అదే అహంకారం

| సాహిత్యం | వ్యాసాలు

అదే అహంకారం

- పాణి | 16.06.2019 09:43:01am


నిన్న శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం.. ఇవాళ స్పీకర్‌ ఎన్నిక.. ఇంకా పూర్తిగా సర్దుకోలేదు. లాంఛనప్రాయమైన గవర్నర్‌ ప్రసంగం పూర్తి కాలేదు. అప్పుడే తన్నుకోవడం మొదలు పెట్టారు. తన ʹఅఖండʹ మెజారిటీ వల్ల అత్యల్పంగా కృశించిపోయిన ప్రతిపక్షాన్ని పట్టించుకోకుండా జగన్‌ తన ʹపనిʹ తాను చేసుకపోవచ్చు.

కానీ పార్లమెంటరీ రాజకీయాల స్వభావం ఎక్కడికి పోతుంది? పులివెందులలో ఆయన కుటుంబం నేర్చుకున్న బుద్ధులు ఎక్కడికి పోతాయి? సభలో స్పీకర్‌ ఎన్నిక గొడవ.. చంద్రబాబు ఏదో అంటున్నాడు.. అప్పుడు జగన్‌ ముఖం మీది నవ్వు చూడాలి.. ఎవరికైనా చప్పున ʹనాన్నగారుʹ గుర్తుకొచ్చి ఉండాలి. నాకైతే పులివెందుల పాలెగాళ్ల అహంకారం కనిపించింది. దానికి తిరుగలేని మెజారిటీ వల్ల సంక్రమించిన విజయోన్మత్తత తోడైతే..? తలచుకుంటేనే భయం గొలుపుతోంది. ఆ పక్కన ఉన్న చంద్రబాబు గురించి ఇన్నేళ్లుగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా అక్కర్లేదు. అలా మనం మాట్లాడాల్సిన అర్హత చంద్రబాబుకు ఏమీ లేదు. కానీ జగన్‌ అనే రౌడీ ఇమేజ్‌ ఉన్న నాయకుడి సారధ్యంలో రాష్ట్రం ఏమవుతుందనే ఆందోళన ఎవరికైనా కలుగవచ్చు. అలా కలిగితే అది వాళ్ల సమస్య కాదు.

ఇప్పుడు ఎంత విషాదకరమైన రాజకీయ వాతావరణంలో బతుకుతున్నామంటే.. ఈ రౌడీ ఇమేజ్‌ కంటే పాలెగాడి ఇమేజ్‌ ఉన్న వాళ్ల నాయినే ఎవరికై ముద్దొచ్చేలా కనిపించవచ్చేమో. ఈ తండ్రీ కొడుకులు, ఆ తండ్రీ కొడుకులు, పక్క రాష్ట్రంలోని తండ్రీ కొడుకులు, పైన ఉన్న తల్లీ కొడుకులు.. ఇలా అందరూ పేర్లు వేరే, కుటుంబాలు వేరే, అంతా ఒకే రాజకీయ వంశస్తులు.

కానీ ఒక మోస్తరు మేధావులనబడే వాళ్లు కూడా జగనన్న విధానాలకు ఉబ్బితబ్బియిపోతున్నారు. పైగా పది రోజులు కూడా కాలేదు కదా.. అప్పుడే విమర్శించడం దేనికదే దొడ్డ బుద్ధులు కూడా సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్నాయి. చంద్రబాబుకంటే బెటర్‌గా కనిపిస్తున్నాడనే క్వాలిఫికేషన్‌ను కొందరు ఇచ్చేశారు.

పాలకులను అర్థం చేసుకోడానికి పది రోజుల కావాలా? పది నెలలు కావాలా? ఈ గడువులు దేనికి? ఇందులో ఉన్న అర్థం ఏమిటి? దినపత్రికలు మాత్రమే చదువుకొని సత్యాన్ని తెలుసుకొనే వాళ్ల సంగతి వదిలేద్దాం. కానీ మేధావులంటే, ప్రజాస్వామికవాదులంటే ప్రజల పక్షమనే కనీస నమ్మకం ఉన్న వాళ్లు తప్పక ప్రభుత్వాలపట్ల విమర్శనాత్మకంగా ఉండాలి. గట్టిగా చెప్పాలంటే ప్రభుత్వ వ్యతిరేకతే మేధావి అనిపించుకోడానికి తొలి అర్హత. ఇదేమీ లేకుండా ముఖ్యమంత్రి మా ప్రాంతం వాడు కాబట్టి అని కొందరు, మా కులం వాడు కాబట్టి అని ఇంకొందరు, ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎడతెరపి లేకుండా పెడుతున్న సంతకాలను చూసి మరి కొందరు నిర్వమర్శగా చూసి మురిసిపోయేట్టయితే మేధావులని, ప్రజాస్వామికవాదులని పిలిపించుకొనే అవకాశం ఘోరంగా కోల్పోయినట్లే.

ప్రభుత్వాలు మారినప్పుడు ఎంత మాయగమ్ముతుందంటే.. అప్పుడే విమర్శించడం దేనికి అని సుద్దులు చెప్పడం మొదలు పెడతారు. దీనికి పత్రికలు, టీవీలు తోడవుతాయి. నిన్నటి దాకా నానా దుమ్మెత్తిపోసిన పత్రికలు, టీవీ చానళ్లకు ఇప్పుడు జగన్‌ను చూసి ఆ జగన్‌.. ఈ జగన్‌ వేరేనా? అనే దిక్కుమాలిన విశ్లేషణలు ప్రారంభిస్తాయి. నిన్నటి దాకా మీకున్న పొలిటికల్‌ కమిట్‌మెంట్‌ మాటేమిటని అడిగితే.. ఇలా ఉండటమే పత్రికల పాత్ర నిర్వహించడమని, ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయడమని, ఇంకా బరితెగించి ప్రజాస్వామికంగా ఉండటమనీ పత్రికల వాళ్లు అనేయగలరు. జగన్‌ ప్రమాణ స్వీకారం అయినప్పటి నుంచి ఒక్క పత్రిక కూడా నిన్నటి దాకా చూపిన ʹవిమర్శనాత్మకతʹను చాలా జాగ్రత్తగా మర్చిపోయాయి.

ఇదంతా అప్పుడే విమర్శించడం దేనికి? అనే సుభాషితాల దాకా వెళ్లింది. ముఖ్యమంత్రి పదవికి జగన్‌ కొత్తకాని, మనకు పాలకులు కొత్తా? వాళ్ల వర్గ స్వభావం, వాళ్ల ప్రయోజనాలు కొత్తా? కొత్త మురిపెం వాళ్లకు ఉండొచ్చు. మనకెందుకు ఉండాలి? రాజ్యాంగ యంత్రం ఈనాటిదా? అందులో కుర్చీ దక్కించుకున్న మనిషి ఈనాటికి కొత్త వ్యక్తి కావచ్చుగాని.

ఇవేవీ పట్టించుకోనక్కర్లేని వాళ్లకు మంత్రి మండలిలో 60 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కనిపిస్తారు. దళిత మహిళా హోం మంత్రి కనిపిస్తుంది. అక్కడికి ఆగితే బాగుండు. పక్క రాష్ట్రం మేధావులైతే ఏకంగా జగన్‌ చూసి కెసీఆర్‌ నేర్చుకోవాలంటున్నారు. ఆయన కంటే ఈయనే బెటరట. ఈ మాటలన్నీ సోషల్‌ మీడియాలో మురిపెంగా చూసుకొని మురిసిపోతున్న మేధావులు, రచయితలు కూడా ఉన్నారు. ఎవరి కంటే ఎవరు బెటరని ఈ విశ్లేషణలు? ఆ మాట మనమంటే ఇటు జగనూ ఒప్పుకోడు, అటు కేసీఆరూ ఒప్పుకోడు. పైగా మీరు మా కావలింతలు చూడ్డంలేదా? మేమిద్దం ఒకటే.. అని ఎదురు ప్రశ్న వేస్తే తలకాయ ఎక్కడపెట్టుకోవాలనే బెరుకు కూడా లేకుండా ఆయన కంటే ఈయన బెటరని కితాబులిస్తున్నారు.

నిజమే తరతరాలుగా ఆ పదవుల్లో మగవాళ్లే ఎందుకు ఉండాలి? అగ్రకుల పురుషులే ఎందుకు ఉండాలి? ఇంత కాలం అధికారానికి దూరంగా ఉన్న కులాల వాళ్లు కూడా ఏదో ఒక రీతిలో వాటా పొందవచ్చు. కాదనేది లేదు. కానీ మరీ అంతగా ముచ్చటపడిపోతే ఎలా? ఆ స్థానాల్లోకి వెళ్లాక రోజా రెడ్డికి, దళిత మహిళ అయిన హోం మంత్రికి తేడా మనం ఎందుకు చూడాలి? తేడాలు ఏవో ఉంటే ఉంటాయి కావచ్చు. అంత మాత్రాన అవే ఎలా ప్రధానం అవుతాయి? పైగా వాటిని ఎలా పరిష్కరించుకోవాలో వాళ్లకు బాగా తెలుసు. మహిళా మంత్రుల హయాంలో పేద మహిళలపై ఎన్ని ఘోరాలు జరగలేదు? వాళ్లలో సహజంగానే దళిత, ఆదివాసీ మహిళలే ఎక్కువ. ఈ 60 శాతం కింద ఇన్ని సత్యాలను మరుగుపరిస్తే ఎలా?

ఈ మాట చెప్పడానికి మనం ఎంత కాలం వెయిట్‌ చేయాలి? దానికేమన్నా లెక్క ఉందా? పోనీ జగన్‌ మన మీది నుంచి గుర్రాలను తొక్కించుకుంటూ పోవాలా? నడి బజార్లో మూకుమ్మడిగా ఉతికిపారేయాలా? లేక పిట్టల్లా కాల్చిపారేయాలా? అప్పుడు గాని ఈ జ్ఞానం రాదా? ఈ 60 శాతం ఎస్సీ ఎస్టీ బీసీల మంత్రివర్గం హయాంలో అలాంటి ఘట్టాలేవీ రావనే భరోసా ఏమిటో ఎవరైనా చెబితే వినాలని ఉంది. సరిగ్గా ఇది బూర్జువా దళిత వాదం కాక ఇంకేమవుతుంది? ఈ పద్ధతిలో అధికారాల్లో వాటా రావడాన్ని, ఇవ్వడాన్ని అడ్డుకోబోయేదేమీ లేదు. కాకపోతే ఏదో ఒక పద్ధతిలో మన దళితులు, బహుజనులు పర్సెంటేజీ ప్రకారమైనా చట్టసభల్లోకి పోతే చాలనుకోవడం తప్ప ఇందులో ఇంకేమీ లేదని అనాల్సిందే. బహుజన రాజ్యాధికారానికి పులివెందుల ముద్దబిడ్డ ఇలా సోపానం పరిచాడనే ఆనందపడేవాళ్లుంటే కాస్త ఆలోచించుకోవాలి. రెడ్ల నాయకత్వంలోని పార్టీ ద్వారా కాకుండా బహుజనుల పార్టీ ద్వారా బహుజనులు ఎన్నికై ప్రభుత్వంలోకి వెళ్లాలనుకునే వాళ్లుంటే వాళ్లకు ఈ ప్రశ్న వర్తించదు.

ఇవన్నీ చర్చల్లోగాక రేపో ఎల్లుండో తేలే సత్యాలు. అక్కడి దాకా ఎదురు చూడాల్సిన పని కూడా లేదు.

ఒకవేళ ఇవి చర్చకు తావు లేని వైఖరులని గట్టిగా అనే వాళ్లుంటారు. కాబట్టి ఈ సంగతి కూడా వదిలేద్దాం. జగనన్న విధానాల గురించయినా మాట్లాడాలి కదా. ʹనాన్నగారుʹ వైద్య కార్పొరేట్లను మేపడానికి ఆరోగ్య శ్రీ తెచ్చారు. దాని వల్ల ఆయన చాలా కీర్తి గడించారు. ఇప్పుడు కొడుకు విజయానికి కూడా అదే కొంత మదుపుగా మారింది. సరిగ్గా ఇప్పుడు కొడుకు విద్యా కార్పొరేట్ల బొక్కసాలు నింపడానికి ʹఅమ్మ ఒడిʹ పరుస్తున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మృత్యుశయ్యమీద ఉన్న ప్రభుత్వ విద్య మీద అమ్మఒడి కఫన్‌ కాబోతోందా? లేక దానికి జవజీవాలు ఇవ్వడానికే తీసుకొస్తున్నాడా? అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే దీని మీద బోలెడు విమర్శలు వినిపిస్తున్నాయి.

పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయడానికి జగన్‌ రెడ్డి పరుగులు తీస్తున్నాడు. మంచిదే. కానీ ప్రజల మాటలు విని ఆ రోజు వాగ్దానాలు ఇచ్చాననే సంగతి జగన్‌ మర్చిపోడానికి లేదు. వాగ్దానాలు ఇవ్వడం, నెరవేర్చడం కంటే ముందు ప్రజల మాట వినడం ప్రజాస్వామ్యానికి ప్రాణనాడి. అమ్మఒడి ప్రైవేట్‌ స్కూళ్లకు ఇవ్వవద్దని ఇప్పటికీ 60 శాతం పేద పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వ బళ్లమీది మమకారంతో అనేక మంది కోరుకుంటున్నారు. లక్షలాది మంది పిల్లల తరపున చెబుతున్న ఈ మాట జగన్‌ వింటాడా? లేదా? అనేదే ఆయన ప్రజాస్వామ్య గుణానికి నిదర్శనమవుతుంది. దాని కోసమైతే ఎదురు చూడాల్సిందే.

కొత్తగా అధికారంలోకి వచ్చిన మంత్రులైనా జగన్‌ మాట వింటారేమోగాని బలిసిన విద్యా కార్పొరేట్లు ఆయన మెడలు వంచి అమ్మఒడిని కొల్లగొడతారని చాలా మంది నమ్ముతున్నారు. ఎందుకిలా అనుమానిస్తున్నారనే దానికి ఏవో కారణాలు వెతకాల్సిన పని లేదు. ఆయనంటే వ్యతిరేకత ఉందని ఆరోపించనవసరంలేదు. ఆయన విధానాలే దీనికి కారణం. పార్లమెంటరీ రాజకీయాల్లో ఎన్నికల ఫలితాలపై బోలెడు విశ్లేషణలు ఇస్తుంటారు. ఆ పార్టీ విధానాల కంటే ఈ పార్టీ విధానాలకే ప్రజలు ఓట్లేశారని అంటుంటారు. ఆ గొడవలోకి వెళ్లనవసరం లేదు కాని, ఆ రెండు పార్టీల విధానాల్లో తేడా ఏమిటో చూడాలి. ఆయన ఇచ్చిన పింఛన్లే ఈయన ఇంకో వెయ్యి ఇస్తాడు. కొత్తగా ఇంకొన్ని పింఛన్లు ఇస్తానంటున్నాడు. ఆయన మూడు వేలకు అడ్డగోలు చాకిరీ చేయించుకుంటే ఈయన పది వేలు ఇస్తానంటున్నాడు.. అన్నీ ఇంతే కదా. ఇవైనా ఇవ్వడం మంచిదే కదా.. అనే వాళ్లున్నారు. కాదనేది లేదు. కానీ విధానాల్లో ఏదో విప్లవాత్మక మార్పు ఉందంటే వంచన అవుతుంది. వాళ్లలో వాళ్లు మా విధానాలంటే మా విధానాలని పోటీ పడుతోంటే బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్లెవరైనా సరే కొంచెం విమర్శనాత్మకంగా చూసి మీరు పార్టీల్లో వేరే కాని, మీ విధానాల్లో తేడా ఏమీ లేదని చెప్పాలా లేదా? అసలు విషయమేమంటే అందరి విధానాలు ప్రజా ధనాన్ని పెట్టుబడిదార్లకు, కార్పొరేట్లకు ధారాదత్తం చేసేవే. ఇప్పుడేదో రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి మధ్య తేడా లేకపోవడమే కాదు. నెహ్రూ దగ్గరి నుంచే ఈ దారిపడింది. ఆయన ఆ పని చేయడానికి పెద్ద పెద్ద మాటలు ఉపయోగించాడు. వీళ్లకు ఆ స్థాయి కూడా లేదు. అంతే తేడా.

ప్రభుత్వ రంగాలకు పూర్తిగా పాడె కట్టి, ప్రైవేట్‌ రంగానికి అక్కడ గుత్త పెత్తనం కట్టబెట్టడం కోసం పోటీ పడి ఆ పార్టీ ఈ పార్టీ ఒకే విధానాలను ముందుకు తీసుకపోతున్నాయి. ప్రతి దానికి జగన్‌ నాకు రెండేళ్ల టైం ఇవ్వండని అడుతున్నాడు. దేనికంటే ఈ విధానాలను తానెంత ఎఫిషియెంట్‌గా ముందుకు తీసికెళ్లేదీ నిరూపించుకోడానికి. అంత దాకా నోరెళ్లబెట్టి చూస్తూ ఉండటమా? లేక నోరు తెరిచి మాట్లాడటమా? అనేది ప్రజాస్వామికవాదులు తేల్చుకోవాలి.

ఈ మొత్తంలో కోర్‌ పాయింట్‌ ఏమంటే సంక్షేమం పేరుతో ప్రైవేట్‌ శక్తులను మేపడం. ఈ వ్యవహారంలో ఒక పద్ధతి పూర్తిగా బద్‌నామైతే ఇంకో పద్ధతిని పాలకులు అనుసరిస్తుంటారు. మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యమైనా బతికి ఉందనడానికి ఇవే ఆనవాళ్లు.

జగన్‌ ప్రజల మాటలు వింటాడా, కార్పొరేట్ల మాటలు వింటాడా? అనే విచికిత్స మనకు అక్కర్లేదు. ఉదాహరణగా పోలీసులు ఎవరి మాటా వినకుండా వాళ్లపని వాళ్లు చేసుపోతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రమే ప్రమాణం చేశారు. శాసన సభ ఇంకా మొదలు కాలేదు. 11వ తేదీ తెల్లవారుజామున విశాఖ-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులో పోలీసులు ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డారు. అక్కడ మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో వెళ్లారు. కాల్పులు జరిపారు. అవతలి వాళ్లు కూడా ఫైర్‌ చేస్తూ తప్పించుకున్నారట. సీనియర్‌ మావోయిస్టు నాయకులు ఆ ఘటనలో ఉన్నారట. అర్రె.. తప్పించుపోయారే అని పోలీసులు చేతులు విదిలించుకున్నారు.

జగన్‌ ప్రమాణం చేశాక మావోయిస్టుల వైపు నుంచి ఎలాంటి చర్యలూ లేవు. హింస జరగలేదు. మరి పోలీసులు విశాఖ, తూర్పుగోదావరి అటవీ ప్రాంతానికి ఎందుకు వెళ్లారు? అక్కడ మావోయిస్టులు ఉంటే ఉంటారు. వాళ్లే హింసా చేయనప్పుడు అక్కడికి ఎందుకు ఎగబడిపోయారు? ఎందుకు కాల్పులు జరిపారు? అని జగన్‌ను ఎవరైనా అడుగుతారేమో అని ఎదురు చూసిన వాళ్లకు నిరాశే. అంత బుద్ధీ జ్ఞానం సున్నితత్వం, ప్రజాస్వామ్యతత్వం వంటబట్టిన వాళ్లు జగనన్న చుట్టూ ఆరాధనగా చూసే వాళ్లలో ఎవరైనా ఉన్నారా? ఉంటారా?

No. of visitors : 623
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •