భయం అలవాటైపోయి, పరాధీనత సుగుణమైపోయిన స్థితిని బద్దలుకొట్టాలి

| సంభాషణ

భయం అలవాటైపోయి, పరాధీనత సుగుణమైపోయిన స్థితిని బద్దలుకొట్టాలి

- ఐనా పురి | 17.04.2019 06:17:36am

షాహిదుల్‌ ఆలంతో సంభాషణ

బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్‌ షాహిదుల్‌ ఆలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టయ్యారు. 64 సంవత్సరాల షాహిదుల్‌ ఆలం సుమారు 40 ఏళ్లుగా ఫోటోగ్రాఫీతో పెనవేసుకొని ఉన్నారు. ఆయన ఛాయా చిత్రాలన్నీ సమాజ చైతన్యాన్ని తట్టి లేపేవి. 2018 ఆగస్టులో వేల సంఖ్యలో విద్యార్థులు ఢాకా వీధుల్ని ముంచెత్తి తమ ఆగ్రహపూరిత నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాన్ని ఆయన ఫేస్‌ బుక్‌ లైవ్‌లో పెట్టాడు. జులై 29న ఇద్దరు స్కూలు విద్యార్థులు మీదుగా వేగంగా వస్తున్న బస్సు దూసుకుపోయిన ఘటన తర్వాత రోడ్డు భద్రతను గురించి బంగ్లాదేశ్‌లో అప్పటికే ఉన్న ఆందోళనలు మిన్నంటాయి. షాహిదుల్‌ పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్టులో అధికార ఆవామీ లీగ్‌ అనుబంధ సంస్థ ఛాత్రా లీగ్‌ సభ్యులు నిరసనకారులపై ఆయుధాలతో దాడిచేస్తున్న దృశ్యం స్పష్టంగా ఉంది. దీని కారణంగా, అట్లాగే ఆయన అల్‌జజీరా టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూ కారణంగా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేసి రెచ్చగొడుతున్నాడనే నెపం మోపి ఆయన్ని అరెస్టు చేసారు. వంద రోజులకు పైగా జైల్లో గడిపాక విడుదలై షాహిదుల్‌ నేరుగా ʹచోబీ మేలాʹ (ఫిబ్రవరి 28-మార్చ్‌ 9) అనే ప్రఖ్యాత దక్షిణాసియా ఛాయాచిత్ర ప్రదర్శనకు హాజరయ్యాడు. (ఈ చోబీ మేలా స్థాపకుడు, 20 ఏళ్లుగా దీనిని నిర్వహిస్తున్న వాడు కూడా ఆయనే.) ఆ సందర్భంగా ప్రముఖ మీడియా సంస్థలెన్నో ఆయనను ఇంటర్వ్యూ చేసాయి. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కోసం ఐనా పురి అనే రచయిత, కళాకారుడు చేసిన ఇంటర్వ్యూ మిత్రుల కోసం తెలుగులో

కెరనీగంజ్‌లో మీ ఖైదు నుండి 10వ చోబీ మేళా వరకు చాలా కార్యమ్రాలు జరిగాయి. ఈ ఉత్సవాలను (ఫోటోగ్రఫీ ఫెస్టివల్‌) మీరు అనుకున్నట్టుగా నడిపించగలగడం ఎలా సాధ్యమైంది?

నన్ను నేను స్టీరింగ్‌ పట్టుకొని నడిపించే నాయకుడిగా ఎప్పుడూ అనుకోను. ఈ ఫెస్టివల్‌ జరగాలనే ఒక సమష్టి నిర్ణయంలో భాగం కావడమే నా ప్రధాన పాత్ర అనుకుంటున్నా. పైగా అప్పుడు నేను జైల్లోనే ఉన్నాను. బైటికి వస్తానో రాలేనో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనా షో జరిగితీరాలని అనుకున్నాం. భయం అనే సంస్కృతి ఉన్నదంటే మనం విషపూరిత సంఘంగా మారామని అర్థం. షాహిదుల్‌ మిత్రులుగా ఉండడం ప్రమాదకరం అయిపోయింది. డిరిక్‌తో (షాహిదుల్‌ ఆలం నిర్వహించే గాలరీ, ఫోటో లైబ్రరీ), పాఠ్‌శాల (ఆలం ఫోటోగ్రఫీ స్కూల్‌)తో ఉండడానికి స్థానిక సంఘాలు భయపడిపోతున్నాయని మాకు తెలుసు. అందువల్ల శిల్పకళా అకాడెమీ, నేషనల్‌ మ్యూజియం వంటి పబ్లిక్‌ వేదికలు మాకు దొరకడం అసాధ్యం (మేం అడగలేదు కూడా). కళకు సంబంధించిన నాణ్యతతో రాజీపడకుండానే మేమో సాదాసీదా కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. ఇలా అనుకోవడమే దానికి సరికొత్త స్థాయిని అందుకునేలా చేసింది. డిరిక్‌ పాఠశాల భవన నిర్మాణం ఆగిపోయి, అది గ్యాలరీ కాంప్లెక్స్‌గా మారిపోయింది. ఈ ఏడాది తీసుకున్న ʹథీంʹకు మేం ఊహించినదానికన్న ఇది బాగా సరిపోయింది.


మారిన పరిస్థితులు వల్ల వేదికలు కూడా మార్చుకోవలసి వచ్చిందిని అర్థమవుతోంది. అయితే ఈ మార్పులకు అనుగుణంగా ఒక కళాప్రదర్శన నిర్వాహకుడిగా మీరు ఎలాంటి మార్పులను దృష్టిలోకి తీసుకున్నారు?

చోబీ మేలా -10 మరింత ప్రయోగాత్మకంగా ఉండాలని అనుకున్నాం. ఎప్పుడూ పాత సందర్శకులు మునుపటి ప్రదర్శనలతో సమకాలీన కళాకారుల దృశ్య చిత్రణను పోల్చగలిగేవారు. మేము మా పరిమితుల్ని కూడా ప్రయోగాత్మకం చేయలగలిగాం. ప్రధాన వేదిక అసంపూర్ణంగా ఉండటం వల్ల కళాకారులు తమ ప్రదర్శనకు అనుగుణంగా సెట్టింగ్‌ చేసుకునేవాళ్లు. నిజానికి పాత పద్ధతి కంటే ఇది వారికి మరింత స్వేచ్ఛనిస్తుంది. ప్రాచీన గ్రంధాల అధ్యయనం మరో ముఖ్యమైన అంశం. పాఠ్‌శాల ఢాకా యూనివర్సిటీకి అనుసంధానమైనందువల్ల అధ్యయనం ప్రధాన అంశమైంది. మొదటి సారి ఫోటోగ్రఫీ, ఫొటోగ్రాఫర్ల ఇతివృత్తాలతో సినిమా ప్రదర్శన జరిగింది. సెబాస్టియా సాల్‌గడో, రాబర్ట్‌ ఫ్రాంక్‌, రాబర్ట్‌ కాపా, ఎడ్వర్డ్‌ బర్టిన్‌స్కీ మీద సినిమాలు ప్రదర్శించారు. చోబీ మేలాకు రూపర్ట్‌ గ్రే ప్రస్థానం (రూపర్ట్‌ గ్రేస్‌ జర్నీ టు చోబీ మేలా) అనే అంశం మీద తీసిన సినిమా కూడా ఉండింది. ఇది ఏ పరిధుల్లేని ఛాయాచిత్ర ప్రపంచం.

దాదాపు ఒక ధిక్కార ప్రకటనగా మీ వేదిక మీద రాజకీయ కార్యకర్తలు, అరుంధతి రాయ్‌ లాంటి మేధావులు కనిపించారు. అంతకు ముందు కూడా మీరు మహాశ్వేతా దేవిని ఆహ్వానించారనుకుంటా?

అవును. అరుంధతి రాయ్‌ రావడం మాకు చాలా స్పెషల్‌. బంగ్లాదేశ్‌కు ఆమె మెదటిసారి రావడం కూడా. దానివరకు అది కూడా ప్రచారం చేసింది. ప్రభుత్వం అనుమతిని రద్దుచేసి ప్రోగ్రాం జరగకుండా చెడగొట్టాలని చూడటం, ఒక కళా ప్రదర్శన మీద స్వయంగా ప్రధానమంత్రి అసంబద్ధమైన కథలు ప్రచారం చేయడం లాంటి హడావిడి నడిచింది. మరో వేదికను కూడా పోలీస్‌స్టేషన్‌ నుండి అనుమతి తీసుకోవాలని చెప్పి రద్దుచేసారు. కానీ చివరికి వెనక్కుతగ్గక తప్పలేదు. దీనివల్ల వాళ్లు దేశప్రజల ముందు నవ్వులపాలయ్యారు. అరుంధతిరాయ్‌ని వినడానికి సుమారు 800 మంది గంటల తరబడి ఎదురుచూసారు. రెండుగంటల పాటు ఆమె అద్భుత ప్రసంగానికి మంత్రముగ్ధులయ్యారు.

మీరొకసారి అన్నారు చూడండి, ʹసెకెనులో 125వ వంతు షట్టర్‌ వేగంలో ఎన్నో చిరస్మరణీయ కాల ఖండికలు నిక్షిప్తమవుతాయని, నిశ్శబ్ద నిట్టూర్పులు వినడానికి కూడా అది మందగించదుʹ అని... కానీ విషాదంగా మీరు బలవంతపు ఏకాంతవాసంలో ఉంచబడ్డారు. ఇలాంటి అసాధారణ పరిస్థితులు ఇప్పటి మీ ఆలోచనల్ని ఎలా నిర్వచిస్తాయి?

అప్పుడు మరింత విశాలమైన లెన్స్‌తో శిక్షా స్మృతిని చూడడానికి ఒక అడుగు వెనక్కువేయడం కూడా అవసరమని నాకనిపించింది. అభివృద్ధికి కొలమానంగా మౌలిక అవసరాలు తీరడమనే విషయాన్నే తీసుకుంటే జైల్లో అవన్నీ తీరుతాయి. అయినా ఖైదులో ఉంచడం అన్నది తీవ్రమైన శిక్షగా పరిగణించబడుతోంది. మరి బయట ఎందుకని ʹఅభివృద్ధిʹ కోసం స్వేచ్ఛను పణంగా పెట్టవచ్చనే సూక్తిని మనం ఆమోదిస్తున్నాం? అధిక జిడిపి సాధించడం కోసం మన స్వేచ్ఛలు పూర్తిగా హరించుకుపోవడం తప్పనిసరి కర్మగా మనమెందుకు అంగీకరిస్తున్నాం? మనమేమీ మాట్లాడమని, మన రాజ్యాంగ హక్కులను వదిలేసుకుంటామని ఒప్పేసుకుంటూనే స్వాతంత్రమనే భ్రమను కూడా ఎందుకు ఒప్పుకుంటున్నాం? ఎందుకు భయం సాధారణమైపోయి, పరాధీనత గొప్ప సుగుణంగా చూడబడాలి? మన బుద్ధిని బంధించే గొలుసులను తెంచేస్తే ఏమవుతుంది? అవును, నేను నా తోటి పోరాటయోధుల స్నేహం, ప్రేమ, సాహచర్యానికి దూరమవుతాను. కానీ వారి సహవాసం ఆలోచనలను పంచుకునే, ప్రశ్నించే, స్వేచ్ఛగా ఆలోచించే శక్తిని ఇవ్వనప్పుడు సామీప్యం కూడా ఎండమావిగా ఉంటుంది. స్వేచ్ఛ సుదూర స్వప్నమవుతుంది.

చోబీ మేలాలో డైరెక్టర్‌గా పాల్గొనడం ఇదే చివరిసారి అని చెప్పారు కదా? తర్వాతేమిటి?

అవును, డైరెక్టర్‌గా ఇది నా చివరి టర్మ్‌. వ్యవస్థాపకుడిగా ఉండి, ఇరవై ఏళ్ల పాటు దానిని పోషించిన తర్వాత ఇక దీనిని యువతరానికి అప్పగించే సమయం వచ్చిందని నమ్ముతున్నాను. ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడు మునుపటికన్నా వాళ్లు మరింత ప్రధాన పాత్ర పోషించారు. ఈ ఏడాది చివరికంతా మా కొత్త భవనం తయారవుతుంది. పాఠ్‌శాల, డిరిక్‌ కూడా ఆవరణను పంచుకుంటాయి. రెండు సంస్థలు ఒకటి కావాలని, ఉమ్మడిగా మరింత శక్తితో పనిచేయాలని నా ఆశ. నా సహకారం కొనసాగిస్తాను కానీ అది భౌతికంగా కాకుండా ఆలోచనలపరంగా ఉండాలని అనుకుంటున్నా. కవిత్వం రాయడానికి నాకు కొంత సమయం దొరుకుతుందని ఆశిస్తున్నాను.

మీ కొత్త ప్రాజెక్ట్స్‌ గురించి చెప్పండి?

నవంబర్‌లో న్యూయార్క్‌ రూబిన్‌ మ్యూజియంలో నా చిత్రాల ప్రదర్శన ఉంటుంది. అప్పటికి నా జైలు జీవితంపై ఏమైనా తీసకురాడానికి ప్రయత్నిస్తున్నా. నా సహచర ఖైదీలతో కలిపి ఆ ప్రాజెక్ట్‌ ఉంటుంది. వారితో కలిసి గడిపింది, వాళ్లకు నేర్పించింది అందులో భాగమవుతాయి. ఆర్ట్‌తోపాటు, వాళ్లు రాసిన కవిత్వం, వాళ్ల పాటలు ఉంటూ, బైటికొచ్చాక నేను తీసిన ఫోటోలు, జైలు నోట్స్‌ కూడా ఉంటాయి. మనుషులు లేకపోవడం గురించిన ప్రాజెక్ట్స్‌ ఇదివరకు చేసాను. ఇప్పుడు ఫొటోలు లేని ఫోటోగ్రఫీ ప్రాజెక్టు మీద పనిచేస్తున్నాను. జర్మన్‌ ప్రచురణకర్త గెర్‌హార్డ్‌ స్టీడిల్‌ నేను చేసే ప్రాజెక్ట్‌ను ప్రచురించబోతున్నాడు. కాబట్టి రూబిన్‌ మ్యూజియంలో ఎగ్జిబిషన్‌తో పాటు పుస్తకావిష్కరణ కూడా ఉంటుంది.

(మార్చ్‌ 17నాటి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితమైన ఈ ఇంటర్వ్యూ గురించి అపురూపంగా ప్రస్తావించిన వివిని మరీ మరీ తలచుకుంటూ)

స్వేచ్ఛానువాదం: వరలక్ష్మి


No. of visitors : 459
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •