నల్లమల యురేనియం గని కాదు, జీవవైవిధ్య కేంద్రం

| సాహిత్యం | వ్యాసాలు

నల్లమల యురేనియం గని కాదు, జీవవైవిధ్య కేంద్రం

- రాఘవాచారి | 16.08.2019 10:56:24pm

మనని ఇంతకాలం నల్లమల కాపాడిందా లేక మనమే ఇంతకాలం నల్లమలను కాపాడుకున్నామా అంటే రెండూ నిజమే అని చెప్పాలి. నల్లమలకి తవ్వకాలకు వస్తున్న యురేనియం కార్పొరేషన్‌కి ప్రాణులతో పర్యావరణంతో ప్రజలతో పనిలేదు. దానికి భూమి లోలోపలి పొరల్లో వున్న యురేనియం కావాలి. క్యూరీ దంపతులు యురేనియం తెలుసుకున్న నాటి నుండి పాలకవర్గాల చూపు భిన్నంగానే ఉంది. యురేనియంతో చాలా చాలా ఉపయోగాలుంటాయని పాలకుల బాకా మోగుతూనే ఉంది. అణు విస్ఫోటనం పరిణామాలతో ప్రపంచ ప్రఖ్యాత విజ్ఞానశాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ ఎంతబాధపడ్డాడు. హిరోషిమా, నాగసాకి అణుబాంబుల ఘటనలేకాదు. చెర్నోబిల్‌ దురంతం ఎన్ని అనుభవాలు ముందుకు తెచ్చింది. ప్రపంచం ఈనాటికీ తేరుకోలేదు కదా. ఎపుడైనా పాలకులు, దోపిడీవర్గాలు, కార్పొరేట్లు ఆలోచిస్తారా? దోచుకుని దోచుకుని కోట్లకు పడగలెత్తిన ప్రపంచ వ్యాపారవర్గాలకు వారి దోపిడీకి మార్కెట్లు కావాలి. దేశం అంటే వ్యాపారవర్గాలకి వారి సంస్థలకి మార్కెట్లే. వారు మార్కెట్ల కోసమే యుద్ధాలు చేస్తారు. దోపిడీ వర్గ ప్రయోజనాలకే పాటుపడే పాలకులు యుద్ధాల సృష్టికర్తలుగా ప్రజలకు నిజాలు చెప్పకుండా పాలన చేస్తుంటారు. తమ అన్ని చర్యలకు అభివృద్ది అనే ట్యాగ్‌ తగిలించి మనని నమ్మిస్తారు. ఇవాళ నల్లమలలో యురేనియం తవ్వకాలు ప్రారంభిస్తారంటే పాలకులు నల్లమల మీద, నల్లమలమీద ఆధారపడిన లేక నల్లమల ప్రభావంలో జీవిస్తున్న ప్రజలమీద, సమస్త జీవావరణ వ్యవస్థల మీద యుద్ధం ప్రారంభిస్తారనే మనం అనుకోవాలి. ఇది నిజం.

నల్లమల నేపథ్యం

నల్లమల ఎంత అద్భుతమైన అడవి. పాల్కురికి సోమన, గోనబుద్ధారెడ్డి తమ రచనలలో వర్ణించిన అడవులు ప్రధానంగా గోదావరి, కృష్ణాతీరాల అడవులే. పడమటి కనుమల నుండి బయలుదేరి కృష్ణానది నల్లమలలోకే వస్తుంది. ఎంతో ప్రాచీనమైన నల్లమల అడవులలో కృష్ణా తీరంలోనే ఇక్కడి మానవుల జీవనయాత్ర మొదలైందంటారు. ఈ తీరమే వ్యవసాయ పనిముట్లకు ఆహార అవసరాలు తీర్చుకోగల పనిముట్లకు జన్మస్థానమంటారు. నాగలి, ఇసుర్రాయి, రోలు, రోకలి వంటి వన్నీ మన పూర్వులే రూపొందించారంటారు. వారు ఎన్ని కష్టనష్టాలకు, ఎన్ని జీవన త్యాగాలకు ఓర్చి మనని ఈ కాలంలోకి నడిపించి వుంటారు. ఈ పరిసరాలలో ఎన్నెన్ని రాజ్యాలు పుట్టాయో ఎన్నిన్ని రాజ్యాలు కుప్పకూలిపోయాయో కృష్ణాతీరంవెంట, నల్లమల అడవుల వెంట ఎన్నెన్ని ఆనవాళ్ళు కనిపిస్తాయి.? ఈ చారిత్రక పరిణామంలో మనం తెలుసుకోవలిసింది మనకు అర్థం కావలిసింది ఏమిటంటే మానవులు ప్రకృతిని కాపాడుకోవాలి. తమను కాపాడుకోవాలి. అందుకు అత్యంత కీలకమైన ప్రాజస్వామ్యాన్ని కాపాడుకోవాలి. మనం పౌరులుగా సాధించుకున్న హక్కులను పాలకులు హరిస్తున్నారు. మన జీవించే హక్కుని తమ చేతిలోకి తీసుకుంటున్నారు. ఆధునికులమని, నాగరికులమని మనది గొప్ప ప్రజాస్వామ్యమని విర్రవీగే వీరు రాజ్యాంగ విలువలను సైతం తోసేసి మనని, మనం ఆధారపడిన ప్రకృతిని తమ ఆధీనంలోకి తీసుకుని నియంతృత్వాన్ని చలాయిస్తున్నారు. వారికి నల్లమల వనరుల గని మాత్రమే. అందుకే యురేనియం అనే భూగర్భంలోని విషాన్ని వెలికితీసే పనికి పూనుకుంటున్నారు. వారికి డాలర్లు కావాలి.

నల్లమలలో చెంచుల చరిత్ర నల్లమల అడవులంత పురాతనమైంది. చెంచు మహిళ ʹఉగ్రనరసింహుణ్నిʹ ఎంత ఆట పట్టించిందో మన సమాజం పాడుకుంటుంది. వలస పాలకులను చెంచులు ఎలా ఎదిరించారో మనం కథలు కథలుగా వింటాం. చెంచులు తమ దబ్బలకు పని చెబితే అబ్బా అని బెదిరిపోని శక్తిలేదు. నిజాం నవాబుల కాలంలో అమ్రాబాద్‌ తహసీల్దార్‌ చెంచుల సభ జరిపి చెంచులకు ఏం చేయాలో నివేదిక తయారు చేశాడు. మానవ శాస్త్రవేత హెమన్‌డార్ఫ్‌ చెంచులను ప్రాచీనమానవులుగా గుర్తించి నల్లమలలో విస్తారంగా తిరిగి చెంచుల రక్షణకు ప్రతిపాదనలు చేశాడు. అవేవీ స్వతంత్ర పాలకులకు పట్టలేదు. అందుకే ఆదివాసుల కోసం జీవితకాలం పనిచేసిన ఐ.ఎ.ఎస్‌ అధికారి బి.డి.శర్మ 1947లో దేశానికి స్వతంత్రం రావటంతోనే అప్పటిదాకా ఆదివాసులకు ఉండిన స్వతంత్రం పోయిందన్నాడు. ఆదివాసులు విప్లవ చైతన్యంతో పోరాడి రెగ్యులేషన్‌ 1ఆఫ్‌ 70 సాదించుకున్నారు. పెసా చట్టం సాధించుకున్నారు. అటవీ హక్కుల చట్టం, అనేక నిర్వహణా సంస్థలు సాధించుకున్నారు. ఆ ఫలితాలను వారికి దక్కనీయటంలేదు. అడవులలోని పెంటలలో ఆదివాసులు, అటవీ గ్రామాలలో ఆదివాసేతరులు, తాండాలలో లంబాడాలు ఎవరూ ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులనే పాలకులు కల్పిస్తున్నారు. ఎన్నికల ముందు ఒక మాట చెప్తారు. ఎన్నికల తర్వాత ఒక దాడికి తెరతీస్తారు. అనేక విధాల చక్రబంధాలలో నల్లమల ప్రజలు నలిగిపోతున్నారు. ఈ ఏడు దశాబ్దాలలో పాలన ఎవరిదైనా అన్ని అటవీ ప్రాంతాల ప్రజల మనుగడ దినగండమై పోయిన పరిస్థితులను విధానకర్తలే కల్పిస్తున్నారు.

భూమి రూపొందేక్రమంలో ఏర్పడిన నల్లమల కొండలు తూర్పు కనుమలలో భాగంగా దక్షిణాన శేషాచలం కొండలలోకి, ఉత్తరాన రాచకొండ గుట్టటలలోకి, అనంతగిరి పర్వతాలలోకి కృష్ణానది వెంట క్రమంగా పడమటి కనుమలదాకా విస్తరించి ఉన్నాయి. అమ్రాబాదు అడవులుగా సుప్రసిద్ధమైన ఈ అడవులలో పురాతనమైన చైనా గోడవంటి గోడను చరిత్రకారులు పరిచయం చేస్తున్నారు. అక్కమహాదేవి ఆనవాళ్ళు సరే. చెంచులు ఆశ్చర్యంగా అటవీ అందాలు దర్శించిన ఫర్హాబాదు ప్రాంతం, బౌరాపురం చెరువు గుడి ప్రాంతం, లొద్ది, అనేక జలపాతాలు. ఎంత అందమైన సహజ సుందరమైన నేల ఇది. ఇక్కడ ప్రజల నమ్మకాలలో నీరు, గాలి, రాయి, రప్ప, చెట్టు ఇలా సమస్త అడవీ దైవ సమానమై పోయాయి. దైవమే అయిపోయాయి. ఇక్కడ సుప్రసిద్ధమైనవిగా ప్రచారంలో వున్న దైవ స్థలాలు జగమెరిగినవే కానీ ఇక్కడి ప్రజలు నల్లమలను దైవంగానే కాపాడారు. నల్లమల గతాన్నంతా శోధించవలసే వుంది. సమీప గతంలోనైనా నల్లమల తనలో అనేక జ్ఞాపకాలు పొదువుకుని వుంది. ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర నల్లమల మీదుగానే సాగింది. ఆయన చాలా అపురూపంగా చెంచుల అమాయకత్వాన్ని, తోడ్పాటును తన యాత్రాచరిత్రలో రాసుకున్నాడు. హైదరాబాదు రాజ్యం తాను అమలుపరచే నిర్బంధానికి నల్లమలలో కాలాపానీ గా ప్రసిద్ధమైన జైలు నిర్వహించింది. నల్లమలలోనే లింగాల వంటి సెటిల్మెంటు గ్రామాలు ఏర్పరచింది. తెలంగాణ సాయుధ పోరాటం నల్లమలలో కెప్టెన్‌ జైపాల్‌సింగ్‌ నేతృత్వంలో సాయుధ శిక్షణ శిబిరం నడుపుకుంది. కమ్యునిస్టు రంగమ్మగా సుప్రసిద్ధమైన ఒక మహిళ ఈ కేంద్రంగా సాయుధ దళానికి నాయకత్వం వహించి స్ఫూర్తినింపింది. ఆ చరిత్రకు కొనసాగింపుగా పీపుల్స్‌వార్‌ పార్టీ భూమి, భుక్తి, విముక్తి లక్ష్యంతో నడిపిన పోరాటం, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంతో నడిపిన చర్చలు నల్లమల కేంద్రం నుండే ముందుకు సాగాయి. ఇదంతా చరిత్ర. మనుగడకు విశ్వాసాలకు పోరాటాలకు అసమానత్యాగాల చరిత్రకు రంగభూమికదా నల్లమల. ఇప్పుడిప్పుడే నల్లమల బిడ్డలు చదువులలో ఉపాధి అవకాశాలలో తమ కదలికలు ప్రారంభించారు. ప్రభుత్వమే ఓర్వలేకపోతోంది.

ఏం జరుగుతోంది?

భారత ప్రభుత్వాలు 1973లో దేశంలో పులుల అభయారణ్యాల ఏర్పాటుకు విధాన నిర్ణయం తీసుకున్నాయి. ఇపుడు దేశంలోని 50 పులుల రక్షణ అడవులలో నల్లమలలోనే అధిక పులులున్నాయట. 3728 చదరపు కిలోమీటర్ల విస్తారమైన ఈ కేంద్రం 1983లో ప్రారంభమైంది. ఎక్కడెక్కడి పులులనో తెచ్చి వదిలితే ప్రజలెంత బాధలకు గురైనారో మేం స్వయంగా చూశాం. బాధితులతో గొంతు కలిపి టైగర్‌ ప్రాజెక్టు ఎత్తేయమని డిమాండ్‌ చేశాం. నల్లమల పులులతో మేం కలిసి బతుకుతాం బయటి పులులను తేకండని ఇక్కడి ప్రజలు పెద్దపోరాటాలే చేశారు. పై పై సంక్షేమ చర్యలు కాదు శాశ్వత గౌరవ జీవన సౌకర్యాలు కావాలన్నారు, దారవాగు, మానువడ్డవాగుల ఆధారంగా సాగునీటి వనరులు వృద్ధి పరచాలన్నారు. తాగునీరు, ఆరోగ్యం, చదవులు కావాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలలో అచ్చంపేట ప్రాంత ఆయకట్టు తగ్గించవద్దని, అమ్రాబాద్‌, బల్మూరు, లింగాల మండలాలకు చిన్నచిన్న ఎత్తిపోతల పథకాలతో సాగునీరిచ్చి రక్షించమన్నారు. ఈ అనేక పోరాటాలలో ప్రజల వెంట మేమున్నాం. పాలకులు అణిచివేతమీద కనబరచిన శ్రద్ధ, హింసాత్మక చర్యల మీద పెట్టిన శ్రద్ధ శాశ్వత సౌకర్యాల మీద, వసతులమీద పెట్టలేదు. రాను రాను అటవీ ఫలాలు కూడా వీరికి దక్కకుండా పోతున్నాయి. నల్లమల అడవులు పర్యాటక ప్రదేశంగా ఒక మార్కెట్‌గా మారిపోతున్నాయి. ఇక యురేనియం తవ్వకాలే జరిగితే నల్లమల అడవుల చరిత్ర ముగిసిపోయే ప్రమాదం వుంది. నల్లమల ప్రజలు నిర్వాసితులు కాకతప్పదు.

శ్రీశైలం ప్రాజెక్టుతో నల్లమలకు,పాలమూరు ప్రజలకు చాలా చేదు అనుభవాలే ఉన్నాయి. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి పాలకులు నల్లమలలోని వటవర్లపల్లి గ్రామపంచాయతీ నుండే అనుమతులు పొందారు. ప్రాజెక్టు నిర్వాసితులకు ఉద్యోగం ఇస్తామన్నారు. విద్యుత్తు ఉత్పత్తిలో వాటా ఉంటుందన్నారు. లాభాలు పంచుతామన్నారు. ఏదీ ఇవ్వలేదు. చివరికి వటవర్లపల్లి గ్రామం కరెంటు కోసమే అనేక పోరాటాలు చేసింది. శ్రీశైలం ప్రాజెక్టువల్ల నిర్వాసితులైన, జీవిక కోల్పోయిన చెంచులు కనీసం చేపలు పట్టుకోలేక పోతున్నారు. అలివి వలల ధాటికి ఆగలేక పోతున్నారు. ప్రభుత్వం అలివి వలల వెంట ఉంది. శ్రీశైలం నీటి తొలి హక్కుదారులు తాగునీటికే కటకట పడుతున్నారు. ప్రభుత్వాలు ఏజన్సీ ఏరియాను, ఇక్కడి ప్రజలను, వారి గౌరవాన్ని ఎలా కాపాడాలో ఒక్కనాడూ ఆలోచించిన పాపాన పోలేదు.

నల్లమల అడవులు కొండల మీద దోపిడీవర్గాలు, వారిమైనింగ్‌ కార్పొరేట్లు కన్నేసి చాలా కాలమైంది. తొలుత వారు అటవీ ఉత్తత్పుల కోసం వచ్చారు. అడవిలోని కలపకోసం వచ్చారు. మోసం అబద్దం తెలియని అడవిబిడ్డల, అటవీ ప్రాంత గ్రామాల బిడ్డల శ్రమను కొల్లగొట్టటానికి వచ్చారు. ప్రజల్ని వలసబాట పట్టించి దోచుకున్నారు. ఎన్ని వలసలు, ఎన్ని వలసచావులు ఎంత శ్రమ దోపిడీ జరిగాయో లెక్కలేదు. వారు క్రమంగా భూగర్భవనరుల మీద కన్నేశారు. నల్లమల నుండి కృష్ణాతీరం వెంట డిబీర్స్‌ కంపెనీతో భూమిని జల్లెడచేస్తు వజ్రాల వేట నడిపారు. తమ ఎర్ర దుక్కులు దెబ్బ తింటాయని ఇక్కడి ప్రజలు డిబీర్స్‌పై తిరగబడ్డారు. పాలకులు ఇపుడు ఏకంగా యురేనియం తవ్వకాలకు వచ్చి నల్లమలకు ఇక చావోరేవో తేల్చుకోక తప్పని పరిస్థితి కల్పించారు.ఇది ఇక్కడనే ఆగిలేదు. కృష్ణాతీరంలో గట్టు ప్రాంతంలో, జూరాల దగ్గరలో మస్తిపూర్‌లో కూడా యురేనియం అన్వేషణలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళనలో ఉన్నారు.

యురేనియం పరిశోధనలు - ఉత్పాతాలు - పోరాటాలు

భారతదేశంలో 1945లో టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చివారు ఈ దిశగా పరిశోధనలు ప్రారంభించారు. హోమీ జె బాబా నేతృత్వంలో 1954లో అటమిక్‌ ఎనర్జీ ట్రాంబో (ఎఇటి) మొదలైంది. ఆయన మరణం తరువాత ఆయన పేరుతోనే బాబా ఆటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బి.ఎ.ఆర్‌.సి) ప్రారంభమైంది. దేశంలో న్యూక్లియర్‌ పరిశోధనలు చాల పెరిగాయి. కనీసం 13 ప్రాంతాలలో ప్రజలు యురేనియం ఉత్పాతాలను ఎదుర్కుంటున్నారు. యురేనియం అన్వేషణలలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో 12 స్థలాలలో కెనడా, ఆస్ట్రేలియాలలో దొరికే హైగ్రేడ్‌ యురేనియం దొరుకుతుందని గుర్తించారు. కేంద్రప్రభుత్వ నిర్వహణలోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(యు.సి.ఐ.ఎల్‌.) ఈ తవ్వకాలను నిర్వహిస్తుంది.

2006లో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నించి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, ఆయన కొడుకు వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ఆ పార్లమెంటు సభ్యుడుగా ఉన్నపుడు వారిద్దరి తోడ్పాటుతో అదే నియోజక వర్గంలోని తుమ్మలపల్లి గ్రామంలో యురేనియం గుర్తించి తవ్వకాలు ప్రారంభించారు. వారితోనే ప్రారంభోత్సవాలు చేయించారు. సమస్య తీవ్రత అర్థమయ్యేలోపే భూములు ప్రజల చేతినించి జారిపోయాయి. ఇంటికో ఉద్యోగం అని మోసంచేశారు. భూములు పోయి, వేసుకున్నబోర్లు ఎండిపోయి, రోగాల బారినపడి ప్రజలు చాలా నష్టపోయారు. అక్కడనే యు.సి.ఐ.ఎల్‌ రెండవ యూనిట్‌ తవ్వకాలకు భూసేకరణకు రావడంతో ప్రజలు ప్రతిఘటించారు. ఆ ప్రతిఘటనను తండ్రీ కొడుకులు కానీ, యుసీఐఎల్‌ కానీ ఆపలేకపోయారు. రెండవ యూనిట్‌ ఆగిపోయింది. దాదాపు అదే కాలంలో నల్లగొండ జిల్లాలో పెద్దగుట్ట దగ్గర తవ్వకాలకు వచ్చారు. తెలంగాణ ఉద్యమం యురేనియం తవ్వకాల ఆలోచనలపై, ప్రజాభిప్రాయసేకరణపై తిరగబడింది. పౌరసమాజం, ప్రజాసంఘాలు బాధిత ప్రజల వెంటనిలిచారు. ఇది తమ అందరి సమస్య అనుకున్నారు. దీంతో అక్కడ తవ్వకాల ప్రతిపాదన ఆపారు. మనకు సమీపంలో చెన్నై రాష్ట్రంలో యురేనియం బాధితులు నిత్యపోరాటంలో ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.

ఇలా యురేనియం తవ్వకాలకు, యురేనియం ఉత్పాతాలకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్రంగా పోరాడుతూండగానే యురేనియం కార్పొరేషన్‌ వారు మరోవైపు నించి నల్లమల మీదికి తవ్వకాలకు వస్తున్నారు. ఈ రాకడ ఈక్షణాన మొదలైంది కాదు. ఆటమిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ వారు ఉస్మానియా విశ్వవిద్యాలయం అప్లైడ్‌ జియో కెమిస్ట్రీశాఖతో కలిసి నల్లమలలో పరిశోధనలు జరిపారు. ఆమ్రాబాద్‌ మండలం చెన్నకేశవుల గుట్టలో, పద్ర పరిధిలో 75 నుండి 83 చదరపు కిలోమీటర్ల మేర గ్రామాలలో భూగర్భంలో యురేనియం నిలువలున్నట్టు 2015లోనే గుర్తించారు. తాజాగా నల్లమలలో ఈ నిలువలు గుర్తించినప్పటి నుండి నల్లమల మీద పరుచుకునివున్న నీడలు చిక్కనవటం తీవ్రమైంది. ఇది రెండు రాష్ట్రాల నల్లమల దుస్థితి. నల్లమలలో చెంచుల జనాభా తగ్గిపోతున్నదని, వారు మరణం అంచున ఉన్నారని ప్రభుత్వాలే గుర్తించినా ఏజన్సీలో ఎవరికీ ఉపాధి, ఉద్యోగాలు దొరకటంలేదని తెలిసినా, చెంచులు స్వయంగా పాదయాత్రలు, అధికార కార్యాలయాలముందు ఆందోళనలు జరిపినా రెండు రాష్ట్రాలలో ఎవరికీ, దక్కింది ఏమీలేదు. తెలంగాణలోనైతే ఒక్క బౌరాపురం జాతర నిర్వహణే గొప్ప అయిపోయింది. ఇప్పటికే ʹహరితహారంʹ అడవిలోని ప్రజల్ని భూములనుండి తరుముతుండగా ఇపుడు యురేనియం ఏకంగా జీవనం నించి తరిమేయడానికే వస్తోంది.

1919లో లార్డ్‌ రూథర్‌ ఫర్డ్‌ అనే శాస్త్రవేత్త అణువుని బద్దలు కొట్టగలమని దానితో శక్తి విడుదలవుతుందని నిరూపించాడు. ఆ తరువాత అణుశక్తి సాధనపై దృష్టి పెరిగింది. యురేనియం -235 మూలకం విచ్చేదనకు గురయితే ఎక్కువ అణుశక్తి విడుదలవుతుందని గుర్తించారు. అలాగే థోరియంపై జరిపే చర్యలు కూడా యు-233 గా మారతాయని వీటిని అణుశక్తికి, అణువిద్యుత్తుకు ఉపయోగించవచ్చునని నిర్ధారణకు వచ్చారు. దీంతో దేశంలో ఈ ధాతువుల అన్వేషణలు పెరిగాయి. భూగర్భంలో డెబ్భైవేల టన్నుల యురేనియం, అలాగే సముద్రతీరాల ఇసుకలో మూడులక్షల అరవై వేల టన్నుల థోరియం దోరుకుతాయని ఇవి అనేక శతాబ్దాలపాటు విద్యుదుత్పత్తి అవసరాలు తీరుస్తాయని అంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే శతాబ్దకాలం తరువాత ఈ2019లలో అణు విద్యుత్తుతో ప్రపంచ విద్యుత్తు అవసరాలలో 16శాతం మాత్రమే తీరుతున్నాయని, దేశంలో ఇది మూడు శాతం అవసరాలు తీర్చేస్థాయిని కూడ చేరుకోలేదని ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నివేదికలు తెలుపుతున్నాయి. అంటే మనం బొగ్గు, నీరు, గాలి సూర్యరశ్మి ద్వారానే ప్రపంచంలో 84శాతం, దేశంలో 97శాతం విద్యుత్తు అవసరాలు తీర్చుకోగలుగుతున్నామని గుర్తించాలి. బొగ్గుకి పరిమితి ఉండొచ్చు. నీటి విద్యుదుత్పత్తికి కాలపరిమితి ఉండొచ్చు. గాలికీ, సూర్యరశ్మికీ కొరతలేదుకదా. ఆరోగ్య అవసరాలకూ యురేనియం కావాలంటారు. ఆ కొద్ది పాటిదానికి కొత్త తవ్వకాల అవసరమేలేదు.

యురేనియం తవ్వకాల ప్రక్రియ చాలా కఠినతరమైంది. శుద్దిచేసే ప్రక్రియ చాలా సున్నితమైంది. అనేక సమస్యలుంటాయి. టన్ను ముడి యురేనియం శుద్ధి చేస్తే 2.94 గ్రాముల యురేనియం మాత్రమే తీయగలరు. రోజుకు 20 నుండి 30 టన్నుల ముడి యురేనియం శుద్ధి చేస్తే కనీసం 3 కోట్ల టన్నుల వ్యర్ధ పదార్థాలు బయటికి వస్తాయి. ఎక్కడైనా యురేనియం లభ్యత తగ్గి శుద్ధి ప్రక్రియ ఆపేసినా అక్కడ పోగుపడిన వ్యర్థాలు విడుదల చేసే రేడియేషన్‌ ప్రభావం కనీసం వంద సంవత్సరాలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. యురేనియం తీసే ప్రక్రియలో భూమి, భూగర్భం, గాలి, నీరు, పర్యావరణం కలుషితమై పోతాయి. ప్రాణుల జీవనం, ప్రజాజీవనం విషవలయంలో కూరుకుపోతాయి. రేడియేషన్‌ ప్రభావం ఎంత తీవ్రమైందో ఒక అనుభవం ప్రజలకు బాగా తెలుసు. అది ఎక్స్‌రే. ఎక్స్‌రే తీసే వాళ్ళు గది బయటవుండి తీసుకునేవాళ్ళను మాత్రమే యంత్రంవుండే గదిలోకి పంపి ఎక్స్‌రేతీస్తారు. గర్భవతులకు ఎక్స్‌రేతీయరు. పిల్లలను ఆ పరిసరాలకు రానీయరు ఆసుపత్రులలో

ఆ పరిసరాలలో ʹనిషేధస్థలముʹ అని బోర్డులుంటాయి. మరొక అనుభవం పంజాబ్‌. హరితవిప్లవ ప్రభావంతో అక్కడ గాలిలో, నీటిలో ఆహారపదార్థాలలో రేడియేషన్‌ తీవ్రత పెరిగి ప్రజలు క్యాన్సర్‌ వంటి తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారని క్యాన్సర్‌ బాధితులు ఆసుపత్రికి తిరిగే ఒక రైలును క్యాన్సర్‌ ఎక్స్‌ప్రెస్‌గా పిలుస్తున్నారని పత్రికలు రాస్తున్నాయి. యురేనియం తవ్వకాలతో వ్యర్థాలతో వ్యాపించే రేడియేషన్‌ వల్ల ఉన్నవాళ్ళకి రోగాలు తీవ్రమవటమేకాక పుట్టబోయే శిశువులకు ప్రాణులకు రక రకాల సమస్యలుంటాయి అసలు శిశువులు పుట్టని సమస్యలు పెరుగుతాయి. ఇంత తీవ్ర వినాశకరమైన యురేనియం తవ్వకాలు అవసరమా? అవసరం లేదు గాక లేదు. ప్రభుత్వాలకు, పార్టీలకు ఇదంతా తెలుసు. తెలిసినా ఎందుకు తవ్వకాలు చేపడుతున్నారు.

తట్టుకోగలమా ..

యురేనియంను యుద్ధ ఆయుధాలకోసం వాడతారు. అణుబాంబులకోసం వాడతారు. పాలక వర్గాల వ్యాపార దాహం వల్ల రెండు ప్రపంచ యుద్ధాలు, ఆ తరువాత అనేక దేశాల మధ్య ఈ 75 ఏండ్లలో వందకుపైగా యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలతో జరిగిన ప్రాణనష్టం,ఆస్తుల నష్టం, ప్రకృతి విధ్వంసం అంతా ఇంతా కావు. యుద్ధంలోకి దిగిన దేశాలు చంపి రావటాన్నే గొప్ప అనుకుంటాయి. జపాన్‌లో ఫుకుషిమాలోని అణుధార్మిక కేంద్రాలు భూకంపం తాకిడికి గురి కాగా అయిదు యూనిట్లలో శీతలికరణ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. దియా ఇచి అనే అణు కేంద్రంలో యూనిట్‌ భవనం పేలిపోయింది. రష్యాలో చెర్నోబిల్‌ అణు కేంద్రంలో చిన్న పొరపాటుతో జరిగిన ప్రమాదం వేల ప్రాణాలు బలి తీసుకుంది. ఆమెరికాలో త్రీమైల్‌ ఐలాండ్‌ అణువిద్యుత్‌ కేంద్రంలో 1979లో జరిగిన ప్రమాదంలో 13మిలియన్‌ క్యూరీల రేడియో ధార్మిక వాయువుగాలిలోకి చేరింది. ఇవన్నీ ప్రజల మీద మారణాయుధాలతో దాడివంటివే.

అణు కేంద్రాలతో విడుదలయ్యే రేడియో ధార్మికత తీవ్రతను మూడు జోన్లుగా విభజిస్తారు. మొదటిది చుట్టూ రెండు కి.మీ. ఎక్స్‌ క్లూజివ్‌జోన్‌. నివాసాలు రద్దుచేస్తారు. ఆ పైన రెండవది చుట్టూ 5కి.మీ. దూరం స్టెరిలైజ్డ్‌ జోన్‌. ముంపు ప్రాంతాల లాగా అభివృద్ధి పనులు ఆపేస్తారు. ఆ తరువాత మూడవది చుట్టూ 16 కి.మీ. దూరం ఎమర్జెన్సీ ప్రొటెక్షన్‌ జోన్‌. ఏ చిన్న ప్రమాదం జరిగినా ఇక్కడి నుండి ప్రజలందరినీ తరలిస్తారు. ఇలాంటి సందర్బాలను తట్టుకునే శక్తి సామర్థ్యాలు మన దేశానికి లేవు. భూపాల్‌ పట్టణంలో మిక్‌ (మిథైల్‌ ఇసోసైనెడ్‌) విషవాయువు విడుదలైనపుడు ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసింది. అందువల్ల మన శక్తి గొప్పదని భేషజాలు అవసరం లేదు. అయినా ప్రత్యామ్నాయ వనరులతో విద్యుత్తు ఉత్పత్తి అవకాశాలుండగా యురేనియం తవ్వకాలెందుకు?

తమ్మలపల్లెలో యురేనియం శుద్ధికోసం అవసరమైన నీటిని బోర్లతో తీసుకున్నారు. చిత్రావతి నదినించి తరలించారు. నల్లమలలో కృష్ణానదిని వాడతారు. విపరీతంగా బోర్లువేస్తారు. మనబోర్లన్నీ ఎండిపోతాయి. కృష్ణానది, శ్రీశైలం ప్రాజెక్టు కాలుష్య కాసారమవుతాయి. నల్లమల చుట్టూవున్న తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు; ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, ప్రకాశం, గుంటూరు; జిల్లాలతోపాటు కృష్ణ నీరు ఉపయోగించుకునే అన్ని జిల్లాలు యురేనియం ప్రత్యక్ష, పరోక్ష ప్రభావంలోకి వస్తాయి. పాలకులు కఠినమైన నిజాలు మరుగుపరిచి మాట్లాడతారు. అధికారం కోసమైనా అభివృద్ధి పేరునైనా పాలకులు, పాలనావ్యవస్థలు ఎన్నెన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారో మనం అనుభవిస్తున్నాం.

పోరాడుదాం...

కరువు, వలసల నివారణ కోసం నల్లమలలో మూడుదశాబ్దాలుగా మనం అనేక ఆందోళనలు జరుపుతున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో క్రియశీలంగా పాల్గొన్నాం. ప్రాణాలు కూడా అర్పించాం. తెంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ప్రాంతం డిబీర్స్‌ కంపెనీ వజ్రాల వేటను పోరాడి ఆపింది. ఇపుడు యురేనియం దాడి జరుగబోతున్నది. ఇప్పటికి నాలుగేండ్లుగా జిల్లాలో ఈ విషయమై మనం తీవ్ర ఆందోళనతోవున్నాం. ఎన్నికలు సమీంపలోకి వస్తున్నాయని అప్పడు యురేనియం చర్చ ఆగినా ఇపుడు ఎన్నికల తరువాత ఈదాడి తీవ్రంగా ముందుకువస్తున్నది. ఇది అమ్రాబాద్‌ లేక అప్పర్‌ప్లాట్‌ నల్లమల సమస్యకాదు. కృష్ణా తీరప్రాంతమంతటి సమస్య. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సమస్య. సారాంశంలో దేశ ప్రజలందరి సమస్య. మనందరం మనకోసం, మనబిడ్డల కోసం కలిసి కట్టుగా పోరాడి దేశాన్ని కాపాడుకుందాం. దేశం అంటే మనమే శ్రామికులమే అని చాటి చెబుదాం. యురేనియం తవ్వకాలను ప్రతిపాదన దశలోనే అడ్డుకుందాం.

యురేనియం వ్యతిరేక పోరాటాలలో నల్లమల ప్రజల వెంట విద్యార్థి యువజనులు, ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాలు మేధావులు, కవులు రచయితలు, కళాకారులు కలిసినడవాలి. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీలు ఈ దాడిని ఆపటంలో ముందునిలవాలి.

No. of visitors : 428
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార సెప్టెంబర్ 2019

  దళిత భక్త కవి రవిదాస్‌ సంత్‌ ఆలయం కూల్చివేత హిందూ ఫాసిజంలో భాగమే
  The Destruction of Kashmir is a Deathblow to Democracy in India
  నల్లమల యురేనియం గని కాదు, జీవవైవిధ్య కేంద్రం
  అతడు ఆమె అడవి
  మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ
  కన్ ఫామ్... !
  బందిష్
  రాంగూడ ప్రాంతంలో సమిష్టితత్వం, సహకార పద్ధతి
  కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం
  కవులకు సమర స్ఫురణ

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •