సాహితీ కృషీవలుడు టి. జి. ఆర్‌. ప్రసాద్‌

| సంభాషణ

సాహితీ కృషీవలుడు టి. జి. ఆర్‌. ప్రసాద్‌

- డా. వెల్దండి శ్రీధర్‌ | 17.05.2019 09:46:23am

వ్యవసాయదారుడిలాగే కొంత మంది నిత్యం ఏదో ఒక సాహితీ సేవ చేస్తూనే ఏ మాత్రం గుర్తింపు, ప్రచారం కోరుకోరు అలాంటి విశిష్ట వ్యక్తిత్వంగల సాహితీవేత్త డా. టి. జి. ఆర్‌. ప్రసాద్‌. దాదాపు అయిదు దశాబ్దాలుగా సాహితీరంగంలో ఉంటూ బాలల కథకుడిగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా, కవిగా బహుముఖాలుగా సాహితీసేవ చేసిన డా. టి. జి. ఆర్‌. ప్రసాద్‌ లివర్‌, రెండు కిడ్నీలు చెడిపోయి చికిత్స పొందుతూ 6 మే 2019న తుదిశ్వాస విడిచారు. ఇది తెలుగు సాహితీ రంగానికి ఒక తీరని లోటు.

బాలల కథకుడిగా సాహితీరంగంలో అడుగుపెట్టిన ప్రసాద్‌గారు 1980 - 1990 మధ్య సుమారు 510 బాలల కథలను రాసి ఒకనాటి పసి హృదయాలపైన తనదైన ముద్రవేశారు. ఈ కథలన్నీ చదివితే ఇవి నిజంగా పిల్లల కోసం రాసిన కథలేనా? అనే సందేహం వస్తుంది. ఎందుకంటే వాటిల్లో ఆయన చర్చించిన విషయాలు అంత గంభీరమైనవి. ఒక రకమైన మంచి కోసం తాపత్రయపడేవి. ఈ కథలన్నీ చందమామ, బాలమిత్ర పత్రికల్లో ముద్రింపబడ్డాయి. ఈ 510 కథల్లో 88 భేతాళ కథలు. సాధారణ పిల్లల కథలు రాయడం కన్నా భేతాళ కథలు రాయడం ఒకింత కష్టమైన పని. విపరీతమైన సాధన ద్వారా మాత్రమే సాధ్యపడే ఒక కళ కూడా. వీటన్నింటి నిండా ప్రసాద్‌గారి బహుభాషా పరిజ్ఞానంతో పాటు సమాజాభివృద్ధిపట్ల వారికిగల తపన అర్థం అవుతుంది. అంతేకాదు వారు ప్రదర్శించిన వస్తు వైవిధ్యం, శిల్ప నైపుణ్యం భావి తరాలకు ఆదర్శనీయం. ఇన్నిన్ని బాల కథలు రాయాలంటే రచయితకు ఎంతో సృజనాత్మకత ఉండి తీరాలి. ఒక కథలో వచ్చిన వస్తువు మరో కథలో రాకూడదు. ఒక కథలో వాడుకున్న శిల్పాన్ని మరో కథలో వాడుకోకూడదు. ఇది చాలా పెద్ద సవాలు. ఇన్ని కథలు రాయడం అటుంచి వాటికి పేర్లు పెట్టడం కూడా చాలా పెద్ద సవాలే. ఇందుకు రచయితకు చాలా శ్రమ అవసరమవుతుంది. ఎంతో గొప్ప చట్రంతో బాలల కథలు రాసి మెప్పించిన ప్రసాద్‌గారు పెద్దల కథలు/సీరియస్‌ కథలు ఎందుకు రాయలేదో అర్థం కాదు. అలా రాసి ఉంటే కచ్చితంగా తెలుగు కథా సాహిత్యానికి గొప్ప మేలు జరిగేది. ప్రసాద్‌గారి బాలల కథలపైన ఇప్పటికే రెండు ఎం. ఫిల్‌లు, రెండు పిహెచ్‌. డిలు వచ్చాయి. అయితే వీరు రాసిన కథలన్నీ ఏదైనా ప్రచురణ సంస్థ ముందుకు వచ్చి ముద్రిస్తే అపారమైన బాలసాహిత్యాన్ని అందుబాటులోకి తెచ్చినవారు అవుతారు. కొన్ని కథలనైనా కూర్చి ఒక పుస్తకంగా తేవాలనే ఆలోచన వారికి ఉండేది కాని ఆ కార్యం నెరవేరకుండానే వారు కీర్తిశేషులు కావడం దురదృష్టకరం. వీరు రాసిన ʹకళ - వ్యాపారంʹ కథను మహారాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు కొన్నేండ్లపాటు పాఠ్యాంశంగా పెట్టింది.

ఒక వైపు బాలల కథలు రాస్తూనే విమర్శనా రంగంలో అడుగుపెట్టారు ప్రసాద్‌గారు. 1979లో వీరు పరిశోధక విద్యార్థిగా ఉన్న కాలంలోనే ʹఆధునిక సాహిత్య పరిశోధన - విద్యార్థుల సమస్యలుʹ అనే వ్యాసం రాసి సంచలనం సృష్టించారు. విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనా చర్చంతా ʹహంబగ్‌ʹ అని తేల్చిపారేశారు. పరిశోధనలో ʹదృక్పథ రాహిత్యంʹ కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని విమర్శించారు. తరువాత తన దృష్టిని కథా విమర్శ మీదికి మళ్లించి అనేక కథా విమర్శా వ్యాసాలు రాశారు. ʹపుట్టిల్లుʹ కథా సంపుటి ఆధారంగా డా|| కే. వి. రమణరావు కథలు - శిల్ప పరిశీలనʹ అనే పుస్తకమే వెలువరించారు. ఇంకా రాసాని కథలపైనా, బి. ఎస్‌. రాములు కథలపైనా, కరుణకుమార కథలపైనా, పాణి రాసిన ʹఇన్‌మోషన్‌ʹ కథపైనా, బాల కథా శిల్పంపైనా, ముస్లిం అస్తిత్వ కథపైనా, కథల్లోని కవిత్వంపైనా విలువైన వ్యాసాలు రాసి తెలుగు కథా విమర్శ ఎలా ఉండాలో చూపెట్టారు. ఇవన్నీ తెలుగు కథా విమర్శకు గొప్ప చేర్పుగా భావించాలి.

కథలు, విమర్శలు రాసే వారు కవులుగా రాణించడం చాలా కష్టం. దీనికి మినహాయింపు ప్రసాద్‌గారు. వీరు తన నలభైలలో మంచి భావనా ప్రపంచంలో విహరిస్తూ ఎన్నో కవితల్ని రాశారు. వీటన్నింటినీ ʹఆగష్టు లవ్‌ʹ పేర పుస్తకంగా తేవాలని అనుకున్నారు కాని వారి అనారోగ్యం కారణంగా అది సాధ్యపడలేదు. ఈ కవితల నిండా గొప్ప ప్రేమ పరుచుకొని ఉండడం గమనార్హం. ప్రేమలో మునిగిపోయి, ప్రేమరాహిత్యంతో కొట్టుమిట్టాడి ఒక ప్రేమ దాహంలోంచి రాసుకున్న కవిత్వం ఇదంతా.

ʹʹనా అశ్రువుల్ని
సమీక్షించే
వ్యాఖ్యాతలెవరూ లేరు
నేటి నా నిరంతర
చింతనలకు
నిష్కృతి లేదు
మలుపు తిరిగిన కాలాన్ని
అధిగమించకపోతే
బ్రతుకు
చమురు లేని దీపం ముందు
గీసి పారేసిన
అగ్గిపుల్లవుతుందిʹʹ అంటాడు.

ప్రతి మనిషి గుండె నిండా లోలోపల ఎంతో దు:ఖం దాగి ఉంటుంది. అదంతా కవిత్వమై బయటికి రాకపోవచ్చు. వచ్చిన దు:ఖ భాగాన్ని మనం అర్థం చేసుకోకపోవచ్చు. ఎవరైనా జరిగిన దానికి బాధ పడుతూ ఉన్నచోటే నిల్చుండిపోవడానికి గాని, మిన్ను విరిగి మీదపడిందని అక్కడే ఆగిపోవడానికిగాని వీలు లేదు. చీకటి పొరల్ని తొలగించుకొని, కొత్తదారుల్ని తొలుచుకుంటూ మరీ ముందుకు సాగిపోవాల్సిందే. లేదంటే జీవితం ఊదిపారేసిన బెలూనైపోతుంది. నాటకమంతా అయిపోయి చాపచుట్టేసిన తరువాత ఇంకా అనుభూతులెందుకు? అనుభవాలెందుకు? జీవితం ఫలించని ప్రయత్నంగా మిగిలిపోతుంది.

ʹʹఆమె చెవితో విని
ఆమె కన్నుల్లోంచి చూసి
నేను మరణించాక
ఆమె నా రచనంతా
ఆక్రమించుకుందిʹʹ అంటాడు మరోచోట.

మనల్ని మనం కోల్పోయి ఈ ప్రపంచాన్ని ఆమె చూపులతో చూసి, ఆమె చెవులతో విని, ఆమె హృదయంతో అనుభూతించి, ఆమె చేతులతోనే ముట్టుకున్నప్పుడు క్రమంగా మనం కనుమరుగైపోతాం. అప్పుడు మనం సృష్టించిన ప్రతి సృష్టిలో ఆమె ముద్రే కనిపిస్తుంది. కవిత్వమైతే ఆమె చేయిపట్టి సృజింపజేస్తుంది. అందుకే ఆ పదాలకు అంతటి పరిమళం. అంతటి నాజూకుతనం. అంతటి ఉదాత్తత. మొత్తంగా మనమొక కవిగా రాణిస్తున్నామంటే దాని వెనక ఆమె అదృశ్య హస్తముంటుంది. అట్లా కళాశాలలో ప్రవేశించిన ప్రతి మనసుకు ఇది అనుభవైకవేద్యం. ʹచిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న ఓనమాలు ఇప్పుడు ఆమె కోసం రాయడం నిజంగా పేరడీయేʹ అంటాడు.

కథకుడిగా, కవిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా ఎంతో సాహిత్యసేవ చేసిన ప్రసాద్‌గారు ఇంకొంత సాహిత్య సేవ చేయగలిగిన చేవ ఉన్న దశలోనే కాలగర్భంలో కలిసిపోవడం విషాదం. వీరు 1957 డిసెంబర్‌ 4న కడపలో శకుంతమ్మ, సుబ్బరామయ్య దంపతులకు పుట్టారు. ప్రాథమిక విద్య కడపలోనే పూర్తిచేసి 1973 - 76లో కర్నూలులోని సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎం.ఏ., ఎం. ఫిల్‌., పిహెచ్‌. డి. పట్టాలు పొందారు. కొడవటిగంటి కుటుంబరావు ʹచదువుʹ నవల మీద వీరు చేసిన ఎం. ఫిల్‌ పరిశోధన ఇప్పటికీ సాధికారికమైనదే. జాపపద సాహిత్యం మీద మమకారంతో ʹర్నూలు జిల్లా జానపద గేయాలుʹ మీద పిహెచ్‌. డి. చేశారు. దీన్ని కూడా ముద్రణ రూపంలోకి తీసుకొస్తే ఎంతో విలువైన గేయసాహిత్యం అందుబాటులోకి వస్తుంది.

వల్లంపాటి వెంకటసుబ్బయ్య తరువాత తెలుగు కథా శిల్పంపై అంత అవగాహన ఉన్నవారు చాలా అరుదుగా కనిపిస్తారు. ప్రసాద్‌గారికి కథ కన్నా కథా శిల్పంపైన దృష్టి ఎక్కువ. అందుకే ఉద్యోగ విరమణ పొందిన తరువాత బరంపురం యూనివర్సిటీలో ʹతెలుగు కథాశిల్పంʹ పైన డి. లిట్‌. చేయడానికి పూనుకున్నారు. కాని అది పూర్తికాకుండానే కాలం వారిని మనకు మిగిల్చకుండా తీసుకుపోవడం తీరని లోటు. నిత్య సాహిత్య శ్రామికులు, మంచి తనానికి కానుగు చెట్టులాంటి వారు డా. టి. జి. ఆర్‌. ప్రసాద్‌గారు. వారికి నా అశ్రు నివాళి.

No. of visitors : 301
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార భాస్వరం ʹఅవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియాʹ

వెల్దండి శ్రీధర్‌ | 16.07.2017 08:31:51am

ఈ సంపుటిలోని ప్రతి కథ ఆధిపత్య వర్గాల పునాదులను కదిలించే కథ. ఇప్పుడు రెండే కులాలు ఒకటి ధనిక, మరొకటి పేద అని అనుకుంటాం కాని తెర వెనక కులం పోషించే పాత్రను........
...ఇంకా చదవండి

దు:ఖం చేత దు:ఖం కొరకు దు:ఖం వలన

డా. వెల్దండి శ్రీధర్‌ | 01.10.2018 05:23:40pm

రోజువారి జీవితం చుట్టూ ఇంత ముళ్లకంచె పర్చుకొని ఉందా అని ఆశ్చర్యపోతాం. చాలా సార్లు ఆ వాక్యాల్లో చిక్కుకుపోయి బయటకు రాలేం. ఎందుకంటే ఒక్కో పదం ఎంతో లోతుకు......
...ఇంకా చదవండి

వేయి అంచుల ʹజీవితంʹ

డా. వెల్దండి శ్రీధర్‌ | 21.12.2018 01:31:51am

ప్లవోద్యమానికి ఎంతో మంది తల్లులు తమ బిడ్డల్ని ధార పోశారు. అన్నల్లో కల్సిన తన కొడుకు సంక్రాంతి పండుగకు వస్తడని ప్రతి సంక్రాంతికి కండ్లు కాయలు కాచేలా ఎదురు......
...ఇంకా చదవండి

ముస్లిం జీవితాల వాస్తవిక కథలు

డా. వెల్దండి శ్రీధర్‌ | 20.01.2019 11:40:09am

ఈ దేశంలో బహుజనులంతా అయిదు సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వేసే మరయంత్రాల్లానే మిగిలిపోతున్నారు తప్పితే పూర్తి స్థాయిలో రాజ్యాధికారంలోకి రావడానికి ఇంకా చాలా రోజుల....
...ఇంకా చదవండి

దళిత దృక్పథం, ధిక్కార స్వరం

డాక్టర్‌ వెల్దండి శ్రీధర్‌ | 06.12.2018 12:09:20am

ఒక ఆవేదన, ఒక దు:ఖం, ఒక ఆగ్రహం, ఒక ధిక్కారస్వరం, ఒక మెలకువ, ఒక చైతన్యం, ఒక సమ సమాజ అవగాహన, ఒక దళిత దకృథం.. ఇలా ఎన్నింటినో మన రక్తంలోకి, మన మెదడులోకి ఒంపి......
...ఇంకా చదవండి

సమాజ నగ్న చిత్రం ʹమట్టిరంగు బొమ్మలుʹ

డా. వెల్దండి శ్రీధర్‌ | 04.01.2019 10:50:11pm

ఏదో గాయపు సలపరాన్ని గుండె నిండా నింపుకొని కవిత్వమై కదిలిపోతున్నప్పుడు ఆయన కలం నుండి అనేక ఇమేజరీలు దొర్లిపోతాయి. ʹఊపిరి తీరంʹ, ʹనిప్పుటడుగులుʹ, ʹచీకటి... ...
...ఇంకా చదవండి

పాతబడిన దేహపు రొద ʹవృద్ధోపనిషత్‌ʹ

డాక్టర్‌ వెల్దండి శ్రీధర్‌ | 16.06.2019 10:11:38am

ప్రేయసి పాతబడుతుందేమో కాని ప్రేమ పాతబడదు. యవ్వనపు తొలివాకిట్లో నిలబడి నచ్చిన సుందరిని ఎదనిండా నింపుకున్నప్పుడు ఏదో కొత్త ......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •