కశ్మీర్ జాతి ప్రజల ఆకాంక్షలను ఎత్తిపడుదాం

| సాహిత్యం | వ్యాసాలు

కశ్మీర్ జాతి ప్రజల ఆకాంక్షలను ఎత్తిపడుదాం

- అభయ్ | 16.08.2019 07:47:45pm

కేంద్ర ప్రభుత్వం అగస్టు 5 న ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ జాతి ప్రజా ఆకాంక్షల కొలిమిలో ఆజ్యం పోసింది. ఇది రాజ్యాంగ విద్రోహ చరిత్రలో కొత్త అధ్యాయం. 26 అక్టోబర్, 1947 నాడు కశ్మీర్ గడ్డన కాలుమోపిన భారత సైన్యాలు గత 7 దశాబ్దాల కాలంలో ఎయేటికాయేడు పెరుగుతూ కశ్మీర్ లో రాజ్యమేలుతున్నాయి. 17వ లోకసభ ఎన్నికలలో సంపూర్ణ మెజారిటీ పొందిన హిందుత్వ శక్తులు సహజంగానే తమ దూకుడుకు పట్టపగ్గాలు లేకుండా వ్యవహరిస్తున్నాయి. లోకసభ ఎన్నికల ప్రచారంలోనే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేస్తామంటూ ఎడతెరిపి లేకుండా హిందుత్వ శక్తులు తమ విధానాన్ని ప్రచారం చేశారు. వారి ఎన్నికల హామీల పత్రంలో కూడా ఆ విషయాన్ని చేర్చారు. దానిని ఆనాడు ఏ ప్రతిపక్షం మాటవరుసకైనా ప్రచార పర్వంలో ఖండించలేదు. జాతీయోన్మాదాన్ని, హిందుత్వ విష విద్వేషాన్ని రెచ్చగొట్టడం సహా అనేక పాచికలు విసిరి లోకసభ ఎన్నికలలో నెగ్గిన భారత జాతీయోన్మాదులు ఎట్టకేలకు అగస్టు 5 నాడు కశ్మీర్ విషయంలో తమ పంతం నెగ్గించుకున్నారు. ఆరెస్సెస్ ముఠా చిరకాల ఎజెండాలోని కశ్మీర్ అంశానికి కార్యరూపం ఇచ్చారు. కేంద్రం వైఖరి అర్థమైన వారెవరికీ ఈ చర్య లేశమాత్రమైన విస్మయాన్ని కలిగించలేదు. లోకసభ ʹఅఖాడాʹలో చతికిలపడ్డ ప్రతిపక్షాలు ఆ చర్యకు వ్యతిరేకంగా బలంగా తమ నిరసన స్వరాన్నైనా వినిపించలేకపోయాయి. ప్రాంతీయ పార్టీలు నిస్సిగ్గుగా వంతపాడాయి. అంతిమంగా, అగస్టు 6నాడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 లాంచనంగా కాలగర్భంలో కలిసిపోయింది. పాలకవర్గాల అధికారాల పంపకంలో భాగంగా కశ్మీర్ లో పరిస్థితులు శాంతించేవరకూ అంటూ ʹతాత్కాలికంగాʹ పొందుపరచబడిన ఆర్టికల్ 370ని ఆ తర్వాత చోటుచేసుకున్న 35 ఎ ను రద్దు చేయడం అప్రజాస్వామిక, అలౌకిక, అనైతిక, నిరంకుశ చర్య తప్ప మరోటి కాదు.

2014లో తొలిసారి దిల్లీ గద్దెనెక్కిన బ్రాహ్మణవాదులు కశ్మీర్ పై చిరకాల వాంఛను నేరవేర్చుకోవడానికి చేయని కౌటిల్యం లేదు. కశ్మీర్లో తమ బలాన్ని పెంచుకోవడానికి భాజపా ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అక్కడే తిష్ట వేసి పి.డి.పి.తో కొంతకాలం పోత్తుల కుంపటి నెరిపారు. కానీ మధ్యలోనే దానికి చెల్లుచీటి ఇచ్చి అక్కడికి, తమ అనుంగు బంటు సత్యపాల్ మల్లికను గవర్నర్ గా పంపి తమ కుట్రలను వేగవంతం చేశారు. బూటకపు ఎన్ కౌంటర్ల ఎక్స్పర్ట్ ట్రిగ్గర్ హ్యాపీ కె. విజయకుమార్ ను ముందే అక్కడికి పంపడం గమనార్హం. కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించి అక్కడి ప్రజా జీవితాల్ని కేంద్రం తమ చేతులలోకి తీసుకుంది.

నిజానికి కశ్మీర్ జాతి ప్రజల కోరికపై రూపొందిన ఆర్టికల్ కాదది. అది రద్దు అయినంత మాత్రాన వారి జాతి పోరాటం ఆగేదేమి లేదు. దానితో ఏ సంబంధం లేకుండానే వారు గత ఏడు దశాబ్దాలుగా సాయుధ పోరులో నిమగ్నమై వున్నారు. కశ్మీర్ విలీన ఒప్పందంలో భాగంగా ఆ ఆర్టికల్ ను రాజ్యాంగంలో పొందుపరిచారు. దాని ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ మినహా అన్ని విషయాలలో జమ్మూ కశ్మీర్ స్వయం పాలిత ప్రాంతంగా ఉంటుందన్నారు. కానీ, ఏకపక్షంగా కేంద్రం దానిని రద్దు చేసి తన సత్తా చాటుకుంది.

రెండో విడత అధికారానికి వచ్చిన వంద రోజులలోపే మోదీ ప్రభుత్వం ప్రజలు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను సవరించింది. పాశవికమైన, అనాగరికమైన ఉపా లాంటి చట్టాలను మరింత కర్కశంగా తయారు చేశారు. ఆ క్రమంలోనే కశ్మీర్ పై విరుచుకపడ్డారు. కశ్మీర్ పై నిర్ణయం తీసుకోవడానికి కొద్ది రోజుల ముందు తన నమ్మినబంటు, భజనపరుడు, హెూం మినిస్టర్ అమిత్ షాను ఆయనతో పాటు అన్ని విషయాలలో తనకు శకుని సలహాలు ఇచ్చే జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోభాలను కశ్మీర్ కు పంపడంతో అక్కడ అన్ని విధాల వారు రంగం సిద్ధం చేశారు. వేల సంఖ్యలో అదనపు బలగాలను అక్కడికి తరలించారు. అమర్ నాథ్ యాత్రీకులను, పర్యాటకులను వెనక్కి మళ్ళించారు. కశ్మీరీ ప్రజా పోరాట నాయకులను కల్పిత ఆరోపణలపై కటకటాలపాలు చేశారు. పార్లమెంటరీ పార్టీల నాయకులనూ ఉపేక్షించలేదు. మొబైల్ నెట్వర్క్, లాండ్ లైన్ ఫోన్ వ్యవస్థ సహ మొత్తం కమ్యునికేషన్ వ్యవస్థను స్థంభింపచేశారు. కశ్మీర్లో కర్ఫ్యూ విధించి, ప్రజలను ఇళ్లలో బంధించి, దానిని అతి పెద్ద జైలుగా మార్చారు. హిందువుల ప్రాబల్యం కలిగిన జమ్మూలో 144 సెక్షన్ విధించారు. విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. ఈ జరుగుతున్నదంతా అక్కడ అతి సాధారణ ప్రక్రియగా నాయకులు, అధికారులు ప్రజలకు బుకాయించారు. అన్ని రకాల కట్టుదిట్టాలు చేసుకున్న తర్వాతనే ఇక ఏ ధోకా లేదనుకున్నాకే మొక్కుబడి మంత్రిమండలి సమావేశం జరిపి అసలు గుట్టు విప్పారు. జమ్మూ కశ్మీర్ ను రెండు ముక్కలు చేసి బౌద్ధులు అధికంగా వున్న లద్దాక్ ను విడిగానూ, జమ్మూ కశ్మీర్ ను విడిగానూ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. భారత రాజ్యాంగబద్ధంగా ఒనగూడిన జమ్మూ కశ్మీర్ స్వయం పాలనకు స్వస్తి చెప్పి తమ నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధం చేశారు. దోపిడీ పాలకుల నిర్ణయం ఎంతటి ప్రజా వ్యతిరేకమైనదో, దానిని ప్రకటించడానికి వారికి ఎంతటి కట్టుదిట్టాలు అవసరమయ్యాయో, వారు చేపట్టిన దుశ్చర్యలే మరోసారి స్పష్టం చేశాయి. వీటన్నింటి మధ్య అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మోదీని ఉల్లేఖిస్తూ కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వానికి తాను సిద్ధం అనడం గమనార్హం.

బ్రిటిష్ వారి వలస నుండి ʹభారత స్వాతంత్ర్యాన్ని కోరిన నెహ్రూ మరోవైపు దక్షిణాసియాలో కశ్మీర్ ను తన సైన్యాలతో తొలి వలసగా మార్చుకుంటే, ఆయన ʹవారసుడుʹ ప్రధాని మోదీ సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ ను కట్టుకొని ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం పూర్తి చేయని దుష్కార్యాన్ని పూరించాడు. ʹఏక్ ప్రధాన్, ఏక్ విధాన్ʹ అంటూ 1950లలో తమ నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ తలచిన కలలను సాకారం చేశాడు. ʹరాజతరంగిణిʹ నుండి భారత రాజ్యాంగం వరకు కశ్మీర్ చరిత్రను మసిపూసి మారేడుకాయచేసి తమ ʹనయా భారత్ʹ వ్యూహంలో మరో దుందుడుకు చర్యకు తలపడ్డారు. సామ్రాజ్యవాదుల అండ కలిగిన దేశంలోని బడా బూర్జువా భూస్వామ్య పార్టీలేవైనా అంతిమంగా జాతుల ఆకాంక్షలను వమ్ము చేసేవేనని ప్రస్తుత చర్య ద్వారా మరోమారు వెల్లడైంది.

కశ్మీరీ ప్రజలు తమ డిమాండ్ల సాధన కోసం నేటికీ అనేక త్యాగాలు చేస్తూనే ఉన్నారు. అఫ్జల్ గురు లాంటి వాళ్లెందరో భారత పాలకుల ఉరికోయ్యలను అలంకరించారు. బుర్హన్ వానీ లాంటి యువ పోరాటకారులెందరో కశ్మీర్ యువతకు రోల్ మోడల్ గా నిలిచి ఇప్పటికీ సాయుధపోరులో ప్రాణాలర్పిస్తునే ఉన్నారు. భారత సైనికులు అక్కడ వేలాది పోరాటకారుల ఇండ్లు కాల్చినా, వారి బంధు మితృలను ఎంత క్రూరంగా హింసించినా, అక్కడి మహిళలను ఎందరినో అత్యాచారాల పాలు చేసినా, కశ్మీరీ బిడ్డలనెందరినో అదృశ్యం చేసినా, సామూహిక స్మశానాలలో ఖననం చేసినా ʹఆజాదీ కశ్మీర్ʹ నినాదం నెరవేర్చుకునే వరకు వారి గుండెలలో మారుమ్రోగుతూనే ఉంటుంది. ఆ జాతి ఆకాంక్షలను ఎవరూ చెరపలేరు. మోదీ ఎన్ని స్పెషల్ ప్యాకేజీలు ప్రకటించినా, ఎంతటి ఆర్థిక ప్రలోభాల ఎరలు విసిరినా, ఎన్ని వ్యాపార చిట్కాలు విప్పి చెప్పినా, ఏ ప్రధాని కన్నా అధికంగా ఎన్నిసార్లు కశ్మీర్ ను సందర్శించినా, ద్రోహులను, బలహీనులను, అధికార దాహంతో లొంగిపోయే స్వార్థపర శక్తులను భారత పాలకులు తమ వైపు ఎందరిని తిప్పుకున్నప్పటికీ ప్రజలలో నెలకొన్న బలమైన జాతి ఆకాంక్షలు చల్లారవు. భారత పాలకులు చేపట్టే ప్రతి దుష్ట చర్య ఆ జాతి ప్రజల ఆకాంక్షలను, పోరాట సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయే తప్ప అణచలేవు.

తమిళ ప్రజల ఆకాంక్షలతో పురుడు పోసుకున్న ద్రవిడ కజగంల అన్ని శాఖలూ నేడు భారత పాలక వర్గాల కొమ్ము కాస్తున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం తెలుగు ప్రజల ఆకాంక్షలంటూ అధికారాన్ని కైవశం చేసుకున్న తెలుగుదేశం పార్టీ, ప్రాంతీయ అసమానతలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సొమ్ము చేసుకొని ఐదేళ్ల క్రితం అధికారాన్ని అలంకరించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ బోర్డు పెట్టుకొని దిల్లీ పాలనను చేపట్టిన ఆప్, అంబేడ్కర్ ను అడ్డు పెట్టుకొని ఎన్నికల వ్యాపారంలో దళితులను కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే భావిస్తూ సోషల్ ఇంజనీరింగ్ లో ఘనత వహించిన బహుజన సమాజ్ పార్టీ నిస్సిగ్గుగా కేంద్రం చర్యను సమర్థించి పాఖండీ బ్రాహ్మణవాదులను రంజింపచేశాయి. తద్వారా అవి తమ నైజాన్ని ఆయా జాతుల, దళితుల ముందు బట్టబయలు చేసుకున్నాయి.

దేశంలో ప్రతి జాతికి విడిపోయే హక్కుతో సహ స్వయం నిర్ణయాధికారం ఉండాలి. అందుకు కార్మికవర్గ నాయకత్వన పోరాటం వినా జాతులకు మరో మార్గమే లేదు. ప్రాంతీయ పార్టీలైనా, ʹజాతీయʹ పార్టీలైనా సామ్రాజ్యవాదుల, బడా బూర్జువా భూస్వాముల ప్రయోజనాలను నెరవేర్చేవే! తాము నమ్మిన ఆశయాల సాధన కోసం కశ్మీర్ ప్రజలు మరిన్ని త్యాగాలకు సిద్ధమవుతున్నారు. దేశంలోని ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, దేశభక్తులు, రచయితలు, కళాకారులు, పాత్రికేయులు, కశ్మీరీ హితోభిలాషులు, వామపక్షాలు, సమస్త జాతుల ప్రజలు న్యాయమైన కశ్మీరీ ప్రజా పోరాటానికి అండగా నిలువాల్సిన తరుణమిది. దేశంలోని జాతుల విముక్తి పోరాటాలకు తలమానికమైన కశ్మీర్ జాతి ప్రజలు ఒంటరిగా లేరని నినదిద్దాం.

No. of visitors : 271
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార సెప్టెంబర్ 2019

  దళిత భక్త కవి రవిదాస్‌ సంత్‌ ఆలయం కూల్చివేత హిందూ ఫాసిజంలో భాగమే
  The Destruction of Kashmir is a Deathblow to Democracy in India
  నల్లమల యురేనియం గని కాదు, జీవవైవిధ్య కేంద్రం
  అతడు ఆమె అడవి
  మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ
  కన్ ఫామ్... !
  బందిష్
  రాంగూడ ప్రాంతంలో సమిష్టితత్వం, సహకార పద్ధతి
  కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం
  కవులకు సమర స్ఫురణ

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •