వర్తమాన చరిత్రకు, సంఘర్షణకు ప్రతిరూపం

| సాహిత్యం | క‌థ‌లు

వర్తమాన చరిత్రకు, సంఘర్షణకు ప్రతిరూపం

- పలమనేరు బాలాజీ | 16.06.2019 09:52:19am

మనుషుల మధ్య నిశ్శబ్దంగా ఏర్పడ్డ గోడల్ని, అసమానతల్ని, అసహనాల్ని,ఖాళీల్ని , నిస్సానుభూతిని పోగొట్టేందుకు, మనుషుల్లో పేరుకు పోయిన నిర్లిప్తత, ఉదాసీనతల్ని, నిద్రమత్తుని వదిలించేందుకు , సమాజ ప్రక్షాళనతో బాటూ , మెరుగైన మనుషులు, సమాజాల పునః నిర్మాణానికి ప్రేరణ కలిగించేవే మంచి కథలు. నా దృష్టికి వచ్చి, నన్ను కలవరపరచి, హెచ్చరించిన అలాంటి కొన్నికథల్ని గుర్తు తెచ్చుకునే కథాసమయమే... ఈ కథావరణం !.అపుడెప్పుడో కాత్యాయని గారు వెలువరించిన చూపు కథల ప్రత్యేక సంచిక కళ్ళ ముందు ఎప్పుడూ కదలాడుతూనే ఉంది. ఆ తర్వాత కాలం లో కథల ప్రత్యేక సంచికల్లో నన్ను అమితంగా ఆకట్టుకున్న వాటిల్లో వంగాల సంపత్ గారి నేతృత్వంలో 2016 జూలై - డిసెంబరు సంచికగా వరంగల్ నుండి వెలువడ్డ సాహితీ గోదావరి కథల ప్రత్యేక సంచిక ముఖ్యమైనది, ప్రత్యేక మైనది కూడా. !

వర్తమాన చరిత్రకు, సంఘర్షణలకు ప్రతి రూపాలు ఇందులోని 32 కథలు.(అనువాద కథను మినహాయించి). నిత్యం పరిణితి చెందుతున్న తెలుగు కథా శిల్ప వికాసానికి , వస్తు విస్తృతికి , బహుముఖ చలనాలకు ప్రతీకలు ఇందులోని కథలు. అనేక మంచి కథల్లో ఒకటి ఆముదాల మురళి (తిరుపతి ) రాసిన ʹ అదృశ్య శత్రువు ʹ

ఈ నిరంతర వర్తమాన సంక్షోభాలను ఏమనాలి?

యస్సీ యస్టీ పిల్లల మధ్య ప్రేమ వుండ కూడదా? ఆధునికత, సాంకేతికత బాగా పెరిగిన ఈ కాలం లో ఈ రెండుకులాల మధ్య చిగురించిన ప్రేమ పరువు హత్యకు దారి తీసిందంటే ఏమనాలి? కింది కులాల వాళ్లకు కటింగు చేస్తే ఊరినుండి బహిష్కరించడం ఆమోదయోగ్యమైన, అమలవుతున్న శిక్ష అంటే ఏమనాలి? రెండు గ్లాసుల టీ పద్ధతి ఇంకా ఉందంటే, దేవాలయాలోకి ప్రవేశం కొన్ని కులాలకు నిషేధం అంటే, కులాన్ని బట్టి తరగతి గదిలోఓ మూల చివర్లో పిల్లలు కూర్చోవాలి అంటే, కింది కులం మనిషి మధ్యాహ్న భోజనం వండిoదని వూరు మొత్తం తరగతి గదులనుండి తమ పిల్లల్ని ఆ తిండి తిననీయకుండా ఇండ్లకు తీసుకు వెళ్లడాన్ని ఏమనాలి? ఆమె వండటం మానేస్తేనే పిల్లల్ని బడికి పంపుతామని పెద్దలు మొండికి కుర్చోవడాన్ని ఏమనాలి? ఈనాటికి గిరిజనులు, దళితులకు వోటేయడం హక్కు కాదనే వాళ్ళను ఏమనాలి ? జరిగిన, జరుగుతున్న కుల వివక్షతల మాటేమిటి? కింది కులం పిల్లలు బడులలో లేరంటే, సక్రమంగా బడులకు రావడం లేదంటే, బడి లో ఉండాల్సిన పిల్లలు బడికి దూరంగా వున్నారంటే కారణాలు ఏమిటి? మనుషుల మధ్య కులాల మధ్య అంతరించాల్సిన అసమానతలు అంతరిస్తున్నాయా లేక కొత్త రూపాల్లో అవే అవమానాలు మళ్ళీ మళ్ళీ దళితుల్ని దుఖితుల్ని చేస్తున్నాయా? మార్పు ఎవర్లో రావాలి ?

అభివృద్ధికి నిజమైన అర్థాలు వేరైన దేశంలో ,వర్తమాన కల్లోలాలను ప్రశ్నించిన కథల్లో ఇదొక ముఖ్యమైన కథ. చదువుకున్న దళిత స్త్రీలో కలగవలసిన , కలిగిన చైతన్యానికి ఒకానొక సూచిక, కుల వివక్షతకొక హెచ్చరిక ఈ కథ. ఇదొక దళితుడి కథ. పల్లెటూరి మూలాల్ని పోగొట్టుకోలేక పల్లెటూరి విశేషాల కోసం పల్లెటూరినుండి నగరానికొచ్చిన కుర్రాడి సేలూన్లో గంటలు గంటలు గడిపే వాడి కథ. తనపై వివక్ష చూపి బహిష్కరణ విధించినా , ఆ పల్లెను మరువని నికార్సైన గ్రామీణుడి ఆత్మ గౌరవానికి సంబందించిన కథ.

కింది కులాల స్త్రీ లో వచ్చే చైతన్యానికి ,తిరుగుబాటుకు ముందస్తు సూచన ఈ కథ. మొగవాడు మొగమాటానికి పోతున్నా, అటు కాదు వెళ్ళాల్సింది , ఇటూ అని వెళ్ళాల్సిన దారిని మొగుడికి చూపించిన ఒక చురుకైన దళిత స్త్రీ కథ.

ఆముదాల మురళి రాసిన ʹ అదృశ్య శత్రువు ʹ కథ ఒక సంఘటనకో , ఒక కథాoశానికో, ఒక స్థలానికో, కాలానికో పరిమితం కానిది. కథ లోపల, చుట్టూ, కథ తర్వాతా చాలా కథలు అదృశ్యం గా అల్లుకునే వుంటాయి అనటానికి ఒక మంచి ఉదాహరణ ఈ కథ. ఒక చిన్న కుర్రాడు స్కూల్లో వాళ్ళ నాయన చేసిన కటింగును తోటి పిల్లలు, ఎగువ కులాలకు చెందిన పిల్లలు గేలి చేయటాన్ని తట్టుకోలేక పోతాడు. ఎట్లాగైనా మునెప్ప దగ్గర తన కటింగు సవరించుకోవాలని తపన పడతాడు.

ʹ తాతా నాకు కటింగు చేస్తావా ʹ అన్నాడా పిల్లోడు.
ʹ వెంట్రుకలు పెరగలేదు గదరబ్బా, కటింగు చేసుకున్నట్లే వుందే ʹ

ʹ అవును తాతా! మా నాయన నిన్న మాపటేల కటింగు చేసినాడు.బడికిపోతే అందరూ ఎగతాళి చేస్తా వుండారు. బాలగని కటింగు కొండ మెట్లు మాదిరిగా ఉందంటా ఉoడారు. వాళ్ళంతా నీ దగ్గిర కటింగు చేసుకొంటారంట, వాళ్ళ కటింగు నిజంగానే బాగుంటాది తాతా! తాతా! తాతా! బడికి పోవాలనే లేదు తాతా! ఈ సారికి నువ్వు కటింగు చెయ్యి తాతా!ʹ

ʹ ఎవురి పిలగాడు నువ్వు, మీ నాయిన ఎందుకు కటింగు చేసినాడుʹ
ʹ పొన్ను స్వామి కొడుకు తాతా ! నేనుʹ
ʹ తలారెంకట్రాముని మనుమడా నువ్వుʹ
ʹ అవును తాతా!ʹ
ʹ బావుందిలేరా కత, నీకు కటింగు చేస్తే నన్ను ఊరెళ్ళగొడతారు, అయినా మీకు మేమెట్లా కటింగు చేస్తాoరే ʹ
ʹ తాతా ! అట్లా అనొద్దు తాతా! తలకు నీళ్ళు గూడా పోసుకోనుండా , నువ్వు చెయ్యనంటే ఎంటుకలోచ్చేదాకా బడికిపోను , చెయ్ తాతా ! ఈడ ఎవురూ సూడరు,నేనేవురికీ సెప్పను ʹ

అదీ కథ! అక్కడ అట్లా మొదలైన కథ చాల ఏళ్ళ పాటూ కొనసాగింది. ఆ కథే పల్లె లోంచి కాలానుగుణoగా నగరం లోకి వచ్చి చేరింది. ఇరవై రూపాయల అపరాధం తో బాటూ , ఊరినుండి ఆ కారణం గా వెలి వేయబడ్డ ఆ కుర్రాడు, ఆబాల చంద్రుడు, ఆ తలారెంకట్రాముని మనుమడు, ఆ పొన్నుస్వామి కొడుకు చిత్తూరు బస్టాండులో కూలి అయిన మేనమామ వాళ్ళింటికొచ్చి పడ్డాడు.హాస్టల్లో చేరాడు, వాతావరణం మారి, శ్రద్ధగా చదువుకున్నాడు.

నగరం లో అందాలూ, విలాసాలు, సౌకర్యాలు, విశేషాలూ కాదు అతడికి నచ్చింది. కులంతో పనిలేకుండా డబ్బిస్తే నగరం లో కటింగు చేయడం ఆ కుర్రాడికి నచ్చింది.

ఒక పల్లెటూర్లో పిల్లాడికి కటింగు చెయ్యాలంటే ఇంకో కులపాయనకు కుదరదు. వూరి కట్టుబాటు అది.కులం తక్కువోనికి కటింగు చేస్తే ఊర్లోకి రానివ్వరనే భయం మునెప్పది.అయినా ఆ కుర్రాడి మాటలకు చలిస్తాడు, కటింగు చేస్తాడు. వూర్లో పిల్లలు ఆ కటిoగు అతడిదే అని కనిపెట్టేస్తారు. ఇంకేముంది. పెద్దల కోపానికి గురవుతాడు, అయితే అతడి అవసరం , అతడి కొడుకుతో వున్న ఆర్ధిక లావాదేవీల కారణంగా వూరి పెద్దలు అతడ్ని కాక ఆ కుర్రాడిని వూర్లోంచి వెలేస్తారు.

ఒక పల్లెటూరినుండి బలవంతంగా బయటకు పంపివేయ బడిన కుర్రాడికి , బహిష్కృతుడైన కుర్రాడికి మనసులో పల్లె పట్ల, పల్లె లోని పెద్దరికాల, పెద్ద కులాల ఆధిపత్యం, అజమాయిషీ పట్లా ఎట్లాంటి కోపం ఉంటుంది ? పెరిగే పిల్లాడిలో వయసుతో బాటూ బాధ, నిరసన, ఆగ్రహం, అలజడి ఎట్లా పెరిగి పోతాయి? ఆ కుర్రాడిలో పెద్దయ్యాక వచ్చే మార్పులేమిటి? రాజీ పడతాడా? లేక అణచివేత, కులం కట్టుబాట్లు, కుల వివక్షతలపై తిరగాబడతడా? అయితే ఆ నిరసన , ప్రతిస్పందన అతడి నుండి కాక అతడి భార్య నుండి కనపరచడమే ఈ కథలోని విశేషం.

బాలచంద్ర పెరిగి పెద్ద వాడయ్యాడు. వుద్యోగాస్తుడయ్యాడు. కుముద్వతి అతడి భార్య. సంపాదనా పరుడయ్యాడనే నెపం తో వాళ్ళ నాయన వద్ద చందాలు తీసుకుంటారు కానీ ఆ పెద్ద మనుషులు, ఆ పెద్ద కులాల పెద్ద మనుషులు అతడ్ని గుడిలోకి రానియ్యరు. వూళ్ళో జరిగే పండగలకి, దేవర్లకి, ఉత్సవాలకి బాలచంద్ర చందాలు మాత్రం చేరుతున్నాయి, క్రమం తప్పకుండా. అయినా వాళ్ళ నాయన గుడికి దూరంగానే ఉండిపోయాడు. బాలచంద్ర మాత్రం ఇంకా వూరికి దూరంగానే వుండి పోయాడు.

ఒకరకంగా చెప్పాలంటే మనిషికి కులమే ఒక ఊబి. ! తక్కువ కులమని అనిపించుకునే వాళ్ళకు కూడా తమకన్నా కొంచెం కింద వున్న కులమోల్లని చూస్తే అస్సలు పడదు. పై కులమోల్ల దగ్గర మెప్పు కోసమో, ఒప్పు కోసమో, కుల మర్యాదల పేరిట , పై కులాల ఆధిపత్యాలకు బలి కావడానికి సగం సిద్దంగా వుండే ఒక చేతకానితనాన్ని ఈ కథలో సున్నితంగా ప్రశ్నిస్తాడు మురళి. ఈ కథలో ఉత్తేజ పరచే అంశం కుముద్వతి స్పందన!

గుడికోసం చందా అడగటానికి తన ఇంటికి వచ్చిన వూరి పెద్దల కోసం ʹకుముదా వాళ్ళకో ఐదు వేలు ఇవ్వు ʹ అంటాడు బాలచంద్ర. ʹ మేం చందా ఇవ్వం, ఇక మీరు బయలు దేరండి ʹ అంది ఆమె. బాలచంద్ర కుముద్వతి వైపు చూశాడు. ఆమె ముఖం జేగురు రంగులో జ్వలిస్తూ కొత్తగా, చాలా కొత్తగా కనిపిస్తూ వుంది. పెద్ద రెడ్డి ,చెన్నప్ప ఆమె వైపు కొరకొరా చూస్తూ బయటికి నడుస్తున్నారు. కుక్క వారివైపు చూసి మొరగడం ప్రారంభించింది. ఇదీ కథ ముగింపు. ఈ కథలో చెప్పిన విషయాలకన్నా చెప్పని అనేక విషయాలు ఈ కథకు బలాన్ని కలిగించాయి.పొరలు పొరలుగా విచ్చుకునే ఈ కథలో అనేకానేక అసమానతలు , అవమానాలు అనేక విషయాలను చెపుతాయి. కొత్త ఆలోచనల్ని కలిగిస్తాయి. మొత్తంగా మనల్ని కదిలిస్తాయి.

ఆర్థికంగా ఆమెకు స్వేచ్చ ఉండటానికి ఇదొక ఉదాహరణ. కాగా ఆమె పతిస్పందంకు అతడు యెంత మాత్రం అడ్డు చెప్పక పోవడం, ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం , ఆమె వైపు ఆశర్యంగా చూడక పోవడం ఈ కథలోని చాతుర్యం, లేదా శిల్ప రహస్యం. ఎందుకంటే ఉత్తేజితమైన ఆమె గొంతులో అతడున్నాడు. నిఖార్సైన ఆమె ఆగ్రహంలో అతడున్నాడు. ఆమె తిరుగుబాటులో అతడున్నాడు. తరతరాల మొహమాటాలను, బానిసత్వపు సంకెళ్ళను తెగ్గొట్టిన ఈ దళిత మహిళ గొంతు- కథ చదివిన చాలా కాలం తర్వాత కూడా మనకు వినపడుతూనే ఉంటుంది.!

మన అదృశ్య శత్రువు ఎవరో తెలుసుకోవడమూ, నిరంతరం స్వీయ రక్షణ చేసుకోవడమూ, సమాజాలను, మనిషిని, మనిషి ఆత్మ గౌరవాన్ని , సమానతను కాపాడుకోవడమూ మన ముందున్న తక్షణ కర్తవ్యo.! కాదంటారా ?

No. of visitors : 544
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....
  జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •