో... మీ అభిమానం దొరవారూ... తమరు రెడ్డి చెరువు మీది ఇరువై ఎనిమిదెకరాలు దయతో దళితులకు ఇవ్వడానికి సిద్ధపడినందుకు నాకు సంతోషంతో స్వర్గం కనబడుతోంది.ʹʹ

మాట్లాడుతూ మాట్లాడుతూ... ఎవరికో ఫోన్‌ కలిపి ఆఫీసరు గారి చెవి దగ్గరుంచారు దొర. ఆఫీసరు కూడా ఆబగా అందుకున్నాడు, ఆనందంగా... ఎవరిదని అడక్కుండానే -

ʹʹఎమ్మెల్యేగారూ!... నమస్కారం సార్‌...ʹʹ

ʹʹ........ʹʹ

ʹʹఆఁ... ఆఁ... మీ మాట కాదంటానా సార్‌...ʹʹ

ʹʹ........ʹʹ

ʹʹఅవును సార్‌... అధికార పార్టీ కండువా కప్పుకున్న కాంచి... పాపం దొరవారు... నిద్ర... ఆహారం మాని... పార్టీ కోసం... ప్రాణం పెట్టి పని చేస్తోండు ఎమ్మెల్యే గారూ...ʹʹ

ʹʹమీరంతగా చెప్పాలా? దొరవారూ... మీరు... నాకు దేవుడితో సమానం సార్‌. మీ మాటే నాకు దైవాజ్ఞ.ʹʹ

తిరిగి ఫోను దొరకిచ్చాడు, ఆఫీసరు. ఫోను వింటూనే దొర నవ్వులు బంగ్లా అంతా ప్రతిధ్వనించాయి. జరిగిన సంభాషణంతా ఆఫీసర్లూ... పెద్దాఫీసరు నోటి నుండి విని ఆనందాన్ని తట్టుకోలేకపోయారు.

అత్తవారింట్లో అల్లుళ్ళ వైభోగంలా ఉంది వారికి, రంగారెడ్డి దొర గారి గడిలో. ఆ తర్వాత జరిగిన వ్యవహారం వంట మల్లయ్యకు తెలియదు. దళితులకూ తెలియదు.

మాజీ పట్వారీల నోట్లోంచి పొక్కి... ఊళ్ళో పచార్లు కొడ్తున్న విషయమేమిటంటే, దాదాపు కోటీ అరవై లక్షల చిల్లర పూలల్లో పెట్టి ప్రభుత్వం ఖజానా నుండి రంగ రంగ వైభవంగా చెల్లించిందని. విన్న జనం గుండెలు బాదుకున్నారు.

రంగారెడ్డి గారి తెలివికి జేజేలు పలుకుతూ... తమ పంట కూడా ముందు ముందు పండబోదాని పట్వారీలు మాజీ అయినా తాజా తాజాగా మురిసిపోయారు. తమ తెలివికి తగిన ఫలితం కోసం ఎదురు చూడసాగారు.

ఆ రోజు... పట్టాలిచ్చే భూముల్లోనే సభ ఏర్పాటు చేశారు. కొద్ది దూరంలోని బక్కచిక్కిన చెరువు సాక్షిగా భారీ సభ.

దొరవారికీ... ఎమ్మెల్యేగారికీ... అధికార పార్టీ లాంఛనాలతో... మంత్రిగారి సమక్షంలో భారీ సన్మానం జరిగింది. కదిలివచ్చిన ఊరు ఊరంతా ఆ సన్మాన దర్శన భాగ్యం కలిగినందుకు ఎంతో ఆనందించింది.

తమ వాళ్ళ కోసం భూమిని ʹత్యాగంʹ చేస్తున్న రంగారెడ్డి గారిని, వేనోళ్ళ దళితవాడ కీర్తించింది. అపర అంబేద్కరుడు రంగారెడ్డి దొరవారని పొగిడింది. సింహం వదిలేసిన దానికోసం నక్కల హడావుడి లాగా ఉంది మిగల్న మాజీ పట్వారీల హంగామా.

మంత్రిగారు, ఎమ్మెల్యే చేతుల మీదుగా రంగం శివమ్మ, దుడ్డెల గంగమ్మ, కంది కనుకమ్మ, నామ నాగమ్మ, పిల్లి సమ్మక్క... దాదాపు ఏడుగురు భూమి లేనివారికీ... మూడెకరాల చొప్పున పట్టాలు ప్రదానం చేశారు. అక్కడే ఎవరి హద్దులు వారికి చూపారు.

ఆ రోజు... దళితవాడ, మంత్రిగారిని, ఎమ్మెల్యేగారినీ, దొరగారినీ... తమ భుజాలమీద... వాడవాడ... వీధివీధి... గల్లిగల్లీ... ఇల్లు ఇల్లు... తిప్పి తిప్పి... అధికార పార్టీకీ... తమ వాళ్ల తరఫున... తమ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంది.

- - -

కనుకమ్మ... గంగమ్మ... నాగమ్మ... సమ్మక్క... ఇతరులు... తమతమ కలల్లో... భూమి దున్నుతనే ఉన్నరు. గింజలేస్తనే ఉన్నరు. కోత కోస్తనే ఉన్నరు. కుప్ప కొడ్తనే ఉన్నరు. కాని శివమ్మకు కంటి మీద కునుకు కందిరీగై కుడుతోంది.

భూమీ... భూమీ... భూమీ... ఈ భూమి కోసం ఎంత మంది రక్తాన్ని ధారపోసిండ్రు. ఈ భూమికోసం ఎన్ని ప్రాణాలు గడ్డిపోచల్లా ఈ మట్టిలో కలిసి పోయాయి. ఈ భూమికోసం ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయినాయి. ఈ భూమి కోసం ఎందరు కొడుకులు... ఎందరు ఆడబిడ్డలు... తుపాకులు పట్టుకొని అడివి పాలైండ్రు.

భూమంటే ఆత్మగౌరవం... భూమంటే ధైర్యం... భూమంటే బతుకు మీద విశ్వాసం.

భూములున్నోడే దొరైండు... భూమిలేనోడే పాలేరైండు జీతగాడైండు. కూలైండు. బానిసైండు. కూటికి లేనోడైండు.

ఇవన్ని రాజయ్య మాటలు. శివమ్మ కండ్ల ముందట, రాజయ్య మాటల జ్ఞాపకాల ప్రవాహంలో... జరిగిన, జరుగుతున్న చరిత్ర సినిమా రీలులాగా కదులుతోంది.

ఎన్నెల రాత్రుల్ల... ఎగురుతున్న ఎర్రజెండాల మధ్య... ఎన్ని రాజయ్య ముచ్చట్లిన్నది. ఎంత కొట్లాట చూసింది.

ఇప్పుడు... ఇంత అల్కగా... ప్రజల త్యాగాలతో వచ్చిన తెలంగాణల ఏర్పడిన ప్రభుత్వం... మావోయిస్టుల ఎజెండే, మా ఎజెండాని చెప్పుకుంటా... ఇలా మూడెకరాలివ్వడం... శివమ్మకు ఒక కలలాగున్నది.

ఎమ్మెల్యే ఇచ్చిన కాగితాల వైపు చూసింది శివమ్మ.

ఇవి పట్టాలేనా... నిజంగా... ఆ భూమిలో గింజలేస్తామా? మొలకలొస్తాయా? మొక్కలు పెరుగుతాయా? కాయలో... గింజలో కాస్తాయా? ఆ గింజలు చేతికందుతాయా... చేతికందినా... నోటికందుతాయా?

శివమ్మ కళ్ళలోంచి కన్నీళ్ళు జలజలరాలాయి.

ఆ రోజుల్లో... పరకాల ప్రాంతంలో... దొరల భూముల్లో ఎర్రజెండాలు పాతారు. కొన్ని రోజులకు భారీగా సరిహద్దు సైనికులు దిగారు. శివమ్మ ఊరి మీద పడ్డారు. శివమ్మ భర్త రాజయ్య కోసం ఇల్లిల్లు వెతికారు. ఊర్ని భయం మింగింది. అప్పుడు శివమ్మ ఆర్నెల్ల గర్భిణి.

కనబడ్డోని కాలు మొక్కింది. అయినోని... కానోని... కడుపుల తలబెట్టింది. పోలీసులకు పొర్లు దండాలు బెట్టింది. ఊరికి దండం బెట్టింది.

అయ్యో... అంటోళ్ళేగాని... ఆదుకునే వాళ్ళేలేరు. పాపం... అనే వాళ్ళే కాని... పట్టిచ్చుకునే వాళ్ళే లేరు. రాజయ్యను కాపాడే వాళ్ళే లేరు. ఏడ్చి ఏడ్చి కనుపాపలు కరిగినై. రాజయ్యను... పిల్చి పిల్చి కడుపు కుట్టుబట్టింది.

రాజయ్య ఏమైండో తెలియదు. ఏడపట్టుకున్నరో తెలియదు. ఏం జేసిండో, తెలియదు. అస్సలు బతికున్నడో తెలియదు. చంపిండ్రో తెలియదు. ఇగ ఒక్క చిత్తం చేసుకున్నది. ఏదైతే... అదాయె... అనుకున్నది. కాని తన కణకణంలో రాజయ్యే కన్నీరై ఒలుకుతాండు. నీడై వెంట నడుస్తాండు.

ʹʹఒద్దురా... ఒద్దురా కొడుక

దొరలతోనీ... యుద్ధమంటే...

నెత్తినోరూ... మొత్తుకున్నా..

ఎంత జెప్పిన వినకపోతివి...

మొండివాడివి దండివాడివి

శమలు నిండిన గుండెవాడివి

ఎత్తినా... ఆ ఎర్రజెండను

పాణముండగ విడవలేదుʹʹ

రాజయ్య గుర్తుకొచ్చినప్పుడల్లా... ఆ పాట... మనసుల మెదుల్తది. కడుపంతా... కలికలైతది. కాని ఏదో మొండి ధైర్యం కడుపునిండి... బతకడానికి కావల్సిన... ఆసరా ఇచ్చినట్టనిపించేది. శివమ్మకు. ఆ ఆసర రాజయ్యేనేమొ!

ముండరాలు లాగ... అనాథలాగ... ఆ ఊరు... ఈ ఊరు... తిరుగుతూ... ఈ మాదిగవాడ ఒడిలో ఓదార్పు పొందింది. ఇష్టం లేకపోయినా... భర్త చనిపోయిన సానుభూతి పొందింది. ఈ మాదిగ వాడే కడుపుల బెట్టుకొని కాపాడింది, శివమ్మను.

ఇక్కడే కొడుకు బుట్టిండు. కూలో నాలో చేస్కుంట... కొడుకును నాగలేకుండా... బడికి పంపింది. ఉస్మానియల చదివిండు. ఇగ నౌకరి కోసం పడరాని పాట్లు పడుతాండు. కొడుకు రాజాలు గుర్తుకొచ్చే సరికి దుఃఖం గుండెల్నుంచి తన్నుకొచ్చింది శివమ్మకు.

ఎట్ల సాదిన్నో... ఎట్ల పెంచిన్నో... కొడుకు నోరిడిసి గదిగవాలే.. గిది గవాలే... అని అడిగిందీ లేదు. తను ఇచ్చిందీ లేదు.

రాజాలుకు తెలంగాణంటే ప్రాణం. తెలంగాణ కొట్లాట జరిగినంత కాలం... కొడుకును.. ఎట్లా దక్కించుకోవాల్నోనని తల్లడమల్లడమైయ్యేది. సరం బడ్తెనో... కడుపు కలుక్కుమంటేనో... వాళ్ళ వీళ్ళ అడుక్కుంటనైనా... యూనివర్సిటీకి చేరేది. కొడుకును చూసుకునేది. అదీ అగ్గిపుల్ల లెక్క తెలంగాణ కోసం మండిన యాదయ్య సావు తర్వాత... రాత్రుల్లు నిద్రపట్టేది కాదు శివమ్మకు.

ఆయాల్ల... కూలోల్ల నాలోల్ల పెత్తనంలో... దొరలకు వ్యతిరేకంగా... భూమికోసం... రాజయ్య బరిగీసి... గిరిగీసి... నిలబడ్డడు. సావొచ్చినా... ఆఖరికి... ఎవన్నో దొరోని తొత్తును... చంపే చస్తనన్నడు. ఇయ్యాల... దొరల పెత్తనంలో... తెలంగాణ భూపోరాటంలో... బరిగీసి... గిరిగీసి... నిలబడడుగాదు. భరించలేని దిక్కుతోచనితనంతో... వీరమరణానికి బదులు వారిని వారే చంపుకొని... వచ్చిన తెలంగాణలో... ʹʹదారిʹʹ చూపెట్టలేని ʹʹతాలుʹʹ మిగిలిచ్చిపోయిండు. నిస్వార్థులు నీరసించిపోయి... దోచుకున్నోళ్ళకు... దోచుకున్నంత... అన్నట్టయ్యింది.

గిట్లాంటి తీరుల... రాజయ్య గుర్తుకొచ్చి... రాజాలు గుర్తుకొచ్చి... రాత్రులన్నీ కన్నీటి గోదారులైయ్యేవి, శివమ్మకు. రాజాలు ఇంటికొస్తనే... కంటినిండా నిద్రపట్టేది. రాజాలు మళ్ళీ చదువుకు బోతే... శివమ్మకు మళ్ళీ జాగారమే!

తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు... రాజాలు నౌకరి కోసం తండ్లాట జూసి... అప్పుడప్పుడు శివమ్మకు భయమైతాంటది. అంతర్మథనంతో శివమ్మ గుండె శబ్దం బయటకు వినబడుతోంది.

- - -

పట్టాల సంబరంతో మాదిగవాడ ఊగిపోయింది. గంగమ్మ, కనుకమ్మ, నాగమ్మ, సమ్మక్క... అందరొచ్చి శివమ్మను ఒప్పించ్చిండ్రు. అప్పో సొప్పో చేసిండ్రు. ధరెక్కువైనా... మాంచి షియ్యబట్టిన ఎద్దను కొన్నరు. ఇరువై లీటర్ల మాంచి నిఖార్సైన గుడంబ దెచ్చిండ్రు.

మాలు మసాల దట్టించి కమ్మగ ఎద్దుకూరొండిండ్రు. బగార బువ్వొండిండ్రు. గుడంబ బోసిండ్రు. బంతిభోజనం బెట్టిండ్రు. మాదిగవాడను ధనసమ్మతి జేసిండ్రు.

కూర... బువ్వ... కమ్మగ వొండిన శివమ్మతో... మాదిగవాడంతా చేతుల చేయ్యి గలిపింది.

మాదిగవాడ సహకారంతో... ఒక్క చినుకు రాల్తే చాలు... ఇరువాల్లు దున్ని... ఇత్తనాలెయ్యాల్నని సూత్తాండ్రు లబ్దీదారులు.

కొత్తగా భూమొచ్చెసరికే... కొత్త బలమేదో ఒంట్లెకొచ్చినట్టుగా... ఇంట్లకొచ్చినట్టుగా... అనిపిస్తోంది. విత్తనాలేదే రోజు కోసం... పట్టాలొచ్చిన వాళ్ళు... కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తాండ్రు.

- - -

మే, చివరివారం. ఆ ఉదయం... పదకొండు కొవొస్తాంది. ఎండమండి పోతోంది. మాదిగవాడల కలకలం పుట్టింది.

అందరు చెరువు దారి పట్టారు. ఎండిన చెరువంతా.. మాదిగవాడ పగిల్న బతుకుల్లాగా... కనిపిస్తోంది.

పట్టాలిచ్చిన భూముల్లో ప్రొక్లైన్లున్నాయి. మట్టి తొవ్వుతున్నాయి. అప్పటికే పెద్ద పెద్ద బొందలు కనబడుతున్నాయి. అయిదారు ట్రాక్టర్లు మట్టి నింపుకొని పోతున్నాయి. ఇంకొన్ని ట్రాక్టర్లు నింపుతానై, ప్రొక్లైన్లు.

ఆ దృశ్యం చూసి లబ్దిదారులంతా లబోదిబోమంటూ... ఆ వైపు పరుగెత్తారు. డ్రైవర్లతో ఎంత చెప్పినా... ఎంత వాదించినా... పూటికి తీతను ఆపలేదు. ఇక లాభం లేదని పూటిక తీస్తున్న గుంటలో ఒక్కసారిగా దూకింది శివమ్మ. శివమ్మను చూసి గంగమ్మ, కనుకమ్మ, నాగమ్మలు కూడా ఆ బందల్లోకి దూకారు. దాంతో డ్రైవర్లు పూటికతీతను ఆపక తప్పలేదు. వెంటనే సమ్మక్క... శివమ్మ దూకిన బొంద తీస్తున్న ప్రొక్లైన్లు డ్రైవరును క్యాబిన్‌ నుండి కిందికి గుంజుకొచ్చింది. ఆ దృశ్యాన్ని చూసిన మిగతా డ్రైవర్లంతా పరుగున వచ్చారు. సమ్మక్క గుంజుకొచ్చిన డ్రైవరు కొంచెం భయం భయంగా ఉన్నాడు.

ʹʹఇవి... మా పట్టాభూములు... మా ముఖ్యమంత్రి దయవల్ల మూడెకరాలు పంచిండ్రు... మీరు బొందలు తోడితే మేమెట్లా దున్నుకోవాలెʹʹ. బొందల్నుంచి లేచి పైకి వచ్చి కండ్లల్ల నిప్పులు కురిసేటట్టు నిలదీసింది శివమ్మ. మిగిల్న వాళ్ళంతా డ్రైవర్లను కొట్టెట్టట్టే మీది మీది కొచ్చిండ్రు.

అక్కడ కూడిన జనమంతా ప్రొక్లైన్లా... ట్రాక్టర్ల... డ్రైవర్లను బండ్లెక్కిచ్చి... ఎక్కడి నుండి వచ్చారో... అక్కడికే పొమ్మని పంపించారు. కొడుక్కు ఫోన్‌ చేసింది శివమ్మ... బాధను తట్టుకోలేక.

ఇట్లెందుకు జరిగిందో అర్థం కాలేదు, లబ్ధిదారులకు దొర దగ్గర సేకరిఞచారు. మూడు మూడు ఎకరాలకు పట్టాలు పంచారు. భూమీ... చూపించారు.

దొరలు... ఎమ్మెల్యే.. మంత్రి... ఊరిజనం... ఇందరి ముందు పంచిన భూమి. ఎందుకిట్లా కొరగానిదై పోయింది.

ఆ రాత్రి లబ్దిదారులంతా శివమ్మ ఇంట్లోనే ఉన్నరు. ఎవ్వరి కంటి మీదా... కునుకు తొంగి చూల్లేదు. అందరి మనసుల్లో ఆందోళన.. ఆశ భగ్నమౌతుందా? కలముక్కలవుతుందా? ఏం జరుగబోతోందో... ఎవ్వరికీ అర్థం కాలేదు.

తెలతెలవారుతుండగానే లబ్దిదారులంతా భూముల మీదికి చేరారు. ముఖం కడుగలేదు. కడుపల ఆసరా పడలేదు. ముఖాలన్నీ ఈడ్చుకుపోయాయి. బాధగా ఉన్నారు.

తొమ్మి కావొస్తాంది. దూరంగా వాహనాల శబ్దం. లబ్దిదారుల వైపు దూసుకొస్తున్న శబ్దం. కొత్త కొత్త పోలీసు వాహనాలు. వేగంగా వచ్చినై. ఆగినై. ఆ వాహనాల్లోంచి బిలబిలమంటూ కొత్త కొత్త ఆయుధాల్తో పోలీసులు దిగారు.

అప్పుడే వచ్చిన వాహనంలోంచి కాంట్రాక్టరు అవతారమెత్తిన అధికార పార్టీ లీడరు దిగాడు. అతని వెనుకాలే నీటిపారుదల శాఖాధికారులూ దిగారు. దూరంగా.. ప్రొక్లైన్లు... ట్రాక్టర్లూ... వస్తున్న శబ్దం కూడా వినవస్తోంది.

దిగడం దిగడమే... చూసేవాళ్ళు భయపడే చేష్టలతో... ఫ్రెండ్లీ పోలీసింగ్‌ క్యాంపెయినింగ్‌లో ఉన్న పోలీసులు.. తుపాకులు ఎక్కుపెట్టినంత హడహూడి చేస్తూ... ఆ ప్రాంతాన్నంతా తమ చేతికి తీసుకున్నారు. వాళ్ళ వీరంగం చూసిన కనుకమ్మ, నాగమ్మ గుండెల్లో ఎక్కడో చిన్న వణుకు ప్రారంభమైనట్టనిపించి... తమల్ని తాము తమాయించుకున్నారు. సి.ఐ. సెగతో ఎస్‌.ఐ. లబ్దిదారుల దగ్గరకు వచ్చాడు.

ʹʹఎవతి? ఎవ్వత్తది? పూడిక తీయనియ్యంది?ʹʹ ఎస్సై గద్దించిండు.

ʹʹమేమే సార్‌...ʹʹ

ఆ మాటలు వినగానే... లబ్దిదారుల్ని కొట్ట కొట్ట వచ్చిండ్రు మగ పోలీసులు. పట్టాదారులు భయపడలేదు. రెట్టించిన గొంతుతో-

ʹʹఇవి... మా పట్టా భూములు. ముఖ్యమంత్రి మూడెకరాల స్కీం కింద పంచిన భూములు. ఆఫీసర్లు దొరవారి దగ్గరకొన్నారు. మాకు పంచారు. ఆ భూముల్ని బొందలు జేస్తే... మా కడుపు కాలదా? సార్‌ʹʹ లబ్దిదారుల మధ్యలోంచి శివమ్మ మాట్లాడింది.

దాంతో లబ్దిదారుల చుట్టూ పోలీసులు చేరారు. మాట్లాడొద్దన్నట్టుగా లబ్ద్దిదారుల వైపు చూస్తుండగానే -

ʹʹఅమ్మడానికి దొరెవరు? కొంటానికి ఆఫీసర్లెవరు? పట్టాలు తీసుకోవడానికి మీరెవరు?ʹʹ సి.ఐ. గట్టిగా అరుస్తోండు.

ʹʹఇది చెరువు శిఖం భూమి. ఇరిగేషన్‌ వాళ్ళదిʹʹ ఆ కాగితాలు చూపించమని ఇరిగేషన్‌ అధికారులకు ఆదేశించాడు సి.ఐ.

పోలీసులు దారిచ్చారు. ఇరిగేషన్‌ అధికారులు ముట్టడి లోపలికి వచ్చారు. లబ్దిదారులకు ఏవేవో కాగితాలు చూపించారు. ఏదేదో చెప్పారు. చదువురాని వాళ్ళకు కేసుపెడ్తాం... జైలుకు పంపుతాం... అన్న విషయాలు తప్ప... బెదిరింపులు తప్ప... ఇంకేమి అర్థం కాలేదు. కాంట్రాక్టరు పొట్టచెక్కలైయ్యేలా నవ్వుతున్నాడు, కొద్దిదూరంలో.

ఒకవైపు పోలీసులు... అధికారులు... మాట్లాడుతుండగానే... ప్రొక్లైన్ల పని ప్రొక్లైన్లు చేస్తానై. ట్రాక్టర్ల పని ట్రాక్టర్లు చేస్తానై. ఇది గమనించారు లబ్దీదారులు.

ʹʹపొక్లింగులాపండ్రి. తొవ్వకండ్రిʹʹ అరుస్తూ లబ్దిదారులు ఆ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి ప్రయత్నించారు. ఎంత మాత్రం సహించని మగ పోలీసులు ఆడ లబ్దిదారులను జడలు పట్టి... అమాంతం ఎత్తి... పోలీసు వాహనాల్లో కుదేసారు. ఒకటీ అర లాఠీలు అంటించారు. ఏడ్పులు... పెడబొబ్బలతో కదిలిన వ్యాన్లు... మూడెకరాల పట్టాదార్ల ఇండ్ల ప్రాంతంలో ఆగాయి...

వాళ్ళందరి ఇంటినెంబర్లు... కుటుంబ వివరాలు... రాసుకున్నరు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని భయపెట్టిండ్రు. వాననులోంచి దింపిండ్రు.

వెనుక కోపం కోపంగా... భయం భయంగా... ఏడ్చుకుంటా తూడ్చుకుంటా... నిలబడ్డ లబ్దిదారుల ముఖం మీద దుమ్ముకొట్టుకుంటూ... పోలీసు వ్యాన్లెల్లాయి... లబ్దిదారులందరు... పోలీసులను... ముఖ్యమంత్రిని... ఎమ్మెల్యేను... శాపనార్థాలు పెట్టుకుంటూ... ఏడ్చుకుంటూ... ఎవరింటింకి వాళ్ళెళ్ళిండ్రు...

- - -

చీకట్లు పడుతుండగా శివమ్మ కొడుకొచ్చిండు. రాజాలును చూడగానే శివమ్మ ముఖంల కొంచెం వెలుగొచ్చింది. పొద్దట్నుంచి బువ్వొండలేదు. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టింది. జరిగిన కథంతా చెప్పింది. బువ్వకాగానే... ఉల్లిగడ్డలు కోసింది. రొండు గుడ్లు కొట్టిపోసి... కూరొండింది. ఇద్దరూ... కాళ్ళూ చేతులు కడుక్కొని నేలమీదే తింటాని క్కూర్చుండ్రు. రొండు పల్లాలల్ల అన్నం వేసింది. కూరవేసింది. కొడుక్కోటిచ్చింది. తనోటి తీసుకుంది. ఇద్దరూ కల్పుకున్నరు. కాని శివమ్మ నోట్లెకు ముద్దబోతలేదు. కళ్ళు జలజలా రాలాయి. భూమిని తను వేటాడం కాదు. భూమే తనను వేటాడుతున్నట్టుగా ఉంది.

రాజాలు కలిపి అన్నం నోట్లో పెట్టుకుంటోడల్లా... శివమ్మను చూసి ఆగిండు. తల్లిని ఓదార్చాలనుకున్నడు. ఇంతగా దిగాలుపడడం తనెప్పుడూ చూడలేదు. తనకు తల్లీ ఆమే... తండ్రీ ఆమే... తన తండ్రి గురించి తను అడగలేదు. ఆమె చెప్పలేదు.

ఏ బాధ వచ్చినా... ఏ దుఃఖమొచ్చినా... తట్టుకొని... ఎదురీది నెగ్గుకొచ్చుడే తెల్సిన శివమ్మను చూస్తే రాజాలు కండ్లల్ల నీళ్ళు దిరిగినై.

తను తినడం ఆపిండు. తన పల్లెం పక్కకు పెట్టిండు. తల్లి పల్లెం తీసుకున్నడు. కొంచెం దగ్గరగా జరిగిండు. ఎడమ చేత్తో అమ్మ కన్నీళ్ళు తూడ్చిండు. కుడిచేత్తో అన్నం కలుపుతూ... కిందికి తలవంచుకున్న శివమ్మతో...

ʹʹఅవ్వా!ʹʹ

శివమ్మ కొడుక్కెళ్ళి చూసింది.

ʹʹఇప్పుడు నాకు ఇరవై నాలుగేండ్లు. నీ దయవల్ల... నువ్వు నేర్పించిన చదువు వల్లా... నేనీ లోకాన్ని అర్థం చేసుకుంటాన.ʹʹ

శివమ్మ తలూపుకుంట కొడుక్కెళ్ళి చూస్తోంది.

ʹʹఅవ్వా! పైన కోణ్ణేలాడదీసి... కింద బియ్యం బోసి... సుట్టు కూసోబెట్టి... ఖాళీ ఇస్తార్లేసి... ఇగ కడుపు నిండ దినండ్రి!... కోడికూర... సన్నబియ్యం బువ్వ అన్నట్టు గున్నయమ్మా... తెచ్చుకున్న తెలంగాణ రాజ్యం పనులు.ʹʹ

మాట్లాడుకుంటనే... శివమ్మ నోట్లె అన్నం ముద్దపెట్టిండు, బుజ్జగిస్తూనే...

ʹʹమా సదువుకున్నోళ్ళ పని మీ లెక్కనే అయ్యిందిగాదె. ఉద్యోగ నోటిఫికేషన్లు ఏస్తరు. ఫీజులు గుంజుతరు. పరీక్ష రాయకముందో... రాసిం తర్వాత... కోర్టుల కేసేత్తరు. ఇంకేందీ? ఖేల్‌ఖతం. దుకాణ్‌ బంద్‌.ʹʹ

రాజాలు మల్లో ముద్ద శివమ్మ నోట్లె పెట్టిండు. కొడుకు ముచ్చట్లు వింటూ శివమ్మ అన్నం ముద్ద నములుతోంది.

ʹʹపాత రాష్ట్రంలో... ఏదో ఒక నోటిఫికేషన్ను కోర్టుకు గుంజితే... సొంత రాష్ట్రంలో అన్నిటిదీ అదే దారి. ఒక్క పోలీసు నౌకర్లకే ఏ అడ్డూ లేదు.

పాత రాష్ట్రంల... అప్పుడెందుకు అట్ల నౌకర్లిచ్చిండ్రో... సొంత రాష్ట్రంల... ఇట్లెందు కైతానయో... ఆ ముఖ్యమంత్రికి... ఆయన సంతానానికి తప్ప... నరమానవునికి తెల్వదవ్వా...ʹʹ

కొడుకు మాటల్ల బడి శివమ్మ కొంచెం తెరిపిన బడింది. ఇంకో ముద్దరాజాలు తినిపియ్య బోతాంటే.

ʹʹనువ్వు తిను బిడ్డ. నేను కల్సుకొని తింటగని...ʹʹ

కొడుకు చేతిలోంచి తన పల్లెం తీసుకున్నది. రాజాలు అన్న కలుపుకుంటూనే.

ʹʹనోటి కాడి దనుక బువ్వ ముద్దను పెట్టి... నోటి తోటి అందుకనే లోపే... పొయ్యి కింది కొరకాసులు గుంజినట్టు గుంజుకుంటాండ్రు.ʹʹ

ʹʹఔ... బిడ్డ.ʹʹʹ

ʹʹఅవ్వా! నీ భూమి కత... నా నౌకరికత గూడగంతేనే. వాళ్ళు మాత్రం సకుంబ సపరివార బంధుమిత్ర సమేత అధికార పీఠాధిపతులై... ఆఠాణ పని... రూపాయని అంచనాలు పెంచి... మళ్ళీ మళ్ళీ మంచి రెటు బెట్టి ఓటుకొంటానికి... నోట్లు దోస్తనే ఉన్నరు.ʹʹ

శివమ్మ తలూపుతుంది, తింటూనే.

ʹʹఏం లేదవ్వా! కింది నుంచి మీద్దాక... దొరలకు లక్షలు కోట్లు... పేదలకు భిక్షలే వెచ్చాలు...ʹʹ

తల్లీ కొడుకులు బువ్వదిన్నరు. రాజాలు శివమ్మకు నీళ్ళు తాగించాడు. నులక మంచం మీద చద్దరు పరిచి కూర్చోబెట్టిండు. గుడిసె సందు గొందుల్లోంచి చొచ్చుకొన్నది. తండ్రి లెక్కనే మాట్లాడుతున్న రాజాలు వైపు చూసింది.

దూరంగా... ఆగి ఆగి... మిగిల్న లబ్దిదారుల దుఃఖం... చీకటి గాలిలో... పగటి గాలిలో... కొట్టుకొస్తూనే ఉన్నది.

అక్కడ తమ కలలు కల్లలు చేసిన పూటిక తీత కాంట్రాక్టరుని తిట్టని తిట్టు తిట్టకుండా తిడుతున్నారు, పాపం!... మాజీ పట్వారీలు.

- - -

ముందస్తు ఎన్నికలు. ఏడ్చుకుంటూనో... నవ్వుకుంటూనో... పట్టాదారులందరు మూడెకరాల ముఖ్యమంత్రికే ఓటేశారు. గులాబి సుడిగాలి లేసింది. ఫ్రెండ్లీ ప్రభుత్వ ఆఫీసర్లు గెల్చారు. ప్రభుత్వాన్ని మోసం చేసిన దొర గెల్చాడు. దొర మోసం చేయడానికి సహకరించిన ఎమ్మెల్యే... మంత్రి... గెల్చారు. ఆఫీసర్లను... దొరను... ఎమ్మెల్యేను... మంత్రినీ... కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మూడెకరాల ముఖ్యమంత్రీ గెల్చాడు.

తమది గెలుపో... ఓటమో... అర్థం కాని ఆనందంలో లబ్దిదారులు ధూంధాం చేసిండ్రు. శివమ్మ కండ్లను కడిగిన తర్వాత... ఎటోల్లటు పోయే ముందు

ʹʹఈ సారాన్నా... మన మూడెకరాలకు మోక్షముంటదోʹʹ కనుకమ్మ.

ʹʹఆ ఆశతోనేగాదె... ఎనకా ముందూ... ఏదాలోచించకుంట... దిక్క చిత్తంగా... గటే ఓట్లేత్తిమి... గెలిపిత్తిమిʹʹ నాగమ్మ.

ʹʹగప్పుడేమో.. తెలంగాణ తెలంగాణని... గట్ల ఏత్తిమి. ఇప్పుడేమో తేటతెల్లంగాని మూడెకరాల కోసం గట్లనే ఏత్తిమి. గప్పుడే ఎవ్వలో... గిప్పుడు గాయినే ముఖ్యమంత్రాయె...ʹʹ గంగమ్మ.

ʹʹపంచినట్టే పంచి... గింత మోసం జేత్తరనుకున్నమా? ఏదైతదాయె... రేపు కలకట్టరు కాడ కూసోని... కాయో... పండో... తేటతెల్లమయ్యె దనుక లేవొద్దుʹʹ

శివమ్మ... సమ్మక్కల మాటలు మిగిల్న వారి సందేహాలకు సమాధానమైనాయి. లబ్ధిదారులు భూపోరాటానికి సిద్ధమైనారు. అనివార్యంగా శివమ్మను, భర్తి దారిలోకి రాజ్యం నెట్టి వేస్తున్న సంగతి త్వరలోనే అర్థమవుతుందేమో?

No. of visitors : 411
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఇంద్రవెల్లి జ్ఞాపకమా!

వడ్డెబోయిన శ్రీనివాస్ | 17.04.2018 12:23:20am

అడవీ మనిషైయ్యింది అడవీ ఆలోచనైంది అడవీ చీమూనెత్తుటి స్పర్శైంది అడవి మనస్సు పుట్టింది అడవి ప్రశ్నైంది ధిక్కారమైంది సంఘమైంది ...
...ఇంకా చదవండి

జలగలంచ, దేవునిగుట్ట ఆదివాసుల్ని బతకనీయండి!

వడ్డెబోయిన శ్రీనివాస్‌ | 05.10.2017 11:16:52pm

వారు నోరు లేనోళ్ళు.అడవిలో అడివై బతికే వాళ్ళను అడవి నుండి బయటకు వెళ్ళమంటే అడివినే అడవిలోంచి వెళ్ళమన్నట్టుంటుంది.అడవిలో ఆకు పెరిగినట్టు, చెట్టు పెరిగినట్టు......
...ఇంకా చదవండి

గుర్మేహర్‌

వడ్టెబోయిన శ్రీనివాస్‌ | 06.07.2017 12:21:58am

నాన్న రుచి కోల్పోయిన జ్ఞాపకాలగాయం నీగుండెల్లో రక్తమొడ్తుండవొచ్చు హిందుత్వవిచ్చుకత్తులవిన్యాసం నీమనస్సుపొక్కిలి పొక్కిలి చేయవచ్చు ...
...ఇంకా చదవండి

సూర్యాక్షరం

వడ్డెబోయిన శ్రీనివాస్ | 19.11.2018 04:55:36pm

చీకటియుగానికి పాదులు తొవ్వుతున్న ద్వేషభక్తుల అబద్దాలముసుగు హామీలమత్తులో దేశం ఊగుతున్నప్పుడు అధికారంకౄరమృగమై దేశభక్తుల వేటాడుతూ నెత్తురు...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •