కులం - విప్లవోద్యమ అవగాహన, ఆచరణ - 2

| సాహిత్యం | వ్యాసాలు

కులం - విప్లవోద్యమ అవగాహన, ఆచరణ - 2

- రవి నర్ల | 02.10.2019 09:43:26am


విమర్శ పేరుతో వీళ్ళు సకారాత్మక విమర్శ చేయడం కాక విప్లవోద్యమంపై, కమ్యూనిస్టు సిద్ధాంతంపై దాడి మొదలు పెట్టి నేటికీ కొనసాగిస్తున్నారు.

ఏదేమైనా, ప్రజా పంథాను అనుసరించి పని చేసే విప్లవ పార్టీ, సమాజంలోని ఏవైనా సెక్షన్లు కొత్త ప్రశ్నలను లేవనెత్తినప్పుడు, అవి ఫెమినిజం లేవనెత్తిన ప్రశ్నలైనా కావచ్చు, లేదా దళితవాదం లేవనెత్తిన ప్రశ్నలైనా కావచ్చు మరెేవైనా కావచ్చు, వాటిని నిరాకరించక, వాటిలోని సకారాత్మకమైన విషయాలను స్వీకరించి, మార్క్సిస్టు దృక్పథంతో వాటిపై తమ విమర్శను ప్రకటించే దృక్పథమే చేపట్టింది. కాబట్టి దళితవాదం లేవనెత్తిన ప్రశ్నలు కూడా కుల సమస్యను కూలంకషంగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవడానికి, విప్లవ పార్టీలు కులాల రద్దు కోసం చేపట్టవలసిన కార్యక్రమం పట్ల ఒక సమగ్ర దృక్పధాన్ని పెంపొందించుకోవడానికి ప్రేరణ కలిగించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నక్సలైట్‌ పార్టీలు ఈ సమస్యపై తమ తమ అవగాహనలను ప్రకటించాయి. కులం ఉపరితల అంశమే అని కొన్ని ప్రకటిస్తే, మరికొన్ని పార్టీలు కులం వర్గం ఒకటేననేటటువంటి వైఖరిని చేపట్టాయి. కుల పోరాటమే వర్గపోరాటం అని కొందరు సూత్రీకరించారు.

1995లో ఆనాటి పీపుల్స్‌ వార్‌ పార్టీ, పార్టీ యూనిటీలు కుల సమస్య పట్ల తమ అవగాహన ఏమిటో ప్రకటిస్తూ డాక్యుమెంట్లను విడుదల చేశాయి. అంతేకాకుండా మొత్తం విప్లవ శిబిరంలో ఈ విషయంపై చైతన్యం పెంచడానికి అధ్యయన తరగతులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, ఈ సమస్యపై పోరాడటానికి నిర్దిష్టమైన నిర్మాణాలను, సంఘాలను ఏర్పరచాలని నిర్ణయించి ఆచరణలోకి వెళ్ళాయి.

2004లో ఏర్పడిన మావోయిస్టు పార్టీ కూడా ఆ తదుపరి కాలంలో కుల సమస్య పట్ల తమ అవగాహన ఏమిటో ప్రకటిస్తూ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఆ పార్టీ మౌలిక డాక్యుమెంట్లు అయిన పార్టీ కార్యక్రమం, వ్యూహం ఎత్తుగడలలో కుల సమస్య పట్ల అవగాహననూ, ఈ సమస్యను పరిష్కరించడానికి దాన్ని ఎట్లా నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగం చేయాలనే విషయాన్నీ, విప్లవానంతరం కూడా కులంపై ఎట్లా పోరాడి నిర్మూలించాలనే విషయాలను భాగం చేసుకున్నాయి.

వాటిలోని ముఖ్య విషయాలు:

* వేల సంవత్సరాల పాటు భారత సమాజంపై పెత్తనం చెలాయించిన భూస్వామ్య విధానం బ్రాహ్మణవాద భావజాలం ప్రాతిపదికపై నిర్మితమైన, కట్టుదిట్టమైన కులవ్యవస్థ పునాదిగా గల భూస్వామ్య విధానం. పీడితుల నుండి, ప్రత్యేకంగా బానిసల్లాంటి స్థితిలోకి నెట్టబడి అంటరానివారుగా పిలువబడే వారి నుండి పెద్ద మొత్తంలో అదనపు విలువను పిండుకోవడంలో ఈ కుల వ్యవస్థ దీనికి ఎంతగానో ఉపకరించింది.

* కుల వ్యవస్థ ఇక్కడ ఉపరితల నిర్మాణానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. అది ఆర్థిక పునాదిలో భాగం కూడా.

* దళిత సమస్య అంతస్సారంలో వర్గ సమస్యే అయినప్పటికీ పార్టీ దళితులపైనా, ఇతర వెనుకబడిన కులాలపైనా సాగుతున్న కుల అణచివేత వ్యతిరేక పోరాటాన్ని నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగంగా నడపాలి. కుల వివక్ష, పీడన తాలూకు అన్నిరూపాలతోనూ పోరాడటం ద్వారా సామాజిక జీవనానికి సంబంధించిన అన్ని రంగాలలోనూ వారికి సమాన హోదా కోసమూ, కుల వ్యవస్థను సమూలంగా నాశనం చేయడానికి పోరాడాలి.

* ఇతర వెనుకబడిన కులాల వారికి సమాన హక్కులు, రిజర్వేషన్లు, తదితర ప్రత్యేక సౌకర్యాల కల్పన కోసం తప్పనిసరిగా పోరాడాలి. వాటిని ప్రజాస్వామ్యం కోసం జరిగే పోరాటంలో అవిభాజ్యంగా పరిగణించాలి.

* దళితులలోని పెటీబూర్జువా సెక్షన్లు దళితులకు మాత్రమే సంబంధించిన సంఘాలను ఏర్పరచి, తమకు సంబంధించిన కొన్ని సమస్యలపై ఉద్యమాలను నిర్మిస్తున్నారు. ఆ సంస్థలతో ఈ సమస్యలపై కలిసి పని చేస్తూనే, మత మార్పిడి, రిజర్వేషన్ల వంటి వాటి ద్వారా కుల నిర్మూలన అనే వారి సంస్కరణవాద భావాలపై సిద్ధాంత, రాజకీయ పోరాటాలు జరపాలి.

* నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసి కుల వ్యవస్థకు పునాదిగా పనిచేస్తున్న కుల ఆధారిత భూస్వామ్య విధానంతో పాటు దానికి దన్నుగా నిలిచి నిలబెడుతున్న దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ విధానాన్నీ, సామ్రాజ్యవాదాన్నీ కూలదోసి శాశ్వతంగా కులవ్యవస్థ నిర్మూలనకు కావలసిన భౌతిక పరిస్థితులను సృష్టించాలి.

* బ్రాహ్మణవాద కులాధిపత్య, భూస్వామ్య, సామ్రాజ్యవాద సంస్కృతులను తుడిచిపెట్టి అంటరానితనానికీ కులపీడనకూ తావు లేని నిజమైన ప్రజాస్వామిక సోషలిస్టు సంస్కృతిని నెలకొల్పాలి.

* ప్రజల ప్రజాస్వామిక విప్లవం తర్వాత, దోపిడీదారులకూ, పీడితులకూ మధ్య వర్గవ్యత్యాసాన్ని నిర్మూలించే క్రమంలో ఉత్పత్తి సంబంధాలను క్రమక్రమంగా విప్లవీకరించి, శాస్త్రీయ సోషలిస్టు దృక్పథాన్ని పెంపొందించటం ద్వారా బ్రాహ్మణవాద భావజాలాన్ని, కుల పీడన, వివక్షలను రూపుమాపే కృషిని కొనసాగించాలి.

నూతన ప్రజాస్వామిక విప్లవానంతరం కూడా అవసరమైనంత కాలం రిజర్వేషన్లను కొనసాగించడం నుండి మొదలుకొని సాంస్క తిక రంగంలోనూ, చట్ట పరంగానూ చేపట్టే ఎన్నో కార్యక్రమాల గురించిన వివరాలు అందులో ఉన్నాయి.

తొమ్మిదో కాంగ్రెస్‌ చేసిన మరో ముఖ్యమైన తీర్మానాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. ʹపార్టీలోని అన్ని స్థాయిల్లో కార్మికుల, దళితుల, మహిళల, ఆదివాసుల పాత్రను ముఖ్యంగా పునాది వర్గాల పాత్రను పెంచాలిʹ అనే తీర్మానమది. అది ఇలా మొదలవుతుంది.

ʹరాష్ట్ర కాన్ఫరెన్స్‌లలో, కాంగ్రెస్‌ల్లో దళిత సెక్షన్లకు చెందిన కామ్రేడ్స్‌కు ప్రాతినిధ్యం ఉండేలా పాలసీని అమలు చేయాలని ʹఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాన్ఫరెన్స్‌ చేసిన ప్రతిపాదనను 9వ కాంగ్రెస్‌ ఆమోదించింది.

అంతే కాక కార్మిక నేపథ్యం నుండి సామాజికంగా పీడించబడుతున్న, వెనుకబడిన సెక్షన్ల నుంచి, ముఖ్యంగా పునాది వర్గాల నుండి కామ్రేడ్స్‌ పాత్రను పార్టీ అన్ని స్థాయిల్లో పెంచడానికి ప్రత్యేక కృషి చేయాల్సిన అవసరాన్ని కాంగ్రెస్‌ గుర్తించింది.

1. పార్టీ శ్రేణులలో కార్మికులు తదితర అణచిబడ్డ సెక్షన్ల (దళితులు, మహిళలు, ఆదివాసుల) నుండి రిక్రూట్‌మెంట్‌ను పెంచడానికి మనం ప్రత్యేకమైన కృషి చేపట్టాలి.

2. పార్టీలోని అన్ని స్థాయి నాయకత్వ అంగాలలోనూ, పార్టీ వేదికలైన కాన్ఫరెన్స్‌లూ, కాంగ్రెస్‌ వంటి వాటిల్లోనూ కార్మికుల, ఇతర పీడిత సెక్షన్ల పాత్ర, ముఖ్యంగా పునాది వర్గాల పాత్ర పెరిగేందుకు పార్టీ నిరంతరాయంగా కృషి చేయాలి.

3. మిగతా అన్ని అవసరమైన అంశాలు సమానంగా ఉన్నప్పుడు, కార్మికవర్గం నుంచి వచ్చిన కామ్రేడ్స్‌ ప్రమోషన్స్‌ సంబంధిత విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలనే పాలసీని పార్టీ అమలు చేస్తోంది. దళిత, ఆదివాసీ, మహిళ కామ్రేడ్స్‌ విషయంలో కూడా ఇదే దృక్పథాన్ని అవలంబిస్తాం. ముఖ్యంగా పునాది వర్గాల నుండి వచ్చే వారి విషయంలో ఈ దృక్పథం ఉండాలి.

4. పార్టీ ఆదివాసుల, దళితుల, మహిళల విషయంలో సమాజంలో వివక్ష, అణచివేతల వల్ల వచ్చే కొన్ని లోపాలను అధిగమించేందుకు ఎడ్యుకేషన్‌, శిక్షణ వంటి విషయాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ప్రత్యేక చర్యల ద్వారా ఈ సెక్షన్ల నుండి వచ్చే కామ్రేడ్స్‌ పార్టీలో నాయకత్వ పాత్రను పోషించడానికి అవసరమైన శక్తి సామర్ధ్యాల్ని అభివృద్ధి పర్చుకోగలుగుతారు. ఈ సామాజిక సెక్షన్ల నుండి వచ్చిన వారిని నాయకత్వ స్థానాల్లోకి వేగంగా అభివృద్ధి పర్చుకోడానికి కొన్ని ప్రత్యేక ఎడ్యుకేషన్‌ మరియు శిక్షణ కార్యక్రమాలను రూపొందించడం పట్ల సిసి, రాష్ట్ర కమిటీలూ కింది కమిటీలు శ్రద్ధ పెట్టాలి...ʹ

****

సిద్ధాంత ఆచరణలకు సంబంధించిన ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్ని జవాబులు చెప్పుకున్నా విప్లవోద్యమంలో అసువులు బాస్తున్నది పీడితకులాలకు చెందినవారు, ఆదివాసీలు, దళితులు కాగా నాయకత్వం వహిస్తున్నది మాత్రం అగ్రకులాలవారే అనే విమర్శకు సమాధానం చెప్పవలసే ఉంది.

ఏ వర్గం తన విముక్తికై పోరాడుతుందో ఆ వర్గం నుండే త్యాగాలు ఉంటాయనేది చాలా సహజమైన విషయం. కాబట్టి విప్లవోద్యమంలో దళితులు, వెనకబడిన కులాలకు సంబంధించిన వారు ఎక్కువ అమరులు కావటం చాలా సహజం. పై ప్రశ్నకు నిజాయితీగా జవాబు చెప్పాలంటే - విప్లవకారులు అగ్రకులాలకు చెందినవారైతే రాజ్యం వారిని వదిలి పెట్టిందా అనే ప్రశ్నను వేసుకోవాలి. చారు మజుందార్‌ నుంచి, కిషన్‌ జీ, ఆజాద్‌ ల వరకు ఎవ్వరినీ వదిలి పెట్టలేదు. ప్రజా సంఘాల నాయకులలో సైతం రాజ్యం మన్నెం ప్రసాద్‌ నూ చంపింది. రామనాథంనూ, పురుషోత్తంనూ, గంటి ప్రసాద్‌ నూ చంపింది. అరెస్టులలో సైతం దళితులైన సుధీర్‌ ధావలే, సురేంద్ర గడ్లింగ్‌ లనూ వదిలిపెట్టలేదు, బ్రాహ్మణ నేపథ్యం నుండి వచ్చిన వరవర రావునూ, సుధా, షోమ లనూ, క్రిస్టియన్‌ నేపథ్యం నుంచి వచ్చిన వెర్నన్‌, అరుణ్‌, రోనాలనూ వదిలి పెట్టలేదు. పాలకవర్గాలకూ, రాజ్యానికీ తన శత్రువుల పట్ల చాలా స్పష్టత ఉంది. లేనిదల్లా బహుజన విముక్తి పేరుతో విప్లవోద్యమం మీద దాడి చేసే వారికే.

విప్లవోద్యమం - పీడిత కులాల నాయకత్వం

కమ్యూనిస్టు పార్టీ అంటే కార్మికవర్గ అగ్రగామి పార్టీ అని సాధారణ అర్థం. కార్మికవర్గం అంటే శ్రమ చేసేందుకు రెక్కలు తప్ప స్వంత ఆస్తి లేని వర్గం. ముఖ్యంగా ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం లేని వర్గం. కాబట్టి శ్రమదోపిడీకి మూల కారణమైన ఉత్పత్తి సాధనాల స్వంత యాజమాన్యాన్ని రద్దు చేయడానికీ, వాటిని సమాజపు సమిష్ఠి యాజమాన్యం లోకి తీసుకు వచ్చి సామ్యవాదానికీ, కమ్యూనిజానికీ దారులు వేయగలిగే వర్గం కార్మిక వర్గమే. అందుకే అది పెట్టుబడిదారీ సమాజంలో అత్యంత విప్లవకర వర్గం. అయితే ఈ కార్మిక వర్గం తనను తాను ఒక వర్గంగా గుర్తించడం దానికదిగా జరిగే పని కాదు. అదనపు విలువ దోపిడీని అర్థం చేసుకోవటానికి చైతన్యపూర్వకమైన కృషి అవసరం. శాస్త్రీయ సోషలిజాన్ని అంటే మార్క్సిజాన్ని అర్థం చేసుకోవటం, మార్క్సిస్టు లెనినిస్టు పద్ధతిలో వర్గపోరాటాన్ని అంటే విప్లవాన్ని ఆచరించటం చైతన్యపూర్వకంగా చేయవలసిన కృషి. కార్మికవర్గంలో అలా చైతన్యం పొందిన సెక్షన్‌నే కార్మికవర్గ అగ్రగామి దళం అంటాము. దాని సంఘటిత రూపమే కమ్యూనిస్టు పార్టీ.

కార్మికులు తమ జీవిక కోసం చేసే పోరాటంలో నిమగ్నం కావలసిన అనివార్య పరిస్థితుల వల్ల కార్మికవర్గం తనకు తానుగా ఈ చైతన్యం పొందటానికి అవసరమైన సైద్ధాంతిక కృషి చేయగలగటానికి అవకాశాలు తక్కువ. అందుకే లెనిన్‌ కార్మికవర్గానికి ఈ చైతన్యం బయటినుండి అందవలసి ఉంటుందని అన్నాడు. మార్క్స్‌, ఎంగెల్స్‌లు కానీ, లెనిన్‌ కానీ, మావో కానీ ఇంకా ఎందరో కమ్యూనిష్టు పార్టీల నాయకులు కానీ కార్మికులు కాకపోయినా కార్మిక వర్గ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి ఆచరించడానికి కారణమిదే. అందుకే ఏ దేశంలోనైనా విప్లవ సిద్ధాంతాన్ని రూపొందించి మొదట కార్యాచరణలోకి వెళ్లింది మేధావి బృందాలే . రష్యా నుండి మొదలుకొని చైనా, వియత్నాం, క్యూబా, ఫిలిప్పీన్స్‌ వరకూ జరిగినదిదే. మన దేశంలోనూ జరిగింది అదే. సిద్ధాంతాన్ని అధ్యయనం చేయగల వెసులుబాటు మధ్యతరగతికి ఉండటమే దీనికి కారణం. వీరి కార్యాచరణ భౌతిక వాస్తవికతకు ఎంత దగ్గరగా ఉంటే అంతగా విప్లవోద్యమానికి విజయవంతంగా నాయకత్వం వహించగలుగుతారు. అయితే కార్మికవర్గానికే చెంది సైద్ధాంతిక కృషి చేసి గొప్ప నాయకులైన వారు కూడా ఉన్నారు. వర్గ పోరాటమే ఒక పెద్ద పాఠశాల కాబట్టి వర్గ పోరాట క్రమంలో కార్మికులు సైద్ధాంతికంగా ఎదగగలుగుతారు. ఇతర వర్గాలకు చెందినవారు మాత్రం ఆయా వర్గాలకు సహజమైన దృక్పథాలనూ, ధోరణులనూ చైతన్యపూర్వకంగా వదిలించుకోవడానికి అంతరంగికంగానూ, ఇతర సహచరుల సహకారంతోనూ పోరాటం చేసి కమ్యూనిస్టు విలువలను సంతరించుకోకపోతే అది కమ్యూనిస్టు ఉద్యమానికి హానికరంగా మారుతుంది. అందుకే ఇతర వర్గాల నుండి వచ్చేవారు డీ-క్లాసిఫై కావాలని అంటాం. కార్మిక వర్గం కూడా ఈ సమాజంలో ఏకాకిగా ఉండే వర్గం కాదు కాబట్టి ఇతర వర్గాల సహజ దృక్పథాల ప్రభావంతో కార్మికవర్గానికి సహజంగా ఉండే అవకాశమున్న విప్లవ దృక్పథం స్థానంలో ప్రవేశించిన అన్యవర్గ దృక్పథాలను కూడా చైతన్య పూర్వకంగా వదిలించుకోవాలి.

ఇక విప్లవ పూర్వపు చైనావంటి అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశాల్లో కార్మిక వర్గం సంఖ్య రీత్యా తక్కువ ఉండటం వల్ల విప్లవానికి నాయకత్వం వహించేది కార్మికవర్గ దృక్పథం కలిగిఉన్నదే అయినప్పటికీ, ప్రధాన చోదక శక్తులుగా పని చేసింది మాత్రం భూమిలేని రైతాంగం, పేద రైతాంగమేనని మనకు తెలుసు. ప్రధానంగా పునాది వర్గాల నుండే నాయకత్వం ఎదిగేలా చర్యలు చేపట్టాలని చైనా కమ్యూనిస్టు పార్టీ చైతన్య పూర్వకంగా కృషి చేసింది. సిపిసి నియమావళిని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. వర్గ పునాదుల రీత్యా చూస్తే మాత్రం చైనా కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహించిన వాళ్ళల్లో ఎందరో పెటీ-బూర్జువా వర్గానికీ, ధనిక రైతాంగ వర్గానికీ చెందిన వారు కూడా ఉన్నారు. అది ఆ సమాజం విధించిన పరిమితులు. ఇతర వర్గాల నుంచి వచ్చిన నాయకత్వం ఎంతగా తమను తాము కార్మిక వర్గ భావజాలానికీ, కమ్యూనిస్టు విలువలకూ అనుగుణంగా తీర్చిదిద్దుకుంటారో అంతగా అది విప్లవ విజయానికీ, దాని కొనసాగింపుకూ హామీ.

ఇక భారత దేశ విషయానికి వస్తే, ఇక్కడ కూడా అర్ధ వలస అర్ధ భూస్వామ్య వ్యవస్థ విషయం వరకు స్థూలంగా చైనాను పోలి ఉన్నప్పటికీ, ఇక్కడ ఉన్న పారిశ్రామికాభివృద్ధి రీత్యా కానీ, కార్మికవర్గ సంఖ్య రీత్యా కానీ, వ్యవసాయరంగంలో సాపేక్షికంగా పెరిగిన పెట్టుబడిదారీ సంబంధాల రీత్యా కానీ ఎన్నో తేడాలు ఉన్నాయి. వీటన్నిటికి తోడు భారత దేశంలో కులవ్యవస్థ, అంటరానితనం ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆదివాసీలు ఉన్నారు. మనదేశానికి సంబంధించినవరకు పీడితవర్గాలకే కాక పీడితకులాలకు సంబంధించిన వ్యక్తులు నాయకత్వంలోకి రావాలనడం ఎంతో న్యాయసమ్మతమైన విషయం.

మునుపటి పీపుల్స్‌ వార్‌, ఎంసిసిలలోనూ, ప్రస్తుత మావోయిస్టు పార్టీలోనూ నాయకత్వ పొందికలో వచ్చిన మార్పులను పరిశీలిద్దాము.

సిపిఐ (ఎంఎల్‌) మొదటి కాంగ్రెస్‌ లో ఎన్నికైన కేంద్ర నాయకత్వంలోనూ కింది స్థాయిల నాయకత్వంలోనూ అత్యధికంగా- వర్గ రీత్యా మధ్య తరగతి నుండి వచ్చిన వారు, కులం రీత్యా అగ్రకులాల వాళ్ళు. వివిధ రాష్ట్రాల కమిటీల్లో ఆనాటికి అదే పరిస్థితి. పునాది వర్గాల నుండి నాయకత్వం ఏర్పరచాలనే చైతన్యపూర్వక ప్రయత్నంతో విప్లవోద్యమాన్ని నిర్మించిన కారణంగా వర్గ పోరాటం పెంపొందే క్రమంలో ప్రజాసంఘాలలోనూ పార్టీ కమిటీలలోనూ పీడితకులాల నుండి వచ్చినవారే క్రమంగా నాయకత్వ స్థానంలోకి ఎదిగారు. భూమిపుత్రులు, పుత్రికలు, గ్రాంసీ అన్నటువంటి ఆర్గానిక్‌ ఇంటిలెక్చువల్స్‌ విప్లవోద్యమ నాయకత్వ స్థానాల్లోకి ఎదిగారు, ఎదుగుతున్నారు.

మరికొంత నిర్దిష్టంగా చూస్తే మునుపటి పీపుల్స్‌ వార్‌ లో కామ్రేడ్‌ కొండపల్లి సీతారామయ్య తరువాత పార్టీ నాయకుడుగానే కాకుండా విప్లవ రచయితలకూ, కళాకారులకూ, విద్యార్థులకూ గొప్ప ప్రేరణగా దళిత క్రిస్టియన్‌ నేపథ్యం నుండి వచ్చిన కేజి సత్యమూర్తి నిలిచాడు. కేఎస్‌ అరెస్టయిన తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఎస్‌ఎమ్‌ కొన్ని ఏళ్ళ పాటు పని చేశాడు. ఇతర సైద్ధాంతిక, ఆచరణాత్మక విభేదాలతో పార్టీ నుండి వైదొలగక ముందు మొత్తం పార్టీ అభిమానం చూరగొన్న నాయకుడిగా ఉన్నాడు. ఎస్‌ఎం విషయం అందరికీ తెలిసిందే అయినా 70ల్లో ఎదిగిన మరొక ముఖ్య నాయకుడి గురించి అంతగా ఎవరికీ తెలియదు. నక్సల్బరీ పోరాటం వెనకపట్టు పట్టిన తరువాత ఆంధ్ర ప్రదేశ్‌లో విప్లవోద్యమ పునర్నిర్మాణంలో 1974లో జరిగిన ఉత్తర తెలంగాణ రీజనల్‌ కాన్ఫరెన్స్‌కు చాలా కీలకమైన చారిత్రక పాత్ర ఉంది. ఆ కాన్ఫరెన్స్‌లో ముగ్గురితో కూడిన రీజనల్‌ కమిటీ ఏర్పడింది. ఎమర్జెన్సీ కంటే ముందు రాష్ట్ర కమిటీ తరువాత అదే అత్యంత కీలకమైన కమిటీ. ఆ కమిటీలో ఆ తరువాతి కాలంలో మావోయిస్టు పార్టీ కార్యదర్శి అయిన గణపతి ఒక సభ్యుడైతే ఆ కమిటీకి కార్యదర్శిగా ఎన్నికైనవాడు చిరంజీవి. అతనిది దళిత నేపథ్యం. కార్యదర్శి అయిన కొద్దికాలానికే అరెస్టు అయ్యి ఆ తరువాత విప్లవోద్యమం నుండి దూరం అయ్యాడు. ఉద్యమంలో కొనసాగక పోవడంతో నాయకత్వంలో కొనసాగలేదు. అంటే పీపుల్స్‌ వార్‌ పార్టీ తొలినాళ్ళలోనే ఆ పార్టీ అగ్ర నాయకులిద్దరు దళితులు.

ఉద్యమం విస్తరించేకొద్దీ రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ గొప్ప విప్లవోద్యమ నాయకులుగా పీడిత ప్రజలందరికీ ప్రీతిపాత్రమైన నాయకులుగా ఎదిగినవాళ్ళు వందలాది మంది పీడిత కులాలు, వర్గాల నుండి వచ్చిన వాళ్ళే. ఎన్ని పేర్లని లెక్కించగలం? సుదీర్ఘ కాలం బీహార్‌ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసి పోలిట్‌ బ్యూరో సభ్యుడై గత సంవత్సరమే అమరుడైన కా. దేవ్‌ కుమార్‌ సింగ్‌, కేంద్ర కమిటీ సభ్యులుగా ఎదిగిన కా. శీలం నరేశ్‌, రాజమౌళి, చంద్రమౌళిలు, ఏపి రాష్ట్ర కార్యదర్శులైన పులి అంజన్న, మాధవ్‌లు, వెంకటస్వామి (సూర్యం సారు), ఐలన్న, మహేందర్‌, రెడ్డప్ప వంటి డజన్ల కొద్దీ రాష్ట్ర స్థాయి నాయకులు, గజ్జెల గంగారాం, జన్ను చిన్నాలు, పెద్ది శంకర్‌, రామేశ్వర్‌, హరిభూషణ్‌, కైరి గంగారామ్‌, దివాకర్‌, రమేశ్‌ వంటి దళిత నేపథ్యం నుండి వచ్చిన జిల్లా స్థాయి, రీజనల్‌ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు, పీడితకులాల నుండి వచ్చిన న్యాలకొండ రజిత (పద్మ), లక్ష్మి (మహిత), గంజు ఊర్మిళ (దళిత), అజిత వంటి రాష్ట్ర స్థాయి నాయకులయిన మహిళలు, రాష్ట్ర స్థాయికి నాయకులుగా ఎదుగుతూ అసువులు బాసిన తిరుపతి పద్మ, ఎల్లంకి అరుణ వంటి వారు. విప్లవోద్యమ క్రమంలో రాజ్యం చేతిలో వీరి ప్రాణాలు పోకపోయి ఉంటే వీరిలో ఎందరో ఇంకా ఉన్నత నాయకత్వ స్థానాలకు ఎదగగలిగే వాళ్ళు (అమరులైన వారిలో చాలా కొద్ది మంది పేర్లు మాత్రమే ఇక్కడ పేర్కొన్నాను. ఉద్యమంలో నేటికీ నాయకత్వం వహిస్తున్న వారి గురించి ఇందులో రాయలేదు).

ఈ అద్భుతమైన విప్లవ నాయకులను సృష్టించింది విప్లవోద్యమమే. ఇక బీహార్‌లోనైతే తొలుత విప్లవోద్యమ నిర్మాణానికై బెంగాల్‌ నుండి వెళ్ళిన నాయకత్వం తప్ప అక్కడ స్థానికంగా ఎదిగిన నాయకత్వంలో 90శాతం వెనుకబడిన కులాలకు చెందినవారు, దళితులు, ఆదివాసీలే. అక్కడినుండి కేంద్ర నాయకత్వంలోకి, పోలిట్‌ బ్యూరో స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా 90శాతం పీడిత వెనుకబడిన కులాల నేపథ్యం నుండి, దళితుల నుండి, ఆదివాసీల నుండి వచ్చిన వాళ్ళే.

ఆంధ్రప్రదేశ్‌లో, నేటి తెలంగాణాలో వర్గపోరాటంలో నిమగ్నమైన అనేక ప్రజాసంఘాలకు (ఆర్‌ఎస్‌యూ, ఆర్‌వైఎల్‌, ఆర్‌సిఎస్‌, సికాస) ఇతర ప్రజాసంఘాలకు అన్నికులాల నుండి వచ్చిన వారు నాయకత్వం వహించినప్పటికీ ఎక్కువ శాతం పీడిత కులాల నుండి, దళిత నేపథ్యం నుండి వచ్చిన వారే. ఉదాహరణకు 1975 నుండి 1993 వరకు జరిగిన 10 ఆర్‌ఎస్‌యూ మహా సభలల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా మొత్తం 15 మంది ఎన్నికయ్యారు (కొంత మంది ఒకటికి మించిన సార్లు ఎన్నికయ్యారు). వీరిలో అగ్రకులాల నేపథ్యం నుంచి వచ్చిన వారు 7గురు కాగా 8 మంది వెనుకబడిన కులాల నేపథ్యం నుండి, దళిత నేపథ్యం నుంచి వచ్చినవారు. ఆర్‌ఎస్‌యూ రెండవ, మూడవ మహాసభల్లోనే దళిత నేపథ్యం నుంచి వచ్చిన కామ్రేడ్‌ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఇక ఆర్‌వైఎల్‌ మొదటి, రెండవ, మూడవ మహాసభల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన కామ్రేడ్‌ దళిత నేపథ్యం నుంచి వచ్చిన కామ్రేడ్‌. (1984 వరకు జరిగిన ఐదు మహా సభల్లో ఎనిమిది మంది అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నిక కాగా అందులో ముగ్గురిది అగ్రకుల నేపథ్యం, ఒకరిది బిసి నేపథ్యం. మిగిలిన వారి విషయం నా వద్ద సమాచారం లేదు). రైతు కూలీ సంఘం మూడు మహాసభలు జరిగితే అందులో మూడు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన కామ్రేడ్‌ది దళిత నేపథ్యం కాగా, కార్యదర్శులుగా ఎన్నికైన వారిది వెనుకబడిన కులాల నేపథ్యం. రైతుకూలీ సంఘాలు/ క్రాంతికారీ కిసాన్‌ కమిటీలతో పాటు యువజన, మహిళా, సాంస్క తిక సంఘాలలో దళిత-వెనుకబడిన కులాలకు చెందిన పేద, మధ్య తరగతి నుండి నాయకత్వం ఎదిగేలా అభివృద్ధి పరచి, ప్రజల చేత గుర్తింపు పొందేలాగా ప్రయత్నపూర్వకంగా కృషి చేసినట్లే పట్టణాల్లోని ప్రజాసంఘాలలోని నాయకత్వాన్ని కూడా విప్లవోద్యమం అభివృద్ధి చేసింది. దాని ఫలితంగానే ఎన్నో ప్రగతిశీల , విప్లవ మేధావుల సంఘాల్లో కూడా క్రమంగా నాయకత్వంలోని కులాల పొందికలో పీడిత కులాల నేపథ్యం నుండి వచ్చిన వారి సంఖ్య పెరగటం కనిపిస్తుంది. కొన్నింటిలోనైతే అగ్ర నాయకత్వంలో మొత్తం గానే దళిత, వెనకబడిన కులాల నేపథ్యం నుంచి వచ్చిన వారే ఉన్నారు. పరోక్షంగా విప్లవోద్యమ స్ఫూర్తితో ఏర్పడిన మహిళా సంఘం నాయకత్వంలో మొదటి నుండి ఇప్పటి వరకు అత్యధికంగా దళిత, వెనుకబడిన కులాల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే ఉండటం చూస్తాం.

విప్లవోద్యమ నాయకత్వంలో నేటి పరిస్థితి చూస్తే విప్లవోద్యమ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ, దండకారణ్యం, ఆంధ్ర-ఒడిషా బార్డర్‌ కమిటీ, జార్ఖండ్‌ స్పెషల్‌ ఏరియా కమిటీ, బీహార్‌ స్పెషల్‌ ఏరియా కమిటీ, మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌-మధ్యప్రదేశ్‌ కమిటీల కార్యదర్శులు, అక్కడి సైనిక నాయకత్వం కూడా పీడిత కులాల నేపథ్యం నుండి, దళితులు, ఆదివాసీల నుండి వచ్చినవారే.

మొత్తం దక్షిణాది మూడు రాష్ట్రాలకు నాయకత్వం వహించిన బ్యూరో కార్యదర్శి, (కేంద్ర కమిటీ సభ్యుడు), కమ్యూనిస్టు మేధావి అయిన అమరుడు కా.యోగేష్‌ (కుప్పు స్వామి) దళిత క్రిష్టియన్‌ నేపథ్యం నుండి వచ్చినవాడే. 2004లో మావోయిస్టు పార్టీ ఏర్పడిన నాటికే పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా ఉన్న మరొక దళిత నేపథ్య కామ్రేడ్‌ ఆ తరువాతి కాలంలో అరెస్టయ్యాడు.

1970లో సిపిఐ (ఎంఎల్‌) కేంద్ర నాయకత్వంలో 90 శాతానికి మించి అగ్ర కులాలకు చెందిన వారు కాగా, 2004 నాటికి మావోయిస్టు పార్టీ కెేంద్ర నాయకత్వంలో 49 శాతం అగ్ర కులాలకు చెందిన వారైతే, 51 శాతం వెనుకబడిన కులాలు, దళితులు, ఆదివాసీలు, మతపరమైన మైనారిటీలకు చెందిన వారు. ఎందరో కేంద్ర నాయకుల అరెస్టులు, ఎన్‌కౌంటర్‌ హత్యలు జరిగి కొత్త వారు నాయకత్వంలోకి ఎదిగిన తర్వాత ఈ రోజు ఆ పార్టీ కేంద్ర నాయకత్వంలో అగ్రకులాల నేపథ్యం నుంచి వచ్చిన వారు 31 శాతం కాగా, 69 శాతం దళితులు, ఆదివాసీలు, మతపరమైన మైనారిటీలకు చెందినవారు. ఈ స్థాయిలో పీడిత కులాల నుండి కేంద్ర నాయకత్వంలో మరే పార్టీలోనూ లేదంటే అతిశయోక్తి కాదు.

అవాస్తవాలతో, వక్రీకరణలతో సుజాత గిడ్ల తన పుస్తకంలో ʹఅగ్రకులాలకు ఆయుధాలు, దళితులకు చీపుర్లు ఇచ్చారʹని రాసింది కానీ మావోయిస్టు పార్టీలో అగ్రకుల ఆధిపత్యం ఉంటే పైన పేర్కొన్న మార్పు ఎట్లా జరిగేది? గత సంవత్సరం మావోయిస్టు పార్టీ నాయకత్వంలో చేసుకున్న మార్పుల గురించి పత్రికలలో వచ్చిన ఆ పార్టీ పత్రికా ప్రకటన ప్రకారం పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కామ్రేడ్‌ నంబల్ల కేశవరావుది వెనుకబడిన కుల నేపథ్యం కాగా, కేంద్ర సైనిక కమిషన్‌ బాధ్యుడు కా. తిప్పిరి తిరుపతి దళిత నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తి.

మరి తొలుత 90 శాతం దాకా అగ్రకులాల నేపథ్యం నుంచి వచ్చిన వారి నాయకత్వంలోనే ఈ మార్పెలా సాధ్యమైంది? ఎందుకంటే వీళ్ళంతా నిఖార్సయిన కమ్యూనిస్టు విప్లవకారులు. వర్గ రహిత, కుల రహిత సమాజం కోసం స్వప్నించి, ఆ స్వప్న సాకారం కోసం తమను తాము డీక్లాసిఫై చేసుకొని, తమ జీవితాన్ని అందుకు అంకితమిచ్చిన వాళ్ళు కావటం వల్లే ఇది సాధ్యమైంది.

వివక్ష ఉందని ఎప్పుడు అనవచ్చు? ఒక కమిటీలోకి ఎన్నికైన ఒక వ్యక్తి కంటే వేరే ఎవరికైనా దాదాపుగా సమానమైన విప్లవజీవితం, రాజకీయ సైద్ధాంతిక అనుభవం, దక్షత ఉన్నప్పటికీ వారిని ఆ కమిటీలోకి తీసుకొనకపోతే అప్పుడు వివక్ష ఉన్నట్టు. అటువంటి నిర్దిష్టమైన ఆరోపణ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ విప్లవ పార్టీపై వచ్చిన దాఖలాలు లేవు.

విప్లవోద్యమంలో నాయకత్వానికి ఎదగటానికి రిజర్వేషన్లు ఉండవు. కానీ పీడిత వర్గాల నుండే కాక పీడిత కులాల నుండి కూడా నాయకత్వాన్ని ఎదిగించాలనే ప్రయత్నపూర్వకంగా కృషి చేయడం, నాయకులుగా ఎదగడానికి ప్రత్యేక తర్ఫీదు చర్యలు, నాయకత్వంలోకి ప్రమోషన్ల సమయంలో పాజిటివ్‌ డిస్క్రిమినేషన్‌ (సకారాత్మక వివక్ష) వంటి చర్యలు చేపట్టడం వల్లనే ఈ మార్పు సాధ్యమైంది.

దళిత వెనుకబడిన కులాలకు, ఆదివాసీలకు చెందిన పీడిత ప్రజలు వర్గ పోరాటంలో సుశిక్షితులవుతూ వివిధ ప్రజాసంఘాలలో, విప్లవ ప్రజా కమిటీలలో, పార్టీ, ప్రజావిముక్తి గెరిల్లా సైన్య నిర్మాణాల్లో కేవలం గ్రామ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర, కేంద్ర స్థాయి నాయకత్వాల్లోకి రావడం అనేది పెరగడం విప్లవోద్యమం సాధించిన విజయం.

అట్లాగే విప్లవోద్యమం సాధించిన మరో గొప్ప విజయమేమిటంటే భారత సమాజం లోని విశాలమైన గ్రామీణ ప్రాంతాల్లో, సాయుధ వ్యవసాయ విప్లవోద్యమం ద్వారా దళిత తదితర వెనుకబడిన కులాల పేద ప్రజలతో పాటు అగ్రకులాల పేద, మధ్య తరగతి ప్రజలను రాజకీయంగా సమీకరించి సంఘటితం చేస్తూ సుదీర్ఘ కాలం పాటు భూస్వామ్యాన్నీ, అగ్రకుల దురహంకారాన్నీ ఎదుర్కొని దానిపై దెబ్బ మీద దెబ్బ తీసి దాని పునాదులనూ, దానిపై ఆధారపడిన బ్రాహ్మణీయ అగ్రకుల విలువలనూ కుదిపివేస్తూ ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ఒక నూతన ద క్పథాన్నీ, నూతన పోరాట మార్గాన్నీ ముందుకు తేవడం.

సిద్ధాంతంలో కానీ, ఆచరణలో కానీ ఇప్పటి వరకు సాధించిందే అంతిమం కాదు. పోరాట క్రమంలో విప్లవోద్యమం తన అనుభవాల నుండీ, ఇతర అన్ని ఉద్యమాల నుండీి నేర్చుకుంటూ, తప్పులను సరిదిద్దుకుంటూ సిద్ధాంతాన్నీ, ఆచరణనూ మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగుతున్నదని చెప్పటమే ఈ వ్యాస ఉద్దేశ్యం. కుల నిర్మూలన కోరుకునే వాళ్ళందరూ ఇందుకు సకారాత్మకంగా దోహదపడినప్పుడు ఈ ప్రక్రియ మరింత వేగవంతమౌతుంది. అట్లా చేయకుండా తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం విప్లవోద్యమంపై కువిమర్శలు, దాడి చేసే వాళ్ళను చరిత్ర పెంటకుప్ప మీదికి విసిరేస్తుంది.

(ఈ వ్యాసానికి ఆధారాలు: ఏడున్నరేళ్ళ నా జైలు జీవిత కాలంలో ఎందరో మావోయిస్టు పార్టీ నాయకులతో మాట్లాడి తెలుసుకున్న విషయాలు నా కేసులలో, ఇతరుల కేసులలో మావోయిస్టు నాయకుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లలో పేర్కొనటం తలలకు వెలలు ప్రకటిస్తూ పోలీసులు ప్రకంచిన మావోయిస్టు నాయకుల లిస్టులు, వారి పుట్టుపూర్వోత్తరాలతో సహా దినపత్రికలలో వచ్చిన వార్తలు bannedthought.net ను భారత ప్రభుత్వం అడ్డుకొనడానికి పూర్వం ఆ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండిన డాకుమెంట్లు)


No. of visitors : 794
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కులం - విప్లవోద్యమ అవగాహన, ఆచరణ - 1

రవి నర్ల | 02.10.2019 09:17:44am

ʹఅగ్రకులాలకు దళితులకు ఉన్న వైరుధ్యమే ప్రధానమని భావించి దీని మీదనే ఆధారపడి వ్యవసాయ విప్లవం చేయొచ్చు కదాʹ అని తలెత్తే ప్రశ్నలకు ఆనాటి పీపుల్స్‌ వార్‌ పార్టీ న...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •