Democratized Poetry

| సాహిత్యం | స‌మీక్ష‌లు

Democratized Poetry

- డాక్టర్ వెల్దండి శ్రీధర్ | 01.06.2019 11:02:18pm

కవిత్వాన్ని డెమొక్రటైజ్ చేయడం, ప్రజలను సెన్సిటైజ్కు గురిచేయడం అందరు కవులకు చేతకాదు. కొన్నిసార్లు కవికి తెలియకుండానే పాఠకులకు దూరమవుతాడు. ఇంకొన్ని సార్లు పాఠకులే సదరు కవిని తిరస్కరిస్తారు. భాష చేత, భావం వలన, వస్తువు కొరకు కవిత్వం ప్రజల దాకా చేరడం అంత సులభం కాదు. ఒక ధర్మపురి శేషప్ప కవి, ఒక సిద్ధప్ప వరకవి, ఒక దాశరథి కృష్ణమాచార్య, ఒక కాళోజీ నారాయణరావు మొదలైన కవులు ఇప్పటికీ ప్రజల నాలుకల మీద జీవించి ఉన్నారంటే వారి కవిత్వం డెమొక్రటైజ్ చేయబడి, వారు ఏ సమూహాలనో సెన్సిటైజ్ చేయడమో అయ్యుండవచ్చు. సబాల్టర్న్ శ్రేణులను సాహిత్యంలోకి తీసుకురావడం, సరళమైన భాష వాడడం, భిన్నమైన అభివ్యక్తితో కవిత్వం చేయడం ఈ మూడు బహుశా కవిత్వాన్ని డెమొక్రటైజ్ చేయడానికి ఉపయోగపడుతాయేమో! కాలం కవులను, కవిత్వాన్ని తప్పక వడగడుతుంది. జల్లెడ కిందికి రాలిపోయిన వారు పోగా, మిగిలేది ఎప్పుడూ పిడికెడు కవులే. ఆ పిడికెడు కవుల్లో ఇప్పుడు ఆధునికంగా వినిపిస్తున్న విలక్షణమైన పేరు జోద కోబల్ (డా|| జె. రాజారాం). ఎందుకంటే ఆయన ʹతెలంగాణ నా మాతృభూమిʹ పేరిట ʹమరో కోణపు కవిత్వమ్ʹ రాయడమే. ఇందులోని 21 కవితల్లో ఏ ఒక్కటీ ఊహల ప్రపంచంలో తేలియాడుతూ, ఏవో రస లోకాలకి తీసుకుపోయేది కాదు. ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు గాయపడ్డ జీవితాలే కవితా రూపాన్ని సంతరించుకొని పుటల మీద నిల్చున్న కవిత్వం ఇది. ఉద్యమ జీవితం కావచ్చు, బంజార జీవితపు సెగ కావచ్చు, మార్జినలైజ్డ్ పీపుల్ బతుకు పోరాటం కావచ్చు ఏదైనా ఒక రకమైన నొప్పితో కూడుకున్న అక్షరాలే ఇందులో కనిపిస్తాయి. కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ అని ఒక సాహిత్య నానుడి. కాని ఈ కవిత్వం జీవితాల్ని విప్పి చెప్పిన కవిత్వం. ఒక జానపద పాటలాగా, ఒక గిరిజనుడు సంధించిన విల్లంబులాగా పాఠకుడి మనసులోకి నేరుగా దూసుకుపోయే కవిత్వం. కుండబద్ధలు కొట్టినట్లుగా, ముసుగులో గుద్దులాట లేకుండా కవి తాను చెప్పాలనుకున్నది కుళ్లం కుళ్లా చెప్పి మెప్పించడం కనిపిస్తుంది. రాత్రికి రాత్రే కవినైపోయి తోచిన వస్తువుల మీద కుప్పలు కుప్పలుగా కవిత్వమేదో రాసేని తత్త్వవేత్త అవతారమెత్తాలనే ఉబలాటపు కవి కాదు ఇతడు. సుమారు పదహారేళ్లపాటు తాను జీవించిన సమాజాన్ని వస్త్రగాలం పట్టి ఎంతో జాగరూకతతో వస్తువునెన్నుకొని అంతే జాగ్రత్తగా కవిత్వమై మన ఎదుట నిల్చున్న కవి. అంటే ఒక రకంగా ఇతనిది అనుభవవాద కవిత్వం. వాస్తవిక సంఘటనకు ఒకింత కవిత్వాన్ని అద్ది పేరు తెలియని అడవిపక్షిలాగా ప్రమాదాన్ని హెచ్చరించే కవిత్వం.

ʹʹకాలం ప్రవహిస్తూనే వుంది
1969 నుండి
అంతకంటే ముందు నుండి కూడా
అది ద్రోహులను తేదీల కొక్కానికి
వేలాడ దీసి
హెచ్చరిస్తూనే వుంది
ఓడిపోయిన ప్రతిసారి
అది తల్లి గర్భంలో
తెలంగాణ ఉద్యమకారుల్ని
పిండస్తం చేస్తూనే వుందిʹʹ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1952 నుండే పోరాటాలు జరిగాయని చరిత్ర చెబుతోంది. ఎంతో మంది నాయకులు తెలంగాణ నినాదాన్ని తలకెత్తుకొని నమ్మించి కొంత దూరం ప్రజలతో కలిసి నడిచి మధ్యలోనే ఎత్తేసి పదవుల కోసం మోసం చేసిన చరిత్ర కూడా చరిత్ర చెబుతుంది. తొలి దశలో పోలీసుల తూటాలకు, మలి దశలో ఒంటికి నిప్పంటించుకొని మరీ ఆత్మత్యాగం చేసిన యువకులను చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. ఈ నేల కోసం అగ్గిని ముద్దాడిన వాళ్లు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ముందు అగ్నిగోళమై మండిపోయిన వాళ్లు, ʹనిప్పుల వస్త్రాన్ని వొంటికి చుట్టుకొని విలయ విన్యాసంʹ చేసిన వాళ్లు, ʹనిప్పు పెదవులతో తెలంగాణ మట్టిని ముద్దాడిన వాళ్లు, నిప్పును పుక్కిట పట్టినʹ వాళ్లు ఎంతో మంది. ఆనాడు ఎవరి ఊపిరి ఆగినా, నినాదమై ఆకాశ పర్యంతం ఎగిసినా అది కేవలం తెలంగాణ కోసమేనంటే అతిశయోక్తి కాదు. ఉద్యమంలో పాలక వర్గాలు ఎంత మందిని భూస్థాపితం చేసినా ఇక్కడి తల్లులు మళ్లీ కొత్త పోరాట వారసులను పిండస్తం చేస్తూనే ఉన్నారని, తరాలు మారినా ఉద్యమం ఆగేది కాదని దాని చారిత్రక భూమికను ఇప్పటి తరాలకు బోధిస్తాడు కవి.

ʹʹబంగారి తెలంగాణ అంటే
ఇనుమును వదిలేసి
బంగారం గురించి మాట్లాడడం
పునాదిని వదిలేసి
భవనం గూర్చి మాట్లాడడం
భవనానికి వేసే
రంగు గురించి మాట్లాడడం
పునాదిని గురించి
మాట్లాడక పోవడమంటే
చిక్కి శల్యమైన
ఎద్దు గురించి మాట్లాడకుండా
దాని కొమ్ములకు
రంగులద్దడంʹʹ

ఈ కవితలో ʹఇనుమునుʹ పేదరికానికి, ʹపునాదిʹని తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన త్యాగమూర్తులకు, ʹఎద్దుʹను ఎముకల గూడులా మిగిలిన వర్గాలకు సంకేతించి కవి ʹబంగారు తెలంగాణʹ నినాదం వెనకగల కుట్రను బట్టబయలు చేస్తున్నాడు. తెలంగాణ ఏర్పాటు మొదలు ఇప్పటిదాకా పాలక వర్గాలు ఎప్పుడూ ʹబంగారు తెలంగాణʹ అంటున్నారు తప్పితే సామాజిక తెలంగాణ, సర్వజన శ్రేయో తెలంగాణ నిర్మిస్తామని ఎప్పుడూ చెప్పడం లేదు. ʹబంగారు తెలంగాణʹ మాట వెనక ఒక పెట్టుబడిదారి వ్యవస్థ, ఒక ఫ్యూడల్ పాలన నిండి ఉందని చెప్పకనే చెప్తాడు కవి.
గ్రామాలలో
నిప్పు పుడుతుందేమో కాని
ఉప్పు పుట్టదు
సముద్ర తీరాల నుండి
ఉప్పును
కార్ఖానాల నుండి ఇనుమును
గ్రామాలకు చేర్చింది ఈ జాతే
...................................

ఓ వేగుచుక్కా!
వెచ్చని వెన్నెల కింద
పరిఢవిల్లిన
సాహిత్య, నృత్య, సంగీతాల ఝరి
ʹతీజ్ʹ నా సంస్క ృతిʹʹ

శతాబ్దాలుగా ప్రజల నాలుకల మీదికి ఉప్పు రుచిని తీసుకొచ్చింది దేశదిమ్మరులైన లంబాడ జాతివారేనంటే ఆశ్చర్యం కలుగుతుంది. దేశ మూల మూలలకు తిరిగి, సరిహద్దులను దాటి ఉప్పమ్ముకుంటూ బతికే వాళ్లను, వ్యాపార సంస్క ృతిని నేర్పిన వాళ్లను ఈ సమాజం నేరగాళ్లుగా, దొంగలుగా ముద్రవేసింది. లంబాడాల ఆహారపు అలవాట్లను, వేష, భాషలను, సంస్క ృతిని సమాజం ఈసడించుకుంది. అంటరానితనాన్ని అంటగట్టలేదు కాని అంతకంటే ఎక్కువైన వివక్షను చూపింది. ఉప్పును నమ్ముకొని నిప్పులా బతికిన జాతి బంజారాలు. బంజారాల జీవితాల వెనక దాగిఉన్న చీకటి వెలుగులను అనుభవం నుంచి రాసిన కవిత్వం ఇది.

ʹʹఅంటరానితనం
అవమానం
పేదరికంతో పాటు
బాలమ్మ
వారసత్వంగా
ఏడుమెట్ల కిన్నెరను కూడ
అందుకుంది
..............

సంగీత స్వరాలు
ఆమె యాచక వృత్తిలో
భాగమనుకున్నారు కాని
బాలమ్మ 90 ఏళ్ల
సంగీత సారాన్ని
ప్రజల దగ్గరికి తీసుకెళ్లింది
...............................

సంగీతం ఆమె శ్వాస
ఈ దేశంలో
బాలమ్మ అస్ప ృశ్య సంగీతానికి
అధికారిక చిరునామాʹʹ

శాస్త్రీయ సంగీతానికి మూలం జానపద సంగీతమేనని ఒప్పుకొని తీరాల్సిందే. సంగీతంలోని సప్తస్వరాలు కూడా ఆయా జంతువుల అరుపుల నుండే గ్రహించారని ప్రతీతి. నిజానికి నిరక్షరాస్యులైన ప్రజల నాలుకల మీదే బోలెడు సంగీతం దాగుంది. ఇప్పటి ఎన్నో సినిమా పాటలు, కృతులకు భీజం జానపద సంగీతమేనంటే అతిశయోక్తి కాదు. ఎంతో మంది అంటరాని, గిరిజన, పామర జన వాద్య పరికరాల్లో ఇమిడి ఉన్న సంగీతాన్ని శాస్త్రీయ సంగీతకారులు ఎంత వరకు ఇమిడించుకున్నారనేది ఇప్పటికీ తేలని ప్రశ్న. ఏడుమెట్ల కిన్నెరలాంటి వాయిద్యాలను చేతబూని ఇంటింటికీ తిరుగుతూ యాచించే వాళ్లను చూస్తున్నప్పుడు వాళ్లు అడుక్కునే వస్తువులు, డబ్బులపైనే మన దృష్టంగా ఉంటుంది కానీ వాళ్లు దానం చేసే సంగీతం మీదికి పోదు. దాన్ని ఒక అస్పృశ్య సంగీతంగానే చూస్తాం. ఇలాంటి కళాకారులకు సమాజంలో విలువ లేదు. సరికదా కనీసం మనుషులుగా కూడా చూడక వాళ్లను బిక్షగాళ్లుగానే చూడడం మరీ ఘోరమైన విషయం.

సాధారణ వచనాన్ని కవిత్వం చేయడానికి కవిత్వ పరిభాష ఏదో కావాలి. ఇట్లా కవిత్వాన్ని అల్లుకుంటూ పోతున్న క్రమంలో కవి తన కవిత్వ శైలిని స్థిరపర్చుకుంటాడు. తన భాషను స్థిరీకరించుకుంటాడు. అట్లాగే తనవైన మెటఫర్ల (నిప్పుల వస్త్రం, మంటల కొరడా, చెలకల నొసళ్లు)ను, సిమిలీ (తెల్లటి మబ్బు పరుచుకున్నట్లుండే మా ఊరి చెరువు)ని, ఇమేజరీ (ఉద్యమాల కొలిమి, కలల కాగితం)లను, పెర్సోనిఫికేషన్ (వాళ్లు చేతులకు శ్రమ ఊడలు మొలిచిన వాళ్లు, నీళ్లు నిండి గర్భం దాల్చే మా ఊరి చెరువు)ను మెటానమి (పోరాట దీపం), అల్యూజన్ (ధర్మాపురం ధర్మవీరుడు)ను, అలెగరీ (ఆ ఆకలే ఇప్పుడామెను రోడ్డు మీదికి తెచ్చింది)ని, టోన్ (బాలమ్మ ఏడుమెట్ల కిన్నెరనే నమ్ముకుంది అంతకన్నా ఆమెకి మరేముంది?)ను కూడా ఏర్పర్చుకుంటాడు. అప్పుడే తనదైన ప్రత్యేక మార్గం ఒకటి ఏర్పడి కవితా ప్రపంచంలో ఒక స్థానం దొరుకుతుంది. ఇందులో కొందరు సఫలీకృతులవుతారు. కొందరు ముందు తరం కవులను అనుకరించి అనుకరణ కవులుగానే మిగిలిపోతారు. జోద కోబల్ది ప్రత్యేక స్వరం. దానికి నిదర్శనం ఇందులోని అనేక కోణాల కవిత్వం. ఈ కవితా సంపుటి ఒక అనేక అస్తిత్వాల వినిర్మాణ క్షేత్రం.

No. of visitors : 303
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •