భూమికి చెవి పెట్టి విందాం, విముక్తి రహస్యం చెబుతుంది

| సంభాషణ

భూమికి చెవి పెట్టి విందాం, విముక్తి రహస్యం చెబుతుంది

- అశోక్ కుంబము | 16.07.2019 08:33:36pm

ప్రపంచ వ్యాప్తంగా ఫాసిస్టు పాలకులు అధికారంలోకి వస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమాల మీద తీవ్ర నిర్బంధం, ప్రజల మీద హింస రోజురోజుకు పెరుగుతున్నాయి. పౌర, ప్రజాస్వామిక హక్కుల సోయితో బ్రతికిన తెలుగు నేల మీద మొన్నటి వరకు "విప్లవాల యుగం మనది, విప్లవిస్తె జయం మనది" అని నినదించిన ఎంతోమంది బుద్ధిజీవులు, కవులు, రచయితలు విప్లవం మంచి ఆదర్శమే కాని ఆచరణ సాధ్యం కాదని కొత్త తీర్మనాలు చేస్తున్నారు. మారిన కాలానికి యాబై ఏండ్ల కిందటి నక్సల్బరీ పంథా సరికాదని, డెబ్బై ఏండ్లుగా ప్రజలకు పనికిరాని పార్లమెంట్ బాట పడుతుండ్రు. అవకాశవాదంతో దోపిడీ పాలకుల పంచన చేరి విప్లవ ప్రజల త్యాగాలను హేళన చేస్తుండ్రు.

ఇవన్నీ చూస్తూ నిరాశపడేవారున్నారు, తక్షణం ఆవేశపడేవారూ ఉన్నారు. వీటన్నింటికి అతీతంగా విప్లవ ఆచరణలో ముందుకు సాగుతున్న వాళ్ళూ ఉన్నారు. ఈ గందరగోళ సందర్భంలోవిప్లవోద్యమంలో తమ జీవితాలను, విలువైన ప్రాణాలను ప్రజల కోసం త్యాగం చేసిన అమరుల తల్లితండ్రులు, బంధుమిత్రులు అమరుల గురుంచి, వాళ్ళు కనిన కలల గురుంచి, వాళ్ళ త్యాగాల గురుంచి, మొత్తంగా విప్లవం గురుంచి ఏమనుకుంటున్నారో, ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలంతో గత సంవత్సరం అమరుల బంధుమిత్రుల సంఘం సమావేశాలకు పోతె వాళ్ళలో కొందరితో మాట్లాడే అవకాశం దొరికింది. సంవత్సరం దాటినా వాళ్ళ మాటలు నాకు ఇంకా వినిపిస్తూనే వున్నాయి.

వినగలిగే మనసు ఉండాలి కాని వాల్ల దగ్గరి నుండి ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు. వాళ్ళ జ్ణాపకాలలో ఎంత చరిత్ర దాగుంది. చదువుకున్నామనే అహం పక్కన పెట్టి వాళ్ళ గుండె చప్పుడు వినాలి కాని ఎన్ని త్యాగాల గుర్తులను ఏరుకోవచ్చు. పైకి ఎంత అమాయకంగా, గంభీరంగా ఉన్నా తమలో ఎన్నో ప్రకంపనాలను దాచుకునివున్నారు. వాళ్ళతో మట్లాడడం అంటే విప్లవ మార్గంలో సాగిపోయిన, ఒరిగిపోయిన అమరుల పాదముద్రలు తాకడమే.

***
"మాది ఖిలా వరంగల్. పడమటికోట. నేను మహేశన్న తల్లిని" అమరుడైన కొడుకే తన చిరునామాగా పరిచయం చేసుకుంది ఆ తల్లి.

"అమ్మా నీ కొడుకు విప్లవోద్యమంలోకి ఎట్ల పోయిండు, ఏడ పనిచేసిండు, ఎట్లా అమరుడయిండు" చెప్పమని ఆ తల్లిని అడగగానే...

"ముందుగాల మా తమ్ముడు, మా పెదనాయన కొడుకును 94ల ధర్మారం దగ్గర పోలీసోళ్ళు కాల్చి చంపిండ్రు. అప్పడిదాక ఆయన పార్టీల పనిచేస్తుండని మాకు తెల్వదు. ఆయన పేరు రమణమూర్తి. ఇంటిపేరు మొగుసాలి. మొగుసాలి రమణమూర్తి. రమణ పేరు మీద పట్టణ కార్యదర్శిగ చేశిండు. అప్పుడు మాకు ఇవేమి తెల్వది. ఆయన ఉన్నప్పుడే నా కొడుకును ఒకసారి అరెస్ట్ చేసిండ్రు. "

"నా కొడుకు నాగార్జునసాగర్ గురుకులంల పది వరకు చదువుకుండు. పరీక్ష రాపిస్తె సీటొచ్చింది. అక్కడే మూడేండ్లుండి చదువుకోని వచ్చిండు. పదో తరగతి ఫస్ట్ క్లాస్ ల పాస్ అయ్యిండు. 92ల. ఒకలు చదువుకో అని చెప్పాల్సిన పనిలేదు ఆయనకు. చదువంటె అంత ఇష్టం. పది పాసయి వచ్చినంక సీకేయం కాలేజ్ ల అప్ప్లై చేస్తే ఫస్ట్ లిస్ట్ లనే పేరొచ్చింది…"

ఆ తల్లి చెప్పేది వుంటున్న కాని దానికి సమాంతరంగా నాలో మరో ఆలోచన నడుస్తావుంది. నేను కూడ నల్లగొండ జిల్లాలో ఒక గురుకులంలోనే చదువుకున్న. నేను పాస్ అయ్యింది కూడ 92లోనే. కాని మహేశన్న చైతన్యానికి, ఆచరణకు, త్యాగానికి నాకు ఎంత తేడా వుంది అని మనసు ఒక్కసారిగా ముడుసుకున్నట్లయ్యింది.

ఆ ఆలోచనలోంచి బయటపడడానికి "అమ్మా, నీ కొడుకులాగానే నీను కూడ గురుకులంలోనే చదువుకున్న. 92లనే పాస్ అయిన. అంటే మీమిద్దరం ఒక్కతోటోల్లం. కాని నీ కొడుకు ప్రజల మీద ప్రేమతో వాళ్ళ విముక్తి కోసం విప్లవంలో అమరుడయ్యిండు. నేనేమో నా బతుకు మీద ప్రేమతో ఇలా బతుకుతున్న. నాలాంటోళ్ళను చూసినప్పుడు నీకు ఏమనిపిస్తది? " అని అనగానే

"నాకు ఇంకా ముగ్గురు కొడుకులు ఉండ్రు. వాళ్ళేమి పార్టీల పోలేదు కద బిడ్డ. ఎవ్వరి తెల్విని బట్టి, గుణం బట్టి వాళ్ళు పనిచేస్తరు." నన్ను ఓదార్చినట్లు చెప్పినట్లుంది కాని అందులో జ్ణానం, ఆచరణ, నిబద్ధతకు సంబంధించిన ఒక సత్యాన్ని చెప్పింది.

మహేశ్ గురుంచి ఇంకా తెలుసుకోవాలనే ఉత్సాహం పెరిగింది. "అమ్మా నీ కొడుకు గురుంచి ఇంకా చెప్పు" అని అడిగిన.

"ఆయన పేరు రవిందర్ రాజు అని పెట్టుకున్నం. బడిల రవిందర్ అంటోల్లు. ఇంట్ల రాజు అని పిలుస్తోలం. పార్టీల మూర్తి పేరుతోటి పనిచేసిండంట. కాని చనిపోయినప్పుడు మాత్రం మహేశన్న అని పేపర్ల పడ్డది" అని చెప్తుంటె

"సీకేయం కాలేజీల చదువుకుంటున్నాయన పార్టీలకు ఎట్ల పోయిండు" అని నా ఆతృత ఆపుకోలేక అడిగిన.

"సీకేయం కాలేజీల చదువుతున్నప్పుడే ʹమీ మామ ఏడవుంటడో చెప్పురాʹ అని ఆయనను అరెస్ట్ చేసిండ్రు. అప్పటికి మా తమ్ముడు పార్టీల పని చేశేది మాకు తెల్వది. ఆయన బాగ బొమ్మలు గీసేది. మా దగ్గరికి బాగ వచ్చేది. ఆయనతో పాటే మా రాజు కూడ గోడల మీద రాతలు రాసేది. బొమ్మలేసేది. అదేమి తప్పుపని కాదు కదా అని మీము సుతాగ ఏమి అనపోతోళ్ళం. నాకు, రాజు వాల నాయనకు ఇద్దరికి చదువు రాదు. కూలి పని చేస్తోల్లం. ఆయన రిక్షా తొక్కేది. బస్తాలు మోసేది. మీము గోసంగోల్లం. మాకు సెంట్ భూమి కూడ లేదు. అయినా కూడ కూలినాలి చేసి రాజును చదివియ్యాలనుకున్నం. కాని మా తమ్ముని కోసమని మా రాజును పరీక్ష రాసి బయటకు వస్తుంటె పట్టుకుపోయేవరకు మాకు తెల్వదు అసలు ఎంజరుగుతుందో. మా చుట్టూర విప్లవ పార్టీలు వున్నయని తెలుసు. రోజు చూస్తనే వుంటిమి. కాని మాదాంట్ల అంత తెల్వికల్లోలు ఎవరున్నరు వాటిల్ల పనిచేయనీక అనుకుంటోళ్ళం. మా తమ్ముడే పనిచేసేది అప్పుడే తెల్సింది."

"రాజును పట్టుకపోయి రైలు పట్టాలకు కట్టేసి ʹమీ మామ ఎక్కడుండో చెప్పకపోతె సచ్చిపోతవ్ʹ అని బెదిరించిండ్రంట. నేను సచ్చినా సరేకాని నాకు తెల్వదని చెప్పిండంట. ఇంక ఇట్ల చెప్పడని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తీసుకపోయి కరెంట్ పెట్టిండ్రంట. కళ్ళకు గుడ్డలు కట్టి నానా హింస పెట్టిండ్రంట. కొడుకు హింస భరించిండు కాని ఒక్క మాట కూడ వాళ్ళకు చెప్పలే. చివరికి వాళ్ళవీళ్ళ కాళ్ళు పట్టుకోని విడిపించుకోని వచ్చినం."

"వచ్చినాంక మల్లమల్ల పట్టుకుపోవడం చేసిండ్రు. ఒకసారి మా పక్క ఊర్ల శ్యాం అనే పార్టీ సభ్యుని తల్లిని హింస పెడితె ఆ బాధ తట్టుకోలేక ఆమె మందు తాగి సచ్చిపోయింది. తల్లి చావుకు మారువేశంల వచ్చి పోతుంటె ఆ పిల్లగాన్ని మా రాజు సైకిల్ మీద తీసుకపోయిండంట. అది ఎవరో చూసి పోలీసులకు చెప్తె, పొద్దున్నే మళ్ళీ కాలేజ్ దగ్గరే అరెస్ట్ చేసి తీసుకుపోయిండ్రు. మాకు తెల్సి స్టేషన్ కు పోయి అడిగితె ʹమీము ఎవ్వరిని అరెస్ట్ చేయలెపోʹ అన్నరు. అక్కడే మాకు తెల్సిన కానిస్టేబుల్ వుండె. ఆయనొచ్చి ʹరాజును పట్టుకొచ్చిండ్రు. లోపల పెట్టిండ్రుʹ అని చెప్పిండు. ఏమన్న గాని అని లోపలికి పోయినం. పోయేసరికి ఏముంది, నా కొడుకు వేలుముద్రలు తీసుకుంటుండ్రు. బాడీ కొలతలు తీసుకుంటుండ్రు. అప్పుడే అనుకున్న నా కొడుకును నాకు కాకుండ చేస్తుండ్రని. సక్కగపోయి ʹఏంది సారు, మా రాజును ఎందో ఆగం చేయపడ్తిరి. వాడు మంచిగ సదువుకుంటోడు సారు. వానికి పార్టీ ముచ్చట్లేం తెల్వదు సారు. కూలినాలి చేసి అట్లనో ఇట్లనో చదివిస్తున్నం. వాని మీదనే మా ఆదరువు. నా బిడ్డను వదిలిపెట్టండి సారూʹ అని దండం పెట్టి అడిగిన. అయినా వినలె. చివరికి ఐదు రోజుల తర్వాత జమానత్ కట్టి తీసుకొచ్చుకున్నం.ʹ

"ఇట్లనే మాటమాటికి తీసుకపోతుండ్రు, బెదిరించి వదిలిపెడుతుండ్రు. రొండేండ్లు బాగ సతాయించిండ్రు. పార్టీ వాళ్ళను ఒక్కరినన్న పట్టియమని వెంటపడ్డరు. ఎట్ల పట్టిస్తడు. ఎవరినని పట్టిస్తడు. చదువొచ్చిన మేధావాయె. ఎవని కడుపు కాలుస్తడు. వాల్లెన్నితీర్ల బెదిరించినా బెదరలే, అదరలే."

"ప్రతిసారి పట్టుకుపోతుండ్రని రాజును దొరకకుండ చేసినం. ఇక పోలీసోల్లు వచ్చినప్పుడల్ల మా ఆయనను కొట్టిండ్రు. మా మరిదిని కొట్టిండ్రు. మా చిన్నోన్ని తలకు తుపాకి పెట్టి కాలుస్తమని బెదిరించిండ్రు. నన్ను, నా బిడ్డను చెప్పరాని మాటలు తిట్టిండ్రు. ఈయెత్తున చేస్తుంటె వుండలేక రాజు ఇంటికొచ్చిండు. వచ్చిన పది నిమిషాలకే పోలీసోలొచ్చి పట్టుకపోయిండ్రు. మల్ల హింస పెట్టిండ్రు. "

"ఎన్ని హింసలు పెట్టినా మాకు చెప్పకపోయేది. మనసులనే పెట్టుకున్నడు. అట్ల రొండేల్లు ఇబ్బంది పెట్టిండ్రు. ఇట్ల జరుగుతుండగనే మా తమ్మున్ని 94ల కాల్చి చంపిండ్రు. జూన్ 04, 94ల చంపేసిండ్రు. ఆ తర్వాతనే రాజు పార్టీలకు వెళ్ళిపోయిండు. ఆయనను కూడ 96ల చంపేసిండ్రు.ʹ

ఆ తల్లి చెప్పేదంతా విన్న తర్వాత "అమ్మా, నీ కొడుకు, నీ తమ్ముడు విప్లవం కోసం ప్రాణాలను త్యాగం చేసిండ్రు. ఆ త్యాగాన్ని ఎట్ల చూస్తున్నవ్? ఆ త్యాగానికి ఉన్న విలువేంటి?" అని అడిగిన.

వెంటనే ఆమె "ఆ త్యాగానికి చాలా విలువుంటది బిడ్డా. వాళ్ళు చదువుకున్నరు, మంచిగ బతికే పరిస్థితి వుండె. కాని వాళ్ళ జీవితం కన్న ప్రజల జీవితం ముఖ్యమనుకున్నరు. వాళ్ళ కోసం వాళ్ళు బతకడంల ఏమి విలువ వుంటది. నలుగురు కోసం బతికినా, సచ్చినా విలువనే. ఆ ఆలోచన చేయడానికి చాలా ధైర్యం వుండాలి. సాన మందికి ఆ ధైర్యం వుండదు."

"అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.ʹ

"నిజం చెప్పాలంటె నాకున్న నలుగురు కొడుకులల్ల రాజు కున్న తెలివి, గుణం ఎవ్వరికి రాలె. మల్ల నా బిడ్డకొచ్చింది. ఆమె కూడ పార్టీల, ప్రజా సంఘాలల్ల పనిచేసింది. ఆమె కూడ చనిపోయింది."

ఏ తల్లి అయినా తన పిల్లలందరిని ఒక్కతీరుగ పోల్చుకుంటది, పొగుడుకుంటది. కాని ఈ తల్లి మాత్రం విప్లవంలో ప్రజల కోసం ఒరిగిన తన ఇద్దరు బిడ్డలు మెరికల్లాంటోళ్ళు, మేలైనోళ్ళని మాతృత్వ సహజ నియమాలను రద్దు చేసుకొని చెబుతుంది. ఎలా సాధ్యమవుతుంది? ఆ బిడ్డలు అమరులయ్యారు కాబట్టి అలా అంటుందా, లేక వాళ్ళు విప్లవంలో భాగమయ్యారు కాబట్టి అంటుందా? ఈ ప్రశ్నలు నా మెదల్లో సుడులు తిరుగుతుండగానే "సరే అమ్మ, మెరికల్లాంటి నీ పిల్లల విప్లవానికి అందిచ్చినవ్. కాని ఇప్పుడు పార్టీ మీ దగ్గర లేదు. ఊర్లల్ల మొత్తం పరిస్థితులన్నీ మారిపోతున్నయ్. ఇంకా ఏం ఆశ వుంది విప్లవం వస్తదని?ʹ అడిగిన.

"ఏం మారింది కొడుక. దొంగలు మారిండ్రా, దోపిడీ మారిందా? ఎవరికన్న కొత్తగ భూములొచ్చినవా? కొలువులొచ్చినవా? అంతా మారింది మారింది అని ఊదురగొడుతుండ్రు కాని ఏమి మారలే. ఇంకా రెక్కాడితెనే ఇంత ముద్ద దొరుకుతుంది. ఇప్పుడు పార్టీ లేదు నిజమే. మస్తు బాధ పడుతున్నం. కాని మళ్ళీ వస్తది. ఇవ్వాల కాకపోతె రేపైనా వస్తది."

ఆ తల్లికి విప్లవం మీద ఉన్న విశ్వాసానికి ఆశ్చర్యం వేసి మరో ప్రశ్న అడిగిన.

"మీరేమో పార్టీ తప్పకుండ మళ్ళీ మీ ఊర్లకు వస్తదని అంటుండ్రు. కాని, అది నక్సల్బరీలో పోయింది, శ్రీకాకులంలో పోయింది, తెలంగాణలో పోయింది, మళ్ళీ వస్తదని మీ నమ్మకం ఏంటి?"

నా ప్రశ్న పూర్తి కాకముందే తను మాట అందుకుంది.

"ఒక్క మాట చెబుత ఏమనుకోవు కదా బిడ్డా" అంది.

"చెప్పమ్మా, నువ్వు చెప్పాల్సింది ఏదైనా చెప్పు. ఏమి అనుకోను" అని అనగానే

"నీ ధ్యాసంతా పోయినదాని మీదనే వుంది కాని, ఒక్కాడ పోయిన ప్రతిసారి ఇంకోకాడ పుట్టుకొచ్చింది కదా. విప్లవానికి చావే లేదు. అదెందుకు చూస్తలేవు? "

ఆ మాట వినగానే ఇందుకే కదూ ప్రజలే నిజమైన మేధావులని అనేది అనిపించింది. తెలుగు సమాజంలో ʹమేధావి ʹ అనే పదాన్ని ఎంత ఉచితంగా వాడుతున్నారో కదా! పెద్ద పెద్ద భుజకీర్తులతో ఊరేగే ఎంత మంది మేధావులకు ఈ విప్లవ చలన సూత్రం అర్థమవుతది.

ఇంకా ఆ తల్లి చెబుతనే వుంది. "మళ్ళీ పార్టీ వస్తదని నమ్మకం ఉంది. చీకటి కొన్నాల్లు. వెన్నెల కొన్నాల్లు. విప్లవం కూడ అంతె. నేను మాత్రం ఎవరైనా మనోళ్ళు వస్తె వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్న. దాని కోసమే బతుకుతాన్న. వీలొచ్చి భయపెట్టిస్తరు, వాలొచ్చి భయపెట్టిస్తరని బుగులేమి లేదు. పోలీసోలొస్తరని భయమేమి లేదు. కొడితె నాలుగు దెబ్బలు కొడుతరేమో. తిడితె నాలుగు తిట్లు తిడుతరేమో. తీస్తె పానం తీస్తరేమో. పోతెపొయ్యింది. అంతకన్న ఎక్కువేం చేస్తరు."

...

అమరుల త్యాగాలను తమ గుండెల్లో పదిలంగ దాచుకొని వారి స్వప్నాలను నిజంచేసే విప్లవకారుల కోసం తెలంగాణ గడ్డ మీద ఎదురుచూస్తున్న తల్లులు ఎందరో! విప్లవానికి మరణం లేదని ఎలుగెత్తి చెప్పే ఆ తల్లుల విశ్వాసమే అమరులకు నిలువెత్తు నివాళి!

No. of visitors : 953
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మొద్దుబారుతున్న సమాజం

అశోక్ కుంబము | 02.05.2018 10:50:42am

దేశం మొత్తంలోనె అత్యంత చైతన్యవంతమైన పౌరసమాజం ఉన్న తెలంగాణ కొత్త రాస్ట్రం గా ఏర్పడ్డాక ఎందుకు తన గొంతును తానే నొక్కేసుకొని మూగగా మారిపోయిందే ప్రశ్నించుకో.....
...ఇంకా చదవండి

ద్రోణాచార్యుడి వేలు తెగాల్సిందే

అశోక్ కుంబము | 20.01.2018 01:08:15am

అంటరానోళ్లంతా మా అగ్రహార విద్యాలయాలలో పిడికిళ్ళ వనమై విస్తరిస్తుంటే మా అగ్రవర్ణ ఆదిపత్య పిలకలెట్ల మొలుస్తయ్? మీ నీడనే మహా పాతకమనుకుంటే నీలి ఆకాశమై ......
...ఇంకా చదవండి

అక్షర చెప్పిన చిన్న కథ

అశోక్ కుంబము | 21.12.2018 01:41:33am

ఆ అమ్మాయి ఆ వాడలోకి పోతుంటె, ఎవరో వెనకనుండి ʹవాళ్ళు అంటరానివాళ్ళు, ముట్టుకోకు" అని గట్టిగా చెప్పినట్లు వినపడుతుంది.ఆ అమ్మయికి ఒక్కసారిగా ఎంతో బాధ అనిపిస్త.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •