జైలు స్వ‌ప్నాలు

| సాహిత్యం | స‌మీక్ష‌లు

జైలు స్వ‌ప్నాలు

- శివ‌రాత్రి సుధాక‌ర్‌ | 17.05.2019 10:22:45am

ఇవి జైలు స్వ‌ప్నాలు. ఒంట‌రి రాత్రుల్లో ఖైదీ క‌ల‌గ‌న్న స్వ‌ప్నాలు. చీక‌టి రోజుల్లో అల్లుకున్న అక్ష‌రాలు. నిర్బంధం నీడ‌న స్వేచ్ఛ‌ను క‌ల‌గ‌న్న మ‌నిషి గుండె నెత్తురులోంచి ఒలికిన అక్ష‌రాలు. అండా సెల్ స్వ‌ప్నాలు. సంకెళ్ల చేతులు రాసిన సుదీర్ఘ నిద్ర‌లేని రాత్రుల వెన్నెల దీపాలు. క‌న్నీళ్ల‌లో త‌డిసిన భావాలు. జైలు గోడ‌ల న‌డుమ జంగ్ సైర‌నూదుతున్న అక్ష‌రాలు. బ‌తుకే యుద్ధ‌రంగ‌మైన జ‌నంతో సంభాష‌ణ ఇది.

కామ్రేడ్ సాయిబాబా. నూత‌న మానవ ఆవిష్కారం కోసం స‌మాజాన్ని ప్రేమించిన మ‌నిషి. ప్ర‌జ‌ల మ‌నిషి. అత‌ని రాత‌, మాట‌, ఆచ‌ర‌ణ‌ రాజ్యానికి కంట‌గింప‌యింది. స్వేచ్ఛ‌ను క‌ల‌గ‌నే మ‌నిషిని బందించింది రాజ్యం. స్వేచ్ఛాగానాలపై ఆంక్ష‌లు పెట్టింది. జైలు గోడ‌ల న‌డుమ ఏయే ఉద్వేగాల‌కు లోన‌వుతున్న‌డో. మ‌న‌సులో ఎంత సంఘ‌ర్ష‌ణ ఉన్న‌దో. సాయిలోని కాల్ప‌నిక‌త అంతా వాస్త‌వంతో క‌ల‌గ‌లిసి క‌విత్వ‌మైంది. ఒంట‌రి రాత్రుల్లో లోలోప‌ల వెల్లువెత్తిన స‌మస్త ఉద్వేగాల‌ను బ‌య‌టి ప్ర‌పంచంతో హృద‌య‌చాల‌నం చేస్తున్న‌డు. ʹʹమ‌నిషిని బంధించ‌గ‌ల‌రేమో గానీ, గుండె నెత్తురులో పోటెత్తే స్వప్నాల మాటేమిటి?ʹʹ అని అడుగుతున్న‌బందీ గొంతుక ఇది.

అత‌డు మృత్యువు గురించి ఆలోచిస్తున్నాడు. జీవితం గురించీ మ‌థ‌న‌ప‌డుతున్నాడు. జీవిత ఖైదు కంటే మ‌ర‌ణ శిక్షే మేలంటున్నాడు. అట్లాంటి దుర్భ‌ర జైలు జీవితాన్ని మ‌న‌కు దుఃఖంతో నిండిన స్వ‌రంతో చెప్తున్న భావాలివి.
త‌న జీవిత స‌హ‌చ‌రి వ‌సంత‌కు రాసిన లేఖ‌లో అత‌నిలోని ఆశావ‌హ దృక్ప‌థం, జీవితేచ్ఛ అర్థ‌మ‌వుతుంది.

ʹʹనేను చ‌నిపోవ‌డానికి నిరాక‌రించిన‌పుడు
నా జీవితంతో విసుగుచెంది
న‌ను బంధించిన వాళ్లు న‌న్ను వ‌దిలేశారు
నేను బ‌య‌ట‌కు న‌డిచాను....ʹʹ అంటున్నాడు.

ʹʹమ‌ర‌ణంలేని నా మంద‌హాసం చూసి
మండిపోయి
వాళ్లు న‌న్ను మ‌ళ్లీ బంధించారు....ʹʹ అంటూ తాను చావును ఎలా నిరాక‌రిస్తున్నాడో చెప్తున్నాడు. ఉద‌యించే సూర్య కాంతుల్నీ, మొల‌కెత్తే గ‌డ్డిపూల న‌వ్వుల స‌వ్వ‌డినీ వింటున్న సాయిని క‌ల‌ల‌కు దూరం చేయ‌డం ఈ రాజ్యంత‌ర‌మెప్ప‌టికీ కాదు.

ʹʹఅమ్మా... నా కోసం దుఃఖించ‌కుʹʹ- అంటూ సాయి త‌న త‌ల్లికి రాసిన లేఖ ప్ర‌తిఒక్క‌రినీ క‌న్నీళ్లు పెట్టిస్త‌ది. త‌న కొడుకును చూసేందుకు ములాఖ‌త్ కోసం జైలుకు వ‌చ్చిన త‌ల్లికి తీర‌ని దుఃఖ‌మే మిగిలింది. ఫైబ‌ర్ గాజు కిటికీలోంచి త‌ల్లి ముఖాన్ని చూడ‌లేక‌పోయాన‌నే వేద‌న ఇది. త‌న త‌ల్లి ఒడిలో నేర్చుకున్న భాష‌లో రాసే అనుమ‌తి లేనందుకు ఎంత త‌ల్ల‌డిల్లిండో. త‌న కోసం దిగులుప‌డే త‌ల్లికి ధైర్యం చెప్తున్నాడు. అత‌నిది స‌ముద్రాల్ని పోటెత్తించిన అంత‌రంగం. అత‌ని మాట న‌దీ ప్ర‌వాహ స‌దృశ్యం..

ʹʹఅమ్మా నీ ఆశ‌ల్ని వ‌దులుకోకు
జైలు నాకు మ‌ర‌ణం కాదు
పున‌ర్ జ‌న‌న‌మ‌ని
అర్థం చేసుకున్నాను
నేను ఇంటికి తిరిగి వ‌స్తాను
నాకు ఆశ‌ను ధైర్యాన్ని యిచ్చి
పోషించిన నీ ఒడిలోకి...ʹʹ అంటూ త‌న స్వేచ్ఛ గురించి భ‌య‌ప‌డొద్ద‌ని త‌ల్లికి ధైర్యం చెప్తున్నాడు.

వ‌సంత‌కు రాసిన లేఖ‌లో...

ʹʹవిరిగిపోయిన
నా గుండె ప‌గుళ్ల నించి
ప్ర‌వ‌హించే ర‌క్త‌పు వెలుగులో
ఈ చీక‌టి నిండిన జైలు గ‌దిలో
నీ ఉత్త‌రాల‌ను చ‌దువుతాను...ʹʹ అంటున్నాడు. ప్రేమ‌లో ముంచి రాసిన వాక్యాల్లో ఆమె ముఖంలో మారుతున్న భావాల‌పే వెతుకుతానంటాడు. ఆమె లేఖ‌ల‌తో బందీఖానాను జ‌యిస్తానంటున్నాడు.

ʹʹప్రియ‌త‌మా
ఈ బందిఖానాలోని శిక్ష‌ను
నీ ప్రేమ‌లేఖ‌ల్లో
న‌న్ను నేను ముంచుకోవ‌డం ద్వారా
జ‌యిస్తాను..ʹʹ. అంటూ త‌న జీవితం, ఆచ‌ర‌ణ‌లో భాగ‌మైన వ‌సంత‌కు రాస్తున్నాడు.

జైలులో ఉన్నా త‌ర‌గ‌తి గ‌దినే క‌ల‌గంటున్న అధ్యాప‌కుడు అత‌ను. బోధించ‌డం అత‌ని బ‌లం. ఊపిరి. జీవితం. చెర‌బ‌డ్డ ఈ నేల విముక్తి కోసం రేప‌టి ఉద‌యాల్ని హ‌త్తుకుంటానంటున్నాడు. రోజురోజుకూ క్షీణిస్తున్న ఆరోగ్యం. శ‌రీర భాగాల‌న్నీ ఒక్కొక్క‌టిగా ధ్వంస‌మవుతున్నాయి. చాలా అవ‌య‌వాలు ప‌నిచేయ‌లేని, క‌ద‌ల్లేని స్థితి. త‌నకు సానుభూతి నచ్చ‌దు. దానిపై న‌మ్మ‌కం లేదు. సంఘీభావాన్ని మాత్ర‌మే న‌మ్ముతానంటున్నాడు. మ‌నంద‌రి స్వేచ్ఛ కోసం నిన‌దిద్దామని జైలు గోడ‌ల నుంచి పిలుపునిస్తున్నాడు.

జైలంటే...
ʹʹఎత్తైన న్యాయ‌పీఠాల‌పైన‌
ప‌రుచుకున్న అబ‌ద్దాల స‌మూహం..ʹʹ అంటున్నాడు సాయి. అది అసంఖ్యాక ప్ర‌జ‌ల ఎడ‌ల జ‌రిగే అన్యాయం ప‌ట్ల కంఠ‌స్వ‌రాల మౌనం అని జైలును నిర్వ‌చిస్తున్నాడు. అండా సెల్ తాళాలు తీసే జైలు గార్డును ప్రేమ‌గా స్ప‌ర్శిస్తాడు సాయి. అత‌ని స్నేహాన్ని త‌న అక్ష‌రాల‌తో ఆలింగనం చేసుకుంటున్నాడు. ఖైదీల బాగోగుల్ని చేసుకుంటున్న ఆ గార్డు మ‌న‌సులో ఎన్ని సుడిగుండాలు చెల‌రేగుతున్నాయో సాయి అర్థం చేసుకున్నాడు. అత‌ని అంత‌రంగాన్ని విన్నాడు. అత‌నిలోని మాన‌వ‌త్వానికి స‌లాం చేస్తున్నాడు.

ʹʹస్వీయ విషాద గాథ‌కు సెల‌విచ్చి
ఖైదీల క‌న్నీటి గాథ‌ల్ని
త‌డి క‌ళ్ల‌తో వింటుంటాడు
వాళ్ల నేరాల‌కూ నిర్ధోషిత్వాల‌కూ
అతీత‌మైన మాన‌వ‌త్వ‌మ‌త‌నిది...ʹʹ అంటూ జైలు గార్డు వేద‌న‌ల్ని క‌విత్వం చేశాడు. అత‌డు త‌న‌కు గొప్ప సాంత్వ‌న‌నిచ్చే స్నేహితుడ‌ని చెప్తున్నాడు.

నెట్‌లో బందీలైన మ‌నుషులంద‌రూ వాటి నుంచి త్వ‌ర‌లోనే విముక్తుల‌వుతార‌ని ఆశావ‌హ ప్ర‌క‌ట‌న చేస్తున్నాడు సాయి. న‌ట్టింట్లో నెట్ రాజేస్తున్న మంట‌లన్నీ ఆరిపోతాయ‌ని చెప్తున్నాడు. త్వ‌ర‌లోనే అన్నిటి నుంచి బంధ విముక్తుల‌వుతార‌ని ఊహిస్తున్నాడు. స‌మాచార హోరులో చిక్కుకుపోయిన బందీల‌ను ఏకం కావాల‌ని పిలుపునిస్తున్నాడు.

ʹʹనా సోద‌ర ఖైదీల్లారా
ఏడ‌వ‌కండి ఏడ‌వ‌కండి
మీరు త్వ‌ర‌లోనే బంధ విముక్తుల‌వుతారు
...
...
ముఖ‌పుస్త‌కం శాశ్వ‌తంగా తుడిచిపెట్టుకుపోతుంది
ట్విట‌ర్‌లు మూసుకుపోతాయి
కంప్యూటింగ్ మేఘాలు కూలిపోతాయి
వాట్సాప్ క‌నుమ‌రుగై పోతుంది
గూగుల్ గ‌ల్లంత‌వుతుంది... అంటూ ప్ర‌పంచ నెటిజ‌నులంతా ఏక‌మైతే - మీకు పోయేదేమీ లేదు
స‌మాచార సంకెళ్లు త‌ప్ప‌
గెల‌వ‌డానికి మాత్రం
గొప్ప ప్ర‌పంచ‌మే మీ ముందుంది...ʹʹ అని గెలుపు దారుల్లో సాగుదామ‌ని పిలుపునిస్తున్నాడు.

ʹన‌ది ప్ర‌వ‌హిస్తూనే ఉంది..ʹ. క‌విత ఓ దృశ్య కావ్యం. త‌న తొలి య‌వ్వ‌న కాలాల్లో విక‌సించిన పూల న‌వ్వుల స‌వ్వ‌డి అది. త‌న ప్రేయ‌సి కోసం ఎదురు చూసిన క్ష‌ణాలెంత మ‌ధుర‌మైన‌వో చెప్తున్నాడు. కొండ వాలున చెట్ల‌పై కురిసే మంచు బిందువుల్లో త‌న రూపాన్ని చూసుకున్న‌డు. ఉద‌యిస్తున్న సూర్యుడిలో నిశి రాతిరి దుఃఖాల‌కు వీడ్కోలు ప‌లికాడు. స‌ముద్ర‌మూ, ఆకాశ‌మూ క‌లిసే సుంద‌ర దృశ్యాన్ని క‌ళ్ల‌ముందుంచాడు. అల‌లు అల‌లుగా ఎగ‌సిప‌డుతున్న తొలి య‌వ్వ‌నాల ఉద్వేగాల‌ను, ఉద్రేకాల‌ను అండా సెల్ ఒంట‌రి గ‌దిలో క‌ల‌గంటున్నాడు. జైలు గ‌దిలో ఆవ‌రించిన శూన్యంలో వేన‌వేల త‌ల‌పోత‌ల‌తో త‌ల్ల‌డిల్లుతున్నాడు. అక్క‌డ సూర్యోద‌యాలూ, చంద్రోద‌యాలూ లేవు. మేఘాలూ లేవు. మెరుపుల్లేవు. రాత్రికీ ప‌గ‌టికీ తేడాలేని జీవితం. చీక‌టి. చుట్టూ చీక‌టే. క‌ను పాప‌ను పొడుచుకున్నా కాన‌రాని వెలుతురు జాడ‌లు. ఈ అంధ‌కార కారాగారంలో త‌న అక్ష‌రాల‌తో మిణుగురుల వెలుతురు పంచుతున్నాడు.

త‌న‌ను త‌లుచుకుంటూ అల‌సిపోయిన వ‌సంత‌ను - ఈ ఒంట‌రి త‌న‌మెప్ప‌టికీ ఒంట‌రి కాదు అంటున్నాడు.

ʹʹప్ర‌జా స‌మూహాల‌న్నీ
నిర్బంధ ఉక్కు పాదాల కింద‌
న‌లిగిపోతున్న స‌మ‌యంలో
నీవు ఒంట‌రిత‌నం
అనుభ‌విస్తున్నావా

వాస్త‌వ పోరాటంలో
ఒంట‌రిత‌నం కూడా
స‌మూహంలో భాగ‌మే
నువ్వూ నేనూ
ఎంత దూరంలో ఉన్నా
ప్ర‌జా రాశుల స‌మూహంలో
అంత‌ర్భాగ‌మే...ʹʹ అంటూ వ‌సంత‌కు ప్రేమ వాక్యం చెప్తున్న‌డు. ప్రేమ‌, ఆప్యాయ‌త‌, అనురాగాల‌కు సంకెళ్లు వేస్తున్న ఈ యుగం కూలిపోక త‌ప్ప‌దంటున్నాడు. కాల‌మే చ‌రిత్ర కాద‌నీ, చ‌రిత్రే కాలాన్ని మారుస్త‌ద‌ని చెప్తున్నాడు.

ʹʹమ‌నం అనుకున్న‌వ‌న్నీచేస్తూ ముందుకు సాగు
నిర్బంధం ముగిసిపోతుంది
మ‌నం తిరిగి క‌లిసి జీవించే కాలం ఎంతో దూరంలో లేదు
త్వ‌ర‌లోనే నీ కౌగిలిలో క‌రిగిపోతాను....ʹʹ అని వ‌సంత‌ను ఊర‌డిస్తున్నాడు. దేదీప్య‌మానంగా వెలిగే అడ‌వులూ, కొండ‌ల్నీ, ల‌క్ష న‌క్ష‌త్రాల కింద తామిద్ద‌రూ జ‌మిలిగా క‌న్న క‌ల‌ల్నిగుర్తుచేసుకుంటున్నాడు. ఒంట‌రి రాత్రుల‌న్నీ త‌న మ‌దిని స‌లుపుతున్నాయ‌ని బాధాత‌ప్త హృద‌యంతో క‌న్నీళ్ల‌వుతున్నాడు. ప్రేమ‌ల్ని నిషేధించే చోట‌, ఊహ‌ల్ని బంధించ‌డ‌మెవ‌రి త‌ర‌మూ కాదంటున్న‌డు.

ʹʹవాళ్లు విసిరేశారు
మ‌న హృద‌యాల‌ను వేల మైళ్ల దూరం
కానీ మ‌న ఊహ‌ల కిర‌ణాలు క‌లుసుకోవ‌డాన్ని
ఆప‌లేదు ఈ రాత్రి..ʹʹ. అంటూ న‌ల్ల‌ని మేఘాల వెనుక దాక్కుని త‌ళుక్కుమ‌నే న‌క్ష‌త్రాల బాధ‌ను నువ్వూ అనుభూతి చెందుతావ‌నేది నాకు నిశ్చ‌య‌మేన‌ని ఆశ‌ను పంపిస్తున్నాడు.

జ‌నం న‌డ‌వాల్సిన పోరుబాట‌కు సాయిబాబా అక్ష‌రాలు వెలుగు దివిటీలు. పొద్దుపొడుపై ఎదురొచ్చే వీరుల జాడ‌లు. న‌డ‌వాల్సిన తొవ్వ‌లు. చావును నిరాక‌రిస్తున్న ప్ర‌జ‌ల మ‌నిషి అంత‌రంగాన్ని విందాం రండి. అత‌ని అక్ష‌రాల ములాఖ‌త్‌లో అలైబ‌లై తీసుకుందాం. నూత‌న మానవ ఆవిష్కారాన్ని క‌ల‌గందాం.

No. of visitors : 382
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....
  జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •