దండకారణ్య సాహిత్యోద్యమం - ఒక పరిచయం

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

దండకారణ్య సాహిత్యోద్యమం - ఒక పరిచయం

- దండకారణ్య రచయితలు | 02.10.2019 08:51:28am

(యాభై వసంతాల విరసం సాహిత్యంలో అజ్ఞాత సాహిత్యం, అందునా దండకారణ్య సాహిత్యం అతి ముఖ్యమైన పాయ. మొత్తంగానే తెలుగు సాహిత్యంలోకి కొత్త జీవితాన్ని, అట్టడుగు ప్రజాపోరాటాన్ని అత్యంత కళాత్మకంగా దండకారణ్య రచయితలు అనేక రూపాల్లో తీసుకొస్తున్నారు. ఒకప్పుటి ʹదండకారణ్య రచయితలుʹ ఆ తర్వాత ʹచేతనానాట్యమంచ్‌ʹ పేరుతో భారతదేశంలోనే అతి పెద్ద సాహిత్య సాంస్కృతిక సంఘంగా దండకారణ్యంలో కొనసాగుతోంది. విరసం పాతికేళ్ల సభల సందర్భంలో దండకారణ్య రచయితల పేరుతో ఈ రచన వచ్చింది. అందులోని కొన్ని భాగాలు ఇక్కడ ఇస్తున్నాం. ʹవిరసం50 ప్రత్యామ్నాయ రాజకీయాలుʹ అనే ఈ శీర్షిక కింద విరసం.ఓఆర్జీ దండకారణ్య సాహిత్యోదమ విశ్లేషణలతోపాటు కొన్ని ముఖ్యమైన గత రచనలను కూడా అందిస్తుంది. సంపాదకవర్గం)

1977 తర్వాత ఉత్తర తెలంగాణాలో కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కొలిమంటుకుంది. పల్లెలు కదిలాయి. రైతాంగం నడుం బిగించింది. తరతరాల భూస్వామ్యం సహించలేదు. మందమర్రి మాధవ్‌ రావు వేలాది ఎకరాల భూస్వామి లొత్తునూరు రాజేశ్వరావు, ఉప్పుమడిగె రాజేశ్వరావు, చిన్న మెట్టుపల్లి జగన్మోహన్‌ రావు, రేచపల్లి వెంకట్‌ రెడ్డి ఇలా ఒక్కొక్కడు ఊరికి, పల్లెకి దొరలు.

దొరతనానికి గండి పడింది. దొరల గడీలకు తాళాలు పడ్డాయి. దొరల వాకిళ్ళు వెల వెలా పోయాయి. దొరల భూములు బీళ్ళు పడ్డాయి. మింగుడు పడని దొరలు పట్నం ʹసర్కార్‌ʹ పక్కలో చేరారు. అక్కడివారూ దొరలే. దొరలు దొరలు కలిశారు. మీటింగులు చేశారు. తెలంగాణా పల్లెల్లో అగ్గెట్ల పడ్డదన్నారు. నెహ్రూ సైన్యాలు నాటి తెలంగాణా బీజాలను ఇంకా వేళ్లూడ పీకలేదనీ ఆ రెడ్డి వెలమ దొరల సర్కార్‌ ఓపక్క నెహ్రూను, మరో పక్క నైజాంను నిందించాయి. ఈ పాపాలకి బీజాలు చరిత్రలో చూశారు. నిజం - అదే వాస్తవం. నేటి చరిత్రను తెలుసుకోవాలంటే నాటి పాపాలను తవ్వడం తప్పదు.

దండు కదిలిందిరా జంబాయి రే, కూలి గుండె రగిలిందిరా జంబాయి రే! ఊరూరూ కదిలింది జంబాయి రే, అంటున్న రైతుల ఉత్సాహానికి అవధులు లేవు. పల్లెలెట్లా కదలుతున్నయంటే, అరే వహ్వరే! భళి భళి! సిరిసిల్ల, జగిత్యాల, చిన్న మెట్టుపల్లి, లొత్తునూరు, మద్దునూరు ఆంటూ ఓ పల్లె మరో పల్లెను చూసింది. ఇల్లు మరో ఇల్లును చూసింది. ఓ అన్న మరో రైతన్న ను చూశాడు. ఓ తల్లి ... ఇలా ఇన్నాళ్ళు దొర, దొరసానుల పాపాలను, కోపాలను మౌనంగా భరించిన ఆ పల్లె పేదజనం ఈ రోజు నవ్వుతున్నారు. నేడు పండుగలు చేసుకుంటున్నారు. చరిత్ర ఇలా ఇలా పునరావృతమవుతుందని ఊహించని దళితన్నల ఇళ్ళల్లో బడిపిల్లగాండ్లు (గవాళ్ళే ʹసార్లుʹ) చేతులు కడుగుతుంటే ఆ దిక్కు మొక్కు లేని జనం గుండెల్లో గుసగుసలాడే ఆ భాషలే మూగభావాలను ఏ కలమూ తర్జుమా చేయలేదు.

ఆ ఎట్టి బతుకులు, ఆ మట్టి బతుకులు, దండుగలు చెల్లించి, దడావతులు పెట్టి, బైటక్‌ లు కట్టిన పేద బతుకులు దొరపిలిచిననాడు గడీలోకి, వాడి పడగ్గదిలోకి పోని వారెవరై నా దొర ముందు గులాముగా, నోరున్న మూగ జీవరాశిలా మనగలగని వాడెవడైనా దండుగలకు తలవంచడమో, గడికి ʹబలిʹ గావడమో తేల్చుకోవాలి.

ఆనాటి పల్లెల పోరాటాలకు కేంద్రం జగిత్యాల. ఆ పల్లెల్లో కేంద్ర నినాదం ʹదొరలకు అగ్గి నీళ్ళుబంద్‌ ʹ (సాంఘిక బహిష్కరణ). అదే ఆ రైతుల కానాడు ఆయుధం. ఆనాటి జగిత్యాల జైత్రయాత్ర వారి జీవితాల్లో, ఉద్యమ చరిత్రలో మైలురాయి.

జగిత్యాల పోరాటంతో తెలుగు సాహిత్యం మరింత వేడి ఎక్కింది. ఆ రైతాంగ ఉద్యమంలో తానై సాహిత్యసృష్టి జరిగిందానాడు.

ఏలినవారు సహించలేకపోతున్నారు. వారి కోపం, వారి అట్టహాసం విధాన సభలో చట్టాలు చేస్తూనే పోయింది. ఫలితం సిరిసిల్ల, జగిత్యాల్లో కల్లోలితమంటూ ʹగోలʹ పెరిగింది. జైళ్ళు నోళ్ళు తెరిచాయి. ఖాకీరక్కసులు హెడ్‌ క్వార్టర్స్‌ వదిలారు . తుపాకుల బూజు దులిపారు. వాహనాలు పల్లెలు చేరాయి. వారితో ప్రత్యేక క్యాంపులు వెలిశాయి . దొరలను పున:ప్రతిష్టించడానికి ʹపట్నం పెద్ద మనుషులుʹ అన్ని తీర్ల సిద్ధపడ్డారు. అయితే, వారికి ʹశవాలుʹ స్వాగతం చెప్పాయి. ఖాళీ గడీలు హారతులు పట్టాయి. అదిరిన గుండెలతో, వణికే ధోతులు పల్లెలొద్దన్నాయి. పట్నాల్లోనే మా మొఖాం అన్నారు. పల్లెకు జై కొట్టి పట్నం కదిలిపోయారు. పల్లెల్లో పోలీసులు - పట్నాల్లో దొరలు దొరగడీలు రైతుల ఊచకోత కేంద్రాలయ్యాయి.

ఉద్యమాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం తక్షణం ముందుకు వచ్చింది. జగిత్యాల సందేశాన్ని మారు మూలలకు, మరెన్నో పల్లెలకు, చుట్టూ ఉన్న అడవికి అందించాలని పార్టీ పిలుపునిచ్చింది. పెద్దపల్లి, మంథని, హుజురాబాదులేగాదు. పరకాల, జనగాం, కామారెడ్డి, సిరిసిల్ల, భద్రాచలం, సింగ రేణి, లక్సెట్టిపేట, ఖానాపూర్‌ , సిర్పూర్‌లతో పాటు గోదావరి - రైలు రోడ్డు మధ్య ప్రాంతం- అదే దండకారణ్యం అనే లక్ష్యంతో పార్టీ కార్యకర్తలు కదిలారు.

తలకు టోపీలు, అలీవ్‌ గ్రీన్‌ డ్రెస్సులు. భుజాలకు తుపాకులు . వీపులకు కిట్లు. కార్యకర్తలు కదిలారు. దళాలు ఏర్పడినాయి - పల్లె పల్లెన పోరు బాటలు, ఎర్రని శ్రీకాకుళాలు నాడు అక్కడ రగిలి రగిలి నేడు ఇక్కడ మండుతున్నవి. ఇది మా ఆడవికి పయనం.

తల్లి గోదావరి మమ్మల్ని ఆహ్వానించింది. తుడుం మోత ఇంద్రవెల్లి పరిచయం చేసింది. ప్రాణహిత, ఇంద్రావతులు తమతోనే రా, రమ్మన్నాయి. పెన్‌ గంగలు, వైన్‌ గంగలు శబరి, సీలేర్లు పల్లె పల్లెను పరిచయం చేస్తామని బాస చేశాయి.

భారత నూతన ప్రజాతంత్ర విప్లవాన్ని ఈ దేశంలో జయప్రదం చేయాలనుకున్నాం. నదులు దాటాం. రాష్ట్రాల సరిహద్దులు చెరిపేశాం. భాషా భేదాలు మాకు లేవన్నాం. కొండకోనల్లోకి, అడవితల్లి ఒడిలోకి వచ్చి వాలాం. అడవి సంపదలు చూశాం. అడవన్నలను చూశాం. మమ్మల్ని చూస్తేనే పరుగులెత్తేవారి బెదురు బతుకులు చూశాం. వారి గుడిసెల్లో చూశాం. వారి గూడాల్లో తిరిగాం. వారి గుండెల్ని చదివాం. అదో లోకం - వారిదో ప్రపంచం -

ఇరవై నాలుగ్గంటల వ్యవధి లేకుండానే ఆ ప్రపంచాన్ని నెత్తురిచ్చి తెలుసుకోవలసి వస్తుందని ఊహించలేదు. నునువెచ్చని నెత్తుర్లిచ్చి అడవితల్లిని ఎరుపు చేస్తామని ఊహించలేదు - మాలోని వాడు, మాతోటివాడు మా పెద్ది శంకర్‌ మహారాష్ట్ర పోలీసుల తూటాలకు బలై నాడు.

బాస చేసిన నదులు మూగపోయినాయి. రా రమ్మన్న ప్రాణహిత ఎరుపయ్యింది. తల్లి గోదావరి చిన్న బోయింది - అడవి అడవంతా చిన్నబోయింది. కొండలు, గుట్టలు తలలు వంచాయి. గోండన్నలు గొల్లుమంటే, ఆంధ్రలోకం బోరుమంది. దళాలు కిరియ (ప్రతిజ్ఞ) చేశాయి. కామేడ్‌ పెద్దిశంకర్‌కు విప్లవజోహార్లు ఆన్నాయి. ఈ దేశంలో ప్రజాతంత్ర విప్లవాన్ని జయప్రదం చేయడానికి తమ అసువులు అర్పించిన వీరయోధులందరికీ ఎర్రెర్ర దండాలంటూ, కత్తి-కలం పట్టి పోరాడి తృణప్రాయంగా తమ ప్రాణాలర్పించిన మా ప్రజాకవులకు లాల్‌ లాల్‌ సలాం అంటూ దళాల కృషి ప్రారంభమైంది.

అలా అలా ఈ అడవిలో గత 12 ఏళ్ళుగా పని చేస్తున్నాం . ఆదివాసి రైతాంగంతో మమేక మవుతున్నాం. పోరాటాల్లో వారిని కదిలిస్తున్నాం. వారి నుండి నేర్చుకుంటున్నాం. మాకు తెలిసింది వారికి చెప్పుతున్నాం. ఈ దోపిడి సమాజాకుకి గోరికట్టాలని వారికి పిలుపునిస్తున్నాం . పాట రూపంలో, కవితల్లో, కథల్లో, నాటకాల్లో, నవలల్లో, వ్యాసాల్లో మా ఆందోళనను ఆదివాసీలకు అందిస్తూనే ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం .

దండకారణ్యంలో పని చేస్తున్న మాలో నిజానికి సాహిత్యంపై పట్టుతో, సాహిత్యంతో గాఢ సంబంధాలుండి నన్నయ్య నుండి విశ్వనాథ వరకు తెలసిన వారెవరు లేరు. ప్రేమ్‌చంద్‌ గూర్చి తెలసినవాళ్ళు, అడవి బాపిరాజును చదవిన వాళ్ళు, చలం సాహిత్యాన్ని అభిమానించిన వారు కారెవరు.

శ్రీ శ్రీ గేయాలతో, గద్దర్‌, వంగపండు పాటలతో, విరసం రచయితల ఉపన్యాసాలతో ఉత్తేజితులై కదలిన వాళ్ళు , గ్రామాల్లో దొరల దోపిడిని అనుభవించిన రైతాంగ యువకులు కొందరైతే, కాలేజీ చదువులొదిలి , పోరాట పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిన బడిపిల్లలు మరికొంత మంది. ఇంద్రవెల్లి తుడుం మోతతో, కమలాపూర్‌ క్రాంతిబాటలో బస్తర్‌ పిస్తోల్‌ మోతతో, చత్తీస్‌ఘర్‌ చిరుమంటతో, బాలఘాట్‌ వరకు బారులు తీస్తున్న గిరిజనోద్యమంలో ఎంతోమంది గిరిజన యువకులే ఈ 12 ఏళ్ళ కాలంలో కవులయ్యారు. కళాకారులవుతున్నారు. ప్రజల కోసం రచయితలవుతున్నారు. ఉద్యమ అవసరాల కోసం గాయకులవుతున్నారు.

ప్రజల్లో ఉండి ప్రజల కోసం పని చేస్తున్న మా ప్రజా సైన్య సాహితీ సైనికులకు నిధి ప్రజల్లోనే ఉంది. మా ప్రజల్లో ఎంతో విలువైన సాహిత్యం ఉంది. ప్రజల్లో పాట ఉంది. ఆ ప్రజల్లోనే ఆట ఉంది. వాళ్ళల్లో డోల్లు, డప్పులున్నాయి. కాలికి గజైకట్టి ఆడ - మగ తెలతెలవార్లూ ఎగిరే (నృత్యం) సాంప్రదాయం ఉంది. అడవిలో ఖేల్‌ (నాటకం) ఉంది. అడవిలో ʹడెంసాʹ ఉంది. అడవిలో ʹజులువాʹ ఉంది. ఈ రెండూ నృత్యరూపాలే. ఇవన్నీ మమ్మల్ని ఎంతగానో కదిలించాయి. వాటన్నింటిలో ఆదివాసుల బాధ ఉంది. ఆ వినోదంతోనే వారి ఆనందం ఉంది. బతుకు తీపి జ్ఞాపకాలు - చేదు అనుభవాలు రంగరించి ఉన్నాయి. రాజుల నుండి నేటి రాబందుల రాజ్యం వరకు పీడిస్తున్న వర్గాలపై స్పష్టమైన కసి, కోపం వాటిల్లో వెల్లడవుతుంది. అంతే ! అందులో లేనిది ఏదో మాకు తెలిసింది. అమాయకులైన గోండులు ఎక్కడ తడుము లాడుతున్నారో అర్థమయ్యింది. తోవ తప్పిన బాటసారుల్లా వారు మార్గాన్వేషణలో ఉన్నారకు తేలింది. అగ్నికి ఆజ్యం తోడైంది. పాట రాజుకుంది. ఆడవి అంటుకుంది. జననాట్య మండలి అడవిలో తన సందేశాన్ని వినిపించింది. అంతటితో అవసరాలు తీరిపోలేదు. పునాదులు మాత్రం స్థిరపడ్డాయి.

లోతట్టు అడవిలో తెలుగు పాట పని చేయడం లేదు - తెలుగు వస్తువుతో వారికి పనిలేదు. విస్తరణలో ఈ సమస్య ఎదురైంది. అప్పటివరకు దాదాపు రెండేళ్ళు తెలుగుతోనే అన్నీ నడిచేవి...ఆ రెండేళ్ళు తెలుగు పాట ఎంతో సహకరించింది. కాని క్రమక్రమంగా భాష నేర్చుకోవలసి వచ్చింది - మా భాష తెలియని, మాకు తెలియని సంస్కృతితో, ఆదివాసి సాంప్రదాయాలతో అదో లోకంలో నివసిస్తున్న ఆ ప్రజలకు మా రాక, మా పాట, మా మాట వినిపించాలి. ఏ గూడెం వెళ్ళినా, ఏ ఇంటి కెళ్ళినా , ఏ దాదతో మాట్లాడినా, ఏ బాయికు (స్త్రీ) పలకరించినా బోర్‌?(ఎవరు) ఆంటారు. బారామొ (ఏమో) అంటారు. అప్పటికి పాటలు రాసిన అనుభవం మా దండకారణ్యంలో పెద్దగా ఎవరికి లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో పాటకు మా ప్రజా సైన్యం కళాకారులు, రచయితలు, కవులు ప్రాణం పోశారు. తెలియని ఆ గోండు భాషలోని ప్రతిపదాన్ని తర్జుమా చేయడానికి ఆ నాటి మా సహచరులు అనుభవించిన అవస్థ ఇవాళ మాకు తీపి అనుభూతులుగా తిరిగి తిరిగి స్పురణకు వస్తున్నాయి. మొదట ఆదిలాబాద్‌ గోండు భాషలోకి జననాట్యమండలి పాటలను రచయిత ʹసాహుʹ అనువాదం చేసి గిరిజన భాషలో అనువాద ఒరవడికి పునాది వేస్తే, ఆ తర్వాత చాల మంది అనువాదాలు చేశారు. అలా మొదట అనువాద పాటలనే మేం ప్రజలకు అందించాం. ఆ తర్వాత క్రమంలో పాట మార్పు కోరింది. స్థానిక ఆదివాసీ పాటలు మాకు అర్థమవుతున్న క్రమంలో ఆ బాణీలను వారి నాడిని దొరకబుచ్చుకోవలసిన అవసరం చాలా తీవ్రంగా ముందుకు వచ్చింది. మా అనువాద పాటలు విని వారు ఆనందిస్తున్నారు తప్ప, వాటిని సొంతం చేసుకోవడం లేదకు. రోజు రోజుకు ఆర్థమవుతున్న కొద్దీ మాలో ఆందోళన పెరుగసాగింది. వారి బాణీల్లోనే వారి వస్తువును వారికి అంద జేసినపుడే వారికి న్యాయం చేసిన వాళ్ళమవుతామన్న అభిప్రాయం మాలో కలిగింది. ఆదివాసీ ఉత్పత్తి విధానంలో(mode of production) స్థిరమైన వ్యవసాయానికి ఇపుడిపుడే అలవాటు పడుతున్న క్రమంలో ʹరిలోʹ అంటూ మహిళలు, ʹరెలోʹ అంటూ పురుషులు గొంతెత్తి శ్రావ్యంగా పాడే పాటల్లాగ మా పాటలుంటే గానీ పాట ప్రజల పరం కాదకు తెలిసి వచ్చింది.

వారు పాడే ప్రతి పాటలోను స్త్రీ- పురుషులు మా దళాలను వారి బాగుకోసం వచ్చిన వాళ్ళుగా కీర్తించేవారు. ఆ భగవంతుడే మమ్మల్ని పంపినట్లుగా వారు ఆ పాటల్లో బలంగా చెప్పేవారు. వాళ్ళను విడిచి పోకూడదనీ, ఇన్నాళ్ళు వారికోసం ఎవరూ లేరని వేడుకునేవారు - మా దళాల కష్టాలను వాళ్ళ పాటల్లో ఆ ప్రజలు ఎంతో నేర్పుగా వివరించేవారు. వారి అవస్థలన్నింటిని చెప్పేవారు.

చిలోరొ చలోరోమ్‌ రేరేలోమ రెల రెల
ఒంది వెదురు నడ్కి తెకి చిలోరో చలోరోమ్‌
సౌరూప్‌ యా ఏకంతోగ్‌

గేదె ఇన్విరి మెట్ట ఇక్వురి ,
డువ్వల్‌ ఇక్వురి బుర్కల్‌ ఇన్విరి చిలో రే చలోరోమ్‌

మా కట్టతున్‌ హూడిరి దాద
పేన్‌ లెక్క నా లిరి దాద
మాకున్‌ లిడ్చీసి హనుమట్‌ దాద
****

(తెలుగు)
చిలో రోమ్‌ చలోరోమ్‌ రే రేలోమ రెల రెల
ఒక్క వెదురు నరికితే చిలో రె చలోరోమ్‌
వందరూపాయలు దండగ

అడవి అనకుండా, గుట్ట అనకుండా
సింహాలనరు - పులులు అనరు

మా కష్టం చూస్తిరి ఆన్న
దేవుడి తీరు వస్తిరన్న
మమ్మల్ని విడిచి పోవద్దన్నా

ఇలా జట్లు జట్లుగా మౌఖిక సాహిత్యంతో వాద పతివాదాల రూపంలో లేదా చాలా సుదీర్ఘమైన పల్లవితో ఎత్తుకునే ఆ పాటల్లోని మెళకువలను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది.

అలా అలా మేం ʹరిలోʹ అన్నాం - మేం ʹరెలోʹ అన్నాం . (స్త్రీలు ఏ పాటనైనా రిలో తోనే ప్రారంభిస్తారు. పురుషులు రెలో అంటారు) స్థానికులైన యువతీయువకులు మాతో కలిశారు. వారు సహజ కవులు - వారి నెత్తురులోనే కవిత్వం పారుతుంది. వారి గుండెల్లోనే కమ్మని స్వరాలు గూళ్ళు కట్టుకున్నాయి. దండకారణ్యమంతటా డజన్ల కొద్ది పాటలు వెలుగు చూశాయి. ప్రజల ప్రతి పోరాటం మీద పాటలు వచ్చాయి.

ప్రజలనుండి, ప్రజా రచయితల నుండి ఎంతో విలువైన సాహిత్యం వెలువడి శతృ నిర్బంధాన్ని గేలిచేసింది. ప్రతి పాటకు ఒక కథ ఉంది. ప్రతి పాటకు ఎంతో అనుభవం ఉంది. ఈ పాటల వెనుక ప్రజల ప్రతి క్రియ, ప్రజల చరిత్ర ఉంది. ప్రతి పాట వెనుక ఆదర్శ మూర్తుల త్యాగాలు నిండి ఉన్నాయి.

ఉద్యమం మరింత ముందుకు సాగుతోంది. మరాఠి, హిందీ, ఒరియా ప్రాంతాలకు విస్తరిస్తోంది. అయినా ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఆయా భాషలే ఇప్పటికీ ఇంకా ప్రధానంగా ఉన్నాయి . ఉద్యమం వింధ్యా పర్వతం అంచుల్లోకి పోతుంది. రాఖేల్‌ పర్వత కనుమలను తాకింది. తూర్పు కనుమలను అరకులోయలు ఆహ్వానించాయి. ఈ విస్తరణలో ప్రజలముందు ʹʹసునో సు కో మెరె దేశ్‌ వాసియో, (వినండి ఓ దేశ ప్రజలారా) సునో మెరె సాధియో (ఓ మా మిత్రులారా) సునో మెరె వతన్‌ కెలాగోఉ (వినండి నా ప్రజలారా) సునో మెరె ప్యా రె సాధియో (వినండి ప్రియమైన మిత్రులారా) అంటూ ʹʹ ఒక రాగం హిందీలో ఆ ప్రజలకు మన పోరాటాల్ని వివరిస్తుంటే మరో బాణి మరాఠీలో ఆ ప్రజలకు విప్లవ సందేశాన్నందిస్తోంది .

ఇంతటి విలువైన పాటలు సృష్టించడం వెనుక మేం మరవలేని మా తోటి కామేడ్స్‌ త్యాగాలున్నాయి . వారు పాటలు రాయలేదు కావచ్చు కవితలు అల్లలేదు కావచ్చు. కథానికలు, కథలంటేనే ఆసక్తి లేకపోవచ్చు. సాహిత్యం వాసన అబ్బిన వారు కాదు కావచ్చు. కానీ వారికి ప్రజలతో లోతైన సంబంధాలున్నాయి . వారు ప్రజలను గొప్పగా కదలించారు. వారికి బతుకు వెతలు తెలుసు. కాయకష్టం తెలుసు. దోపిడీ పీడనలనను భవించారు. అందుకే తిరగబడాలన్నారు. తిరగబడ్డారు. తమ నును వెచ్చని నెత్తురుతో అడవితల్లికి అంకితమయ్యారు. ప్రజల గుండెల్లో దాగున్నారు.

ʹʹఅడవులు, కొండలు, గుట్టలు, నదులు, ఎడారులా మనకు అడ్డంకిʹʹ అన్న శ్రీశ్రీలు, కమ్యూలుస్టులం మేము కష్టజీవులం, ఆవునన్నా కాదన్నా అదే యిష్టులం, లంచాలకు తలవొగ్గం, మా ఆత్మను వంచించంʹ అని నినదించి ʹʹ శ్రమజీవుల రకంతో జెండానెగరేసాము మృతవీరుల ఆశలతో మునుముందు కే పోతాముʹʹఅని అంతిమ శ్వాస దాకా సాగిన పాణిగ్రాహులు కావాలీనాడు.

అడవిలో పాట ఎదుర్కొన్న కష్టాలు పాటతో మొదలైన అనుభవం, పాట ప్రజల పరమైన తీరు ఇది. ఈ రోజు పాట ఏ చారిత్రక అవుసరాన్ని తీర్చాల్సి ఉందో అందరం ఆలోచించాల్సి ఉంది. అడవి అందాల్ని , పారేటి సెలయేళ్ళను పొంగేటి జీవనదులను, ఎత్తయిన కొండల్ని , అందులో గూడు కట్టుకున్న ఆదివాసి జీవితాలను, అన్నల జీవితాలను ఇంకా ఎలా ఎలా దండకారణ్యం నుండి వెలువడిన కవిత్వంలో బంధించామో వివరిస్తాం. మా పాటలను ప్రజల్లోకి తీసు కెళ్ళడానికి, అదే సమయంలో ప్రజల నాడి దొరకబట్టుకోవడంలో మా సాయుధ రైతాంగ దళాల కృషి ఎంత ఉందో పైన వివరించాం. అలాగే మా కవిత్వాలను తెలుగు పాఠకలోకానికి అందివ్వడానికి విరసం మాస పత్రికైన ʹఅరుణతారʹ, ʹసృజనʹ, ఆర్‌. యస్‌. యు, ఆర్‌ వై ఎల్‌ పత్రిక ʹరాడికల్‌ మార్చ్‌ʹ, ప్రభాత్‌ (హిందీ) మొదలయిన పత్రికలు చేయూతనిచ్చాయి. నరటోర్‌, సమర్‌, నీలాబ్‌, అరణ్య, మైనా, అన్న, మడాలి, రాగో, దేవన్న , ఏలేర్‌, తాండవ సుబ్బన్న , దేవక్క, ఇంద్రావతి, రఘునాధ్‌, శివాజి, కెరటం, స్రవంతిల కలాలు ఎంతో స్పూర్తితో కవితాలోకానికి కవిత లందించాయి. అయితే ఈ ప్రక్రియ స్థానిక ప్రజల సాహిత్యంలో లేదు. ఇదొక ʹమారిన రచనా విలువల రూపాలʹ లోనికి వస్తుంది. దీకుతో స్థానిక ప్రజల సంబంధం తెలిపే విధంగా తెలుగు - హిందీ ప్రజలకు మాచే అందించబడింది. స్థానిక ప్రజల పోరాటాలను స్థానిక ప్రజల బతుకు తీరును అడవి నుంచి తెలిపే ప్రయత్నం చేశాం.

ఇంక కథ - గురించి దండకారణ్యంలో అనేక కథలు వెలుగులోకి వచ్చాయి. నేలతల్లి విముక్తి కోసం (తెలుగు), జమీన్‌ బంధన్‌ ము కీకే లియే (హిందీ) పుస్తక రూపంలో వెలువడిన తెలంగాణ కథలతో ఈ కథలు అల్లుకుపోయాయి. కొన్ని కథలు తెలుగులో తప్ప మరో భాషలో మా రచయితలు రాయలేక పోయినందుకు విచారిస్తున్నాం. మా కథలు అన్నీ కాకున్నా, కొన్నైనా ప్రభాత్‌ ప్రచురణల వారు హిందీలో తీయడంతో దండకారణ్య కథలు హిందీ ఆదివాసి ప్రజల్లోకి, హిందీ వచ్చిన జనాల్లోకి పోయాయి ..

కథలో పాత్రలను చిత్రించడం నిజంగా ఒక కళే. ఆ పాత్రలు సజీవంగా ఉండాలి. రచయితల భావాలనే కాకుండా పోరాట స్వభావాన్ని, ఉద్యమ లక్ష్యాలను, లక్షణాలను తెలిపే కథలో పాత్రలు సముచితంగా, సజీవంగా ఉంటేనే ఆ కథలో బలం ఉంటుంది. ప్రజలు ఆ కథల్ని చాలా ఉత్సాహంతో స్వీకరిస్తారు. ప్రోత్సహిస్తారు. చదువుతున్నంత సేపు పాఠకుడు పాత్రల్లో లీనమవుతాడు. ఈనాటికి కాళీపట్నం రామారావు, రాచకొండ విశ్వనాధ శాస్త్రిల కథలు ఎంతో విశిష్టత్వం కలగి ఉన్నవి. తెలంగాణ మాండలికంలో ʹʹఅల్లం అన్నదమ్ములుʹʹ రచనలు ఆ పల్లెల్లో భూస్వాముల కిరాతకాల్ని, పెద్దమనుషుల (గ్రామ దేవతల) నంగనాచి వ్యవహారాలు, రాజీ ధోరణులు రైతుల అవస్థలతో కూడి ఉండి రైతాంగం సంఘటితం అయ్యే వరకు ఎంతో అద్భుతంగా చిత్రించబడ్డాయి.

విప్లవ రచయితల్లోని కొందరు కథా రచయితలు నేటి వ్యవస్థను ప్రతిబింబించే కథలు తేవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా, నెత్తుర్లోడుతున్న తెలంగాణ మాగాణం పల్లెల్లో రగుల్కొన్న విప్లవాగ్నులకు, వీరోచిత త్యాగాలు చేస్తూ అసువులర్పిస్తూ సమధిలవుతున్న ప్రజల, విప్లవ కార్యకర్తల చరిత్రను అన్ని కోణాల నుండి విశ్లేషిస్తూ, ప్రతిబింబించేలా వాటికి కథా రూపం విస్తృతంగా ఇవ్వాలే వుంది. పోరాట పల్లెల్లో అడవి - మైదానాల్లో జరుగుతున్న అనేక మార్పుల్ని, ఉత్పత్తి సంబంధాల్లో, ఆర్థిక జీవితాల్లో వస్తున్న మార్పుల్ని , భూసంబంధాల్లో జరుగుతున్న పరిణామాలను గతితర్కానుగతంగా ప్రజల ముందుంచడం నేటి రచయిత కనీస కర్తవ్యం. ʹʹనేల తల్లి విముక్తి కోసంʹ పోరాట క్షేత్రం నుండి వెలువడినాయి... ఆ యుద్ధభూమిలోని ప్రజల పోరాటాలే అందులోని వస్తువు. విప్లవ వైతాళికులే వాటి సృష్టికర్తలు. వాటిల్లోని సాహితీ విలువలు, శైలి, శిల్పం మాట ఎలా ఉన్నా, ఉద్యమావసరాల్ని తీర్చడానికి అవి ఎంతో కొంత ఉపయోగ పడ్డాయనడం నిస్సందేహం.

దండకారణ్యంలోని అదిలాబాద్‌ గోండుల కోసం నిజాం బలగాలతో పోరాడి తమ ప్రాణాలర్పించిన కామ్రేడ్‌కొమరం భీంపై సాహుతో కలసి కామ్రేడ్‌ అల్లం రాజయ్య రాసిన కొమరం భీం నవల మొదటిది. ఆ తర్వాత వసంత్‌ దేశ పాండే గారు రాసిన ʹఅడవిʹ నవల కూడా అడవి జీవితాల పై ఆధారపడి రాసిందే. ఈ క్రమంలోనే ఆనందమోహన్‌ రాసిన మరో నవల ʹవసంత గీతం ʹ కూడ దండకారణ్య ఉద్యమం పై ఆధారపడి రాసిందే. ఈ క్రమంలో దండకారణ్య రచయితల నుండి వెలువడిన తొలి నవల - ʹఅడవిలో అన్నలు ʹ (ఈ నవలనే ʹసరిహద్దుʹ పేరుతో విరసం ప్రచురించింది.) అడవిలో పని చేస్తున్న దళాల గూర్చి బయటి ప్రజానీకానికి తెలపడమే ఆ నవల పరిధి. ʹఅరుణతార ʹ ఆ నవలను ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అడవన్నలతో ఆదివాసుల సంబంధాలు లోకానికి తెలియ చెప్పడమే అందులోని వస్తువు . అడవిలోని అన్నల గూర్చి శత్రువు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, దీనితో ఏర్పడిన భ్రమలను తొలగించడానికి చేసిన కృషి ఫలితమే ʹఅడవిలో అన్నలుʹ. ఆ తదనంతరం సాధన రాసిన మరో నవల ʹరాగోʹ సృజన ద్వారా తెలుగు ప్రజలకు అందించబడింది. దండకారణ్యం, తెలంగాణ ప్రేరణతో అనేక మంది రచయితలు తమ కలాలకు పదును పెట్టుకుంటున్నా నేటి విప్లవ అవసరాలకు ఆది సరిపోవడం లేదనే దండకారణ్య రచయితల సూచనను ఆలోచించాలని కోరుతున్నాం

No. of visitors : 874
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •