ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు

- అల్లం రాజయ్య | 01.04.2019 03:11:28pm

పార్ట్ -1

ఏకబిగిన కూర్మనాథ్ కథలు రెండు వారాలు చదివేసరికి మెదడు పచ్చిపుండై పోయింది. కథల వర్కుషాపుల్లో తరచూ కలుసుకున్నా, అప్పుడప్పుడు ఈ కథల్లో కొన్ని చదివి అందరం చర్చించినా కూడా … వ్యంగ్యంగా ఒకదానికొకటి పొంతనలేకుండా కనిపించినా కూడా; అల్లకల్లోలమై, కకావికలై, కడుపుదేవి ఏకబిగిన చదివితే ఈ కథల్లోని అనేక వాక్యాల్లాగే అయిపోతాం. ఈ ప్రవాహపు సుడి మునకనుండి తేరుకోవడం కష్టం.

లోలోపల ఇంతగా పోగుపడిన అసంబద్ధతను, దుఃఖాన్ని, కోపాన్ని; ప్రదర్సించజాలని, ఫలవంతంగాని సుదీర్ఘ యాతన -- తనలో పేరుకుపోతున్న ద్వంద్వ ప్రపంచాల హింస, దోపిడీ, దౌష్ట్యం రేపిన కోపాన్ని అణిచిపెట్టుకుని, విశ్లేషించుకుని ఒక్కొక్క పదంగా, వాక్యంగా మలుచుకోవడం ఎంత నరకయాతనో? ఇదంతా ఎప్పటినుండి అనుభవిస్తూన్నాడో కాని 1999 నాటికి ఇట్లా కథల రూపంలోనైనా వ్యక్తమయ్యింది.

ఒక దుర్మార్గమైన దోపిడి ప్రపంచంలో, దాన్ని ఎదిరించడానికి, నిర్మూలించడానికి ప్రజలు పడే యాతనల పరంపర తెలిసి -- అలాటి యుద్ధావరణ చారిత్రిక సంధి దశలో పోరాడేప్రజల పక్షాన నిలిచే మనిషిగా -- బతకడం ఎంత యాతనో ఈ కథల్లోని ప్రతి వాక్యం రూపుడుకడుతుంది. అయితే ఈ కథలు, నిర్థారణలు, వాక్యాలు; తలకిందులుగా, డోకాబాజీగా, మిరుమిట్లుగొలిపే పై మెరుగులతో బతికే ఈ సుదీర్ఘ కాలపు దోపిడీ ప్రపంచం అసలు రూపం -- స్వభావం, రూపుకట్టడం, తెలపడం -- ఎప్పుడు ఎక్కడ కూర్మనాథ్ కు మొదలయ్యిందోగాని -- మనకు కథల రూపంలో బయటికి వచ్చింది 1999 తరువాతనే. నేను చదివిన ఇరవై తొమ్మిది కథలు (e-కుక్క మరికొన్ని కథల పుస్తకంతో సహా), నేను ముందుమాట రాయాల్సిన పదిహేడు కథలు కూర్మనాథ్ లోలోపల రూపుకట్టిన శకలాలల్లోని కొన్ని -- నిజానికి ఈ కథల్లోని ప్రతివాక్యం ఒక కథే.

కూర్మనాథ్ కథలను స్థలకాలాలనుండి విడదీసి చదివితే మనకేమీ అర్థం కాదు. ప్రపంచవ్యాపితంగా -- సామ్రాజ్యవాదం తన దురాశాపూరితమైన దోపిడీ కోసం చేస్తున్న యుద్ధ బీభత్సంలోంచి -- లాటిన్ అమెరికన్ కథలుగాని, ఆఫ్రికా కథలుగాని, ఇరాక్, ఇరాన్, ఈజిప్టు లాంటి దేశాలల్లో వచ్చిన వస్తున్న ʹమేజిక్ రియలిజంʹ గా పిలవబడే కథలన్నీ -- ఆయా స్థలకాలాల నేపథ్యంలో అర్థం చేసుకుంటేనే -- అందులోని బీభత్సం, ప్రతిఘటనా అర్థం కావు. యుద్ధ బీభత్సాల నుండి వెలువడే కథలేవీ సాంప్రదాయక, సాధారణ కథాసాహిత్య ప్రమాణాలకు లోబడేవి కావు. ఒక కథకు మరోకథ పోలినది కాదు.

కూర్మనాథ్ కథలు రాయడం మొదలుపెట్టేనాటికే అతని లోలోపల తన జీవితం పొడుగుతా చూసిన అమానవీయమైన బీభత్సకాండ కుదురుకుని వున్నది. అది మన ప్రాంతంలోని యాభై సంవత్సరాల విప్లవోద్యమ కథ, వ్యథ. బహుశా కూర్మనాథ్ వయసంత కథ.
కూర్మనాథ్ శ్రీకాకుళంలోని పొందూరు, హీరమండలం ప్రాంతాలల్లో నడక నేర్చుకునే నాటికే శ్రీకాకుళంలో సుదీర్ఘకాలంగా యుద్ధంలో వున్న ఆదివాసులు (1969-70) మరోమారు సాయుధంగా తిరగబడి ఊచకోతకు గురయ్యారు. ఆ బీభత్సకాండ, ఆ అణచివేత, విప్లవోద్యమ పోరాటం, త్యాగం -- ఎవరి ప్రయోజనాలనుబట్టి, వారివారి చైతన్యాల మేరకు దేశవ్యాపితంగా సుళ్ళు తిరుగుతోంది.

చోడవరంలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివేనాటికి కూర్మనాథ్ కు శ్రీకాకుళం వేసిన ప్రశ్నలు చేరాయి. పక్కనే వున్న విజయనగరం, విశాఖపట్నం లాంటి చోటనే కాదు, మారుమూల తెలంగాణాలాంటి ప్రాంతానికి తెలుపవల్సిన విషయాల గురించి, పోరాట ఎత్తుగడలు వ్యూహంతో పాటు, తగిన నిర్మాణం లేకపోతే జరిగే మారణకాండ గురించి తెలిసిపోయాయి. అమరుడు భూషణం, ఆ తరువాత అప్పలనాయుడులాంటి వాళ్ళు ఎంత రాసినా ఆ హింసాకాండ సంపూర్ణంగా రూపుకట్టేది కాదు -- అక్కడి చెట్టు, పుట్ట, కొండా కోనా యాభై సంవత్సరాలుగా మూడు తరాలు, లోపల శ్రీకాకుళం ఎంత నొప్పితో కదులుతున్నదో? రగులుతున్నదో? ఎవరికి తెలుసు? ఒక హత్యకాదు -- కోరన్న, మంగన్న నుండి మొదలు తామాడ చినబాబు, పాణిగ్రాహి, వెంపటాపు, వందలమంది ఆదివాసుల హత్యాకాండ, మన కాలపు దుర్మార్గపు హత్యాకాండ -- తమకు కాసింత బతుకు కావాలనే మామూలు మనుషుల హత్యాకాండ -- ఎంత మాయోపాయాలు చేసినా తుడిచేస్తే పొయ్యేది కాదు. ఆ హత్యాకాండ జరిగిన కుటుంబాల లోలోపలి దుఃఖాలు, కోపాలు -- బతుకు పొదుగుతా వెంటాడిన, మెదడులో ఇంకిపోయిన ఘట్టాలు ఎవరికైనా రాయడం సాధ్యపడుతుందా?

కూర్మనాథ్ బాల్యం శ్రీకాకుళంలో, యవ్వనం-చదువు విశాఖ ఆంధ్రా యూనివర్సిటిలో జర్నలిజంలో బంగారు పతకం సాధించి 1994లో హైదరాబాదు వచ్చి ʹఉదయంʹ పత్రికలో జర్నలిస్టుగా చేరేదాకా భిన్న వర్గాల, కులాల, చైతన్యంలో భాగమైన శ్రీకాకుళం, యాది, మనాది కూర్మనాథ్ లోలోపల పేరుకపోయింది. కానీ ఈ కథలు రూపుకట్టే దాకా అదేమిటో అతనికి తెలియదు.

కూర్మనాథ్ 1994 ʹఉదయంʹలో జర్నలిస్టుగా చేరేనాటికి తెలంగాణ సమాజం -- గతకాలపు తెలంగాణ సాయుధ పోరాట గాయాన్ని, నక్సల్బరీ కలను, శ్రీకాకుళపు విరిగిన కలను తన అనుభవంలోకి, ఆచరణలోకి తెచ్చుకున్నది. అదేంటో కూర్మనాథ్ లో కదలిక తెస్తోంది.

నక్సల్బరీ, శ్రీకాకుళం తిరుగుబాటు దేశవ్యాపితంగా ఆదివాసీలను, రైతాంగాన్ని, కార్మికులనే కాక విద్యార్థులను, యువకులను తీవ్రంగా ప్రభావితం చేసింది. తెలంగాణాలో, బీహార్, బెంగాల్ లాంటి చోట్ల విద్యార్థి, రైతాంగ, ఆదివాసీ ఉద్యమాలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ప్రజలు దారులు వెతుకుతున్న కాలమది. నెహ్రూ మార్కు సోషలిజం కుప్పకూలి అర్ధవలస, అర్థ భూస్వామ్యం ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. అన్ని వ్యవస్థలూ కుప్పకూలి, నిర్వీర్యమై, దోపిడీ, పీడన మరింత పెరిగి దేశవ్యాపితంగా ప్రజా ఉద్యమాలు చెలరేగాయి. ఈ సంక్షోభాన్ని, ఉద్యమాలను అణచడానికి అత్యయిక పరిస్థితితో పాటు దేశవ్యాపితంగా పదహారువేలమందిని హత్యచేసి ముప్ఫైవేలమందిని జైళ్లలో కుక్కారు.

మార్చి 1977 లో ఎమర్జెన్సీ ఎత్తివేయగానే తిరుగుబాటుకు దారులు వెదుకుతున్న ప్రజలు అన్నిచోట్ల అనుభవాలు బేరీజు వేసుకుని క్రియాశీల ఉద్యమాలు చేపట్టారు. ఆదిలాబాదు, కరీంనగర్ జిల్లాల్లో రాడికల్ విద్యార్థులు గ్రామాలకు తరలారు. జగిత్యాల జైత్రయాత్ర (8-9-1978) గా ప్రసిద్ధి చెందిన రైతాంగపోరాటం; అనతి కాలంలోనే తెలంగాణలోని ఆదివాసీప్రాంతాలకు, సింగరేణి కార్మిక ప్రాంతాలకు, విశాఖ, శ్రీకాకుళంలోని ఆదివాసీ ప్రాంతాలకు విస్తరించింది.

దున్నేవాడికి భూమి నినాదంతో, శిఖం, దేవాలయ, అటవీ, బంజరు, దొరలు అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూములు వేలాది ఎకరాలు రైతుకూలీ సంఘాల నాయకత్వంలో రైతులు దున్నుకున్నారు. రైతుకూలీ సంఘాలు కూలిరేట్ల పెంపు, వెట్టి లాంటి వాటికి వ్యతిరేకంగా పోరాడాయి. ప్రజా పంచాయితీలు, ధర్నాలు, ఊరేగింపులు, చివరకు దొరల సాంఘీక బహిష్కారం దాకా సాగాయి. మధ్యయుగాలనాటి అకృత్యాలు చేసే క్రూరమైన దొరలను, రైతాంగ గెరిల్లాలు మట్టుబెట్టారు. వేల ఏండ్లుగా గ్రామాలనాక్రమించి -- అన్ని రకాల దోపిడీ దౌర్జన్యాలు -- అడవిసంపదలు దోచుకోవడం లాంటి, దొరల అనేక దోపిడీ రూపాలకు గండిపడింది. దొరల ఆర్థికమూలల మీద దెబ్బకొట్టి భూస్వామిక అధికారాన్ని గ్రామాల్లో కూల్చివేశారు.

మొదటి దశలో దొరలు ప్రతిదాడులకు దిగారు. గుండాలతో దాడులు, అరెస్టులు, కార్యకర్తల హత్యలు, కల్లోలిత ప్రాంతాల చట్టాలు -- మొత్తంగా తెలంగాణ ఒక అగ్నిగుండమయ్యింది. సాంఘీక బష్కరణతో దొరలు పట్నం బాట పట్టారు. జమీందార్లు, బాగా డబ్బున్న దొరలు వాళ్ళవాళ్ళ సంపదననుబట్టి హైదరాబాదు నుండి మొదలుకొని చిన్నపట్టణాలదాకా విస్తరించారు. పల్లెల్లో దొరతనం కూలిపోయి, పోలీసు రాజ్యం వెలిసింది. యుద్ధరంగం ప్రజలకు ప్రభుత్వంకు మధ్యకు మారింది. కేసులు, అరెస్టులు, ఎన్కౌంటర్లు ముమ్మరమయ్యాయి.

తెలంగాణ నక్సల్బరీ, శ్రీకాకుళం పోరాటాల గుణపాఠాలు నేర్చుకుంది. సాయుధపోరాటం ద్వారా రాజ్యాధికారం సాధించాలనే లక్ష్యంతో ప్రజల పార్టీ, సైన్యం, ఐక్య సంఘటన, ఆయుధాలతో దేశవ్యాపిత ప్రజాపోరాటాలను సమన్వయపరిచి, అర్ధవలస అర్థ భూస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి ʹనూతన ప్రజాస్వామిక విప్లవంʹ విజయవంతం చేసే వ్యూహంలో భాగంగా 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడింది. దీర్ఘకాలిక గెరిల్లా ప్రజా యుద్ధంలో భాగంగా రైతాంగ, కార్మికపోరాట యోధులతో క్రమంగా అడవిలోకి విస్తరించి -- తరతరాలుగా యుద్ధాలు చేస్తున్న కొమురం భీం లాంటి ఆదివాసీ యోధుల పోరాట మార్గాలను అనుసరించి -- దండకారణ్యంలోకి విస్తరించింది. భారతదేశ విప్లవోద్యమంలో ఒక కీలకఘట్టంగా నిలదొక్కుకున్నది.
పోలీసు నిర్బంధంలో పల్లెలు విలవిలలాడాయి. పట్నాలు చేరిన దొరలు మొదట సారా, బ్రాందీ వ్యాపారాలల్లోకి, ఆ తరువాత తాము వెంట తెచ్చుకున్న డబ్బులో పట్నాల శివారులల్లో చౌకగా భూములు కొని రియల్ ఎస్టేట్, ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు స్థాపించి వ్యాపారస్తులుగా, క్రమంగా బిల్డర్లుగా ఎదిగారు.

పల్లెల్లో నిర్బంధం మూలకంగా యువకులు పట్నాల బాట పట్టారు. చిన్న, పెద్ద పట్నాల మీద ఎప్పుడూ లేనంత ఒత్తిడి పెరిగింది. రాజకీయరంగంలో తీవ్రమైన మార్పులు జరిగి -- గ్రామీణ ప్రాంతాలల్లో బహుజనుల నుండి నాయకత్వం ఎదిగింది. పట్టణ ప్రాంతాలల్లో సాంప్రదాయిక కాంగ్రెస్ పార్టీలలాంటివి నిలబడలేని పరిస్థితిలో -- ʹనక్సలైట్లే దేశభక్తులుʹ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. నటులు, సినిమా పెట్టుబడి రాజకీయరంగంలో ప్రవేశించి -- ఉద్యమాల నేపథ్యంలో తయారయిన కొందరిని కలుపుకుని కొత్త తరపు నాయకత్వాన్ని తయారుచేసుకున్నారు. రాజకీయాలల్లో నటన మాటల గారడీ, అనుత్పాదక పెట్టుబడి పెరిగింది. పాతతరం దొరలు ఖాళీ చేసిన జాగాలన్నీ నక్సలైట్లే దేశభక్తులు లాంటి నినాదాలతో -- తెలుగుదేశం పార్టీ ఆక్రమించింది. హైదరాబాదు చుట్టుపక్కల భూములన్నీ, ఆక్రమించి -- సినిమా పరిశ్రమ హైదరాబాదు తరలివచ్చింది. చాపకింద నీరులాగా తెలంగాణ నటుల వశమయ్యింది. పెద్ద ఎత్తున వనరులు, సమకూర్చుకుని తెలుగుదేశం, బలమైన రాజకీయ పార్టీగా ఎదిగింది.

బూర్జువా రాజకీయ సంకుల సమరంలో పాత దొరల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి, వారి ఆర్ధిక రాజకీయ మూలాలమీద తెలుగుదేశంపార్టీ దెబ్బతీసింది. సారా నిషేధించింది. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుపరిచి మండల వ్యవస్థను తెచ్చి, కొత్త నాయకత్వాన్ని నెలకొల్పింది.

అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీ బలపడి ఆట, మాట, పాట బందు చేసి తెలంగాణాలో ఫాష్టిస్తు నిర్బంధకాండకు పూనుకున్నది. ప్రజల ఆస్తులు ధ్వంసం, కార్యకర్తల మాయం, ప్రజల ఆస్తుల లూటీలు, గృహదహనాలు, ప్రయివేటు గ్యాంగులు తయారుచేసి తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలల్లో విప్లవకారుల విచ్చలవిడి హత్యలకు పూనుకున్నది. ఈ నిర్బంధ వాతావణంలో అన్ని ప్రాంతాల నుండి ఉద్యమకారులు నల్లమల, దండకారణ్యంలోకి విస్తరించారు. దాదాపు అన్ని ప్రజా సంఘాలమీద నిషేధం , విద్యార్థి సంఘాల నిషేధంతో పాటు కాలేజీలు, యూనివర్సిటీలు తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొన్నాయి. ఇదే కాలంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ కాలేజీలు రాష్ట్ర వ్యాపితంగా విస్తరించి -- అప్పటిదాకా సామాజిక ఉద్యమాలలో ఆరితేరిన విద్యార్థులకు -- పోటీ అనే తత్వాన్ని తీసుకువచ్చి వ్యక్తికేంద్రంగా సాగే, సామాజిక అంశాలు లేని విద్యను ప్రవేశపెట్టారు. యువకుల అద్భుతమైన సృజనాత్మక శక్తుల వికాసపు హత్యాకాండ -- అక్కడితో ఆరంభమయ్యింది. కాలేజీలు కాన్సంట్రేషన్ క్యాంపులయ్యాయి. క్రమంగా వొత్తిడి భరించలేక విద్యార్థుల ఆత్మహత్యల నిలయాలయ్యాయి.

పోరాట ప్రాంతాలల్లో వీటన్నింటినీ తట్టుకుని నిలబడడానికి పెనుగులాట ప్రారంభమయ్యింది. ఒక పక్క ప్రజారాజ్య కమిటీల లాంటి రహస్యపార్టీ నిర్మాణాలు, మరోపక్క రాజకీయ నాయకుల కిడ్నాపులు, పోలీస్ స్టేషన్ల, మండలాఫీసుల దగ్ధం ప్రారంభమయ్యాయి. గ్రామాలు, పట్టణాలు లాటిన్ అమెరికన్ దేశాలల్లాగా యుద్ధకేంద్రాలయ్యాయి. రాజకీయనాయకులు, పోలీసు, రెవెన్యూ అధికారులు సాయుధ పోలీసు రక్షణలో తప్ప తిరగజాలని పరిస్థితి వచ్చింది. తెలంగాణ నిండా రిజర్వు పోలీసు బలగాలు, సరిహద్దు భద్రతా దళాలు మోహరించి పల్లెలు, అడవులు గాలించడం ఆరంభమయ్యింది.

అంతర్జాతీయంగా సోవియెట్ కుప్పకూలడం లేదా అమెరికన్ సామ్రాజ్యవాదం కూల్చడం అయిపోయిన తర్వాత చైనా రాజకీయాలకన్నా తన ఉత్పత్తి తాను చూసుకునే దశకు కుదించబడింది. ప్రపంచం యావత్తూ ఇబ్బడి ముబ్బడి సరుకులతో, కొనుగోలు శక్తిలేని ప్రజలతో, కుప్పకూలిన ఆర్ధిక వ్యవస్థలతో రాజకీయ అస్థిరతతో అనేక దేశాలు తల్లడిల్లాయి. అమెరికన్ సామ్రాజ్యవాదం ఎదురులేని శక్తిగా ఎదిగింది. ప్రపంచీకరణ దేశాలను కబళించే మార్కెట్ వ్యూహంతో తన సంక్షోభాన్ని దాటవేయడానికి, ప్రపంచవ్యాపితం చెయ్యడానికి ప్రణాళికలు రచించింది. లొంగిన వారిని పీల్చిపిప్పి చేస్తూ, లొంగని దేశాలను కడదేరుస్తూ -- అన్ని దేశాల ఆర్ధిక, రాజకీయ, సాంఘిక జీవితంలోకి చొచ్చుకుని వఛ్చి ప్రపంచ వనరులను, ప్రజల శ్రమను కొల్లగొట్టే ఏకైక గజదొంగగా మారింది.

అప్పటికే సంకర రాజకీయాలతో, కూలిన ఆర్ధిక వ్యవస్థతో -- భూస్వామ్య, పెట్టుబడిదారీ కీచులాటల్లో నుండి -- పూర్తిగా ప్రపంచమార్ట్ కు, దోపిడీకి పి వి నరసింహారావు గ్లోబలైజేషన్ పేరుమీద తలుపులు, కిటికీలు ఊడబెరికి స్వాగతం పలికారు.
గుత్త పెట్టుబడిదారులు తమ చెత్త సరుకులతో భారతదేశంలో దిగిపోయారు. విలువైన ఖనిజాల తరలింపునకు దళారీ ప్రభుత్వాలు తమ వాటా తాము తీసుకున్నాక అభివృద్ధి పేర విధ్వంసానికి పెద్ద ఎత్తున ఆహ్వానం పలికారు. బహుళజాతి సంస్థలు స్థానిక పెట్టుబడిదారులతో కలిసి కోట్లకు పడగలెత్తాయి.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం సాగించిన నిర్బంధకాండ, దోపిడీ అనుభవించిన ప్రజలు ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తిరస్కరించారు. మళ్ళీ ప్రజలను, నక్సలైట్లను అడ్డం పెట్టుకుని మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయి కొద్దికాలం నిర్బంధం సడలించారు. అన్ని ప్రజాసంఘాల మీదా, విప్లవపార్టీల మీదా నిషేధం ఎత్తివేసారు. భూస్వామ్య శక్తులు చెన్నారెడ్డి నాయకత్వంలో తిరిగి పుంజుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టారు. విప్లవ ప్రజానీకం లక్షలాదిగా కదిలి, తిరిగి దున్నేవారికి భూమి ప్రాతిపదికగా కొద్దికాలంలోనే ప్రజాపోరాటాలు ఉవ్వెత్తున లేచాయి. అతి కొద్దికాలంలోనే చెన్నారెడ్డిని గవర్నరుగా పంపి కోట్ల విజయభాస్కరరెడ్డిని ముఖ్యమంత్రిని చేసి జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాలు కలిసి ఎప్పటి నిర్బంధాన్నేఅమలు చేశారు. అన్ని విప్లవపార్టీలను, ప్రజాసంఘాలను తిరిగి నిషేధించారు.

మర్రి చెన్నారెడ్డి కాలంలోనే కూర్మనాథ్ జర్నలిజం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ʹఉదయంʹ పత్రికలో మరుగుతున్న హైదరాబాద్ లో అడుగుపెట్టారు.

అప్పటికే ఇలాంటి నేపథ్యంలో తయారయిన యువ జర్నలిస్టుల గుంపు హైదరాబాదులో వివిధ పత్రికల్లో పనిచేస్తున్నారు. పతంజలి, నామిని, త్రిపురనేని శ్రీనివాస్, అల్లంనారాయణ, కె శ్రీనివాస్, సతీశ్ చందర్, వేణు, చారి, అమర్, అఫ్సర్, వసంత లక్ష్మి, రత్నమాల, ఉమామేశ్వర రావు, ఖదీర్, జగన్ ఇంకా చాలామంది ఇలాంటి ఉద్విగ్న స్థితులను కవిత్వం, కథలు, కాలమ్ లు, వార్తా కథనాలు రాస్తున్న కాలం.

ఒకపక్క కొత్త హంగులతో, వ్యవసాయరంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని మింగేస్తూ ప్రపంచీకరణ హైదరాబాదును ఆక్రమిస్తున్న కాలం. కార్పొరేట్ ఆసుపత్రులు, పత్రికలు, మీడియా చానళ్లు, ఐటి లాంటి సర్వీసు రంగం -- వ్యక్తిని, వ్యక్తిగత ప్రతిభను మాయోపాయాలతో పెంచే వ్యక్తిత్వ వికాసాలు, బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీలు, వీటి నిర్వహణలో గుట్టుచప్పుడు కాకుండా గొంతు నులిపే కేంద్రాలైన స్టార్ హోటళ్లు........ సమష్టి పోరాటాలతో, త్యాగాలతో శాస్త్రీయ ఆలోచనలతో ఎదిగివచ్చిన ఇలాంటి జర్నలిస్టులు-- అనివార్యంగా ప్రపంచీకరణ పెట్టుబడి విషపు పుత్రికల పత్రికలల్లో మోసకారులైన దోపిడీదారులైన రాజకీయ నాయకులతో పనిచేయాల్సి వచ్చింది. వారి యంత్రాంగంతో-- మార్కెట్ మాయల మాంత్రికులతో, వినిమయ పరికరాల ప్రోమోటర్లతో, ఉత్పత్తిదారులతో, ఏంకర్లతో, నటులతో ఫైవ్ స్టార్ హోటళ్లలో రిపోర్టింగ్-- మరోపక్క గ్రామాలలో అక్రమ అరెస్టులు, యువకుల కాల్చివేతలు-- అలాంటి ఈ రెండు విభిన్న ప్రపంచాల మధ్య ఇంకా అలవాటు కాని, సర్దుకుపోని బీరకాయ పీచుసంబంధాలు విరసం, ప్రజాసంఘాలతో మమేకమై తిరిగే ఈ యువ జర్నలిస్టులు తీవ్రమైన అ శాంతితో బతికారు.అలాంటి కవిత్వం, కథనాలు రాశారు.

ఆ కాలంలో దాదాపుగా కలం పట్టిన ప్రతి రచయిత ఈ దమనకాండను రాయకుండా వుండలేదు.దాదాపుగా రచయితలు, మేథావులందరు ప్రజా ఉద్యమాలతో వున్నారు. నడిచారు. అవి ఉద్విగ్న ఉద్యమ రోజులు.

వ్యాపార విస్తరణలో భాగంగా, ప్రజా పోరాటాలను అణచడం అత్యవసర ఎజెండాగా మారింది. నిర్బంధం కొత్త రూపాలు సంతరించుకుంది. తెరవెనుక అమెరికన్ సామ్రాజ్యవాదంతో పాటు జాతీయ దళారీ ప్రభుత్వం ప్రజాపోరాటాలు జరుగుతున్న అన్ని రాష్ట్రాలల్లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో పరోక్షంగా ఎన్నికల్లో డబ్బు, కుల సమీకరణాలు ఆరంభమయ్యాయి. విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ తెలుగుదేశం, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వచ్చారు.

ఈయనకు అంతర్జాతీయ రాజకీయాలు, పట్టువిడుపులు, దళారీ వ్యూహాలు అమలు చెయ్యగల నైపుణ్యం, చొరవ లేనందున మామను వెన్నుపోటు పొడిచి, అందుకు తగిన నాయకుడైన చంద్రబాబు జాతీయ, అంతర్జాతీయ శక్తుల మద్దతుతో నాటకీయంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికలు, ప్రజాస్వామ్యం ఒక బూటకపు క్షుద్రక్రీడగా తేలాయి.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి కూడా నేరుగా అమెరికాతో సంబంధాలు నెరిపారు. హైదరాబాదు అంతర్జాతీయ మార్కెట్ శక్తుల దోపిడీ అడ్డాగా ఫ్లై ఓవర్లు, హైటెక్ సిటీలు, ఐటీ కారిడార్లు ప్రజల సొమ్ముతో నిర్మించారు. మీడియా, పత్రికలు చెలరేగిపోయి కూర్మనాథ్ మాటల్లో చెప్పాలంటే అభూతకల్పనల దళారుల భజన బృందాలుగా మారిపోయాయి. హైదరాబాద్ నగరంలోని విలువైన లక్షలాది ఎకరాల భూమిని వలసవచ్చిన అగ్రకులాలవాళ్ళు, దళారీ బహుళజాతి కంపెనీలు చౌకగా కొల్లగొట్టాయి. మిలియనీర్ల దళారుల మంద తయారయ్యింది. అందినకాడికి దోచుకునే ఈ దళారుల గుంపునకు రాజకీయం అన్ని హంగులు సమకూర్చింది. తెలంగాణ పల్లెలు తరిమేసిన దొరు కొద్దిపాటి డబ్బుతో తమ పట్నాలల్లోనే ʹకోన్ కిస్కేʹ గాళ్ళ కింద తయారయ్యారు. రాజకీయం - దళారీ దందా అన్ని రకాల సంపాదనలకన్నా అనతికాలంలోనే మించిపోయి ఉత్పత్తి రంగాలను తొక్కేసి, కకావికలు చేసి, విధ్వంసం చేసి మాయా సర్వీసు రంగం ఒక మహమ్మారిలా విస్తరించింది. ఇన్ని రకాల జిత్తులమారిని ఎత్తుగడను ఎదిరిస్తూ గ్రామాలలో ఉద్యమాలు కొనసాగుతూనే వున్నాయి.

అంతర్జాతీయ పెట్టుబడి, సామ్రాజ్యవాద యుద్ధ తంత్రం, మంద్రస్థాయి యుద్ధం ఆంధ్రప్రదేశ్ గ్రామసీమలదాకా విస్తరించింది. వ్యక్తికేంద్రంగా, పోటీ కేంద్రంగా ఎదిగిన తరం దేశవ్యాపితంగా ముప్పై కోట్లమంది సర్వీసు రంగంలో -- జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ మాయోపాయ దోపిడీ సజావుగా సాగడానికి సుశిక్షుతులైన యంత్రాగమయ్యారు.

అది అన్ని రంగాలకు పాకింది. సోకింది. మేధావుల్లో భిన్న స్వరాలు, కోట్లాది రూపాయల సామ్రాజ్యవాద నిధులతో అనేక ఎన్జీవో, కుల, సాహిత్య సంఘాలు పుట్టుకొచ్చాయి. సామాజిక స్థితిగతులను తమతమ జీవన నేపథ్యంలో వ్యక్తీకరించే అనేక ʹఅస్తిత్వʹ సంస్థలు వచ్చాయి. పాతతరం జర్నలిస్టులు, రచయితలూ, మేథావులు ప్రమాదరహితమైన ఈ సంస్థలన్నింటిలోకి సర్దుకున్నారు.

మరోపక్క లొంగని వారికోసం, ఆంధ్రప్రదేశ్ వ్యాపితంగా అనేక చట్ట విరుద్ధ హంతకముఠాలు చిలి, కెన్యా లాంటి దేశాలల్లో లాగా రాజ్యం పెంచి పోషించింది. గ్రేహౌండ్స్, గ్రీన్ టైగెర్స్, పేరులేని హతక ముఠాలు, ఇన్ఫార్మర్ వ్యవస్థ -- ప్రజావ్యతిరేక భారతి నాటక సమాజాలు, ప్రజాసంఘాల నాయకులు, జర్నలిస్టుల హత్యలు, హత్యాకాండతో గ్రామాలు వనికిపోయాయి. ప్రజారాజ్య కమిటీలు అగ్రకుల, బహుజన నాయకత్వంలోకి వచ్చి యాభై శాతంగా వున్నా భూమిలేని దళితులు కమిటీల కావలే ఉండిపోయారు. దొరతనం ఖాళీచేసిన గ్రామాలలో ఎక్కువ భాగం బహుజనులో లేదా అగ్రకులం వాళ్ళ చేతుల్లోకి పోయాయి. క్రమంగా ప్రభుత్వపథకాలకు లోబడి నిర్వీర్యమయ్యాయి. సాయుధ దళాలు తిరుగులేని పరిస్థితుల్లో గ్రామాలు ఖాళీ చేసి అడవుల్లోకి ముడుచుక పోయాయి.

ప్రజలకు రాజ్యాధికారం అనే వ్యూహాన్ని ఎన్నికలకు కుదించో, లేదా వ్యూహం మాటేలేని ఎన్జీవో అస్తిత్వ సంఘాలు ముందుకు పోలేక అక్కడికక్కడే కదంతొక్కాయి. కాలానుగుణంగా పోరాటంలో ఎత్తుగడలు మార్చుకుని ప్రజాసంఘాలు కేవలం ʹవ్యూహంʹ గురించే మాట్లాడే అతివాదానికి లోనయ్యాయి. అందరూ అతి, మిత అవకాశవాదంతో నిర్బంధాన్ని సాకుగా చెప్పారు.

గ్రామాలలోకి విధ్వంసకర నమూనా పంటలు, పురుగుమందులు, మార్కెట్టు, ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ దవాఖానాలు చొచ్చుకువచ్చి గ్రామాలు వల్లకాడులయ్యాయి. ఉత్పత్తి సంబంధాలల్లోని అభివృద్ధి నిరోధకపు భూస్వామ్యం కుప్పకూల్చి ఉత్పత్తి శక్తులను, ఉత్పత్తి వనరులను, ఉత్పత్తి సంబంధాలను నూతన ప్రజాస్వామిక సంబంధాలల్లోకి విప్లవోద్యమం మార్చే క్రమంలో ప్రతిష్టంభనకు లోనయ్యాయి. దాదాపుగా జిల్లాల నాయకత్వాలు ఎంతోమంది విప్లవకారులను, చురుకైన గొప్ప నాయకులను వందలాదిమందిని ఒంటరిచేసి హత్య చేశారు.

ఒకపక్క విధ్వంసకర ఆర్ధిక నమూనా -- తీవ్రమైన అణచివేత మంద్రస్థాయి యుద్ధ లక్షణాలు. రోగాన్ని గుర్తించినా సవరించుకునే సమయం, నాయకత్వం లేక (డిసెంబర్ 2, 1999 న నల్లా ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి, శీలం నరేశ్ హత్యలు) విప్లవోద్యమం తెలంగాణలో సెట్ బ్యాక్ కు గురైంది.

ఇదిగో ఇలాంటి పెను ఉప్పెన కాలంలో కూర్మనాథ్ విరసంలో చేరారు. అప్పటికే పైన పేర్కొన్న అన్ని సందర్భాలు నేను రాసిన దానికన్నా వెయ్యిరెట్లు కూర్మనాథ్ తరం జర్నలిస్టులకు తెలుసు. లోలోపల రక్తప్రవాహాల హంతక రాజకీయ చరిత్ర. దాన్ని నిలువరించే ప్రజాపోరాటాలు, వాటిని నిలబెట్టడానికి ప్రజలు పడే తాపత్రయం, దాని బీభత్స స్వరూపం జర్నలిస్టులకు తప్ప మరెవరికి తెలుసు? కానీ అప్పటికే అన్ని ఇండ్లలోకి గుడిసెల్లోకి అందరి సుఖదుఃఖాల వ్యక్తీకరణలోకి మందులేని రోగంగా వ్యాపించి -- శరీరాలను, మెదళ్లను పూర్తిగా తినేసిన మీడియా, పత్రికల ఇరవైనాలుగు గంటల ఆకలికి చెత్తా చెదారం వండి అందించింది కూడా ఈ జర్నలిస్టు సమూహాల్లోని వారే.

ఇది కూర్మనాథ్ లోలోపల పేరుకుపోయిన వమనం. అయిదు సంవత్సరాలుగా నిలువనీయకుండా చేస్తున్నది.ఇది బయటపడకుండా బతుకలేం. అంతకన్నాతను మనిషిగానిలబడాలి.ఈ ద్వంద్వంలోంచి నిలబడాలి. ʹఎర్రగౌనుʹ పిల్ల పక్కన నిలబడాలి. ఎర్రగౌను పిల్ల కథలో ఈ స్థితి కనిపిస్తుంది.

అప్పటికి ఈ స్థితులు భరించలేక కవిత్వం రాసిన వాళ్ళున్నారు. అది తనకు సరిపోదు. రాత్రులకురాత్రుల్లు పిచ్చివాడిగా అరిచినా కూడా వొడువుదు. దిగులుదిగులుగా-- తనకే స్పష్టంగానిదేదో పూనినవానిలాగా విరసంలోతిరుగుతూ...... తిరుగుతూ.... అప్పటికే విరసంలో బయటా ఈ స్థితిలో కథలు రాసిన వాళ్లున్నారు. తన లోపల బయట పూర్తిగా చెడగొట్టుకుని--తనే బాగుచేసుకోవాలని వైద్యంలో- వ్యంగ్యంతో పోరాడుతున్న ʹపతంజలిʹ కూడా పాత భూస్వామిక డొక్కు సమాజాన్నితోలుతీసాడేగాని.......కాని......తన లోపలిది అదికాదు.ఆ వ్యక్తీకరణాలేవీ తనకు సరిపోవు. ఫైవ్ స్టార్ హోటళ్లల్లో హంతకులతో విధినిర్వహణలోభాగంగాభేటీ -- కుళ్లిపోయిన, అవసరంలేని -- ఉత్పత్తులప్రదర్శనలో తానుతచ్చాడుతూ....మరోపక్క గ్రే హౌండ్స్ గ్రీన్ టైగర్స్ పేరులేని హంతక ముఠాలు విచ్చలవిడి హత్యాకాండ , ఈ దుర్మార్గాన్ని, విధ్వంసాన్ని ఆపడానికి నిర్మాణాలున్న వాళ్ళు, వాళ్ళ తడి ఆరని నెత్తురు …. తను ఈ మీడియాల కన్నా -- అతి తీవ్రంగా ప్రపంచం బద్దలయ్యేదాకా మొత్తుకుంటే తప్ప - - ఈ భిన్న దృశ్యాలు, అనుభవాలు కలిగించిన వొత్తిడి తగ్గదు…. తనేమిటి? కూర్మనాథ్ ఎక్కడ? బహుశా ఇలాంటి స్థితిలోనే శ్రీశ్రీ పిచ్చి వాడయ్యారు.

ఇలాంటిస్థితి - ప్రజలు తిరుగుబాట్లు చేస్తున్న దగ్గరల్లా ఉంది. దానిదో భాష, వ్యక్తీకరణ. రెండువేలమంది బనానాతోటల కార్మికుల ఊచకోతను ప్రత్యక్షంగా చూసిన కొలంబియా ప్రజలు మౌనంలోకి వెళ్లిపోయారు. వాళ్ల జ్ఞాపకం, నోరు చచ్చుబడిపోయాయి. మాజిక్‌ రియలిజం (మార్మిక వాస్తవికత) గాబ్రియల్‌ గార్షియా మార్కెవెజ్‌ లాంటి రచయితలు - లాటిన్‌ అమెరికన్‌ సాహిత్యం ʹవనెహండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌ ʹ నలలు చదివాడు.

కూర్మనాథ్‌కు దారిదొరికింది.... లోపల గడ్డకట్టిన వాక్యాలు - పదాలు - బహుశా కన్నీళ్లు, మారణాయుధాలకన్నా పదునైన పదాలు విస్ఫోటనంగా బయటపడ్డాయి. అప్పుడు అతనికి లోపలి అలజడి రాస్తున్నాకొద్ది అర్థమైంది. అర్థమౌతున్నకొద్దీ- రాస్తూపోయాడు. ఫైవ్‌స్టార్‌ హోటళ్లు - జంతువులు - అడవులు - పశువులు, పక్షులు - మనుషులు - నదిని నిర్మించేవాళ్లు - గాలిని ఊదేవాళ్లు - పక్షులరెక్కల చప్పుళ్లల్ల గానం, పాడేవాళ్లు..... తనకే తెలియని పాత్రలు - జంతువులుగా, మనుషులుగా, పక్షులుగా, అడవిలా.... ప్రవహిస్తున్నాయి. ప్రవహించాయి...... ఇలాంటి లోపల యుద్ధవాతావారణంలో తనెక్కడ మొదలవ్వాలో తెలిసింది. నడక ఆరంభమయ్యింది... ఆత్మీయుల, సహచరుల చావులు లోలోపల గడ్డకడుతూ సరైన భాష, వ్యక్తీకరణ - మరేదో లేక దాదాపు పదిహేను సంవత్సరాలు కూర్మనాథ్‌ స్థితిలో ఉండి (2000-2015) దాదాపుగా కథలు, నవలలు రాయలేదు.

4

బహుళజాతి కంపెనీలకు హైదరాబాదు కేంద్రమయ్యింది. జార్జిబుష్‌ నేరుగా హైదరాబాదు వచ్చిపోయాడు. బడ్జెట్‌ మొత్తం బహుళజాతి కంపెనీలకు మౌలిక వసతులకు - ఆ పేరున రాజకీయ దళారులకే సరిపోలేదు. హైదరాబాదు అనేక ఐటి కంపెనీలతో, అపార్టుమెంటులతో ఫ్లై ఓవర్లతో మట్టికాళ్ల మహారాక్షసి స్వరూపం సంతరించుకున్నది. ఆంధ్రప్రాంతం లోని మధ్యతరగతి, రైతులు తమ ఆస్తులమ్ముకొని వేలంవెర్రిగా ఫ్లాట్లు కొనుక్కున్నారు. వేలాదిమంది యువకులు వ-కుక్కలయ్యారు. కుక్కల నాయకుడు తను నిద్రపోకుండా ఆంధ్రప్రదేశ్‌నంతా నిద్రకు దూరం చేశాడు. పిచ్చి ఉన్మాదస్థాయికి చేరింది. ఏదడిగినా తుపాకిమోతలే.... అమెరికాకు దారులు పడ్డాయి.

ఈ మొత్తం ప్రక్రియలో రాజకీయ ఆధిపత్యం లేక - అటు వ్యాపారంలోను - ఆస్తిపాస్తుల్లోను వాటా దక్కక - గ్రామాలు తరిమేసిన తెలంగాణ దొరలు, ఉద్యమాల ద్వారా కొత్తగా ఎదిగివచ్చిన నాయకత్వం ... విప్లవోద్యమం ఖాళీచేసిన వేదికమీద ʹప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధనʹ ప్రదర్శన ఆరంభించారు ..... ఉద్యమంలోని అవకాశవాదశక్తులు నటగాయకులయ్యారు. బద్‌నాం అయిన దొరలు గులాబికండువాలు ధరించి - తమ పెదవులకు చెలిమెలకు అంటిన రక్తం గులాబిరంగుది అని నమ్మబలికారు.

వర్గపోరాటం పాడిన కవిగాయక కంఠాలు - రగల్‌ఝండా బ్యాలేలు - బతుకమ్మపాటలుగా కొత్త ఫ్యూడల్‌ ఎత్తుగడలతో ముందుకువచ్చాయి.

ఏదో ఒకటి ఈ నిర్బంధం పోతే చాలు అని ప్రజలు - అతివాద అవకాశవాద ఎత్తుగడలు, ఉద్యమాలతో సుదీర్ఘకాలం పోరాడిన ప్రజలను- ʹవంటవార్పుʹ లాంటి మెత్తటి అవకాశవాద ఉద్యమాలల్లోకి దించారు. ఉద్యమాల వెనుక చేరిన దొరల నక్కజిత్తుల ఎత్తుగడలు - మొత్తంగా పుంజుకున్నాయి. నాయకత్వం లేమితో - ఇలాటి ఉద్యమాలతో కలువజాలని ఉద్యమనేపథ్యం - ఆచరణలో పుట్టిపెరిగిన యువకులు ఇలాంటి ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించలేక, ఉద్యమాల్లో ముందువరుసలో ఉంటూనే రగిలిపోయారు. క్రమంగా ఉద్యమం మరోరూపం తీసుకునే దశలో - తెలివైన రాజకీయనాయకులు - పెట్రోలు పోసుకున్నట్టు నటించారు. ఆ విధంగా ఆత్మహత్యల పరంపరకు తెరతీశారు... వ్యక్తం కాని కోపోద్రిక్తతలో పన్నెండువందల మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఎవరికి చిక్కని విధ్వంసం- నిర్మాణం అక్టోబర్‌ 1, 2003 నాడు అలిపిరిలో విస్ఫోటనం చెందింది.... దేశ, విదేశ వ- కుక్కల నషా దిగిపోయి పిరికి జొచ్చింది.

అవకాశం కోసం పొంచి ఉన్న మరో మాయల గుంటనక్క మారువేషంలో పాదయాత్ర మొదలుపెట్టి - ఇదంతా తను సరిచేయగల ʹఅన్నʹనని నమ్మబలికాడు...

ఎన్నికలతో కొత్త ఫ్యాక్షనిస్టు అన్న అధికారంలోకి వచ్చి - అన్నవిధంగానే పాత వ -కుక్క భరతం పట్టి - ఉద్యమకారులతో చర్చలు జరిపి - అనతికాలంలోనే అన్నీ ఆకళింపు చేసుకొని - ఉన్నకాడికి అడుగుబొడుగు ఉద్యమకారులను ఏరివేసి, నల్లమలను మాడ్చేసి - బహుళజాతి కంపెనీలకు స్థానిక రాజకీయాలకు మధ్య ఒక సుస్థిరమార్గం వేశాడు. అప్పుడు మార్కెట్టు, పెట్టుబడి ప్రాజెక్టుల పేర గ్రామాలకు, ప్రైవేటు ఆసుపత్రులు, కాలేజీలు - ప్రభుత్వ డబ్బు మదుపుతో - రాజకీయనాయకుల వాటాతో సుస్థిర వ్యాపారవిధ్వంసం మొదలయ్యింది.

అయితే ఇలాంటి మేళా జరుగుతుండగానే సెప్టెంబర్‌ 21, 2004లో మావోయిస్టుపార్టీ ఏర్పడడం కొసమెరుపు.

ఈ నేపథ్యంలో - ప్రతి కదలికను ఆద్భుతమైన వ్యంగ్యంతో, కడుపుదేవే విశాదంతో, క్షద్రక్రీడ, ఒక జననం గురించి, ఈరిగాడు ఇకలేరు, ఎర్రగౌనుపిల్ల, న్యాయం, సంత్రాలి, బకాసురవథ, కొరియర్‌, బందెలదొడ్డి, వ-కుక్క, కుక్కబతుకు, చివరి అధ్యాయం - పన్నెండు కథలు కలిపి ʹ వ -కుక్కʹ పేర 2005 లో పుస్తకం వేసారు...

(కూర్మనాథ్ రాసిన ʹవెన్నెలపడవ - మరికొన్ని కథలుʹ కథాసంకలనానికి రాసిన ముందుమాట)


No. of visitors : 583
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెలుతురు న‌ది

అల్లం రాజ‌య్య‌ | 03.07.2016 02:04:45am

ʹʹదళితులు, బహుజనుల స్థితిగతులు, చరిత్ర గురించి పూలే, అంబేద్కర్‌ ఎంతో కొంత చెప్పిండ్లు. కాని మహిళల చరిత్ర ఉందా? లేదా? ఉందేమో తనకు తెలియదేమోʹʹ రాజు లోలోప......
...ఇంకా చదవండి

విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు

అల్లం రాజయ్య | 05.03.2020 12:30:34pm

ఇందులో భిన్నమైన కథా నిర్మాణం ఉంది. ఉద్యమ విస్తృతిలో విప్లవకారుల, ప్రజల వ్యక్తిగత అనుభవం, గతితార్కిక మానవ సంబంధాల అధ్యయనం, ఆచరణ ద్వారా దశలు దశలుగా ఎదగడం కనిప...
...ఇంకా చదవండి

మూడో తరానికి...

అల్లం రాజయ్య | 19.02.2020 03:00:32pm

ఐక్యంగా పురోగమనించడానికి దారులు వెతకడానికి విప్లవ కథ ప్రయత్నించడం కన్పిస్తుంది. ఇందులో కొత్త వస్తువులు, కాలానికి తగిన శిల్ప రీతులు కూడా కనిపిస్తాయి....
...ఇంకా చదవండి

తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం

అల్లం రాజయ్య | 17.12.2019 10:09:31pm

ప్రజాపోరాటాలను, ప్రజా జీవితం లోలోతులు చిత్రించడానికి ఇంత పెద్దఎత్తున రచయితలు, కళాకారులు పూనుకోవడం గతంలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడడం, క్రమంగా తగ్గడం, ఇప్టా.....
...ఇంకా చదవండి

ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు

అల్లం రాజయ్య | 01.04.2019 08:48:11pm

కూర్మనాథ్‌ ఈ గడబిడలో ʹనగరంలో ఇంకోరోజుʹ గడవక మరింత పేరుకపోయిన వ్యక్తం గాని, విస్ఫోటనం చెందని అసహ్యాన్ని - భిన్న ప్రపంచాల క్రౌర్యాన్ని - పసిపిల్లల కలలను.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •