విరసం తో నా అనుబంధం - అనుభవం

| సంభాషణ

విరసం తో నా అనుబంధం - అనుభవం

- కాత్యాయ‌నీ విద్మ‌హే | 02.10.2019 09:46:38am

మీ తొలి నాళ్లలో విరసం ఎలా పరిచయం అయింది?

విరసంతో నాకు పరిచయం కలిగించింది మా నాన్న కేతవరపు రామకోటిశాస్త్రి. 1978 లో అనుకుంటా ..  వరంగల్ లో జరిగిన విరసం సభ కు  ఆయన  నన్ను వెంటపెట్టుకొని వెళ్లారు. కే.వి. రమణారెడ్డిగారిని, త్రిపురనేని మధుసూదనరావు గారిని  , చలసాని ప్రసాద్ గారిని అక్కడే చూసాను. వరవరరావుగారు అప్పటికే తెలుసు. మూడురోజుల ఆ సభలో  నాకు బాగా గుర్తుండిపోయినవి రెండు. ఒకటి - అల్లం రాజయ్య విప్లవ కథకు ముడిసరుకు కాగలిగిన గ్రామీణ జీవిత ఘటనలను ఉదహరిస్తూ చేసిన ఉపన్యాసం.  అందులో చెప్పిన ఆంబోతు ఉదంతాన్ని కేంద్రంగా చేసి  ఆయన  ఆతరువాత  ʹమార్పుʹ కథ వ్రాసాడు.   రెండవది - ఎన్. కె . రామారావు  ʹఒక చేత్తో కంటినీరు తుడుచుకుంటూ/ వేరొకచేత్తో ఎర్రజండ పట్టుకుని / నీ పేరే అంటాము నాగరాజు …ʹ  అంటూ పాడిన పాట.    

1976 తెలుగు ఎంఏ రెండవ సంవత్సరం చదువుతుండగానే నాన్న నన్ను  విశ్వనాథ సత్యనారాయణ గారి సహస్ర చంద్ర దర్శన శాంతి పౌష్టికోత్సవానికి విజయవాడకు  వెంటపెట్టుకొని వెళ్లారు. కానీ ఆ సభ వెయ్యని గాఢమైన ప్రభావం ఏదో ఈ సభ నామీద వేసింది.

1980 ఆగస్టు 17 న కొడవటిగంటి కుటుంబరావు మరణించిన్నప్పుడు   వరంగల్ లో విరసం ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో నన్ను ʹచదువుʹ నవల మీద మాట్లాడమన్నారు. విరసంతో నా స్నేహం అలా మొదలైంది.

విరసం సభలకు, పాఠశాలలకు, కథావర్కుషాప్ లకు  ఎన్నిటికో హాజరయ్యాను. 1984 లో విశాఖలో  కథ, నవల మీద జరిగిన పాఠశాల నాకు బాగా గుర్తుండిపోయింది. రాచకొండ విశ్వనాథ శాస్త్రి, కాళీపట్నం రామారావు క్లాసులు తీసుకున్నారు.  రెండు మూడు కథలు కాపీలు చేయించి అందరికీ ఇచ్చి చదివమన్నారు. మర్నాడు  వాటిమీద చర్చ. చాలా ఆసక్తికరంగా సాగింది. ఆ పాఠశాలలో నవల మీద మాట్లాడవలసిన వాళ్లెవరో ఏ కారణాల చేతనో రాలేదు. చివరకు మిగిలేది నవల మీద పరిశోధన చేసి  పిహెచ్ డి డిగ్రీ తీసుకొన్నావు కదా  మాట్లాడమని  నిర్వాహకులు అన్నారు. మాట్లేడేసాను. ఆ పాఠశాలలో మహిళలం ముగ్గురమే. నేను, వేమన వసంతలక్ష్మి, గోపరాజు సుధ.

వ్యక్తిగా మీరు రూపొందిన క్రమం మీద దాని ప్రభావం ఏమిటి? ఏ మౌలిక భావాల రూపకల్పనలో విరసం, విప్లవోద్యమ ప్రభావం ఉన్నట్లు గుర్తిస్తారు?

వ్యక్తిగా నేను రూపొందటంలో విరసంతో పాటు విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రభావం,  విద్యార్థి సంఘాలు ఏర్పరచే  జన నాట్యమండలి కార్యక్రమాలు, గద్దర్ గానం మొదలైన వాటి  ప్రభావం కూడా వుంది. విరసం సభకు హాజరయ్యే నాటికి కాకతీయ యూనివర్శిటీ ఆర్ట్స్&సైన్స్ కాలేజీలో నా అధ్యాపక జీవితం మొదలైంది. విద్యార్థుల ప్రశ్నలు, వాళ్ళతో నిత్య సంభాషణ, సృజన పత్రిక  నా అనుభవ ప్రపంచాన్ని, ఆలోచనా ప్రపంచాన్ని కూడా పట్టి కుదిపేశాయి. అధ్యయనాన్ని కొత్తదారి పట్టించాయి.  గతితార్కిక చారిత్రక భౌతిక వాదానికి, మార్క్సిస్టు సిద్ధాంతానికి సంబంధించిన పుస్తకాలు వెతికి చదవటం అప్పటినుండే మొదలైంది. విరసం,  విప్లవోద్యమం -ఉన్న ప్రపంచాన్ని ఎవరికీ ఏ ప్రయోజనాన్ని సమకూరుస్తున్నది అన్న ప్రశ్నతో - విమర్శనా త్మకంగా  పరిశీలించటం, విశ్లేషించటం నేర్పాయి.  ఈ ప్రపంచం మంచికి మారుతుందన్న ఆశను, నమ్మకాన్ని ఇచ్చాయి. అది పోరాడి సాధించవలసినది అన్న అవగాహనను కలిగించాయి.

ఈ క్రమంలోనే సంపదల ఉత్పత్తిలో శ్రమకు ఇచ్చే ప్రతిఫలానికి దాని మార్కెట్ విలువకు మధ్య ఉండే వ్యత్యాసంలోనే దోపిడీ ఉందని, అదే భూస్వాములకైనా, పెట్టుబడిదారులకైనా లాభం అవుతుందని అర్ధమైనప్పుడు చాలా అలజడికి లోనయ్యాను. ఆ సమయంలోనే వరంగల్ లో ʹచైతన్య సాహితిʹ అనే సంస్థ 1979 జనవరి 7 న ఏర్పాటు చేసిన యువ వక్తల సమావేశంలో మాట్లాడటానికి రావిశాస్త్రి కథలను ఎంచుకొనటానికైనా  అందులోనూ  దోపిడీ మాయను విప్పి చెప్పిన ʹపాతదే కథʹ ను, అదనపు విలువ సిద్ధాంతాన్ని సులభ సూత్రంగా బోధించిన ʹబల్ల చెక్కʹ కథను, పీడిత జాతులు తిరగబడి విజయాలను సాధించగలవు అనే దృఢమైన విశ్వాసాన్ని కలిగించిన ʹపిపీలికంʹ కథను, విప్లవాలు ఉవ్వెత్తున్న లేస్తున్న కాలంలో ద్రోహం చేసే అవకాశాలు ఉన్న ఉద్యోగ వర్గాల గురించి హెచ్చరిక అయిన ʹవేతనశర్మʹ  కథకు పరిమితమై ప్రసంగానికి తయారు కావటానికైనా ఆ అలజడి, ఆ ప్రభావమే కారణం. అట్లాగే ఉత్పత్తుల అసమ పంపిణీ అసమానతలను సృష్టిస్తున్నది, ఉన్నవాళ్లను, లేనివాళ్లను శత్రు శబిరాలుగా నిలబెడు తున్నది  అన్న విషయం అర్ధం చేసుకుంటున్నప్పుడు ఆ నాటి నా  అవగాహనను ఒరిపిడి పెట్టుకొనటానికి శ్రీశ్రీ వ్రాసిన ʹఐశ్వర్యం ఎదుట దారిద్య్రంʹ కథ నాకు బాగా ఉపకరించింది.

విరసం వికాసక్రమాన్ని మీరు ఎలా చూస్తారు ?

ఒక సాహిత్య సంస్థ యాభై ఏళ్లుగా కొనసాగటంలో ఉన్నది వికాస స్వభావమే. ఎప్పటికప్పుడు సమకాలీన రాజకీయార్థిక పరిణామాలపై లోతైన  శాస్త్రీయ అధ్యయనం, స్పష్టమైన అవగాహన, అభివ్యక్తి విరసంలో ఉన్నాయి. విరసం ఒక విప్లవ రాజకీయ దృక్పథం గల సాహిత్య సంస్థ. ఆ రాజకీయాల పట్ల గౌరవం గల వాళ్ళు ఆ సంస్థలో ఎంతమంది ఉన్నారో బయట అంతకంటే అనేక రెట్లు అభిమానులుగా ఉన్నమాట కూడా వాస్తవం. అయితే విరసం సభలలో ప్రసంగాలు తరచు రాజకీయాల దగ్గరే ఆగిపోవటం, సైద్ధాంతిక పరిభాషను పదేపదే వల్లించటం, విప్లవోద్యమ నిర్మాణాన్ని ప్రస్తావిస్తుండటం వంటి వాటి  వలన సాహిత్య సంఘంగా అది గిడసబారుతున్నదేమో అన్న సందేహం కలిగే ప్రమాదం ఉంది. ఈ సవాల్ ను ఎదుర్కొనటానికి విప్లవ సాహిత్యం ద్వారా విప్లవ రాజకీయాలను అర్ధం చేయించే పని ఎక్కువగా జరగాలనుకుంటాను.    
 
విరసం వికాస క్రమంలో నన్ను బాగా ఆకట్టుకున్నది   యువతరం భాగస్వామ్యం. ఈ నాడు ఏ సాహిత్య సభలలోనూ కనబడని యువతరం విరసంలో ఉంది.  వాళ్ళు మంచి అధ్యయనపరులు కావటం, నాయకత్వంలోనూ వాళ్ళు కనబడటం సంతోషాన్ని కలిగించే విషయం. ఆ యువతరం ఆకాంక్షలను గమనిస్తూ పరిగణలోకి తీసుకుంటూ పోవటం, వాళ్లకు పని కల్పించి నడిపించటం ఈ సంక్షోభ కాలంలో చాలా అవసరం.  

విప్లవ సాహిత్యోద్యమాన్ని మీరు గమనించే తీరు ఎలా ఉంటుంది?

విప్లవ సాహిత్యోద్యమంలో  కవిత్వం చదువుకున్నాను. శివసాగర్ నాకు ఇష్టమైన కవి. విప్లవోద్యమ గతిక్రమాన్ని, ఉద్వేగాలను, వ్యూహాలను ఆయన కవిత్వం బాగా పట్టుకున్నదని నాకు అర్థమైంది. ఎమ్మెస్, సముద్రుడు, గౌతమ్, కౌముది  మొదలైన వాళ్ళ కవిత్వం చదవటం, వాళ్ళ ఆచరణను తెలుసుకొనటం నాకు ఒక గొప్ప జ్ఞానం. విప్లవోద్యమంలో అమరులైన వాళ్ళ మీద రాసిన కవిత్వం నన్నెంతో కదిలించింది. సాహిత్యంలో భార్యలు మరణిస్తేనో, కొడుకులు మరణిస్తేనో కవిత్వం వ్రాసి దుఃఖం వెళ్లబోసుకొన్నవాళ్ళు ఉన్నారు. స్మృతి కవిత్వంగా  అది ఒక ప్రత్యేక అధ్యయన విభాగం.   రక్త సంబంధాలు  లేనివాళ్ళు విప్లవ బాంధవ్యం వల్ల వియోగ దుఃఖాన్ని వ్యక్తీకరించే ఆ కవిత్వం చదివినప్పుడు అందులోని ఉన్నత మానవీయ విలువలు- ఉత్పత్తి ఫలితాలు శ్రామిక  ప్రజలకు దక్కాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఒక ఆచరణలోకి రావటం ఒక్కటే సామాన్యమైన లక్షణం అయినవాళ్లు ఒకరికొకరు ఎంత ప్రేమాస్పదులు అవుతున్నారో తెలుస్తూ హృదయం కరిగి కన్నీళ్లయ్యేది. విప్లవోద్యమంలో స్మృతి కవిత్వం అనే అంశం మీద పరిశోధన చేయించాలని కూడా అనుకున్నాను. చేస్తానని ప్రారంభించిన సదానందం ఒత్తిడిని తట్టుకోలేక మధ్యలోనే వదిలేసాడు. ఆ తరువాత కొద్దికాలానికే చనిపోయాడు.

విప్లవోద్యమ పాట విన్నాను. కథ, నవల చదువుకున్నాను. పాట నా హృదయాన్ని తాకి ఉత్తేజాన్ని ఇస్తే కథ నవల విప్లవోద్యమగతిక్రమాన్ని రక్తమాంసాలున్న మనుషుల చలన చైతన్యాల సంగీతం ద్వారా ఏక కాలంలో హృదయదఘ్న అనుభవాన్ని, రాజకీయ దృకథాన్ని ఇచ్చాయి. 1985 లో మొదటిసారి విప్లవ కథపై కదలిక పత్రిక కోసం ఒక వ్యాసం వ్రాసాను. అది ఒక సంక్షోభ కాలపు వ్యాసం. పౌరహక్కుల నాయకుడు పిల్లల డాక్టర్ రామనాథంగారి హత్య తరువాత వరవరరావు గారు, జీవన్ కుమార్ గారు వరంగల్ వదిలి వెళ్ళిపోయాక ఒక ఒంటరి నిశ్శబ్దంలో ఒత్తిడినుండి ఒక ఓదార్పును, విశ్వాసాన్ని పుంజుకొనటానికి  అది వ్రాయటం నాకెంతో ఉపకరించింది. ఏదన్నా వ్యాసం వ్రాస్తే వివి ఇంటికి వెళ్ళి ఆయనకు చూపించి,  ఆయన సలహాలు సూచనలు తీసుకొని ఆ మేరకు మార్పులు చేర్పులు చేసే అలవాటు నాది.  వివి చూడకుండానే ప్రచురణకు పంపిన వ్యాసం అది. నాకెంతో ఇష్టమైన విప్లవ కథ నవలా రచయిత అల్లం రాజయ్య గారు ఆ వ్యాసం చదివి నాకు ఉత్తరం వ్రాయటం … నాకు ఇష్టమైన జ్ఞాపకం. ఉత్తరాలలో ఆ వ్యాసం ఇంకా ఎలా మెరుగుపరచవచ్చో రాజయ్య గారు సూచించారు.  ఆ సందర్భంలోనే అట్లాగే సూచనలు చేస్తూ సుధ అనే పేరుతో అనేక ఉత్తరాలు వ్రాసినది బిఎస్ రాములు గారే అని ఆ తరువాత నాకు తెలిసింది.
 
విప్లవోద్యమ సృజన సాహిత్యం అంతవరకు నాకు తెలియని గ్రామాలను, అడవులను , రైతాంగాన్ని, వాళ్ళ సమస్యలను, సహనాన్ని, తెగింపును, తెలివిని నాకు ఎరుక పరిస్తే సిద్ధాంత వ్యాసాలు, సాహిత్య విమర్శవ్యాసాలు జీవితాన్ని అయినా, సాహిత్యాన్ని అయినా అర్ధంచేసుకొనటానికి కొత్త చూపును ఇచ్చాయి.

ఈ యాభై ఏళ్లలో  విరసం సాధించిన విజయాలను ఎలా సూత్రీకరిస్తారు?

ఇన్నాళ్లుగా ఉపాంతీకరించబడిన సమాంతర జీవిత సంస్కృతి ఏదైతే ఉందొ దానిని సాహిత్యంలోకి సాధికారంగా ప్రవేశపెట్టటం, ప్రజల భాషను నిజమైన అర్ధంలో సాహిత్యభాషగా చేయటం, ప్రత్యామ్నాయ సామాజిక రాజకీయార్థిక నిర్మాణాలను, ప్రత్యామ్నాయ సంస్కృతిని అభివృద్ధి పరిచి స్థాపించటం విరసం సాధించిన విజయాలు.  

సాహిత్య చరిత్ర పరిశోధకులుగా విరసం ప్రభావాన్ని ఎలా అంచనా వేస్తారు?

 విరసం కృషి ఉత్పత్తి వనరులు, పంపిణీ అనే అంశాలకు పరిమితమయ్యే కావచ్చు, సాహిత్య రంగంలోకి సమాజంలోకి కూడా  సమానతను ఒక విలువగా చాలామంది మనసులకు ఎక్కేలాగా చేయగలిగింది. ఒక సారి అసమానతలోని అన్యాయం అర్ధం అయ్యాక అది ఏ రూపంలో వున్నా గుర్తించటం, నిరసించే చైతన్యం ప్రదర్శించటం, నిర్మూలించే ఆచరణకు దిగటం సులభం అవుతుంది. స్త్రీవాద దళితవాద మైనారిటీ ప్రాంతీయ ఉద్యమాలన్నిటికీ ఆ రకంగా దారిని సుగమం చేసింది విరసం. ఈ నాడు అనేక సమూహాలు ఎక్కడికక్కడ ప్రాంతీయ సమస్యలపై పోరాటాలకు దిగటానికి నేపథ్యంలో  వున్నది విరసం ప్రభావం, విప్లవోద్యమ ప్రభావం అని  చెప్పక తప్పదు. విరసం కూడా వాటిని కనిపెట్టి వాటిలో భాగం అవటం ద్వారా వాటిలోని డైనమిక్స్‌ను   సృజన సాహిత్యంలోకి అనువదించే పని చెయ్యాలి.

విప్లవ రచయితలతో మీ వ్యక్తిగత సాన్నిహిత్యం ..?

విప్లవ రచయితల సంఘంలో మొదటి తరంలో వరవరరావు మా నాన్నతో  పి హెచ్ డి కోసం పనిచేశారు. ఆ పనిలో ఆయన మాఇంటికి వస్తుండటం, నాన్నతో చర్చోపచర్చలు చేయటం నాకు బాగా తెలిసిన విషయమే. ఆయన, నేను ఒకే బాచ్ లో పి హెచ్ డి కి ప్రవేశం పొందాం. కొడవటిగంటి కుటుంబ‌రావు మీద కలిసి పని చెయ్యాలనుకున్నాం. కొడవటిగంటి కుటుంబ‌రావు వాజ్మయ జీవిత సూచిక తో మొదలుపెట్టాలని అనుకోని నేనా పని ప్రారంభించి ఒక డ్రాఫ్ట్ వ్రాసి ఇస్తే దానిని సమగ్రం చేయటానికి ఎందరెందరి దగ్గరకు దానిని పంపారో లెక్కలేదు, తీరా దానిని అచ్చువేయాలనుకునే సరికి ఆయన జైలులో … ఆగకు వేసెయ్యమంటే ఆయన ముందుమాటైనా లేకుండానే 1986 లో ఆ పుస్తకం ప్రచురించ వలసి వచ్చింది. ఆయనతో చేసే సంభాషణ లో ప్రత్యేకంగా చెప్పినట్లు ఉండదు కానీ, నేను చేయవలసిన పని ఏమిటో నాకు తెలుస్తుంటుంది.

  ఇక సత్యమూర్తి గారు, చలసాని ప్రసాద్ గారు, త్రిపురనేని మధసూదనరావు నాన్నకు 1955 నాటికి గుడివాడ కాలేజీలో నాన్నకు విద్యార్థులు.ఆ రకంగా స్నేహితులు. సన్నిహితులు..1990 లో సత్యమూర్తి గారు మానాన్నతో మాట్లాడటానికి ఇంటికి వచ్చినప్పుడు ఆయనను చూసాను.ఒకటి రెండు మాటలు తప్ప నేను ఆయనతో సంభాషణ చేసింది లేదు.  ʹనా మల్లియ రాలేనుʹ పాడుతుంటే విని అందులోని అనురాగ విషదా లన్నీ పలికించిన ఆ స్వరం ఇంకా ఎదలోతులలో ప్రతిధ్వనిస్తూ నే వుంది.

నాన్న తో విశాఖ కు వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా ప్రసాద్ గారి తో, మధుసూదనరావు గారితో సమావేశం తప్పనిసరి.  వాళ్ళ సంభాషణకు నేను శ్రోతను. నా పరిశోధనల పట్ల ఇద్దరూ ఆసక్తిగా ఉండేవాళ్ళు. ఏమి చేస్తున్నానో అడిగి తెలుసుకొనే వాళ్ళు. అవసరమైన సూచనలు ఇచ్చేవాళ్ళు. నాన్న చనిపోయాక (1991) నాన్న తో స్నేహాన్ని నాతో కొనసాగించారు. కలిసినప్పుడల్లా సాహిత్యం, మహిళా ఉద్యమాలు - ఈ రెండింటి చుట్టే మా సంభాషణ.విరసం గురించి, శ్రీశ్రీ గురించి  చలసాని ప్రసాద్ గారు ఎన్నెన్ని కబుర్లు చెప్పే వారో...!?   ఎన్. రుక్మిణి విరసం నుండి నాకొక మంచి స్నేహితురాలు అయింది. కొన్నేళ్ల గా పాణి తో స్నేహం పెరిగింది.అతనితో  ఫోన్ల మీద  సంభాషణలు నాకు చాలా అర్థవంతంగా అనిపిస్తాయి.

విరసం మీతో ఎలా ఉంటుందని మీరు ఫీలవుతారు?


విరసం, నాకు నడక, నడత నేర్పిన సంస్థ. నా పట్ల  వాత్సల్యం, స్నేహం రెండూ పంచిన, పంచుతున్న సంస్థ. విరసం విలువల చట్రం నుండి, విరసం నియమాలకు అనుగుణంగా నా పని విధానం ఉండాలన్న హెచ్చరికలు కూడా స్నేహం గానే చేసిన సందర్భాలూ ఉన్నాయి. అందువల్ల విరసం నన్ను తన మనిషిగానే చూసింది అనుకుంటాను. 

ఈ యాభై ఏళ్ల సందర్బంగా మీకెలా అనిపిస్తున్నది?


Long live విరసం. గత యాభై ఏళ్ల అనుభవాల్ని సమీక్షించుకుని చూస్తే విప్లవ ఉద్యమ భావజాలాన్ని మధ్యతరగతి చదువుకున్న వర్గాలలో వ్యాపింప చేయటంలో విఫలమైన విషయం గుర్తించగలం.దానిని అధిగమించే మార్గాల గురించి ఆలోచించటం ,ఆచరణ కార్యక్రమాన్ని ఎన్నుకోవటం ఇప్పుడు విరసం చెయ్యాల్సిన పని అనుకుంటున్నాను. ప్రజా స్వామిక భావజాలం గల వ్యక్తులతో, సంస్థలతో అతి వాదానికి పోకుండా ఏర్పరచుకునే సంబంధాల ద్వారా మాత్రమే విప్లవ భావజాలాన్ని భిన్న సమూహాలలో ప్రవేశ పెట్ట గలుగుతాము.మరో యాభై ఏళ్ల సాంస్కృతిక ఉద్యమానికి విరసం దిశా నిర్దేశం చేస్తుంది అని నమ్ముతున్నాను. 

ప్రరావే బాధ్యులుగా విరసంతో మీ సంబంధం ఎలా అనిపిస్తుంది?

విప్లవరచయితలతో వ్యక్తిగత సాన్నిహిత్యం సంగతి సరే, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వల్ల విరసంతో ఏర్పడిన సంస్థాగత స్నేహాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రరవే పదేళ్ల క్రితం స్త్రీల భిన్న అస్తిత్వ సమూహాల ప్రాతినిధ్యాలతో ఏర్పడిన ఒక స్వతంత్ర సంస్థ. తొలి నుండి ఇందులో ఇష్టంగానూ, బాధ్యతగానూ పనిచేస్తున్న నేను విరసం ప్రరవే పట్ల ఎంత స్నేహంగా ఉందో చెప్పగలను. రచయిత్రులను సమూహంగా శక్తిమంతం చేయటం , సామాజిక సంఘర్షణలు, ప్రజాసమస్యలు కేంద్రంగా ప్రజాస్వామిక దృక్పథాన్ని రాజకీయ పదునుతో అభివృద్ధి పరుచుకొనటం, దానిని రచనగా మలచటం లక్ష్యంగా ఏర్పడిన ప్రరవే ప్రజాస్వామిక దృక్పథమూ, సంస్కృతీ గల ఇతర సంఘాల వారిని కలుపుకొంటూ, వారి అనుభవాలను, జ్ఞానాన్ని పంచుకొంటూ, అవసరమైన సందర్భాలలో కలిసి నడిచింది. ఆ క్రమంలో మాకు సన్నిహితంగా వచ్చిన మిత్ర సంస్థ విరసం.రత్నమాల, నల్లూరి రుక్మిణి తదితర మిత్రులు ప్రరవేలో క్రియాశీల సభ్యులు. విరసం కంటే భిన్నమైన స్వతంత్ర వ్యక్తులుగా మహిళా రచయితలుగా వాళ్ళు ఇందులో భాగస్వాములైన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. స్థలం, కాలం, సందర్భం డిమాండ్ చేసిన అంశాలపై నిర్వహించిన సదస్సులలో కృష్ణాబాయి వంటి సీనియర్ రచయితల నుండి పద్మకుమారి, వరలక్ష్మి వంటి వాళ్ళు ఇష్టంగా వచ్చి పాల్గొన్నారు. ప్రసంగించారు. పాణి, ఖాదర్ మొయినుద్దీన్ , కల్యాణరావు వంటివారు ప్రరవే ఒక స్వతంత్ర సంస్థగా నిలబడి పనిచేస్తున్నందుకు సంతోషించారు. సంస్థలు ఎలా నడవాలో దానికి సంబంధించిన రాజకీయ ఆదర్శం ఒకటి విరసానికి ఉండవచ్చు. ఒకటి రెండు సందర్భాలలో ప్రరవే పనితీరుతో విభేదించినా ప్రభావితం చేయాలనో, అదుపు చేయాలనో విరసం ఎన్నడూ అనుకోలేదు.

No. of visitors : 530
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

International Seminar on Nationality Question

AIPRF | 20.11.2018 11:30:05pm

AIPRF - International Seminar on Nationality Question | Delhi | 16 - 19 Feb 1996| William Hinton | Saibaba | Varavararao | Ngugi |Noam Chomsky...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •