ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి

| సంపాద‌కీయం

ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి

- పాణి | 01.06.2019 10:35:12pm

ఈ ఎన్నికల ఫలితాలు కొందరికి దిగ్భ్రాంతికరంగా ఉండొచ్చు. మరి కొందరిని అమాంతం నిరాశలోకి తోసేయవచ్చు. కొందరైతే దీన్నీ ప్రగతిశీల విప్లవ శక్తుల నెత్తిన పడేసి చేతులు దులుపుకోవచ్చు. ఇట్లా ఎన్నికల ఫలితాల గురించీ ఎంతయినా మాట్లాడుకోవచ్చు కానీ సమస్య అంతకంటే గంభీరమైనది. మొత్తంగానే చాలా సంక్షోభం ఆవరించింది.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా దీన్ని ఎదుర్కోవాలనే వాళ్లు ఉన్నారు. విప్లవకర పరివర్తనకు ఎన్నికల గోదాలో దిగి సమీకరణాలను మార్చేసి ఉంటే ఈ ఫలితాలు ఇట్లా ఉండేవి కాదని వీళ్లనుకుంటారు. ఈ కోణంలో ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ ఒకలాగా ఉంటుంది.

ఎవరైనా ఈ ప్రయోగాలు చేస్తే మంచిదే.

అదెలా ఉన్నా గుండె దిటువుతో నిలబడేవాళ్లు ఇప్పుడు కావాలి. దీనికి సాహసోపేతమైన ఆలోచన, ఆచరణ కావాలి. అయ్యో అయ్యో అని గుండెలు బాదుకుంటే ఈ కాలానికి ద్రోహం చేసినట్లే. నిష్క్రియాపరంగా చేతులు ఎత్తేసి పండిత చర్చకు దిగడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఈ ఫాసిజాన్ని, బూర్జువా నియంతృత్వాన్ని పట్టించుకోలేదనడం సత్యాన్ని కత్తిరించడమే. ప్రజా ఆచరణను కుదించడమే. ప్రజా జీవన క్షేత్రంలోని వేర్వేరు తలాల్లో గత ఐదేళ్ల నుంచి, ఇంకా వెనుకటి నుంచి తీవ్రమైన నిరసనలు వచ్చాయి. ఆందోళనలు జరిగాయి. కేవలం సాంస్కృతిక, సామాజిక ఆధిపత్య హింసకేగాక అనేక మౌలిక సమస్యలపై పోరాటాలు జరిగాయి. అవి విజయం సాధించి ఉండకపోవచ్చుగాని, భవిష్యత్ పోరాటాలకు సన్నాహాలుగా వాటిని గుర్తించవచ్చు. ఆ రకంగా ఫాసిజం పట్ల మన ఆచరణాత్మక అవగాహన చాలా విస్తరించింది. పదునెక్కింది.

అయినా ఫాసిజమే పూర్తిగా పైచేయి సాధించింది. ప్రగతిశీల విప్లవ శక్తులకు ఇప్పుడున్న బలం చాలకపోవడమే దీనికి కారణం. ఎన్నికల్లో ఫాసిస్టు శక్తులకు ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని మాత్రమే చూసి ఆందోళనపడటం సత్యాన్ని పాక్షికంగా చూడటమే. ఇది నిరాశను పులుముకోడానికి తప్ప ఇంకెందుకూ పనికి రాదు. ఫాసిజం ఎలా పెరిగిపోతున్నదో, దాని విష ప్రభావం ఎలా ఉన్నదో ప్రగతిశీల విప్లవ శక్తులకు తగినంత అవగాహన ఉన్నది. దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఫాసిజం గురించి ఏ అవగాహనా లేదని, ప్రజలు ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చున్నారని అనడం నిజం కాదు.

ఒకవేళ ఈ ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చి ఉంటే ఫాసిజం ఓడిపోయినట్లని నిర్ధారించుకునే వాళ్లమా? అప్పుడు మనకు ఫాసిజం అంటే ఏమిటో బొత్తిగా తెలియనట్లే. ఈ ఎన్నికల ఫలితాలు ఫాసిజం బలపడుతోందనడానికి ఒక ముఖ్యమైన సంకేతం మాత్రమే. అంత వరకే తీసుకోవాలి. బీజేపీ అధికారంలోకి రావడమే ఫాసిజం కాదు. ఫాసిజం తీవ్రతను రాజకీయాధికారంలో మాత్రమే చూడటం తగదు. అలాగే దాని విపత్తున కేవలం సామాజిక, సాంస్కృతిక కోణాల్లోనే చూసి ఎదిరించడం సమగ్ర ఫాసిస్టు వ్యతిరేక పోరాటం కాదు. అలాగే ఎన్నికల ఫలితాల్లో ఫాసిస్టు వ్యతిరేకత వ్యక్తం కాకపోవడమే ప్రజా శక్తులు బలహీనంగా ఉన్నాయనడానికి కొలమానం కాదు. ఫాసిస్టు వ్యతిరేక శక్తుల బలహీనతను ఇంకా చాలా విశాలమైన ప్రజా క్షేత్రంలో చూడాలి.

అప్పుడు మాత్రమే ఫాసిస్టు ప్రమాదాన్ని ఎదుర్కోగల అవకాశాలను స్థిమితంగా అన్వేషించగలం, ఆచరించగలం.

ఈ స్పష్టత లేనివాళ్లే ఎన్నికల ఫలితాలకు ప్రగతిశీల విప్లవశక్తుల మధ్య ఐక్యత లేకపోవడమే కారణమనే నిర్ధారణకు వస్తారు. ఐక్యత ప్రాధాన్యతను ఏ కొంచెం తక్కువ చేయడానికి లేదు. ఐక్యం కావాల్సిన శక్తులు ఎన్నో ఉన్నాయి. ఎన్నికల ఫలితాలకు అలాంటి ఐక్యత లేకపోవడమే కారణమనే సూత్రీకరణ ఫాసిజాన్నే కాదు, ఐక్యతనూ అర్థం చేసుకోడానికి కూడా పనికి రాదు. ఐక్యత పవిత్రమైన కోరిక కాదు. అది గాలిలోంచి ఊడిపడేది కాదు. ఆలోచనా, ఆచరణ రంగాలు రెండూ కలగలసిన ఉమ్మడి కార్యక్షేత్రం ఎంత బలంగా ఉంటే అంత ఐక్యతకు అవకాశం ఉంటుంది.

నిరాశ నిస్పృహల వల్ల అయితే కచ్చితంగా ఐక్యత సిద్ధించదు. నిరాశ, భయాందోళనలు ఫాసిజానికి శాశ్వత విజయాన్ని అందిస్తాయి. ఉత్తుత్తి మాటలు ఎన్ని చెప్పుకున్నా ఫాసిజానికి ఏ ఇబ్బందీ ఉండదు. ఏదో ఒక పార్శ్వంలోనైనా సాహస వ్యక్తిత్వం, మేధ, ఆచరణ ఉండాలి. లేకపోతే ఫాసిస్టుల పదఘట్టనల కింద నలిగిపోవాల్సిందే.

ఈ ఎన్నికల్లో ఫాసిజం పై చేయి సాధించిందనే నైరాశ్యం ఎందుకూ పనికి రాదు. అంతా అయిపోయిందని, ఇంకేమీ లేదని, మళ్లీ మొదలు పెట్టాల్సిందే అనే విచారం వల్ల ప్రయోజనం లేదు. ఇట్ల ఆలోచించడమంటే మనంతకు మనం పక్కకు జరిగి ఫాసిజానికి దారి ఇచ్చినట్లవుతుంది.

తిరుగలేని సాహసం ప్రదర్శించాల్సిన అత్యంత అననుకూల పరిస్థితులు ఇవి. ఫాసిస్టు మార్గాలకు ఈ సమాజంలో ఎన్నెన్ని అవకాశాలు ఉన్నాయో గుర్తించి అన్నిటినీ సమూలంగా ఎదుర్కోవాల్సిందే. వందల వేల ఏళ్ల నాగరికతా క్రమంలోంచి, భావజాల సంకెళ్ల మీది నుంచి, ప్రజల మనసుల్లో పేరుకపోయిన మౌఢ్యపు చీకట్ల లోంచి ఫాసిజం వస్తుంది. అవన్నీ ఫాసిస్టు వ్యతిరేక పోరాట క్షేత్రాలు కావాల్సిందే. వీటన్నిటి ఉమ్మడి క్షేత్రంగా పని చేస్తున్నది రాజ్యం. రాజ్యమనేంత పెద్ద మాట వద్దనుకుంటే కనీసం ప్రభుత్వం అని గుర్తించాలి.

ప్రభుత్వ పశుబలాన్ని, అతి క్రూరమైన ఒక సామాజిక దుర్నీతిని పోల్చి ఏది బలీయమైనదనే విచికిత్సకు గురి కావాల్సిన పని లేదు. ప్రభుత్వంపై నీ వైఖరి ఏమిటి? అనేదే నీ ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి గీటురాయి. ఆ తర్వాత పాటించాల్సిన విలువైన గీటురాళ్లు ఇంకెన్నయినా ఉండవచ్చు. దేనికంటే ఫాసిజం ఎన్నెన్ని మార్గాల్లో వస్తున్నదో ఆ మార్గాలన్నిటికి కాపలాగా, విశాలం చేస్తున్నదీ సాయుధ ప్రభుత్వమే. ఈ మొత్తానికి సామాజిక సాంస్కృతిక వ్యవస్థలతో ఉన్న లోతైన సంబంధాన్ని విస్మరించకుండానే ప్రభుత్వాన్ని కేంద్రం చేసి పోరాటాలకు సిద్ధం కావాలి. దేనికంటే ఏ చిన్న విమర్శను, ప్రత్యామ్నాయ ఆలోచనను ప్రభుత్వాలు అంగీకరించడం లేదు. తీవ్రంగా అణచివేస్తున్నాయి.

ఫాసిజాన్ని ఎదుర్కొనే పోరాటం ఎక్కడ ప్రారంభించినా రాజ్యం ఎదురెక్కి వస్తోంది. సాంఘిక సంస్కరణలు, చట్టబద్ధ హక్కులు, సాంస్కృతిక వ్యక్తీకరణలు, ఆహారపు అలవాట్లు.. ఇలా ఎక్కడి నుంచి బయల్దేరినా ప్రభుత్వం చుట్టుముడుతోంది. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతామా? లేక ఏదో ఒక నాజూకైన దారి వెతుక్కుంటామా? అనే అతి ముఖ్యమైన జంక్షన్లోకి ఫాసిజం మనల్ని తీసుకొచ్చింది. విచిత్రమేమంటే దేనిలోనైనా ఎత్తుగడలు ఉంటాయి కాని ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో ఏ ఎత్తుగడా ఉండదు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమా? మర్యాదస్తుల్లా తప్పుకొనిపోవడమా? రెండే మార్గాలు ఉంటాయి. తేటతెల్లంగా తేలిపోయే విషయమిది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ప్రదర్శించకుండా ఎన్ని మాటలు చెప్పినా నిష్ప్రయోజనమే. ప్రభుత్వ వ్యతిరేకత కంటే కమ్యూనిస్టు విప్లవ వ్యతిరేకతపట్ల చురుగ్గా వ్యవహరించే శక్తులు పెరిగిపోవడం వెనుక తర్కం గమనించాలి. వాళ్లకు అందులో చాలా సౌకర్యం ఉంది. వీళ్లలోనే తిరిగి ఐక్యత కోరే వాళ్లూ ఉన్నారు. ఇలాంటి వాళ్లను ఏమీ అనకుండా ఐక్యతను స్వప్నించే ఇతరులూ ఉన్నారు. విప్లవ వ్యతిరేకతను ఉంచుకుంటూనే ఫాసిస్టు వ్యతిరేకతలో భాగంగా ప్రభుత్వ వ్యతిరేకతకు సిద్ధమైనా మంచిదే. తమను ఎంత వ్యతిరేకించినా ఫర్వాలేదు.. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు వస్తే చాలు, సామాజిక దుర్మార్గాలను వ్యతిరేకిస్తే చాలు.. ఐక్యతకు ప్రాతిపదిక ఉన్నట్లే అని విప్లవ శక్తులు భావిస్తాయనడానికి చరిత్రలోంచి చాలా ఉదాహరణలు చూపవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక పోరాట చరిత్ర ఎంతో ఉన్న విప్లవశక్తులకు ఈ విషయంలో స్పష్టత ఉన్నది. దేనికంటే ఫాసిస్టు నిర్మూలన ఏ ఒక్కరి వల్లా కాదు. అది మౌలికంగా సమాజాన్ని చైతన్యవంతంగా పునర్నిర్మించే సమగ్ర ప్రక్రియ. దీనికి దోహదపడే శక్తులు మన దగ్గర ఎన్నో ఉన్నాయి. వాటి ఐక్యతను, ఉమ్మడి ప్రభావశీల వ్యక్తీకరణను ఎంత సాధిస్తే అంత ఫాసిజంమీద విజయానికి అవకాశాలు మెరుగవుతాయి.

అయితే ఫాసిస్టు వ్యతిరేకతలో ప్రభుత్వ వ్యతిరేకత చాలా కీలకం. మరెన్ని రూపాల్లో పని చేసినా దీన్ని తక్కువ చేయడానికి లేదు. ప్రభుత్వం పింఛన్లు ఇచ్చి, ఉచితాలు ఇచ్చి తన మీద ఆధారపడి బతికేలా ప్రజలను తయారు చేసుకుంటుంది. ఇంకో పక్క మానవ ఆవాసాలను, మనిషి ఉనికి తుడిచేసే బుల్డోజర్ పదఘట్టనలతో సాగిపోతుంది. ఇదేమిటని అడిగే వాళ్ల లేకుండా భయపెట్టి లోబరుచుకుంటుంది. ప్రాచీనమైన హేతురాహిత్య భావజాలంలోకి జనాన్ని తోసేసి తన పని తాను చేసుకపోతుంది.

ఈ మొత్తాన్ని ఎక్కడ ప్రశ్నించినా అది ప్రభుత్వ వ్యతిరేకపోరాటం అవుతుంది. వ్యవస్థీకృతమైన దోపిడీ, పీడనలను, అసమానతలను ప్రశ్నించే పని ప్రభుత్వ విధానాల దగ్గర ఆరంభమవుతుంది. రైతాంగ సమస్య, నిరుద్యోగం, ఆధునిక వెట్టి చాకిరీని పోలిన ఔట్ సోర్సింగ్ విధానం వంటివి ఎన్నో ఉన్నాయి. మనుషులు తమ జీవన్మరణ సంక్షోభంలోంచి కనెక్ట్ అయ్యే మౌలిక పోరాటాలకు సిద్ధం కావాలంటే ప్రభుత్వ వ్యతిరేక చైతన్యం ఉండాలి. సంసిద్ధత ఉండాలి. దేశ జనాభాలో సగం మందిని మంచినీళ్లు కూడా అందని స్థితిపై చేసే పోరాటానికి ఏ స్వభావం ఉంటుందో చెప్పనవసరం లేదు. వీటిని పట్టుకుంటేనే విస్తృత ప్రజా సమీకరణ సాధ్యమవుతుంది. ముఖ్యంగా మిలిటెన్సీ పెరుగుతుంది. అదే లేకపోతే ఫాసిజం కన్నెర్రజేస్తే ఎలాంటి సామాజిక, సాంస్కృతిక పోరాటాలైనా కుప్పకూలిపోతాయి. కనీసం ఆ రంగాల్లోని పోరాటాలైనా విస్తరించాలంటే మిలిటెన్సీ పెరగాల్సిందే. ఇవాళ ఫాసిస్టు వ్యతిరేకపోరాట రూపాలన్నిటిలో లోపించింది అదే. కేవలం లాంఛన ప్రాయంగా, పాండిత్య ప్రదర్శనగా అవి మిగిలిపోతున్నాయి. అసలు ఏ ప్రజలు ఫాసిజం బారిన పడకుండా నిటారుగా నిలబడాలో వాళ్లను కదిలించే తక్షణ, దీర్ఘకాలిక పోరాటాలు రెంటికీ ప్రభుత్వ వ్యతిరేక మిలిటెన్సీ పెంచడమే ఇప్పుడు చేయాల్సిన పని.

సామాజిక పోరాటాలు విజయం సాధించడంలో ప్రజల మానసికతను పునర్నిర్మించడమనే కర్తవ్యం ఉంది. సామాజిక మానసిక స్థితిని మార్చడం దానికదే ఫాసిస్టు ఓటమికి అవసరమైన ఆవరణను సిద్ధం చేస్తుంది. అయితే ఆ ఒక్కదానితోనే ఫాసిజాన్ని ఓడించలేం. ఇంకోదాన్ని పోటీ తేవడం కాదు ఇది. ప్రభుత్వ వ్యతిరేక చైతన్యం పెంచని ఉదార్త పోరాట కర్తవ్యాలు సునాయాసంగా క్రియారహితమయ్యే ప్రమాదముంది. అస్తిత్వవాదులకు ఫాసిజాన్ని ఎదుర్కోవాలనే ఆశయమే ఉంటే ఈ ఎరుక అవసరం. సాంఘిక విముక్తి సాధించాలన్నా ఫాసిజాన్ని నిలువరించే పోరాటంలో భాగం కావాలి. ఈ మొత్తానికి సాంఘిక రంగంలో మిలిటెన్సీ ఒక్కటే సరిపోదు. ఆ సంగతి ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. గత ఐదేళ్లలో ఏం జరిగిందో మన అనుభవంలో ఉన్నదే. ప్రభుత్వ వ్యతిరేక మిలిటెన్సీ పెంచుకోకపోతే ఏ విషయంలోనూ గొంతు పెగలని స్థితి దాపురిస్తుంది.

ప్రజలను క్రియారాహిత్యం చేయడం ఫాసిజంలోని ఒక దుర్మార్గమైన వ్యూహం. దాన్ని ఎదుర్కోడానికి రాజ్య వ్యతిరేక క్రియాశీలత పెంచుకోవాలి. సామాజిక బంధనాల నుంచి, దోపిడీ నుంచి బైటికి రావాలంటే ప్రభుత్వ వ్యతిరేక మిలిటెన్సీ అత్యవసరం అని విప్లవోద్యమం భావిస్తుంది.

ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ అవసరం మరింత పెరిగింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయంలో పరిస్థితి ముంచుకొస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ప్రజలు, మేధావులు అందరూ తనకు లొంగిపోయి బతకాల్సిందేకాని రెండో మాట మాట్లాడటానికి లేదని తేల్చేసింది. దీనికి పౌరహక్కుల నాయకుడు, ముఖ్యంగా ముస్లిం హక్కుల ఉద్యమకారుడు, ఉపాధ్యాయుడు లతీఫ్ఖాన్ను ప్రభుత్వం ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడం తాజా హెచ్చరిక. ఉపాధ్యాయుడిగా విధి నిర్వహణలో తప్పు చేసినట్లు రుజువైతే సస్పెండ్ చేయవచ్చు. కానీ పౌరుడిగా రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ఆయన ప్రభుత్వ విధానాలపై తన విమర్శ ప్రకటించారు. అంతే. సస్పెండ్ చేశారు. బహుశా అన్ని రంగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు గుణపాఠంలా లతీఫ్ఖాన్పై ఈ చర్య కేసీఆర్ తీసుకున్నాడు. భయంతో, లేదా భక్తితో దొరవారికి సలాంకొడుతూ, ఆయన పాలనా వైభవాన్ని గానం చేయనందుకు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు.

తనకు భిన్నంగా ఆలోచిస్తే సహించకపోవడం అన్ని ప్రభుత్వాలకు ఉన్నదే. ఫాసిజం అంత మాత్రమే కాదు. ఒక రకమైన భయంలోకి మనుషుల్ని తోసేస్తుంది. మనుషులు దుర్బలంగా తయారవుతారు. పోరాడగలమనే నైతికధృతిని సహితం కోల్పోతారు. ఇప్పుడు తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు భయపడి ఫాసిజాన్ని స్వాగతించాలా? లేక ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఫాసిజాన్ని నిలువరించాలా? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల స్థితి ఇక్కడికి చేరుకున్నది కాని, వేర్వేరు రంగాల్లోని ప్రైవేట్ జీతగాళ్ల పరిస్థితి మొదటి నుంచీ దుర్భరమే. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల దగ్గరి నుంచి విశ్వవిద్యాలయ ఆచార్యుల దాకా ఇప్పుడు ప్రభుత్వ విమర్శకు సిద్ధమవుతారా? లేదా? అనే పరీక్షా కాలమిది. ఫాసిజమంటే ఇదే.

ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ ఆందోళన కలిగిస్తోంది. పైగా జగన్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనేక ముద్రల్లో రౌడీ అనే ఇంప్రెషన్ కూడా ఒకటి. ఆయన చుట్టూ అలాంటివాళ్లే ఉంటారనే అభిప్రాయం కూడా ఉంది. 150 సీట్లు వచ్చినంత మాత్రాన ప్రజాస్వామికవాది అయ్యే అవకాశం మన పార్లమెంటరీ విధానంలోనే లేదు. ఎన్నికల రాజకీయాల పట్ల భ్రమలున్న వాళ్లు ఈ సంగతి గుర్తించాలి. జగన్ వల్ల రాయలసీమకు ఏదో మేలు జరుగుతుందనే ఆరాటం అప్పుడే మొదలైంది. వాళ్ల నాయిన వదిలేసిపోయిన భగీరథ కర్తవ్యాలు కొడుకు తీరుస్తాడని గంపెడు ఆశ పెంచుకున్నవాళ్లున్నారు. అప్పుడే మేధావులకు ఆ వైపు గాలి మళ్లుతోంది. రాయలసీమకు ఏమైనా ʹమేళ్లుʹ చేస్తే మంచిదేగాని, ఈ పక్క టీఆర్ఎస్తో, పైన బీజేపీతో ఉన్న స్నేహం, వాళ్ల మధ్య ఉన్న స్నేహం అన్నీ కలిసి ఏపీ ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతుంది. చీకటి కొట్టుగానే మారుతుంది. ఈ మాట అనడం ముందస్తు ఎంత మాత్రం కాదు. ముందస్తుగా అనకపోవడమే నేరమవుతుంది.

బూర్జువా ప్రభుత్వాలు వాటి సహజ స్వభావమైన బూర్జువా నియంతృత్వాన్నే చెలాయిస్తాయి. ఇంకోలాగా అవి మనుగడ సాధించలేవు. భీమా కొరేగావ్ కేసు ఈ నియంతృత్వానికి ఒక మచ్చుతునక. అది సమాజంలో ఏ భిన్నాభిప్రాయాన్ని సహించదని, దాని కోసం ఎంత బరితెగింపుకైనా సిద్ధమవుతుందని రుజువైంది. అందులో ఇంకో హెచ్చరిక కూడా ఉంది. భిన్నాభిప్రాయం ఉన్నవాళ్లు ఎంత పెద్దవాళ్లయినా కావచ్చు, తమ వృత్తి వల్ల, ప్రవృత్తి వల్ల, ప్రజా జీవితం వల్ల, మేథో సృజనాత్మక కృషి వల్ల ఎంత గుర్తింపు ఉన్నా సరే ఖాతర్ చేయనని ఆ కేసు తేల్చేసింది. తెలంగాణలో దాని సూక్ష్మ రూపమే లతీఫ్ఖాన్ ఉదంతం.

కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలను, విశ్లేషణలను, చైతన్యాలను పెంచడం తప్ప దగ్గరి దారి ఏదీ లేదు. ఎత్తుగడలు అస్సలు లేవు. అందుకే ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలుగు ప్రజలకు, దేశప్రజలకు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు తప్ప దగ్గరి దారి ఏదీ లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో ఇంకా ప్రయోగాలు చేద్దామనుకుంటున్నవాళ్లు కూడా కొంచెం ప్రభుత్వ వ్యతిరేకత ప్రదర్శిస్తే మన ప్రజాస్వామ్యం ఏమిటో నేరుగా అనుభవంలోకి వస్తుంది. అలాగే అయినదానికి కానిదానికి విప్లవ ప్రజాస్వామికశక్తులను నిందించే వాళ్లు కూడా కాస్తంత ప్రభుత్వ వ్యతిరేకతకు సిద్ధమైతే పోరాటాల్లో సాహసం అవసరం ఏమిటో తెలుస్తుంది.

ఈ ఎరుకే ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనకు సరైన దారి చూపుతుంది.

No. of visitors : 579
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •