దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

- సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

నా ఈ రచన మధ్య భారతంలోని చ‌త్తీస్‌ఘ‌డ్‌ లో పాత్రికేయులు ప్రధానంగా హిందీ పాత్రికేయులు ఎదుర్కొంటున్న సవాళ్ళనుద్దేశించినది. దండకారణ్యంలోని దక్షిణ చ‌త్తీస్‌ఘ‌డ్‌ ప్రాంతం 40వేల కిలోమీటర్ల వైశాల్యంతో దాదాపు నెదర్లాండ్ దేశమంత లేదా కేరళ రాష్ట్రమంత ఉంటుంది. జనాభా చాలా పలుచగా ఉండి ఇందులో అధికంగా గోండు ఆదివాసీలు జీవిస్తుంటారు.

స్రాత్వంత్ర్యం వచ్చిన నాటి నుంచి పాలక వర్గాల నిర్లక్ష్యానికి, పోలీసు బలగాల అణచివేతకు ఇక్కడి ఆదివాసీలు గురవుతూనే ఉన్నారు. ఆదివాసీల మీద జరుగుతున్న అణచివేత, దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా 1980ల్లో విప్లవోద్యమ కార్యాచరణ ఆరంభమైంది. 1960ల్లో కొనసాగిన కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల నాటికే ఇక్కడ ప్రభుత్వ బలగాల అణచివేత మొదలైంది. ఆదివాసీల మీద పోలీసుల దౌర్జన్యాలు సాధారణ కార్యక్రమంగా సాగుతూ వచ్చింది.

60వ దశకంలో ఆదివాసీలపై కొనసాగిన అణచివేత చర్యలను గురించి నాటి దండకారణ్య సమాచార్ అనే ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన వార్తా కథనాలను ఇక్కడ చూడవచ్చు.

నాటి కాలంలో ఆ పత్రిక నిండా అణచివేత వార్తా కథనాలే. అయినా... వార్తా సేకరణ, ప్రచురణల్లో నాటి జర్నలిస్టులు ఎలాంటి ప్రతిబంధకాలనూ ఎదుర్కొనలేదు. నేడు బస్తర్లో పోలీసు కాల్పులనే వార్తను ప్రచురించడం దుస్సాద్యమైన విషయమే. బస్తర్ డివిజన్ చ‌త్తీస్‌ఘ‌డ్‌ పోలీసుల రోజువారి అణచివేత కార్యక్రమాల వార్తల ప్రచురణ మావోయిస్టు ఉద్యమం ఆరంభానికి ముందు కాలం కంటే ఇప్పుడు మరింత కష్టసాధ్యమైన విషయంగా మారింది.

అనామకులు, అమాయకులైన ఆదివాసీలను పోలీసులు మావోయిస్టుల పేరుతో పట్టుకొని కట్టేసి కాల్చిచంపినా... ఆ ప్రాంతాల ప్రజలను కలసి మాట్లాడేందుకు పాత్రికేయులకు అనుమతి లేదని సీనియర్ పాత్రికేయుడు కమల్ శుక్లా గతవారం యథాలాపంగా మాట్లాడుతూ చెప్పాడు. నిత్య సంఘర్షణలు జరుగుతున్న ఈ ప్రాంతంలో అసలు ఎదురు కాల్పులేవో, నకిలీ ఎదురుకాల్పులేవో నిర్ధారించుకొని వార్తను ప్రచురించడం జర్నలిస్టుల విధి. ఆ విధిపై ఇప్పుడు నిషేదం అమలు జరుగుతోంది.

నడకదారి కూడా సరిగ్గాలేని దండకారణ్య ప్రాంతంలో పోలీసు, పారామిలటరీ సంయుక్త బలగాల సంయుక్త క్యాంపులు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాత్రికేయులకు సమాచార సేకరణ చాలా క్లిష్టమైన వ్యవహారమనే చెప్పాలి. 1. అడవిలోపల ప్రజలను కలవడం, సమాచారం కోసం సంబంధాలు కొనసాగించడం సులభమైన విషయం కాదు. 2. సమాచార సేకరణ కోసం అడవిలోకి తీసుకెళ్లడానికి ఎవరి సహాకారం తీసుకోవాలన్నా స్థానికులను ఒప్పించడం 3. పారామిలటరీ బలగాల పహరాను తప్పించుకోవడానికి కష్టతరమైన వాతావరణంలో 20 - 30 కిలోమీటర్లు చుట్టుదారిగా నడిచి గ్రామాలను చేరుకోవల్సి ఉంటుంది. లోతట్టు గ్రామాలకు వెళ్లి ఆదివాసీల హత్యలు, అత్యాచారాల కథనాలను వెలికి తీయడానికి వారాల తరబడి అందుభాటులో ఉండలేని పరిస్థితి ఉంటుందని ఎడిటర్ ను ఒప్పించాల్సి ఉంటుంది.

ఆయా పాత్రికేయులు పని చేస్తున్న వార్తా సంస్థల్లో కల్పించే సౌకర్యాలు, ఆర్థిక సహకారాల పరిధిలో లోతట్టు గ్రామాల్లో తిరిగి వారానికి ఒకటైనా సంస్థ సంతృప్తిపడే వార్తను సేకరించడం గొప్పవిజయమే. సంస్థ సహాకారం లేకుండా అది బస్తర్లోనే కాదు.. నిత్య సంఘర్షణలు జరిగే ఏ ప్రాంతంలోనైనా పనిచేయడం పాత్రికేయుడికి కష్టతరమే. అత్యంత వెనకబడిన తూర్పు మహారాష్ట్ర, దక్షిణ చత్తీస్ఘడ్, ఉత్తర తెలంగాణ, ఆగ్నేయ జార్ఖండ్, నైరుతీ బెంగాళ్ వంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఖనిజాల తవ్వకాలు చేస్తున్న బడా కంపెనీలకు స్థానిక ఆదివాసీ ప్రజానీకానికి మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతున్నయి. ఈ మధ్య భారతంలోని సంఘర్షణాత్మకమైన ప్రాంతాల్లో ఫ్రీలాన్స్ జర్నలిస్టులు సంచరించడానికి అవకాశాలు దాదాపు మృగ్యమే.

బీజాపుర్ దక్షిణ ప్రాంతంలోని మారుమూల కుగ్రామంలో హతుడైన హెడ్మారాంను గురించి వార్త సేకరించడానికి ప్రయత్నించిన కమల్ శుక్లాకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మారుమూలలోని సులెంగా గ్రామానికి వెళ్లడానికి ప్రయత్నించిన కమల్ శుక్లాను ఫిబ్రవరి 19న పోలీసులు నిర్భందించారు. నిర్భందించడం ద్వారా శుక్లా ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలులో పెడతామని బెదిరించారు. అయినా.. ఒక నెల రోజుల తరువాత ఒక ప్రముఖ ఆంగ్ల టెలివిజన్ జర్నలిస్ట్ సహకారంతో కమల్ శుక్లా సులెంగా గ్రామాన్ని చేరుకోగలిగాడు.

ఆ గ్రామానికి వెళ్లలేకపోయినట్లయితే... హెడ్మారాం అనే ఆదివాసీ మావోయిస్టు పేరుతో కాల్చిచంపబడ్డాడని శుక్లా నిర్ధారించుకోగలిగే వాడే కాదు. హెడ్మా రాం ను పోలీసులు ఫిబ్రవరి రెండున నిర్భందించి కాల్చిచంపారనేది సులెంగా గ్రామాన్ని సందర్శించిన తరువాతే తెలుసుకోగలిగాడు. ఇదే విషయాన్ని ది హిందూ పత్రిక మే నెలలో ప్రచురించిన మరో కథనంలో పేర్కొంది. అయితే.. పోలీసుల కథనం.. ఇందుకు పూర్తి భిన్నం. హెడ్మారాం ఒక కరడుగట్టిన నక్సలైట్. అతని తలకి లక్ష రూపాయల బహుమతి ప్రకటించబడి ఉంది. అయితే... నక్సలైట్ అని పోలీసులు ప్రకటించిన హెడ్మారాం తప్పుడు కేసులు మోపబడి గతంలో రెండేళ్ల కాలం జైలు జీవితం గడిపాడు. అతని సోదరుడి అరెస్టుకు సహకరించనందుకు పోలీసులే ఈ తప్పుడు కేసును అతనిపై మోపి జైలుకు పంపారు. అతను కరడుగట్టిన మావోయిస్టుగా నిర్ధారించే సాక్ష్యాలు రుజువు కాకపోవడంతో కోర్టు అతనిని వదిలేసింది. ఆయన జైలు నుంచి విడుదలైన వారం రోజుల్లోనే పోలీసులు నిర్భందించి కాల్చిచంపారు.

శుక్లా ఆ గ్రామానికి వెళ్లి ఉండకపోతే.. హెడ్మా తప్పుడు కేసుల నుంచి బయటపడిన వారం రోజులకే కరడుగట్టిన నక్సలైట్గా మారాడనే విషయం తెలిసేదే కాదు. ఎవరైనా వరుసగా అరెస్టులు, ఎన్కౌంటర్లపై పరిశోధన చేస్తే ఆదివాసీలపై పెట్టిన మెజార్టీ కేసులు అక్రమంగా మోపినవేనని అర్థమవుతుంది. వాస్తవాలు వెలికివచ్చే అవకాశం ఉన్నందువల్లే స్థానిక పాత్రికేయులు ఆదివాసీ గ్రామాల్లోకి వెళ్లడం పోలీసులకు ప్రమాదకరమైన వ్యవహారంగా మారింది.

బస్తర్ మారుమూల ప్రాంతాల్లోని విద్య, వైద్య కేంద్రాలు, విప్లవకారుల లొంగుభాటు, అత్యాచారాలు, ఎన్కౌంటర్ల వార్తలను కేవలం పోలీసులు విడుదల చేసిన ప్రకటనల ప్రకారమే రాయాలి. అంతకు మించి పాత్రికేయులు గ్రామాల్లో భాదిత కుటుంబసభ్యులను కలసేందుకు ప్రయత్నించకూడదు. ఒకవేళ ఎవరైనా పాత్రికేయులు పోలీసుల ఆంక్షలు దాటుకొని గ్రామాలకు వెళ్లి వార్తలు సేకరించేందుకు ప్రయత్నిస్తే... వాళ్ల ఇళ్లపై దాడి మొదలవుతుంది. చివరకు ఆ పాత్రికేయులు కఠిన చట్టాల కింద అరెస్టు చేయబడతారు. అవసరమైతే.. నక్సలైట్లుగా ముద్రవేయబడతారు. గత సంవత్సరం కాలంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి.

పాత్రికేయురాలు, ఐసీఆర్సీ మాజీ చీఫ్ మాలినీ సుబ్రహ్మణ్యం ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దీంతో తను దక్షిణ చత్తీస్ఘడ్ ప్రాంతాన్ని వదలివెళ్లవలసి వచ్చింది. అంతేకాదు... సోమారు నాగ్, సంతోష్ యాదవ్, ప్రభాత్ సింగ్, దీపక్ జైస్వాల్ వంటి పలువురు పాత్రికేయులు గత ఏడాది కాలంలో వేరు వేరు కేసుల్లో అక్రమంగా అరెస్టు చేయబడ్డారు. బస్తర్లో స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పించాలని కోరుతూ ప్రభాత్ సింగ్, దీపక్ జైస్వాల్ చత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి రమణ్సింగ్ని కలిసి మరీ విన్నవించుకున్నారు. ముఖ్యమంత్రి పాత్రికేయులకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవంటూ హామీ కూడా ఇచ్చారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన తరువాత కూడా ఈ ఇరువురు పాత్రికేయులను పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ఇందులో ఒకరికి ఈ మధ్యనే బెయిల్ మంజూరయ్యింది.

ఇలాంటి పరిస్థితులను కేవలం జర్నలిస్టులు మాత్రమే ఎదుర్కోవడంలేదక్కడ. సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే. అమాయక ఆదివాసీలపై తప్పుడు కేసులు మోపారంటూ తీర్పుచెప్పినందుకు చివరకు న్యాయమూర్తులపై సైతం పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి. జగదల్ పుర్ లీగల్ ఎయిడ్ గ్రూప్, చట్టానికి లోపల, వెలుపలా బస్తర్ ఆదివాసులపై అమలవుతున్న హింస గురించి ప్రచురించిన నివేదికల్ని పరిశీలిస్తే ఇలాంటి అనేక విషయాలు అర్థమవుతాయి.

ఇలాంటి సంఘర్షణా పూరిత వాతావరణంలో జర్నలిస్టు, విశ్లేషకుడు అయిన నా మిత్రుడు సాయిరెడ్డి 2013లో మావోయిస్టుల చేతిలో హత్య చేయబడ్డాడు. అతనిని పోలీసు ఇన్ఫార్మర్గా పార్టీ పేర్కొంది. కానీ ఇదే సాయిరెడ్డికి నక్సలైట్లతో సంబంధాలున్నాయని చత్తీస్ఘడ్ పోలీసులు 2008లో స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్టు చేశారు. ఇలా ఇప్పటికీ పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను వేధిస్తూనే ఉన్నారు.

సంఘర్షణపూరిత వాతావరణాన్ని, సందర్భాన్ని రికార్డు చేసే పాత్రికేయుల పట్ల సానుకూల వైఖరి కలిగి ఉండడ మంటే వారిని కాపాడుకోవడమని అర్థం. మూడవ జనీవా సదస్సు అవగాహన ప్రకారం... అంతర్జాతీయ సాయుధ సంఘర్షణ సమయంలో ప్రజలకు కల్పించే అన్ని రకాల హక్కులు, రక్షణలు పాత్రికేయులకూ కల్పించాలి. ఇవే నిబంధనలు సాధారణ సంఘర్షణ ప్రాంతాల్లో కూడా వర్తిస్తాయి. అంతర్జాతీయ మానవ హక్కుల తీర్మాణంలో సైతం పాత్రికేయుల భావ ప్రకటనా స్వచ్చే, జీవించే హక్కు, రక్షణ తదితర అంశాలను పేర్కొన్నది.

జర్నలిస్టులపై నిరంతర దాడుల నేపథ్యంలో... శ్రీలంకలో ఎల్టీటీఈపై వైమానిక దాడులు మొదలయ్యాక ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్(ఐపీకేఎఫ్) జర్నలిస్టుల లక్ష్యంగా చేసిన దాడులను గుర్తుచేసుకోవచ్చు. అప్పట్లో... ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య సాధనాన్ని హీనపరిచే దుశ్చర్యలకు పాల్పడుతోంది. జాఫ్నా పాత్రికేయుల అభిప్రాయాల్ని, భావ ప్రకటనా స్వచ్ఛను అణచివేస్తోంది- అంటూఎల్టీటీఈ నేతగా దశాబ్ధాలపాటు సేవలందించిన బాలసింగమ్ జీవిత భాగస్వామి అడిల్ బాలసింగం రాశారు. భారతరాజ్యం ఇప్పుడు తన సరిహద్దులలోపలే, బస్తర్లో అలాంటి మిలటరీ ఆపరేషన్స్ స్వేచ్ఛగా చేసుకోవడానికి భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తోంది.

అయితే భద్రతా దళాలకు అనుకూలంగా వార్తాకథనాలను అందించే పాత్రికేయులు ఎలాగూ ఉండనే ఉంటారు. అలా పోలీసులు వైపు నుంచి, వాళ్లు విడుదల చేసే ప్రకటనల్ని ప్రచురించే వారికి రోడ్డు నిర్మాణ కాంట్రాక్టులు, ప్రభుత్వ భవన నిర్మాణ కాంట్రాక్ట్ల వంటి బహుమతులు ఉంటాయి. అదనంగా కావలసినంత డబ్బు కూడా అందుతుంది.

మరి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు ఇలాంటి సందర్భంలో.. పాత్రికేయ విలువల ఉల్లంఘించడాన్ని ఎందుకు ప్రశ్నించవనే సందేహం తలెత్తవచ్చు.
1. చాలా వరకు మీడియా సంస్థలు కిందిస్థాయి పాత్రికేయులకు వేతనాలు చెల్లించవు. ప్రధానంగా హిందీ లేదా ఇతర స్థానికభాషల పత్రికలు, ఛానళ్లు పాత్రికేయులకు ఎలాంటి చెల్లింపులూ చేయవు. మీడియా సంస్థలే వ్యాపారులు, స్థానిక అధికారులు, కంపెనీల నుంచి నిధులు సమకూర్చాలంటూ పాత్రికేయులకు లక్ష్యాల్ని నిర్ధేశిస్తాయి. సంస్థలో చేరేముందే ఇలాంటి నిబంధనలు పెడతారు. ప్రకటనల కింద సేకరించే నిధుల్లోంచి ఎంత సంస్థకు చెల్లించాలి, సర్క్యులేషన్ ఎంత చేయించాలి వంటి నిబంధనలు ప్రధానంగా. అందుకే.. గ్రామీణ భారత దేశంలో... జర్నలిస్టు అంటే పాత్రికేయులు - సేల్స్ మెన్ - సర్క్యులేషన్ మేనేజర్ పాత్రలు పోషించవలసి ఉంటుంది. తన ప్రయోజనాలు, సంస్థ ప్రయోజనాల కలిసి పాత్రికేయ విలువలను పక్కనపెట్టడం జరుగుతోందని చెప్పవచ్చు.

ఈ కారణాల వల్ల ఎలాంటి సందర్భంలోనైనా పాత్రికేయుడు ఒకరు అరెస్టయితే.. ఆయా మీడియా సంస్థల యాజమాన్యాలు అతడిని తమ సంస్థ ఉద్యోగిగా కాక సేల్స్ పర్సన్లాగానో, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్లాగానో చూపిస్తుంది. సంఘర్షణ ఇంత తీవ్రంగాలేని పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇది పెద్ద సమస్య కాదు. కానీ సంఘర్షణ తీవ్రస్థాయిలో కొనసాగుతున్న బస్తర్ లాంటి ప్రాంతాల్లో మీడియా సంస్థల విధివిధానాలు నెలల తరబడి జైళ్లలో నిర్భందించబడే పాత్రికేయుల పాలిటశాపమనే చెప్పాలి.

2. కొన్ని మీడియా సంస్థలు స్వయంగా అటవీ ప్రాంతంలో ఐరన్, బాక్సైట్, బొగ్గు వంటి ఖనిజాలు లీజుకు తీసుకొంటాయి. అలాంటి సంస్థలు ఏవీ ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి ముందుకు రావు. ఏ ప్రభుత్వ విధానాలనైతే విమర్శాన్మక దృష్టితో విశ్లేషించాలని మీడియా సంస్థల నుంచి ఆశిస్తామో.. అదే ప్రభుత్వాల నుంచి సదరు మీడియా సంస్థలు ఖనిజాలు పొందుతున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కొన్ని వార్తా పత్రికలు, న్యూస్ ఛానల్స్ ఏకంగా టెర్రరిజం మొదలు ద్రవ్యలోటు వరకు అన్ని జాతీయ విధివిధానాలను నిర్థేశిస్తుంటాయి. ఇలాంటి సంస్థలు తమ ఉద్యోగుల పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తాయో ఎలాంటి పర్యవేక్షణ కూడా ఉండదనే విషయాన్ని మనం గమనించాలి.

ఈ నేపథ్యంలో స్థానిక అధికార యంత్రాంగం ఈ విషయాలను సీరియస్గా తీసుకోవడం పట్ల మా వంటి జర్నలిస్టులకు, లేదా నాకు కనీసం ఆంగ్ల మీడియా మీద కొంత ఆశ ఉండింది. కానీ మావోయిస్టులకు, మైనింగ్ కు ఆదివాసీలకు గుండెకాయగా ఉన్న మధ్య భారతంలోని విషాదగాథల తీవ్రతను గుర్తించడంలో ఆంగ్ల మీడియా వైఫల్యం చెందింది. అధికారిక గణాంకాల ప్రకారం గడిచిన ఐదారు సంవత్సరాల్లో 3000 - 4000 మంది ప్రజలు చనిపోయారు. ఇక అనధికార గణాంకాలు ఇంకా ఎక్కువే ఉంటాయి.

లోధి నగరంలో ఒక అరగంట ట్రాఫిక్ నిలిచిపోతే ఓ ఇరవై మంది పాత్రికేయులు జమైతారు. కానీ దండకారణ్య ప్రాంతంలో ఏ ఆంగ్ల వార్తా సంస్థ కూడా పూర్తి స్థాయి ప్రతినిధిని నియమించుకోలేదు. ఫలితంగా గిరిజన భారతంలో వేలాది మందిపై హత్యలు, అత్యాచారాలు, అక్రమ అరెస్టులు జరుగుతున్నా ఏ ఒక్క ఆంగ్ల వార్తా సంస్థా వాటిని నమోదు చేయదు.

ఇలాంటి అస్సహాయ పరిస్థితుల్లో ఆదివాసీ సమూహపు గాయాలు, నిస్సహాయత బయటి ప్రపంచానికి తెలియకుండానే కప్పివేయబడుతున్నాయి. ఆదివాసీల పట్ల మీడియా సంస్థల నిర్లక్ష్యం నేపథ్యంలో స్వయంగా ఆదివాసీలే తమపై జరుగుతున్న దాడులకు చిత్రలేఖనం రూపమిస్తూ అమరుల స్తూపంగా పిలుచుకునే రాతి ఫలకంపై బొమ్మలు వేయడం ఆరంభించారు.

కొద్ది రోజుల క్రితం హిందూ పత్రికలో మేము రాసినట్లు... మిలటరీ బలగాలతో నిండిపోయిన దక్షిణ చత్తీస్ ఘడ్ ప్రాంతంలో - నిత్యకృత్యంగా మారిన బూటకపు ఎన్కౌంటర్లను ప్రపంచానికి చాటేందుకు సాంప్రదాయ గోండు కళను స్వీకరించారు స్థానిక ప్రజలు. ఇది తాజా ఉద్యమ రూపం అక్కడ. బూటకపు ఎన్కౌంటర్లో భద్రతాబలగాల చేతుల్లో హత్యచేయబడిన తీరును కథలుగా శిలా ఫలకాలపై చెక్కుతున్నారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేసిన కమల్ శుక్లా గతంలో ఎప్పుడూ ఇలాంటి వైవిద్యమైన ప్రక్రియను చూడలేదని చెప్పాడు. 19వ శతాబ్ధ ఆరంభంలో పోటుయాస్గా పిలువబడే చదువురాని బెంగాళ్ చిత్రకారుల వంటి ఈ చిత్రకళ ఎలాంటి రూపు తీసుకుంటుందనేది కాలమే తేల్చాలి. కానీ 20వ శతాబ్ధంలో కలాన్ని, కెమెరా కంటిని నిషేదించిన చోట రూపుదాల్చుతున్నకొత్త ఒరవడి ఇది.

చివరగా..జాన్ పిల్గేన్ మాట ఒకటి ఉటంకించదలచాను – యుద్ధంలో మొదట చచ్చిపోయేది ʹనిజంʹ కాదు, జర్నలిజం. - ఇదీ ఇప్పడు దక్షిణ చ‌త్తీస్‌ఘ‌డ్‌ పరిస్థితి!

(www.sabrangindia.in సౌజ‌న్యంతో)

No. of visitors : 2334
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి

హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను మోటారు వాహ‌నాల‌తో తొక్కిస్తాడ‌ట‌

సంఘ‌ర్ష్‌ | 04.03.2017 12:26:49pm

హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను రోడ్డు మీద వాహ‌నాల‌తో తొక్కించాలంటూ వ్యాఖ్యానించ‌డం హంత‌క రాజ్యం న‌గ్నంగా ఊరేగుతోంద‌న‌డానికి నిద‌ర్శ‌నం. ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •