నన్నెక్కనివ్వండి బోను

| సాహిత్యం | క‌విత్వం

నన్నెక్కనివ్వండి బోను

- చెరబండరాజు | 02.07.2019 11:53:14pm

నల్లకోట్లు నీలిరంగు నోట్లతో
ఒక దేశం ఒక కోర్టులో
ఫైసలా అయ్యే కేసు కాదు నాది
నన్నెక్కనివ్వండి బోను

నలుగురి నమ్మకంతో ʹఅమ్మా ʹ అని పిలవడం తప్ప
నవమోసాలు మోసిందెవరో
ఎవరికైనా ఏమి తెలుసంటున్నాను
సృష్టికర్తనే వెక్కిరిస్తోన్న పాపిష్టిని
మీలో మిమ్మల్ని ప్రశ్నించుకొమ్మంటున్నాను
అంటున్నాను అంటాను
అనుకుంటూనే వస్తున్నాను
మనిషిమీద నమ్మకం పోగొడుతున్న మీరు
దేవుడిమీద ప్రమాణం చేయమంటారెందుకు?
దోషికి నిర్దోషికి ఒకటే సూత్రం
వల్లించిందే వల్లించి వాదిస్తారు
ఫీజు కుడితి కుండలో
న్యాయాన్ని ఎలుకలా ముంచేస్తారు
మీ ఉద్యోగాలకు ప్రమాణాలేమిటి?
ఎక్కనివ్వండి నన్ను బోను

కలాలు కాగితాలు సర్దుకోండి
లా బుక్కుల్లో నా సందేహాలు వ్రాసుకోండి
న్యాయానికి దేశాలేమిటి? యెల్లలేమిటి?
మనిషీ, రక్తం ప్రాణం ముఖ్యం
లింగ భేదాలు వాదాలు తప్పితే
మందిర్, మజ్జిద్, చర్చి,
మతాధికారులు మతాలు యెందుకు?
ఆకలి, కామం, కలలూ, కన్నీళ్లు,
మనిషిలోని మర్మజ్ఞానమంతా ఒక్కటే
దేశమేదైతేనేం? మట్టంతా ఒక్కటే
అమ్మ యెవరైతేనేం? చనుబాల తీపంతా ఒక్కటే
బిక్క ముఖాలతో చూస్తారేం?
పిచ్చివాణ్ణిగా కేసు పుటప్ చెయ్యండి
నన్నెక్కనివ్వండి బోను

తిన్నయింటి మర్యాదెంచని నాకు
బుద్ధుల్లో పెద్దల సహజాతాలేమైయుంటాయ్?
మంచి మనసు పరిమళాలు
విశ్వవ్యాప్తి కాకపోవు
భావితరం గుర్తించకపోదు
జగత్ప్రళయ కావ్యంలో
తపనాగ్ని జ్వాల నిలుస్తోంది
అణువణువున అగ్నికణం
చల్లారక రగులుతోంది
తీర్పు మీది జైలు మీది
భయపడతారెందుకు
మీ మనోసౌధాలనిండా
తరగని తరతరాల బూజు
అనుక్షణం చచ్చే ప్రియత్వం
కాపురాల గోపురాలలో తిరిగే పావురాళ్ళారా!
నరుక్కోరెందుకు తలలు
గది నాల్గు గోడలు కూల్చివేసి
దిశలు నాల్గుగా మార్చుకోండి
ప్రపంచ పౌరులు కారెందుకు అప్పుడు?
నాకు తెలుసు
మీ రాత్రి చొక్కాలు పగళ్లు నిలవవు
పగటి చొక్కాలు రాత్రి వుండవు
మీ పెళ్ళాలు పిచ్చివాళ్లు
పాతిక చీరతో స్వర్గాన్ని కప్పుకొని
వంట గదిలో ఆలోచనలకు
ఎసర్లు పెడుతున్న వాళ్లు
మీ వాగ్దానాలు పుచ్చుగింజలు
మీ బిడ్డలు కృత్రిమ నాగరికత షోలో
మోడల్ గా పనికొస్తున్నవాళ్ళు
ఛీ, ఛీ యెవరు మీరు?
నవ్వుతారెందుకు
నీవు నేను కలిసి ఎదుటవాని పిలుపుకు
ʹమీరుʹ గాక ఏమౌతాం?
నీ గుండెలు నా గుండెలు
మూతబడిన కొండగుహలు
ఎక్కనివ్వండి నన్ను బోను

ఈ సువిశాల ప్రపంచ జీవశాలలో
సిసలైన న్యాయస్థానం ఎక్కడైనా వుంటే
నన్నెక్కనివ్వండి బోను

నా గుండెలు పిండుకునే
కొండల్లాంటి సందేహాలు...
విశ్వ శాంతి మన ధ్యేయం
యుద్ధాలకు పరిమితమా?
అబద్దమా యీ వేదన?
మాంసం ముద్దలుగా మనుషులు
శిశువులుగా జన్మించుట ఏ దేశంలో లేదు
ఏ దేశంలోనైతేనేమి?
అర్ధరాత్రి పడగ్గదుల
అంతరార్థమొకటే గద!
ప్రపంచమొక నగ్న శిలా
ఫలకము వలె కనిపిస్తున్నది
భగవంతుడి అసలు పేరు నగ్న ప్రియుడంటాను
అంటాను అంటున్నాను
అనుకుంటూనే వస్తున్నాను
అందుకే
నన్నెక్కనివ్వండి బోను.





No. of visitors : 157
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జూలై - 2019

    చారిత్రక పత్రం
    రచయితలకు సవాల్ !
    మూడు తరాల, యాభై వసంతాల విరసం
    వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
    రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
    తిరిగి వ‌స్తావ‌ని
    నన్నెక్కనివ్వండి బోను
    కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
    సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
    సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •