అడవిని రాజ్యం కల్లోలిత ప్రాంతంగా మార్చి వేసింది. అడవి ఎప్పుడూ రాజ్యానికి తలవంచని ప్రశ్నగా నిలవడమే దీనికి కారణం కావచ్చు. పురాణేతిహాసాల కాలం నుండి నేటి కార్పొరేట్ ఫాసిస్ట్ రాజ్యాల వరకు అడవి తనకు తానుగానే ఒక ఆయుధంగా మారిపోయింది. స్వయం నిర్ణయాధికారంతో మానవాళి పురోగమనంలో ఎదురైన ఆటుపోట్లకు తట్టుకొని నిలబడుతున్న అడవి తన ధిక్కారాన్ని ఎప్పుడూ చాటుతూనే వుంది. తన అస్తిత్వాన్ని కాపాడే పోరాటాలకు తను మాతృగర్భంగా నిలుస్తూ వుంది. ఈ కారణంగానే అది నేడు నెత్తుటి మడుగవుతూనే వుంది. తను ప్రాణాధారంగా నిలవాల్సిన చోటుని మనిషి సరుకుని చేసి తనను ఎత్తుకుపోయే కుట్రను ఎదుర్కొంటూనే వుంటుంది. మహత్తర శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం ద్వారా సాధించుకున్న 1/70 చట్టం నుండి నిన్నా మొన్నటి అటవీ హక్కుల చట్టం వరకు ప్రభుత్వాలు కంటి తుడుపుగా చేస్తున్న చట్టాలేవి అమలు కాకపోవడంతో అడవి ఆర్తనాదం భవిష్యత్తరాలకు అంధకారంగా మారబోతున్నా సరే రాజ్యం అడవిని కొల్లగొట్టేందుకు తవ్విపోయేందుకు రకరకాల ప్రాజెక్టులు, అభయారణ్యాలు పేరుతో అక్కడి ఆదివాసులను ఖాళీ చేయించడానికి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం తన కార్పొరేట్ రంగును నిస్సిగ్గుగా విప్పి చూపుతూ భూమిపుత్రులను అభివృద్ధి పేరుతో ఖాళీ చేయించేందుకు తీర్పులిస్తోంది. కానీ వీటన్నింటిని తట్టుకుని నిలబడే ఆత్మాభిమానాన్ని అడవి వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడాన్ని నియాంగిరీ పోరాట పతాక రెపరెపలు ఆశను సజీవంగా ఉంచుతున్నాయి.
కానీ నేడు సమాధాన్ పేరుతో విరుచుకు పడుతున్న హిందూ ఫాసిస్ట్ కార్పొరేట్ రాజ్యం ప్రకటించిన యుద్ధం ఆదివాసీ ప్రజలపై పాల్పడుతున్న హత్యాచారాలు గృహదహనాలు గిరిజనులను నాజీల తరహా ప్రత్యేక క్యాంపులకు తరలించడం కార్పొరేట్ మీడియాకు కనీసం వార్తలు కూడా కాకపోతున్నాయి. చెట్టుకో పారామిలటరీ సైనికున్ని నిలుపుతూ అడవిని జైలుగా మార్చివేసింది రాజ్యం. వేలాదిమంది ఆదివాసీ ప్రజలను ఏళ్ళ తరబడి జైళ్ళలో నిర్బంధిస్తోంది, తను చేసిన చట్టాలే అక్కడ అమలుకాకుండా చేస్తున్నది. ఈ నేపథ్యాన్ని తను నిత్యమూ చూస్తున్న కవి సిరికి స్వామినాయుడు తన కొత్త కవితా సంపుటి మట్టిరంగు బొమ్మలులో మనముందు వుంచారు. అందులో "అతడు ఆమె అడవి" కవితలో మాయమైపోతున్న ఆదివాసీ ప్రజల గురించి వారి జీవన విధానంతో పాటుగా మన కళ్ళముందు ఆవిష్కరిస్తారు.
ప్రకృతితో మమేకమైన పదచిత్రాలతోనే కవితలను అల్లడం ఈ కవి తన సొంతం చేసుకున్నారు. సరళమైన భావ చిత్రాలతో చదవగానే హత్తుకునేట్టు వుంటాయి తన కవిత్వ నిర్మాణం. ఉత్తరాంధ్ర సజీవ యాసను తన కవిత్వంగా మలచుకున్న కవి. ఈ నేలా అడవీ నదులూ అన్యాక్రాంతమైపోతున్న గోసను మనకు తనదైన శైలిలో వినిపిస్తారు.
వాళ్ళిద్దరూ... గువ్వా గోరింకలు
అడవితల్లి ఆకుపచ్చని నేత్రాలు
అడవి తీరాన చెంగు చెంగున దుమికే రెండు కుందేటి కూనలు....
పోడు వ్యవసాయం చేసే ఆదివాసీ రుతువు రుతువు మధ్య కొండ నేలను చదును చేస్తూ కొట్టిన చెట్లను కాల్చి బొగ్గును చేసుకుని అల్లంత దూరాన్నుండి కావిడి భుజాన మోసుకొని పల్లానికి చేరుకుని అమ్మి తన నిత్యావసర సరకులను తీసుకు పోతాడు. దీనివలన అడవి తరిగిపోదు. ఎందుకంటే తను చదును చేసిన ప్రాంతంలో ఆ పంట కాలం తరువాత మరల అక్కడ మొక్కలు చిగురించేందుకు ఆ చోటునుండి వేరొక చోటుకి మారిపోతుంటాడు. కానీ వ్యాపారులు అధునాతన యంత్రాలతో చెట్లను కొట్టుకుపోవడాన్ని నిలువరించని అటవీ అధికారులు ఆదివాసులనే నేరస్తులుగా ముద్రవేసి ప్రచారం చేస్తారు. నిర్భంధానికి గురిచేస్తారు. అలా బొగ్గును తయారు చేసే విధానాన్ని కవి యిలా చెప్తారు..
అతడు గొడ్డలి చేతపట్టి, ఎండిన కొమ్మల్ని ముట్టే కట్టి
నుయ్యి తీసినట్టు నిలువెత్తు గొయ్యి తీసి కుచ్చిలి పేరుస్తాడు
ఆమె పోడు ముట్టించినట్టు, బట్టీ ముట్టించి మట్టి కప్పుతుంది
శ్వేతనాగు పడగెత్తినట్టు, బుసలు కొడుతుంది పొగ
నేల పొరల్లోనూ... వాళ్ళ ఆకలి కడుపుల్లోనూ రాజుకుంటుంది మంట
ఆదివాసీ జీవన విధానం ప్రకృతితో ముడివేసుకొనే వుంటుంది. దానినుండి దూరమైతే వారి అస్తిత్వమే మిగలదు. ఈ కవితలో తనెంచుకున్న వస్తువుకు సరిపడా భావ చిత్రాలకు ముడిసరుకు అడవే కావడం మనకు కవితను మరింతగా దగ్గర చేస్తుంది.
కందమూలాలు తవ్వినట్టు చల్లారిన బట్టీ తవ్వితే
నేల పొరల్లోంచి నల్లని వజ్రపు తునకలు
రేపటి కుంపట్లో రగిలే నిప్పు కణికలు
అతడు బొగ్గులో బొగ్గై
నీలాల కావిడితో నడిచొస్తుంటే
ఆమె కళ్ళు విరిసిన పుచ్చ పూలవుతాయి
చివరిగా అడవిలో జరుగుతున్న రాజ్య దాష్టీకం అకారణంగా ఎదురుకాల్పుల పేరుతో ఆదివాసీలను చంపుతూ మావోయిస్టుల ఏరివేత అన్న వార్తలతో నిండిపోయే కార్పొరేట్ అనుకూల మీడియా కుట్రను బహిర్గతం చేస్తాడు కవి. ఇటీవల పెద్ద ఎత్తున పదుల సంఖ్యలో ఆదివాసీలను చంపుతూ ఎదురుకాల్పులంటూ కథలల్లుతూ అడవిపై విరుచుకుపడుతోంది రాజ్యం. యిందులో ప్రాణాలు కోల్పోతున్న ఆదివాసీ మహిళలూ, పిల్లల పట్ల కనీసం న్యాయస్థానాలు కూడా నోరు మెదపక పోగా యిటీవల సుప్రీం కోర్టు తమ కోర్టులిచ్చిన మానవీయ ఉత్తర్వులనే కాలరాయడాన్ని చూస్తున్నాం. రాజ్యానుకూలంగా మారిపోతున్న న్యాయస్థానాలు నిజానికి అరణ్య రోదనగా మిగిలిపోతున్నాయి. ఆదివాసీల స్వయం ప్రతిపత్తిని ప్రశ్నార్థకం చేస్తూన్నాయి. ఈ ఆవేదనను కవి రాని తన భర్తకోసం ఎదురు చూసే ఆదివాసీ మహిళ ఎదురుచూపులో చెప్తారు. కవిత్వం సరళంగా సహజంగా హత్తుకునే సజీవ పద చిత్రాలతో అల్లిక చేసే శైలి ఈ కవిత ప్రత్యేకం. కవికి తనకున్న ఆదివాసీ జీవన శైలి పరిచయాన్నే కవితలో ధారగా అల్లుకుపోతారు. వారి సహజ జీవన విధానంలోని ప్రకృతి సంబంధాన్ని పద చిత్రాలుగా మలచుకోవడంతో కవిత నడక సాఫీగా సాగి హత్తుకుంటుంది.
అతడు ఆమె అడవి
వాళ్ళిద్దరూ... గువ్వా గోరింకలు
అడవితల్లి ఆకుపచ్చని నేత్రాలు
అడవి తీరాన చెంగు చెంగున దుమికే రెండు కుందేటి కూనలు....
కుబుసం విడిచి ఫలమాడే రెండు నాగసర్పాలు
జాకరమ్మ గుడి ముందర వెలిగే జంట దీపాలు
అడవి ఆ దరి నుండి యీ దరికి ఒరిసి పారే
రెండు ఆకుపచ్చని నదులు!
అతడు గొడ్డలి చేతపట్టి, ఎండిన కొమ్మల్ని ముట్టే కట్టి
నుయ్యి తీసినట్టు నిలువెత్తు గొయ్యి తీసి కుచ్చిలి పేరుస్తాడు
ఆమె పోడు ముట్టించినట్టు, బట్టీ ముట్టించి మట్టి కప్పుతుంది
శ్వేతనాగు పడగెత్తినట్టు, బుసలు కొడుతుంది పొగ
నేల పొరల్లోనూ... వాళ్ళ ఆకలి కడుపుల్లోనూ రాజుకుంటుంది మంట!
కందమూలాలు తవ్వినట్టు చల్లారిన బట్టీ తవ్వితే
నేల పొరల్లోంచి నల్లని వజ్రపు తునకలు
రేపటి కుంపట్లో రగిలే నిప్పు కణికలు
అతడు బొగ్గులో బొగ్గై
నీలాల కావిడితో నడిచొస్తుంటే
ఆమె కళ్ళు విరిసిన పుచ్చ పూలవుతాయి
ఏడేడు కొండలెక్కీ దిగుతున్న అతడి ఆలోచనలన్నీ...
అమ్మబోయే బొగ్గుల కావిడి మీదే
పల్లె వీధుల్లో తిరిగి తిరిగీ
భుజాన బరువుదించుకునే వేళకు పొద్దు
అడవి జింకలా పడమట కొండల్లోకి పారిపోతుంది
చిమ్మ చీకట్లు పులుముకున్న అడవిదారుల్లో అతడు
ఒంటరి లేడికూనలా యింటిదారి పడుతూ...!
సామల బియ్యం జావ చేసి ఆమె
అతడు వచ్చే దారుల్లో కళ్ళను కాగడాలు చేసి వెలిగిస్తుంది
అతడెంతకీ యింటికి రాడు!
ఆయుధాలు సంఘర్షించే వేళ తుల్లిపడుతూ...
అక్కడే... ఆ కాలం దువ్వారం దగ్గరే...
యింకా, ఆమె ఎదురు చూస్తూనే ఉంది!!
Type in English and Press Space to Convert in Telugu |
ఆకు కదలని చోట వర్షించిన కవిత్వంఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం....... |
ఆ పావురాలు!ఒలికిన నెత్తురు
అద్దిన జెండానందుకుంటూ
గుంపుగా ఆ పావురాలు! ... |
తెలవారని ఆకాశం!కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన
వాన చివుళ్ళ నుండి రాలుతూ
రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి
టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ... |
Lockdown 3.0కానీ
రేప్పొద్దున్న రెపరెపలాడే
జెండాగా మారాల్సింది
ఈ నెర్రెలు బారిన పాదాలిస్తున్న
వాగ్ధానం కదా?? ... |
నమస్కరిస్తూ..కళ్ళకు గంతలు కట్టుకొన్నదని
మీ న్యాయ దేవత ముందు
నగ్నంగా నిలబడిన ఆ
పదముగ్గురూ
విడిచిన లజ్జను మీ మఖంపై
నెత్తుటి ఉమ్ముగా ఊసి!... |
జీవసూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹకవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప... |
పాలపుంతల దారిలో..
అమ్మలు
అలా వచ్చి ఎర్ర పూలను
దోసిట్లో పోసి వెళ్ళి పోతారు
కొన్ని నెత్తుటి చారికలను
కళ్ళలో నీటి బిందువులుగా
మార్చి కడిగిపోతారు... |
దక్షిణ యాత్రనీ ఒంటి రంగును హేళన చేసి
నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు
నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం
నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!... |
గులాబీ!వాడెంత విధ్వంసం చేసినా
నీ పసివాడి చేతిలో
గులాబీ విచ్చుకుంటూ
వాడిని భయపెడుతూనే వుంది!!... |
కుందాపనఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు...... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |