ఏడు దశాబ్దాల పార్లమెంటరీ రాజకీయాలు - ప్రత్యామ్నాయం

| సాహిత్యం | వ్యాసాలు

ఏడు దశాబ్దాల పార్లమెంటరీ రాజకీయాలు - ప్రత్యామ్నాయం

- ఎ. నర్సింహారెడ్డి | 02.10.2019 09:27:23am

1947 ఆగష్టు ముందుగానీ, ఆ తర్వాత గానీ దేశంలో ఏ సమాజిక విప్లవం జరుగలేదు. వలస పాలకులు పెంచి పోషించిన బడా దళారీ బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలు భారతదేశ పాలకులయ్యారు. మనదేశపు వనరులను దోచుకోవడమే లక్ష్యంగా ఉండే సామ్రాజ్యవాదుల పాలనే ʹస్వేచ్ఛ, స్వాతంత్రపుʹ ముసుగులో నేటికీ కొనసాగుతోంది. మన దళారీ పాలకులు అభివృద్ధి పేరుతో సామ్రాజ్యవాద పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల రుణ పెట్టుబడులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను కొనసాగిస్తోన్నారు. సార్వభౌమత్వం, స్వావలంబన అనేవి వట్టి భూటకం. ప్రాతినిద్య ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా కొనసాగుతోంది. నెహ్రూ అనుసరించిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ దేశంలోని బడా దళారీ బూర్జువా త్వరితగతిన పెరిగేందుకు దోహదపడింది. భూ సంబంధాలలో గుణాత్మక మార్పు రాలేదు. ఇవాళ దేశంలో అన్ని ఉత్పత్తి రంగాలపై సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థల పట్టు పెరిగింది. గడిచిన ఏడు దశాబ్దాల కాలంలో ప్రజల మౌళిక సమస్యల్లో ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు. ప్రజలు తమను తాము పాలించుకోవాలనే, స్వరాజ్యం నడుపుకోవాలనే ప్రాథమిక లక్ష్యంతో ఏర్పడిన ఈ వ్యవస్థ ఆ లక్ష్యాన్ని ఏ మేరకు సాధించిందనే ప్రశ్నకు తప్పనిసరిగా జవాబు చెప్పుకోవలసిన సందర్భం ఇది.

1946 జూలై 7న జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ గాంధీ ʹʹమనం గొప్పగా చెప్పుకుంటున్న సార్వభౌమాధికారం న్యాయపరిమితి భారతదేశపు ʹస్వాతంత్య్రంʹ, సామ్రాజ్యవాదుల మీద ఆధారపడి ఉందన్న వాస్తవాన్ని దాచిపెట్టె సాధనంగా రాజ్యాంగ సభనుʹʹ అభివర్ణించాడు. నిజానికి ఆనాడు సామ్రాజ్యవాదానికి ప్రజలకు, భూస్వామ్యానికి రైతాంగానికి, పెట్టుబడికి శ్రమకు, పాలక వర్గాలలోని వివిధ సెక్షన్ల మధ్య వైరుధ్యాలు తీవ్రంగా ఉన్నాయి. అయినా, సామ్రాజ్యవాదానికి, భూస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగే ప్రజాతంత్ర విప్లవానికి నాయకత్వం వహించే శక్తి భారత దళారీ బడా బూర్జువా వర్గానికి లేదని 1947 ఆగష్టు 15 అధికార మార్పిడి రుజువు చేసింది. బ్రిటిష్‌ ప్రభుత్వం దాదాపు రెండు శతాబ్దాలు పెంచి పోషించిన నిరంకుశ పరిపాలన యంత్రాంగాన్ని, మిలిటరీని, బ్యూరోక్రసినీ బ్రిటిష్‌ వారి నుంచి వారసత్వంగా భారత ప్రభుత్వం స్వీకరించింది. మనం రూపొందించబోయే రాజ్యాంగ శాసనం దేశ సాంఘిక ఆర్థిక సమస్యలను పరిష్కరించకపోతే అది వ్యర్థమైపోతుంది. ʹʹవిదేశీ ప్రభుత్వం స్థానంలో దేశీయ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పాత దోపిడి ప్రయోజనాలను నిలువరించకుండా ఉన్నట్లయితే అది స్వాతంత్య్రం నీడగా కూడా ఉండబోదుʹʹ అని ప్రధాని కాక ముందు నెహ్రూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. గ్రాన్విల్‌ ఆస్టిన్‌ చెప్పినట్లు-ʹʹజాతీయోద్యమ కాలంలో రెండు విప్లవాలు ఒకటి రాజకీయ విప్లవం, రెండోది సామాజిక విప్లవం సమాంతర రేఖలో నడిచాయి. స్వాతంత్య్రం లభించడంతో రాజకీయ విప్లవం ముగిసింది. కాని సామాజిక విప్లవం మిగిలిందిʹʹ.

పెట్టుబడిదారీ దోపిడి కొనసాగాలంటే రాజ్యాంగ యంత్రం యావత్తు బూర్జువా వర్గం చేతిలో ఉండాలి. దానిపై సర్వాధికారం ఉండాలి. కాని రాజ్యాధికారాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోగలిగిన శక్తి సామర్ధ్యాలు భారత బూర్జువా వర్గానికి ఆనాడు లేవు. దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అది భూస్వామ్యంతో రాజీపడింది. రాజ్యాధికారం దక్కాలంటే సాంఘికంగా బలమైన ఇతర వర్గాలతో బూర్జువా చేతులు కలుపక తప్పలేదు. ఇందులో గ్రామీణ భూస్వామ్య వర్గం ప్రధానమైంది. ఈ రాజీ-అభివృద్ధి నిరోధకమైన రాజీ. ఈ రాజీ వల్ల రైతాంగంపై భూస్వాముల దోపిడి, అణచివేతలు కొనసాగడానికి కారణమైంది. ʹʹ ఈ కూటమి సమాజంలో ఎలాంటి మౌలికమైన మార్పును తీసుకురాలేదు. దోపిడీ, పీడనను నిర్మూలించలేకపోయింది. దోపిడీ వర్గాలు ఘర్షించుకుంటూ, రాజీలు చేసుకుంటూ, అంతర్గత వైరుద్యాలు హద్దు మీరిపోకుండా అదుపు చేసుకుంటూ ఇంతకాలం దేశాన్ని పాలించగలుగుతున్నారుʹʹ.  (ప్రార్ధ చఠర్జీ).

భారత స్వాతంత్య్ర చట్టం 1947 వల్ల రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది. రాజ్యాంగ నిర్మాణ సభ ప్రాతినిధ్య స్వభావం పట్ల విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా అది ప్రజాస్వామికంగా సార్వత్రిక ఓటింగ్‌ ద్వారా ఎన్నిక కాలేదన్నది మొదటి విమర్శ. భారత రాజ్యాంగం ʹరాజీలు-రాయితీʹల ఫలితంగా ఏర్పడిందని మరో అభిప్రాయం. స్వేచ్ఛ స్వాతంత్య్రాలు అనుభవించే ప్రజల రాజ్యాంగ సభకు ఉండవల్సిన లక్షణాలలో ఒక్కటి కూడా దీనికి లేకుండా పోయాయన్నది ప్రజాతంత్రవాదుల విమర్శ. ఆశ్చర్యమేమంటే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని పూర్తిగా తిరస్కరించిన నాయకులే రాజ్యాంగ రచనకు పూనుకొన్నప్పుడు ఆ చట్టం నుంచి సుమారు 80 శాతం అంశాలను గ్రహించడానికి వెనుకాడలేదు. 80 శాతంగా ఉండే రైతాంగానికి, కార్మిక వర్గానికి, కూలీలకు రాజ్యాంగ పరిషత్‌లో ప్రాతినిధ్యం లేదు. ఈ కారణం చేత రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్దంగా జరిగి, అది ప్రజలకు వాస్తవమైన ప్రాతినిధ్యాన్ని వహించలేదు.

జనవరి 26, 1950న మనం ఒక వైరుధ్యమయమైన జీవితంలో ప్రవేశించబోతున్నాం. రాజకీయాలలోనేమో మనకు సమానత్వం ఉంటుంది. సామాజిక ఆర్థిక జీవనంలో మాత్రం మనకు అసమానత్వం ఉంటుంది. రాజకీయాలలో మనం ఒక మనిషికి ఒక వోటు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం. కాని మన సామాజిక, ఆర్థిక జీవనంలో మన సామాజిక ఆర్థిక వ్యవస్థ కారణంగా ఒక మనిషికి ఒక విలువ అనే సూత్రాన్ని నిరాకరించడం కొనసాగిస్తాం. ఈ వైరుధ్యమయమైన జీవితాన్ని ఎంతకాలం కొనసాగించగలం? మన సామాజిక, ఆర్థిక జీవనంలో సమానత్వాన్ని నిరాకరిస్తూ ఎంతకాలం కొనసాగగలం? సమానత్వం లేకుండా స్వేచ్ఛ మాత్రమే ఉంటే అది అనేకుల మీద కొందరి ఆధిపత్యాన్ని సృష్టిస్తుంది. స్వేచ్ఛ లేకుండా సమానత్వం మాత్రమే ఉంటే అది వ్యక్తిగత చొరవను చంపివేస్తుంది. సౌభ్రాతృత్వం లేకుండా స్వేచ్చా సమానత్వాలు సహజంగా వికసించలేవు. వాటిని అమలు చేయడానికి రక్షక భటుడుగా సౌభ్రాతృత్వం కావాలి.

ʹʹ26 జనవరి 1950 నాడు మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి అడుగుబెట్టబోతున్నాం. రాజకీయ రంగంలో సమానత్వం, సామాజిక ఆర్థిక రంగాలలో అసమానత్వం కొనసాగుతున్నది. మనకు రాజకీయ ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ సాంఘీకార్థిక ప్రజాస్వామ్యం రాలేదు. సామాజికార్థిక ప్రజాస్వామ్య పునాది లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం దీర్ఘకాలం మనుగడ సాగించలేదు. సామాజిక ప్రజాస్వామ్యమంటే అది ఒక జీవన విధానం. స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే సూత్రాలను ఏదో విడిగా సూత్రత్రయంగా చూడకూడదు. స్వేచ్ఛను సమానత్వం నుండి, సమానత్వాన్ని స్వేచ్ఛ నుండి వేరు చేయలేము. సమానత్వం స్వేచ్ఛను సోదరభావం నుండి వేరు చేయలేము. సామాజిక, ఆర్థిక అసమానతల్ని సాధ్యమైనంత త్వరగా నిర్మూలించాలి. లేకుంటే అసమానతకు గురవుతున్న వాళ్లు ఈ రాజ్యాంగాన్ని బద్దలు కొడతారుʹʹ అని, ఆనాడే స్పష్టం చేశారు అంబేద్కర్‌.

భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చాయి. మన రాజ్య స్వభావం ʹఅర్థవలస-అర్థ భూస్వామ్య వ్యవస్థʹ మాత్రమేనని ఏడు దశాబ్దాల రాజ్య స్వభావం-పాలన విధానాలు తెలియజేస్తున్నాయి. విదేశీ సాంకేతిక పరిజ్ఞానం మీద, విదేశీ ముడిసరుకుల మీద, విదేశీ పెట్టుబడుల మీద, నిర్వహణ మీద ఆధారపడిన దళారీ బడా బూర్జువా వర్గం స్వతంత్రంగా ఉత్పత్తిని సాగించలేదు. ఏడు దశాబ్దాల కాలాన్ని ప్రమాణంగా తీసుకుని ఆ కాలంలో ఏ వర్గ ఆధిపత్యం, దోపిడీ, సంపద పెరిగిందనేది పరిశీలిస్తే రాజ్యసారం వర్గ దోపిడీలో వుందనే విషయం సులభంగా అర్థమవుతుంది. భారతదేశ సంపదలో అత్యధిక భాగం 100 మంది దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల చేతుల్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 40 శాతం కుటుంబాలు సెంటుభూమి లేనివారుగానే ఉన్నారు. గ్రామీణ చేతివృత్తులు ధ్వంసమై ప్రత్యామ్నాయం లేక దినసరి కూలీలుగా మారారు. బతుకుదెరువు కోసం కొందరు వలసలు వెళ్తున్నారు.

సామ్రాజ్యవాద యుగంలో భారతదేశంలో వ్యవసాయ సంబంధాలను అర్థం చేసుకునేందుకు, పెట్టుబడి స్వభావాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ఆర్థికవేత్త ఆర్‌ఎస్‌రావు మన దేశంలో పెట్టుబడిదారీ విధానం సమాజాన్ని పరివర్తన చెందించే సామర్థ్యాన్ని కలిగిలేదని ఆయన సూత్రీకరించాడు. పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి, ఉపరితల నిర్మాణంతో కలగలసి సాగకపోగా పెట్టుబడిదారీ విధానానికి ఆటంకంగా ఉండే గతకాలపు ఉపరితల నిర్మాణాన్నే అది ఆశ్రయించిందని విశ్లేషించాడు. వలసానంతర భారతదేశంలో ఉనికిలోనున్న విధానం పెట్టుబడిదారీ విధానమైనప్పటికీ అది సామ్రాజ్యవాదం ప్రభావం చేత అడ్డగించబడిందని పేర్కొన్నారు. మరోవైపు ప్యూడల్‌ భూస్వామ్య ప్రభావాన్ని రద్దు చేయడానికి నిర్దేశిత లక్ష్యాలను చేరేందుకు తీసుకోవల్సిన చర్యలను విరమించుకున్న ఫలితంగా దున్నే వారికి భూమి హక్కు కలుగలేదు. అలాగే వ్యవసాయంలో వ్యవస్థాపక మార్పు రద్దు చేసుకొని సాంకేతికపర మార్పు పంథాను స్వీకరించిన ఫలితంగా ʹఅర్థవలస-అర్థ భూస్వామ్యʹ స్వభావం మనదేశంలో మారలేదు. కనుక వ్యవస్థ మార్పుకు ప్రజాతంత్ర విప్లవమే ప్రత్యామ్నాయం కాగలదు.  

ఆర్థిక అంతరాలు తీవ్రంగా పెరిగాయి. దేశంలో నానాటికీ పేదరికం, నిరుద్యోగం, నిర్వాసితులు పెరుగుతుండగా కుబేరులు పుట్టుకొస్తున్నారు. 2013-19 మధ్య కాలంలో శతకోటీశ్వరుల సంఖ్య 190కి చేరింది. కేవలం 9 కుటుంబాల సంపద దేశజనాభాలో సగం మంది అనగా 65 కోట్ల మంది అట్టడుగు ప్రజల సంపదతో సమానమైనప్పుడు, ఇంత అసమానతలకు కారణం పరిపాలకులు కాక ఇంకెవరు? వ్యవసాయం కుదేలైంది.  పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకోవడం లేదు. ఎక్కడ, ఏనాడు లేని విధంగా మనదేశంలో ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వ ఖజానా నిండుతోంది. నిరుద్యోగం పెరిగింది. విద్యా, వైద్యం సామాజికాంశాలుగా పాలకులు ఇవాళ్టీకి గుర్తించడం లేదు. అందరికి సమానవకాశాలు, స్వాతంత్య్రాలు, స్వేచ్ఛల పేరుతో ప్రజల ప్రజాస్వామిక హక్కులు, విభిన్న జాతులు స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛ కోసం చేస్తున్న పోరాటాలను పాశవికంగా పోలీసు, సైనిక బలగాలతో అణచి వేస్తోన్నారు. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని బిజెపి పాలకులు సాంస్కృతిక జాతీయవాదం పేరుతో ఒకేదేశం, ఒకేభాష అనే నినాదంతో ఫాసిస్టు పాలన సాగిస్తోన్నారు. వీరి రాజ్యాంగం ʹమనుʹ రాజ్యాంగమే అన్నట్లు నగ్నంగా మాట్లాడుతున్నారు.

ʹʹసంప్రదాయిక ప్రజాస్వామ్యం పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రయోజనాలు కాపాడుతున్నది. ఇలాంటి ప్రజాస్వామ్యంలో సంపన్న వర్గమే విధాన నిర్ణయాలు చేస్తుంది. మిగతా వర్గాలను రాజకీయాల నుండి తరిమివేస్తుంది. నిజం చెప్పాలంటే అధికారం ప్రజల నుండి కొనబడుతుంది. అందుకే బూర్జువా ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం అంటారుʹʹ మాక్‌ చెన్ని. ʹʹబూర్జువా ప్రజాస్వామ్యంలో ప్రజలను ములగ చెట్టెక్కించి, వారిని భ్రమల్లో ఉంచడం ద్వారా తమ వర్గస్వామ్య స్వభావాన్ని దాచిపెడతారు. ఆదాయం, సంపదలో అసమానతలున్న సమాజం ప్రజాస్వామిక సమాజం ఎలా అవుతుందనిʹʹ డెమోక్రసీ-1988 గ్రంథ రచయిత మైఖేల్‌ ఫెర్నిటి ప్రశ్నించారు. భారతదేశంలో జరుగుతున్నది కూడా ఇదే. అందుకే రాజకీయాల వర్గ స్వభావాన్ని, రాజ్య స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. దోపిడీని, సొంత ఆస్తిని కాపాడుకోవడానికి దోపిడీదారులకు రాజ్యాధికారం ఎంత అవసరమో ఆ దోపిడీ నుండి విముక్తం కావడానికి పీడితులకూ అది అంతే అవసరం. దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే ఆర్థిక సంబంధాలు మారాలంటే రాజకీయ సంబంధాలు మారాలి. ఆర్థికాధిపత్యం ఎవరి చేతుల్లో వుంటుందో రాజ్యాధికారం కూడా వారి చేతుల్లోనే ఉంటుంది. అయితే వాటిని నడిపించేవి మౌలికమైన, స్థిరమైన వర్గ ప్రయోజనాలే.

నెహ్రూ పాలనలో :

ʹʹఆర్థిక నిర్మాణంలో ఎలాంటి మార్పులుండవు, ఇప్పట్లో విదేశీ పరిశ్రమలు ఏవీ జాతీయం చేయడం జరుగదుʹʹ అని 1948 ఫిబ్రవరి 17న   నెహ్రూ ప్రకటించాడు. 1948 ఏప్రిల్‌ 6న భారత ప్రభుత్వం స్పష్టంగా ఆయుధ సామాగ్రి, రైల్వేలు, విద్యుచ్ఛక్తి, అణుశక్తి తప్ప ʹʹమిగిలిన పారిశ్రామిక రంగమంతటా సాధారణంగా ప్రైవేట్‌ పెట్టుబడికి అవకాశం ఉంటుందిʹʹ అని తన  పారిశ్రామిక విధానాన్ని తెలిపింది. 1950 నాటికి పూర్వపు సంస్థానాధిపతుల భూభాగాలను వారి సామాజిక, ఆర్థిక ప్రత్యేక హక్కులకు ఎట్టి తీవ్రభంగం లేకుండా కలుపుకొన్నారు. మిర్ధాల్‌ తన ʹʹఏషియన్‌ డ్రామాʹʹ పుస్తకంలో  చెప్పినట్లుగా ʹʹదౌత్యం, బుజ్జగింపులు, చట్టబద్దమైన లంచగొండితనంʹʹ లాంటివి భారత యూనియన్‌లో సంస్థానాధిపతులు చేరేలా ప్రోత్సహించడానికి వినియోగపడ్డాయి. ప్రజాతంత్ర వ్యవస్థ స్వభావానికి పూర్తి విరుద్దంగా సంస్థానాధీశులకు రాజభరణాలు, పన్నుల నుండి మినహాయింపులు, వారి రాజబిరుదుల్ని కొనసాగించడం తదితరమైన అనేక ప్రత్యేక హక్కులు కల్పించి వారిని భారత యూనియన్‌లో చేర్చుకొన్నారు.

భారత్‌లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరుగక ముందే బ్రిటిష్‌ పాలన నాటి ప్రివెంట్యూ డిటెన్షన్‌ యాక్టును ఫిబ్రవరి 1950న నెహ్రూ కమ్యూనిస్టు ఉద్యమకారులపై ఉపయోగించారు. వ్యవస్థలో మౌలిక సంస్కరణలు లేకపోవడంతో, ఆర్థిక అభివృద్ధికి అవసరమైన వనరులను వ్యవస్థలోనే అంతర్గతంగా సమీకరించడం అసాద్యమైపోయింది. నెహ్రూ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం (స్టేట్‌ క్యాపిటలిజం) అభివృద్ధికి మూలధనాన్ని ʹవిదేశీ సహాయంʹ ద్వారా సమకూర్చుకోవలసి వచ్చింది. ఆధునీకరణ-అభివృద్ధి పేరిట సామ్రాజ్యవాదంపై అంతకంతకూ ఆధారపడటాన్ని నెహ్రూ ప్రారంభించారు. ప్రజల కొనుగోలు శక్తిని, దేశీయ మార్కెట్‌ను అభివృద్ధి చేయుటకు చర్యలు చేపట్టలేదు. పేరుకు ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానమే అయినా పెట్టుబడిదారులకు సులభంగా, తక్కువ వడ్డీరేట్లతో అప్పులు దొరికేలా చూడడం కొరకు ప్రభుత్వమే అనేక బ్యాంకులనూ, పరపతి సంస్థలనూ స్వయంగా స్థాపించింది. ఈ బ్యాంకులనూ, అవి అందించే నిధులనూ బాగా ఉపయోగించుకుని లాభపడిందీ. బలపడిందీ గుత్త పెట్టుబడిదారీ సంస్థలు.

ఇందీరాగాంధీ పాలనలో :

పెట్టుబడిదారీ విధానాన్ని భూస్వామ్యాన్ని మాటల్లో త్రీవంగా వ్యతిరేకిస్తూనే ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చింది. ఈ కాలంలోనే పంజాబు, నాగ, మిజో ప్రాంతాలలో ఉద్యమాలు చెలరేగాయి. ఈ ఉద్యమాలను నల్లచట్టాలైన అన్‌లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్టు 1967, మేంటెనెన్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ సెక్యూరిటీ యాక్టు1971, నేషనల్‌ సెక్యూరిటీ యాక్టు 1980లతో జాతుల ఉద్యమాలను అణచివేసింది. అభివృద్ధి లక్ష్యాలు సామాజిక న్యాయాన్ని సాధించడంలో విఫలమయ్యామని ఆర్థిక ప్రణాళికా వేత్తలు తెలుసుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ʹఆదాయ పంపిణీ-జీవన  ప్రమాణాలుʹ పై మహల నోబిస్‌ కమిటీ నివేదిక (1964) ప్రకారం సంపద కొద్దిమంది బడా పెట్టుబడిదారీ చేతుల్లో కేంద్రీకృతమైంది. గుత్త సంస్థలపై కెసి దాస్‌ విచారణ కమిటీ (1964), పరిశ్రమల లైసెన్స్‌ విధానంపై సుబిమల్‌ దత్‌ కమిటీ (1969) నివేదికలు సమసమాజ నిర్మాణానికి కావల్సిన ఆర్థికాభివృద్ధి లక్ష్యం పక్కదారి పట్టిందని స్పష్టం చేశాయి.

ఇందిరాగాంధీ ఆర్థిక విధానాల్లో  ప్రణాళికా విధానాలకు విరామం, ప్రభుత్వ రంగ వ్యయం కుదింపు, నూతన వ్యవసాయ విధానాలు చేపట్టింది. ధనిక రైతులు, ప్రాంతీయ ఆధిపత్యవర్గాలు అధికారంలో వాటా, ప్రభుత్వ వనరుల్లో వాటా కొరకు డిమాండ్‌ చేయడంతోపాటు తమ వర్గ సమస్యలు సాధించుకోవడానికి ప్రాంతీయ, జాతి, మత, కుల, సాంస్కృతిక అంశాలను ఉపయోగించుకున్నారు. అదే సమయంలో పేద రైతులు, కూలీలు, శ్రామికులు, విద్యార్థులు, పెట్టి బూర్జువాలు కేంద్ర, రాష్ట్ర ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా సమరశీల వర్గ ఉద్యమాలు చేపట్టారు (నక్సల్బరి, శ్రీకాకుళం, ముషాహరి). పెరిగిన అసమానతలు, పేదరికం, నిరుద్యోగంతో సతమతమవుతున్న ప్రజలు ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. ఈ నేపథ్యంలో రాజ్యం పాసిస్టు విధానాలు చేపట్టింది. పార్లమెంట్‌, న్యాయస్థానాలు, పాలన యంత్రాంగం, పార్టీని బలహీనం చేసి అన్నీతానై ఇందిరా ఒక నియంతగా మారింది.

పి.వి. నర్సింహ్మారావు కాలంలో :

పి.వి. నర్సింహరావు జూలై 1991 నుండి భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. ఈ సంస్కరణలను స్థిరీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ వంటి పేర్లలో పిలిచారు. ఆర్థికాభివృద్ధి 3.5 శాతం దాటటం లేదని, విదేశీ మారక ద్రవ్యం నిల్వలు అంతరించాయని, ఈ సమయంలో ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ప్రపంచ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌ల నుండి రుణం తెచ్చారు. రుణం ఇచ్చిన వారు విధించిన షరతులు అంగీకరించి అమలు చేయక తప్పదని దబాయించారు. ప్రపంచ ద్రవ్య పెట్టుబడి ప్రయోజనార్థం మన మార్కెట్‌ను బార్లా తెరిచారు. రూపాయి విలువ తగ్గించారు. మన వనరులు అప్పగించారు. స్వేచ్ఛగా లూటీ చేసుకోవడానికి కావల్సిన సదుపాయాలు అన్ని సమకూర్చారు. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం, దిగుమతి సుంకాల తగ్గింపు, ఏ పరిశ్రమలోనైన పెట్టుబడులు పెట్టడానికి అనుమతించారు. ద్రవ్యలోటు తగ్గింపు పేరుతో సంక్షేమ పథకాలకు కోత విధించారు. ఎగుమతుల పేరుతో కార్పొరేట్లకు కోట్లాది రూపాయల రాయితీలు యిచ్చారు. పన్ను మినహాయింపులు, నీటి సరఫరా, భూములు, ఖనిజాలు అప్పనంగా అప్పగించారు. కార్మిక చట్టాలు సవరించి, హక్కులు హరించారు. దేశీయ పెట్టుబడి తగ్గింది, విదేశీ పెట్టుబడీ పెరిగింది. ఆర్థిక వృద్దిరేటు పెరిగినా ప్రజల అభివృద్ధి మాత్రం జరుగలేదు. ప్రజావసరాలు తీర్చవల్సిన ప్రజాసేవారంగాలన్నీ ప్రైవేటీకరించబడ్డాయి. విద్య, వైద్యం, ఉపాధి, భద్రత సాధారణ ప్రజలకు అందని మావిగా మిగిలాయి. మార్కెట్‌ ప్రయోజనమే సమాజ ప్రయోజనంగా ప్రచారం జరుగుతూ వచ్చింది.

భారత వ్యవసాయ రంగాన్ని రైతాంగ వ్యవస్థగా ఉంచకుండా సంపన్నుల కార్పొరేట్‌ వ్యవస్థగా లేదా కాంట్రాక్ట్‌ వ్యవసాయిక వ్యవస్థగా మార్చడానికి సంస్కరణలు ఆరంభించింది. ప్రపంచ బ్యాంక్‌ వ్యవసాయానికి సంబంధించిన సూచించిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. 1) భూ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలి. 2) వ్యవసాయాధారిత వ్యాపార కార్పొరేషన్ల కార్యకలాపాలను అనుమతించాలి. 3) ఎరువులు, ఇరిగేషన్‌ విద్చుక్తి, రుణ సౌకర్యం (పరపతి) వగైరా వ్యవస్థలపైనా సబ్సిడీలను రద్దు చేయాలి. 4. ప్రపంచ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా మాత్రమే దేశీయ మార్కెట్‌ ధరలు ఉండేట్టుగా వ్యవసాయ సరుకులపైన వాణిజ్య పరమైన ఆంక్షలు తొలగించాలి. 5) ప్రస్తుత ఆహార ధాన్యాలు, తదితర సరుకులకు ఉన్న ద్వంద్వ మార్కెటింగ్‌ విధానం అంతరించేలా ధరల ఏకీకరణ (యూనిఫికేషన్‌) విధానం రూపొందించాలి. అంటే ధరలను డాలర్‌ విలువకు సరితూగేట్టుగా నిర్ణయించాలి. (దీన్నే ఒక ఆర్థికవేత్త దేశీయ ʹధరలడాలరీకరణʹ-డాలరైజేషన్‌ ఆఫ్‌ ప్రైసెస్‌ʹ అన్నాడు) 6. ఆహార సబ్సీడీలు కోత పెట్టాలి. ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థను (పిడిఎస్‌) సాధ్యమైనంతమేర (ఉద్దేశిత పేదలకు మాత్రమే) కుదించాలి. 7. ఏ సరుకును ఉత్పత్తి చేయాలి. ఏది అక్కర్లేదు, ఏ సరుకును ఎక్కడ అమ్మాలి వగైరా నిర్ణయాలపై ఎలాంటి ఆంక్షలూ ఉండరాదు. 8. భారత ఆహార సంస్థ ధాన్యాదుల సేకరణ చేయరాదు. ధాన్యా సేకరణ బాధ్యతను, సేకరించిన ధాన్యం తరలింపు బాధ్యతను, పంపిణీ బాధ్యతను ప్రైవేటీకరించాలి.

యూపిఎ పాలకులు అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోయారు. సామ్రాజ్యవాదుల కోర్కెలు తీర్చటానికి భారత ప్రజల ప్రయోజనాలను బలి పెడుతున్నారు. 2005లో చేసుకున్న వ్యూహాత్మక సైనిక ఒప్పందం, అణుసరఫరా ఒప్పందం, అణు ఇంధన సరఫరాలకు అమెరికా, ఫ్రాన్స్‌, రష్యాలతో చేసుకున్న ఒప్పందాలు, అణు ప్రమాదాల సందర్భంలో నష్టపరిహార చెల్లింపు బాధ్యత నుండి విదేశీ కంపెనీలను మినహాయించే చట్టం.  2012 అక్టోబర్‌లో ప్రకటించిన సంస్కరణలు రిటైల్‌ రంగంలోకి, భీమారంగంలోకి, ప్రసార మాథ్యమంలోకి, ఫించన్‌ రంగంలోకి ఆహ్వానించిన విదేశీ పెట్టుబడులు, ఇవన్నీ ప్రజల ప్రయోజనాలకు హానికరమైనవి. నేటి రాజకీయ స్థితి, సామ్రాజ్యవాదానికి లొంగి ఉన్న, ప్యూడలిజంతో పెనవేసుకున్న పెట్టుబడిదారీ సంబంధాలు, భారత ప్రజలను దారిద్య్రంలోకి, బానిసత్వంలోకి నెట్టివేస్తున్నాయి.  

మోడీ పాలనలో :

గడచిన ఐదేళ్లుగా సాగిన నరేంద్రమోడీ ప్రభుత్వ పాలనపై తమ ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గాలకు చేయవలసిన లబ్ధి చేకూర్చడమేగాక, అందింనంతకాడికి దోచుకొని హాయిగా విదేశాలకు చెక్కేయడానికి కేంద్రంలోని ఏలికలు, వారి అనుచర గణనేతలు దోహదపడ్డారు. ఫలితంగా మనదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులలో నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎలు) పేరుకుపోయి అవి దివాలాటంచులకు సంఘ్‌ పరివార్‌ వంటి ప్రతీపశక్తుల దన్నుతోనున్న బిజెపి  2014 మేలో ప్రభుత్వ అధికారాన్ని చేజిక్కించుంది. మోడీ పాలనలో వెనుకబాటుతనం, ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. ప్రభుత్వ దన్నుతో హిందూత్వ ఫాసిస్టు శక్తులు మత మైనారిటీలపై, దళితులపై, హేతవాదులపై దాడులకు పాల్పడుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘాలు సాంస్కృతిక పోలీసులుగా వ్యవహరిస్తున్నాయి.

ఆర్‌ఎస్‌ఎస్‌ దుండగులు లవ్‌జిహద్‌, గోరక్షకల ముసుగులో అరాచక దాడులు విస్తారంగా జరుగుతున్నాయి. మోడీ పాలనలో గోరక్ష మూఠాలు 100కి పైగా ముస్లింలను, దళితులను హత్య చేశారు. చట్ట సభలకు ఎన్నికైన ప్రతినిధులే మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామికంగా, లౌకికంగా ఆలోచన చేసేవారిపై, కార్యకర్తలపై, రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారు. దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. మతం పేరుతో ప్రజలను విభజిస్తున్నారు. ఆర్థికంగా చూస్తే పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి వంటివి పరిశ్రమలను, ప్రజల జీవితాలను ఛిద్రం చేశాయి. కార్పొరేట్‌ అనుకూల విధానాలు అమలు ప్రజలకు కడగండ్లు మిగిల్చింది. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్నా ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి బదులు కార్పొరేట్లకు, బ్యాంకులకు లక్షలాది రూపాయల రాయితీలు ప్రకటిస్తుంది.

భూస్వామ్య-సామ్రాజ్యవాద, వారి దళారిశక్తుల ప్రయోజనాలను కాపాడటానికే ఇప్పుడు ʹఉపాʹ చట్టానికి మరింత పదును పెడుతున్నారు.  సవరించిన ʹఉపాʹ చట్టం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రాల ప్రజానీకంపై నిర్బంధకాండను సాగించే హక్కులను తన గుప్పెట్లోకి తీసుకుంటోంది. భారత కేంద్ర పాలకులు ఎప్పటినుంచో రాష్ట్ర ప్రభుత్వాలను మున్సిపాలిటీలుగా దిగజార్చాలనే ఆలోచనలకు ఇదొక ఆచారణాత్మక ముందడుగు. ఇది భవిష్యత్తులో రాష్ట్రాల పాలిట పిడుగుపాటులా మారుతుంది. ఇప్పటికే భీమా కోరేగావ్‌ సంఘటనల సాకున వరవరరావు, సుధా భరద్వాజ్‌ తదితరులకు చట్టబద్దమైన బెయిలు కూడా ఇవ్వనీయకుండా క్రూర నిర్బంధంపాలు చేశారు. నేర నిరోధం పేరుతో రాజకీయ భిన్నాభిప్రాయాలు కలవారు, పాలనా విధానాల పట్ల అసమ్మతి ప్రకటించేవారు, అణచివేత చర్యలను ప్రశ్నించేవారందరూ ఉగ్రవాదులుగా ఆపాదించబడే ప్రమాదం ఉంది.

నేడు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను మరింత నిరంకుశంగా దూకుడుగా అమలుపరచటానికి భాజపా పాలకులు ʹదేశభక్తిʹ పేరున అత్యుత్సాహ పడుతున్నారు. నిర్బంధం ద్వారా తప్ప కొనసాగుతున్న నేటి దోపిడీ వ్యవస్థను చెక్కుచెదరకుండా కాపాడుకోలేమని భాజపా పాలకులు ఎప్పటినుంచో చెబుతున్నారు. తిరుగులేని అధికారం పొందిన తర్వాత తమ దూకుడుని పెంచుతున్నారు.15-25 ఏళ్ళకు పూర్వం టాడా, పోటా లాంటి చట్టాలు ప్రయోగించి, ఉద్యమించే ప్రజలను వారికి నాయకత్వం వహించిన కార్యకర్తలను ప్రశ్నించిన హక్కుల సంఘాలను మేధావులను తీవ్ర నిర్బంధాలకు గురిచేసిన కాంగ్రెస్‌ పాలనాకాలం మన ముందున్నది. అవన్నీ ʹనాసాʹ, ʹమీసాʹ, ʹఎస్మాʹ, ʹపారిశ్రామిక సంబంధాలు బిల్లుʹ తదితరాల తర్వాత వచ్చినవి. ఆ చట్టాల అమలుపట్ల ప్రజానిరసన పెరిగిన తర్వాతే అవి పాత పేర్లు మార్చుకొని ʹఉపాʹ చట్టంగా మరిన్ని కోరలు పెంచుకుంటూ ముందుకొచ్చింది. ప్రజా ఉద్యమాలపై పాశవిక నిర్భందం, విభజించి పాలించడం,  క్షీణ సంస్కృతి వ్యాప్తి అనే వ్యూహంతోనే మోడీ ప్రభుత్వం ప్రజలను అణచివుంచుతుంది. 1919లో ఆనాటి బ్రిటిష్‌ పాలకులు పెరుగుతున్న స్వాతంత్రోద్యమాన్ని అణచివేయడానికి తెచ్చిన రౌలట్‌ చట్టం లక్షణాలు, నేటి సవరించిన  ʹఉపాʹ చట్టంలో ఉన్నాయి.

1/70వ చట్టం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు భూమిని కలిగి ఉండరాదని చెప్పినప్పటికీ అది సక్రమంగా అమలుకు నోచుకోలేదు. ఇటీవల అటవీ చట్టాలకు పదును పెట్టి కోరలు పెంచి వాటిని అతిక్రమించారనే పేరిట ఆదివాసీలపై జరిమానాలు, జైలు శిక్షలు విధించగలిగే 1927 నాటి నిరంకుశ అధికారాలు తిరిగి ఫారెస్ట్‌ అధికారులకు కట్టబెట్టారు. దేశవ్యాప్తంగా 11 లక్షలకు పైగా ఆదివాసులను అడవుల నుండి గెంటివెయ్యమని గత ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆదివాసీలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వేలాది సంవత్సరాలుగా వందలాది తరాలుగా అడువులలోనే పుట్టి అడవులలోనే పెరిగి అడవే జీవితంగా బుతుకుతున్న అడవితల్లి కన్నబిడ్డలు తీవ్రమైన అలజడికి గురవుతున్నారు. రోజు రోజుకీ పెరిగిపోతున్న ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక అసమానతల వ్యవస్థను ఖండించే మేధావులను, ప్రశ్నించే ప్రజలను, ఉద్యమింపచేసే కార్యకలాపాలను నిరోధించడానికి, అణచివేయటానికి ఉద్దేశించినదే నేటి ʹఉపాʹ చట్టంలోని సవరణలకు అర్థం.

పి.వి. నర్సింహారావు మూడు దశాబ్దాల క్రితం తలకెత్తుకున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అంతిమ దశకు తీసుకువచ్చాయని పలువురు ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించడం గమనార్హం. మనదేశ పాలకులు కూడ 1991 నుంచి అనుసరించిన ప్రపంచీకరణ నూతన ఆర్థిక విధానాలు మన ఆర్థిక వ్యవస్థను కూడ అదే స్థితికి తీసుకవచ్చినట్లు కనిపిస్తున్నది. 2013 నాటి స్థితికి దేశ ఆర్థికవృద్ధి 5 శాతానికి పడిపోయింది. రూపాయి విలువ పడిపోతోంది. విదేశీ మారక నిల్వలు కరిగిపోతున్నాయి.   స్టాక్‌ మార్కెట్లు కప్పుకూలి మదుపరుల లక్షలాది సంపద ఆవిరైపోతోంది. ఉపాధి, ఉత్పత్తి రంగాలు నీరుగారిపోతున్నాయి. వృద్దిరేటు నేలచూపులు చూస్తోంది. నిరుద్యోగం గత 45 సంవత్సరాలలో ఏనాడు లేని విధంగా 6.1 శాతానికి చేరింది.

ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు-మారని ఉపరితలం :

ఒక దేశం స్వతంత్రమయిందా లేదా అని చూడడానికి  రాజకీయార్థిక శాస్త్ర అవగాహన నుంచి ఆ దేశపు ఉత్పత్తి శక్తుల, ఉత్పత్తి సంబంధాల అభివృద్ధి ఎలా ఉంది, ఉపరితలాంశాల మార్పు ప్రగతిశీల దిశలో పురోగమిస్తుందా అని చూడాలి. ఉత్పత్తి శక్తులలో భాగమైన ఉత్పత్తి సాధనాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే చూసి, అంతకన్న ముఖ్యమైన మనుషులను, మానవశ్రమను విస్మరించడం జరుగుతున్నది. ఉత్పత్తి సాధనాలకు, సాంకేతిక పరిజ్ఞానానికి కళ్లు మిరుమిట్లు గొలిపేంత దృశ్యనీయత ఉంటుంది. అందువల్ల అవి కొట్టవచ్చినట్టు కనబడతాయి. కాని అదే సమయంలో ఉత్పత్తిలో పాల్గొంటున్న  మనుషుల్లో అభివృద్ధి ఉన్నదా తేల్చడం అంత సులభం కాదు. ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని ఉత్పత్తి సాధనాలతో మాత్రమే చూడాలి. సాంకేతిక పరిజ్ఞానంతో  చూడగూడదు. మనుషుల అభివృద్ధితో కలిపి చూడాలి. మనుషుల అభివృద్ధిని కూడ వారి రూపాలతో మాత్రమే చూడగూడదు. సారంలోకి వెళ్లి, వాళ్లు ఏ ఉత్పత్తి సంబంధాలలో, ఏ సామాజిక సంబంధాలలో ఉన్నారు, ఏ ఉపరితల ప్రభావంలో ఉన్నారు, వారి నిత్య జీవితాన్ని నిర్ణయిస్తున్న ఉపరితలం అభివృద్ధికరమైనదా, అభివృద్ధి నిరోధకమైనదా, రేపటిదా, నిన్నటిదా అని పరిశీలించాలి.

అలా చూసినప్పుడు ఈ డెబ్బై సంవత్సరాలలో, ప్రత్యక్ష వలస పాలన తొలగిపోయినప్పటికీ ఉత్పత్తి సాధనాల అభివృద్ధి జరిగినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని బైటి నుంచి ఎంత ఎక్కువగా అరువును తెచ్చుకున్నప్పటికీ, ఇక్కడ సమాజ స్థితి, మనుషుల సామాజికార్థిక స్థితి మారలేదు. అంటే ఉత్పత్తి శక్తుల అభివృద్ధి సంపూర్ణంగా జరగలేదు. అది సంపూర్ణంగా జరగలేదనడానికి సమాజంలో ఉపరితలాంశాలలో సమూలమైన, గుణాత్మకమైన మార్పులు జరగలేదు. పాత ఉపరితలాంశాలే ఇంకా మనుషుల మనసుల మీద రాజ్యం చేస్తున్నాయి. కులం, మతం, ఆచారాలు, సంస్కృతి, దైవభావన, స్త్రీ పురుషుల పరస్పర సంబంధాలు, సాహిత్యం, కళలు, సినిమా, క్రీడలు వంటి ఏ రంగం తీసుకున్నా కాలం చెల్లిన, అభివృద్ధి నిరోధక ఉపరితలాంశాలే ఆధిపత్యం చేస్తున్న  సందర్భంలో మనం ఉన్నాం.

ముగింపు :

1947 బ్రిటిషు వారి నుండి అధికారాన్ని స్వీకరించిన బడా బూర్జువా వర్గం ప్రజల తిరుగుబాటు విప్లవ స్వరూపం తీసుకొనకుండా అడ్డుకోవడానికి, ప్రధానంగా గ్రామీణ భారతదేశంపై అదుపును పటిష్టం చేసుకోవడానికి, బూస్వామ్యవర్గంతో రాజీపడి, రాజ్యాధికారంలో వారిని జూనియర్‌ భాగస్వాములుగా చేర్చుకోవాలని నిర్ణయించారు. ఏడు దశాబ్దాల కాలంలో  ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి పేదలు పేదలుగానే మిగిలిపోవడానికి భారత రాజకీయ వ్యవస్థ దోహదపడుతుంది. దోపిడీ, అణచివేత అనేక రూపాల్లో కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో సామాజిక ఆర్థిక విషయంలో వివిధ ప్రాంతాల మధ్య తీవ్రమైన స్థాయిలో అసమానతలున్నాయి. ఇవాళ రాజకీయాలంటే ప్రజాసేవ అనే అర్థం మారిపోయి, అతి ఎక్కువ లాభాలు సంపాదించే వ్యాపారం అని రూఢి అయిన తర్వాత ప్రజాప్రతినిధి కావడం అనేది మరిన్ని లాభాలు సంపాదించడానికి ఎన్నికల్లో గెలుపు కొరకు పెట్టుబడి పెట్టడంలా మారిపోయింది.  

మనదేశంలో ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పేరు మీద సాగుతున్నది ప్రజాస్వామ్యమే కాదు. అది సామ్రాజ్యవాదంతో మిలాఖత్‌ అయిన బడాదళారీ బూర్జువా, బడా భూస్వామ్య వర్గ నియంత్వ పాలన మాత్రమేనన్నది యదార్థం. ప్రజాస్వామ్యంలో ముందస్తు షరతైన సమానత్వం కనీస స్థాయిలోనైనా అమలవుతుందా? వర్గ అసమానతకు తోడు కుల, మత, ప్రాంత, భాషా, స్త్రీపురుష అంతరాలు అతి భయంకరంగా అమలయ్యే చోట ప్రజాస్వామ్యం అమలు కావడం అసాధ్యం.

భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ రూపంలో ఉన్నాకానీ అది ప్రజల జీవితాలలో అభివృద్ధిని, సౌభాగ్యాన్ని, స్వేచ్ఛను తీసుకురాలేదని రుజువైన సత్యం. కాగా ఈ పెట్టుబడిదారీ విధానం సృష్టించిన సర్వవ్యాపిత సంక్షోభం, పర్యావరణ విధ్వంసం, ప్రజల జీవనాధారాలను కుళ్ళబోడుస్తున్న విధానాలు ఎంత సత్యమో తిరోగమన ప్రతిఘాతక పాలకుల  ఫాసిస్టు విధానాలకు దారీ తీస్తుందనేది కూడ అంతే సత్యం. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ రాజకీయ పార్టీలు పెట్టుబడిదారీ విధానం సృష్టిస్తున్న విధ్వంసానికి, విలయానికి ప్రత్యామ్నాయం కాలేవు. కావు కూడ. పీడిత, తాడిత ప్రజలందరికి సమానత్వాన్ని, అభివృద్ధిని, అత్యున్నత సార్వత్రిక సంక్షేమాన్ని అందజేయగలిగేది సోషలిస్టు ఉత్పత్తి విధానం ఒక్కటే. అందుకు వర్గ రాజకీయ దృక్పథం కలిగిన కార్మికవర్గంలో సమన్వయమైన రైతాంగం మాత్రమే వర్గ పోరాటం ద్వారా సోషలిజాన్ని సాధిస్తుంది. వర్గ పోరాటం మాత్రమే యావత్తు ప్రజలందరికి పెనుభారంగా అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన ప్రతిఘాతుక ఫాసిస్టు శక్తులను మట్టిగరిపించగలదన్నది చారిత్రక సత్యం.

No. of visitors : 276
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •