వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ

| సాహిత్యం | క‌థ‌లు

వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ

- పలమనేరు బాలాజీ | 03.07.2019 05:39:19pm

పైకి ఒక రకంగా లోపల వేరొక రకంగా పొరలు పొరలుగా వదులుగా ఉండే మనుషులు వేరు.
భేషజాలు లేకుండా నిక్కచ్చిగా నిర్మొహమాటంగా ఉన్నదున్నట్లు మాట్లాడే మనుషులు వేరు. కథల్లో మాటలు ముఖ్యమైనవే.
కొన్ని కథల్లో మాటలే ముఖ్యమైపోతాయి. కథంతా మాటలే చెపుతాయా? మాటలే కథను నడిపిస్తాయా ? అని ఆలోచిస్తే
నిఖార్సైన మాటలు నడిపించే కథలకు ఒక ఉదాహరణ ʹశ్రీ సూర్యనారాయణ ʹ. రచయిత అద్దేపల్లి ప్రభు.

మనుషులు పాత్రలుగా కథల్లో కనపడినప్పుడు పైకి సంక్లిష్టత లేనివిగా అనిపించినప్పటికీ సరళంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ , లోతుగా పరిశీలించినప్పుడు పైకి కనిపించే పాత్రల స్వభావానికి మించిన, అందని అంచనాలను ఆ పాత్రలు కలిగి ఉంటాయి. అలాంటి పాత్రలు పాఠకుల ఆలోచనల్ని కదిలిస్తాయి, కొత్త ఆలోచనల్ని కలిగిస్తాయి.

కథలో కథా కథనం తో పాటు కథ చెబుతున్న రచయిత కంఠస్వరం కూడా చాలా ముఖ్యం. కథ ఏం చెబుతుందో కథ ద్వారా రచయిత ఏం చెప్పదలుచుకున్నాడో అందుకు సరైన కంఠస్వరాన్ని గనుక కథలో వినియోగించనట్లయితే ఆ కథ సారాంశం, లక్ష్యం పాఠకులకు అందకుండా పోయే ప్రమాదం ఉంది.

కంఠస్వరాన్నిసమర్థవంతంగా ఉపయోగించుకున్నట్లయితే కథ లక్ష్యం త్వరగా, సులభంగా పాఠకులకు అంది తీరుతుంది. తీసుకున్న కథా వస్తువుకు అనువైన కంఠస్వరాన్ని ఎన్నుకుంటూ , వైవిధ్యభరితంగా కథకు కథకు కంఠస్వరాన్ని మార్చుకోగలిగే సమర్థత కలిగిన తెలుగు కథా రచయితల్లో అద్దేపల్లి ప్రభు ఒకరు.

2018 జనవరిలో ʹ సీమేన్ ʹ కథా సంపుటిని ప్రభు వెలువరించారు. . ఇందులోని 13 కథల్లో ʹ శ్రీ సూర్యనారాయణ ʹ కథ మొదట చినుకు మాస పత్రికలో డిసెంబర్ 2017 లో అచ్చయింది. కథకు సరైన పేరు పెట్టడంలోనే కథకు బలం చేకూరింది.

ఇప్పుడంతా మేలుకోవలసిన కాలం . నిద్రపుచ్చడానికి కథలు చెప్పే కాలం కాదిది. నిద్ర పోవటానికి చదువుకునే కథలు కావివి. నిజానికి వర్తమాన సమాజానికి ఒక నిరంతర మేల్కొలుపు మంచి కథ! ఈ కథ కూడా అలాంటి ఒక మంచి కథే.! అవును మేలుకోవాల్సిందే, ఇప్పుడు మేల్కొలపాల్సిందే. సూర్యనారాయణ మేల్కొంటాడో లేదో , తన వారిని , చుట్టూ వున్న వారిని సూర్యనారాయణ మేల్కొలుపుతాడో , లేదో ఈ కథ చదివాక పాఠకుల ఆలోచనలకే రచయిత వదిలేస్తాడు.

ఇందులోని వైవిధ్యభరితమైన కథాంశం కోస్తా ప్రాంతంలో దశాబ్దాలుగా అమిత వేగంతో అభివృద్ధి పేరిట గ్రామాల్లో వస్తున్న పెనుమార్పులు. రైతుకు భూమికి , మనిషికి మనిషికి మధ్య చెదురుతున్న సంబంధాలు. మనిషి స్వభావం లో , ఆలోచనల్లో వచ్చిన మార్పుని ఒక చిన్న కథ లో పాఠకులకు స్పష్టంగా అర్థమయ్యేలా పాఠకులు తమను తాము ప్రశ్నించుకునేలా, తమలోకి తాము తొంగి చూసుకునేలా ప్రభు శిల్పచాతుర్యంతో రాసిన కథ ʹశ్రీ సూర్యనారాయణ ʹ. కథ సరిగ్గా ప్రారంభం కావాల్సిన చోట మొదలయి, సరిగ్గా ఎక్కడ ముగియాలో అక్కడే ముగించడం ఒక మంచి శిల్పలక్షణం అనుకుంటే, ఈ కథ సరిగ్గా మొదలై, సరిగ్గా ముగిసిన కథ. ఎలాంటి ఉపన్యాసాలు, ఆదర్శాలు, అనవసర వర్ణనలు,
కొనసాగింపులు లేని చిక్కటి కథ.

వంటపాకకి కాస్త అవతలగా ఉన్న ఉసిరి చెట్టుకి గుత్తులుగా వేళాడుతున్న ఉసిరికాయల్లో చేతికి అందిన నాలుగు కాయల్ని సుతారంగా తెoపాడు సూర్యనారాయణమూర్తి. పొయ్యి పక్కనే ఉన్న బుట్టలోని గళ్లుప్పుని కాస్త తీసుకొని పక్కనున్న కొబ్బరీనెల చెట్టు మొదలు కి ఆనుకుని కూర్చున్నాడు.ఒక్కో ఉప్పుగల్లుని ఉసిరికాయలోకి గుచ్చి పంటితో కొరికి తినడం మొదలుపెట్టాడు. కొబ్బరీనెల చీపురుతో దొడ్డంతా బరబరా ఊడుస్తున్న సత్యవేణి ʹ అన్నయ్యా.. దుమ్ము లేస్తుంది...తప్పుకో ʹ అంది కానీ సూర్యనారాయణ వినకుండా ఉసిరికాయలు తినటంలో పడిపోయాడు.

చేతికర్రతో దొడ్డి వేపు నిoచి వచ్చి కర్రని గోడకి ఆన్చి నీళ్ళతొట్టి కాడకెళుతూ సూర్యనారాయన్ని చూశాడు బూరయ్య. వొoటికి కారం రాచుకున్నట్టయింది. తొట్టిలో నీళ్ళని ముఖం పైన జల్లుకుంటూ ... ʹ చేలో చచ్చేంత పనుందిరా అంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉండి ఈడు చేస్తున్న పనేoట్రా అంటే ఉసిరి కాయలకి ఉప్పునంజుకు తింటున్నాడు... ఎదవ ...గేద్దూడలా ఎదిగాడు ఏటి లాభం?ʹ అంటున్నాడు.

సూర్యనారాయణ చూసాడు. ఏమీ మాట్లాడలేదు. చివరి ఉసిరికాయని కూడా నమిలేసి గింజల్ని ఊస్తూ కోళ్ళని చూస్తున్నాడు. బూరయ్య భుజం పైని తుమాలుతో ముఖం తుడుచుకుంటూ ʹసందేలవుతుంది...పోయి ఆ దూళ్ళకి పాలన్నా తియరాదురా...ʹ అన్నాడు.

ʹనేను తీయనుʹ అంటూ లోనికి పోయాడు సూర్యనారాయణ.

ఇదీ ఈ కథా ప్రారంభం.! రెండు పేరాల్లో మొత్తం కథంతా పరిచయం అయిపోతుంది. వాచ్యంగా చెప్పకుండా ఈ కథలో ముఖ్య పాత్ర అయిన సూర్య నారాయణ ప్రవర్తన, మాటల ద్వారా అతడేమిటో కథ మొదట్లోనే సూటిగా చెప్పేయడం మంచి ఎత్తుగడ. బీరయ్య 50 ఎకరాల రైతు. ఊళ్లో మొట్టమొదట డాబా ఇల్లు కట్టిన వాడు, కాకినాడ మెజెస్టిక్ టాకీస్ లో వాటా కలిగిన వాడు. అతని పెద్దకొడుకు ఇంజినీరింగ్ చదివి విదేశాల్లో ఉండి పోయాడు. రెండో కొడుకు సరిగ్గా చదవలేదు కానీ వ్యవసాయంలో కుదురుకున్నాడు. ఎటొచ్చీ బీఈడీ చేసిన అతడి మూడో కొడుకు నిరుద్యోగి సూర్యనారాయణ అటు ఉద్యోగం చేయక, ఇటు వ్యవసాయమూ చేయక తండ్రికి ఒక ప్రశ్నగా మిగిలిపోయాడు. ఊరికే పని పాటా లేకుండా తినడం,తిరగడం రోజూ సెకండ్ షో సినిమాకు వెళ్లడమే కాకుండా, వెంటనే పెళ్లి చేసి, తన వాటా పొలం తనకు పెట్టమని, కాకినాడకు పోయి
కాపురముoటానని పొలాన్ని ఎవరికైనా అమిర్చేసుకుంటానని తండ్రితో దెబ్బలాడేవాడు.

చాలా సాదా సీదాగా, హంగూ ఆర్భాటాలు లేకుండా , సూటిగా అద్దేపల్లి ప్రభు కథ నడిపిన తీరు ఒక ఎత్తయితే , సూర్యనారాయణ పాత్రను పాఠకుడికి అతి తక్కువ సమయం లో సంపూర్ణంగా పరిచయం చేయడంలో రచయిత వాడిన భాష, ఈ కథలోని కంఠస్వరం భారతీయ గ్రామీణ రైతాంగ జీవితాల్లో వచ్చిన ఉప్పెన లాంటి మార్పు గురించి, ఆస్తి పరులైన రైతు బిడ్డలలో వచ్చిన బద్ధకం, పోకిరితనం,నిర్లక్ష్యం గురించి, వ్యాపారంగా మారిపోయిన వ్యవసాయం గురించి పాఠకుడికి కొత్త ఎరుకను, స్పృహను కలిగిస్తుంది.

ఎవరెన్ని అన్నా వాడిదొక్కటే మాట... ʹ ఈ ఊర్లో ఉంటే చిన్నన్నయ్య లాగా నన్నూ పాలేరుని చేసేస్తావ్. ఇన్ని ఎకరాల పొలం పెట్టుకుని పాలేరు గా ఉండాలా? హాయిగా కాకినాడ పోతా. పొలాన్ని అమిర్చేసుకుంటే పోయే దానికి ఈ ఇత్తనాల గొడవలు..ఊడ్పులూ.. కోతలు .. ఎవడు పడతాడు ? ʹ

ఆస్తులు ఉండి వ్యవసాయం స్వంతంగా చేయలేని పెద్ద రైతు కుటుంబాల వారసులతరానికి సూర్యనారాయణ ఒక ప్రతినిధి. కోస్తా ప్రాంతంలో పొలాలు చేపల చెరువులుగా మారుతున్న సందర్భంలో వ్యవసాయం చేయటాన్ని దండగమారితనంగా భావించి , జులాయిగా తిరిగే డబ్బున్న రైతుల బిడ్డలు ఎలా ఉంటారో, ఎలా బ్రతుకుతారో ఈ కథలో సూర్యనారాయణ పాత్ర ద్వారా సూచిస్తాడు ప్రభు.

పొద్దున్నే లేచి కోoటోడి కొట్టునుంచి డజను ఇడ్లీలు మైసూర్ బజ్జీలు తెచ్చుకుని తింటాడు సూర్యనారాయణ. మంచం మీద పడుకొని కూనిరాగాలు తీస్తూ నిద్రపోతాడు. మధ్యాహ్నం సుబ్బరంగా అన్నం తినేసి మళ్ళీ పడుకుంటాడు. సాయంత్రం అలా ఊరు మీది పోతాడు. రోడ్డుమీద బజ్జీల బండి దగ్గర మిరగాయ బజ్జీలో.. నూడుల్సో.. పలావు ప్యాకెటో తినేసి రాత్రి సెకండ్ షోకి కాకినాడ పోయి అర్థరాత్రి వచ్చి పడుకుంటాడు. తండ్రికి కనపన్నే కనపడ్డు. కనపడితే మాత్రం గొడవే . ఇదీ ధనిక రైతు బిడ్డల అసలు కథ.

తన వాటా తనకు ఇవ్వటానికి ఒప్పుకోని తండ్రి పైన కోర్టులో దావా వేయడానికి అయ్యే ఖర్చులకు గాను రెండు వేల రూపాయలను తండ్రినే అడుగుతాడు సూర్యనారాయణ. ఎవరు ఎంత చెప్పినా ఆ తండ్రి ఎంత గొడవ పడినా మొత్తానికి కోర్టు నుంచి తండ్రికి సమన్లు పంపిస్తాడు.

సూర్యనారాయణ చెడ్డవాడా అంటే కాదు . పెళ్లి అయ్యాక కాకినాడ వచ్చేసి తూరంగి లో మకాం పెట్టాక పంపకాలు అన్నీ అయిపోయాక తనపొలాన్నిఅమిర్చేసుకున్నాడు .ఇంట్లో వాటా కోసం నడుస్తూనే ఉంది కానీ అన్నతో చెప్పేసాడు ʹదావా వుంటే ఉన్ని కానీ ఇల్లు మాత్రం నీదే . నాకేమీ అక్కర్లేదు. పెద్దన్నయ్య గానీ వాటాకి వస్తే మాత్రం ఊరుకోను ʹ అన్నాడు.అదీ అతడి మనస్తత్వం .

బూరయ్య చనిపోయాక తండ్రి శవాన్ని చూస్తూ ʹ అచ్చమైన రైతోడు నాన్న. వ్యవసాయానికి గొడ్డు చాకిరీ చేశాడు. సుఖపడింది లేదు. ముక్కు మీద ఉండేది కోపం. కానీ బుర్ర తక్కువ. అతడు మట్టిలో మొలిచిన చెట్టులా బతికాడు ʹ అనుకుంటాడు సూర్యనారాయణ. ఈ మాటలు అర్థం కాక పోతే అతడు మనకి అర్థం కాడు.

అమెరికా నుంచి అన్నయ్య రాకపోయినా వీడియో కాల్ ద్వారా ఇలా చేయి, అలా చేయి అంటుంటే కోపం వచ్చిన సూర్యనారాయణ చిన్నన్నయ్య దగ్గర సెల్ లాక్కొని అందులో అన్నయ్య ని చూస్తూ ఒక మాటంటాడు. ʹ ఒరేయ్ తింగరెదవ.. కన్న తండ్రి పోతేరాలేనోడివి... నీకెందుకురా మేమేం చేస్తే?.. ఆస్తి వాటాలేసేటప్పుడు మాత్రం వచ్చావే.. మా ఏడుపు మేం ఏడుస్తాం గానీ .. మాకిలా ఫోన్లు చైకు.ʹ అని అరచి సెల్ ని స్విచాఫ్ చేసి చిన్నన్నయ్య తో ʹ ఆ పనికిమాలిన ఎదవతో నీకు ఊసులేట్రా... ఈ కార్యక్రమం అంతా నువ్వేచెయ్ʹ అoటాడు.ఈ మాటలు అర్థం కాక పోతే ఈ పాత్ర అర్థం కాదు.

కౌలు తీసుకున్న రైతు కౌలు వదిలేస్తున్నా బాబు ఇంకా మీరే చేసుకోండి అనేసరికి గాబరా అయిపోతాడు సూర్యనారాయణ. ʹఅవునండి.. ఎవసాయం ఇంక చైలేమండి. పెట్టుబళ్లు... ఎక్కువ.. వడ్డీలు ఎక్కువ..వచ్చేది తక్కువా.. ఎట్ట బతకాలి? దూళ్ళు పెంచినాo. ఆటికి మేత కర్సేక్కువా. పైగా దూళ్ళు పెంచే కన్నా పేకెట్ లోపాలు సవక. ఇంకేంటి చెయ్ మంటారు ? అందుకే విజయవాడలో మా తమ్ముడి కొడుకు ఉండే అపార్ట్మెంట్ పక్కన ఉండే అపార్ట్మెంట్ లో వాచు మెన్ కావాల్ట... ఆడికి పోతున్నా...ʹ చిన్నన్న తనే చేస్తానన్నాడు కానీ సూర్యనారాయణ ఇష్టపడడు.

ఆ రైతు మాటలేకథ లోని కీలకమైన మలుపుకు చిహ్నం. రైతు వ్యవసాయం చేయడు. కౌలుకు తీసుకున్న వాడికి గిట్టుబాటు కాదు.పొలం వుంది, వ్యవసాయం చేసే వాళ్ళు లేక పోవడం, చెయ్యాల్సిన వాళ్ళు కొత్త ఉపాదుల్ని వెతుక్కుంటూ పట్టణాలకవలస పోవడం, రైతు రైతుగా మిగలక పోవడం ఏ అభివృద్ది కి నిదర్శనం?

ఎదురుగా ఆకుపచ్చని సముద్రం అల్లంతదూరంలో చౌదరి గారి పొలం లో క్లీనర్లు పొలాన్ని తవ్వి పోగులు పెడుతున్నాయి. కాసేపు దాని వంక చూశాడు ఇంటికి వచ్చి చిన్న అన్నయ్యని అడిగాడు ʹ అవున్రా పాత ఎకరాల పొలం చేపల చెరువులు చేసేస్తున్నారు మంది కూడా అడిగారు సంవత్సరానికి లక్ష రూపాయలు ఆరు నెలలకి పేమెంట్ʹ సూర్యనారాయణ మనసులో లెక్క వేసుకున్నాడు.

ʹ పొలాన్ని నమ్మకు నమ్మకు అది నిన్ను గొడ్డు చాకిరి చేయిస్తుంది. ఇప్పుడు మనం డబ్బులు నమ్మాలి డబ్బును మాత్రమే నమ్మాలి డబ్బు ఒక్కటే మన్ని బతికిస్తుంది. మనకి డబ్బు తప్ప వేరే దిక్కు లేదు. అంచేత నా పొలం ఇచ్చేస్తున్న ఏంటి ఇంకా చేపల చెరువు పక్కన వ్యవసాయం ఎలా చేస్తారో నీ సంగతి ఆలోచించుకో ʹ అని పకపకా నవ్వాడు సూర్యనారాయణ ఇదీ ఈ కథ ముగింపు.

ఈ కథలో ఆదర్శాలు లేవు, కల్పనలు లేవు. ఉపన్యాసాలు లేవు సిద్ధాంతాల బరువులూ లేవు. చదువుతున్నప్పుడు కొత్త ప్రశ్నలు ఎన్నోమొలకెత్తుతాయి. వర్తమానం , భవిష్యత్తు ఆందోళన కలిగిస్తాయి. కొత్త ఆలోచనల్ని రగిలిస్తాయి. కోస్తా ప్రాంతంలో భూమికి రైతుకు మధ్య అనుబంధం క్రమంగా వేగంగా మాయమైపోతున్న తీరుకు , ఈ కథ అద్దం పట్టింది . ఈ కథలో కంఠస్వరం పాఠకుల ఆలోచనా సరళికి పదును పెడుతుంది .సూర్యనారాయణ అనే రైతు బిడ్డ ఆలోచనా విధానం, అతడి నిర్ణయాలు, ఉద్దేశాల ద్వారా ఈ చిన్న కథలో విస్మయం కలిగించే అనేక వాస్తవాలను సూటిగా తెలియజేస్తాడు రచయిత. రైతు వ్యాపారవేత్తగా మారే క్రమంలో రైతు దిగజార్చుకున్న విలువల్ని ఈ కథలోప్రతిభావంతంగా అద్దేపల్లి ప్రభు చూపించారు.

ఈ కథను అర్థం చేసుకునే క్రమంలో నిజానికి వర్తమాన పరిస్థితులు మనుషుల్లో, సమాజంలోతీసుకు వచ్చిన మార్పుల్ని ముందుగా గమనించాల్సి ఉంటుంది. అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసం, వ్యవసాయం విధ్వంసం కావటం, సమాజం విధ్వంసం కావడం, మనిషి విధ్వంసం కావడం, ప్రకృతి విధ్వంసం కావడం ఇలా అనేక విధ్వంసాలు ఈ కథలో కనిపిస్తాయి. భూమితో ఉండాల్సిన అనుబంధం , సెంటిమెంటును దాటిన మనిషి కుటుంబ బంధాల పట్ల , ఊరిపట్ల కూడా ఉదాసీనంగా ఉండిపోవడమేకాక పొలం పట్ల, మట్టి పట్ల, వ్యవసాయం పట్ల తనకు ఎలాంటి అనుబంధాన్ని మానసిక బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకపోవడాన్ని సూర్యనారాయణ పాత్ర చక్కగా చెపుతుంది.

పైకి సరళంగా క్లిష్టత లేని పాత్రగా అనిపించినప్పటికీ సూర్యనారాయణ పాత్ర సంక్లిష్టమైనది, సంఘర్షణాత్మకమైనది. తుదికంటా ఆ పాత్రను అర్థం చేసుకోవటానికి కథలోని కంఠస్వరం పాఠకులకు దారి చూపుతుంది.

వ్యవసాయం వ్యాపారం అయిన చోట ఆస్తుల పెంపకానికి,పెట్టుబడిపోషణకు పొలాలు వ్యాపార ముడి సరుకు అవుతున్న చోట, వ్యవసాయ సంస్కృతి పోయి వ్యాపార సంస్కృతి ఎలా మొదలైంది, ఎలా విస్తరిస్తుంది అనటానికి ఒక చక్కటి మేల్కొలుపు లాంటి కథ ఇది.

పొలాలు వ్యాపార కేంద్రాలుగా వ్యవసాయ క్షేత్రాలు చేపల చెరువులుగా మారిపోతుంటే , చుట్టుపక్కల రైతులు తమ పొలాలను చేపల చెరువులుగా మార్చుకోవడం తప్ప మరొక మార్గం లేని ప్రత్యామ్నాయం లేని అనివార్య పరిస్థితికి ఈ కథ ఒక సజీవ ఉదాహరణ. వ్యవసాయ రంగం లో, గ్రామీణ భారతం లో వ్యాపార సంస్కృతి విస్తరణకు, విస్తృతికి దారి తీసిన పరిణామం, ఈ పరిణామాన్ని ఉన్నది ఉన్నట్లుగా , వాస్తవానికి మరింకేమీ జోడించకుండా కథలో సూర్యనారాయణ పాత్ర ద్వారా సున్నితంగా వాచ్యత లేకుండా , కథాంశం దెబ్బతినకుండా పదునుగా చెప్పడం సాహసం.

ఈ కథలో లో భవిష్యత్తు పరిణామాలకు సంబంధించిన ముఖ్యమైన సూచన ఉంది. భవిష్యత్ పరిణామాలను మనిషి మనస్తత్వం లో మనిషి ఆలోచనల్లో మనిషి ఆదర్శాలలో వచ్చిన మార్పుని సూర్యనారాయణ మాటల్లో తెలియ చేస్తాడు రచయిత. ఇది కేవలం నీరు పుష్కలంగా ఉన్నటువంటి ఒక ప్రాంతానికి సంబంధించిన కథ మాత్రమే కాదు. ఆ ప్రాంతంలో ఆ కాలంలో నిర్దిష్టంగా ఆ స్థల కాలాల్లో జరుగుతున్న కథగా మాత్రమే ఈ కథకు పరిమితులు లేవు. ఈ కథ స్థలకాలాల పరిమితులను దాటిన మంచి కథల్లో ఒకటి.

భవిష్యత్తు ఎలాంటిదైనా ప్రమాదకరమైనది, విషాదకరమైనదే అయినా, సంఘర్షణాత్మకమైనదయినా భవిష్యత్తుని ముందుగా సూచించే కథ మంచి కథ. వాస్తవాన్ని వాస్తవంగా కఠిన వాస్తవాన్ని కూడా ఒప్పుకుని నడుచుకునే పాత్ర సూర్యనారాయణ. అతనికి ఎలాంటి ఆదర్శాలు లేవు. ఆశలు, ఆశయాలు లేవు. ఎంతోమంది చదువుకుని ఉద్యోగం చేయడానికి ఇష్టపడని, పొలాలు ఉండి వ్యవసాయం చేయడానికి ఇష్టపడని , పొలంలోకి పోకుండా తన నడక, నడత మార్చుకున్న ధనిక రైతు వారసులకు ప్రాతినిధ్య పాత్రగా సూర్యనారాయణ గుర్తుండిపోతాడు. సమాజంలో వచ్చిన వస్తున్న మార్పులకు తక్షణ ఉదాహరణగా , మానవ స్వభావ స్వరూపాలను చక్కగా తీర్చిదిద్దిన పాత్ర సూర్యనారాయణది.

చివరిలో అన్నతో ʹ... నీ సంగతి ఆలోచించుకో... ʹఅని నవ్వుతాడు సూర్యనారాయణ. ఆ ఒక్క మాటలో ఎంతో అర్థం ఉంది.కథ మలుపు లేదా కొస మెరుపు అంటా అక్కడే ఆ మాటల్లోనే వుంది. ఇక్కడ ఆలోచించవలసింది సూర్యనారాయణ గురించి కాదు. సూర్యనారాయణ లాంటి వాళ్ళ కారణంగా తమ పొలాల్ని కూడా చేపల చెరువులుగా మార్చుకోక తప్పని అనివార్యతకు గురవుతున్న రైతుల గురించే.

ఒకే ఒక్క ప్రధాన పాత్ర ద్వారా ,అతడి చేష్టలు, మాటల ద్వారా వ్యవసాయo- రైతు –భూమి –మానవ సంబంధాల్లో వచ్చిన మార్పుల్ని, పైకి కనిపించని సంఘర్షనల్ని, వర్తమాన సంక్షోభాలను తాత్వికంగా చిత్రించి , భవిష్యత్ ప్రమాదాలను ముందస్తు హెచ్చరికగా సూచించిన మేల్కొలుపులాంటి ఈ కథలోని కంఠస్వరం,కథా కథనం, కొత్త కథకులకు అధ్యయనాంశం. !

No. of visitors : 339
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ

పలమనేరు బాలాజీ | 17.09.2019 08:46:21am

భారతదేశంలో స్థల కాలాలను బట్టి కులాన్ని బట్టి సామాజిక స్థితిగతులను బట్టి చావుకు అర్థం, విలువ మారిపోతూ ఉంటుంది. అంతో ఇంతో ఉన్నవాడి చావుకి ,గొప్ప వాడి .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •