కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం

| సంభాషణ

కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం

- ముకుళిక. ఆర్‌. | 16.08.2019 08:28:10pm


జె.ఎన్‌.యు.లో గోడ పత్రికలు, రాతలకు (గ్రాఫిటీ) వ్యతిరేకంగా ఆదేశాలు

విపరీతమైన ఎండ, ఉ్కపోతగా వున్న ఓ రోజు మధ్యాహ్నం ఢిల్లీలోని ప్రసిద్ధి చెందిన జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో వందమందికి పైగా విద్యార్థులు క్యాంపస్‌ అంతటా నిరసన నినాదాలతో కూడిన పోస్టర్లు తయారుచేస్తూ, అంటిస్తూ కనపడ్డారు. సంగతేమిటని అడిగితే ʹʹయూనివర్శిటిలో గోడ రాతల (గ్రాఫిటీ) సంస్కృతిని పరిరక్షించడానికి మేం పోరాడుతున్నాంʹʹ అని ఒక నిరసనకారుడు అన్నాడు. గ్రాఫిటీ కేవలం కళమాత్రమే కాదు, అది ఒక మాధ్యమం కూడా. దానికి రెండు విధాలైన వునికి వుంది. అది భౌతికమైనది, సందర్భోచితమైనది. మనం కేవలం ఆ పోస్టర్లలో వున్న సారాంశాన్ని మాత్రమే చూడడంకాక, దానితోపాటు ఇలాంటి నిరసనకు దారితీసిన ప్రస్తుత పరిస్థితిని కూడా గమనించడం ప్రధానం.

ఈ మధ్య కాలంలో ఆ విశ్వవిద్యాలయ పరిపాలకులు క్యాంపస్‌లో హింసాత్మకమైన అణచివేతను ప్రారంభించారు. వాళ్ళు అనుసరిస్తున్న ఆధిపత్య, నిరంకుశ విధానాలలో విలక్షణమైనది గ్రాఫిటీపై అంక్షలు విధించడం. ʹపరిశుద్ధ జె.ఎన్‌.యు. డైరక్టర్‌ʹ సంతకంతో విడుదలైన ఒక ఆదేశాన్ని జులై 10న విద్యార్థులు అందుకున్నారు. క్యాంపస్‌లోని బహిరంగ స్థలాలను గాని, గోడలను గాని ʹʹవికారంగాʹʹ చేస్తూ, వాటి ʹʹఅందచందాలపై దాడిచేస్తున్నʹʹ ప్రతిదాన్నీ తొలగిస్తామని ఆ ఆదేశంలో పేర్కొన్నారు. తదనంతర దినాలలో క్యాంపస్‌ అంతటా వున్న పోస్టర్లను బలవంతంగా తొలగించడం ప్రారంభించారు. క్యాంపస్‌లో ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి, జె.ఎన్‌.యు.కు వున్న ఒక ప్రత్యేక స్వభావాన్ని మార్చడానికి పాలకులు తీసుకున్న అనేకానేక అణచివేత చర్యలలో గ్రాఫిటీని తొలగించడం సరికొత్తది మాత్రమే. అభ్యుదయకరమైన ప్రవేశ విధానంలో అనుచితంగా జోక్యం చేసుకోవడం, రాత్రి అంతా తెరిచివుంచే క్యాంటీన్‌లను మూయించివేయడం, హస్టళ్ళల్లో కర్ఫ్యూను విధించడానికి ప్రయత్నించడం, హాజరును తప్పనిసరి చేయడం వంటివి ఇంతకాలంగా చేపట్టిన చర్యలు.

గోడ పత్రికలంటే పేదవాళ్ళ భావప్రకటనా సాధనాలు :

జె.ఎన్‌.యు.లో హాస్టళ్ళ గోడలమీదా, తరగతి గదుల భవనాలమీదా, క్యాంటీన్‌లమీదా, లైబ్రరీలమీదా కనపడే రాడికల్‌ స్వభావం కలిగిన పోస్టర్లు, నినాదాలు, బొమ్మలు వైవిధ్యభరితమైనవి. ఇవన్నీ ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థి రాజకీయాల సుదీర్ఘమైన చరిత్రకు చిహ్నాలు. ఆ విశ్వవిద్యాలయంలో పనిచేసే అనేక విద్యార్థి సంఘాలు గోడలపై అంటించే పోస్టర్లు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రజా వుద్యమాలను గురించిన సమాచారాన్ని అందించేవి. అనేక సంవత్సరాలుగా ఆ విశ్వవిద్యాలయంలో జరిగే రాజకీయ, విద్యా సంబంధమైన చర్చలలో అతి ముఖ్యభాగంగా మారిన గ్రాఫిటీ, అధిక ధరలు, తెలంగాణా ఉద్యమం, కాశ్మీర్‌, పాలస్తీనా వంటి సమస్యలు, గతకాలపు పోరాటాల స్మరణ, ఉద్యమాల సంస్కృతివంటి అనేక సమకాలీన సమస్యలకు అద్దం పట్టేవి. అంతేకాకుండా జె.ఎన్‌.యు.లో జరిగిన గత పోరాటాల పురా భాండాగారాలు కూడా అవి.

ప్రతి సంవత్సరం విద్యార్థి యూనియన్‌ ఎన్నికలు జరగడానికి ముందు వేసవి కాలంలో వివిధ సంఘాల విద్యార్థులు, తమ భావజాలానికి అనుగుణంగా వుండే కళారూపాల గురించిన తీవ్రమైన పరిశోధనలో నిమగ్నమై వుండేవాళ్ళు. తదనంతరం పెద్ద ఎత్తున గ్రాఫిటీలను తయారుచేసి గోడలమీద అంటించేవాళ్ళు. గ్రాఫిటీ ఒక కళ. మనం నివసిస్తున్న పరిసరాలకు అనుగుణంగా రూపొందే కళ అది. అది ఆ ప్రాంతంలో జరిగే రాజకీయ కార్యకలాపాలలో వ్యక్తుల చురుకైన పాత్రను రికార్డు చేస్తుంది. అందుచేత సమకాలీన సాంఘిక, రాజకీయ పరిణామాలకు అనుగుణంగా రూపొందిన కొత్త గ్రాఫిటీలతో విశ్వవిద్యాలయపు ప్రాంగణాన్ని అంతటినీ నింపి వేయడం అక్కడ ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం. సహజంగానే అనేక భావజాలాలకు చెందిన విద్యార్థి సంఘాల గ్రాఫిటీలు అక్కడ దర్శనమిస్తాయి. ఒకప్పుడు భావసంఘర్షణ ఆ యూనివర్శిటీలో ఎలా సహజీవనం చేసిందో ఆ గ్రాఫిటీలు సూచిస్తాయి.

విద్యార్థి సంఘం ఆఫీసు పక్కనే వున్న క్యాంటీన్‌ గోడమీద ఎడురడో గాలెనో రచనల నుండి ఉల్లేఖనతో ఒక గ్రాఫిటీ వుంటే, సామ్రాజ్యవాద వ్యతిరేక హీరోలు, వక్రీకరణకు గురైన టిప్పుసుల్తాన్‌ వంటి చారిత్రక వ్యక్తులతో కూడిన గ్రాఫిటీలు మరొకచోట వుంటాయి. లైబ్రరీ గోడమీద మార్క్స్‌, స్టాలిన్‌, లెనిన్‌, మావోల వంటి ప్రపంచవ్యాపిత వామపక్షవాదుల బొమ్మలు దర్శనమిస్తాయి. మరోచోట దేశవ్యాప్తంగా నలుమూలలా జరుగుతున్న వివిధ పోరాటాల- మణిపూర్‌లో సాయుధబలగాల ప్రత్యేక చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కార్యకర్త ఇరోమ్‌ షర్మీలా, పోస్కో చట్టానికి వ్యతిరేకంగా ఒరిస్సాలో జరుగుతున్న పోరాటం, ఆదివాసీ నాయకురాలు సోనీసోరీ- చరిత్ర మరొకచోట రికార్డు అవుతుంది. అంతేకాక గ్రాంస్కీ, చె గువేరా, కెప్టన్‌ లక్ష్మి, రోజా లగ్జెంబర్గ్‌లతో పాటు బాబ్‌ మార్లే, మొహమ్మద్‌ ఆలీలు కూడా దర్శనమిస్తారు.

ఇటీవల యూనివర్శిటీ అధికారులు జారీ చేసిన ఆదేశంలో ఇలాంటి సంస్కృతిమీద దాడి ప్రారంభమయింది. అంతా ఏకపక్ష కథనం. విశ్వవిద్యాలయం ఆవరణను ʹʹస్వచ్ఛ ఆవరణగాʹʹ మార్చాలని నిరంకుశ అధికారులు చెప్తున్న కారణం కేవలం సాకు మాత్రమే. దాన్ని విద్యార్ది సమూహం మీద వాళ్ళు బలవంతంగా రుద్దుతున్నారు. ఒకప్పుడు రాజకీయీకరణకు ప్రసిద్ధి పొందిన ఈ విశ్వవిద్యాలయంలో ఇప్పుడు విద్యార్థులపై నిఘా, నిరసనల గొంతు నులిమివేయడం, విద్యార్థుల రాజకీయ వ్యక్తీకరణ హక్కుమీద నియంత్రణ విధించడం వంటి చరిత్ర ప్రారంభమయింది. యూనివర్శిటీలో గ్రాఫిటీని ధ్వంసం చేయడమనేది, క్యాంపస్‌లో రాజకీయ వ్యక్తీకరణకు వున్న అన్ని జాగాలను మూసివేయడానికి పాలకులు చేస్తున్న అనేక ప్రయత్నాలలో ఒకటనీ, ʹʹపరిశుభ్రతʹʹ అనేది వాళ్ళ అసలు ఉద్దేశాలను దాచిపెట్టే ముసుగు మాత్రమేననీ విద్యార్థి సంఘ సభ్యులు క్రితి రాయ్‌ అన్నారు.

గ్రాఫిటీలు ఎందుకు?

ఒక ప్రసారమాధ్యమ స్వభావానికి వుండే ప్రాధాన్యత గురించి వివరిస్తూ ʹ60లలో రాసిన తన గ్రంథంలో కెనడాకు చెందిన తత్వవేత్త మార్షల్‌ మెక్‌ లుహాన్‌, ʹʹమాధ్యమమే సందేశంʹʹ అని వాదించారు. యూనివర్శిటీ పాలకులను ఒకటి రెండు పోస్టర్లు ఎలా ఇరుకున పెడతాయి? నగరాలలో కనపడే సాంస్కృతిక రూపమైన గ్రాఫిటీ, విలక్షణమైన రూపాలను వుపయోగించుకుంటుంది: ప్రతిరోజూ మనకి కనపడే గోడలవంటి వస్తువులకు వుండే ప్రాథమిక ఉపయోగాన్ని మించి, అది కళాకారుడి ఉద్దేశాలని మనకు తెలియచెప్పేదిగా తయారవుతుంది. ఈ కారణంగానే రోజూ మనం చూసే ఈ కళారూపమే కల్లోలాన్ని సృష్టించేదిగా పాలకులకు అర్థం అవుతుంది. ఏకపక్ష కథనాలను, ఆధిపత్య దృక్పథాలను సవాల్‌ చేస్తూ, బహిరంగ ప్రదేశాలను ఎలా, ఎందుకు ఉపయోగించుకోవాలో ఈ కళారూపం తెలియచేయడమే ఇందుకు కారణం. అంతేకాకుండా, విద్యార్థుల రాజకీయ వ్యక్తీకరణను నిషేధిస్తూ పాలకులు ఆదేశాల్ని జారీచేయడం, గోడలపై వున్న రాతలన్నింటిని చెడిపివేయడాన్ని చూస్తే యూనివర్శిటీ క్యాంపస్‌లోని బహిరంగ ప్రదేశాలైన గోడలపై యాజమాన్యం ఎవరిదనే ఆశ్చర్యంకూడా మనకి కలుగుతుంది. విశ్వవిద్యాలయ ఆవరణలో వుండే విద్యార్థి సంఘాల భావజాలల పొందికను, ఆయా ప్రదేశాలపై హక్కులకోసం వారి మధ్య పోటీనీ, వివిధ రకాలైన గ్రాఫిటీలు సూచిస్తూవుంటే, పాలకుల ఆదేశాలు, విద్యార్థుల వివిధ రకాల వ్యక్తీకరణలను నిషేధించడం ద్వారా వాళ్ళ భావాలపై ఆధిపత్యాన్ని నెరపడం, వాళ్ళ గొంతులు నొక్కేయడంగా మనకు అర్థం అవుతుంది. మన చుట్టూవుండే ప్రపంచాన్ని ప్రత్యామ్నాయ కోణాలనుండి అర్థంచేసుకునే అవకాశాన్ని తద్వారా వమ్ము చేయడమే ఆ ఆదేశాల లక్ష్యం.

సామాజిక శాస్త్రవేత్త హెన్రీ లెపెబ్రే ʹʹనగరాలపై హక్కుʹʹ అనే తన విపులమైన అధ్యయనంలో నగరాలపై యాజమాన్యాలకు సంబంధించిన దృక్పథం గురించి పరిశోధించారు. ఆయన ఉద్దేశంలో జాగా అంటే కేవలం ఒక ఖాళీ మాత్రమే కాదు. పోటీపడుతున్న భావాలు, ఆచరణలు అనేకరకాలైన అర్థాలను సూచించడానికి ఉపయోగపడే నిర్మాణయుతమైన, సామాజికమైన ప్రదేశంగా దాన్ని గుర్తించారాయన. అందుచేతనే జాగాపై యాజమాన్యం గురించి ఘర్షణలు తలెత్తుతాయి. తరచుగా అధికారంలో వున్నవారికే ఆధిపత్యం లభిస్తుంది. ʹʹనిరంతరంʹʹ, ʹʹఅందరికీ తెలిసినʹʹ తమ కోర్కెల గురించి నిత్యం తమ వాణిని గ్రాఫిటీలతో వినిపించడం ద్వారా ఆయా ప్రాంతాల వాళ్ళు తాము ఆక్రమించిన జాగాపై తమ హక్కును పునరుద్ఘాటిస్తారు.

సమాజాన్ని వివిధ రకాలుగా దర్శించడానికి గ్రాఫిటీకున్న ఈ శక్తి కారణంగానే నియంతలు, ఏకపక్ష కథనాలు అల్లేవారు వాటిని ద్వేషిస్తారు. ఈ విషయంలో జె.ఎన్‌.యు. ఏకాకి కాదు. గ్రాఫిటీ దానంతట అదే ఒక మాధ్యమం. అక్కడ భావాల ఘర్షణ వుంటుంది. చాలా కాలంగా శాంతికి, ప్రతిఘటనకు చిహ్నంగా నిలిచిన ప్రాగ్‌లోని లెన్నన్‌ గోడలపై వున్న ʹʹఅనధికార కళారూపాల్నిʹʹ త్వరలోనే నిషేధించి, దానిపై రంగులు పూస్తారు. ʹʹవాతావరణంలో వస్తున్న మార్పుల్ని అత్యవసర స్థితిగా ప్రకటించాలిʹʹ అని పిలుపునిస్తూ ఇంగ్లాండ్‌లోని కెండాల్‌ బ్రిడ్జ్‌పై వున్న, విస్తృతంగా చర్చించబడుతున్న గ్రాఫిటీని త్వరలోనే తొలగిస్తారు. మరోపక్క సూడాన్‌లో ఈ మధ్యకాలంలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల మధ్య ఒకరిద్దరు కళాకారులు, వాళ్ళు రూపొందించిన గ్రాఫిటీలు దేశంలోని నాలుగుమూలలా దర్శనిమిస్తున్నాయి. గాజాలో జరిగిన మొదటి తిరుగుబాటులో (1987-93), హక్కులు కోల్పోయిన పాలస్తీనీయులకు ఎలాంటి ప్రత్యామ్నాయ మాధ్యమాలు లేని స్థితిలో సమాచారాన్ని అందించడానికి ఏకైక మాధ్యమంగా గ్రాఫిటీ వుపయోగపడింది.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో సాధారణ ప్రజలు తమ తిరుగుబాటు భావాల్ని వ్యక్తీకరించే కళారూపంగా గ్రాఫిటీ వర్థిల్లుతోంది. జె.ఎన్‌.యు.లో తమ క్యాంపస్‌లోని గ్రాఫిటీని కాపాడుకోవడానికి విద్యార్థులు జరుపుతున్న పోరాటం కూడా ఈ వాస్తవానికి సాక్ష్యం. ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఒక విద్యార్థి కార్యకర్త చేతుల్లో వున్న ఒక పోస్టర్‌పై, ʹʹకళలంటే ఫాసిజానికి భయంʹʹ అనే నినాదం వున్నది. ఈ రోజుల్లో క్యాంపస్‌ అంతటా ఈ నినాదం ప్రతిధ్వనిస్తోంది. మనం నివసిస్తున్న వర్తమాన స్థితిని ఆ నినాదం మనకు గుర్తు చేస్తోంది.

(గ్రాఫిటీ అంటే నగరాలలో ఖాళీగా వుండే గోడలపైన రాసే నినాదాలు, చిత్రించే కార్టూన్లు, బొమ్మలు, అంటించే పోస్టర్లు. సమాజంలోని అణగారిన వర్గాలకు, సామాజిక బృందాలకు చెందినవాళ్ళు తమ భావాల్ని, డిమాండ్లను వ్యక్తంచేసే నిరసన రూపం అది. అందుకే గ్రాఫిటీని పేదల వ్యక్తీకరణ సాధనం అని అంటారు. ప్రధాన స్రవంతికి చెందిన మీడియా చాలా సందర్భాలలో వాస్తవాల్ని సంపన్న వర్గాల, ఆధిపత్యాల వర్గాల దృష్టిలో నుండే సమాజానికి చూపిస్తుంది. అవన్నీ ఏకపక్ష కథనాలుగా వుంటాయి. పేదలని, వుద్యమకారుల్ని అవాంఛనీయమైన వ్యక్తులుగా చిత్రీకరించే స్వభావం ఆ రాతల్లో వుంటుంది. ఇలాంటి ఏకపక్ష కథనాలకు ప్రత్యామ్నాయంగా తమ స్వంత గొంతులను సమాజానికి వినిపించడానికి పేదల చేతుల్లో ఆయుధం గ్రాఫిటీ. గ్రాఫిటీ దానంతట అది ఒక గొప్ప కళాత్మక వ్యక్తీకరణ. దానికి శతాబ్దాల చరిత్రకూడా వుంది. సమకాలీన సమాజాన్ని, ఆ సమాజంలోని వైరుధ్యాల్ని, వైవిధ్యాన్ని ప్రజల చింతనని అర్థం చేసుకోవడానికి ఏ నగరంలోనైనా గ్రాఫిటీలు వుపకరిస్తాయి. అవి కేవలం కళాత్మకమైనవే కాక, చరిత్రను కూడా రికార్డు చేస్తాయి. ప్రజల్ని సమీకరిస్తాయి. పోరాటాల్ని విస్తృతపరుస్తాయి. ఒక సమాజం సజీవంగా, గతిశీలంగా వున్నదనడానికి గ్రాఫిటీలు ఒక ప్రబల సాక్ష్యం. అలాంటి గ్రాఫిటీలంటే, అవి చైతన్యవాహికలు కాబట్టి, ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణలు కాబట్టి, చైతన్యాన్ని భౌతికశక్తిగా మార్చే అవకాశం వాటికి వుందికాబట్టి, నియంతలైన పాలకులకు కన్నెర్ర. అందుకే అనేక సందర్భాలలో ప్రపంచ చరిత్రలో నిరంకుశ ప్రభువులు గ్రాఫిటీలను నిషేధించారు. గోడలమీద నినాదాలు రాయడాన్ని నేరపూరిత చర్యలుగా ప్రకటించారు. వాటి ఆధారంగా కుట్రకేసులు బనాయించారు. వర్తమానంలో మనదేశంలో ఆధిపత్యంలో వున్న భా.జ.పా. ప్రభుత్వం కూడా తన ఫాసిస్టు అమ్ముల పొదిలో నుండి మరో బాణాన్ని ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిమీద ఎక్కుపెట్టింది. అందులో భాగంగానే ప్రగతిశీలమైన, నిత్యకార్యాచరణతో తొణికిసలాడే జె.ఎన్‌.యు. ఆవరణలో గ్రాఫిటీలపై విరుచుకుపడింది. దీనికి వ్యతిరేకంగా అక్కడ విద్యార్థులు జరుపుతున్న పోరాటానికి మనం సంఘీభావం ప్రదర్శిద్దాం)

(ఇండియన్‌ కల్చరల్‌ ఫోరం సౌజన్యంతో)

అనువాదం : సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌


No. of visitors : 284
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ʹకాకుల్ని కొట్టి గద్దలకు వేయటమేʹ నోట్ల రద్దు

సి.ఎస్‌.ఆర్ ప్ర‌సాద్‌ | 07.12.2016 10:19:08am

జాతీయవాద ముసుగులో సామ్రాజ్యవాద పెట్టుబడులకు సేవ చేస్తున్న నరేంద్ర మోది పెద్ద నోట్ల రద్దు ప్రకటన ద్వారా మరో సారి తన ʹ ప్రభు భక్తిని ʹ చాటుకున్నాడు . సాధారణ ప...
...ఇంకా చదవండి

అమ్మభాషలో చదువుకోవడం ప్రజాస్వామిక హక్కు

సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌ | 04.03.2017 08:44:40am

భాష ఒక జాతికి చెందిన ప్రజల అస్తిత్వానికి గీటురాయి. ప్రతిభాషా సమాజానికి తనదైన గొప్ప వారసత్వ సంపద సాహిత్య రూపంలోనూ, సంస్కృతి రూపంలోనూ వుంటుంది. అయితే ఆ సమాజంల...
...ఇంకా చదవండి

గొట్టిపాడు దళితులపై పడగ విప్పిన అగ్రకుల సర్పం

సి.ఎస్‌.ఆర్ ప్ర‌సాద్‌ | 20.02.2018 12:09:16am

ఒకవైపు దళితులపై యింతటి అనాగరికమైన దాడులకు వత్తాసు పలుకుతున్న తెలుగుదేశం, జనవరి 26న దళిత తేజం పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించటం సిగ్గుచేటు.....
...ఇంకా చదవండి

అంబేద్కర్‌ ఆర్టికల్‌ 370ను వ్యతిరేకించారా?

- రామ్‌ పునియాని | 16.09.2019 03:14:12pm

ʹకాశ్మీర్‌ ప్రాతినిధ్యానికి సంబంధించి ఎలాంటి చట్టం చేయడానికి పార్లమెంటుకు అధికారం లేదుʹʹ ఈ విషయంలో జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వానికే అధికారం వుందని కూడా ఆయన .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  ఒక చిన్న అమ్మాయి రాసిన మంచి కథ " భూమి "
  నేను జీవితాన్ని అమితంగా ప్రేమిస్తాను
  సముద్రం ఇంకా బతికేవుంది
  డెన్ ఆఫ్ లైఫ్
  వాళ్ళు
  ప్రజా కళాకారుడా
  వసంతమేఘగర్జన - కార్మికోద్యమాలు
  తెలుగు రాష్ట్రాల వ్యవసాయరంగం - 50 ఏళ్ళ విప్లవోద్యమం
  సీమకవి వినూత్ననిరసన ʹʹలైఫ్‌హాలిడేʹʹ

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •