అక్షర సాహసులకు చైతన్య స్ఫూర్తి విరసం

| సాహిత్యం | వ్యాసాలు

అక్షర సాహసులకు చైతన్య స్ఫూర్తి విరసం

- అశోక్ కుంబ‌ము | 02.10.2019 09:56:17am


విరసం తన యాభై ఏండ్ల సాహిత్య ప్రయాణంలో తెలుగు నేల మీద వేలాది మందిని ప్రభావితం చేసిందనడం ఒక చారిత్రక వాస్తవం. ఎంతో మంది కవులకు, కళాకారులకు, రచయితలకు, ఆలోచనాపరులకు స్ఫూర్తిని ఇవ్వడమే కాదు, తమ రాజకీయ స్పృహను ప్రకటించుకొనే ధైర్యాన్ని కూడా ఇచ్చింది. అలాగే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నక్సల్బరీ రాజకీయ పంథానే దేశంలోని అనేక సమస్యలకు సమాధానమనే విశ్వాసంతో విప్లవ రాజకీయాలను నిబద్ధతతో ఎత్తిపట్టింది. యాభై ఏండ్లుగా ఎంతో మేధోశ్రమ, రాజకీయ పోరాటాలు చేయగలిగిందంటే చరిత్ర తనకిచ్చిన అవకాశాన్ని విరసం అందిపుచ్చుకోవడమే.

ఒక రచయితల సంఘం ఇంత సుధీర్ఘ కాలం తాను నమ్మిన విప్లవ రాజకీయాల కోసం సాహిత్యాన్ని కార్యరంగంగా ఎంచుకొని ప్రజలలో పనిచేయడం ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన అంశం. దాదాపు మూడు తరాలను తనలో భాగం చేసుకొని విప్లవ చైతన్యాన్ని నింపుతున్న విరసం అక్షర సాహసులకు ఎందరికో ఒక చెరగని స్ఫూర్తి. అయితే అర్థ శతాబ్ధపు విరసం సాహిత్య, రాజకీయ కృషిని అంచనా వేయడమంటే దేశ రాజకీయార్థిక, సామాజిక సంబంధాలను విశ్లేషించుకోవడమే. ఎందుకంటే తన పుట్టుక నుండి ఇప్పటి వరకు అన్ని స్థలకాలాలలో విరసం అజెండ ప్రజా రాజాకీయాలతో, ఉద్యమాలతో, సామాజిక మార్పులతో ముడిపడివున్నది.

ఒక రచయితల సంఘంగా మొత్తం సమాజంపై, ముఖ్యంగా ప్రజా ఉద్యమాలపై విరసం ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా తేలికైన పని కూడ. ఎందుకంటే సమాజంలో జరిగే ప్రతి సంక్షోభ, సంఘర్షణ, పోరాట సందర్భాలలో విరసం బాధితుల, బలహీనుల, అణిచివేతకు గురవుతున్న కులాల, వర్గాల, జాతుల, లింగాల పక్షాన నిలబడి తన గొంతును వినిపించింది. చరిత్ర పొడువునా అభాగ్యులకు అండగా నిలబడింది. అయితే విరసం ఆ పనిని ఒంటరిగా ఏమి చేయక పోయినా అన్ని న్యాయమైన ప్రజా ఉద్యమాలతో కలసి నడిచింది. ఈ విషయాన్ని వివిధ రంగాల సృజనకారులు, బుద్ధిజీవులు యాభై ఏండ్ల విరసం సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది.

అయితే విప్లవ రాజకీయ పార్టీల, సంస్థల ప్రయాణాన్ని ఎందుకు అంకెలుగా గుర్తుచేసుకోవాలి, వాటిని ఎందుకు "సెలబ్రేట్" చేసుకోవాలి అనే ప్రశ్న వేసుకోవడం కూడా అవసరం. ఎందుకంటే అదేదో ఒక మైలురాయి దాటినట్లుగా కాకుండా ఆయా పార్టీలు, సంస్థలు తీవ్ర ప్రతికూల పరిస్థితులల్లో కూడ ఏ విధంగా ప్రజల పక్షాన పనిచేస్తున్నాయో ప్రజలకు వివరిస్తూనే, తన ప్రయాణంలోని అవకతవకలను స్వీయవిమర్ష చేసుకొని ఇంకా చేయవల్సిన పనులు, చేరవల్సిన లక్ష్యాల గురుంచి సమీక్షించుకునే ఒక సందర్భంగా తీసుకోవడమే ఈ అంకెల లెక్క. అంతేకాదు సమాజం తరుపున అనేక నిర్బంధాలను, అణిచివేతలను ప్రతిఘటిస్తూ నిలబడిన విరసానికి కొత్త ఉత్సాహన్ని ఇవ్వడం కూడా అవుతుంది.

ఒక వ్యక్తి రాజకీయ స్పృహను (ముఖ్యంగా విప్లవ రాజకీయ స్పృహను) కేవలం ఉపరితలంలో (superstructure) ఉండే సాహిత్యానికి, కళలకు, వ్యక్తి ఇష్టాయిష్టాలకు పరిమితం చేయలేము. ఆయా వ్యక్తులు పునాది (base) అంశాలతో, వర్గ పోరాటాలతో ఎలాంటి సంబంధం కలిగివున్నారు అనేది కూడా ప్రధానమైనది. పునాది-ఉపరితలం లేదా ఉనికి-స్పృహ (being and consciousness) చర్చకు ఇది సందర్భం కాదు కాని అవి రెండూ ఒకటిని మరొకటి నిర్ణయించడం కాకుండా, పరస్పరం ప్రభావితం చేసుకొనే గతితార్కిక సంబంధం కలిగి వుంటాయి.

వ్యక్తులపై విరసం ప్రభావం ఒక సరళరేఖలా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే విరసం తన కార్యరంగాన్ని ఉపరితలంలో ఎంచుకున్నప్పటికీ, అది పునాది అంశాలతో, వర్గపోరాట రాజకీయాలతో ఎప్పటికప్పుడు ప్రభావితమవుతూ, ప్రభావితం చేస్తూ నిత్య చలనంలో ఉండే సంస్థ. అంతేకాదు ప్రతి విషయాన్ని (అది కుల, వర్గ, లింగ, జాతి, ప్రాంతీయ రాజకీయాలు ఏమైనా కావచ్చు) విశాల విప్లవ దృక్పధంతో స్థలకాలాల పరిధిలో పరీక్షకు పెట్టి కావాల్సిన దిద్దుబాట్లు చేసుకుంటుంది. ఇంకా దిద్దుబాటు చేసుకోవాల్సింది ఎంతైనా వుండొచ్చు కాని విరసం అన్ని సమస్యలను విప్లవ దృష్టి కోణంతో చూస్తుంది. అందుకే విరసం తన పతాకంలో కలం పట్టుకున్నా రాజ్యం కండ్లకు అది మరోలా కనిపిస్తుంది. అందుకే విరసం మీద నిత్య అణిచివేత కొనసాగుతుంది. ఈ సందర్భంగా విరసం విశిష్టతను ఎత్తిపట్టేందుకు, ఔచిత్యాన్ని అర్థం చేసుకోవడం కోసం దాని ప్రభావం సమాజం మీద, సాహిత్యం మీద ఎలా వుందో మాట్లాడుకుంటూనే అది వ్యక్తులకు కూడా ఎలా విప్లవ స్పృహను కల్పించిందో చర్చించుకోవాలి.

వ్యక్తుల స్పృహ కేవలం ఆలోచనలకు, అక్షరాలకు మాత్రమే సంబంధించింది కాదు. ఎందుకంటే కేవలం ఆలోచనలు మాత్రమే స్పృహను కలిగించవు. మనిషి స్పృహ కేవలం తర్కానికి, పుస్తక జ్ణానానికే పరిమితమయితే, దానిని జీవిత అనుభవంతో, ఆచరణతో పరీక్షించకపోతే తాను తెలుసుకోగలిగిన గూఢార్థ భావనే (abstractions) వాస్తవం అనే భ్రమలో ఉండే ప్రమాదం వుంది. అంతేకాదు ఆలోచనలు కేవలం వ్యక్తి స్వేచ్ఛా స్వీయచేతన (free self-consciousness) ద్వారానే వచ్చేవి కావు. వ్యక్తులు ఏదో ఒక రకంగా సామాజిక వ్యవస్థలతో, వాటిలో ఉండే వైరుధ్యాలతో ప్రభావితమై లేదా ప్రత్యక్షంగా అనుభవించి దాని ద్వారా వచ్చే సారం (essence) సామాజిక ఉత్పత్తిగా (social product) వ్యక్తి అవగాహనలోకి వస్తుంది.

ఒక సామాజిక వ్యవస్థ, అందులోని సంఘర్షణలు అందరి మీద ఒకే రకమైన ప్రభావాన్ని, స్పృహను కలిగించవు. ఎందుకంటే కులం, వర్గం, లింగ భేదాలు వాటికి మాధ్యమికంగా పనిచేస్తాయి. కొన్ని సందర్భాలలో ఈ స్పృహ సామాజిక వ్యవస్థను మొత్తంగా (totality) కాకుండ (compartmentalize చేసి) విడివిడిగా తమ అస్తిత్వ కోణం నుండి మాత్రమే వ్యవస్థను చూస్తుంది. కాని విప్లవకర వాతావరణంలో వ్యక్తులు చాలా చైతన్యపూర్వకంగా తమ కుల, వర్గ, లింగ భేదాల పరిధిని దాటి (transcendence) చరిత్ర గతిని మొత్తంగా పరిశీలిస్తారు, అందులో భాగమవుతారు. అందుచేత వ్యక్తి విప్లవ స్పృహను ఒక సామాజిక, రాజకీయ చారిత్రిక వాస్తవికత (historicity) దృష్టితో చూడాల్సివుంటుంది. అప్పుడే అది వ్యక్తిగత అనుభవవాద స్థాయిని దాటి సామాజిక చైతన్య పరిస్థితికి అద్దం పడుతుంది.

వ్యక్తులు ఒక మానవీయ సమాజ నిర్మాణం కోసం ఏ విధంగా తమ అవసరాలను, కోరికలను, సౌకర్యాలను వదులుకోని త్యాగాలకు సిద్దమవుతరు? వాళ్ళను అంతగా కదిలించే పని కేవలం సాహిత్యం చేయగలుగుతుందా? కేవలం ఒక వర్గంలోనో, కులంలోనో పుట్టడం మూలంగానే విప్లవ స్పృహ వస్తుందా? అలా కేవలం ఒకటి మరో దానికి దారి తీసేలా (mechanical diterministic గా) ఉండవు. ఒక నిర్దిష్ట స్థలకాలాలలో ఆలోచనల, అనుభవాల, ఆచరణల సృజనాత్మక మేలవింపే సరైన రాజకీయ స్పృహను కలిగిస్తుంది. ఆ రాజకీయ స్పృహకు నిస్వార్థం, నిజాయితి, త్యాగనిరతి జతకూడినప్పుడే వాళ్ళు వెళ్ళేది కత్తుల వంతెన మీదని తెలిసినా ప్రజల కోసం చిరునవ్వుతో అడుగులు ముందుకు వేస్తారు. అలాంటి వ్యక్తుల, ప్రజల అనుభవాలు, సాహసాలు అక్షర రూపం దాల్చినప్పుడే అవి ప్రేరణను ఇస్తాయి, ప్రజా ఉద్యమాలకు ఊపిరినందిస్తాయి. ఇది ఒక చక్రీయ (cyclical) ప్రక్రియ. ఈ ప్రక్రియలో వ్యక్తులు చేసే పని కేవలం చారిత్రక భౌతిక పరిస్థితులు కల్పించే అవకాశాలను సరిగ్గా ఎంపిక చేసుకోవడం మీదనే ఆధారపడివుంటుంది. ఆ బయటి పరిస్థితులు (objective conditions) ఉన్నంత వరకు మనం చేసే పని మనం చేయకపోతే మరొకరు చేస్తరు. అయితే కొంత ఆలస్యం అవుతుండొచ్చు అంతే. కాబట్టి వ్యక్తిగతవాదం, వ్యక్తిపూజ, స్వీయ అభినందన విప్లవ సాహిత్యంలో, రాజకీయాలలో ఉండకూడనివి. ఎందుకంటే మన అక్షరాలు ఏవి మనవి కావు. కవులకు, రచయితలకు మొత్తం సమాజాన్ని సమగ్రంగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ జ్ణానాన్ని తిరిగి ప్రజలకే పంచే కవులు, కళాకారులు, రయితలు నూతన సమాజ నిర్మాణ క్రమంలో కేవలం ఒక మంత్రసాని పాత్రను మాత్రమే పోషించగలరు. ఈ సందర్భంలో నా రాజకీయ చైతన్య నిర్మాణానికి విప్లవోద్యమం, విరసం ఎలా దోహద పడినవో విప్లవ సాహిత్య అభిమానులతో పంచుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.

మాది నల్లగొండ జిల్లా అజ్మాపూర్ గ్రామం. కృష్ణపట్టి ప్రాంతం. నాకు ఊహ వచ్చేసరికి దాదాపు వెయ్యి ఇండ్లు ఉండే మా ఊరిని శాసించేది మా ఊరి పెద్ద దొర సీతారామిరెడ్డి. ఆయన ముందు నిటారుగా నిలబడి, కండ్లల్లోకి కళ్ళు పెట్టి మాట్లాడే సాహసం ఎవ్వరూ చేసేవారు కాదు. ఆయన ఊర్లో ఎక్కడైనా నడిచిపోతుంటే ఆ దారిపొడుగునా ఇండ్ల ముందు కూర్చున్న ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా అందరు లేచి నిలబడేవాళ్ళు. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాకపోయేది. కాని నా దృష్టిలో పెద్ద హీరో అనుకునే మా నాయన, మాకు అద్భుతమైన సాహస కథలు చెప్పే మా తాత కూడ లేచి నిలబడుతుంటే ఆ దొరలో ఏదో పెద్ద శక్తి వుందనుకునే వాడిని. అలా నేను కూడా దొర రాగానే లేచి నిలబడి నమస్కారం చేసేవాడిని.

ఊర్లో జీతగాళ్ళ జీతం పెంచాలన్నా, కూలీ రేట్లు పెంచాలన్నా, ఇంకే పని చేయాలన్నా అది దొరే చెయ్యాలి. ఊర్లో జరిగే ప్రతి చిన్న, పెద్ద పంచాయితి దొర వాకిట్లనే పరిష్కారం కావాలి. దొరే ఊరి పోలీస్. ఆయనే న్యాయనిర్ణేత. ఎవ్వరు ఎదురు చెప్పడానికి వీలులేదు. తన వాకిట్లో తాను ఒక్కడే కుర్చీలో కూర్చుంటే మిగతా వాళ్ళందరూ ఎంతసేపైనా కింద కూర్చోవాల్సిందే. నా మదిలో ఇప్పటికీ చెరగని దృశ్యమది. ఆయన ఇంటి ముందు నుండి నడవాలంటే మేము చిన్న పిల్లలుగా హడలిపోయేవాళ్ళం.

ఆ దొరకు ఊరు ఊరంతా ఎందుకు భయపడేవాళ్ళో అర్థం కాకపొయ్యేది. ఎవ్వరు కూడా అది తప్పు అన్నట్లుగా వ్యవహరించేవాళ్ళు కాదు. దానితో దొర అలాగే వుంటడు, మనం ఇలాగే వుండాలి అనే ఒక సాధారణీకరణ (normalization) పరిస్థితి పిల్లలుగా మాకు వచ్చింది. ఆ దొర సామ్రాజ్యంలో ప్రశ్నకు తావేలేదు. దొరనే అన్నింటికి సమాధానం. కుల, వర్గ, లింగ దోపిడీ ఉన్నా వాటిని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరికి లేదు.

అటువంటి పరిస్థితుల్లో ఊరి అవతలకు విసిరేయబడ్డ దళిత వాడలోకి విప్లవ రాజకీయాలు ప్రవేశించాయి. వాళ్ళను చైతన్య పరచడానికి సాయుధ దళం తరచుగా వస్తుందనే వార్త ఊరంతా తెలిసిపోయింది. ఒక రోజు సాయంత్రం మా ఇంటికి దగ్గర్లో డప్పుల చప్పుడు వినిపిస్తుంటే నేను, మా అన్న వెళ్ళబోతుంటే మా నాయనమ్మ వేగంగా వచ్చి మా చెయ్యి పట్టుకోని ఇంట్లోకి గుంజుకోని పోయి "వద్దు కొడుకా, బయటకు పోకండి. ఊర్లకు టార్చిలైటోళ్లు వచ్చిండ్రంట. (నక్సలైట్లు అని పలకడం రాక మా నాయనమ్మ వాళ్ళను టార్చిలైటోళ్ళు అనేది). మాదిగిండ్లల్ల తిరుగుతుండ్రంట. ఆడికి పోకండి" అని బతిమిలాడుతూనే బెదిరించినట్లు చెప్పింది. నాలో అప్పుడు మొదలయ్యింది అసలు ఎవరు ఈ "టార్చిలైటోళ్ళు" అని. మీము పోలేక పోయినం కాని పొద్దున్నే మాదిగవాడ నుండి వచ్చే దోస్తులు చెప్పిండ్రు ఊర్లకు "అన్నలు" వచ్చిండ్రని, చావాట్ల జనాలను పిలిచి మీటింగు పెట్టిండ్రని. దొర గురించే ఎక్కువ మాట్లాడిండ్రని తెలుసుకున్నం. వాళ్ళ చేతుల్లో తుపాకులున్నయని, డప్పు దరువులతో మంచి పాటలు పాడుతుండ్రని తెలుసుకున్నం. కాని మా ఊరోళ్లు కాని ఈ అన్నలకు దొర మీద ఎందుకు కోపమో అర్థం కాలేదు.

ఈ అలజడి కొనసాగుతుండగానే ఒక రోజు సాయంత్రం మా ఇంటికి దగ్గర్లనే వుండే దొర ఇంటి దగ్గర డప్పుల చప్పుడు వినిపించింది. కుతూహలం ఆపుకోలేక ఇంట్లో ఎవ్వరికి కనబడకుండ దొర వాకిట్లకు పోయిన. అప్పటికే అక్కడ వందకు పైగా ఊరి జనాలు ఉన్నరు. అందులో దళితులు ఎక్కువగా వున్నరు. అప్పటికే నాకు ఒక విషయం అర్థమయ్యింది. దొరకు ఏదో కాబోతుందని. అక్కడున్న వాళ్ళ వీళ్ళ చేతుల సందుల నుండి ముందుకు పోయి చూసిన. అక్కడ సాయుధ దళం దొరతో ఏదో మాట్లాడుతుంది. జనాలు చుట్టూ ఉన్నారు. దొర మామూలు మనిషిలా లేడు. అయితే నేను అనుకున్నట్లు అన్నలు దొరను ఏమీ చేయడం లేదు.

మాటలన్నీ అయ్యాక మా ఊరి మస్కూర్ (ఎప్పుడు దొర చుట్టూ పనిమనిషిలా తిరిగే ఒక దళితుడి) దగ్గర తీసుకున్న తువాల దొర మెడ చుట్టూ కట్టి డప్పుల మోతతో, పాటలతో, నినాదాలతో నడిపిస్తుండ్రు. అట్లా ఆ బలవంతుడైన దొరను బక్కపలచని అన్నలు, అక్కలు అంత మంది ఊరి జనాల మధ్య నడిపిస్తుంటే ఆశ్చర్యం తప్ప మరేమీ లేదు. అసలు ఇలాంటివి కూడా జరుగుతాయా అనుకునేంత ఆశ్చర్యం. అప్పటికే "స్వాతంత్ర్యం" వచ్చి దాదాపు నలభై ఏండ్లవుతుంది కాని దొర పెత్తనానికి ఎదురులేదు. అసలు మా ఊరిని ఆ "స్వాతంత్ర్య" నీడలు కూడా తాకలే. కాని అన్నలు ఒక నెల రోజుల్లోనే ఆ దొరను ఊరి వీధులన్నీ తిప్పుతుండ్రు. అదో అద్భుత సన్నివేశం. అది ఇంకా కండ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది.

ఇక మరుసటి రోజు నుండి ఊరు పాతగా లేదు. ఏవో కొత్త గాలులు వీస్తున్నట్లుగా వుంది. దొర వీధుల్లో నడుస్తుంటే భయపడి ఇంట్లోకి పోవడమో లేకా లేచి నిలబడి నమస్కారం పెట్టడమో చేసే పిల్లలు ఆయనను తగులుకుంటనే పోతుండ్రు. ఆ ధైర్యంతోనే ఊరు ఊరంతా నిటారుగా నిలబడినట్లు అనిపించింది. ఇక తర్వాత కాలంలో ఆ దొర పొలాలు దున్నేవాళ్ళు, కౌలుకు చేసేవాళ్ళు కూడా లేక ఊర్లో పెద్ద రైతులు రోజుకింత అన్నం పెడితే తినే పరిస్థితి వచ్చింది. దర్జాగా కాలు మీద కాలేసుకోని కూర్చోని పెద్ద గోల్డ్ ఫ్లాక్ సిగరేట్ తాగే దొర చివరకు ఊర్లో బీడీలు అడుక్కోని తాగే స్థితి వచ్చింది. ఇలా దొర సామ్రాజ్యం కుప్పకూలి పోవడం కండ్లారా చూసిన. కాని ఊర్లోకి వచ్చిన సాయుధులెవ్వరో, వాళ్ళు ఎందుకు మా ఊరిని దొర పీడన నుండి "విముక్తి" చేసిండ్రో, వాళ్ళ రాజకీయాలేంటో ఏమి అర్థం కాలేదు.

ఇవన్నీ ఊర్లో జరుగుతుండగానే నేను సర్వేల్ గురుకుల పాఠశాలకు వెళ్ళిపోయిన. అది రాచకొండ ప్రాంతం. అక్కడ ఊర్లకు ఊర్లు విప్లవోద్యమ ప్రభావంలోకి వెళ్ళిపోయినవి. విప్లవం ఎంతో సహజమైన ప్రక్రియ అయ్యింది. దొర పెత్తనం ఉన్న ఊర్లో నుండి వచ్చిన నాకు అక్కడి వాతావరణం ఎంతో చైతన్యవంతంగా కనిపించింది. సర్వేల్ లో బస్సు దిగగానే కనిపించే "ప్రజా హోటల్," దానికి దగ్గర్లోనే డాక్టర్ పెంటయ్య పెట్టిన చిన్న "ప్రజా వైద్యశాల," ఊర్లో చెప్పులు కుట్టే దళితుడు సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుక కావడం... ఇలా ఎన్నో అబ్బురపరిచే విషయాల మధ్య తిరుగాడడం అదేదో కొత్త ప్రపంచంలో ఉన్నట్లు అనిపించేది. ఇదంతా జరుగుతుండగానే అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి విప్లవోద్యమం మీద ప్రకటిత నిషేధం ఎత్తివేయడంతో ఆ ఊర్లోకి కొత్త ఉత్సాహం వచ్చింది. మా స్కూల్ గోడల మీదికి అందమైన రాడికల్ రాతలు, బొమ్మలొచ్చినయ్. వాటి అర్థం పూర్తిగా తెల్వకపోయినా వాటిని రోజు చదువుకుంటూ నడవడం అలవాటయ్యింది. మనం రాసే కరపత్రాలు, వ్యాసాలు, కవిత్వాలు ఎవరు చదువుతరులే అని ఒక్కోసారి అనిపిస్తుంది కాని ఆ ప్రయత్నాలు ఎప్పటికీ వృధా కావు. ఆ గోడల మీద రాతలు రాసిన రాడికల్స్ ఊహించి ఉండకపోవచ్చు అవి నాలాంటి వాళ్ళను చిన్న వయసులోనే ఎంత ప్రభావితం చేశాయో. ఆ రాతలను ప్రతి రోజూ ఒక మార్చింగ్ మూడ్ లో చదువుకునే వాళ్ళం.

ఇదంతా జరుగుతుండగానే ఒక రోజు ఆ ఊర్లో ప్రజాకోర్టు నిర్వహిస్తున్నారనే వార్త తెలిసింది. ఎలాగైనా పోవాలని అనుకోని నేను నా మిత్రుడు ప్లాన్ చేసుకున్నం. మా స్కూల్ నియమాల ప్రకారం మా గేట్ దాటి బయటకి పోవద్దు. కాని ఎలాగైనా పోవాలని అప్పుడప్పుడే కొత్తగా కట్టడం నేర్చిన లుంగీ కట్టుకోని తలకు తువాలను రుమాలుగా చుట్టుకోని చుట్టుపక్కల ఊర్ల నుండి వస్తున్న జనంలో కలిసిపోయి ప్రజాకోర్టు జరిగే ఊరి మధ్యల ఉన్న దిమ్మె దగ్గరికి పోయినం. అప్పటికే దాదాపు రెండు వందల మంది జనాలు వచ్చి ఆ దిమ్మె చుట్టూ కూర్చొని ఉన్నరు. వాళ్ళ మధ్యలో సాయుధ విప్లవకారులు. అందరూ కూర్చోగానే సభ మొదలయ్యింది. ఆ రోజు పంచాయితి ప్రేమ పెళ్ళికి సంబంధించింది. గౌండ్ల కులానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి పెండ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన కమ్మరి కులం అబ్బాయిని దళ సభ్యులు వేదిక ముందు నిలబెట్టారు. అమ్మాయి తల్లితండ్రులు తమ వాదనను వినిపించారు. ఆ అబ్బాయి కూడా ఏదో చెప్పాడు. తర్వాత దళం అక్కడ పోగైన ప్రజల నిర్ణయాన్ని అడిగింది. "వాడు పెండ్లికి ఒప్పుకునే వరకు అక్కడ వున్న దిమ్మెకు కట్టేయండ్రి" అని అందరూ కూడబల్కుకోని చెప్పిండ్రు. మొదటి అవకాశంగా అదే పని చేయాలని వెంటనే ఆ అబ్బాయిని అక్కడ దిమ్మె స్థంభానికి తాళ్ళతో కట్టిండ్రు.

ఇదంతా సినిమాలో ఎదో సీన్ జరుగుతున్నట్లే వుంది. ఎంతో ఆతృతగా తల పైకి ఎత్తి ఎత్తి చూస్తున్నాము. అప్పుడే ఒక పిడుగులాంటి మాట వినిపించింది ʹఅరే అశోక్, మీరు వచ్చారా?" అని. అది మా ఇంగ్లీష్ సార్ గొంతు. ఆయన మాలాగే లుంగీ కట్టుకోని పక్కనే కూర్చొని వున్నడు. ఇక ఒక్కసారిగ ఒళ్ళంతా వణుకు. ఎందుకంటే అలా బయటికి రావడం, అందులో ఇలాంటి మీటింగ్ కు పోవడం మహా "నేరం." ఇక మా పని అయిపోయిందని అనుకుంటున్నప్పుడే మా కళ్ళ ముందే జరిగిన సహజ, సత్వర న్యాయ పరిష్కారం ఒకసారి మదిలో మెదిలింది. వెంటనే మాకు ఐదు అడుగుల దూరంలో వున్న ఒక అన్న దగ్గరికి పోయి విషయమంతా చెప్పినం. "మా సార్ ఈ మీటింగ్ లో మమ్ముల చూసిండు. ఆయన మా ప్రిన్సిపాల్ కు చెబితే మమ్మల మా ఇండ్లల్లకు పంపిస్తరు. అది జరిగితే మా అమ్మనాయన కొట్టి సంపుతరు. ఎట్లన్న మా సార్ తో మాట్లాడమని" కోరినం. వెంటనే ఆ అన్న మాతో పాటుగా మా సార్ దగ్గరికి వచ్చి "సార్ ఈ తమ్ముళ్ళు ఏమి తప్పు చేయలేదు. ఇక్కడ కూడా మంచి గురించే నేర్చుకుండ్రు కదా. వీళ్ళను ఏమి అనకండ్రి. మీరు కూడా ఇక్కడికి రావడం మాకు సంతోషంగ వుంది" అని ఆ అన్న అనగానే, మా సార్ "అదేం లేదు. నీను ఎవ్వరికి చెప్పను. వీళ్ళిద్దరు మంచి బ్రైట్ స్టూడెంట్స్" అని ధృవీకరిస్తున్నట్లే చెప్పిండు. ఆ మొత్తం సంఘటనలో విప్లవకారుల మీద ఎనలేని ప్రేమ, గౌరవం కలిగింది. ఎందుకంటే ప్రత్యక్షంగా చూడడమే కాదు, వాళ్ళ మూలంగ పెద్ద ఆపద నుండి బయటపడ్డాను కాబట్టి కూడ.

మరికొన్ని రోజులకే మా స్కూల్ గ్రౌండ్ లో జననాట్యమండలి మీటింగ్ అని ప్రకటించిండ్రు. అప్పుడు అంతా "గద్దర్ మీటింగ్" అనే అనేవాళ్ళు. పిల్లలం అంతా ఎంతో ఆతృతతో ఎదురు చూసిన సభ. అన్ని వేల మందిని ఒక్క దగ్గర మొదటిసారిగ చూసిన. అంతేకాదు అసలు ఈ విప్లవకారులు ఎవరు, ఎందుకు ప్రజల కోసం పనిచేస్తున్నారు అనే విషయం మీద మౌలికమైన అవగాహన ఇచ్చిన సభ. "భారతదేశం భాగ్యసీమర ..." పాట నాకు దేశ రాజకీయార్ధిక విషయాల మీద ప్రాధమిక చారిత్రక అవగాహన కల్పించిన మొదటి "గ్రంధం". "దేశభక్తి" మత్తును కూడా వదిలించిన పాట అది. అంతేకాదు అప్పటివరకు దైవభక్తి కూడా బాగానే వుండేది నాకు. ఎంత పిచ్చి అంటే పరీక్షల్లో ప్రతిపేజీకి ఓం రాసి మొదలు పెట్టడమే కాదు, పరీక్ష ప్యాడ్ కు అగరుబత్తులు వెలిగించుకోని మరీ పరీక్ష రాసేవాణ్ణి. ఒకసారి ఆ అగరుబత్తులు నా ముందు కూర్చున్న నా మిత్రుడి షర్ట్ ను కూడ కొంచం కాల్చింది. అయినా నా పద్ధతి మార్చుకోలే. అటువంటిది "ఓరి సాయిబాబో, సన్నాసి బాబా..." పాట మొత్తం నా ఆలోచనలే తలకిందులు చేసింది. ఒక హేతువును నా మెదడులోకి ఎక్కించి భౌతికవాద దృష్టికోణాన్ని ఏర్పరిచింది.

బాల్యంలో జరిగిన ఈ సంఘటనలు విప్లవోద్యమం మీద అభిమానం పెంచాయి కాని దాని సిద్ధాంతాల మీద, లక్ష్యాల మీద పూర్తి అవగాహనను కల్పించలేదు. ఇక్కడే విరసం నన్ను ఎడ్యుకేట్ చేసింది. విరసం సభలు, సాహిత్యం, సిద్ధాంత చర్చలు ఒక ప్రాపంచిక దృక్పధాన్ని కల్పించాయి. సభలకయితే ఏ ఖర్చు లేకుండా వెళ్ళి కూర్చోని విని విషయం అర్థం చేసుకోవచ్చు. కాని పుస్తకాలు కొనాలంటె డబ్బులు కావాలి. జేబులో రూపాయి కూడా ఉండని రోజులు. అయితే అప్పటికే మా నిజాం కాలేజ్ లిబ్రరీలో ఉండే శ్రీశ్రీ ʹమహాప్రస్థానం,ʹ ʹమరో ప్రపంచంʹ ఇష్టంగ చదువుకున్న. అక్కడే వరవరరావు ʹసృజన సంపాదకీయాలు, ʹ అల్లం రాజయ్య కథలు... ఇలా అందుబాటులోకి వచ్చిన పుస్తకాలను చదవడం, మిత్రులతో చర్చించడం ఒక ప్రాధమిక అవగాహనను కల్పించింది. మొదటి సారిగా ఒక వ్యక్తిగత పని మీద వీవీ దగ్గరికి పోతె నా ఆసక్తిని గ్రహించి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ నిండా విరసం ప్రచురణలు నింపి ఇచ్చారు. అవి భారతీయ సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అందులో నక్సలబరీ రాజకీయాలకు ఉన్న ఔచిత్యం ఏమిటి అనే విషయాల మీద ఒక శాస్త్రీయమైన ఆలోచనలను ఏర్పరిచినవి.

అన్నింటిని మించి అమరుల త్యాగాలు అసలు జీవితానికి ఉండే అర్థం ఏమిటన్నది ఎప్పటికి గుర్తుచేస్తూ ప్రజల ముందు వినమ్రంగా నిలబడేటట్లు చేశాయి. ప్రపంచ నాలుగు మూలలు చూసినప్పటికి, ఎందరో అంతర్జాతీయంగా పేరున్న మేధావులతో కలిసి పనిచేసినప్పటికి నన్ను ఎప్పుడు నిటారుగా నిలబెట్టేది, సాహసాన్ని ఇచ్చేది విప్లవ సాహిత్యం, విప్లవోద్యమ ప్రభావమే. చిన్నప్పుడు దొర కండ్లల్లోకి చూడలేని నేను ఐక్యరాజ్యసమితిలో (జెనీవాలో) జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో ఎదురుగ్గా కూర్చున్న ప్రపంచబ్యాంక్ ప్రతినిధి కళ్ళలోకి చూస్తూ జనతనసర్కార్ గురించి మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది విప్లవ సాహిత్యమే.

హిందుత్వ ఫాసిజం బరితెగిస్తున్న కాలంలో ముందున్నదంతా చీకటి రోజులే అని భయపడుతున్న సమయంలో (మా నాయనమ్మ అన్నట్లు) కమ్ముకుంటున్న చీకటిని చీల్చే కాంతి రేఖలు విరాజిల్లే టార్చిలైట్ కావడం విరసం వంటి సంస్థలకే సాధ్యం. ప్రజా వ్యతిరేక శక్తి ఎంత బలవంతమైనది అయినా ఏదో ఒక రోజు కుప్పకూలకపోదు అని చరిత్ర చెబుతుంది, దానినే నా అనుభవంలో మా ఊరి దొర రూపంలో చూసిన. నా చరిత్ర అవగాహనకు, ప్రత్యక్ష అనుభవానికి మధ్య ఉన్న సంబంధాన్ని అక్షరాలతో అల్లుకునే సోయి కల్పించింది విరసం.

No. of visitors : 516
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మార్క్స్ మెచ్చిన ప్రొమిథియస్ స్పూర్తి

సాహస్ | 19.05.2018 02:25:40am

దానిని సాకుగా చూసుకొని జూస్ మొత్తం భూమినంతటిని వరదలతో ముంచెత్తి తన కోపం తీర్చుకోవాలని మొత్తం మానవాళినంతటిని నాశనం చేయ ప్రయత్నిస్తడు... అయితే చివరికి జూస్ క...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •