ఆచ‌ర‌ణే గీటురాయి

| సాహిత్యం | వ్యాసాలు

ఆచ‌ర‌ణే గీటురాయి

- పాణి | 18.05.2019 12:14:42am

కమ్యూనిస్టులకు ఏం తెలుసు? ఎంత తెలుసు అనే వాటికి వాళ్ల ఆచరణే గీటురాయి. వాళ్లకు ఏం తెలియదో కూడా వాళ్ల ఆచరణ ద్వారానే తెలుసుకోవచ్చు. కమ్యూనిస్టుల గురించి మాట్లాడటమంటే వాళ్ల ఆచరణ గురించి మాట్లాడటమే.

కమ్యూనిస్టుల ఆచరణలోకి రాని జ్ఞానం, జ్ఞానమే లేని ఆచరణ సంగతి ఏమిటి? అనే వాళ్లూ ఉంటారు. అవి తెలుసుకోవాలన్నా వాళ్ల ఆచరణ దగ్గరికి పోవడమే సులభమార్గం.

ఉమ్మడి పార్టీ కాలంలో కమ్యూనిస్టుల ఆచరణ ఎలా ఉండేది? నక్సలైట్‌ ఉద్యమం మొదలయ్యాక కనీసం మూడు నాలుగు దశాబ్దాలపాటు విప్లవ పార్టీల ఆచరణ గ్రామాల్లో ఎలా ఉండేది? అనే పరిశీలనలో ఉద్వేగంతో, సెంటిమెంట్‌తో, పక్షపాత దృష్టితో అదనంగా ఒక్క మార్కు కూడా వేయాల్సిన పనిలేదు. ఇవాళ్టి మన అభిప్రాయాలతో ఒక్క మార్కు కూడా తీసేయడానికి లేదు. దాన్ని దానిగా చూసి కచ్చితత్వం పాటిస్తూ ఏం చేశారో తేల్చేయవచ్చు.

విప్లవకారులు గ్రామాల్లోని దళితుల దగ్గరికి వెళ్లారు. మిగతా వృత్తి కులాలను, అగ్రకులాల్లోని పేదలను సమీకరించినా మౌలికంగా వాళ్ల ఆచరణ దళితుల్లోనే సాగింది. దళితుల దగ్గరికి వెళ్లడమంటేనే ఒక సామాజిక సంబంధాన్ని గుర్తించడం. అత్యంత జటిలమైన మొరటు అమానవీయ గ్రామ సంబంధాల్లో దళితులను కేంద్రం చేసుకున్నారు. కమ్యూనిస్టులుగా వర్గపోరాటం చేయడమే లక్ష్యమని వాళ్లు అనుకొని ఉండవచ్చు. అలా అనుకోకపోతే మౌలికంగా కమ్యూనిస్టులు కానట్టే. అందువల్లే చాలా సహజంగా వాళ్ల ఆచరణ దళితవాడల్లో మొదలైంది.

అయితే ఒక ఊళ్లో పని మొదలు పెట్టగానే అనేక సమస్యలు ఒక్కొక్కటే బైటికి వస్తాయి. మనం వర్గపోరాటం చేసే వాళ్లం కదా, మిగతా వాటితో మనకేం పని అనుకున్నారా? లేక అన్నిటినీ ఎదుర్కొన్నారా? వాళ్ల ముందుకు ఎన్ని రకాల సమస్యలు వచ్చాయి? వాటితో ఎలా వ్యవహరించారు? అనే ఆచరణను దానికదిగానే పరిశీలించాలి.

ఉదాహరణకు ఆంధ్ర ప్రాంతంలో కులాంతర, ప్రేమ, వితంతు వివాహాల్లాంటి సమస్యలు ముందుకు వస్తే కమ్యూనిస్టు పార్టీ తన కేడర్‌తో కర్రలు పట్టించి కాపలా ఉండి పెళ్లిళ్లు చేసేవని ఆనాటి కామ్రేడ్స్‌ అంటారు. ఈ తరహా సమస్య వస్తుందని కార్యకర్తలు ముందే ఊహించకపోవచ్చు. కానీ దగ్గర ఉండి సంప్రదాయేతర పెళ్లిళ్లు చేయడమంటే వాటిని ప్రోత్సహించడం, బలపరచడం. వాటికి అండగా ఉండగల వాతావణానికి దోహదం చేయడం. వాటిని ఒక విధానంగా తీసుకోడానికి ఆరంభంలోని ఈ ఆచరణ పునాది వేసింది.

రకరకాల వెట్టి, శ్రమకు తక్కువ విలువ కట్టడం వంటి సమస్యల‌పై దళితుల్ని ఆర్గనైజ్‌ చేశారు. ఇక్కడ శ్రమ, ఆత్మగౌరవం రెండూ ఉన్నాయి. ఇదంతా వాళ్లకు భూమి లేనందు వల్లే కాదు, అంటరానితనం ఉన్నందు వల్ల కూడా అనే ఎరుకతో తమ పనికి దళిత వాడలను కేంద్రం చేసుకున్నారు. అంటరానితనంతో మాకేం సంబంధం, మేం వర్గపోరాటం చేసే వాళ్లం, మీకు భూమి లేదు కాబట్టి దాని మీదే మేం పోరాడతామని అన్నారా? మగ దళితుడు భార్యను కొడుతూ ఉన్నా... వాళ్లను ఉద్యమాల్లో నిలబెట్టుకోడానికి గృహహింసను నిర్లక్ష్యం చేశారా? మొగుడూపెళ్లాల సమస్యతో మాకేం పని, మేం వర్గపోరాటం చేసే వాళ్లం దాన్ని మీరు ఇంట్లో తేల్చుకోండి, మీ కుల పంచాయితీలో పెట్టుకోండి, లేకపోతే ఊరి పెద్దల రచ్చకట్ట దగ్గర పరిష్కరించుకోండని అన్నారా? అంటరానితనం గురించి, సమానత్వం గురించి మాట్లాడితే అగ్రకులాల్లోని పేదలు దూరమవుతారేమో అని పోరాట క్షేత్రాన్ని ఊళ్లోకి మార్చుకున్నారా?

విప్లవకారుల ఆచరణను పరిశీలించడమంటే ఇలాంటి అన్ని సందర్భాల్లో ఎలాంటి వైఖరి తీసుకున్నారో చూడటమే. ఇవే కాక నేరుగా వ్యక్తంగాని అగ్రకుల వైఖరులు కూడా ఉండొచ్చు. వాటిని కూడా కలిపి ఆలోచించాలి. ఆచరణలో చాలా సహజమైన ఈ ప్రజాస్వామిక వైఖరులను ఇప్పటి భాషలో వివరించి ఉండకపోవచ్చు. అయినా స‌రే, వేర్వేరు రూపాల్లో, అవగాహనలతో చేసిన అన్ని ప్రయత్నాలను పరిగణలోకి తీసుకోవాలి. ఆచరణలోని సంక్లిష్టతను మొత్తంగా చూడటానికి సిద్ధమవుతామా లేక మనకు ఇష్టమైన ముక్కను మాత్రమే తీసుకుంటామా? దానికి మనకు ఇష్టమైన వ్యాఖ్యానం చేసి సరిపెట్టుకుంటామా? ఇలాంటి ఏ పొరబాటు జరగకుండా కమ్యూనిస్టు విప్లవకారుల ఆచరణను పరిశీలించగల దృష్టి సంతరించుకోవడం ఎందుకు సాధ్యం కాదు? వాళ్ల రాజకీయాలతో పూర్తి ఏకీభావం లేకపోయినా ఈ పని చేయవచ్చు.

ఒక్కో ఊళ్లో, ఒక్కో విషయంలో దానిదే అయిన ప్రత్యేకత, దానిదే అయిన కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మనుషుల వ్యక్తిత్వాల్లో తేడాలు ఉంటాయి. వాటిని నడిపిస్తున్న భావజాల ప్రభావాలు ఉంటాయి. ఈ తేడాలన్నీ పరిగణలోకి తీసుకొని ప్రజలను సమీకరించడానికి ఆచరణలో గొప్ప కన్సిస్టెన్సీ ఉండాలి. దృఢమైన వైఖరులు విప్లకారుల సొంతం. లేకపోతే ఏ సమస్యా పరిష్కారం కాదు. కాకపోగా ప్రతిదాంట్లోంచి అనేక సమస్యలు చుట్టుముడుతాయి. ప్రతిఘాతుక పరిణామాలు జరుగుతాయి. కాబట్టి లోతైన అంతర్‌ దృష్టి లేకుండా ఆచరణ కష్టం. అలాంటి దాన్ని దీర్ఘకాలం కొనసాగించారు కావట్టే విప్లవకారుల ప్రవేశం తర్వాత మాల మాదిగ పల్లెల్లో గతంలో ఎన్నడూ లేని మార్పులు జరిగాయి. దేనికంటే ప్ర‌జ‌లు నెత్తురు చల్లి, ప్రాణాలను పణం పెట్టి నిర్మించిన ఉద్యమాలవి.

ఈ సమస్యలన్నిటినీ వర్గంలో భాగంగానే చూశారు కావచ్చు, వర్గపోరాటాలను నిర్మించే లక్ష్యంతోనే అన్నిటినీ పట్టించుకున్నారు కావచ్చు. అయినా సరే అన్నిటినీ పట్టించుకున్న మాట వాస్తవం. దేన్నయినా ఎలా పట్టించుకున్నారో, ఎలా పట్టించుకోలేదో ఆచరణ ద్వారా చూడ్డానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి?

విప్లవకారులు ఆచరణే మాకెందుకు ప్రమాణం కావాలి? సమాజంలోని వాస్తవికత, దాని మూలాలు, రావాల్సిన మౌలిక మార్పు గురించే మాట్లాడతామని ఎవరైనా అనువచ్చు. దానితో కూడా ఏ పేచీ లేదు. ఆ ప‌నిలోకి వెళ్లే ముందు విప్ల‌వ‌కారుల ఆచ‌ర‌ణ‌ను కూడా పార‌ద‌ర్శ‌కంగా ప‌రిశీలించ‌వ‌చ్చు.

కులం విషయంలో విప్లవకారుల ఆచరణ పట్ల ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. దళితులు ఇవాళ గొంతెత్తి మాట్లాడటం అద్భుతమైన చారిత్రక వికాసక్రమం. ఇది ఒకరకంగా మన మేధో, సృజన రంగాలను మార్చేసింది. ఉద్యమ శక్తులకు ఎంతో నేర్పించింది. గతాన్ని దగ్ధం చేసి, ముందుకు వెళ్లే శక్తి విప్లవకారులకే ఉంటుంది. దేనికంటే సమగ్ర మౌలిక మార్పు కోసం ఆచరణలో ఉంటారు కాబట్టి. దానికి మాటలు, విశ్లేషణలు, రచనలేగాక తమ సొంత జీవితాన్ని సహితం ప్రయోగంగా మార్చే సత్తా విప్లవకారుల‌కే ఉంటుంది. కాబట్టి కుల సమస్య విషయంలో దళితులు గద్దించి అడిగినా, ఆగ్రహంగా అడిగినా ఎన్నడూ ఇబ్బంది పడలేదు. పుట్టుకతో అగ్రకులాలకు చెందిన కొందరు విప్లవకారులను చూపి మీ అగ్రకులతత్వం వల్లే మీరు కుల సమస్యను పట్టించుకోలేదని ఆరోపించినా విప్లవకారులకు ఏ ఇబ్బంది ఉండదు. దేనికంటే కమ్యూనిస్టులు తమ ఉద్యమాన్ని, అవగాహనలను తామే కాదు .. ఇతరులు కూడా ఆచరణ పునాదిగానే పరిశీలించాలని కోరుకుంటారు. గొంతుదాకా ఆచరణలో ఉండే వాళ్లు ఏ ప్రశ్ననయినా ఆచరణ నుంచే పరిశీలిస్తారు. ఎలాంటి ప్రశ్ననైనా ఒకే వైఖరితో స్వాగతిస్తారు. మన నిమిత్తం లేకుండా సమాజం నుంచి మనకు సంక్రమించిన సామాజిక జాడ్యాలపట్ల పట్ల మన వైఖరి ఏమిటి? అనేదానికి విమర్శనాత్మక, చైతన్యవంతమైన ఆచరణే అంతిమ గీటురాయి అని విప్లవకారులు నమ్ముతారు. కాబ‌ట్టి ఆ విష‌యంలో ఎవ‌రేమ‌నుకున్నా అస‌హ‌నానికి గుర‌య్యేది లేదు. ఆచ‌ర‌ణే గీటురాయి అని ధృడంగా ప్ర‌క‌టిస్తారు.

అయితే విప్లవం చేయడానికి దేశం మొత్తానికి సరిపడా, అన్ని విషయాలపట్ల ఒకేసారి సిద్ధాంతాలు తయారు చేసుకొని, అన్ని నైపుణ్యాలు సంతరించుకొని బయల్దేరడం అయ్యే పని కాదు. సాయుధపోరాటమే ఏకైక మార్గం అనే వైఖరి తీసుకొని కూడా ఆ తర్వాత ఒక చిన్న చేతి బాంబు తయారు చేయడం రాక చచ్చిపోయిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. 2000 సంవత్సరానికే మంద్రస్థాయి యుద్ధతంత్రాన్ని శతృవు అమలు చేస్తున్నాడని తెలిసినా, నిర్దిష్టమైన ప్రతి వ్యూహాన్ని అనేక నష్టాల తర్వాతే విప్లవోద్యమం ఆలోచించింది. ఈ సైనిక రంగ, ఆచరణాత్మక ఉదాహరణలు అందరికీ నచ్చకపోవచ్చుగాని అన్ని రంగాల్లో ఇది వాస్తవం.

పల్లెల్లో దళితులు మిలిటెంట్‌ రాజకీయ సాంఘిక శక్తిగా ఎదగడం వెనుక విప్లవోద్యమం ఉంది. అసలు విప్లవోద్యమం అంటరాని ప్రజల ఉద్యమంగా గుర్తింపు పొందింది. ఆచరణలో నేరుగానూ, అనేక ఇతర సమస్యల ప్రమేయంతోనూ అంటరానితనం మీద ఎంతో పని చేసిన విప్లవోద్యమం దళితవాదం వచ్చాక కులం గురించి నిర్దిష్టంగా అధ్యయనం ప్రారంభించింది. 1980ల మధ్యకలా విప్లవకారులు కొంత అంబేద్కర్‌ను చదివినా, ఫూలేను అప్పుడే చదవడం మొదలు పెట్టారు. మన దగ్గర సాంఘిక విముక్తి చైతన్యం వెల్లివిరియడంలో వాళ్ల పాత్ర ఉందని, భవిష్యత్‌లో కూడా ఉంటుందని గుర్తించారు. దళిత చైతన్యవం వల్లే వచ్చిన మార్పులను కూడా గుర్తించింది. ఇది అప్పటి దాకా కొనసాగిన ఆచరణను చాలా మార్చేసింది. సజీవ ఉద్యమాలే తమ అచరణను నిత్యం విస్తరింపజేసుకుంటాయి.

ఈ క్రమంలో అంబేద్కర్‌-కులం- విప్లవం చుట్టూ ఎన్నో వాదనలు జరిగాయి. అంబేద్కర్‌ గురించి మాట్లాడటమంటేనే దళిత బూర్జువా శక్తులకు లొంగిపోయినట్లని వాదించే వాళ్లను ఇప్పటికీ చూస్తున్నాం. ఇదొక అన్యాయమైన వైఖరి. వీళ్లకు అంబేద్కర్‌లోని సాంఘిక విముక్తి భావన కనీసంగా కూడా అర్థం కానట్లే. చారిత్రకంగా ప్రగతిదాయకమైన మార్గానికి వీళ్లు ఎన్నటికీ రాలేరు. విప్లవంలో సాంఘిక విముక్తి అనే అతి ముఖ్యమైన ప్రక్రియ ఉందని వీళ్లకు తెలియదు. దాని కోసం చేయాల్సిన ప్రత్యేకమైన కృషిని వీళ్లు గుర్తించలేరు. సంప్రదాయకత అంతగా లొంగదీసుకుంటుంది. దీనికి అనవసరంగా వర్గాన్ని పోటీ తెస్తారు. వీళ్లు ఎంత ప్రమాదమంటే మావోయిస్టు ఉద్యమంపట్ల ఇతరేతరంగా అసంతృప్తులు ఉండేవాళ్లు ఇలాంటి వాళ్లను అడ్డం పెట్టుకొని విమర్శించే ప్రమాదం ఉంది.

అదే సమయంలో రాజ్యాంగ బద్ధ ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తేనే అంబేద్కర్‌ను అంగీకరించినట్లనే వాదన కూడా ఉంది. ఎన్ని మాటలు చెప్పినా చివరికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో దళితులకు విముక్తి ఉంటుందనడమే దీని సారాంశం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తిరస్కరిస్తూ నక్సల్బరీ పంథా ఆరంభమైంది. అంబేద్కర్‌ పార్లమెంటరీ అనుభవం సామాన్యమైనది కాదు. ఆయన తర్వాత నిజంగానే మన పార్లమెంటరీ రాజకీయాలు చాలా మారాయి. పూర్తి స్థాయిలో భ్రస్టు పట్టిపోయాయి. అదే సమయంలో ప్రజలను అనేక రూపాల్లో ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి ఎన్నికల రాజకీయాలను కూడా వాడుకోవాల్సిందే అనే వాళ్లు ఉండవచ్చు. ప్రజలను ఎంత ప్రభావితం చేస్తున్నా సరే, సమాజాన్ని మార్చే లక్ష్యం పెట్టుకున్నవాళ్లకు ఎంత మాత్రం పనికిరాని దశలోకి పార్లమెంటరీ రాజకీయాలు దిగజారిపోయాయి. ఈ మార్పును కూడా పరిగణలోకి తీసుకోకతప్పదు. కాబట్టి కులం గురించి పట్టింపుకు, అంబేద్కర్‌ప‌ట్ల అవ‌గాహ‌న‌కు పార్లమెంటరీ రాజకీయాల్లోకి రావడమే లేదా వాడుకోవడమే గీటురాయి అనే వాదనతో మావోయిస్టు ఉద్యమానికి ఏకీభావం లేదు.

అదే సమయంలో విప్లవం గురించి విప్లవకారులందరిలో అనేక అభిప్రాయాలు ఉన్నట్లే దళిత ఉద్యమంలో, అంబేద్కరిస్టులో కూడా అనేక అభిప్రాయాలు ఉన్నాయి. అందరూ ఒకటి కాదు. ఒక రకమైన వాదనను మాత్రమే చూడటానికి లేదు. దళిత మేధావుల్లో నిరంతర సంభాషణ చేయదగిన శక్తులు ఉన్నాయి. వాళ్ల‌తో మావోయిస్టు ఉద్యమానికి స్నేహపాత్రమైన సంబంధాలు ఉన్నాయి. అయితే అంబేద్కరిస్టుల్లో ఎక్కువ మంది ఎన్నికల ప్రజాస్వామ్యం దగ్గర కలిసే అవకాశం ఉంది. పొలిటికల్‌ మొబలైజేషన్‌కు అవసరమైతే ఎన్నికల రాజకీయాలు (కూడా) చేయాల్సిందే అనే వాదనతో మావోయిస్టు ఉద్యమం ఘర్షణ పడుతూనే ఉంటుంది. ఇలా అంటే తన వెనుక ఉండే దళితులు ఎక్కడ వెళ్లిపోతారో అనే భయం లేదు. ఇక్కడ కూడా దాని బలం ఆచరణే. అన్నిట్లో ఇదే వైఖరిని ప్రదర్శించే శక్తి ఆచరణ నుంచే వచ్చింది. ఇలాంటి వైఖరిపట్ల దళిత శిబిరం, అందునా నిరంతర సంభాషణ సాగించాల్సిన వాళ్లు ఎలా స్పందించినా విప్లవోద్యమం అసహనానికి గురికావడం లేదు. తన పాయింట్‌ చెప్పి వదిలేస్తోంది.

దేనికంటే కులం మీది పోరాటం దశలవారీగా చేసేది కాదు. ఎన్నికల్లో నిలబడి సాధించేదీ కాదు. ఆ పని ఎవరైనా చేయదల్చుకుంటే చేయవచ్చు. తమ మార్గానికి రాలేదంటే, అంబేద్కర్‌ నుంచి ఏమీ నేర్చుకోనట్లేనని మావోయిస్టులను ఎంతయినా విమర్శించవచ్చు. సామాజిక న్యాయానికి, సామాజిక ప్రజాస్వామ్యానికి సిద్ధం కాలేదని అనవచ్చు. ఆ రాజకీయ స్వేచ్ఛ దళిత నాయకులకు ఉన్నది. అలాగే ఇలాంటి వాదన దళితులను దగా చేసే ఎన్నికల వ్యూహమని మావోయిస్టులు కూడా అనవచ్చు. ఒకరికే విమర్శించే హక్కు ఉంటుందంటే కుదరదు.

ఎన్నికల ద్వారా దళితులకు రాజ్యాధికారం రావడం, కుల వ్యవస్థ రద్దు కావడం అయ్యేపని కాదని మావోయిస్టులు అంటారు. దీనికి కులం గురించి వాళ్లకున్న విశాలమైన వైఖరే కారణం. కులం అత్యంత ప్రాచీన కాలం నుంచి, సంస్కృతిగా, ఆలోచనారీతులుగా, భావజాలంగా, కట్టుబాట్లుగా, ఘనీభవించిన అమానవీయ విలువలుగా కూడా కొనసాగుతున్నదని విప్లవకారులకు తెలుసు. ఈ స్థూల అవగాహన విప్లవోద్యమానికి మొదట్లోనే ఉన్నది. ఆ సంగతి అప్పటి ఉద్యమ పత్రాల్లో కనిపిస్తుంది. 1971-72 కల్లా విప్లవోద్యమం పూర్తిగా దెబ్బతినిపోయాక సుమారు 1980 దాకా పునర్నిర్మాణ ప్రయత్నాలు జరిగాయి. ఆరిపోయిన నిప్పు రవ్వను తిరిగి రాజేయడానికే సరిపోయింది. కానీ అ అనుభవం అసాధారణం. దాని మీద ఆధారపడి తెలుగు పల్లెల్లోనేగాక, ఇతర రాష్ట్రాల్లో కూడా అట్టడుగు ప్రజల దగ్గరికి వెళ్లి పని చేశారు. దళిత బహుజన కులాల నుంచి విప్లవోద్యమంలోకి పెద్ద ఎత్తున క్యాడర్‌ వచ్చింది. వాళ్లలోంచి నాయకులుగా ఎదిగిన వాళ్లు ఎందరో ఉన్నారు.

సుమారు రెండు దశాబ్దాలపాటు ఆనాటి ఆంధ్రప్రదేశ్‌లోని మాల మాదిగ వాడల్లో కొనసాగిన విప్లవాచరణ మీద ఎన్నో అధ్యయనాలు వచ్చాయి. ఆ సమయంలోనే దండకారణ్యంలో అనేక అనుభవాలు గడించారు. కొన్ని తెగల వాళ్లు ఇంటి ముందుకు వస్తే నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకొనే తెగలు అక్కడ ఉన్నాయి. వాళ్లందరినీ విప్లవంలోకి తేవాలంటే ఈ సాంఘిక అంతరాలపై పోరాడాలని విప్లవకారులు తెలుసుకున్నారు. ఇవి లోతైన మనోభావాల నుంచి పుట్టుకొచ్చినవని, అంతరాలకు ఆ మన:స్థితి కారణమని తెలుసుకున్నారు. దానితో వ్యవహరించకుండా అక్కడ విప్లవాచరణ ఎలా సాధ్యం? అలాగే పితృస్వామ్యం గురించి కూడా. పితృస్వామ్య భావజాలం మీద, దానికి సంబంధించిన మానసిక ప్రపంచం మీద బహుశా దండకారణ్యంలో జరిగినంత రప్చర్‌ భారతదేశంలో మరెక్కడా జరిగి ఉండకపోవచ్చు. వర్గపోరాటం చేసే విప్లవ శక్తులు సాంఘిక సాంస్కృతిక భావజాల రంగాల్లో తీవ్రస్థాయి పోరాటం చేస్తున్నాయి. ఒక వాస్తవ స్థితిని అర్థం చేసుకోవడంలో, దాని మీద దృఢమైన పోరాటం చేయడంలో విప్లవకారులు ఎంత సునిశితంగా వ్యవహరిస్తారో దండకారణ్యంలో చూడవచ్చు. ఆదివాసీ సాంఘిక ప్రపంచంలో హేతుచింతన లేదు. వ్యక్తి స్వేచ్ఛ లేదు. అలాంటి సమాజంలో మావోయిస్టు ఆచరణ పాత సాంఘిక మూలాలను కదిలించింది. హేతుబద్ధత మీద ఆదివాసీలు తమ సాంఘిక జీవితాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్నారు.

మైదాన, గ్రామీణ ప్రాంతాల్లో సరిగ్గా అలాంటి సాంఘిక ప‌రిస్థితులే ఉండకపోవచ్చు. అలాంటి మన:స్థితే ఉండకపోవచ్చు. దాన్ని అర్థం చేసుకోడానికి అందరూ సంతృప్తి పొందే భాషను మావోయిస్టులు వినియోగించలేకపోవచ్చు. కానీ అందరూ గుర్తించాల్సిన ఆచరణ, దానికి సంబంధించిన కన్సిస్టెన్సీ వాళ్లు చాటుకుంటున్నారు. అందుకే దండకారణ్యలో వలె అంత పెద్ద ఎత్తున మహిళల భాగస్వామ్యం, నిర్ణాయకత మరే ఇతర ఉద్యమాల్లో కనిపించదు. అక్కడ మహిళలు అద్భుతమైన మిలిటెన్సీ, నాయకత్వ పాత్ర పోషిస్తున్నారు. పితృస్వామ్యం కేవలం పురుషుల్లో ఉండేదే కాదు, అదొక ప్రాచీనమైన ఆధిపత్య భావనగా స్త్రీలలో కూడా ఎలా ఉంటుందో అనుభవ పూర్వకంగా గుర్తించి ఆచరణాత్మకంగా ఎదుర్కొంటున్నారు.

ఇంత లోతైన అనుభవం నుంచి మావోయ్టిలకు కొంచెమైనా సిద్ధాంత జ్ఞానం కలుగుతుంది కదా. లేదా సిద్ధాంత అన్వేషణకు ఇది పురికొల్పుతుంది కదా? అలాంటిది ఏమీ ఉండదని కొట్టిపడేయగలమా?

సాంఘిక విషయాల్లో విప్లవకారుల ఆచరణకు ఇదొక ఉదాహరణ. దీని కోసం ఆదివాసీ పోరాటాల్లో వందల ఏళ్ల కిందటి ధిక్కార వారసత్వాన్నంతా స్వీకరించి వర్తమాన ఉద్యమానికి తగినట్లు తీర్చిదిద్దుతున్నారు. ఈ పని మైదాన ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు. ఫూలే అంబేద్కర్‌ తదితరుల స్ఫూర్తిని సాంఘిక విషయాల్లో స్వీకరించారు. మన విప్లవోద్యమంలో అత్యంత ప్రాచీనమైన పితృస్వామ్యం, కులం వంటివాటి నుంచి విముక్తికి కీలక పాత్ర ఉందని విప్లవకారులకు తెలుసు.

అదే సమయంలో గత విప్లవాల్లో లేని పార్లమెంటరీ విధానం మన దగ్గర ఒక ప్రధానమైన సమస్య అని కూడా తెలుసు. సాంఘిక సమస్యలూ, పార్లమెంటరీ విధానం పూర్తి వేర్వేరు స్వభావం కలవి. చారిత్రకంగానే అవి వేర్వేరు. అయితే విప్లవానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక పెద్ద ప్రతిబంధక‌మని మావోయిస్టు అవగాహన.

కాబట్టి అంబేద్కర్‌ పాత్రను సాంఘిక ఉద్యమాల్లో గుర్తించినంత మాత్రాన కొందరు అంబేద్కరిస్టుల్లో ప్రబలంగా ఉన్న పార్లమెంటరీ పంథాను అంగీకరించినట్లు కాదు. నిజానికి ఎప్పటికైనా పార్లమెంటరీ మార్గం ఎలాంటిదో వాళ్లూ గ్రహిస్తారు. అసలు మౌలిక మార్పు వ్యూహం గురించిన చర్చ పూర్తిగా వేరే తలానికి చెందినది. అందులో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపట్ల వైఖరి ఒకటి. ఈ విషయం చర్చకు వస్తే ఘర్షణ పడుతూనే, సాంఘిక ఆధిపత్యం మీద ఈ అన్ని రకాల శక్తులు పోరాడాల్సిన ఉమ్మడి ప్రాంతం చాలా విశాలమైనదనే ఎరుక విప్లవోద్యమానికి ఉంది. ఈ విషయంలో ఇతరులు ఎలా ఉన్నా విప్లవకారులు చాలా సంయమనంతో, దృక్పథ స్పష్టతతో, దృఢమైన వైఖరితో ఉంటారు. రాజ్యం విషయంలో కూడా అంతే. ఎన్నికల ద్వారా ప్రభుత్వానికి రావాలనుకుంటున్న శక్తులతో, ఏకంగా రాజ్యాధికారానికి రావాలని ప్రయత్నిస్తున్న శక్తులతో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఉమ్మడి ఉద్యమాచరణను కొనసాగిస్తోంది. రాజ్యాన్ని వ్యతిరేకించే శక్తి, ఆసక్తి ఎంత ఉంటే అంత వరకు ఈ ఉమ్మడి ఆచరణ సాగుతుంది.

కులం రద్దు కోసం విప్లవకారులు, అంబేద్కరిస్టులు కలవాలనే ఆశ చాలా మందిలో ఉంది. ఆలోచన మంచిదే. అయితే ఇద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ చేయడమో, అంబేద్కరిస్టులు ఎన్నికల్లోకి దిగితే..బాగుంది.. బాగుంది కానివ్వండని అనడమో ఈ ఐక్యతకు అర్థం కాదు. ప్రభుత్వంలో, ఆ మాటకొస్తే తరతరాలుగా అధికార యంత్రాంగంలో అగ్రకులాలే ఎందుకు ఉండాలి? మా వాటా అధికారం మేం తీసుకుంటాం అని దళిత బహుజనుల తరపున ఎవరైనా అంటే అది సామాజిక న్యాయ భావన అంటూనే అయితే అది బూర్జువా మార్గమని కూడా విప్లవకారులు అంటారు. దాని పర్యవసానాలు కూడా వివరిస్తారు. ఈ మాట అన్నంత మాత్రాన పీడిత అస్తిత్వాలను గుర్తించనట్టు కాదు. వాటిప‌ట్ల గౌర‌వంతోనే పీడిత అస్తిత్వాల తరపున కొందరు నాయకులు ఎంచుకున్న మార్గం మీద విమర్శ మాత్రమే.

దళిత బహుజన మేధావులు, రచయితలందరూ నేరుగా ఈ మార్గం గురించి మాట్టాడకపోవచ్చు. కానీ దళిత బహుజన వాదాలను అంగీకరించడమంటే ఈ మార్గాన్ని అంగీకరించాల్సిందే అనే అభిప్రాయం మాత్రం అంతరాంతరాల్లో చాలా మందికి ఉన్నది. అలాగే మార్క్సిస్టులుగా ఉంటూనే దళిత సమస్య చర్చకు రాగానే అసహనానికి గురయ్యే వాళ్లున్నట్లే, విప్లవకారులకు కులం గురించి ఏమీ తెలియదని, పట్టింపు లేదని అనే మార్క్సిస్టులు కూడా ఉన్నారు. కులం గురించే కాదు, విప్లవం గురించీ విప్లవకారుల అవగాహన ఆచరణలో ప్రతిఫలించాల్సిందే. ఆచరణ పురోగమించకుండా, బలోపేతం కాకుండా మాట్లాడుతూపోతే ఒట్టి పాండిత్య ప్రదర్శన అవుతుంది. సిద్ధాంతమంటే ఆచరణకు మార్గదర్శి మాత్రమే కాదు, ఆచరణ వల్ల మాత్రమే నిగ్గుదేలే సత్యం. నేరుగా సిద్ధాంత అన్వేషణ చేద్దామనుకునే వాళ్లకు కూడా దశాబ్దాల ప్రజా ఆచరణ ఒక ఒనరు అయితే మంచిదే. దేనికంటే ఇన్నేళ్ల విప్లవకారుల ఆచరణ రాజకీయ సిద్ధాంత మార్గదర్శకత్వం లేని వ్యవహారం కాదు.

కాబట్టి సాంఘిక విషయాల్లో విప్లవకారులపై విమర్శకు వాళ్ల ఆచరణను, ఆచరణాత్మక అవగాహనను పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత ఎంతయినా విమర్శించవచ్చు. విమర్శనాత్మకత విప్లవ సిద్ధాంతానికి వెన్నెముక అయ్యిందీ దాని ఆచరణ వల్లే. విప్లవకారుల ఆచరణ విమర్శనాత్మకంగా ఉండటమే కాదు, దాన్ని సాధించడం కోసం ప్రాణం పణం పెట్టే సంసిద్ధత వాళ్ల సొంతం. వ్యూహాత్మకంగా దీన్ని పక్కనపెడితే కేవల వాదన మాత్రమే మిగులుతుంది.

కమ్యూనిస్టులు ఎంత విమర్శకైనా పాత్రులే. వాళ్లు ప్రకటించుకున్న లక్ష్యం వల్ల, చారిత్రంగా నిర్వహించాల్సిన పాత్ర వల్ల ఎవరు ఎంతైనా విమర్శించవచ్చు. స్థూలంగా కమ్యూనిస్టు ఉద్యమం అనే మాట ఉపయోగించినా అందులో చాలా నిర్మాణాలు ఉన్నాయి. అనేక స్థాయిల్లో అభిప్రాయాలు, వైఖరులు ఉన్నాయి. వేర్వేరు ఆచరణ రూపాలు, క్రమాలు ఉన్నాయి. ఏ నిర్మాణాల్లో లేని ఉద్యమ సానుభూతిపరులు చాలా మందే ఉన్నారు. వారందరి అభిప్రాయాలు కూడా ఒక్కటి అని కూడా చెప్పలేం. ఆచరణ వల్ల, కాలంతోపాటు కలిసి నడుస్తూ పరిపక్వత సాధించే నిర్మాణాలు ఉన్నట్లే వ్యక్తులూ ఉంటారు.

కాబట్టి ఏ కోణంలో విమర్శ ప్రకటించినా కమ్యూనిస్టులు అని జనరల్‌గా అనడం కంటే నిర్దిష్టంగా అంటే బాగుంటుంది. ఏ రకంగానూ వ్యక్తుల ప్రస్తావన వల్ల ప్రయోజనం లేదు. ఒక నిర్దిష్ట ఆచరణలో ఉన్న పెద్ద సమూహ అనుభవాన్ని, జ్ఞానాన్ని ఉద్దేశించినప్పుడు మాత్రం నేరుగా మాట్లాడుకోవడమే మంచిది.

No. of visitors : 841
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...

  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •