అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ

| సాహిత్యం | క‌థ‌లు

అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ

- పలమనేరు బాలాజీ | 17.09.2019 08:46:21amకొన్ని కథల్లో అభివృద్ధికి సంబంధించిన సూచనలు ఉంటాయి, అభివృద్ధికి సంబంధించిన నిదర్శనాలు ఉంటాయి. చాలా కొన్ని కథల్లో మాత్రమే అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నించడం ,శోధించడం, సమీక్షించడం లేకపోతే ఏ విషయం కూడా పైపైన తేలిపోతుంది. ఎన్నో మంచి కథల ద్వారా ముఖ్యంగా గిరిజన సమస్యలపై స్పందించిన రచయితగా మల్లిపురం జగదీష్ తెలుగు సాహితీలోకానికి సుపరిచితులు. అతడు రాసిన ʹ డోలిʹ కథ సాక్షి ఫన్ డే 2018 జనవరి 8 న ప్రచురితమైంది ఈ కథ గురి కథా సంపుటి(2018)లో చోటు చేసుకుంది.
***
పరిస్థితి అర్థమైపోయింది... ఊరి జనానికి. శవాన్ని చాపలో చుట్టి కట్లు ఇర్రించి కట్టేరు. ఎప్పటిలాగే రెండు కర్రలకి డోలి ని సరిచేసేరు. శవాన్ని డోలి లోకెక్కెoచి హాస్పిటల్ దాటి రోడ్డు మీదికొచ్చేరు. ఎవరో మీడియాకు కూడా సమాచారం ఇచ్చినట్లు ఉంది. సెల్ ఫోన్ లతో కొంత మంది వెనకా ముందు నుంచి బంధిస్తున్నారు. వెనకనుంచి అరుపులూ నినాదాలు వినపడుతున్నాయి .

మలుపు తిరిగింది డోలీ.

నాలుగు రోడ్ల కూడలి.... ట్రాఫిక్ స్తంభించిపోయింది. అన్ని వాహనాలతో పాటు నడుస్తున్న డోలి కూడా ఆగిపోయింది. కారణాలు వాళ్ళకి తెలీలేదు. ముందుకు తలెత్తి చూసేరు. రోడ్డు మధ్యలో టెంట్లు వేసి ఉన్నాయి.

చాలామంది....

టెంటు నీడలో కుర్చీల ముందు నిలబడి....

కుడి చేయ్యిని ముందుకు చాపి నవనిర్మాణ దీక్ష చేపడుతున్నారు .

ప్రతిజ్ఞ మైకుల్లో ప్రతిధ్వనిస్తూoడగా...

డోలి దారి చేసుకుంటూ ముందుకు కదిలి పోయింది.

ఇదీ డోలీ కథ ముగింపు!

కథలో చెప్పిన విషయాలతో పాటు చెప్పని విషయాలు అనేకం పాఠకుడిని ఆకట్టుకుంటాయి, పాఠకుల్ని ఆలోచింపజేస్తాయి. మంచి కథ ఎప్పుడూ సంపూర్ణంగా మొత్తం చెప్పేయదు. ఎక్కడో కొంత ఖాళీ ఉండవచ్చు. కథల్లో కనిపించే ఖాళీలు ఆలోచింపజేస్తాయి.

ఈ కథలో ప్రారంభం గొప్ప వాతావరణ చిత్రణతో మొదలవుతుంది.

సాయంత్రం .. చిన్నారి పెళ్లి కూతురు కన్నీరు పెడుతున్న వేళ. సన్నగా చినుకులు మొదలయ్యాయి. కొండ మీద నుంచి పశువుల తో పాటు మనుషులు కూడా ఊరు చేరడంతో అలికిడి అప్పుడే మొదలైంది. నులక మంచాల కింద కుంపట్లు ఒళ్ళు విరుచుకుంటూ ఉన్నాయి.

ముసిలోల నోట అడ్డ పొగ అంటుకుని గుప్పుగుప్పున పొగాలొదులుతున్నాయి చుట్టలు. గడపల్లో మనుషుల మీద విషం చిమ్ముతోంది రంగుల వెలుతురు.

రంగుల వెలుతురు విషం చిమ్మటం లోని శ్లేష అర్థం కాక పోతే, అభివృద్ది పేరిట జరుగుతున్నదేమిటో, జరగాల్సింది ఏమిటో కథలో అర్థం కాదు. నవనిర్మాణ దీక్ష టెంట్లు రోడ్డు మధ్యలో వుండటం లోని అధికారదర్పం, ఆదర్శం, అభివృద్ది నినాదాల వెనుక వున్న వాస్తవాలు ఏమిటో తెలియకపోతే , ఈకథ లోని కథాంశం అందదు.

భారతదేశంలో స్థల కాలాలను బట్టి కులాన్ని బట్టి సామాజిక స్థితిగతులను బట్టి చావుకు అర్థం, విలువ మారిపోతూ ఉంటుంది. అంతో ఇంతో ఉన్నవాడి చావుకి ,గొప్ప వాడి చావుకి, పేదవాడి చావుకి, మధ్యతరగతి వారిచావుకి, నిర్భాగ్యులైన దళిత గిరిజన బహుజనుల చావుకి చాలా తేడా ఉంటుంది. బతికున్నప్పుడే కాదు చనిపోయినప్పుడు, చనిపోయిన తర్వాత కూడా మనుషులే కాదు శవాలు కూడా వివక్షతకు గురి అవుతాయి. అవమానాల పాలవుతాయి. నిరాదరణకు గురి అవుతాయి. చావులు, చావుల వెనకున్న వాస్తవాలు రేకెత్తించే ప్రశ్నలు సాధారణమైనవి కావు. మనిషిని, సమాజాన్ని ,రాజ్యాన్ని కడుక్కోవటానికి చావులు కారణమవుతాయి. ప్రేరణ కలిగిస్తాయి. చావులు ఊరేగింపులవుతాయి. . బ్రతికి ఉండగా మనిషి ప్రశ్నించలేని దానిని ఏమిటో , చావులు ప్రశ్నిస్తాయి. మనుషుల్ని, సమాజాన్ని ,ప్రభుత్వాన్ని, అధికారుల్ని మనుషులు ఆలోచింప చేయలేని చోట శవాలు ఆ పని చేస్తాయి. ఆలోచింపజేస్తాయి, స్పందింప చేస్తాయి, ప్రశ్నిస్తాయి, నిలదీస్తాయి. మార్పును కోరుతాయి, మార్పును డిమాండ్ చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మనిషికన్నా శవానికి విలువ ఎక్కువ.

వాంతులు విరేచనాలు కావడం వల్ల మనుషులు చనిపోరు. ఒక మాటలో చెప్పాలంటే జబ్బుల వల్ల ఎక్కువ మంది చనిపోరు. సరైన ఆహారం లేకపోవడం , వైద్యం సకాలంలో సక్రమంగా అందక పోవడమే చాలా చావులకు కారణం. పాఠకుల్ని ఆకట్టుకునే ఆడంబరాలు, ప్రయత్నాలేవీ ఈ కథలో కనపడవు. ఇక్కడ ఆకట్టుకోవటానికి ఏమీ లేదు. ఆదర్శాలు వల్లించడం లేదు. కేవలం నిజాన్ని నిజాయితీగా చెప్పడం మాత్రమే ఉంది. పట్టణాల్లో విద్యాధికులైన మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో, ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉండగలరో ఈ కథలో చూస్తాం. ఎన్ని రకాలుగా చూసినా ఈ కథ మొత్తం చావుల పరంపర గురించే. పైకి చూడడానికి జబ్బుతో వైద్యం అందాక చనిపోతున్న ఒక గిరిజన కుర్రాడి గురించి కాదు. కొంచెం కొంచెం మరణిస్తూ చావుకు దగ్గరగా ఉన్న సమాజం గురించి . అవును సమాజం ఇప్పుడు మరణానికి దగ్గరగా ఉంది. మరణిస్తున్న సమాజాన్ని వదిలేయకుండా బ్రతికించుకోవడానికి కొందరు చేస్తున్న ప్రయత్నం గొప్పది.

ఈ కథలో అలాంటి వాళ్ళు వున్నారు. ఆసుపత్రి లో శవానికి వాహన సౌకర్యం కల్పించలేని డాక్టరు నిర్లక్ష వైఖిరిని ఒకతను ప్రశ్నిస్తాడు.

గిరిజన సమూహాల గురించి, గిరిజన సమాజాల గురించి, గిరిజనుల దుస్థితి గురించి, గిరిజనుల ఆక్రందనలు ,ఆకలి గురించి పోరాటాల గురించి బతకాలనే బ్రతికి తీరాలని వారి తపన, జీవన పోరాటాల గురించి నడవడానికి దారి లేని కొండ ప్రాంతం గురించి, రోడ్డు లేని అడవి గురించి, వంతెన లేని వాగు గురించి, ఎంత ప్రాణాపాయ పరిస్థితి లో ఉన్నా దరి చేరలేని 108 వాహనం గురించి, ఫోన్ లో తప్ప వైద్యం చేయలేని, నిరంతరం గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో అందుబాటులో లేని వైద్య సిబ్బంది గురించి, కనీసం రోడ్డు సౌకర్యం లేని ఆ గిరిజన గ్రామంలో , అత్యవసర పరిస్థితుల్లో మనిషిని బ్రతికించుకోవడానికి సరిపడా మందులు సైతం లేకపోవడం గురించి, పక్క లో ఉన్న సంత తప్ప - ఆ పక్కనే ఉన్న పట్నం ముఖం చూడని ఒక గిరిజన తల్లి గురించి , డోలి కట్టి చావు బతుకుల మధ్య ఉన్న ఆ కుర్రాడిని ఎలాగైనా కాపాడుకోవాలనే ప్రయత్నంతో చదువుకున్న ఒక గిరిజన కుర్రాడు నలుగురు కుర్రాళ్ళు ఒక ఊరిని ఏకం చేసిన చైతన్యం గురించి, జోరుగా కురుస్తున్న వానలో కొండ ప్రాంతంలో అడవుల్లో ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేసిన నలుగురు గురించి ,ఆసుపత్రిలో కుర్రాడి మరణాన్ని ధృవీకరించిన తర్వాత శవాన్ని తీసుకు వెళ్ళటానికి అంబులెన్స్ లేదని తుప్పు పట్టిపోయి మూలన పడి ఉన్న కదల్లేని పరిస్థితిలో ఉన్న అంబులెన్స్ గురించి ఈ కథ చెబుతుంది.

ప్రజల అవసరానికి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడాలన్న అంబులెన్స్ తుప్పు పట్టి పోయి కదల్లేని పరిస్థితిలో ఉండటం ఈ కథలో లో బహుశా రాజ్యానికి , పాలనా వ్యవస్థకి ప్రతీక కావచ్చు. అంబులెన్స్ కు మరమ్మతు చేయించాల్సి ఉంది. వినియోగంలోకి తీసుకు రావాల్సి ఉంది. ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా సంస్కరించాలి ఉంది.

సంస్కరణలు తెల్ల కాగితాల పైన కాకుండా , ఆచరణలో అమలు జరగాల్సిన పరిస్థితిలో ఉన్నాం. సంస్కరణలు కావాల్సింది అమలయ్యే చోట మాత్రమే కాదు. బహుశా నగరం మధ్యలో నవనిర్మాణ దీక్ష శిబిరం ఇందుకు ఒక ఉదాహరణ. జరగని, జరగాల్సిన అభివృద్ధి గురించి చెపుతుంది ఈ కథ. జరిగిన అభివృద్ది మనిషి ప్రాణాల్ని కాపాడలేకపోవడాన్ని చెపుతుంది. . ఒకడు మరణిస్తే శవాన్ని తీసుకు వెళ్ళటానికి ప్రభుత్వ సహాయం అందని పరిస్థితుల్లో ,ఏమి చేతకాని పరిస్థితుల్లో సాటి మనుషులు డోలి కట్టి భుజాల మీద శవాన్ని ఒక ఊరేగింపుగా తీసుకు వెళ్ళటం ఒక భీబత్స వాతావరణాన్ని సూచిస్తుంది.

సమాజ ప్రయాణం లో కనిపించే ఒక ప్రమాదకరమైన సూచిక ఈ కథ .రోడ్డుమీద మలుపుల్లో ప్రమాదాన్ని సూచించే సూచికలు అక్కడక్కడా ఉంటాయి. ఇక్కడ మలుపుల్లో మాత్రమే కాదు, దారిపొడవునా ప్రమాదాలే. దారిపొడవునా కనిపించని ప్రమాద సూచికలే.!ప్రమాదాల్ని ముందుగ చెప్పాల్సిన సమాజ శాస్త్ర వేత్తలు రచయితలే.

ఒకవైపు దేశానికే తలమానికంగా హైటెక్ సిటీని చెప్పుకునే చోట, అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం అని చెప్పుకునే చోట ,ఇంకా వైద్యానికి నోచుకోని కనీస సౌకర్యానికి నోచుకోని, రోడ్డు వసతికి నోచుకోని ,వాగుపై వంతెనకు నోచుకోని నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక గిరిజన గ్రామo కథ ఇది. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అందని అడవి ప్రాంతాల కథ ఇది.

అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతున్నాం కానీ , ఇక్కడుండే గిరిజన గ్రామాల్లోకి వెళ్లలేక పోతున్నాం. పౌష్టికాహార లోపం వల్ల మరణిస్తున్న తల్లులు, బిడ్డలు, వాళ్ల మరణాలు సమాజాన్ని ప్రశ్నిస్తాయి. అందరికీ సమానంగా ఆహారం విద్య వైద్యం వసతి కనీస సౌకర్యాలు లేకపోవడం గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం ఒక భయానక వాతావరణాన్ని సూచిస్తుంది.

జ్వరం వస్తే మరణాలు. వాంతులు-విరేచనాలు అయితే మరణాలు. జబ్బుపడితే మరణాలు. ఈ పరిస్థితుల నుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, అధికారుల పైనా ఉందని ఈ కథ చెబుతుంది.

చావులకు పేదరికం కారణం కాకూడదు . గొప్ప భవనాలు ఆధునిక సాంకేతికత కంప్యూటర్లు అంతరిక్ష ప్రయాణాలు ,ప్రయోగాలు, పరిశోధనలు, కృత్రిమ మేధస్సు తయారీ, ఆధునిక వసతులు, అత్యాధునిక రైళ్లు ఇవన్నీ ఒక వైపు. నడవడానికి దారులు, వాగులు దాటడానికి వంతెనలు,చేయడానికి పని , తినటానికి తిండి, అవసరమైనప్పుడు అందని వైద్యం లేని అందని గిరిజనులు మరో వైపు.

తిండి లేక, పోతున్న ప్రాణాల్ని కాపాడ్డానికి డాక్టర్లు లేక, బ్రతకడానికి మందులు లేక అడవుల్లో కనీస అవసరాలు ,సరైన ఆహారం లేకపోవటం వల్ల ఏర్పడే గిరిజనుల చావులన్నీ ఆకలి చావులే.

ఈ కథలో ఒక గిరిజన కుర్రవాడు సరైన తిండి లేక , సకాలంలో వైద్యం అందక మరణించడం, వైద్యం కోసం వెళ్ళటానికి వాహన సౌకర్యం, రోడ్డు సౌకర్యం లేక మరణించడం, సకాలంలో మెరుగైన వైద్యం అందక మరణించడం, చికిత్స చేసే సమయంలో మనిషిలో ఉండాల్సిన కనీస నీటి శాతం తగ్గి మరణించడం, ఇక్కడ ఈ మరణం ఒక్క గిరిజనుడి మరణం మాత్రమే కాదు. మొత్తం సమాజపు మరణం!

మనల్ని మామూలుగా ఉండనీయని మంచి కథల్లో ఈ కథ ఒకటి. అంతా బాగున్నాం అభివృద్ధి సాధించేసాం అనుకొనే వారికి కథ ఒక కనువిప్పు. కథగా రాసినా నవలకున్నంత విస్తృతి ఉన్న కథాంశం ఇది. ఏమరపాటుకు, భ్రమకు గురవుతున్న ప్రజలను ఒక చురక వేయడం ద్వారా ఉలిక్కి పడేలా చేసి ఇదీ సత్యం, ఇదీ పరిస్థితి, ఇదీ వర్తమానం అని చెబుతూ,మరణిస్తున్న సమాజం గురించి, సమాజం యొక్క అనారోగ్యాన్ని గురించి హెచ్చరించే ఇలాంటి కథలు ఆరోగ్యకరమైన కథలు.
నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారిన కొంతమంది అధికారుల్లో, వ్యవస్థలో రావాల్సిన మార్పును ఈ కథ చెపుతుంది. ప్రాణాపాయకర పరిస్థితుల్లో అత్యవసర ముందుల్లాoటి.. కథలు సమాజాన్ని బ్రతికించుకోవడానికి అవసరపడుతాయి.

No. of visitors : 240
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

బ్రతికించే మాట ఒకటి కావాలి

పలమనేరు బాలాజీ | 17.03.2019 09:34:29am

నేనొక సమూహం కావటానికి నాకు ఒక మనిషి ,మాట ,మనసు కావాలి . మనసున్న మనిషి మాట్లాడే మాటొకటి కావాలి ఉదయమో ,సాయంత్రమో, రాత్రో నన్ను బ్రతికించే మాటొకటి కావాలి....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
  విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
  అరుణతార అక్టోబర్ 2019
  మనమూ తేల్చుకోవాల్సిందే
  ఏవోబీ నెత్తురు చిందుతోంది
  అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ
  ఎవరామె?
  స్వైర విహారం
  హిందూత్వసాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా సాంస్కృతిక ప్రతిఘటనా దినాన్ని జరుపుకుందాం
  నీకు నేనంటే కోపమెందుకు ?
  రేయి బంగారు మధుపాత్రలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •