కులం - విప్లవోద్యమ అవగాహన, ఆచరణ - 1

| సాహిత్యం | వ్యాసాలు

కులం - విప్లవోద్యమ అవగాహన, ఆచరణ - 1

- రవి నర్ల | 02.10.2019 09:17:44am

నక్సల్బరీ పోరాట నిర్మాత, సిపిఐ ఎంఎల్‌ వ్యవస్థాపక నాయకుడు అయిన కామ్రేడ్‌ చారుమజుందార్‌ శత జయంతి సంవత్సరం ఇది. నక్సల్బరీ తిరుగుబాటు జరిగి ఇప్పటికి 52 ఏళ్లు. విప్లవ పార్టీలైన సిపిఐ (ఎంఎల్‌), ఎంసిసి లు ఏర్పడి 50 ఏళ్లు. విప్లవోద్యమం ఈ ఐదు దశాబ్దాలలో సాధించిన విజయాలను, ఎదుర్కొన్న ఆటుపోట్లను, అపజయాలను బేరీజు వేసుకుని మున్ముందు ఎదుర్కొన్నబోయే సవాళ్ళను, ఆ సవాళ్ళను అధిగమించే పద్ధతులను చర్చించుకోవాల్సిన సందర్భం ఇది.

విప్లవోద్యమం ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. దశాబ్దానికి పైగా గ్రీన్‌హంట్‌ పేరుతో, ఆ తర్వాత సమాధాన్‌ పేరుతో విప్లవోద్యమం పై బహుముఖ దాడులు జరుగుతున్న నేపథ్యంలో సాయుధ విప్లవాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లడం అతి కీలకమైన సవాలు, రోజురోజుకూ పెరుగుతున్న ఫాసిజాన్ని ఓడించడం మరో కీలకమైన సవాలు, ఐదు దశాబ్దాల క్రితం నక్సల్బరీ కాలం నాటికి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నెలకొని ఉన్న ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులలో, నాడు ఉండిన వైరుధ్యాలలో పెను మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో మైదాన ప్రాంత రైతాంగ ఉద్యమ నిర్మాణంలోనూ కార్మికోద్యమంతో సహా పట్టణ ఉద్యమ నిర్మాణంలోనూ ఎటువంటి పంథా, ఎత్తుగడలు చేపట్టి ముందుకు తీసుకెళ్ళాలనే విషయం- ఇవీ విప్లవోద్యమం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు. ఇందులో భాగంగా, గ్రామీణ, పట్టణ విప్లవోద్యమం నిర్మించే క్రమంలో మన దేశంలో విప్లవ పార్టీ, ఉద్యమం ఎదుర్కొనే నిర్దిష్ట సామాజిక సమస్య కుల సమస్య. దానిని ఎట్లా అధిగమించటం అనేది కూడా విప్లవోద్యమం ముందున్న మరో కీలకమైన సవాలు.

నక్సల్బరీ ఉద్యమ నేపథ్యంలో కుల సమస్యను గురించి, ఈ సమస్య పట్ల విప్లవోద్యమం అవగాహనా, ఆచరణలను గురించి ఈ వ్యాసంలో చర్చిద్దాం.

కుల సమస్య అనేది మన దేశానికే పరిమితమైన నిర్దిష్ట సామాజిక సమస్య. కులంతో పోలిన సామాజిక శ్రమ విభజన కొంతమేరకు మరికొన్ని ఆసియా దేశాల్లో కనిపించినా, భారతదేశంలో ఉన్నట్టుగా వ్యవస్థీకత నిచ్చెనమెట్ల అంతరాల వ్యవస్థ మరెక్కడా లేదు. దాదాపు నాలుగు వేల ఏళ్ళ క్రితం బీజ ప్రాయంగా వర్ణ రూపంలో మొదలైన ఈ అంతరాల వ్యవస్థ రెండున్నర వేల ఏళ్ళ క్రితం ఒక స్థిర రూపం సంతరించుకున్నది. అప్పటినుండి అది భారత సమాజపు ఆర్థిక రాజకీయ సామాజిక సంస్కృతిక క్షేత్రాలన్నింటికీ పట్టుగొమ్మలా పనిచేస్తున్నది.

ఈ నాలుగు వేల ఏళ్ళలో కుల వ్యవస్థ స్థూలంగా చెక్కు చెదరక పోయినా, కులాలలో మాత్రం కొంతమేరకు మార్పులు, చేర్పులు జరుగుతూనే వస్తున్నాయి.

కుల వ్యవస్థ పుట్టుకకు సంబంధించి స్థూలంగా చూద్దాం. ఆర్యులు తమ గణాలలో మొదట బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అనే మూడు వర్ణాల రూపంలో శ్రమ విభజన చేసుకున్నారు. వారు భారతదేశంలోకి వలస రావడంతో ఇక్కడి అనార్య, ద్రావిడ తెగలతో యుద్ధం చేసి ఓడించి వారిని శూద్రులుగా ఆర్య గణాలలోని మూడు వర్ణాలకు సేవ చేసే వారిగా లొంగ తీసుకున్నారు. ఈ తెగలలో బలమైన వాటిలోని కొన్నింటిలో తెగ నాయకులను, తెగ పూజారులను క్షత్రియ, బ్రాహ్మణ వర్ణాల్లో కలుపున్నారు. మిగిలిన వారిని శూద్రులుగా, తమ సేవకులుగా లొంగదీసుకున్నారు. లొంగని వారిని అసురులనీ, రాక్షసులనీ వర్ణించి సంహరించారు. పశు పోషక సమాజం నుంచి వ్యవసాయిక సమాజంగా మారిన క్రమంలో నాలుగు వర్ణాల శ్రమ విభజన నూతన సమాజ అవసరాలకు సరిపోలేదు. వందలాది కొత్త వృత్తులు ఏర్పడటం వందలాది ఆటవిక తెగలను క్రమంగా వ్యవసాయిక సమాజంలోకి కొంత బల ప్రయోగంతోనూ, కొంత ఇముడ్చుకోవడంగానూ చేర్చుకునే క్రమంలో వర్ణ వ్యవస్థ స్థానంలో వందలాది కులాలు అవతరించాయి. ఈ కులాలకు సైద్ధాంతిక ప్రాతిపదికనేర్పరచడానికి బ్రాహ్మణ స్మృతి కారులు పూనుకొని మనుస్మృతి మొదలుకొని ఎన్నో స్మృతుల రూపంలో కులాలను వర్ణచట్రంలో ఇమడ్చడానికి ప్రయత్నించారు. ఈ నాలుగు వర్ణాలతో పాటు వీరందరికీ బహిష్కృతులుగా అవర్ణులుగా, పంచములుగా- కొన్ని తెగలను లేదా తెగలలోని కొందరిని నేడు మనం దళితులుగా పిలుస్తున్న కులాలుగా లొంగదీసుకున్నారు.

క్రీస్తుశకం 4వ శతాబ్దం వరకు అవతరించిన భూస్వామ్య సమాజం నాటికి ఈ కుల వ్యవస్థ పూర్తిగా స్థిరపడిపోయింది.

అంతర్వివాహ పద్ధతి ఒక అనుల్లంఘనీయమైన నియమంగా రూపుదిద్దుకున్న కుల వ్యవస్థగా వృత్తుల శ్రేణులు, తెగలు మారక ముందే అందుకు ప్రాతిపదికగా పనిచేసిన శ్రమ విభజన ఉందనే విషయం ఈ పరిణామ క్రమాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు అర్థమవుతుంది. కులాలకు బ్రాహ్మణులు స్థూలంగా వర్ణవ్యవస్థ అనే చట్రం ఇచ్చినా ఆచరణలో ఉన్నది కుల వ్యవస్థ మాత్రమే. సమాజ అవసరాల కోసం ఏర్పడిన శ్రమ విభజనను సైద్ధాంతీకరించి నిచ్చెనమెట్ల కుల వ్యవస్థగా స్థిర పరచటమే బ్రాహ్మణవాదం చేసిన పని. ఇతర దేశాలలోని శ్రమ విభజనకు భారతదేశంలోని శ్రమ విభజనకు ఉన్న తేడా ఇదే. అందుకే ఇతర దేశాలలో లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఏర్పడింది.

శ్రామికులను నిలువు దోపిడీ చేయడానికి అత్యంత అనువైన వ్యవస్థగా రూపుదిద్దుకోవడమే గాక నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఒకరికంటే మరొకరు అధికులమనే భావన దోపిడీ వర్గాలకు రాజకీయంగా ఉపయోగపడేది కావడంతో కుల వ్యవస్థ భూస్వామ్య సమాజానికి ఆధారంగా పనిచేయడమే కాక బ్రిటిష్‌ కాలం నుండి పెట్టుబడిదారీ సంబంధాలు పెరుగుతూ వస్తున్నా నేటికీ నిలదొక్కుకునే ఉంది. మిగులును దోపిడీ చేయడంలో అమెరికాలో రంగు భేదం ఎట్లా పని చేస్తోందో, ఇంగ్లాండులో జాతి భేదం ఎట్లా పని చేసిందో అదే పనిని అంతకు ఎన్నో రెట్లు అధికంగా కులవ్యవస్థ మనదేశంలో చేస్తోంది. వ్యవస్థ పునాదిలో కులాలకు ఉన్న ఈ ఆర్థిక రాజకీయ కారణాల వల్లనే భారతదేశంలో ప్రగతిశీల మతాలుగా ఆవిర్భవించిన బౌద్ధ జైన మతాలు నిలదొక్కుకోలేక పోగా తదనంతర కాలంలో బయటి నుండి ప్రవేశించిన ఇస్లాం, క్రైస్తవ మతాల లోకి కూడా తరతమ భేదాలతో కులం ప్రవేశించింది. ఈ ఆర్థిక రాజకీయ కారణాలవల్లనే నాలుగు వందల ఏళ్ళకు పైగా తురుష్కులు, మొఘలుల వంటి ముస్లింలు ఈ దేశాన్ని పాలించినా ఆ పాలకులెవ్వరూ కులవ్యవస్థ పై పోరాటం చేయకపోగా దాన్నుండి లబ్ధి పొందడానికే చూసారు. సామాజిక సాంస్క తిక కారణాలతో పాటు వాటికి పునాదిలో ఈ ఆర్థిక రాజకీయ కోణాలు ఉన్నాయనే కోణాన్ని విస్మరిస్తే కులాల రద్దు కోసం చేసే పోరాటాన్ని కూడా సరిగా నడపలేం.

కులం పైన మార్క్సిజపు మౌలిక అవగాహన ఏంటో తెలుసుకోవడానికి మార్క్స్‌ ఈ విషయం పై చేసిన వ్యాఖ్యలను ఒక సారి చూద్దాం.

ʹʹపితృ స్వామ్య వ్యవస్థలో, కుల వ్యవస్థలో, భూస్వామ్య వ్యవస్థలో, కార్పొరేట్‌ వ్యవస్థలో సమాజం అంతటా నిర్ధారించబడిన నియమాలకు అనుకూలంగా శ్రమ విభజన జరిగింది. ఈ నియమాలను శాసనకర్తలు చేశారా? లేదు. భౌతిక వస్తువుల ఉత్పత్తికి అవసరమైన పరిస్థితుల నుండి తలెత్తిన ఈ నియమాలను చాలా కాలం తర్వాత మాత్రమే చట్టపరమైన నిబంధనలుగా మార్చారు. ఈ విధంగా వివిధ రూపాలలోని శ్రమ విభజన విభిన్న సామాజిక నిర్మాణాలకు ఆధారాలుగా మారింది.ʹʹ

ʹʹ..... చట్టం కొన్ని కుటుంబాలచేతుల్లోనే భూ యాజమాన్య వారసత్వాన్ని కొనసాగించేలా చేయవచ్చు లేదా మరికొందరికి శ్రమ చేసుకొని బతకటమే వారసత్వ సౌకర్యంగా కేటాయించవచ్చు. ఇది కులవ్యవస్థగా సంఘటితపడుతుందిʹʹ.
(మార్క్స్‌ -- ʹతత్వ శాస్త్ర దారిద్య్రంʹ)

****

నక్సల్బరీ తిరుగుబాటు జరిగేనాటికి భారతదేశంలో నిర్దిష్టంగా కులవ్యవస్థ ఉన్న తీరుతెన్నులు ఏమిటి?

ఆంగ్లేయులు భారతదేశంలో ప్రవేశించక ముందు భారతదేశంలో ఉన్నది కుల ఆధారిత భూస్వామ్యం. అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలకు చెందిన వారు భూస్వామ్య వర్గం, వీరికి తోడు ముస్లింలలోని జమిందారీ వర్గం. వ్యక్తులుగా మినహాయింపులు ఉంటే అది లెక్క కాదు. శూద్ర కులాలలో అత్యధికులు, దళిత కులాలలో అందరూ శ్రామిక వర్గమే. బ్రిటిష్‌ వాళ్ళు దేశాన్నంతా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాక, తమ పాలనలో కొన్ని సంస్కరణలను, ఆధునిక విద్యనూ, క్రైస్తవ మిషనరీలనూ ప్రవేశ పెట్టి, ఆ తరువాతి కాలంలో పరిశ్రమలను స్థాపించాక క్రమంగా కుల వ్యవస్థలో కూడా కొన్ని గణనీయమైన మార్పులు మొదలయ్యాయి. వెనుకబడిన కులాల నుండి, దళితుల నుండి ఒక మేరకు పట్టణ మధ్య తరగతి వర్గం, చదువుకున్న వర్గం తయారవ్వడం మొదలయ్యింది.

భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, బ్రాహ్మణ వ్యతిరేక పోరాటాలు, కుల వ్యతిరేక సంస్కరణోద్యమాలు కూడా ఈ మార్పులను వేగవంతం చేయడానికి తోడ్పడినాయి.

భూస్వామ్య వ్యతిరేక పోరాటాల కారణంగానూ, ఆనాడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న సోషలిస్టు భావజాలం భారత రైతాంగం పై సానుకూల ప్రభావం వేయకుండా ఆపడానికీ ఆంగ్లేయుల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కొన్ని భూసంస్కరణ చట్టాలు చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రధానంగా అగ్రకులాల భూస్వాముల చేతుల్లోనే అత్యధిక భూమి పోగుపడి ఉండేది. గ్రామీణ ప్రాంతంలోని దళితుల్లో 90 శాతానికి పైగా వ్యవసాయ కూలీలే. పట్టణ శ్రామికుల్లో కూడా 90 శాతానికి పైగా శూద్ర దళిత కులాల వాళ్ళే. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చాలా బలంగా జరిగిన చోట మాత్రం కొన్ని వ్యవసాయ శూద్ర కులాలలోని కొందరు భూములకు సొంతదారులు అయినారు. (తర్వాతి కాలంలో వీళ్ళు పాలక వర్గంలో ఒక ముఖ్యమైన భాగం కావటం చూస్తాం). ఇక బడా పెట్టుబడిదారుల్లో నయితే దాదాపు అందరూ బనియా, పార్శీ, ముస్లిం ధనాడ్యులే. దళితులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండడంతో కొద్ది మేరకు ఈ కులాల నుండి ఆధునిక విద్య సంతరించుకున్న సెక్షన్‌ తయారయింది. దక్షిణాది రాష్ట్రాల్లో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ఉండటంతో ఆ కులాల నుండి కూడా ఈ సెక్షన్‌ ఒకటి పెరిగింది. కేంద్రంలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ పార్లమెంటరీ పార్టీల రాజకీయ నాయకత్వం బ్రాహ్మణులు రాజపుత్రులు కాయస్థుల వంటి అగ్రకులాల వ్యక్తుల చేతుల్లోనే ఉండేది. బ్రాహ్మణ వ్యతిరేక పోరాటాలు జరిగిన తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉండేది.

ఆధునిక విద్య ద్వారా జాతీయవాద చైతన్యం, ఆ తరువాతి కాలంలో సోషలిస్టు చైతన్యం పొంది కమ్యూనిస్టులుగా మారిన తొలి నాయకులలో అత్యధికులు అగ్రకులాలకు, ఇస్లాం మతానికి చెందిన మధ్య, ధనిక వర్గాలకు చెందిన వారే. వీరిలో కమ్యూనిస్టు విలువలతో రాటుదేలిన వారూ ఉన్నారు, బ్రాహ్మణవాద భావజాల దృక్పధాన్ని వదులుకోని పిసి జోషి, డాంగేల లాంటి వారూ ఉన్నారు.

నక్సల్బరీ తిరుగుబాటు:

చైనాలో జరుగుతున్న గ్రేట్‌ డిబేట్‌, సాంస్కృతిక విప్లవాల ప్రత్యక్ష ప్రభావంతో రివిజనిజం మీద రాజీలేని పోరాటం చేసి నక్సల్బరీ తిరుగుబాటు జరిగింది. దాని ప్రేరణతో దేశం నలుమూలలా శ్రీకాకుళం, దేభ్రా, గోపి వల్లభ్‌ పూర్‌, లఖింపూర్‌ - ఖేరి, ముసహరి వంటి ఎన్నో చోట్ల రైతాంగ తిరుగుబాట్లు జరిగాయి. వీటికి సమగ్రంగా నాయకత్వం వహించి దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయడానికి 1969 ఏప్రిల్‌ 22న సిపిఐ (ఎంఎల్‌) ఏర్పడింది. అదే సంవత్సరం అక్టోబర్‌ 22న ఎంసిసి ఏర్పడింది.

వ్యవసాయక విప్లవాన్ని నూతన ప్రజాస్వామిక విప్లవానికి ఇరుసుగా వర్ణించి భూస్వామ్యానికీ, అశేష పీడిత ప్రజానీకానికీ మధ్య ఉన్న వైరుధ్యాన్ని ప్రధాన వైరుధ్యంగా సిపిఐ (ఎంఎల్‌), ఎంసిసిలు గుర్తించాయి. భూస్వామ్యనికీ పీడిత ప్రజానీకానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని పరిష్కరించడం అంటే సాయుధ రైతాంగ పోరాటం భూస్వాముల భూములను స్వాధీనం చేసుకొని దున్నేవారికే అప్పగించడంతో పాటు ఆ వర్గపు రాజకీయాధికారాన్ని బద్దలు కొట్టి పీడిత వర్గాల ( కార్మికుల, భూమిలేని, నిరుపేద రైతుల) నాయకత్వంలో రాజ్యాధికారాన్ని స్థాపించడం.

గ్రామీణ స్థాయిలో ఆర్థిక రాజకీయ అధికారాలు చేతిలో ఉన్న భూస్వామ్య వర్గం అంటే ఆనాటికి నిర్దిష్టంగా భారతదేశంలోని అత్యధిక ప్రాంతాల్లో అగ్రకులాలకు చెందిన వర్గమే. అట్లాగే భూమిలేని రైతాంగం, పేద రైతులంటే 95 శాతం పైగా పీడిత శూద్ర కులాలకూ దళితులకూ చెందిన వారే. అంటే సారాంశంలో భూస్వాముల అధికారం కూలదోయడమంటే మూడువేల ఏళ్ళుగా కుల వ్యవస్థ ఏ పునాది పై ఆధారపడి ఉందో ఆ పునాదిని బద్దలుకొట్టడమే.

సిపిఐ ఎంఎల్‌ వ్యవస్థాపక నాయకుడైన చారుమజుందార్‌ తన రచనలలోనూ పిలుపులలోనూ విద్యార్థులను గ్రామాలకు తరలండని పిలుపునిచ్చినపుడైనా, విప్లవకారులు గ్రామాలలో పీడిత ప్రజానీకాన్ని సమైక్యం చేయడానికి తరలినప్పుడైనా భూమిలేని రైతాంగం, పేదరైతుల ఇళ్ళలో/గుడిసెల్లో- మరీ ముఖ్యంగా ʹహరిజనులʹ గుడిసెల్లో ఆశ్రయం పొందాలని నిర్దేశించాడు. అనాదిగా ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంఘిక దోపిడీ అత్యాచారాలకు గురవతున్నది ప్రధానంగా వాళ్ళే కాబట్టి భూస్వామ్యాన్నీ భూస్వామ్య అధికారాన్నీ రూపుమాపాలనే కసి, పట్టుదల వాళ్ళలోనే అత్యధికంగా ఉంటుందనీ, పీడితుల రాజకీయాధికారం వాళ్ళ చేతుల్లోనైతేనే సురక్షితంగా ఉంటుందనే స్పష్టమైన అవగాహనతోనే ఆనాడు సిపిఐ (ఎంఎల్‌) అటువంటి పిలుపునిచ్చింది. ఆ పిలుపుతో ప్రేరితమైన వేలాది విద్యార్థి యువజన విప్లవకారులు దేశంలో ఎన్నోచోట్ల విప్లవ వెల్లువను స ష్టించారు. ఆ వెల్లువలో విప్లవకారుల నాయకత్వంలో అగ్రభాగాన ఉన్నది ʹహరిజనులుʹ, ఇతర పీడితకులాలే. అయితే ఈ పీడితుల పక్షాన నిలబడి పోరాడి తమ ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా అర్పించడానికి అన్నికులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారనే విషయం మరచిపోకూడదు. ఇదంతా వర్గ ప్రాతిపదికనే జరిగినప్పటికీ పీడిత కులాల్లోనే, అత్యంత పీడిత వర్గాలు కూడా ఉన్నాయనే చాలా స్పష్టమైన ఎరుక ఆనాటి విప్లవకారులకు ఉన్నది. పీడితకులాల అణచివేతకూ, భూస్వామ్య అధికారపు పునాదికీ ఉన్న సంబంధం పట్ల స్పష్టత ఉంది.

నక్సల్బరీ పోరాట వెల్లువ చాలా తక్కువ కాలం పాటు ఉన్నది. 1967 నుండి 1972లో చారుమజుందార్‌ అమరుడయ్యేదాక, ఐదేళ్ళ పాటు మాత్రమే. ఈ అయిదేళ్లకాలంలో భూస్వామ్య వ్యవస్థలో భాగంగా కులాన్ని చూడటం, ఆ వ్యవస్థను కూలదోయడానికీ, కుల నిర్మూలనకూ ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తించటం, అందుకై వర్గరీత్యా భూమిలేని రైతాంగంగా, పేదరైతాంగంగా ఉన్న పీడితకులాలపై, దళితులపై ఆధారపడి రైతాంగ తిరుగుబాట్లు చేపట్టాలని పిలుపునివ్వడమే కాక, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పరిచే విప్లవ రైతాంగ కమిటీల్లో నాయకత్వం కూడా ప్రధానంగా వీరిచేతిలోనే ఉండాలనే స్పష్టమైన నిర్దేశం ఇచ్చింది. ఆ పిలుపు ఆచరణలోకి నిజాయితీగా తర్జుమా అయ్యింది కాబట్టే ʹకాళ్ళ కింది మట్టి భూస్వాముల కళ్ళల్లో పడ్డట్టయ్యిందిʹ. ఆచరణలో పీడిత కులాల ప్రజలను తిరుగుబాటులోకి సంఘటిత పరచడానికంటే మించి, ఆనాడు కుల సమస్యను కూలంకషంగా చర్చించి సైద్ధాంతికంగా విశ్లేషణ చేసి కులనిర్మూలనకు ప్రత్యేకంగా కార్యక్రమం రూపొందించాలనే ఆలోచన ఆనాటి నాయకత్వానికి లేదు. లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా నక్సల్బరీ నాటి ఉద్యమకారులకు, నాటి నాయకత్వానికీ తక్కువే. అయితే గాంధీ పట్ల తీవ్ర విమర్శ చేసిన విప్లవ నాయకత్వం ఆ గాంధీయే రూపొందించిన ʹహరిజనʹ పదాన్నే వాడటం, ఆ పదానికి తీవ్ర ఆక్షేపణ చెప్పిన అంబేడ్కర్‌ ఉపయోగించిన ʹదళితʹ పదాన్ని వాడక పోవడం మాత్రం ఖచ్చితంగా కులం పట్ల ప్రత్యేక విశ్లేషణ లేకపోవటం వల్ల తలెత్తిన లోపమే.

ఆ కాలంలో సూక్ష్మ స్థాయిలో విప్లవకారులు ఎన్నో సాంఘిక తిరుగుబాట్లకు నాయకత్వం వహించారు. భూస్వాముల, అగ్రకులాల వారి ఇళ్ళముందు నుండి చెప్పులు వేసుకుని వెళ్ళకూడదనే ఆంక్షలున్న చోట వాటిని బద్దలుకొట్టడం, ʹʹదొరల గడీల ముందు బతుకమ్మ ఆడంʹʹ అని తమ వాడల్లో బతుకమ్మ ఆడటం, దళాలుగా, సంఘ నాయకత్వంగా అగ్రకులాల ఇళ్ళలోకి దళితులు ప్రవేశించటం వంటి సామాజిక తిరుగుబాట్లు ఎన్నో ఆ కాలంలో జరిగాయి. ఇవన్నీ పీడిత కులాలూ వర్గాల మధ్య బలమైన ఐక్యతకు పునాదివేశాయి.

వర్గ దృక్పథం అంటే ఆర్థిక పోరాటాలు మాత్రమే అని యాంత్రికంగా అర్థం చేసుకునే వారు ఆనాడు వర్గ దృక్పథంతో పోరాడారు కానీ, కుల సమస్యను పట్టించుకోలేదని విమర్శిస్తారు. కానీ, వర్గ పోరాటమంటే అందులో అన్ని సాంఘిక, సాంస్కృతిక అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడటం కూడా ఒక అవిభాజ్యమైన అంశం. కాబట్టే ఆ రోజు ప్రత్యేకంగా కుల సమస్య పైన సమగ్రమైన అవగాహన లేకపోయినా, మనుషులందరూ సమానమనే సోషలిస్టు ప్రమాణంతోనే అగ్రకుల భూస్వాములు వెనుకబడిన కులాలపై జరిపిన అన్ని సాంఘిక దురాగతాలను ప్రతిఘటించారు. అట్లా తమ కార్యాచరణలో దీన్ని ప్రధాన విషయంగా పెట్టుకున్నందుకే విప్లవోద్యమం దళితులలోనూ, వెనుకబడిన కులాలలోని పీడిత వర్గాల్లోనూ బలమైన ప్రజాపునాదిని సంపాదించుకుంది.

నక్సల్బరీ విప్లవోద్యమ తొలి దశలో జరిగిన అతివాద తప్పులను సరి చేసుకోవడంతో విప్లవోద్యమ రెండవ దశ ప్రారంభమైంది. ఈ కాలమంతా, విప్లవ, ప్రజాస్వామిక సంఘాల నిర్మాణం జరిగి ఆ ప్రజాసంఘాలు విస్తృతస్థాయిలో విద్యార్థులను, యువజనులను, రైతాంగాన్ని, కార్మికులను, ఆదివాసీలను, ఉద్యోగులను, మేధావులను కదిలించి సంఘటితపరచి వారిని వారి సమస్యల పైనే కాక ఎన్నో రాజకీయ పోరాటాలలోకి నడిపాయి. ఈ కాలంలో ఆదివాసీ ప్రాంతాల్లో మహిళా సంఘాలను స్థాపించి పెద్ద ఎత్తున పోరాటాలలోకి కదిలించగా, మైదాన, పట్టణ ప్రాంతాల్లో 80వ దశకం మధ్యలో ఆ ప్రయత్నాలు మొదలై 90వ దశకంలో బలమైన మహిళా సంఘాల నిర్మాణం, మహిళా పోరాటాలు జరిగాయి.

ఆర్‌ఎస్‌యు, ఆర్‌వైఎల్‌ల నాయకత్వంలో వేలాది విద్యార్థి యువజనులు 1984 దాకా ప్రతి ఏటా గ్రామాలకు తరలండి క్యాంపెయిన్‌ చేపట్టినప్పుడు జరిపిన ఎడ్యుకేషన్‌ క్లాసుల సందర్భంగా కూడా గ్రామాల్లో అట్టడుగు ప్రజానీకంపై ఆధారపడటానికి ప్రాథమికత నివ్వాలని చెప్పటమే కాక కులసమస్యను ఎట్లా అర్థం చేసుకోవాలి అనే విషయాలపై ఎడ్యుకేషన్‌ ఇవ్వటం జరిగేది. ʹగ్రామాలకు తరలండిʹ రాజకీయ కాంపెయిన్స్‌ సందర్భంలో దళిత పల్లెల్లో ఎన్ని రోజులు నివసించారనేది గీటురాయిగా ఉంటుందనే ఎడ్యుకేషన్‌ ఉండేది. అట్లా గ్రామాలకు తరలిన వేలాది మంది యువతీ యువకులు ఎన్నో పోలీసు దాడులు, నిర్బంధాల మధ్యనే అట్టడుగు వర్గ ప్రజలతో కలిసి, వారు ఏం పెడితే అది తిని, పెట్టకపోతే పస్తులు కూడా ఉండి వారి విశ్వాసాన్ని చూరగొని వారిని సంఘాల్లో సంఘటితపరచారు. వేలాది పోరాటాలను ఆర్గనైజ్‌ చేయడంలో పాల్గొన్నారు.

ఈ కాలంలో మొదటి దశలో వలెనే పీడిత వర్గాలను భూస్వామ్యానికి వ్యతిరేకంగానూ, పట్టణ ప్రాంతాల్లో పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగానూ పోరాటాలలోకి కదిలించడం జరిగింది. చైతన్య పూర్వకంగా, ప్రణాళికాబద్దంగా ప్రధానంగా పేద వర్గాలైన దళిత, వెనుకబడిన కులాల ప్రజల్లో కేంద్రీకరించి కార్యకలాపాలు కొనసాగించినందువల్లనే బలమైన వ్యవసాయ విప్లవోద్యమాలను నిర్మించగలిగింది. ప్రజాసమస్యలైన వెట్టి చాకిరీ రద్దు, కూలీల, పాలేర్ల జీతాల పెంపుదల, భూస్వాములు దండుకున్న దండుగల వాపస్‌, బంజరు తదితర ప్రభుత్వ భూముల స్వాధీనం, భూస్వాముల భూముల స్వాధీనం వంటి వ్యవసాయ విప్లవసమస్యలపైనే కాక అంటరానితనం, కుల వివక్ష, దళితులపై అత్యాచారాల లాంటి సామాజిక సమస్యలపై ఉద్యమాలు నిర్మించడం ద్వారా దళిత-వెనకబడిన కులాల్లోని, అగ్రకులాల్లోని పేద, మధ్యతరగతి ప్రజల మధ్య ఐక్యత సాధించగలిగింది.

విప్లవోద్యమం దళిత తదితర వెనుకబడిన కులాల ప్రజలను రాజకీయంగా సమీకరిస్తూ సంఘటితం చేసే క్రమంలో అగ్ర కుల భూస్వామ్య, పెత్తందారీ శక్తుల దురహంకారాన్నీ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ఆధిపత్యాన్నీ ధ్వంసం చేయటానికి కొనసాగించిన అనేక పోరాటాల ద్వారా వారిలో ఆత్మ విశ్వాసం పెంపొందించగలిగింది. ఆయా ప్రాంతాల్లోని ఉద్యమ బలాన్ని బట్టి కులం పేరుతో దూషించడం, దళిత ప్రజలను కించపరుస్తూ చులకనగా పిలిచే సంబోధనలో దాదాపు పూర్తిగా లేదా చాలా వరకు తొలగించగలిగింది. విప్లవ పార్టీ ఆర్గనైజర్లు, సాయుధ దళాలు ఎన్నో సాంఘిక మార్పులను తీసుకురాగలిగాయి. రచ్చబండ వద్ద దళితులకు ప్రవేశం నిషేధం అన్న చోట దాన్ని ఉల్లంఘించటం, దళితులకు విడిగా కప్పులు, ప్లేట్లు పెట్టే హోటళ్ళలో దానిని తీసివేయాలనే పోరాటం చేయటం, అమలు కాకపోతే చర్యలు తీసుకోవటం వంటి ఎన్నో కార్యక్రమాలను విప్లవోద్యమం చేపట్టింది. వీటన్నింటి వల్ల దళితులలో ఎప్పటి నుంచో ఏర్పడి ఉన్న న్యూనతాభావాన్ని చాలావరకు తొలగించగలిగింది. కులాలు రద్దు కావాలనే చైతన్యం ప్రజా సంఘాలన్నింటిపైనా తరతమ భేదాల్లో పడిన కారణంగా వేలాది కార్యకర్తలు కులాంతర వివాహాలు చేసుకున్నారు. విప్లవోద్యమ మద్దతు ఉన్న కారణంగా ʹఆనర్‌ కిల్లింగ్‌ʹ పేరుతో ఈరోజు పెరిగిపోతున్న కుల దురహంకార హత్యలు ఆరోజు మచ్చుకైనా కనిపించేవి కావు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ ఈ కృషి జరిగింది. ఆ కాలంలో వెలువడిన సాహిత్యం, పాటలు, ఇతర కళారూపాలు ఆనాటి విప్లవకారులు ఈ వెలివాడల్లో తీసుకొచ్చిన మార్పులను ఎన్నో విధాలుగా రికార్డు చేసాయి.

రైతు-కూలీ సంఘాలు/ క్రాంతికారీ కిసాన్‌ కమిటీలతో పాటు యువజన, మహిళా, సాంస్కృతిక సంఘాలలో దళిత-వెనుకబడిన కులాలకు చెందిన పేద, మధ్య తరగతి నుండి నాయకత్వ స్థానం లోకి రాగలిగేలా అభివృద్ధిపరచి ప్రజల చేత గుర్తింపు పొందేలాగా ప్రయత్నపూర్వకంగా కృషి చేసినట్లే పట్టణాలలోని ప్రజాసంఘాలలోనూ నాయకత్వాన్ని అభివృద్ధి చేసింది. వీరు గ్రామ వ్యవహారాల్లో నాయకత్వపరంగా నిర్వహించిన రాజకీయ పాత్రను అగ్రకులాలకు చెందిన వారు కూడా ఆమోదించక తప్పలేదు. ఈ విధంగా అన్ని కులాల పేద, మధ్య తరగతి ప్రజల ఐక్యత పెంపొందుతూ క్రమంగా కుల నిర్మూలన కోసం కొనసాగుతున్న ప్రజాస్వామిక పోరాటంగా అభివృద్ధి చెందుతున్నది.

దేశంలోని చాలా రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై భూస్వామ్య, పెత్తందారీ శక్తులు అమలు చేసిన వర్గ దోపిడీ, పీడనలకు, ఆధిపత్యానికి వ్యతిరేకంగానో, సామాజికంగా అంటరానితనానికీ, అత్యాచారాలకూ, అణచివేతకు, భౌతిక దాడులకు వ్యతిరేకంగానూ ఎన్నో పోరాటాలు చేపట్టింది. భూస్వామ్య పెత్తందారీ అగ్రకుల దురహంకార శక్తులు బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో దళితులపై మారణకాండలు జరిపినపుడు విప్లవ పార్టీ, ప్రజాసంఘాలు చాలా దృఢంగా పీడితుల పక్షంలో నిలబడడంతో పాటు ఈ దుర్మార్గాలను ఎండగడుతూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని, నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. విప్లవ పార్టీ గెరిల్లా శక్తులు ఇలాంటి ప్రతీఘాతుక శక్తులను లక్ష్మణ్‌ పూర్‌-బాథే, సెనారీ, దలేల్‌చక్‌-భగౌరా, కారంచేడు లాంటి చోట్ల నిర్మూలించి దళితులకు గొప్ప దన్నుగా నిలిచాయి. బీహార్‌లో అగ్రకుల దురహంకార శక్తులు రాజ్య యంత్రాంగ దన్నుతో ఏర్పరిచిన భూమిసేన, బ్రహ్మర్షి సేన, సన్‌లైట్‌ సేన, రణవీర్‌ సేన తదితర సేనలు విప్లవోద్యమాన్ని నాశనం చేసే లక్ష్యంతో దళిత తదితర పీడిత వర్గాల, కులాల ప్రజలపై మధ్య యుగాలను తలపింపజేసేలాంటి మారణకాండలను, అంతు లేని అత్యాచారాలను జరిపాయి. ఒక వైపు న్యాయస్థానాలల్లో ప్రధానంగా 90% అగ్రకులాలకు చెందిన న్యాయాధీశులే ఉన్నారని విమర్శ చేస్తూనే మరొక వైపు కోర్టులు ఒక కేసు తరువాత మరొక కేసులో అగ్ర కుల భూస్వామ్య శక్తులను నిర్దోషులుగా విడుదల చేస్తున్నా దళిత ప్రజానీకాన్ని మిలిటెంట్‌ పోరాటాల వైపు నడపకుండా తమ పార్లమెంటరీ రాజకీయాల భ్రమలకు, ఎందరో దళిత మధ్య తరగతి నాయకులు, పార్టీలు బలిచేస్తుంటే, విప్లవ పార్టీల నాయకత్వాన పీడిత ప్రజలు సాయుధులై ఒక్కొక్కటిగా ఈ సైన్యాలను, వీటికి నాయకత్వం వహించిన నాయకులను అణచివేసారు.

ఈ పోరాటాలనన్నింటినీ, వీటిలో ఇమిడి ఉన్న కుల నిర్మూలనా తత్వాన్ని గుర్తించకుండా విప్లవ పార్టీలు ఆర్థిక పోరాటాలకే పరిమితమై కుల సమస్యను విస్మరించాయనే విమర్శ కొందరు నిరంతరం చేస్తున్నారు. అది వాస్తవం కాదని పై ఆచరణ చూస్తే అర్థమవుతుంది.

పై ఆచరణతో పాటు సైద్ధాంతికంగా కూడా ఈ కాలంలోనే కుల సమస్యపై నిర్దిష్టమైన చర్చలు మొదలయ్యాయి.

ʹఅగ్రకులాలకు దళితులకు ఉన్న వైరుధ్యమే ప్రధానమని భావించి దీని మీదనే ఆధారపడి వ్యవసాయ విప్లవం చేయొచ్చు కదాʹ అని తలెత్తే ప్రశ్నలకు ఆనాటి పీపుల్స్‌ వార్‌ పార్టీ నాయకుడు కా. కొండపల్లి సీతారామయ్య వ్యవసాయిక విప్లవం డాక్యుమెంట్‌లో సమాధానం ఇచ్చాడు. అధికారం 90శాతం అగ్రకులాల చేతిలోనే ఉన్నప్పటికీ అగ్రకులస్తులందరికీ అధికారం లేదు. అగ్ర కులస్థులలో సగానికిపైగా భూస్వాములూ కారు, బడా బూర్జువా వర్గమూ కాదు. అగ్రకులాలతో ఉన్న వైరుధ్యమే ప్రధాన విషయమైతే మరి ఈ ప్రజల సంగతి ఏమిటి? ఏ ఉత్పత్తి సాధనాలూ లేకుండా విప్లవంలో కలిసి వచ్చేవారు దళిత కులాలలో 95 శాతానికి పైగా, బీసీలలో 75 శాతానికి పైగా ఉన్నా వీరిలో కూడా కొంతమేరకే కావచ్చుగాని దోపిడీ వర్గాల్లోకి ఎగబాకిన వాళ్ళు ఉన్నారు. వెనుకబడిన కులాల్లో కొన్ని ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంలో కూడా గణనీయమైన పాత్ర నిర్వహిస్తున్నాయి. అంటే కలుపుకొని రావాలనుకుంటున్న కులాల్లో దోపిడీ వర్గాలు ఉన్నాయి. ఏ అగ్రకులాలకు వ్యతిరేకంగా పోరాడాలని అనుకుంటున్నామో ఆ కులాల్లో దోపిడీకి గురవుతున్న వర్గాలు ఉన్నాయి. కాబట్టి వైరుధ్యాన్ని ఇట్లా ప్రతిపాదించడం తప్పవుతుందని వ్యవసాయ విప్లవం వంటి డాక్యుమెంట్లు వర్గానికీ కులానికీ మధ్య ఉండే సంబంధాన్ని గురించి చర్చించాయి.

రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో రిజర్వేషన్లపై తీసుకోవాల్సిన వైఖరి గురించి కూడా రాడికల్‌ విద్యార్థి ఉద్యమం మొదటినుంచి చాలా స్పష్టతతోనే ఉంది. గుజరాత్‌లో 1981లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అగ్రకులాలు ఉద్యమించిన నేపథ్యంలో సంస్కరణలుగా రిజర్వేషన్లకు ఉన్న పరిమితులను గురించి చెబుతూనే రిజర్వేషన్లను ఎటువంటి తటపటాయింపు లేకుండా దృఢంగా సమర్థించడం జరిగింది. రిజర్వేషన్లు ఒక సంస్కరణ మాత్రమే కదా అని వాటిని నిరాకరించ లేదు.

ఆర్‌వై‌ఎల్ మహాసభలకు ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ పంపించిన సందేశంలో యువజనులకు పిలుపునిస్తూ కుల సమస్యను ఎట్లా అర్థం చేసుకొని ఎదుర్కొనాలో పిలుపునిచ్చింది.

ʹకామ్రేడ్స్‌! మన దేశం అనేక జాతులకు నిలయమైనట్టే అనేక మతాలకూ, కులాలకూ, కూడా నిలయమే. ......... ఆంధ్రదేశంలో ఉన్న కులాలన్నింటినీ రెండు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. భూమిపై యాజమాన్యం కల్గి గ్రామీణ జీవితంపై ఆధిపత్యం వహిస్తున్న కులాలు ఒక భాగం. రెడ్డి, కమ్మ, వెలమ, క్షత్రియ, కాపు, కాళింగ, గవర కులాలు ఈ భాగంలోకి వస్తారు. భూస్వాములలో అత్యధిక భాగం ఈ కులాలకు చెందిన వారే. కుంటో సెంటో భూమి ఉన్నా ప్రధానంగా కూలీ చేసుకోవడంపై ఆధారపడిన కులాలు రెండవ భాగం. మాల, మాదిగ, చాకలి, మంగలి, యాదవ, ముదిరాజు, తెనుగు, గౌడ వగైరా కులాలన్నీ ఈ రెండవ భాగానికి చెందుతారు.

అందువల్ల స్థూలంగా మొత్తం కులాలను భూస్వాములకు, రైతులకు చెందిన కులాలు, వ్యవసాయ కూలీ కులాలు - అనే రెండు భాగాలుగా విభజించవచ్చు. జనాభా రీత్యా వ్యవసాయ కూలీ కులాలకు చెందిన వారే అత్యధికం. అందువల్ల రైతాంగ యువకులతోపాటు ఆ కులాలలోని యువకులను కదిలించకుండాను, వారిలో విప్లవ చైతన్యం పెంపొందకుండాను మన దేశంలో ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కాజాలదు. అంతేకాదు. ఆ కులాలకు చెందిన యువకులలో విప్లవ చైతన్యాన్ని పెంపొందించకుండా భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామీణ పీడిత ప్రజల ఐక్యసంఘటన నిర్మించి వ్యవసాయ విప్లవాన్ని విజయవంతం చేసే లక్ష్యమే దెబ్బతింటుంది.

వ్యవసాయ కూలీలలో హరిజనులది ప్రధాన సమస్యే గాక ప్రత్యేక సమస్య కూడ. వారు ఆర్థికంగానేకాక సాంఘికంగా కూడ పలురకాలుగా అణచివేయబడుతున్నారు. హరిజనులపై అత్యాచారాలు జరుగుతున్నట్టు పత్రికల్లో వార్త లేని రోజు అరుదు. విచిత్ర మేమంటే హరిజనులపై అత్యాచారాలు జరుగుతన్నట్టు పత్రికల్లో గోల చేస్తున్నది కూడ భూస్వాములకు చెందిన పార్టీలే. అది అంతా హరిజనుల్ని ఏదో ఒక విధంగా మోసం చేసి తమ వెనుక నిలబెట్టుకోడానికి భూస్వాములు చేస్తున్న తతంగంలో భాగమే. ఆ తతంగాన్ని యువజన సంఘాలు పటాపంచలు చేయాలి. హరిజనులపై భూస్వామ్యవర్గాలు చేస్తున్న అత్యాచారాలను ప్రతిఘటించడానికి యువజన సంఘాలు అన్ని కులాల యువకులను సమీకరించాలి. పై కులాల నుంచి వచ్చిన యువకులు అగ్రకుల అహంబావాన్ని పూర్తిగా త్యజించగల్గినప్పుడే పై కర్తవ్యాన్ని నిర్వహించడంలో వారు ఆదర్శంగా ప్రవర్తించగల్గుతారు. పీడిత ప్రజల్ని విభజించి భూస్వాములు గ్రామ సీమల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోడానికి వీలు లేకుండా అన్ని కులాలకు చెందిన యువకులను యువజన సంఘాలలో సంఘటితపర్చాలి. ఆ విధంగా భూస్వామ్య వ్యతిరేక గ్రామీణ పీడిత ప్రజల ఐక్య సంఘటనకు మీట (లీవర్‌)గా యువజన సంఘం సంసిద్ధం కావాలి. అప్పుడే విభిన్న కులాలకు నిలయంగా ఉన్న మన దేశంలోని యువజన సామాన్యాన్ని సమీకరించి జనతా ప్రజాస్వామిక విప్లవానికి విజయం చేకూర్చడంలో సముచిత పాత్రను మీరు నిర్వహించగలరు. అందుకు తగిన కార్యక్రమాన్ని మీ మహాసభ రూపొందిస్తుందని ఆశిస్తాం.ʹ

ఇక 1980వ దశకం ద్వితీయార్ధం నుండి ఆంధ్రప్రదేశ్‌లో కుల సమస్య పట్ల విప్లవ పార్టీల సిద్ధాంతం ఆచరణల గురించిన చర్చ మొదలై 90వ దశకంలో మరింత పెరిగింది. దళిత ఉద్యమం పెరిగిన తర్వాత కొన్ని కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. 80వ దశకం నాటికి దళితులలో గణనీయమైన సంఖ్యలో మేధావి వర్గం, మధ్య తరగతి వర్గం పెరగడం ఇందుకు ప్రేరకంగా పని చేశాయి. దాదాపు ఇదే సమయంలో కమ్యునిస్టు సిద్ధాంతం తప్పని అంటూ అంతర్జాతీయంగా ఊపందుకున్న పోస్ట్‌ మోడర్నిస్ట్‌ సిద్ధాంత ప్రభావం కూడా పని చేసింది. నక్సలైట్లతో సహా కమ్యూనిస్టులెవ్వరూ కుల సమస్యను పట్టించుకోలేదనీ, కులాన్నీ, వర్గాన్నీ ఒకే గాటన కట్టి చూశారనీ, వ్యవస్థ మారితేనే కులం పోతుందనే కారణం చూపి కులం పై పోరాటాన్ని వాయిదా వేస్తున్నారనీ, విప్లవోద్యమంలో చనిపోతున్నది దళిత బహుజనులయితే నాయకత్వం మాత్రం అగ్రకులాల చేతుల్లో ఉందనీ విమర్శలు లేవనెత్తారు. మార్క్సిజాన్నీ అంబేద్కరిజాన్నీ కలిపి భారతదేశానికి నూతన విప్లవ పంథాను తయారు చేయాలని ప్రతిపాదించారు. నూతన విప్లవ పంథా అని పేరు పెట్టినా, వీరి ద ష్టిలో ఉన్నది మాత్రం పార్లమెంటరీ పంథానే.

గ‌మ‌నిక : త‌రువాత భాగం ఇదే సంచిక‌లోని ʹకులం - విప్లవోద్యమ అవగాహన, ఆచరణ - 2ʹ పేరుతో గ‌ల‌దు

No. of visitors : 799
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కులం - విప్లవోద్యమ అవగాహన, ఆచరణ - 2

రవి నర్ల | 02.10.2019 09:43:26am

దళిత వెనుకబడిన కులాలకు, ఆదివాసీలకు చెందిన పీడిత ప్రజలు వర్గ పోరాటంలో సుశిక్షితులవుతూ వివిధ ప్రజాసంఘాలలో, విప్లవ ప్రజా కమిటీలలో, పార్టీ, ప్రజావిముక్తి గెరిల్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •