పదహారు గంటలపైగా ప్రయాణం, కోర్టు హాలు బయట మరికొన్ని గంటల నిరీక్షణ తర్వాత మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో వాళ్లను తీసుకొచ్చారు. ముందుగా ఇద్దరు మహిళలు. జూన్ 2018లో అరెస్టయి తొమ్మిది నెలలుగా అండర్ ట్రయల్ ఖైదీగా ఉంటున్న షోమాసేన్, అక్టోబర్ ఆఖరువారంలో ఆమెను కలుసుకున్న సుధాభరద్వాజ్. సెక్యూరిటీ మధ్య ఆ ఇరుకు కారిడార్‌లో తమ కోసం వచ్చిన వాళ్లని నవ్వుతూ పలకరిస్తున్నారు. చేయి కలపను దగ్గరికి పోతే అడ్డుపడుతూ దూరం నిలవమంటూ మహిళా పోలీసులు. షోమా దాదాపు బక్కచిక్కిపోయింది. చూపుడువేలితో అభినయిస్తూ చాలా సన్నబడ్డావని పరామర్శిస్తున్న మిత్రులు. ʹమంచిదేగాʹ అని నవ్వుతూ సమాధానం. సుధా భరద్వాజ్‌కు అభివాదం చేస్తుంటే విప్పారిన చిరునవ్వుతో ఆమె పలకరింపులు. రెండు మూడు నిమిషాల తర్వాత ఏడుగురు పురుషుల్ని తీసుకొచ్చారు. ముసిముసి నవ్వులతో మూడు తరాలు ముచ్చట్లాడుకుంటూ వస్తున్నారు. బంధీలమని, చూట్టూ పోలీసులున్నారని స్పృహ వారికున్నట్లు లేదు. పదడుగుల దూరం నుండి సమీపిస్తున్న ఆ సమూహంలో ఖాకీ యూనిఫారాల మధ్య ఒకరి కోసం కళ్లు వెదికాయి. వివి! నలుపుతేలిన శరీర రంగు, సన్నబడ్డ దేహం... అదే ఉత్సాహం. నన్ను చూడగానే వడలిపోయిన ముఖం ఆశ్చర్యంతో ఆనందంతో వెలిగిపోయింది. నేనూ, రమాసుందరి గారు, మిత్రుడు బాషా పరిగెత్తుకుంటూ వెళ్లాం. దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుంటే కళ్లను కప్పేస్తూ నీటిపొర. ʹరమ్మంటున్నారుʹ అంటూ మమ్మల్ని పక్కకు జరిపేసి కోర్టు హాలు వద్దకు సుధ, షోమా నిలుచున్న చోటికి తీసుకెళ్లిపోయారు. వాళ్ల వెనకాలే మేము, మరికొందరు వాళ్లను చూడొచ్చిన మాలాంటివాళ్లు. వెర్నన్ గొంజాల్వెజ్ సహచరి, న్యాయవాది సుసాన్, అరుణ్ ఫెరేరా సహచరి జెన్నిఫర్, అందరిలో చిన్నవాడైన మహేశ్ ఫ్రెండ్స్ వచ్చారు.
అసలు చూడనిస్తారా అనుకుంటూ వెళ్లిన మేము దగ్గరికెళ్లగలిగాం, స్పర్శించగలిగాం. క్షణాల్లో ఎగసిన ఉద్వేగం చల్లారలేదు. వివి ముఖంలో ఎన్నడూ కనపడనంతగా వృద్ధాప్యం పైకి తేలింది. నిజానికి పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకోవలసిన వయసు కదా. ఆయన్ని ప్రేమించే కుటుంబ సభ్యుల మధ్య, మనవళ్ళు, మనవరాళ్ల మధ్య సరదాగా కాలక్షేపం చేయాల్సిన వయసు కదా. కానీ అట్లా నిలకడగా, నింపాదిగా ఉండే జీవితాన్ని ఆయన ఎంచుకోలేదు మరి. ఆరోగ్యం ఎలా ఉందో? ఇన్నేళ్ల తర్వాత ఈ స్థితిలో మళ్లీ జైలు జీవితం, అదీ కరడుగట్టిన అమానవీయతకు పేరుగన్న చోట ఈ కవి ఎలా ఉంటున్నాడో? ఏం చేస్తున్నాడో? రెండు నిమిషాలైనా మాట్లాడగలిగితే బాగుండు. అవకాశం ఉంటుందా? మనుషుల్ని, ఆత్మీయ ఆలింగనాల్ని, మాటల కలబోతల్ని నిషేధించిన చోట అన్నీ అనుమానమే. వివిని చూడ్డానికి తెలంగాణ నుండి 26 మంది రచయితలు, ప్రజాసంఘాల మిత్రులు వెళితే ఎన్నడూ లేనిది ఆరోజు సెక్యూరిటీ సిబ్బంది కొరతను సాకుగా చూపి పురుష ఖైదీలనెవర్నీ తీసుకురాలేదని తెలిసింది. తీసుకొచ్చినప్పుడు కూడా కలవడానికి ఎన్ని ఆంక్షలు, అభ్యంతరాలు, అదిలింపులు ఎదురవుతున్నాయో వింటున్నాం. ʹమిమ్మల్ని చూడాలంటే ఎలా?ʹ నవంబర్ 16 హౌస్ అరెస్టు ముగిసి జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న రోజు ఫోన్లో అడిగినప్పుడు ʹకోర్టులో కలవొచ్చులేʹ అన్నాడు. ʹదిగులుగా ఉంది సార్, ఎట్లుంటారో ఏమోʹ అంటే ʹఎందుకూʹ అని నవ్వి ʹఇవన్నీ మామూలే కదాʹ అన్నాడు. ఆ చిరునవ్వు మాత్రం స్థిరంగానే ఉంది.
ఇందాక నిరీక్షణలో అరుణ్ ఫెరేరా సహచరి పరిచయమైంది. అరుణ్ ఇదివరకే నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు జైలు జీవితం గడిపాడు. కస్టడీలో చిత్రహింసలు అనుభవించిన రచయిత, చిత్రకారుడు తన చైతన్యయుత సంకెళ్ళ సవ్వడిని (కలర్స్ ఆఫ్ ది కేజ్) అక్షరాల్లో బొమ్మ కట్టి, కారాగారపు రంగులద్దిన బొమ్మల్లో కళ్లకు కట్టి పాఠకుల అనుభూతిలోకి తెచ్చాడు. జెన్నిఫర్ కొడుకుని తలచుకుంటూ ʹతను మొదటిసారి అరెస్టయినప్పుడు మావాడికి రెండేళ్లు. విడుదలయ్యాక వచ్చిన తండ్రిని వింతగా చూస్తుంటే మీ నాన్న అని పరిచయం చేయవలసి వచ్చింది. ఇప్పుడు పన్నెండేళ్లొచ్చి ఊహ తెలుస్తోంది. నాన్నను మళ్లీ ఎప్పుడు చూస్తానని అడుగుతాడుʹ అని చెబుతున్నప్పుడు సంకెళ్ల సవ్వడి ద్వారా మీరూ, మీ అబ్బాయీ మాకు పరిచయమయ్యారని చెప్పాం. సుమారు అయిదేళ్లు నాగపూర్ అండాసెల్‌లో నిర్బంధించి కక్ష సాధించడం తప్ప ఆయనపై ఆరోపించిన ఏ ఒక్క కేసుకూ ఆధారాలు చూపలేకపోయారు పోలీసులు. ఇప్పుడు కూడా అంతే అవుతుంది. ఆయన కోల్పోయిన యవ్వనాన్ని, భార్యాబిడ్డల ప్రేమను ఏ న్యాయస్థానమూ తిరిగివ్వలేదు.
హియరింగ్‌కు ఇంకా పిలవలేదు. వివి పక్కకు చేరి పలకరింపులు మొదలుపెట్టాం. ఆరోజేదో అద్భుతం జరిగినట్టుంది. సాధారణంగా ఎవరికీ దొరకని అవకాశం మాకు దొరికింది. అటుగా పోయి కూర్చొండి అని పోలీసులు కాస్త విశాలమైన చోటు చూపించారు. మామూలుగా ఎస్కార్ట్ వాహనంలోనో, ఇరుకు లాకప్ గదిలోనో ఉంచి సరిగ్గా కేసు హియరింగ్ సమయానికి తీసుకొస్తారట. ʹఅయిదు నిమిషాలకు మించి మాట్లాడను వీలుకాదు. న్యాయమూర్తికి విన్నవించుకుంటే రక్తబంధువులను మాత్రమే అనుమతిస్తున్నారు. రక్తబంధువులంటే భార్య, పిల్లలు మాత్రమేనట. నిజానికి ఏ కోర్టులోనూ ఇలాంటి నిబంధనలుండవు. వాయిదాకొచ్చిన ప్రతిసారి బంధువులు, మిత్రులు కలవడం చాలా మామూలు విషయం. ఖైదీలు సాధారణంగా నిరీక్షించేది ములాఖత్‌లకు, కోర్టు వాయిదాలకు. బ్రిటీష్ కాలంనాటి మహారాష్ట్ర జైళ్లలో ములాఖత్ అంటే గాజు కిటికీ వద్ద నిలబడి కనపడీ కనపడని మనిషి ఛాయతో ఫోనులో మాట్లాడటం. అదీ పది నిమిషాలు మాత్రమే.
ʹరండి, కూర్చొని మాట్లాడుకుందాʹమని ఇంటికొచ్చినప్పుడు ఆహ్వానిస్తున్నట్లుగా మమ్మల్ని పక్కకు తీసుకెళ్లారు వివి. షోమా, సుధ అక్కడే ఉండిపోయారు. మిగతా వాళ్లు బెంచీ మీద, దాని పక్కకు వరుసగా చేరి 29 నుండి 79 దాకా అని మహేశ్ రౌత్ నుండి వరవరరావు దాకా మూడు తరాల వాళ్లమంటూ అందరూ నవ్వుతూ పలకరించారు. చుట్టూ కూడిన పోలీసులు అందర్నీ గుచ్చిగుచ్చి చూస్తున్నారనే స్పృహ ఎవరికీ లేదు. ఎవరికి వారు విజిటర్స్‌తో మాటల్లో పడ్డారు. ʹఇట్లనే ఉంటుందని భ్రమపడొద్దు, ఇట్ల కలుసుకొని మాట్లాడటం ఇక్కడ దుర్లభంʹ అన్నారు వివి. అందర్నీ పేరుపేరునా అడిగారు. ఇంత ఎండల్లో అంత దూరం నుండి ఎందుకొచ్చారన్నాడు. మామూలుగా ఆరోగ్యం గురించిన రొటీన్ ప్రశ్న ఇక్కడ ఎంత భారమవుతుందో చెప్పలేను. అసిడిటీ బాగా ఎక్కువైంది, అన్నిటికన్నా నిద్రలేమి సమస్య. అంతకు ముందెప్పుడో వచ్చిపోయిన స్కిన్ అలర్జీ మళ్లీ వచ్చింది. కారణమేమిటో తెలీదుకానీ విపరీతంగా దద్దుర్లు, దురద. డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల ఒక గంట మాత్రమే నిద్రపడుతుంది. సెల్లో విపరీతంగా దోమలు. కాయిల్ వెలిగించి పెడితే అలర్జీకి వొళ్లంతా వాచిపోయింది. చివరికి మూడు రోజుల క్రితం ఫ్యాన్ బిగించారు. ఈ చివరి మాటతో ʹహమ్మయ్యʹ అన్నాం. బహుషా ఓడోమాస్ రాసుకోవడం వల్ల చర్మం నల్లబడినట్లుంది. బయట ఉంటే తీరిక లేకుండా ఉండే వివికి మనుషులు, పనులే ఆక్సీజన్. సాహిత్యమే ఎనర్జీ. ఇక్కడి ఖళీతనంతో పాటు ఉన్న భౌతిక స్థితి వల్ల చాలా అసలిపోయి ఉన్నట్లున్నారు. ఆ గంభీరమైన గొంతులో ఎన్నడూ చూడని అలసటతో కూడిన చిన్నపాటి వణుకు. ఇరుకు బెంచీలో ఆయన కోరికమీద పక్కన సర్దుకొని చురుకు తగ్గని కళ్లలోకి, నల్లబడిన పెదాల మధ్య అలవాటుగా మెరుస్తున్న నవ్వుల్లోకి చూస్తూ కూర్చున్నాను.
వాళ్లందరితో కలిసి చల్లారిపోయిన టీ చప్పరిస్తూ ఎందుకిదంతా...అని అనుకోకుండా ఉండలేకపోయాను. అక్కడ సాయిబాబా, ఇక్కడ ఈయన? ఇద్దరు తెలుగువాళ్లు తమకు సంబంధంలేని పరిసరాల్లో నేరస్తులుగా... బొట్టుబొట్టు జీవశక్తిని తోడేస్తూ మరాఠా కారాగారాలు. అనేక సాహిత్య, రాజకీయ సభల కోసం దేశమంతా తిరిగిన వివిని పూణేకు మొదటిసారి పోలీసులే ఈ కేసులో తీసుకొచ్చారట. కోర్టు హాలు వద్దకు సంకెళ్లు, పొడవాటి తాళ్లతో బంధించిన నేరస్తులు, గుంపులుగా పోలీసులు వస్తూ పోతూ ఉన్నారు. నేరమయ సమాజంలో వీళ్ల ప్రత్యేక నేరాలు ఏమిటో? నేరం లేని సమాజం కోసం వీళ్ల మధ్యకు చేరిన ఈ తొమ్మిది మంది తపన ఏమిటో? దానిని నేరభాషలో అభివర్ణించడమా అర్బన్ మావోయిజమంటే? ʹనక్సలైట్లే దేశభక్తులుʹ దగ్గరి నుండి ʹఅర్బన్ మావోయిస్టులʹ దాకా పరిణామం చెందిన రాజ్యభాషలో ఇంకా లోతైన అర్థమే ఇమిడి ఉంది. ʹనేరస్తుల స్థానంలో నిర్భయస్తులుంటారనిʹ డెబ్బైలలోనే గ్రహించిన వివి తనకు చాలా జైలు అనుభవం ఉంది కానీ ఇటువంటి అనుభవం లేదన్నాడు. ఈ అనుభవం మనుషులు ఎంత అమానవీయ లోతుల్లోకి దిగజారగలరు అన్నదానికి సంబంధించినది. అసలు అధికారంలోనే అమానవీయత ఉంటే ఇక శిక్షించే అధికారంలో, అదీ తమ ప్రత్యర్థులనకునేవారిపై కక్ష సాధించే అవకాశంలో ఇంకెంత అమానుషత్వం ఉంటుంది! ʹఇక్కడ ఎంత ఇన్హ్యూమెన్గా ఉంటారోʹ అంటున్నప్పుడు ఆ ముఖంలో భావాలు చదివితే ʹమానవీయ భాష అర్బన్ మావోయిజమైతే, దానిని ఎదుర్కునే రాజ్యభాష ఈ జైళ్లుʹ అంటున్నాయవి. దేశం నలుమూల నుండి అత్యంత మానవీయ బుద్ధిజీవులను ఎంచుకొని మరీ ఇక్కడ కేసులు పెట్టింది అందుకే.
దినచర్య గురించి చెప్పమన్న సందర్భంలో తనతో పాటు అదే బ్యారక్‌లో ఉంటున్న ఉరిశిక్షపడ్డ ఖైదీల గురించి, ముఖ్యంగా వారిలో కేవలం ముస్లింలుగా పుట్టినందువల్ల అల్‌ఖైదా ముద్ర వేయించుకున్న ఇద్దరని గురించి బాధపడ్డారు. అక్కడే వెర్నన్తో పాటు పుస్తకాల నేస్తం మరొకరు దొరికారు వివికి. పదిహేడు వందల పేజీల అమితావ్ ఘోష్ నవల ఐబిస్ ట్రయాలజీ గురించి, దార్వీష్ కవిత్వం గురించి చెప్తూ, ఉన్నట్లుండి ʹతెలుగులో మాట్లాడక ఎన్నాళ్లయిందోʹ అన్నారు. నా నెలరోజుల తమిళనాడు ప్రవాసం గుర్తుకొచ్చింది. ఇది ఇంకెంత సుదీర్ఘమైనది కదా అనుకోగానే మనసు మెలిపెట్టింది. ఈ తెలుగు కవి వేరే దేనికన్నా కూడా తెలుగుమీద బెంగపెట్టుకున్నారనిపించింది. నోట్బుక్కులెన్నో కవిత్వం, అనువాదాలు, అనుభూతులతో నింపేసారట. తెలుగు కావడం వల్ల జైలు సిబ్బందికి తెలిసిన భాష కాకపోవడం వల్ల, సెన్సార్ చేయలేక బైటికి పంపనివ్వడంలేదట. ఆ కొద్ది సమయంలో ఆయన చదువుతున్న, రాస్తున్న, ఆలోచిస్తున్న విషయాలను గురించి చెప్పినదాన్నిబట్టి జైల్లో కూడా తీరిక లేని పనులు కల్పించుకుంటున్నారని అర్థమైంది. సహచరుల్లో రాసినట్లు ʹఅక్షరాలన్నీ బారులు తీరిన మనుషుల వలె, ముట్టుకుంటే వాళ్ల కన్నీరు తుడుస్తున్నట్లుʹ అనుభూతి చెందుతున్నా ʹమనుషులకు పుస్తకాలు ప్రత్నామ్నాయం కాదుʹ కనక తెలుగులో స్పందించే మనుషుల కోసం చూస్తున్నారా!
కుటుంబసభ్యులకు ఇంగ్లీషులో ఉత్తరాలు రాస్తున్నారు. సహచరికి తెలియని ఇంగ్లీషు భాషలో రాయలేక అసలామెకు రాయడం మానేసానన్నారు. ఎనభైలలో జైలునుండి రాసిన ప్రేమకవిత్వం గుర్తొచ్చింది. సెన్సార్ అవుతున్న ప్రేమ గురించి బాధపడ్డ కవి, ఇప్పుడు ప్రేమను వ్యక్తీకరించే భాషకూడా చేతికందక విలవిల్లాడుతున్నాడా? అక్కడ నాగపూర్‌లో సాయిబాబాను కనీసం కుటుంబసభ్యులతో కూడా తెలుగు మాట్లాడనివ్వడం లేదని వసంత చెప్తుంది. అంతో ఇంతో పేరు, ముఖం ఉన్న తెలుగు గురించి ఇంతగా బాధపడుతున్నామే, ఆదివాసుల పరిస్థితి ఏమిటి అన్నారాయన వెంటనే. వాళ్ల భాష, సంస్కృతి, ఉనికి కూడా గల్లంతవుతున్నది కదా, అదింకెంత దుర్భరం అన్నారు. నిజమే, తమదైన భాష ద్వారానే కదా మనిషి పూర్తిగా వ్యక్తమయ్యేది. మానవ సహజ స్పందనలు బిగించిపెట్టిన సఫొకేషన్ అది.
ఎంత ఆశ్చర్యమంటే ఇక్కడ కూడా ఆయన ఆదివాసుల గురించి ఆలోచిస్తున్నారు. దేనికైనా మనుషులు ఎలా సిద్ధమవుతారు అంటే మానవ సమూహంలో తమను, తమ అనుభూతులను ఎక్కడ లొకేట్ చేసుకోవాలో అక్కడ చేసుకోవడం ద్వారా కదా అనిపించింది. తమను తాము ఎవరితో, ఎక్కడ ఐడెంటిఫై చేసుకుంటారు అన్నదే కదా ప్రశ్న. అర్బన్ మావోయిస్టులనబడే ఓ ఇద్దరు ప్రొఫెసర్లు తమను తాము జైల్లో ఎలా చూసుకుంటున్నారు? అందరికీ తెలిసిన సాయిబాబా సంగతి చెప్పనక్కర్లేదు. షోమాసేన్ ఎగువ మధ్యతరగతి సౌకర్యాల నుండి, ఇప్పుడు ఆర్థరైటిస్ వల్ల కింద కూర్చోలేక, ఎన్ని సార్లు విన్నవించినా కుర్చీ కూడా ఇవ్వని జైలు కాఠిన్యంలో శరీరం కృశించిపోయే స్థితి. వివి తర్వాత అనారోగ్యం కొట్టొచ్చినట్లు కనపడేది షోమాసేన్లోనే. సరిగ్గా రిటైర్ అవ్వడానికి కొద్ది రోజుల ముందు ఈ కేసు మూలంగా నాగపూర్ యూనివర్సిటీ ఆమెను సస్పెండ్ చేసింది. ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందేలా లేవు. అందరిలో చిన్నవాడు మహేశ్ రౌత్, టాటా ఇన్ట్సిట్యూట్‌లో చదివి ప్రైమ్ మినిస్టర్స్ రూరల్ డెవలప్మెంట్ ఫెలోషిప్ సాధించిన చురుకైన పరిశోధక విద్యార్థి, తన చదువును, మనసును, ఆచరణను కూడా ఆదివాసులకు లగ్నం చేసినందుకు ఇక్కడ ఇలా వీళ్ల మధ్యకు వచ్చి చేరాడు. తన కెరీర్‌నే, తన ఎదుగుదలనే చూసుకొని ఉంటే అవార్డులు, ప్రశంసలు పొంది ఉండేవాడు. ఇవాల యువత మునిగితేలుతున్న వాళ్లదైన ప్రపంచంలో ఆనందడోలికల్లో ఉండేవాడు. ఇప్పుడైనా నవ్వుతూ, తుళ్లుతూ ఆయనకా చింత ఏకోశానా లేనట్టున్నాడు. కొద్ది రోజుల క్రితమే మానవహక్కుల మీద డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిప్లమా కోర్సు చేయడానికి జైలు అధికారులు మోకాల్డితేే కోర్టులో సవాలు చేసి అనుమతి సాధించాడని తెలిసింది. ఇక్కడ రాయను వీలు కాదు కానీ సుధా భరద్వాజ్, సురేేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధావలే, వెర్నన్ గొంజాల్వెజ్, రోనా విల్సన్ అందరికి అందరూ స్వార్థం జయించిన అద్భుత మానవులు!
బంగ్లాదేశ్ ఫోటోగ్రాఫర్ షాహిదుల్ ఆలం ఇంటర్వ్యూ (మార్చ్ 17, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితమైంది) గురించి అపురూపంగా ప్రస్తావించిన వివి ఆయన జైలు అనుభవం నుండి చెప్పిన స్వేచ్ఛా భావనలోని తాత్వికతలో లీనమయ్యారా అనిపించింది. ఆ ఇంటర్యూలో షాహిదుల్ ఏమంటారంటే ʹఅభివద్ధికి కొలమానంగా మౌలిక అవసరాలు తీరడమనే విషయాన్నే తీసుకుంటే జైల్లో అవన్నీ తీరుతాయి. అయినా ఖైదులో ఉంచడం అన్నది తీవ్రమైన శిక్షగా పరిగణించబడుతోంది. మరి బయట ఎందుకని ʹఅభివద్ధిʹ కోసం స్వేచ్ఛను పణంగా పెట్టవచ్చనే సూక్తిని ఆమోదిస్తున్నాం? భయం సాధారణమైపోయి, పరాధీనతను గొప్ప సుగుణంగా ఎందుని చూస్తున్నాం?ʹ
నల్లగొండ విరసం సభల గురించి అడిగారు. ʹఇప్పుడు కావలసింది అర్బన్ మావోయిస్టులేʹ అనే శీర్షికతో నేను, పాణి కలిసి రాసిన పుస్తకం సభల్లో ఆవిష్కరించాం అంటే ʹనిజమా!ʹ అని కళ్లు పెద్దవి చేసి ʹపుస్తకం తెచ్చినవా?ʹ అనడిగారు. వెంటనే రమాసుందరి బ్యాగ్‌లో నుండి తీసి చూపించారు. పేజీలు తిరిగేసి చూసి ముచ్చటపడ్డారు. సాయిబాబా కవిత్వం చదివానని, పుస్తకం అద్భుతంగా తెచ్చారని మెచ్చుకోలుగా అన్నారు. ఇట్లా ఎవరైనా తెలుగు పుస్తకాలు తెస్తే అట్ట చూసి, పేజీలు పైపైన తిరగేసి సంతృప్తిపడుతుంటారని తెలిసి బాధనిపించింది. జైల్లోకి తెలుగు పుస్తకాలు అనుమతించరు కాబట్టి, ఆ కొద్ది నిమిషాలు తప్ప ఇక చూసే అవకాశం కూడా ఉండదు. ఏమేం పుస్తకాలొచ్చాయో అడిగితే చెబుతున్నాను. రమాసుందరి ఆ పుస్తకాన్ని సుధాభరద్వాజ్‌కు, షోమాసేన్కు చూపించి వాళ్లతో మాట కలిపారు. మిగిలినవాళ్లు కూడా చిన్నపిల్లల్లా ఆ పుస్తకంలో వాళ్ల బొమ్మలు చూసుకొని వివరాలు అడుగసాగారు. పుస్తక రచయితలు ఎవరు అని అడిగి తెలుసుకొని ʹఅయితే వాళ్లూ ఇక్కడికే వస్తారʹని సుధ చేసిన కామెంట్ విని అందరం నవ్వుకున్నాం.
ʹఆదివారాలో, సెలవురోజులో వచ్చాయంటే మా లాకప్ సమయం పెరిగిపోతుంది. మాధ్నాహ్నానికి ముందే మమ్మల్ని లాకప్‌లో పడేసి వెళ్లిపోతారుʹ అని వివి చెప్పినప్పటినుండీ సెలవురోజు వస్తే ఆయన, ఆయన సహచర ఖైదీలే గుర్తొస్తున్నారు. ఎంత తలకిందుల ప్రపంచం! ఒంటరి సమయాలన్నీ ఆయన ఏమాలోచిస్తుంటారు? ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన రాస్తున్న కవిత్వం గురించే కాదు, ఆ ఎత్తైన గోడల మధ్య ఎంత విశాల ప్రపంచం గురించి ఆలోచిస్తున్నరో విని ఆశ్చర్యపోయాను. నిజానికి అక్కడున్న నిమిషాలన్నీ ఇలాంటి ఆశ్చర్యాలు, తడితడి ఉద్వేగాలతో నిండిపోయాయి. అక్కడ కూర్చొని ఆయన ఇజ్రాయల్ పూర్తిగా దురాక్రమించేసిన గోలన్ హైట్స్ గురించి, పాదాల కింద నేలకోల్పోతున్న పాలస్తీనియన్ల గురించి, ప్రపంచంలో ఎవరికీ పట్టని రోహింగ్యాల గురించి, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఎ కూడా కోల్పోతున్న కశ్మీరీల గురించి, పౌరుల జాబితాలో తాజాగా ముస్లింలతో పాటు స్థానం కోల్పోనున్న పార్శీలు, క్రైస్తవుల గురించి (పౌరసత్వ సవరణ బిల్లు), అడవిని ఖాళీ చేయమని ఉన్నత న్యాయస్థానాలే తీర్పులిస్తుంటే నిలబడి పోరాడుతున్న ఆదివాసీల గురించి ఆలోచిస్తున్నారు. వీళ్లంతా మనలాంటివాళ్ల సంఘీభావం కోరుతున్నారని చెప్పారు.
భోజనవిరామ సమయమై ఇక మూడున్నర దాకా కోర్టు ఉండదని తెలిసాక అందర్నీ ఎస్కార్టు వాహనంలోకి తీసుకెళ్లారు. వాళ్లకేమైనా తినడానికి పట్టుకొద్దామని బయలుదేరి, తెలియని ఊర్లో ఉరుకులు పరుగులు పెట్టి రమాసుందరి తీసుకొచ్చినవి ఆంక్షల మధ్య వాళ్లను చేరనే లేదు. బెయిల్ వినతిని తిరస్కరించమని ఆరోజు ప్రాసిక్యూషన్ చేసిన వాదనను కోర్టు హాల్లో ముద్దాయిలకు ఎదురుగా కూర్చొని వినే అవకాశం దొరికింది. ఇంగ్లీషు, హిందీ, మరాఠీ మాటలు కలగలిసిన ప్రవాహంలో ఎల్గార్ పరిషత్ పేరు మీద దళితుల్ని సమీకరించడం అనే ʹనేరాన్నిʹ గురించి పదేపదే ప్రస్తావించడం విన్నాం. ʹమావోయిస్టు లేఖలుʹ చదివి వినిపిస్తుంటే రిపబ్లిక్ టివి చూస్తున్నట్లుగా ఉంది. రమాసుందరి ʹకోర్టుʹ సినిమాను చాలాసార్లు గుర్తుచేసారు. వివిని ఉద్దేశించి ʹబడా నేతాʹ అంటున్నప్పుడు ఆయనకేసి చూస్తే నవ్వుతున్నారు. ఆయనే కాదు, ఆ తొమ్మిది మంది పేర్లు ప్రస్తావనకొచ్చినప్పుడల్లా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చిరునవ్వులు చిందిస్తుంటే వారిలో ఎంత తొణకనితనం, నిర్భీతి, ధిక్కారం కనిపించాయో అంతగా కసి, ద్వేషం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొంతులో వినిపించి ఆశ్చర్యపోయాం.
ఈ కేసులో మొదట అయిదుగురి మీద దాఖలు చేసిన 5,600 పేజీల చార్జ్‌షీట్‌తో పాటు, వివి తదితరులను చేర్చాక కలిపిన 1800 పేజీల సప్లిమెంట్ మొత్తం ఒక పెద్ద సంచీలో జడ్జిగారి ముందు ఉంది. అందులో నుండి ఒక్కో లావుపాటి బౌండ్ బుక్ తీసి పిపి చదివి వినిసిస్తున్నది. ఆమె ఎడమచేయి వెనక పెట్టుకొని, కుడిచేతి చూపుడువేలు చూపిస్తూ జడ్జి ఎదురుగా మాట్లాడుతున్న తీరు బహుషా ఏ సినిమాలోనూ చూసి ఉండం. రెప్పవేయడం కూడా మర్చిపోయి ఆమెను తదేకంగా చూస్తున్న జడ్జి అప్పుడప్పుడు ఓరగా కుడివైపు బోనులో కూర్చున్న ముద్దాయిలను చూస్తున్నాడు. మూడు రోజుల పాటు ఆమె అదే భంగిమలో చెప్పిందే చెబుతున్న వైనం వరుసగా మేమక్కడున్న రెండు రోజులూ చూసాం. అయితే అందులో మొదటిసారి మేం ప్రత్యక్షంగా వినగలిగిన కొత్త సంగతి, భీమా కోరేగావ్ అల్లర్లలో నిందితులుగా సంఘపరివార్ నాయకులు శంభాజీ భిడే, మిలింద్ ఎక్బొటేల పేర్లు డిఫెన్స్ వారు తెస్తున్నారని, నిజానికి వారికి అందులో ఏ ప్రమేయం లేదని, ఆ ఆరోపణలెప్పుడో కొట్టుడుపోయాయని, కేసు తప్పుదారి పట్టించడానికే వారిని ఇందులోకి పదేపదే లాగుతున్నారని చెప్పింది. నిజానికి భీమా కోరేగావ్ అల్లర్ల మీద మొదట దాఖలైన ఎఫ్.ఐ.ఆర్. ఆ ఇద్దరి మీదే. అచ్చంగా ఆ సీన్లో మాకు పతంజలి, రావిశాస్త్రి గుర్తొచ్చారు. రాయగలిగితే వాళ్ల కన్నా గొప్పగా సృష్టించగల కల్పనా సాహిత్యానికి పనికొచ్చే డ్రామా, మలుపులు, మెరుపులు ఎన్నో ఉన్నాయిక్కడ. ఇది భీమా కోరేగావ్ కుట్ర మాత్రమే కాదని పెద్ద ఎత్తున దేశాన్ని అస్థిరపరిచేందుకు మావోయిస్టులు పన్నుతున్న కుట్ర అని తేల్చేయడంతో ఊరుకోక తన వాదన ఇంకా ముగియలేదంటే మరుసటి రోజు కూడా ఆమెకు సమయమిస్తూ వాయిదా వేసారు జడ్జి గారు.
... ... ...
అంతదూరం వెళ్లాక భీమాకోరేగాం చూడకుండా ఎలా వచ్చేది? అందుకని రెండురోజులుండేలా ముందే ఏర్పాటు చేసుకున్నాం. వివి కూడా అడిగారు, భీమా కోరేగాం వెళుతున్నారా అని. అప్పటికే కోర్టులో ఆయనన్ని చూడవస్తున్న వాళ్లు భీమా కోరేగాంను, ఫూలేవాడను కూడా దర్శించడం అలవాటుగా మారినట్టుంది. సాయంకాలం తిరిగి జైలుకు తీసుకెళుతున్నప్పుడు రేపు కూడా వస్తున్నారు కదా అనడిగి చేతులు కలిపి వీడ్కోలు చెప్పారు. ఉదయాన్నే భద్రతా పర్యవేక్షణలో ఉన్న కోరేగాం స్థూపాన్ని చూసి, అక్కడి మృతవీరుల పేర్లు ముట్టుకుందామని దగ్గరిపోతుంటే తాకకూడదని పోలీసాయన వారించాడు. మరాఠాలు దీన్ని పడగొట్టేస్తామని ప్రకటించారట. ఆ గొడవ జరిగినప్పటి నుండి బందోబస్తు ఏర్పాటు చేసారని చెప్పాడు. మేం ధ్వంసం చేసేవాళ్లలా ఉన్నామా, ప్రేమించేవాళ్లలా ఉన్నామా అన్నారు రమాసుందరి తెలుగులోనే. వాళ్ల బాధవాళ్లది! ఫూలే దంపతులు నివసించిన ఇంటికి వెళుతూ దారిలో మా తెలుగు డ్రైవర్ చెబితే ఆఘాఖాన్ ప్యాలెస్‌లోకి వెళ్లివచ్చాం. అనుకోకుండా తటస్థపడిన ఆ హైదరాబాదీ మాకు మిత్రుడైపోయాడు. గాంధీ దంపతులు రెండేళ్ల పాటు నివసించిన భవనాన్ని చూసి, ఫూలే ఇంటిని చూస్తున్నప్పుడు అక్కడి కృత్రిమత్వం, ఇక్కడి సజీవతత్వం మా విశ్వాసాల వల్లనా, భౌతిక రూపం వల్లనా అంటే రెండూ అనిపించాయి. అనుకోకుండా ఆరోజు జ్యోతిరావు ఫూలే జయంతి కూడా. సందర్శకుల హడావిడి మధ్య సావిత్రిబాయి, జ్యోతిరావు ఫూలేలకు జోహార్లర్పించి అనుకున్న సమయానికంతా కోర్టుహాలు వద్ద యధాస్థానంలో నిరీక్షిస్తున్నాం. రెండున్నర గంటల నిరీక్షణ తర్వాత వివి వాళ్లను కోర్టుకు తీరుకొచ్చారుగానీ లాకప్లోనో, ఎస్కార్టు వాహనంలోనో ఉంచారని, మధ్యాహ్నం సరిగ్గా హియరింగ్ కోసం తీసుకొస్తారని లాయర్ వచ్చి చెప్పాడు. ఫ్యాను కూడా లేని, దుర్వాసన కొట్టే ఇరుకు లాకప్ గది గురించి వివి చెప్పింది గుర్తుకొచ్చింది.
ఇక చేసేదేంలేక భోంచేసి లగేజ్ సర్దుకొని వచ్చేద్దామని వెళ్లిపోయాం. తిరిగొచ్చి మూడున్నర నుండి కోర్టు హాల్లో వారిని మౌనంగా చూస్తూ అదే అరిగిపోయిన వాదన వింటూ కూర్చున్నాం. వివికి చూపిద్దామని విరసం అచ్చువేయబోతున్న ఆయన కవిత్వ విమర్శ పుస్తకం కవర్ పేజీ ప్రింటవుట్, హేమగారు కెసిఆర్‌కు రాసిన బహిరంగలేఖ ఇంగ్లీషు, తెలుగుకాపీలు ఏం చేయాలో తెలీక లాయర్‌కు ఇచ్చేసాను. నేను భ్రమపడ్డానో ఏమోగానీ ఆ రోజు వివి ముఖం తేటగా కనిపించింది. నిజానికి ఆ తర్వాత కోర్టు ముగిసాక ʹరాత్రి నిద్రపోయారాʹ అనడిగితే, ʹఅస్సలు లేదని, రాత్రంతా రాస్తూ కూర్చున్నాననిʹ చెప్పారు. ముందురోజు ఆయనతో మాట్లాడాక నన్నేదో కవితా లోకం ఆవరించినట్లుంది. ఆ రోజూ పిపి వాదన ముగియలేదు. మరొక రోజు సమయం అడిగితే సమ్మతించి వాయిదా వేసారు న్యాయమూర్తి. ముందుగా సుధను, షోమాను తీసుకెళ్లిపోతుంటే ఒక్క నిమిషం వాళ్లకు దగ్గరగా వెళ్లి చివరిసారి పలకరించాం.
ఎస్కార్టు సిబ్బంది మధ్య వివికి దగ్గరగా నడుస్తూ రెండు మూడు నిమిషాలు మాట్లాడి వీడ్కోలు చెబుతున్నప్పుడు మళ్లీ కలిసినప్పటి ఉద్విగ్నత. అప్పుడు కూడా ఆయన ఒక ఇంగ్లీష్ దిన పత్రికలో చదివిన ఆస్ట్రేలియన్ ఆదివాసీ గాయిని గురించి చెప్పి తప్పకుండా చదువు అన్నారు. ఒకానొక కాలంలో తెల్లవాళ్ల చేత దొంగిలించబడిన తరానికి చెందిన ఆ కళాకారిణి తన మూలాలను వెతుక్కుంటుందట. (తర్వాత గూగుల్‌లో వెతికి పట్టుకుంటే అది ʹద మిస్సింగ్ సాంగ్స్ʹ శీర్షికన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ʹఐ న్యూస్ʹ పేజీలో వచ్చిన ఆర్టికల్ అని అర్థమైంది. చీతమ్ అనే గాయిని వెస్టన్ క్లాసికల్ సంగీతాన్ని ఆదివాసీ తెగల భాషల్లో మేళవించి ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది. నిజంగా అదొక అద్భుతం) ʹఏమిటీయన లోకంʹ అనుకునేకొద్దీ దు:ఖం వస్తోంది. ఇట్లాంటి మనుషులను ప్రమాదకర వ్యక్తులుగా ప్రచారం చేస్తున్న రాజ్యం మీద కోపం వస్తోంది. ʹఎప్పుడొస్తారు సార్, మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాంʹ అని రెండో సారి అడిగాను. ʹచూసినవు కదాʹ అని నవ్వారు. ముందు రోజు ఇదే ప్రశ్నకు ʹనేను రావడమేమో గానీ మీరూ ఇక్కడికే వస్తారంటే అందరం నవ్వాం.ʹ కానీ అది జోక్ కాదు. ఇవాలున్న స్థితి. సాయిబాబాతో సహా పది మందీ దీనికి సిద్ధపడ్డారు. వివి గుర్తుచేసిన బంగ్లాదేశ్ ఫొటోగ్రాఫర్ షాహిదుల్ ఆలం చెప్పినట్లు ʹభయం అలవాటయిపోయి, పరాధీనత సుగుణమైపోయిన స్థితిని ఎందుకొప్పుకోవాలʹన్నదే వారి దీక్ష. బైట మనవాళ్లకు మీమాటగా ఏమైనా చెప్పమంటారా అని అడిగినప్పుడు తను బాగున్నానని, ఇంత ఎండల్లో తనకోసం ప్రయాసపడి రానక్కర్లేదని అన్నారు. అది కాదు కానీ మీ సందేశం అడుగుతున్నాను అంటే మీకన్నీ తెలుసు కదా అంటూనే, ఆయన చెప్పిన మాటలు బహుషా జీవితాంతం ప్రతిధ్వనిస్తుంటాయి. ʹʹజైల్లో తల మీద కప్పు, శత్రుశిబిరంలో వాళ్ళ భద్రత కోసం ఇచ్చే భద్రత, రెండు పూటలా తిండి, ఇటువంటి మౌలిక అవసరాలు తీరుతున్నాయి. ఈ మౌలిక అవసరాలేవీ తీరకపోగా జల్ జంగల్ జమీన్ ఇజ్జత్లు అపహరించబడిన వాళ్లు, అంటరానివాళ్లుగా వెలివాడల్లో జీవిస్తున్నవాళ్లు, రెండెద్దులతో పాటు మూడో ఎద్దుగా కాడి మోస్తున్నవాళ్లు జీవితాలతో పాటు నోరు తెరిచి మాట్లాడే మౌలిక హక్కును కూడా కోల్పోతున్నారు. అటువంటి వాళ్ల గురించి, నిషేధించబడిన జీవితాలను, పోరాటాలను గురించి మాట్లాడే స్వేచ్ఛను మేం కోల్పోయాం. అది బాధాకరమేగాని, మా గురించి మాట్లాడే స్నేహితులు ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోతే ఆ మాత్రం స్వేచ్ఛ త్యాగం చేసిన తృప్తి మిగులుతుంది.ʹʹ
వెళ్లిపోయేముందు ఆయన నన్ను దగ్గరికి తీసుకొంటే ʹమళ్లీ ఎప్పుడు చూస్తానో కదాʹ అన్న దిగులు తడిపేసింది. ఇనుప జాలీతో కిటికీలు కూడా కప్పేసిన పొడవాటి వాహనంకేసిి నడుస్తూ ఆయన చేయి ఊపాడు. వెన్నెల నవ్వుల మధ్య ఆ చేయి గట్టిగా బిగుసుకుంది.
Type in English and Press Space to Convert in Telugu |
సోషలిజమే ప్రత్యామ్నాయం, నక్సల్బరీయే భారత విప్లవ పంథా20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణులన్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన లక్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ... |
నేనెందుకు రాస్తున్నాను?
బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక....... |
పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలుసంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విరసం సాహిత్య పాఠశాల కీనోట్)..... |
ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శంఅసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ ....... |
ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్... |
సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹమన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి ....... |
ఇది మనిషి మీద యుద్ధం సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి... |
మంద్రస్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో మంద్రస్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్యదర్శి పి. వరలక్ష్మి కీనోట్... |
ఉనా స్వాతంత్ర నినాదంఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ... |
ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకైప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |