తెలుగువారి ముంగిట్లోకి ప్రపంచం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

తెలుగువారి ముంగిట్లోకి ప్రపంచం

- మిసిమి | 17.06.2016 11:09:21am

సాక్షి దినపత్రికలో ʹటూకీగా ప్రపంచ చరిత్రʹ శీర్షిక మొదటిసారి చూసినప్పుడు తెలుగులో ఇటువంటి ప్రయత్నం పట్ల సహజంగా అందరికీ కుతూహలం కలిగి ఉంటుంది. రచయితగా, అనువాదకులుగా బాగా పరిచయం ఉన్న ఎం.వి.రమణారెడ్డి ప్రపంచ చరిత్రను టూకీగానైనా సరే మన ముంగిట నిలిపేందుకు పూనుకున్నారని తెలిసినప్పుడు సాహిత్యాభిమానిగా, విప్లవాభిమానిగా నాకు అనేక వైపుల నుండి ఆసక్తి కలిగింది. మనకు పరిచయం లేని ప్రపంచాన్ని మన ఆవరణలో పునఃసృష్టి చేయగల మంచి అనువాదకులు ప్రపంచ మానవుని ప్రయాణాన్ని తెలుగువాళ్ళకు చెప్పడం గురించి ఒక ఆసక్తి. అనువాదం అంటే కేవలం భాషను మార్చడం కాదు. అక్కడి ప్రపంచాన్ని ఇక్కడ సృష్టించడం. నిజానికి భాష కూడా మానవ సమాజం వలె సజీవమైనది, గతిశీలమైనది. ఈ రెండూ ఎరుకలో ఉన్న సృజనకారులైన అనువాదకులు అరుదు. అనువాదకులుగా రమణారెడ్డి గురించి చెప్పేదేముంది? ఇక రెండవది దృక్పథపరమైన ఆసక్తి. చరిత్ర ఒకటే. అయితే దానికి వ్యాఖ్యానాలు ఎన్నెన్నో. ఎక్కడ, ఎప్పుడు ఏం జరిగింది అని తారీఖులు, దాస్తావేజుల రికార్డ్స్ నేరుగా ఏమీ మాట్లాడవు. అవి అనేక మంది చేత అనేక విధాలుగా మాట్లాడిస్తాయి. మనిషి చేసిన సుదీర్ఘ ప్రయాణం తాలూకూ ఆనవాళ్ళు వర్తమానంతో ఎట్లా సంభాషిస్తాయి అన్నది చరిత్రతో సంభాషణ మనమెట్లా చేస్తున్నాం అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఇక సహజంగానే విషయసేకరణ, ఎన్సైక్లోపెడిక్ ఆసక్తి ఎట్లానూ ఉంటుంది.

ʹరాశి చక్రగతులలో
రాత్రిందివాల పరిణామాలలో
బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో,
కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన
పరమాణువు సంకల్పంలో,
ప్రభావం పొందిన వాడా!
మానవుడా! మానవుడా!..ʹ

విశ్వ పరిణామ క్రమంలో ఆవిర్భవించిన మనిషి గురించి, ఆ మనిషి సృష్టించుకున్న ప్రపంచం గురించి ఆలోచించినప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, కవిగా శ్రీశ్రీ పొందిన ఉద్వేగానికి మనమూలోనవుతాం. సజీవమైన చరిత్ర రచన ఆలోచననూ ప్రేరేపిస్తుంది. చరిత్రను ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? పాత రాతియుగం నుండా? మానవ సమూహం ఏర్పడిన దగ్గరి నుండా? రమణారెడ్డిగారైతే భూమి ఆవిర్భావం నుండి మొదలు పెడతారు. ʹమతవిశ్వాసాలకూ, శాస్త్రవిజ్ఞానానికి వందలాది సంవత్సరాలు జరిగిన పోరాటంలో చివరకు విజ్ఞానమే విజయం సాధించిందిʹ అంటూ ఆధునిక శాస్త్రాలు విశ్వ ʹసృష్టిʹ గుట్టుమట్టులు విప్పిచెప్పిన విషయం ముందుగా చెప్పి అణువు పుట్టుక నుండి మనిషి ఆవిర్భావం వరకు జరిగిన పరిణామాన్ని వివరించడంతో ఈ టూకీగా ప్రపంచ చరిత్ర మొదలవుతుంది. ఇక్కడ ʹమనిషిʹని మనకు అర్థం చేయించి, ఇక ఆ మనిషి చేసిన ప్రయాణాన్ని చెప్తారు.

విలనమ్ములు చేత్తో పట్టుకుని దశదిశలా విస్తరించిన మానవునితో మనకు సంస్కృతి ప్రారంభం కాగా, నాగలిపట్టిన మానవునితో నాగరికత మొదలయింది. స్థిరవాసుల్లో మాత్రమే నాగరికత కనిపిస్తుందిʹ అంటూ నాగరికతల ఆవిర్భావం గురించి, వికాసం గురించి చెప్తారు. మనవ పరిణామక్రమంలో కోతి వంటి ఆకారానికి చేతులు రూపొంది, అవి చేసిన అద్భుతాల గురించి చెప్తారు. శ్రమ నుండి సంస్కృతి, నాగరిక పుట్టిందని చెప్పకనే తెలియజెప్పడం దానిని నిరూపణ చేయడం కోసం ప్రకృతి, సామాజిక శాస్త్రాల విశేషాలను మన ముందు పెట్టడం అరుదైన విషయం. మోర్గాన్, ఎంగెల్స్ వంటి వాళ్ళను కోట్ చేసి వదిలిపెడితే ప్రయోజనం నెరవేరదు.

ʹఆస్తిʹ, ʹనేరంʹ అనేవి ఒకే నాణెం మీది బొమ్మాబొరుసులు అంటూ మిగులు ఉత్పత్తి, సంపద సృష్టి, ఉత్పత్తి శక్తుల అభివృద్ధి పునాదిగా సామాజిక నియమాలు, సాంఘిక వ్యవస్థలు ఎలా ఏర్పడ్డాయో ఈ పుస్తకంలో చెప్తారు.

నాగరికతల వికాసం, రాజ్యం ఆవిర్భావం, యుద్ధాలు, సామ్రాజ్యాల స్థాపన, వాటి పతనం వంటివి టెక్ట్సు బుక్కు పాఠాల్లో శిధిలమైన చరిత్ర ఫలకాలుగానే మనం చూసి ఉంటాం. చరిత్రకు సంబంధించి మనది తీరని వెలితి. కనీసం ఇంగ్లీషులోనైనా చెప్పుకోదగ్గ పుస్తకాలున్నాయి. మనకు ఆ వెలితి కొంతైనా తీర్చాలని రమణారెడ్డి గారు ఎత్తుకున్న పని అసామాన్యమైనది. ముఖ్యంగా చరిత్ర రచనలో ఆయన పాటిస్తున్న శాస్త్రీయ పరిశీలనా పద్ధతి వల్ల ఇది మనకు చాలా అవసరమైనదీ, అపురూపమైనది. వక్రీకరించడమే పనిగా పెట్టుకుని పాలకుల ఆధ్వర్యంలో అధ్యయన సంస్థలు చరిత్రను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు చరిత్ర విద్యార్థులకే కాదు, సామాజిక ఆచరణలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది మరింత ఆవశ్యకం. ఎన్నివాదోపవాదాలున్నా చారిత్రక భౌతికవాద దృక్పథంలోనే చరిత్రను సమగ్ర దృష్టితో, శాస్త్రీయంగా అర్థం చేసుకోగలమని ఈ పుస్తకంలో పొరలుపొరలుగా మానవసమాజ పరిణామాన్ని రచయిత విప్పి చెప్తున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో మనకు అనిపించక మానదు. ఇక రచయిత శైలి, భాష గురించి చెప్పకపోతే ఈ పరిచయం పూర్తికాదు. తేట తెలుగు భాషలో అంతే తేటగా ఉండే కథనాన్ని పాఠకులు ఆస్వాదించగలరు. అవసరమైన బొమ్మలు, మ్యాపులూ చక్కగా అమరాయి. పుస్తకంలో మొదటగా వచ్చే అధ్యాయాలకు పెట్టిన శీర్షికలు ʹముంగిలి, మొగసాల, తొలిగడప, లోగిలిʹ వంటివి సాహిత్యాభిమానుల్నీ ఆకట్టుకుంటాయి. ʹకలమాగిన పండు తొడిమ తెగి, చెట్టుకొమ్మ నుండి నేలకు రాలుతుంది.ʹ భూమ్యాకర్షణ శక్తిని కనుగొన్న సందర్భాన్ని చాలా మామూలుగా చెప్తున్నప్పుడు కూడా పదాలు రిదమిక్ గా వస్తాయి. థియరీ కూడా రచయిత భాషలో సొగసుగా పలుకుతుంది. ఇటువంటి భాషలో చరిత్రను చదువుకోవడం ఎంత బాగుంటుంది!

టూకీగా ప్రపంచ చరిత్రను నాలుగు భాగాలుగా రాయాలని రచయిత పూనుకుని ఏప్రిల్ 2015 నాటికి మొదటి భాగాన్ని ప్రచురించారు. ముందు మాటలో ముక్తావరం పార్థ సారధి గారన్నట్లు 340 పేజీల మొదటి భాగంలో క్రీస్తుశకం ఇంకా ప్రారంభమే కాలేదు. అసలు కథ చాలా ఉంది. కాబట్టి ʹటూకీగాʹ అన్నారని ఇది ఏదో పైపైన చెప్పే వ్యవహారం కాదు. అపారమైన అధ్యయనం, శ్రమతో కూడుకున్న పరిశోధన ఒక్క చేత్తో ఎత్తుకోవడం చిన్న విషయం కాదు. ఇంతటి శ్రమకు ఓర్చుతూ రమణారెడ్డిగారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కేవలం అభినందించడం సరిపోదు. రచయితతో ఎంతో కొంత సహప్రయాణం పాఠకులూ చేయాలి. వర్తమాన సందర్భానికి అది ఎంతో అవసరం కూడా.

టూకీగా ప్రపంచ చరిత్ర (మొదటి భాగం)
రచయిత: ఎం.వి.రమణా రెడ్డి
కవితా పబ్లికేషన్స్
(ఫోన్:8500927366, 9440280655)
వెల: రూ.400/-

No. of visitors : 1287
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దళిత మహిళా పోరాట చరిత్రను సిలబస్ నుండి తొలగించిన సి.బి.ఎస్.ఇ

-మాయా పలిత్ | 02.01.2017 11:54:34pm

ʹCaste, Conflict and Dress Changeʹ అనే అధ్యాయాన్ని 9వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్య ప్రణాళిక నుండి తొలగిస్తున్నట్లు సి.బి.ఎస్.ఇ (ఉన్నత పాఠశాల కేంద్రీయ విద్యా ...
...ఇంకా చదవండి

దేవతా - దెయ్యమూ

మిసిమి | 03.09.2016 12:53:20am

ఆ అమ్మాయి పదిహేనేళ్ల వయసులో చాలా అందంగా ఉండేదట. ఆ ఊరి భూస్వామి ఆమె మీద మోజుపడి, కుట్రపన్ని ఆమె తండ్రిని హత్య చేసి ఆమెను చేరదీసి చేసి ఇంట్లో బంధించి........
...ఇంకా చదవండి

చదివిన వారిని ʹపాల్గుణʹ ఆవహిస్తాడు!

మిసిమి | 16.07.2016 12:56:55pm

పాల్గుణ మట్టివేళ్ళ నుండి రూపొందిన విప్లవకారుడు. సింగరేణి గని కార్మికుడిగా అత్యంత సహజంగా కార్మికోద్యమానికి దగ్గరై, కార్మికవర్గ రాజకీయాలను సొంతం చేసుకున్న......
...ఇంకా చదవండి

మాయమైన నజీబ్ మాట్లాడే సంగతులు

మిసిమి | 05.04.2017 09:43:48pm

దేశంలో అసహనం (ఉన్మాదం అనవలసినదాన్ని) గురించి రచయితలు, శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు మూకుమ్మడి నిరసన తెలిపినప్పుడు మన ప్రభుత్వం వెటకారం చేసిన విషయం ఎంత.......
...ఇంకా చదవండి

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన

| 01.10.2018 10:37:48pm

సమాజంలో బలహీనవర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులపై రాజ్యం తీవ్రవాద వ్యతిరేక చట్టాలను సరైన ఆధారం లేకుండా ప్రయేగించేటప్పుడు అది కూడా ఒక రకమైన టెర్రర్... ...
...ఇంకా చదవండి

చిన్న చేపల్ని చంపుతున్న పెద్ద పరిశ్రమ

రాహుల్ మాగంటి | 22.09.2018 11:48:04pm

ఆంధ్రప్రదేశ్ లోని ఆ తీర ప్రాంత గ్రామంలో పారిశ్రామిక కాలుష్యం చేపల్ని చంపేసాక మత్యకారులు ఏమయ్యారు? సముద్రమంత గతానికి అనిశ్చిత భవిష్యత్తుకు మధ్య పెనుగులాడు.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!
  అయోధ్యకి మళ్ళీ రెక్కలొచ్చినయ్
  రాయలసీమ బతుకు పోరాటం
  మట్టివాసనెపుడూ జీవనోత్సవమే.
  పాలమూరి దుఃఖం
  బతుకు వెతుకులాట లో పాఠకుడికి యెదురయ్యే నిఖార్సైన మానవుడు
  తొలితరం విప్లవ కథకుడు
  స్వేచ్చా స్వప్నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •