ఇక కాశ్మీరీయుల పరాయీకరణ సంపూర్ణం

| సంపాద‌కీయం

ఇక కాశ్మీరీయుల పరాయీకరణ సంపూర్ణం

- అరుణ్ | 16.08.2019 07:43:10pm

హిందూత్వ అఖండభారత్ కు, కార్పొరేట్ సంస్థల నిరాటంక దోపిడీకి ఎన్.డి.ఎ. ప్రభుత్వం మరొక్క అడుగు ముందుకు వేసింది. ఇంతవరకు ఆ భూభాగాన్నిʹపాక్ ఆక్రమిత కాశ్మీర్ʹ, ʹకాశ్మీర్ʹ గా పిలిచేవారు. ఇక కొద్ది మార్పుతో ʹపాక్ ఆక్రమిత కాశ్మీర్ʹ, ʹభారత ఆక్రమిత కాశ్మీర్ʹ గా పిలువబడుతుంది. కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా నలిపి వేయడానికి చేసిన సన్నాహాలు, దాదాపు 40 వేలమంది అదనపు సైన్యపు మోహరింపు, మొత్తం సమాచార వ్యవస్థను తన గుప్పిట్లో ఉంచుకోవడం, అక్కడి రాజకీయనాయకుల నిర్బంధం -ఇవన్నీ కమల నాథుల మానసిక ఆందోళనకు సూచనలగా భావించవచ్చు. కానీ సంఘ్ పరివార్ తన లక్ష్య సాధనకు దేనికైనా తెగిస్తుందని దాని చరిత్ర తెల్పుతుంది. మోడీ 2014 లో సింహాసనమెక్కాక సంఘ్ పరివార్ లక్ష్యాలు -రామమందిర నిర్మాణం, కాశ్మీర్ పై పూర్తి పట్టు సాధించేందుకై , ʹఅఖండభారత్ʹ నిర్మాణానికి అడ్డంకిగా వున్న ఆర్టికల్ 370 రద్దు సాధనకై వడివడిగా అడుగులు వేస్తూ వస్తుంది. సామ్రాజ్యవాద దశలో పెట్టుబడి విస్తరణకు ఎలాంటి ఆటంకం కలుగకుండా విధేయుడైన దలారిగా మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 35A ను రద్దు చేసింది. వీటిలో రామమందిర నిర్మాణం కొంత ఆలస్యమైనా, రెండవ లక్ష్యంలో కార్పొరేట్ సంస్ధల ప్రయోజనాలు ఇమిడి వున్నాయి కాబట్టి వాటి తాబేదారుగా మోడీ కాశ్మీర్ విషయంలో తొందరపడక తప్పలేదు. అందులోనూ ఎన్నికలు చాలాదూరంగా వున్నాయి కాబట్టి, దేశం లో ఏమైనా అసంతృప్తు లు వున్నా 2024 నాటికి వాటిని ప్రజలు మరచిపోతారని పాలకుల నమ్మకం. .

వాస్తవంగా, ఆర్టికల్ 370 రద్దువల్ల కాశ్మీర్ ప్రజలు కొత్తగా కోల్పోతున్నదేమీ లేదు. ʹసోషలిస్టుʹ నెహ్రూ కాలంనాటి నుండి దేశపాలకులు ఏ పార్టీకి చెందినవారైనా ఆర్టికల్ 370 ని నీరుగారుస్తూ వచ్చారు. ఇప్పుడిది నామమాత్రమే. 1954లో జారీ అయిన అధ్యక్ష ఉత్తర్వులనుండి నేటిదాకా ఆర్టికల్ 370 లో చాలామార్పులు తెచ్చారు. పై ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలోని రక్షణ, సమాచారం, విదేశీవ్యవహారాలలో తప్ప మిగతా అంశాలలో భారత రాజ్యాంగం కాశ్మీర్ కు వర్తించదు. కానీ అనేక సవరణలద్వారా కేంద్ర జాబితాలోని 97 అంశాలలో 94 అంశాలు, వుమ్మడి జాబితాలోని 47 అంశాలలో 26 అంశాలు కాశ్మీర్ కు వర్తించేలా చేశారు. దీనికై కేంద్రం తన తాబేదారులు కాశ్మీర్ లో అధికారంలో ఉండేలా చేసింది. అసత్యాల, అబద్ధాల జోడుగుర్రాలమీద ఎన్నికల పరుగులో విజేతలైన కమలనాథులు ఆ తర్వాత వాటిపైనే తమ ప్రయాణం కొనసాగించాలనుకుంటున్నారు. తాము ప్రచారం చేస్తున్న అబద్ధాలకు ʹదేశభక్తిʹ ముసుగువేసి అసత్యప్రచారానికి పూనుకొని ప్రజల్ని మౌలిక సమస్యల నుండి తప్పించడంలో కృతార్థులయ్యారు కూడా. దానికి కార్పొరేట్ మీడియా సహకారం నిండుగావుంది .

అర్టికల్ 370 నెహ్రూ -షేక్ అబ్దుల్లాల మధ్య జరిగిన చీకటి ఒప్పందంగా చిత్రీకరించి సత్యాన్ని మరుగుపరిచారు. ఇటువంటి పచ్చి అబద్ధాల ప్రచారానికి కార్పొరేట్ మీడియా సహకారం నిండుగావుంది. కాశ్మీర్ సమస్యను హిందూ-ముస్లిం సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం తొలినుండి జరుగుతూ వస్తూంది. కాశ్మీరీలు పాకిస్థాన్ ను పూర్తిగా నిరాకరించారని, ఒక స్వతంత్ర దేశంగా ఉండాలనే ఆకాంక్ష వారిలో బలంగా ఉండిందని, మన ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలవల్ల అది మరింత బలపడిందనే వాస్తవాన్ని మరుగుపరుస్తున్నారు. కాశ్మీర్ రాజు హరిసింగ్ తన అధికారాన్ని రక్షించుకొనేందుకు పాకిస్థాన్ తో యధాతథ ఒప్పందం (standstill agreement) కుదుర్చుకోవడం జరిగింది (అంటే కాశ్మీర్ రాజు తాను ఒక నిర్ణయం తీసుకొనేవరకు అటు పాకిస్థాన్ గాని, ఇటు ఇండియా గాని కాశ్మీర్ పై దాడి చేయరాదు, కాశ్మీర్ ను విలీనం చేసుకోరాదని ఒప్పందం చేసుకున్నాడు). మరి అదే హిందూరాజు ఎందుకు భారతదేశంతో ఆ రకమైన ఒప్పందాన్ని కుదుర్చుకోలేదో ఈ హిందూత్వవాదులు చెప్పగలరా? ఆయనకు ఒక స్వతంత్రదేశానికి రాజుగా ఉండాలనే కోరిక బలంగా ఉండటమే దానికి కారణంగా చెప్పవచ్చు. అందులోనూ నెహ్రూ -షేక్ అబ్దుల్లాల మధ్యగల సాన్నిహిత్యం తన పదవికి ముప్పుతెస్తుందని, షేక్ కాశ్మీర్ ను భారతదేశం ఒడిలో చేర్చేందుకు ప్రయత్నం చేస్తాడేమోననే భయం హరిసింగ్ ను వెంటాడింది. ఇలాంటి భయమే పాకిస్థాన్ ను గిరిజనులతో కాశ్మీర్ పై దాడికి పురికొల్పేవిధంగా చేసింది. దాంతో గంగవెర్రులెత్తిన హరిసింగ్ భారతదేశపు సైనిక సహాయాన్నిఅర్థించక తప్పలేదు. విదేశీ వ్యవహారాల్లో భారతదేశపు జోక్యం సరైందికాదని, కాశ్మీర్ అప్పటికి ఒక స్వతంత్ర రాజ్యమని అందువల్ల భారతదేశం సైనిక జోక్యం కల్గించుకోలేదని చెప్పడంతో కాశ్మీర్ రాజు విలీనఒప్పందానికి అంగీకరించక తప్పలేదు.

ఆ తర్వాత కొన్నిషరతులతో (అర్టికల్ 370) విలీన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందానికి, మిగతా సంస్థానాధీశులు భారతదేశంతో చేసుకున్న ఒప్పందాలకు మధ్యగల తేడా అర్టికల్ 370 అని గుర్తించాలి. వారివి ఎలాంటి షరతులు లేని సంపూర్ణ విలీనం కాగా కాశ్మీర్ ది షరతులతో కూడిన విలీనమని గుర్తుంచుకోవాలి. అర్టికల్ 370 ప్రకారం రక్షణ, సమాచార, విదేశీ వ్యవహారాల్లో తప్ప మిగతా విషయాల్లో భారత ప్రభుత్వానికి జోక్యం కల్గించుకొనే హక్కు వుండదు. అంతేగాక భారత రాజ్యాంగంలోని ఏవైనా నియమనిబంధనలను కాశ్మీర్ కు వర్తింపచేయాలంటే అందుకు కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ సిఫారసు అవసరమవుతుంది. కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ 1956 లో రద్దుకావడంతో అర్టికల్ 370 ను రద్దుచేయడంకాని, అందులో మార్పులు చేర్పులు చేయడంగాని చట్టవిరుద్ధం. ఈ ఆటంకాన్ని అధిగమించేందుకు కమలనాథులు ఈ నెల 5 న అర్టికల్ 370కి సవరణ తెచ్చారు. అందులోవున్నʹకాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ʹ అనే పదానికి బదులుగా ʹకాశ్మీర్ శాసనసభʹ అనే పదాన్ని చేర్చారు. అంటే అర్టికల్ 370లో మార్పులకై ఇప్పుడు కాశ్మీర్ శాసనసభ సిఫారసు చేయవచ్చు. పోతే ఇప్పుడు అధ్యక్షపాలన వుంది కాబట్టి దేశాధ్యక్షుని ఉత్తర్వులతో ఎలాంటి మార్పులు చేర్పులైన చేపట్టవచ్చని కమలనాథుల ఎత్తుగడ. కాకపోతే అర్టికల్ 370 తాత్కాలికమైనదికాదని, అది శాశ్వతమైనదని సుప్రీం కోర్ట్ తీర్పునివ్వడం గమనార్హం. కోర్టులలో అంత వేగరం ఏదీ తెమలదు కాబట్టి, ఆలోగా తమ లక్ష్యం సాధించుకోవచ్చని బీజేపీ ధీమా.

కాశ్మీర్ కు ఎలాంటి ప్రత్యేక గుర్తింపు, ఆ ప్రభుత్వానికి స్వయం ప్రతిపత్తి , అధికారాలు లేకుండా తన చెప్పుచేతుల్లో ఉండేలా బిజెపి ప్రభుత్వం అర్టికల్ 370ని సవరించింది. పోగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ చట్టసహాయం లేకుండా కాశ్మీర్ రాష్ట్ర ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చి, తన బంటులను అక్కడ అధికార పీఠంలో కూర్చోబెట్టాయి. ఎపుడైనా షేక్ అబ్దుల్లాలాగా తోకజాడిస్తే, వారిని నిర్బంధించి తన దారికి తెచ్చిన ఉదంతాలు నెహ్రూ కాలం నుండి దేశచరిత్రలో కోకొల్లలు. పోగా అలాంటి దుశ్చర్యను రాజ్యాంగబద్దంగా చేసేందుకు నేడు మోడీ నిర్ణయించాడు. ప్రకటిత, అప్రకటిత అత్యయిక పరిస్తితి అమలు తీరు నేడు కాశ్మీర్ విషయంలో ఉల్టా అయిందని చెప్పవచ్చు. అయితే కమలనాథుల అజెండాను కాంగ్రెస్ అజెండాతో పోల్చలేము. కమలనాథులది పూర్తిగా తిరోగామి, మతతత్వ ఆలోచన. కాశ్మీర్లో ఇతర ప్రాంతాలవారిని శాశ్వత నివాసులుగా చేయడం ద్వారా కొద్దీ సంవత్సరాలలో అక్కడి జనాభా మతపర నిష్పత్తి పూర్తిగా మార్చాలనే కుటిల ప్రయత్నం ఇందులో వుంది. ఆ ప్రయత్నంలో భాగమే 35-A రద్దు. కాశ్మీరును రెండు భాగాలుగా విడగొట్టి అదీ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం ద్వారా పరిపాలన మొత్తం తన ʹఅధ్యక్షుని చేతిలో వుంచుకునేలా కుట్ర పన్నింది. ఇంతవరకు దేశచరిత్రలో కేంద్రపాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా మార్చిన ఉదంతాలు వున్నాయిగాని, రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలగా దిగువ శ్రేణికి దించిన ఉదంతం లేదు.

35-A రద్దు ద్వారా కాశ్మీర్ లో ఇతర రాష్ట్రాల నుండి వలసలకు అది దారి తెరిచింది. సహజంగా దేశంలో అత్యంత సంపన్నులలో అధిక శాతం హింధువులే కాబట్టి అదానీ, అంబానీ లాంటి ఇతర వ్యాపారస్థులకు కాశ్మీర్ భూభాగం కొనుగోలు వస్తువవుతుంది. దాంతో అక్కడి జనాభాలో హిందూ జనాభా నిష్పత్తి పెంచి ముస్లింలను మైనారిటీల చేయడం బీజేపీ ఎత్తుగడ. దీనికి సమ్మతి సాధించేందుకు సంఘ్ పరివార్ గోబెల్స్ ప్రచారానికి పూనుకుంది. కాశ్మీర్ దేశంలో ఒక రాష్ట్రమయినపుడు దేశప్రజలు ఎక్కడైనా స్థిరనివాసమేర్పరుచుకొనే హక్కు వున్నప్పుడు, అదే హక్కు కాశ్మీర్ లో ఎందుకు ఉండరాదు? అనే ప్రశ్నను ప్రచారం చేసింది. అన్ని విషయాల్లోలాగే ఇందులో ఇసుమంత నిజం లేదు. కాశ్మీర్ కు గల కొన్ని విశిష్ట అధికారాలు కొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా వున్నాయనే విషయాన్ని కాశ్మీరీ ప్రజల పట్ల సంఘీభావం కలవాళ్ళు ప్రచారం చేయలేకపోయారు.

అర్టికల్ 370 కాశ్మీర్ కు కొన్ని ప్రత్యేక రాయితీలు ఇస్తున్నట్టుగా అర్టికల్ 371 A నాగాలాండ్, అర్టికల్ 371 B అస్సాం, అర్టికల్ 371 C మణిపూర్, అర్టికల్ 371 F సిక్కిం, అర్టికల్ 371 G మిజోరాంలకు, ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాయని, అక్కడి భూముల క్రయవిక్రయాలపై నిబంధనలున్నాయనే విషయం మరుగున పెట్టి కేవలం కాశ్మీర్ కు అలాంటి ప్రత్యేక సౌకర్యం ఉందని విషాన్ని కక్కుతున్నారు. ఇక ఆంద్రప్రదేశ్ 1అఫ్ 70 చట్టం గురించి తెలిసినదే. ఆయా రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులవల్ల ప్రజల ఒత్తిడివల్ల అలాంటి చట్టాలు చేశారనే విషయం గమనంలోకి తీసుకుంటే కమలనాథుల కుశ్చిత బుద్ధిని అర్థం చేసుకోవచ్చు. పోతే ఇదే విషయం లో బీజేపీ ద్వంద వైఖరికి ఉదాహరణ హిమాచల ప్రదేశ్ లో వారి ప్రభుత్వం వహించిన తీరు. రాష్ట్ర ఆస్తులను రాష్ట్రేతరులెవరైనా కొనవచ్చనే ప్రభుత్వ నిబంధనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించినపుడు తోకముడిచి ఆ ఉత్తర్వును రద్దుచేసింది బీజేపీ ప్రభత్వం. కేవలం నివాసానికై 500 చ. మీ. భూమిని రాష్ట్రేతరులు కొనవచ్చని, వ్యవసాయ భూములను రాష్ట్రేతరులు కొనేందుకు వీల్లేదని చట్టాన్ని సవరించింది. అంతేకాదు, 370 అధికరణ సవరణ, 35A రద్దు తర్వాత కూడా బిజెపి కాశ్మీర్ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రైనా అక్కడి ప్రజలను బుజ్జగిస్తూ, స్థానిక ధృవీకరణ పత్రం ప్రవేశపెడుతామని, కాశ్మీర్ ప్రజల హక్కులకై కాశ్మీర్ అసెంబ్లీలో చట్టాలు చేసుకోవచ్చని ప్రకటించడం గమనార్హం. మరి దేశ ప్రజలందరికీ (పెట్టుబడిదారులకు) కాశ్మీర్ భూభాగపు తలుపులు బార్లా తెరుస్తున్నామని చెబుతున్న మోడీ, అమిత్ షాల మాటలకు, వారి కాశ్మీర్ ప్రతినిధి మాటలకు ఎలా పొంతన కుదురుతుందో సంఘీయులే చెప్పాలి. ఒక వైపు తను పాలిస్తున్న రాష్ట్రాలలో రాష్ట్రేతరుల కొనుగోలుపై నిషేధం విధిస్తూ కాశ్మీర్ లోయలో అలాంటి చట్టాన్ని రద్దుచేయడం వెనుకగల దాని లక్ష్యమేమిటో అర్థం చేసుకోవచ్చు. కేవలం ముస్లింల పట్ల దానికిగల ద్వేషం తప్ప మరేమీ కాదు.

ఇక రాష్ట్రపౌరులెవరో నిర్ణయించే అధికారం ఆర్టికల్ 35A కాశ్మీర్ కు అంటగడుతుందని, అందువల్ల రాష్ట్రేతరులెవ్వరూ కాశ్మీర్లో స్థిరనివాసం ఏర్పరుచుకొనే అవకాశం లేదని, ఇది దేశ సమగ్రతకు భంగకరమని రొమ్ములు బాదుకుంటున్నవారికి, ఈ చట్టం కొత్తగా చేసినది కాదని, ఆర్టికల్ 35A కేవలం గతంలోనే కాశ్మీరీలకున్న ప్రత్యేక అధికారాలను తిరిగి ఉధ్ఘాటించడమేననే విషయం తెలియదని కాదు. అసత్య ప్రచారం వారికి కొత్తేమీ కాదు. ఈ నిబంధన వారు ప్రచారం చేస్తున్నట్టుగా ముస్లింలకై కూడా కాదు. ఇది తొలుత అక్కడి కాశ్మీరీ పండిట్ల కూడు, గుడ్డ, నీడకు సంబంధిన విషయం. 1889 లో ఆనాటి కాశ్మీర్ ప్రభుత్వం, ప్రభుత్వ వ్యవహారాలలో వినియోగించే భాష ʹపర్షియన్ʹ నుండి ʹఉర్దూʹ మార్చడంతో, ప్రభుత్వ అధికార భాష మార్పిడి వల్ల పంజాబ్ నుండి ఉర్దూ పాండిత్యంగల హిందువులు వలస రావడం, ఆ భాషలో పాండిత్యం లేని కాశ్మీర్ బ్రాహ్మణలు ప్రభుత్వంలో తమ ఆధిపత్యానికి గండి పడుతుందని ఆందోళన చెందారు. ఇలా భాషా మార్పిడికి వ్యతిరేకంగా కాశ్మీర్ పండిట్లు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పరాయి రాష్ట్రాలనుండి వలసల ప్రారంభం తమ ఉపాధికీ గండికొడుతుందని ముస్లిం సమాజం పండిట్ల ఆందోళనలో పాలు పంచుకుంది. ఆ ఉద్యమాలకు లొంగి నాటి ప్రభుత్వం వలసలను అరికట్టేందేందుకుకై 1927 లో ʹవారసత్వ చట్టంʹ తెచ్చింది. దాన్నే 1954 లనాటి అధ్యక్ష ఉత్తర్వులలో 35A గా చేర్చారు. ఇదికూడా నెహ్రూ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిస్తున్న కాశ్మీరీయులకు, ముఖ్యంగా షేక్ అబ్దుల్లాను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కంటి తుడుపు చర్య మాత్రమే. మహిళల, దళితుల హక్కులపై పరితపిస్తున్న కమలనాథులకు, వారికి మద్దతు తెల్పిన BSP లాంటి పార్టీలకు మోడీ అయిదేళ్ళ పాలనలో దళితులపై జరిగిన దాడులు తెలియవనుకోను. ఇక స్త్రీల కున్న హక్కుల గురించి కాశ్మీర్ హైకోర్టు మహిళలకనుకూలంగా తీర్పునిచ్చిన విషయం చాలామంది తెలిసినదే.

హిందూత్వవాదులకు తొలినుండి ముస్లిం పట్ల ద్వేషం వుంది. దానికి తోడు కాశ్మీర్ లో భూయజమానులంతా హిందువులు కావడం, మెజారిటీ ముస్లింలు రైతు కూలీలు కావడంతో వారిమధ్య వర్గఘర్షణ వుంది. అందులోనూ షేక్ అబ్దుల్లా నాయకత్వం భూసంస్కరణలకై పోరాటాలు జరపడంతో, హిందూ మహాసభ లాంటి మతతత్వ సంస్థలకు, మతపరమైన విద్వేషం పెంచేందుకు అవకాశం దొరికింది. హిందూ మహాసభ ప్రతినిధిగా కాశ్మీర్ లో ఇరు వర్గాలమధ్య మరింత ద్వేషం పెంచేందుకు కృషి చేసినవాడు శ్యామప్రసాద్ ముఖర్జీ. ఇక్కడ బీజేపీకి అక్కడి కుహనా ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా తన కుట్రపూరిత చర్యలకు అడ్డంకిగా ఉందని భావించడంవల్లనే, ఇప్పుడీ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నది. ఆరాష్ట్రాన్ని రెండుగా విభజించడం, రాష్ట్రాన్ని కేంద్రపాలలిత ప్రాంతాలుగా ప్రకటించడం ఆ లక్ష్యసాధన కొరకే. కాశ్మీర్ ప్రజలకు తన ప్రభుత్వంపై విశ్వాసం లేదని తెలియబట్టే అక్కడి ప్రజల భావవ్యక్తీకరణను అడ్డుకుంటూ కర్ఫ్యూ విధించడం, మీడియాపై ఆంక్షలు, బూర్జువా రాజకీయ నాయకులనూ గృహనిర్బంధానికి గురిచేయడం -ఈ చర్యలన్నీ అక్కడి ప్రజల ప్రతిఘటనలను మిగతా ప్రపంచానికి తెలియకుండా చేసేందుకే. కానీ ఈ చర్యలే అక్కడివాతావరణాన్ని మనం సరిగ్గా అంచనావేయడానికి ఉపయోగపడుతాయని బీజేపీ ఊహించలేదనుకోవడం మన అజ్ఞానమే అవుతుంది. కమలనాథులు లక్ష్యసాధనలో ఎలాంటి అడ్డంకును సహించరు. వారికి ప్రజల అభిప్రాయాలతో, ఆకాంక్షలతో, కనీసం బూర్జువా ప్రజాస్వామిక విలువలతో పనిలేదు. తమ అఖండభారత్ లక్ష్యాన్ని, దానికి తోడు తన దొరల, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసేందుకు ఎంత రక్తపాతానికయినా సిద్ధపడుతారు. దానికి అనుకూలమైన సామాజిక వాతావరణాన్ని సృష్టించేందుకు సంఘ్ పరివార్ గత కొన్నిదశాబ్దాలుగా మొక్కవోని దీక్షతో పనిచేస్తూ వస్తోంది కూడా. ఒక విధంగా అది తన లక్ష్యసాధనలో విజయం సాదించినట్టు చెప్పవచ్చు. పార్లమెంట్లో ఆ చట్టాలు చేయబడ్డాక, దేశంలో ఏవో ఒక పిడికెడు ప్రజాస్వామిక శక్తులుతప్ప మెజారిటీ బుద్దిజీవులనుండి నిరసనలు లేకపోవడం అందుకు తార్కాణం. ఆ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగమని తలిచేవారుకూడా ఇప్పుడే కాదు, దశాబ్దాలుగా కాశ్మీర్ లో ప్రజల అణచివేత, మానవహననం జరుగుతున్నా , ఆ ప్రజలు తమ దేశప్రజలేనని మన బుద్ధిజీవులు భావించకపోవడం ఒక విషాదం. ఇది ఒక విధంగా పురోగామి శక్తుల వైఫల్యంగా చెప్పక తప్పదు.

ఇంకా విషాదకరమైన, విచారించదగ్గ విషయం రాజ్యసభలో పై బిల్లులకు మద్దతుగా కొన్ని ప్రాంతీయ పార్టీలు నిలవడం. జగన్, కేసీఆర్, మాయావతితోపాటు కేజరీవాల్ కూడా కమలనాథులకు అండగా నిలబడ్డారంటే పార్లమెంటరీ రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో? మాయావతి, జగన్ లకు వారి వారి అవినీతి కార్యకలాపాల భయం వారిని మోడీ, షా కాళ్ల దగ్గర పడేలా వుంచాయనుకోవచ్చు. మరి కేజరీవాల్ మాటేమిటి? అనునిత్యం కేంద్ర ప్రభుత్వ ఫెడరల్ వ్యతిరేక విధానాలను విమర్శించే ఇతగాడు, మోడీ, షాల ముందు మోకరిల్లడానికి కారణాలేమిటో? రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే బీజేపీ ధోరణి ఈశాన్యరాష్ట్రాలకు అదేగతి పట్టించదనేందుకు గ్యారెంటీ ఏమిటి? దేశసమగ్రత, సమైక్యత పేరిట ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, మొత్తం దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే బీజేపీ యత్నాలకు అడ్డుపడే శక్తులు పార్లమెంటరీ వ్యవస్థ లోపల లేవని చెప్పవచ్చు.

కాశ్మీర్ పరిస్థితి ఏమిటి? కాశ్మీర్ ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారుల, అదానీ, అంబానీల వ్యాపార రాజ్యంగా మారినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాశ్మీరీ భాష, సంస్కృతులు క్రమంగా బలహీనపడుతాయి. సంస్కృతం, హిందీ భాషలు రుద్దపడుతాయి. ఆ భాషలకు ప్రభుత్వ ప్రాధాన్యత ఉండటంతో ,ఉద్యోగ ఉపాధులకై కాశ్మీరీయులు వాటిని నేర్వక వుండలేని పరిస్థితి నెలకొంటుంది. ఇక న్యాయకోవిదులకు, న్యాయస్థానాలకు, వకీళ్ళకు చేతినిండా పని. తిమ్మిని బమ్మి చేయగల సమర్థులు అటు పాలకపార్టీలోనూ ,ఇటు ప్రతిపక్షంలోనూ నిండుగా వున్నారు. వాద సంవాదాలు ఎన్నేళ్లయినా జరగవచ్చు. అక్కడ కాశ్మీర్ లో రక్తపాతం జరుగుతూనే ఉంటుంది. మధ్యతరగతి బుద్ధిజీవులు పరిష్కారం న్యాయస్థానాలకు వదిలేస్తారు. పాపం సుప్రీం కోర్ట్ కు ఎన్నో కేసులుంటాయి. కాశ్మీరీయుల జీవన్మరణ సమస్యను మరింత కాలం జాప్యం చేసినా నష్టమేమీ వుండదు. ఈలోగా కాగల కార్యం గంధర్వులు అంటే సంఘ్ పరివార్ తీరుస్తుంది.

మరి కాశ్మీరీయుల ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని చెప్పాల్సిన అవసరమూ లేదు. మిలిటెంట్ పోరాటాలు, వాటిని తనకనుకూలంగా మార్చుకునేందుకు వారికి ఆయుధ సంపత్తిని పాకిస్థాన్ చేకూర్చడం, దానిపై మన సైన్యపు మారణకాండ, దాంతో అక్కడి ప్రజలకు, మరీ ముఖ్యంగా యువతకు భారత్ పై మరింత ద్వేషం పెరిగి పాక్ వైపు మొగ్గుచూపినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దాంతో ప్రభుత్వం మరింత తీవ్రమయిన అణచివేతకు, మారణకాండకు పూనుకుంటుంది. ప్రజల నుండి మరింత తీవ్రమయిన ప్రతిఘటన -ఇవి నిత్యకార్యక్రమాలవుతాయి. దాన్ని దేశసంరక్షణ అంటూ ప్రచారంతో ఇక్కడి ప్రజలు తమ మౌలిక సమస్యలు, నిరుద్యోగం, పేదరికం, ముస్లింలపై, దళితులపై దాడులు గిరిజనల ఊచకోత -వీటన్నిటినీ మరచి ప్రభుత్వానికి మద్దతు తెల్పడం ఊహించవచ్చు. ఇక పీలగా విన్పించే గొంతులు కూడా అర్బన్ నక్సలైట్ లు గా ముద్ర వేయబడుతాయి. వీరిని అణచివేసేందుకు, ప్రజాస్వామ్యవాదుల నోరు నొక్కేందుకే ʹఊపాʹ చట్టాన్ని మరింత కఠినతరం చేయడం. దేశంలో శ్మశాన శాంతి నెలకొనడం, నయా హిట్లర్ పరిపాలన- ఇదీ దేశ భవిష్యత్ చిత్రపటం.

No. of visitors : 693
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సీమ పోరాడాల్సింది... ప్రత్యేక హోదాకై కాదు- నికరజలాలు, నిధులకై

అరుణ్ | 04.02.2017 12:52:07am

ʹ ప్రత్యేక హోదాʹ ఎండమావుల వెంట ప్రజల్ని పరుగేట్టించేందుకు తమిళనాడు జల్లికట్టు ఉద్యమం ప్రేరణ కల్గించడం, దానికి అన్ని రాజకీయ పార్టీలు,ఉభయ కమ్యూనిస్టులతో సహా,...
...ఇంకా చదవండి

వీళ్లు చేసిన నేరం ఏంటి?

అరుణ్ | 16.06.2018 10:29:00am

హిందూ ఫాసిజం నగ్నంగా ప్రజల హక్కుల అణచివేస్తున్నప్పుడు, మనవరకు రాలేదు కదా అని మౌనం వహిస్తే ఏం జరుగుతుందో హిట్లర్ పాలన గురించి వీ ముల్లెర్ చెప్పిన మాటలు వాస్...
...ఇంకా చదవండి

ప్రత్యేక హేళన

అరుణ్ | 21.03.2018 10:49:23am

అవును మరిచాను మీడియా తన స్వామి భక్తిని చాటుకుంటూనే వుంది వలసల ,ఆత్మహత్యల తో సీమ దాహం, దాహం అంటూ అంగలారుస్తూనేవుంది, ఆకాశం వైపు చూస్తూనే వుంది అమరావతి నుండి ...
...ఇంకా చదవండి

దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త

అరుణ్ | 17.11.2019 11:14:53am

ఈ తీర్పు జరగబోయే పరిమాణాలకు సూచకమా?గతం లో రాజులూ దండయాత్ర పేరిట చేస్తున్నదదే-భూ ఆక్రమణ.వారే చట్టం,న్యాయం కాబట్టి,వారు చెప్పిందే న్యాయం,చేసేదే ధర్మం గా వుండే...
...ఇంకా చదవండి

నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు

అరుణ్ | 04.02.2020 05:38:00pm

, అన్ని ప్రాంతాలలో ఉపాధి, ఉద్యోగ కల్పనకు కేవలం పాలనా వికేంద్రీకరణ అంటూ కార్యాలయాలనన్నటినీ ఒక ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల జరగేదేమీ ఉండదు. అది పాలనా......
...ఇంకా చదవండి

ప్రకృతి వైపరీత్యాలు- జెండర్, కులం, వర్గం

అరుణ్ | 15.04.2020 08:57:19pm

చావు సమవర్తి. అవును, కాదనలేని వాస్తవమే. రాజూ పేదా, నవాబూ గరీబు, మంత్రులూ బంట్రోతులూ ఎవరయినా సరే, పుట్టిన ప్రతి జీవి చావాల్సిందే కదా....
...ఇంకా చదవండి

నేరమే అధికారమైన వేళ

అరుణ్‌ | 02.03.2019 04:38:04pm

తూర్పుకు చిహ్నం, మార్పుకు సంకేతం అతడు బాంబులను పంచాలేధతడు బావాలను పంచాడతడు బావాలను బంధించాలనుకోకు అవి తేనేటీగలై ఈ వ్యవస్థకు చరమ గీతం పాడుతాయి...
...ఇంకా చదవండి

పాలకులకు అందివచ్చిన వరం కోవిడ్ 19

అరుణ్ | 15.05.2020 09:15:54pm

తనకు తాను పెట్టుబడిదారివ్యవస్థ మలినాలనుండి శుబ్రపరుచుకొనే ప్రయత్నాలలో భాగమే ఈ కోవిడ్ వైరస్ అని వైరాలజిస్ట్(వైరస్ అధ్యయన వేత్త) లు అంటున్నారు....
...ఇంకా చదవండి

ఆన్ లైన్ విద్య -వర్గస్వభావం - ఒక పరిశీలన

అరుణ్ | 01.07.2020 05:28:52pm

బడుగుబలహీన వర్గాలకు విద్యను దూరంజేసి, క్రమంగా సమాజ మార్పులో, అభివృద్ధిలో వారి పాత్ర, వాటా లేకుండా చేయడమే ఈ ఆన్ లైన్ విద్య లక్ష్యం. అంతేగాక విద్యారంగపు .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •