కవులకు సమర స్ఫురణ

| సంభాషణ

కవులకు సమర స్ఫురణ

- రివేరా | 16.08.2019 08:11:44pm

గూగీ, సాయిబాబ, వరవరరావులను ఉమ్మడిగా కలుపుతున్న అంశాలూ, ప్రత్యేకంగా నిలుపుతున్న అంశాలూ మనం గమనించవచ్చు. ఈ ముగ్గురూ అధ్యాపకులు. ఇప్పుడు వెలువడిన సాయిబాబ ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ కవిత్వాన్ని పరిగణనలోకి తీసుకొంటే.. వీరు ముగ్గురూ ప్రభావమంతమైన సృజనాశీలురు. జైలు జీవితం వీరిని కలుపుతున్న మరో ఆత్మీయ అంశం. మౌలికంగా మార్క్సిజమే వీరి దృక్పథం అయినప్పటికీ వారి జీవన, ఉద్యమ, సామాజిక వ్యక్తీకరణల్లో పోల్చలేనంత వైవిధ్యం కనిపిస్తుంది. గూగీ రచనలను వరవరరావు తన జైలు జీవితంలో అనువదిస్తే, గూగీ ఆత్మకథ మొదటిభాగాన్ని అదే జైలు గోడల మధ్య నుంచి సాయిబాబ తెలుగు పాఠకులకు పరిచయం చేశాడు. ఇప్పుడు గూగీ ప్రవాస జీవితం గడుపుతుంటే, మిగతా ఇద్దరూ జైలులో ఉన్నారు. తాజాగానూ, పునర్ముద్రణలుగా సాయిబాబ, వరవరరావు సాహిత్యం వెలువడి, తెలుగు నేలంతా విరివిగా ఆవిష్కరణలు జరుపుకొంటున్నాయి. అందులో భాగంగా వెలువడినదే వరవరరావు ముందుమాటల పుస్తకం ʹసమర కవి సమయంʹ. ఇది విప్లవ, అమర కవులపై వచ్చిన పుస్తకాలకు ఆయన రాసిన ముందుమాటల్లో కొన్నింటిని ఏర్చికూర్చి తీసుకొచ్చిన పుస్తకం. విప్లవ కవులంటే ఎవరు? అనే మౌలిక ప్రశ్నను తనకు తాను వేసుకొని, దానికి సమాధానం కోసం వరవరరావు సాగించిన అన్వేషణను ఈ ముందుమాటల్లో మనం గమనించవచ్చు. విషాదం ఏమిటంటే, రచయిత అంటే ఎవరు? అంటేనే సరిగ్గా జవాబు దొరక్క, ఆ మాటకు తూగే కలాలు పట్టుమని పిడికెడు కూడా కానరాని ప్రస్తుత నేపథ్యంలో ఈ ప్రశ్న మనముందుకు వచ్చింది. మరోరకంగా చూస్తే, ఇది కవితాన్యాయం అని కూడా అనిపిస్తుంది. ʹతిరిగి తిరిగి వచ్చింది నక్సల్బరీʹ అని పాడుకున్నట్టుగానే.. రచయితలార మీరెటు వైపు? అనే సూదంటురాయి వంటి సూటియైన ప్రశ్న ఇదిగో తిరిగి ఈ రూపంలో మనల్ని తాకిందనేది మనం గుర్తు పెట్టుకోవాలి.

అజ్ఞాతంలోంచి, జైలు జీవితంలోంచి వెలువడిన కవిత్వమంతా విప్లవ కవిత్వమేనని, వారంతా విప్లవ కవులేననే స్థూల అవగాహన ఈ ముందుమాటల్లో కనిపిస్తుంది. పుస్తకం కూర్పులోనూ ఈ జాగ్రత్తను తీసుకొన్నారు. ఇందులో 17 ముందుమాటలు ఉన్నాయి. గౌతమ్‌, షహీదాలను మినహాయిస్తే, మిగతా కవులెవరూ ఇప్పుడు జీవించి లేరు. ఇంకా విషాదం ఏమిటంటే, ఒక అమర కవి పుస్తకానికి రూపకల్పన చేసే పనిలో చురుగ్గా పాలుపంచుకొన్న ఎందరో ఉద్యమ కవులు, ఆ తరువాత ఏడాదికో, రెండేళ్లకో అమరులయ్యారు. వీరందరి అమరత్వాల తాలూకూ ఉద్వేగాలు.. వారిపై వచ్చిన పుస్తకాలకు ముందుమాటలు రాసిన వరవరరావుని మాత్రమే కదిలించలేదు. ఆ పుస్తకాలను ముట్టుకొన్న ప్రతి ఒక్కరి వేళ్లకూ కన్నీరు అంటిన సందర్భం అది. మా తరాన్ని, అంటే 1980ల్లో పుట్టి 1990 చివర్లలో రాజకీయాలకు, సాహిత్యానికి పరిచయం అయిన తరాన్ని విప్లవ ఉద్విగ్నతకు గురిచేసిన కవులు వాళ్లు. ఎంఎస్‌ఆర్‌, సముద్రుడు, భూమిపుత్రుడు వీరన్న, కౌముది, భూమన్న, మంజీర, లక్ష్మక్క.. వీరంతా నక్సల్బరీ విశిష్ఠ సాంస్కృతిక సాహిత్య సంపద్రాయానికి వారసులు. ఉద్యమ జీవితాన్ని ఒక రొమాంటిక్‌ అనుభవంగా చూసిన మా యవ్వన తొలిరోజుల్లో, ఆ జీవితంలో ఉన్నవాళ్లూ కవిత్వాలు రాస్తారని తెలిసినప్పుడు, వాటిని ఎక్కువగా వారి అమరత్వ సందర్భాల్లోనే చదువుకొన్నప్పుడు నిజంగానే సంభ్రమానికి గురయ్యాం. ఎందుకంత సంభ్రమం అనే ప్రశ్న నాడు మేం వేసుకోలేదుగానీ, ఇప్పుడు ఈ పుస్తకం చదువుతుంటే తప్పక అలాంటి పున:స్ఫురణ కలుగుతోంది. కవిత్వమూ, అమరత్వమూ నిజాయితీనీ, వ్యక్తిత్వాన్నీ పట్టిచ్చే కొలబద్దలు కావడమే ఇలాంటి సంభ్రమానికి కారణమని వరవరరావు విశ్లేషించారు. ఈ విశ్లేషణ అక్కడితో ఆగలేదు. సమాజాన్ని మార్చే విప్లవకారులు నిరంతరం ప్రకృతితో మమేకమయి ఉంటారు. చాలా సహజమయిన వ్యక్తీకరణలు చేయగల శక్తి ప్రకృతి సమక్షంలో వారు పొందుతారు. విప్లవ కవుల సృజనకు ప్రధాన బలమూ, ప్రేరణాత్మక శక్తీ ఇక్కడి నుంచే వస్తుందని ఆయన వివరంగా చెప్పారు. ఎంఎస్‌ఆర్‌ సందర్భంలో వరవరరావు పరిశీలన చేసిన సద్య:ప్రతిక్రియ అనే లక్షణం ఆ ఒక్క యువ అమర కవికే కాదు, ఇప్పుడు జైలు జీవితంలో ఉన్న సాయిబాబ సహా ప్రతి ఒక్క విప్లవ కవికీ వర్తిస్తుంది. అంటే, ప్రత్యేక వాతావరణం ఉంటేనే కలం పట్టుకొంటామనే ధోరణి విప్లవ కవుల్లో, ముఖ్యంగా అమర కవుల్లో కనిపించదు. శిల్పం గురించి, కవితను సిద్ధం చేయడంలో జాగ్రత్తలు తీయడం గురించి కొంత వ్యంగ్యంగానూ, మరింత విమర్శనాత్మకంగానూ మాట్లాడేవారికి ఇక్కడేదో తావు ఇచ్చినట్టు కనిపించవచ్చు. కానీ, ఎలాంటి సందర్భంలో ఈ చర్చ జరుగుతున్నదనేది గుర్తించడం అవసరం. ప్రత్యేకంగా సాధన చేసే వీలులేని నిత్య నిర్బంధ ఉద్యమ జీవితంలో ఉన్నవారు, తమ సహజాతిసహజ వ్యక్తీకరణలను కాగితంపై పెట్టిన సందర్భంలోని చర్చ ఇది. అంతకన్నా ముఖ్యంగా అటువంటి కవుల సృజనాశక్తిని తూచేటప్పుడు తప్పక ప్రకృతితో వారికున్న ఆత్మిక సంబంధాన్నీ గమనంలో ఉంచుకోవాల్సిందిగా విమర్శకులను అప్రమత్తం చేయడానికి వరవరరావు ఈ ప్రస్తావనలు చేశారని అనుకొంటున్నాను. ఎందుకంటే, ఈ ముందుమాటలకూ, ఆ మాటకొస్తే మొత్తంగా ఆయన సృజనకు కచ్చితమైన రచనా వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏమిటనేది నా ప్రసంగం చివర్లో వివరించే ప్రయత్నం చేస్తాను.

కేవలం స్మరణగానే కాదు, కవులకు సమర స్ఫురణను కలిగించేరీతిలో 189 పేజీలతో రూపుదిద్దుకొన్న ఈ పుస్తకంలో 68 పేజీలు శివసాగర్‌ కవిత్వ తత్వ పరిశీలనకే కేటాయించడం జరిగింది. శివసాగర్‌ తొలి కవిత్వ సంపుటాలకు రాసిన ముందుమాటలు 14 పేజీల్లో, ఆయన సమగ్ర కవిత్వ స్వరూపాన్ని మరో 54 పేజీల్లో పొందుపరిచారు. విప్లవ కవిత్వాకాశంలో శివసాగర్‌ సాహిత్యానికి ఉన్న స్థానం ప్రత్యేకమైనది. చారిత్రక, ఉద్యమ కోణంలో మాత్రమే కాకుండా, ఆయనతో అతి సన్నిహితంగా మెలిగిన అనుభవం నుంచీ వరవరరావు.. శివసాగర్‌ గురించి చాలా విస్తారంగా రాశారు. శివసాగర్‌ బతికి ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు ఎన్నో పుస్తకాలు ఆయనపై వచ్చాయి. ఆయన ఆవేదనను తమ ఆవేదనగా, ఆయన ఆగ్రహన్ని తమ ఆగ్రహంగా చేసుకొన్న రచనలు, పుస్తకాలే అవన్నీ. వాటి నుంచి వరవరరావు పరిశీలనను వేరు చేసిన అంశమూ, ప్రత్యేకంగా నిలిపిన అంశమూ.. చారిత్రక దృష్టి. రాగద్వేషాలూ, ప్రేమలూ, సంబంధాలతో ముడిపెట్టడానికి వీలులేని దృష్టి ఇది. అలాంటి దృష్టిపథంలోంచి శివసాగర్‌ ఎదిగొచ్చిన నేపథ్యమూ, ముఖ్యంగా కాలం ఆయనను కనుగొన్న తీరును అత్యద్భుతంగా వరవరరావు పసిగట్టగలిగారు. అంతకన్నా ముఖ్యంగా నక్సల్బరీ గర్భంలోనే దాగిన సాయుధ, సాంస్కృతిక విశిష్ఠతలను ఆయన పట్టుకోగలిగారు. ʹగురజాడ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, తిలక్‌ మొదలు దిగంబర కవులు తమ కవిత్వంలో చేసిన శిల్ప ప్రయోగాల్లోని మేలిమినంతా స్వీకరిస్తూ, గురజాడలోని ప్రజాస్వామిక దార్శనికతను, శ్రీశ్రీలోని తిరుగుబాటు ʹవేదాంతాన్నిʹ, తిలక్‌లోని భావుకతను, దిగంబర కవుల్లోని ధిక్కారాన్ని...నక్సల్బరీతో వచ్చిన గుణాత్మక విప్లవమార్పుతో విప్లవీకరించి కవిత్వాన్ని సాయుధం చేసినవాడు శివసాగర్‌ʹ. వరవరరావు చేసిన ఈ పరిశీలన అతి ముఖ్యమైనది. గతకాలపు కొనసాగింపుగా మాత్రమే శివసాగర్‌నో, మరో ఆధునిక కవినో చూడటం చాలా అన్యాయమైన పరిశీలన అవుతుంది. నక్సల్బరీ విషయంలో ఇది మరింత అన్యాయమైన అవగాహనే అవుతుంది. అప్పటి కమ్యూనిస్టు పార్టీల ఆచరణలో చెడులే ఎక్కువ కాబట్టి, నక్సల్బరీ మౌలికంగా రాజకీయ గతం నుంచి తనను తాను వేరు చేసుకొన్న ఉద్యమం. దానిని తెలుగు నేల మీద చేపట్టి, దానికొక ఉద్యమ రూపం, సాహిత్యరూపం ఇచ్చినవారిలో ఎక్కువమంది ఆ రాజకీయ గతంతో గాఢంగా ముడిపడి ఉన్నవారే. దీనికి మినహాయింపు శివసాగర్‌. గుంటూరులోనే ఆయన చదువుకొన్నారు. వామపక్ష విద్యార్థి ఉద్యమాలతో సంబంధం ఉన్నా కూడా, అది ఆయన ప్రధాన రాజకీయ ఆచరణ అయినట్టు కనిపించదు. తొలినుంచీ కొండపల్లి సీతారామయ్య పరిచయంలో ఉన్నా, అధ్యయనం, సాహిత్య ఆసక్తులే ఆయనలో ఎక్కువ. భూమిని తప్పించుకొని మనిషి ఎటూ పోలేనట్టే, శ్రీశ్రీ ఫ్రభావం నుంచి తెలుగు కవిత్వం తప్పించుకుపోవడం నాడూ, నేడూ కష్టమే. అయినా, మిగతా వారి కన్నా త్వరగానే ఆ మోహం నుంచి శివసాగర్‌ బయటపడ్డాడు. తన సామాజిక నేపథ్యం పరిచయం చేసిన వాస్తవిక జీవితమూ, క్రైస్తవ సాహిత్యమూ ఇందుకు చాలావరకు దోహదం చేశాయి. ఆ సాహిత్యంలోని మత కోణాన్ని అలాఉంచితే, అందులోని శ్రవ్యతను, లయబద్ధతను శివసాగర్‌ తన తొలి కవిత్వంలోనే స్వీకరించాడు. ఇలా శ్రీశ్రీ నుంచి స్ఫూర్తిని పొందుతూనే, తనదైన వ్యక్తీకరణ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే..ప్రత్యేక విప్లవ సాంస్కృతిక సందర్భాన్ని నక్సల్బరీ తెర మీదకు తీసుకువచ్చింది. సహజంగానే ఆ సందర్భానికి తగినట్టు స్పందించి, విప్లవ కవితకు శివసాగర్‌ ఆద్యుడయ్యాడు. నిజానికి, శ్రీశ్రీని దాటి ముందుకెళ్లాలని అప్పటికి 30 ఏళ్లుగా ఎందరో ప్రయత్నించారు. వేరే ప్రత్యేకతల రీత్యా వారికి సాహిత్యంలో స్థానం లభించినా, శ్రీశ్రీని ఓవర్‌టేక్‌ చేసే విషయంలో వారంతా రిప్లీకాలుగానే మిగిలారు. 50, 60ల్లో సామాజిక అంశంపై సినిమాకు పాట రాయాల్సి వస్తే, ఆ పాట ఎవరు రాసిందయినా శ్రీశ్రీ రచనగానే పరిగణించేవారు. ʹచదువుకొన్న అమ్మాయిలుʹ చిత్రానికి ఆత్రేయ రాసిన ʹకారులో షికారుకెళ్లే పసిడిబుగ్గల చిన్నదానా.. నీ బుగ్గపై గులాబీ రంగు ఎలా వచ్చేనో చెప్పగలవాʹ అనే పాటపై శ్రీశ్రీ ముద్ర సుస్పష్టం. ఆలూరి బైరాగి ʹతాజ్‌మహళ్లను పగలకొట్టిండిʹ అనే కవిత నేరుగా శ్రీశ్రీ ప్రభావంతో రాసిందే. ఇలా ఎంతైనా ఉటంకించవచ్చు. నక్సల్బరీ కడుపుతో ఉండి కన్న బిడ్డడుగా శివసాగర్‌ మాత్రమే శ్రీశ్రీని పూర్వపక్షం చేయగలిగాడు. అయితే, హేతువు మీద, శాస్త్రీయత మీద ఆధునిక తెలుగు కవితను స్థాపించినవాడిగా శ్రీశ్రీ... ఈ శివʹసాగరంʹలో మనసారా మునకలు వేశాడు. ఇదంతా వరవరరావు చెబుతూ, చారిత్రక సందర్భం నుంచీ, అందులోనూ నక్సల్బరీ సాంస్కృతిక కర్తవ్యాల నుంచి వేరుచేస్తే, శివసాగర్‌ విషయంలో మనకు కలిగే పరవశానికి అర్థమే ఉండదని గట్టిగానే హెచ్చరించారు.

ఇక చివరిగా వరవరరావు రచనా వ్యూహం గురించి నాకు అర్థమయిన మేరకు వివరించి ముగిస్తాను. నక్సల్బరీ సాహిత్య, సాంస్కృతిక సంప్రదాయంలో అతి ముఖ్యమైన అంశం పొలిమికల్‌ డిబేట్‌. రివిజనిస్టు రష్యా నాయకత్వంతో నవ చైనా జరిపిన గ్రేట్‌ డిబేట్‌లో ఈ సంవాద మూలాలు ఉన్నాయి. 1972లో ʹగెరిల్లా విప్లవ గీతాలుʹకు వరవరరావు రాసిన ముందుమాట మొదలు షహీదా ʹఒక మాట-ఒక సంభాషణʹకు రాసిన ముందుమాట దాకా, అంటే ఇంచుమించు ఈ యాభై ఏళ్లలో విప్లవ కవిత్వంపై విమర్శ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడది విమర్శ దశను దాటి దాడి రూపంలోకీ మారింది. సాహిత్యాన్ని విప్లవీకరించే క్రమంలో ఈ దాడిని ఎదుర్కోవడమూ ఒక భాగమే. ʹవిప్లవం లోపించిన కవిత్వమూ, కవిత్వం లోపించిన విప్లవమూ నిజమైన విప్లవ లక్షణం కాదుʹ అని అనడంలో మనకు ఈ ఎరుక కనిపిస్తుంది. విప్లవ కవిత్వంలో కవిత్వం లుప్తం అన్న ఆనాటి విమర్శకులకు సమాధానంగా ఈ ముందుమాట కనిపిస్తుంది. విప్లవ అజ్ఞాత, జైలు కవితలను విశ్లేషించే క్రమంలో కవిత్వాన్ని తూచే పరికరాలను అలంకారికులు, లాకిక్షుల నుంచి కాకుండా, సమాజం నుంచి విమర్శకులు స్వీకరించాలంటూ ఆ రెండింటికీ ఉండే కార్యకారణ సంబంధాన్ని నొక్కి చెప్పారు. గతితర్కం ఆచరణలోంచే అర్థం అవుతుందంటూ... శ్రమకు, జ్ఞానానికి ఉండే లంకెను విస్మరించే బుద్ధిజీవులూ, సాహిత్య విమర్శకులపై వీలు దొరికిన చోటల్లా చురకలు వేశారు. ఒకరకంగా చెప్పాలంటే, వరవరరావు ఇన్నేళ్ల సాహిత్య ఉద్యమ జీవితకాలమంతా ఇంటిలెక్చువల్‌ వార్‌ఫేర్‌నే సాగిస్తున్నారు. సాహిత్య విమర్శను శాస్త్రీయ పునాదిపై నిలబెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ పునాదిని నిరంతరాయంగా కొత్త తావులకు విస్తరించడం అంతకన్నా ముఖ్యం. ఈ పనిని ఒక నియమంగా, చాలా మొండిగా వరవరరావు చేశారు. ఆయనకుముందు కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ కొంత ఈ పని చేయకపోలేదు. ʹభౌతిక యుద్ధంలో బలహీన తావుల్లోనూ, బౌద్ధిక యుద్ధంలో బలమైన చోట్ల దెబ్బ తీయాలిʹ అని కుటుంబరావు స్పష్టంగానే చెప్పారు. ʹʹనువ్వు డాక్టరువి కా, టీచరువి కా.. కానీ ముందుగా కమ్యూనిస్టువి కాʹʹ అని శ్రీశ్రీ తేల్చేసి ఉన్నాడు. కానీ, నక్సల్బరీ మూల దినుసు అయిన ప్రతి దాన్నీ ప్రశ్నించి, నిగ్గుతేల్చడమనే సమర గుణమే వరవరరావు రచనలకు ప్రత్యేకతకు తెచ్చిపెట్టాయి. ఈ లక్షణం ఎంతగా ఆయన రక్తంలో భాగమయి పోయిదంటే, తన కవితా శైలీ, వాక్య శైలీ సైతం తదానుగుణమైన రూపం సంతరించుకొన్నాయి. నిజానికి, వరవరరావు రాసినట్టు ఎవరైనా రచనలు చేసి పంపితే, అవి పత్రికాఫీసుల గడపను కూడా దాటలేవు. ఇలాంటి శైలిని తాను ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందనేది ఆయన స్పష్టంగానే చెప్పారు. ʹʹసాహిత్య జీవుల సమావేశాల్లో, చేతికి వచ్చే తీరిక సమయాల్లో దృష్టిలోకి వచ్చే పత్రికల్లో, తాముగా ఇంటికి నడిచివచ్చే పుస్తకాల్లో తప్ప సాహిత్యాన్ని పట్టించుకొని, విశ్లేషించలేని విమర్శకులకు ఈ సాహిత్యం (విప్లవ సాహిత్యం) ʹచూపుకందడం లేదుʹ. విప్లవ సాహిత్యోద్యమాన్ని అంచనా వేయడంలో వాళ్లు అలవాటుపడ్డ సాహిత్య దైనందిన చట్రంలో, ʹఅండర్‌గ్రౌండ్‌ సాహిత్యంʹ ప్రతిఫలనాన్ని ప్రవేశపెట్టడం ప్రయత్నపూర్వకంగా జరగాలిʹʹ. ఒకరకంగా ఇవి విప్లవ రచయితల సంఘం ఆచరణలో భాగంగా ఆయన కొనసాగిస్తున్న ఇంటిలెక్సువల్‌ వార్‌ఫేర్‌ను నిర్వచించే వాక్యాలనే చెప్పాలి. విప్లవ కవులు ఎవరు? అనే ప్రశ్నతో ఈ ప్రసంగాన్ని మొదలుపెట్టాను. అమరులు ఎవరు? అనే మరో ప్రశ్నతో దీనిని ముగిస్తాను. ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసినవారు మాత్రమే అమరులనే స్థూల అవగాహనను వరవరరావు విస్తరించారు.

ఈ ప్రశ్నకు ʹమంజీరా మూడ్స్‌ʹ ముందుమాట ముగిస్తూ ..ఒక ఆలోచనకు, సంభాషణకు సజీవ కొనసాగింపును వాగ్దానం చేసేవారే అమరులు అని స్పష్టం చేశారు. ఈ అర్థంలో కామ్రేడ్‌ ఆలూరి భూజంగరావు కూడా అమరులేనని చెబుతూ, ఆయనకు నివాళి అర్పిస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

(గుంటూరులో నిర్వహించిన కామ్రేడ్‌ ఆలూరి భుజంగరావు సంస్మరణ సభలో వరవరరావు ʹసమర కవి సమయంʹ పరిచయ ప్రసంగం)

No. of visitors : 325
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మంద్ర‌స్థాయి యుద్ధం - ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న : రివేరా

రివేరా | 10.06.2016 01:10:40am

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధం - ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న పై రివేరా ఉప‌న్యాసం.......
...ఇంకా చదవండి

చేజారిన జాడల్లోంచి మైదానాల్లోకి..

రివేరా | 16.07.2016 11:50:45am

పుస్తకాల సంచిని గిరాటేసి రోడ్డుపైకి దూసుకెళ్లిన జ్ఞాపకం వెనుక నుంచి పిలుస్తున్న తల్లివైపు స్నేహితుల భుజాలపైనుంచి నవ్వుతూ చూడటమే చివరిచూపు.......
...ఇంకా చదవండి

ఏప్రిల్ పండు II రివేరా

రివేరా | 24.04.2016 11:08:03pm

పిల్లలు లేని ఇల్లు, ఇది హైదరాబాద్, ఊరేగింపు, ఏప్రిల్ పండు,...
...ఇంకా చదవండి

సాయంకాలం వాన‌!

రివేరా | 20.12.2016 11:48:01pm

దుప్ప‌టి కింద‌, దిండు అడుగున‌ పిల్ల‌లు చూడ‌కుంటా క‌ప్పెట్టుకొన్న వ‌ర‌ద‌గూడుని మెలిపెడ‌తావేమో...
...ఇంకా చదవండి

భ‌యం చుట్టూ భ‌యం..

ఎడార్డో గెల‌నో | 04.02.2017 01:18:19am

వీళ్లెక్క‌డ చంపుకుతింటారోన‌ని ఆడ‌వాళ్ల‌కు భ‌యం భ‌యంలేని ఆడ‌వాళ్లంటే మ‌గ‌వాళ్ల‌కు మ‌హా భ‌యం దొంగ‌లంటే భ‌యం, పోలీసుల‌న్నా మ‌రి భ‌య‌మే తాళాలు లేని త‌లుపులంటే భ...
...ఇంకా చదవండి

రెప్పని కప్పని నిద్దుర

రివేరా | 16.08.2016 09:26:54am

ఒకే రాత్రిని కప్పుకొన్న మనకి ఒక్క నిద్దుర చాలదా? చుక్క కలని పొదువుకోడానికి ఈ ఒక్క దేహ వర్షం చిలకదా?...
...ఇంకా చదవండి

నో, ఐ డోన్ట్‌ లైక్‌ టమాట

రివేరా | 17.09.2016 10:14:09am

టమాట రంగు సరే, రసాలూరే సరస్సులేమీ.. కొంచెం కరిచిపట్టుకొన్న మిలమిలా మీనాలేమీ.. పైకి కిందకి మునకలేసే గత్తరబిత్తర గోళాలేమీ.......
...ఇంకా చదవండి

ఈ రాక్ష‌స గీతి వింటారా?

రివేరా | 02.11.2016 10:23:06am

మ‌నం నిల‌బ‌డిపోయిన చోట నుంచే మ‌న న‌డ‌క‌ల‌ను మోసుకెళుతున్నారు మ‌నం ఆపేసిన రాగాల‌నే తీగ‌లుగా సాగిపోతున్నారు మ‌న గొంతునీ, మ‌న వంతునీ మ‌న‌క్కిచ్చేసి వెళుతు...
...ఇంకా చదవండి

సబ్కా జవాబ్ వెతికుతున్న కవి రివేరా

మహమూద్ | 04.05.2017 10:49:39am

విప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే.......
...ఇంకా చదవండి

అద్గ‌దీ...

రివేరా | 20.10.2016 12:13:15am

అటో ఇటో వేటో పోటో ప‌డిపోవాల్సిందే! పాల‌కులంతా ప్ర‌జాస్వామిక‌వాదులై ప్రజ‌లేమో నియంత‌లైతే ఏమి చేస్తాం?...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •