మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి

| సంభాషణ

మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి

- తెలంగాణ ప్రజా ఫ్రంట్ | 01.04.2019 02:14:09pm

అయిదేళ్ళ మోడీ పాలనలో కొట్టొచ్చినట్లు కనపడేవి విద్వేష రాజకీయాలు. మైనార్టీ మతస్తులపై, దళితులపై, మేధావులపై దాడులు, హత్యలు. విచ్చలవిడి హింసకు పోలీసుల, పాలకుల మద్దతు. ఆరెస్సెస్ గూండాల స్వైరవిహారం. హంతకులకు, హిందుత్వ తీవ్రవాదులకు బెయిలిచ్చి, కేసులు కొట్టేసి, సన్మానాలు కూడా చేసిన సిగ్గుమాలిన ఫాసిస్టు పోకడలు. పాలకులకు లొంగనివారిని, రాజీపడని వారిని, జడ్జిలను కూడా చంపిన ఘటనలు. కోర్టులు, సి.బి.ఐ., ఆర్.బి.ఐ., యూనివర్సిటీలు ఇలా ఎన్ని వ్యవస్థలున్నాయో అన్నిటి నడుములు విరగ్గొట్టి, మీడియాను కొనేసి, అపద్ధాలు, విద్వేషాలు మూలల మూలలా ప్రచారం చేసే వందిమాగాధులను పోషించడం. మందలు మందలు మోడీ భక్తులను తయారుచేసి నిజాలు మాట్లాడేవాళ్ళను వెంటపడి, వేధించి, బెదిరించడం. ఇవీ మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి, అభివృద్ధి అయినవీ. ఇవన్నీ ఒకవైపు తన నియంతృత్వాన్ని స్థాపించుకోడానికి చేస్తూ మరోవైపు ఆయన చాలా అభివృద్ధి కబుర్లు చెప్పాడు. జనం అయితే విద్వేషం వైపు, లేదంటే తను చూపించే అభివృద్ధి వైపు, లేదా రెండింటి సమర్థకులుగా కొట్టుకుపోయేలా రెండంచుల వ్యూహం ఆరెస్సెస్ పరివారం తయారుచేసి విపరీతంగా ప్రచారం చేసింది. లక్షల కొద్దీ వాట్సాప్ గూపులు, ట్విట్టర్ మెసేజీలు, ఫేస్ బుక్ పోస్టుల ద్వారా పెద్ద కాంపెయిన్ నడిచింది, నడుస్తున్నది.

ఇందులో ముఖ్యమైన మోడీ మేకిన్ ఇండియా, దేశాభివృద్ధి నిజానిజాలను ఒకసారి చూద్దాం.

మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే అట్టహాసంగా భారతదేశాన్ని ʹమేక్-ఇన్-ఇండియాʹ పేరున 2022 నాటికి ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేస్తానని, దీనికోసం అవసరమయ్యే విదేశీ పెట్టుబడిని సమీకరిస్తామని ప్రకటించాడు. అయితే, ఐదేళ్ళు పూర్తి అయినా ఈ పథకం అమలు అయ్యే సూచనలు మచ్చుకైనా ఎక్కడా కనపడటం లేదు. మోడీ భక్త జనం, ఈ సర్కారుకు భజన చేయటమే ప్రధాన వృత్తిగా చేసుకున్న పత్రికలు, ప్రసారమాధ్యమాలు మాత్రం ఇక మోడీ చేతిలో భారత్ కు బంగారు భవిష్యత్తు ఉన్నదని, త్వరలో చైనాను అధిగమించి, ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక శక్తిగా ఎదగబోతున్నామని చెవులు చిల్లులు పడేలాగా ప్రచారాన్ని ప్రారంభించారు. సోషల్ మీడియాలో అయితే, ఆర్థికశాస్త్ర ఓనమాలు తెలియకపోయినా ఆర్.ఎస్.ఎస్ ప్రచార మూకలు మోడీ నాయకత్వంలో భారత్ వెలిగిపోతోందని, దీన్ని చూసి దేశంలోని జాతిద్రోహులు కుళ్ళుకుంటున్నారని, అవాకులు చెవాకులు పేలటం నిత్యకృత్యమయి పోయింది.

ఇవ్వాళికీ దేశ పారిశ్రామిక ఉత్పత్తి జిడిపిలో 17 శాతానికి మించలేదు. దాన్ని ఏడేళ్ళలో 25 శాతానికి పెంచుతానని, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి, హైటెక్ పరిశ్రమలు నెలకొల్పి, తద్వారా 2022 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. నేడు దేశంలోని 45 కోట్ల మంది కార్మికులలో 7శాతం అంటే 3 కోట్ల మంది మాత్రమే సంఘటితరంగంలో జీవనోపాధిని పొందగలుగుతున్నారు. అంటే సంఘటిత రంగాన్ని ఏడేళ్ళలో మూడున్నర రెట్లు పెంచవలసి ఉండగా, గడిచిన ఐదేండ్లలో పారిశ్రామిక ఉత్పత్తి పెరగటానికి బదులు కుచించుకుపోతున్నది. ఎగుమతులు కూడా దిగజారిపోతున్నాయి. ఇక మూడున్నర రెట్లు పెరిగే మాట కల్లే. విదేశీ పెట్టుబడులతో లక్షల ఉద్యోగాలు మన ముందు ప్రత్యక్షమవుతాయనీ గాలికబుర్లు చెప్పటమే తప్ప, ఎక్కడా కొత్త ఉద్యోగాలు కల్పించబడిన దాఖలాలు లేవు. దేశంలో 70 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో గ్రోత్ కారిడార్లు నిర్మిస్తామని చెప్పాడు.

మోడీ ʹమేక్-ఇన్-ఇండియాʹ ఒక బూటకపు ప్రచారం, ఆకాశానికి నిచ్చెనలు వేయటం వంటిదే. ఎందుకంటే ఈనాడు ప్రపంచంలో ఉత్పత్తి సామర్థ్యం మార్కెట్ అవసరాలకు మించి ఏర్పాటు అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని పరిశ్రమలు తమ సామర్థ్యం కంటే తక్కువ ఉత్పత్తిని చేస్తున్నాయి. పోటీ ఎక్కువగా ఉంది. పైగా వస్తూత్పత్తికి నేడు అధునాతన టెక్నాలజీ కారణంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమల్లో విడిభాగాలు తయారయి, మరొకచోట అంతిమంగా రూపందాల్చి, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వస్తున్నాయి. మరోవైపు విదేశీ పెట్టుబడిదార్లు తక్షణ లాభాల కోసం చూస్తారు కాని, పర్యావరణ రక్షణ వారికి అసలు పట్టదు.

ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే ఈ విదేశీ పెట్టుబడులు ఎంతవరకు దేశాభివృద్ధికి దోహదం చేశాయి, ఎన్ని కొత్త ఉద్యోగాలు కల్పించాయనేది. దీనికి ప్రభుత్వాలు సమాధానం చెప్పవలసి ఉన్నది. దేశీయ పరిశ్రమల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించే వినాశకర చర్యలు చేపడితే విదేశీ బహుళజాతి సంస్థలకు లాభాలు పండవచ్చునేమోకానీ, దేశ జనాభాలో అత్యధిక శాతం ప్రజలు మాత్రం జీవనోపాధి కోల్పోయి రోడ్డునపడటం ఖాయం. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే, పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే తొలుతగా ప్రాథమిక విద్యాస్థాయి నుండి ఉన్నత విలువలు కలిగిన ఉచిత విద్యను అందిస్తూ, ఉచిత ప్రజారోగ్య సదుపాయాలు దేశవ్యాప్తంగా కల్పించగలిగినప్పుడే, హైస్కూల్ స్థాయికి చేరగల విద్యార్థులు తయారవుతారు. 45 కోట్ల మంది నైపుణ్యం కలిగిన కార్మికులను, నిపుణులను తయారుచేయటానికి కనీసం పదేళ్ళ కృషి ఆర్థిక వనరులు అవసరమవుతాయి. కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్లలో ఈ కేటాయింపులు ఇప్పటివరకూ నామమాత్రమే. ఇక ముందు కూడా ఈ ప్రకటనలు గాలికబుర్లుగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్లో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదార్లకు రాయితీలు ఇవ్వటానికి చొంగలు కార్చుకుంటూ ఎగబడే ఈ ప్రభుత్వం, కనీసం అందులో 10 శాతం అయినా విద్య, ప్రజారోగ్యం పై ఖర్చు చేస్తే కొంత మేరకు ఫలితాలు కనిపిస్తాయి.

మోడీ ప్రభుత్వం ప్రకటించినట్లు 10 కోట్ల ఉద్యోగాలు యువతకు కల్పించాలంటే, ఒక ఉద్యోగానికి 9 కోట్ల రూపాయలు చొప్పున (అన్ని పరిశ్రమలూ హైటెక్ పరిశ్రమలు కానక్కరలేదు. వాటిలో కొన్ని తక్కువ పెట్టుబడితో ఉద్యోగాలు ఇవ్వగలవని అనుకుందాము) ఏడేళ్ళలో ʹమేక్ ఇన్ ఇండియాʹ పథకం రూపం దాల్చటానికి 90 కోట్ల కోట్ల రూపాయలు పెట్టుబడులు అవసరమవుతాయి. అంటే ఏడాదికి 13 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడి మనదేశంలోకి రావలసి ఉంటుంది. నిజానికి ఈనాడు మనదేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడి 4 లక్షల కోట్లు మాత్రమే. అంటే విదేశీ పెట్టుబడిని 400 రెట్లు పెంచితేనే ఈ పథకం సాధ్యం అవుతుంది. ఇండియా ప్రపంచంలోని మొత్తం విదేశీ పెట్టుబడిలో 2 శాతం మాత్రమే ఈనాడు పొందగలుగుతోంది. ఈ పథకానికి కావలసిన పెట్టుబడి ప్రపంచం మొత్తం విదేశీ పెట్టుబడికి 16 రెట్లు. ఇది సాధ్యమా? ఏ విదేశీ పెట్టుబడి లేకుండానే, దేశంలో 45 శాతం ఉద్యోగాలు ఒక్క అసంఘటిత రంగ వ్యవసాయేతర పరిశ్రమలలో కల్పించబడుతున్నాయి. ఒక చిన్నతరహా పరిశ్రమలో ఒక ఉద్యోగం కల్పనకు 3 లక్షల రూపాయల పెట్టుబడి సరిపోతుంది.

మన దేశంలోకి వచ్చి చేరే విదేశీ పెట్టుబడిలో 70 శాతం ఇక్కడ నుండి బయటకు వెళ్ళిన నల్లధనం డొంకతిరుగుడు పద్దతిలో తిరిగి ప్రవేశిస్తోందని, ఇదంతా, ధనిక వర్గాలకు, రాజకీయ నాయకులకు, అవినీతి అధికారులకు దేశాన్ని దోచుకోవటానికి రాజమార్గం తప్ప, దేశాభివృద్ధి కోసం కాదనే విషయం మనం విస్మరించరాదు. వెరసి మోడీ మేక్-ఇన్-ఇండియా ఒక డ్రామా తప్ప మరేం కాదు. దేశాభివృద్ధికి భారీ పరిశ్రమలు వెన్నుముక వంటివి. అయితే ఈ భారీ పరిశ్రమల అభివృద్ధికి అధునాతన టెక్నాలజీని సమకూర్చుకోవడానికి వివేచనతో విదేశీ పెట్టుబడులను వినియోగించుకోవలసి ఉంటుంది. మన దేశ యువతలో ఎక్కువమంది చేతివృత్తుల కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. వారికి అతితక్కువ సమయంలో, తమ తమ వృత్తులలో శిక్షణ ఇచ్చి, గ్రామీణ ప్రాంతాలలో చిన్నతరహా పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించటానికి సహాయం చేయటం ద్వారా, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

చిన్నతరహా పరిశ్రమలకు నూతన టెక్నాలజీని అందిస్తూ, సహకారమిస్తే, అనతికాలంలోనే అవి అంతర్జాతీయ స్థాయికి ఎదగగలవు. దేశాభివృద్ధి జరగాలన్నా, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించాలన్నా ఈ విదేశీ పెట్టుబడి అనే ఎండమావిని పక్కన పెట్టి మనదేశంలోని నల్లధనాన్ని బయటకు తీసి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం ఒక్కటే పరిష్కారం. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక నమూనా పథకాలతో దేశాభివృద్ధి అసాధ్యం, నిరుద్యోగ సమస్య పరిష్కారం అసలే కాదు. ఇటువంటి తప్పుడు పద్దతుల్ని విడనాడి నిజాయితీతో ప్రజాసంక్షేమం కోసం మన దేశ ఆర్థిక విధానాలలో సమూలమైన మార్పులు తీసుకు రావాలి. దేశాభివృద్దికి ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం అవసరం ఉంది. ధనిక వర్గాల లాభాల వృద్ది కాకుండా, ప్రజలందరి సర్వతోముఖ వికాసం ప్రాతిపదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేయవలసి ఉంది. అందుకు పాలకులపై ఒత్తిడి తీసుకు రావడానికి ప్రజా ఉద్యమమే పరిష్కారం.

తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రచురించిన మోడీ ఐదేళ్ళ నిరంకుశ పాలన పుస్తకం నుండి

No. of visitors : 211
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఆగస్టు 2019

  ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
  వేటగాడి వల
  పదునెక్కుతున్న కోరలు
  ఎదురుచూపులు
  యురేనియమం
  మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
  నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
  దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
  చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
  ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •