మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

| సాహిత్యం | క‌థ‌లు

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

- పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

ప్రపంచంలో అత్యంత సౌందర్యవంతమైన, అత్యంత విలువైన, అత్యంత గొప్ప వ్యక్తి ఎవరు అని ప్రశ్నిస్తే స్థల కాలాలకు అతీతంగా చెప్పగలిగే సమాధానం ఒకటే! తల్లి మాత్రమే ఎవరి జీవితంలో అయినా గొప్ప వ్యక్తి కాగలుగుతుంది. నవమాసాలే కాదు తల్లులు బిడ్డల్ని జీవితాంతం మోస్తూనే వుంటారు. బిడ్డకు రక్తమాంసాలతో పాటు భాషను, ఆలోచన శక్తిని ,భావవ్యక్తీకరణ శక్తిని ,వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని ,హృదయ వైశాల్యాన్ని నేర్పించగలిగేది తల్లి మాత్రమే. అలాంటి తల్లుల గురించి తెలుగు సాహిత్యంలో చాలా మంచి కథలు వచ్చాయి.

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేరుకున్న దశలో కొడుకులు గతంలో తామ తమ కన్నతల్లిని ఎంత బాధ పెట్టారో, తమ వల్ల తమ తల్లులు ఎన్నెన్ని బాధలు పడ్డారు, ఆ బిడ్డలు ఆ వయసులో పునరాలోచించుకోవాలని అనుకోవటం , మనసులోనే వాళ్ల వాళ్ల తల్లులకు ముసలి వాళ్ళయిన కొడుకులు క్షమాపణలు చెప్పుకోవడం, ఇలా కాకుండా ఉండి ఉంటే, తమ తల్లిని బాగా చూసుకొని ఉంటే ఎలా ఉండేది? అనే ఆలోచన వాళ్లలో కలగటం, వాళ్ళు పశ్చాత్తాప పడటం ఇవన్నీ జి. ఉమామహేశ్వర్ రాసిన ʹచందమామ రావేʹ కథలోని అంశాలు.

కథలో మనల్ని కలవరపెట్టే అంశాలు ఒక పాత్రకో, రెండు పాత్రలకో పరిమితం చేయకుండా ఈ కథాంశాన్ని అనేక పాత్రల ద్వారా విస్తృత పరచి వివిధ వర్గాలకు చెందిన బిడ్డలు వారి ఆర్థిక స్థితిగతులు ఏవైనప్పటికీ ,వేరే అయినప్పటికీ తమ తల్లులు పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా స్వార్థంగా ప్రవర్తించారో తెలియ చెప్పిన కథ ఇది. ఆర్ధిక స్థితిగతులు మారే కొద్దీ ముసలివాళ్ళయిన స్త్రీల పట్ల కుటుంబ సభ్యుల ప్రవర్తన ఎట్లా మారిపోతుందో ఈ కథలో గమనించవచ్చు. నిస్వార్థంగా తల్లి తన బిడ్డలకు, వాళ్ళ బిడ్డలకు అందచేసిన సేవలన్నిటిని ఆ కుటుంభ సభ్యులు ఏవిధంగా విస్మరిస్తారో, ఆమె నిరంతర నిస్వార్థ అమూల్యమైన సేవలు అనంతర కాలంలో ఏవిధంగా నిష్ప్రయోజనమవుతాయో, ఆమెకు ఆమె సేవలకు, ఆమె చేసిన శ్రమకు కనీస గుర్తింపు లేకుండా పోవడం ఇదంతా మానవసంభందాల విధ్వంసానికి ఒక చిత్రిక మాత్రమే.

ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతిలో 2017 మే 14 లో మొదట అచ్చు అయింది. అనంతరం పాలపిట్ట బుక్స్ ప్రచురించి జి. ఉమామహేశ్వర్ రెండవ కథాసంపుటి ʹ భరోసా ʹ లో (డిసెంబర్ 2018 )రెండవసారి ప్రచురణ అయింది. తల్లి మనస్తత్వాన్ని గురించి తల్లి వ్యక్తిత్వాన్ని గురించి ,తల్లి నిస్వార్థ ఆలోచనల గురించి ఒకవైపు, అంత గొప్ప తల్లిని పట్టించుకోలేని, పట్టించుకోని అసమర్థ కొడుకుల చేతగానితనం మరొకవైపు చూపించిన కథ ఇది. ఏకకాలంలో అటు తల్లి వ్యక్తిత్వాన్ని ఇటుబిడ్డల స్వార్థాన్ని , చేతగానితనాన్ని, రాజీతత్వాన్ని చూపించడం ఈ కథలోని విశేషం. మానవ సంబంధాల విధ్వంసాన్నిఒక వైపు చేపుతూనే, అదే మానవ సంభందాల ఉన్నతీకరణ ఎంత అవసరమో చెప్పిన కథ ʹ చందమామ రావే ʹ.

ఆకాశంలో చందమామను చూపిస్తూ తల్లి తన బిడ్డకు అన్నం తినిపించడంతో ఈ కథ మొదలవుతుంది.
ʹ అంత పెద్ద ఆకాశంలో చందమామ ఒక్కడికే భయమేయ్యదా ? ʹ అని అమాయకంగా ప్రశ్నిస్తాడు ఒక చిన్న బిడ్డ.
ʹ ఉహూ, చంద్రుడికేం భయముండదు ʹ అంటుంది తల్లి .
ʹ ఎందుకుoడదు ? అక్కడ వాళ్ళ అమ్మ లేదు కదా ? ʹ అని తిరిగి ప్రశ్నిస్తాడు ఆ బిడ్డ.
ʹ ఎందుకు లేదు, ఒక్క అమ్మ కాదు, చూడు... అక్కడ మెరుస్తున్న నక్షత్రాలున్నాయే, అవన్నీ అమ్మలే- ఇంకేం భయం? ʹ అని సమాధానం చెబుతుంది తల్లి.

ఆకాశాన్ని చూపించి బిడ్డకు అన్నం తినిపించే మానవ ప్రస్థానంలోని తొలిదశతో ఈ కథ ప్రారంభమవుతుంది. అనేక తల్లుల గురించి అనేక తల్లుల అనేక కష్టాల గురించి, మానసిక వ్యధల గురిoచి, అనేక తల్లుల త్యాగాన్ని గురించి అనేక తల్లుల నిస్వార్థ శ్రమ గురించి, అనేక తల్లుల వ్యక్తిత్వాన్ని గురించి కథకుడు మెల్ల మెల్లగా చెప్పుకుంటూ వస్తాడు. అదే సమయంలో కన్నతల్లుల పట్ల నిర్దయగా వ్యవహరించే బిడ్డల చేతకానితనాన్ని కూడా ప్రశ్నిస్తాడు.

ఈ కథలో కథకుడు సున్నితంగా , పరోక్షంగా లేవనెత్తిన ప్రశ్నలు, మనిషి లోని స్వార్థాన్ని, చేతకానితనాన్ని ప్రశ్నించిన విధానం, లోతైన వ్యంగ్యం , పునరాలోచనలకు , మానవ సంబంధాల పునః నిర్మాణానికి చేసిన సూచనలను పాఠకుడు అర్థం చేసుకోకపోతే ఇదొక సాధారణ కథగా భ్రమించే అవకాశం వుంది. తనచుట్టూ జరుగుతున్న అనేక సంఘటనలను , తనకు సుపరిచితమైన మనుషుల్ని ఈ కథలో పాఠకుడు చప్పున గుర్తిస్తాడు. అయితే రచయిత లేవనెత్తిన ప్రశ్నల్ని , స్పష్టంగా చూపించిన ఆర్ధిక సంభందాల లోగుట్టుల్ని , అంతరంగాల విశ్లేషనల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడే పాఠకుడికి కథా లక్ష్యం లేదా కథకుడి ఉద్దేశ్యం అర్థం అవుతుంది.
ʹ కొడుకులందరూ దొంగ నా కొడుకులు ʹ చివరి మాట చెపుతున్నట్టు చెప్పాడు గోపాల్ రావు .
ʹ అవును గోపాలం, కొడుకులందరూ దొంగ నా కొడుకులే, నాతో సహా ʹ రుద్ధ కంఠంతో గొణిగాడు రమణ. ఇదీ కథ ముగింపు. ఇద్దరు స్నేహితులు వాళ్ళ వాళ్ళ తల్లులకు వాళ్ళు చేసిన అన్యాయాన్ని తలుచుకుంటారు. తాము తల్లులకు చేయలేక పోయిన న్యాయం అప్పుడు వాళ్లకు తెలిసి వస్తుంది. తల్లుల ఆత్మాభిమానాల్ని, ఆత్మా గౌరవాన్ని కాపాడుకోలేక పోయిన వాళ్ళ వైఫల్యం గురించిన ప్రశ్నల్ని కథకుడు నేర్పుగా అడుగుతాడు.

ఈ కథ ముగింపు ఇలా ఉంటుంది.
మాటలు చెబుతూ చెబుతూ అమ్మ అన్నమంతా తినిపించేసింది.
చూస్తూ చూస్తుండగానే ఓ నాలుగు నక్షత్రాలు ఆకాశం నుండి నేలకు రాలాయి.
ఇంకా వేలాది, లక్షలాది నక్షత్రాలు ఆకాశంలోనే తమ వంతు కోసం నిరీక్షిస్తున్నాయి.

ఈ కథ ఎప్పటికి ముగియదు కదా, కొనసాగుతుంది. రచయిత లేవనెత్తిన ప్రశ్నలు పైకి సాధారణంగా అనిపించవచ్చు , కానీ, అవి మానవ మనస్తత్వానికి, మానవ సంస్కారానికి, మానవ సంబందాలకు సంబందించిన లోతైన ప్రశ్నలు. బిడ్డలు తప్పనిసరిగా తల్లులకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు.

బహుశా అనేక మాతృమూర్తుల వేదనా భరిత అనుభవాలు ఎన్నో కలవరపరచి , వారి బాధ అంతా రచయిత మనసులో చేరి అతను ఎంతగానో మదనపడి ఉంటే తప్ప ఈ కథ ఇట్లా వచ్చే అవకాశం లేదు. చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి సమాజంలోని దురాగతాలను చూసి తల్లికి జరుగుతున్న అన్యాయాల్ని చూసి కేవలం చూసిన అనుభవాలతో మాత్రమే ఈ కథ రాసినట్లు అనిపించదు.వార్తాంశం కథ కావడం లేదిక్కడ. వాస్తవమే కథ అవుతోంది. కేవలం మనుషుల ప్రవర్తనను ఆర్ధిక అంశాలు ఎంతగా ప్రభావితం చేస్తాయో, పరుగుల ప్రవాహంలో సమాజంలో విలువ , మర్యాద పొందటానికి మధ్యతరగతి మనుషులు పడే తాపత్రయమంతా ఏమిటో ఈ కథలో కనిపిస్తుంది. ఈ కథలో పాఠకుడు లీనమవుతాడు అడుగడుగునా తనను తానూ , తన చుట్టూ వున్న వాళ్ళను పరిశీలించుకుంటాడు. తనని తన తల్లిని ఈ కథలో తడిమి చూసుకుంటాడు. ఏ తల్లయినా తన బిడ్డల క్షేమం కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటుంది. వాళ్ల ఆలనా పాలన కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకుంటుంది. బిడ్డ సుఖం కోసం బిడ్డ సుఖం గా ఉండడం కోసం కన్నతల్లి ఆకలిని దాచుకుంటుంది, బిడ్డ గౌరవం కోసం తన గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడుతుంది. బిడ్డలో తల్లి తనను చూసుకుంటుంది కానీ ఆ తల్లిని ప్రేమగా, గౌరవంగా చూసుకునే బిడ్డలు ఎందరు ?

ఇక్కడ బిడ్డకు తల్లి ప్రతి దశలోనూ ముఖ్యంగా అనిపించకపోవచ్చు. తల్లి, తల్లి ఆత్మాభిమానం, తల్లి ఆరోగ్యం, తల్లి మానసిక ఆనందం కొందరు కొడుకులకు ముఖ్యం కాకపోవచ్చు. అయినా తల్లి లక్ష్యం మాత్రం బిడ్డలే! బిడ్డల ప్రశాంతతే! తనకంటే తన ఆరోగ్యం కంటే తన వ్యక్తిత్వం కంటే తన ఆత్మ అభిమానం కంటే తన ఆత్మ గౌరవం కంటే తన ఆకలి కంటే తన కష్టం కంటే తన ఆరోగ్యం కంటే ,అన్నిటికంటే బిడ్డ సుఖమే ఎక్కువ, ముఖ్యం అనుకుంటుంది తల్లి. అలాంటి ఎందరో తల్లుల గురించి రాసిన ఈ కథ అలాంటి బిడ్డలకు ఒక కనువిప్పు.

ఈ కథలో నేలకు రాలటానికి ఆకాశంలో తమ వంతు కోసం నక్షత్రాలు నిరీక్షిస్తున్నాయి అనడాన్ని చాలామంది తల్లులు వాళ్ళ మరణం కోసం ఎదురు చూస్తున్నారేమో అని సాధారణ పాఠకుడు అపోహ పడాల్సిన అవసరం లేదు .
ఇక్కడ రచయిత అమ్మ ఉంటే చంద్రుడికి సైతం భయం ఉండదు అని పసిబిడ్డకు చెప్పటంలో కన్నతల్లి ఆదరణ బిడ్డకు రక్షణగా ఉంటుందని తన కథనంలో చెప్పుకొస్తాడు.అందుకే తన తప్పు తెలుసుకున్న కొడుకు తను ఆదరించ లేకపోయిన కన్నతల్లిని క్షమించమని అడగడానికి సైతం ఒక జీవితకాలం లేట్ అయింది అని అనుకుంటాడు. అదే మాట అంటాడు ఏకాంతంలో ధ్యానంలో మనిషికి , తన మనస్సాక్షికి కనపడేది దేవుడు కాదు, కన్నతల్లి మాత్రమే.
****

తన చివరి రోజుల్లో రామలక్ష్మమ్మకు కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎనభై ఏళ్ల వయసులో చేతకాని పరిస్థితిలో ఇంట్లో అందరూ అనే చీదరపు మాటల్ని భరించలేక బలవంతంగా మలవిసర్జన ఆపుకోవడం వల్ల కడుపులో తీవ్ర ఒత్తిడి పెరిగి కండరాలు ఉబ్బడం వల్ల చనిపోతుంది . ఎందరు బిడ్డలు ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా, ఆస్తిపాస్తులు ఉన్నా, కనీసం ముసలి వయసులో కన్నతల్లి సౌకర్యం కోసం ఒక మరుగుదొడ్డిని కట్టించలేకపోయిన అసమర్థత ఆ కుటుంబీకులది.
నడుము నొప్పి కారణంగా ఆ కన్నతల్లి ఐదుగురు కొడుకులున్న ఆ తల్లి కనీసం మరుగుదొడ్డికి నోచుకోలేక చనిపోతుంది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. తండ్రి తద్దినానికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక లెట్రిన్ కట్టించండి రా అని అభ్యర్ధిస్తే అందరూ యధాలాపంగా ఎవరి పరిధిలో వారు ఆ.. అవును కట్టించాలని నొక్కులు నొక్కారు తప్ప ఒక మరుగుదొడ్డిని కట్టించలేక పోతారు. ఇది సాధారణ విషయమో , విషాదమో కాదు.

ఆమె కొడుకు శంకర్రావు ధ్యానం చేస్తుంటే , జ్ఞానబోధ తర్వాత అర్థమవుతుంది .ఇష్టంగా కొన్న డూప్లెక్స్ ఇంటిలో ఫస్ట్ ఫ్లోర్ లో వాడకుండా బూజు పట్టి పోయిన రెండు లెట్రిన్లు వెక్కిరిస్తూ మనోఫలకం మీద మెదిలాయి -అంటాడు రచయిత.

మాట పడిపోయి మాట రావడం కోసం ఆపరేషన్ నిమిత్తం ఆసుపత్రిలో వున్నప్పుడు అనస్తీషియా తర్వాత
వృద్ధాప్యదశలో వెంకటరెడ్డికి తన తల్లి గుర్తొస్తుంది. తల్లి తో మాట్లాడాలి అనుకుంటాడు. అప్పటివరకు మాట్లాడని వాడు కొన్ని సంవత్సరాల పాటు తల్లి తో మాట్లాడకుండా నిర్దాక్షిణ్యంగా గా ఉన్నటువంటి ఆ కొడుకు ఆపరేషన్ థియేటర్లో తన తప్పు తెలుసుకుంటాడు. అహంకారం మాట్లాడని కారణంగా తల్లితో మాటలు లేకపోవటాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. క్షమించు తప్పు అయింది ఎలా ఉన్నావు ఎలా ఉన్నావ్ అమ్మా అని మాట్లాడేస్తాడు. ఈ లోకంలో లేని వాళ్ళ అమ్మను ఆ దశలో తలుచుకుని తన క్షమాపణలు చెబుతాడు వెంకటరెడ్డి.

డెబ్బయ్యేల్ల మోహన్రావుకి జ్ఞాపకాలు ఉండవు. అల్జీమర్స్ అయినా ఒక తల్లి జ్ఞాపకం మాత్రం ఇంకా పచ్చగానే ఉంటుంది. తన ఇంట్లో ఉన్న తల్లి కోడలు నిరాదరణ కారణంగా తన ఊరికి వెళ్లి పోవాలని అనుకుంటుంది . కొడుకు ఏం చెప్పకపోయినా రాత్రి గొడవ తర్వాత, ఉదయం లేచేసరికి బుట్ట సర్దుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉంది ఆ తల్లి. ఎక్కడికమ్మా నీరసంగా బలహీనంగా తల్లిని అడిగాడు కొడుకు .
ʹ చిన్నోడు గుర్తుకొస్తున్నాడ్రా , రాత్రి కూడా మన శివాలయం పూజారి కలలో గుర్తుచేశాడు. డిసెంబరు వచ్చింది కదా, నగర సంకీర్తనలు అవి ఉంటాయి కదాʹ .
తనకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మానసికంగా తల్లి ఎంతగా కోడలి ప్రవర్తన వల్ల నలిగిపోతూ కూడా తన వాళ్ళ బిడ్డ పది మందిలో మాట పడకూడదని, భార్య ముందు మరింత పలుచన కాకూడదనే పెద్దరికంతో తన పరువు కాపాడే ప్రయత్నం చేస్తోంది.
అంతే కానీ, ʹ నాకు అక్కడ ఆరోగ్యం బాగాలేక నయo చేయించుకునేందుకు ఇక్కడికి వచ్చాను రా ఇక్కడే ఉంటానుʹ అని అనదు. ʹ నా కొడుకు ఇంట్లో నాకు అధికారం లేదా? ʹ అని దబాయిoచట్లేదు.ʹ ʹ నీ భార్య నా మీద ఇన్ని ఆరోపణలు చేస్తుందా ?ʹ అని నిలదీయట్లేదు . ʹ పిల్లల జోలికి వెళ్లకుండా నా పాటికి నేనుంటాను లే ʹ అని అభ్యర్థించదు.
అప్పటి నుండి రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు. పిల్లల పరీక్షల హడావుడి ఆ సెట్స్, ఈ సెట్స్ అన్నీ అయిపోయాక సెలవుల్లో ఊరెళ్ళి అమ్మను పిలుచుకొని వద్దామనుకున్నాడు. -ఇప్పుడు సెలవులిచ్చారని టీవీలో చెప్పారు. త్వరగా వూరేల్లాలి. లేచాడు. లేచి సూట్కేసు తీసుకుని గడప దాటి చెప్పులేసుకొంటున్నాడు. భార్య వస్తుంది.ʹ ఇప్పుడు ఎక్కడికి వెళ్లే పనిలేదు బట్టలు మార్చుకోండి. మీ రిజర్వేషన్ రేపు ఈరోజు కాదుʹ అంటుంది.

వృద్ధాప్య దశలో మతిమరుపుకు గురైన కొడుకు తన చేతగానితనం వల్ల తన తల్లికి జరిగిన అన్యాయాన్ని గుర్తుకు తెచ్చుకునే క్రమంలో అనుకుంటాడు. ʹ ఓహో!రేపా ? ఓ.కే. ఓ.కే. రేపు తప్పకుండా గుర్తుచేయి. నాకు గుర్తు ఉంటుంది కానీ మళ్ళీ మర్చిపోతానేమోనని చెబుతున్నాను. అసలే ఈ మధ్య పనుల వత్తిడిలో మతిమరుపు వచ్చేస్తోంది.ఊరెళ్ళి అమ్మను తీసుకొని రావాలిʹ పనమ్మాయికి చెప్పాడు మోహన్రావు.

భార్య తల్లి అంత్యక్రియలకు రాని కొడుకును గురించి తలుసుకుంటూʹ కొడుకులందరూ దొంగ నాకొడుకులుʹ అంటాడు గోపాలరావు. పదిరోజుల క్రితం భార్యని పోగొట్టుకున్న అతడికి తోడుగా వస్తాడు వెంకటరమణ . నలభై ఏళ్ల స్నేహం సాక్షిగా ఒంటరి స్నేహితుని ఓదార్చేందుకు కొన్ని రోజులుగా అతడితోనే ఉంటున్న వెంకటరమణ ఆ దుఃఖంలో ఆవేదనలో తను కూడా పాలుపంచుకుంటాడు. తన కొడుకును గోపాలరావు తిడుతుంటే ఆ తిట్లన్నీ తనకి తగులు తున్నట్లు భావిస్తాడు వెంకటరమణ. చనిపోయిన గోపాల్ రావు భార్య తాలూకు ఫోటోలో ఇంకేదో రూపం గోచరిస్తుంది వెంకటరమణకు. ఎవరిదో కాదు అతని తల్లి . ఇతను ఆఫీసర్ అయితే అవుతాడు కానీ ఆ తల్లి తన అటెండరు ఉద్యోగాన్ని వదలక చివరి వరకూ తన కాళ్ళపైన తానే నిలబడుతుంది. ఐదు నెలల గర్భవతి గా ఉన్నప్పుడు భర్త చనిపోతే ప్రసవం వైపు కొందరు, గర్భస్రావం వైపు కొందరు సలహా ఇస్తుంటే బిడ్డను కని బ్రతుకు ఈడుస్తానని ప్రతిన బూని సుశీలమ్మ చివరికి ఆ కొడుకు, కోడల్ల నిర్లక్ష్యానికి మనసు దెబ్బతిని దూరంగా వెళ్లి పోతుంది.

ఎవరెన్ని చెప్పినా, తామే స్వయంగా బిడ్డలు ఆ తప్పులు తెలుసుకున్నా, తల్లులు ఎప్పుడూ బిడ్డలని శిక్షించరు. ఆ తప్పులను మన్నిస్తూనే ఉంటారు. వాళ్లకు క్షమించడం తెలుసు గాని క్షమించి ఆదరించడం తెలుసు కానీ అక్కున చేర్చుకోవడం తెలుసుగానీ , శిక్షించడం తల్లులకు తెలియదు. తల్లి ప్రేమ లో ఉన్న నిస్వార్థం కొడుకు ప్రేమలో ఉండదు. తల్లి ప్రేమలోని స్వచ్ఛత కొడుకు ప్రేమలో ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ మనసు ఎవరికీ ఉండదు. అమ్మలకు తప్ప!

మానవ సంబంధాలను ప్రభావితం చేసే ఆర్ధికసంబంధాలు ఏమిటో ,ఆర్ధిక అసమానతలు తల్లి బిడ్డల్ని యెట్లా వేరు చేస్తాయో , ఒకానొక దశ తర్వాత మనిషిలో వచ్చే మార్పు ఏమిటో , మధ్య తరగతి ఊగిసలాటలు ఏమిటో ఈ కథలో కథకుడు సూచిస్తాడు.

నిరాదరణతో నిస్సహాయ పరిస్థితులలో తనువు చాలించిన తల్లులు తమ పట్ల నిర్లక్ష్యంగా, నిర్దయగా, నిర్మమ కారంగా వ్యవహరించిన కొడుకుల పట్ల మరణానంతరం కూడా క్షమిస్తునే వుంటారేమో!? బహుశా క్షమించడం, ప్రేమించడం స్త్రీల, తల్లుల ఆనవాళ్లేమో! .

ఈ కథ ఆకాశంలో చందమామను నక్షత్రాలను అమాయకపు పసిబిడ్డలకు చూపించే , చూపించి లాలనగా అన్నం తినిపించే అమ్మల కథ మాత్రమే కాదు. ఈ పరిమితిని ఈ కథ దాటిందని ,మనిషి తప్పుల్ని నిలదీసే కథ ఇదని పాఠకుడు గ్రహిస్తే రచయిత ఉద్దేశ్యం , కథ లక్ష్యం నెరవేరినట్లే !
ఈ బిడ్డలందరూ ఇప్పుడు లేని తమ తల్లులను తమ వృద్ధాప్య దశలో తలుచుకోవడం, క్షమించమని అడగడం, తమ తప్పులను గుర్తు తెచ్చుకోవటం ఇతరుల పట్ల తమ ప్రవర్తనను సమీక్షించడం ఈ కథలోని కథాంశం. కథనంలోని పదును, రచయిత కంఠస్వరం సరిగ్గా గమనిస్తే కథకుడి సుతిమెత్తని ఆగ్రహం పాఠకుడికి అర్థమవుతుంది కథకుడి ధర్మాగ్రహం, వ్యంగ్యం పాఠకుడికి అర్థం అయితే తప్ప రచయిత ఆవేదనను పాఠకుడు అర్థం చేసుకోలేడు. కథను చదివేటప్పుడు రచయిత వాడిన భాష, కథనం కొనసాగిన విధానం, సంభాషణలు పాత్ర తీరు తెన్నులు అన్నిటినీ సమన్వయ పరుచుకుని , శ్రద్ధగా కథ చదివినప్పుడు కథతో బాటు పాఠకుడు కూడా ముందుకు నడుస్తాడు. ఈ కథలో తల్లుల ఆవేదనని కొడుకుల నిష్ప్రయోజన పశ్చాత్తాపాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఎక్కడా తన ధర్మాగ్రహాన్ని రచయిత వాచ్యంగా చెప్పకపోవడం, తన కంఠస్వరాన్ని ఎంత మేరకు ఉపయోగించాలో అంత మేరకే ఉపయోగించడం ఈ రచయిత శిల్ప పరిణితికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

కథ మొత్తం వాచ్యంగా చెప్పేయడం వల్ల కథ తేలిపోయే ప్రమాదం వుంది కాబట్టే , కథకుడు ప్రత్యేక శ్రద్ధ తో , శిల్ప నైపుణ్యం తో ఈ కథను నడపటం వల్ల ఈ కథ మంచి కథ అయ్యింది.


No. of visitors : 801
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

కథల గూటి లోని ఒక మంచి కథ నల్లూరి రుక్మిణి గారి "ఎవరిది బాధ్యత"

పలమనేరు బాలాజీ | 02.12.2019 11:35:29pm

థను శ్రద్ధగా చదివే వాళ్ళకి మానవ మనస్తత్వం లోని వైరుధ్యాలను, సంఘర్షణలను రాజీతత్వాన్ని, ప్రశ్నించే గుణాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత సంపద పట్ల.....
...ఇంకా చదవండి

అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ

పలమనేరు బాలాజీ | 17.09.2019 08:46:21am

భారతదేశంలో స్థల కాలాలను బట్టి కులాన్ని బట్టి సామాజిక స్థితిగతులను బట్టి చావుకు అర్థం, విలువ మారిపోతూ ఉంటుంది. అంతో ఇంతో ఉన్నవాడి చావుకి ,గొప్ప వాడి .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •