సీమకవి వినూత్ననిరసన ʹʹలైఫ్‌హాలిడేʹʹ

| సాహిత్యం | స‌మీక్ష‌లు

సీమకవి వినూత్ననిరసన ʹʹలైఫ్‌హాలిడేʹʹ

- ప్రొ. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి | 15.10.2019 05:44:24pm

ఇక్కడ
రైతునుదురే ఒక ప్రాంసరీనోటు
ఆత్మహత్యలే వేలిముద్రలు
అదిగో
ఉరికొయ్యకు అప్పులచిట్టా వేలాడుతోంది
దేశం ఖరీదైన సేద్యాన్ని కలగంటోంది
నిరసనగా
పల్లెపల్లెనా శవాలతోరణాలు వెలుస్తున్నాయి
రైతు
లైఫ్‌హోలీడేే ప్రకటిస్తున్నాడు
ఇపుడు
పల్లె ఒక కార్పొరేట్‌ స్మశానవాటిక (లైఫ్‌హాలిడే: పు 43)

కొత్తపల్లి సురేశ్‌ వర్తమాన వచన కవులతరానికి చెందిన యువకవి. అనంతపురంలో సాహిత్యపరంగా క్రియాశీలంగా ఉంటూ, కవిత్వరచన చేస్తున్నాడు. అధ్యాపకుడుగా ఉంటూ, తాను కవిత్వం రాయడమేగాక, తనవిద్యార్థులనూ కవులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఈయన మావిద్యార్థి కావడం మాకు సంతోషం కలిగించేవిషయం. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు చదివినవాళ్ళు చాలామంది కవులు, కథకులు, విమర్శకులుగా పుట్టుకు రావడం విశ్వవిద్యాలయానికే గర్వకరాణం. కొత్తపల్లి సురేశ్‌ ఆగర్వకిరణాలలో ఒకకిరణం. ఈయన రాసిన కావ్యం ʹʹలైఫ్‌హాలిడేʹʹ. ఇది 2018లో వచ్చింది. తెలుగు వచనకవిత్వ పరిణతికి ఈ కావ్యం ఒక సంకేతం.

ʹలైఫ్‌హాలిడేʹఅనేది తెలుగు కవిత్వనిఘంటువుల్లోకి ఎక్కవలసిన కొత్తమాట. తెలుగు కవిత్వంలోనే ఇది కొత్తమాట. ఇది కవి కొత్తదనం కోసం సృష్ట్టించిన మాటకాదు. రైతులఆత్మహత్యలకు సరైననిర్వచనం ʹలైఫ్‌హాలిడేʹ. మనం గతరెండు దశాబ్దాలలో విన్నమాట ʹక్రాప్‌హాలిడేʹ. కోస్తాప్రాంతరైతులు పండినపంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేదని నిరసనగా, వాళ్ళ పంటలను రోడ్లమీద పారబోసి తగలబెట్టడం చూశాం. ఈపని రాయలసీమ రైతులు చెయ్యలేరు. ఎందుకుంటే సీమలో పంటపండడమే గాలివాటు వ్యవహారం. మదనపల్లి, ఆదోని ప్రాంతాలలో టొమాటో రైతులు మాత్రం ఆపని చేశారు కొన్నిసార్లు. అవి ఉపయోగించకపోతే కుళ్ళిపోతాయి. రోడ్డుమీదపోసినా, పంటచేలోనే వదిలేసినా ఒకటే. ఈ నిరసనలు వేరు. కోస్తాప్రాంతంలో నిరసనదశ దాటి ʹక్రాప్‌హాలిడేʹ దశకు చేరుకున్నారు రైతులు. అంటే పంటపండించకుండా నిలిపివేయడం. ఒక పంటపండకపోయినా వాళ్ళ జీవనానికి అక్కడ వెంటనే వచ్చేప్రమాదం ఏమిలేదు. అయినా పంటవెయ్యకుండా మానివే నిరసన తెలపడం పెద్ద తిరుగుబాటే. కాని రాయసీమలో రైతులు పాలకుల నిరాదరణ, ప్రకృతి అననుకూలతల వల్ల వేసిన పంటలు పండక, పెట్టుబడుల ఖర్చులు కూడా రాకుండా అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మట్టిమనుషులు నిర్బంధంగా అర్ధాంతరంగా మట్టిలో కలిసిపోవడం రాజకీయ వ్యవస్థకే సిగ్గుచేటు. రైతుల ఆత్మహత్యలనే సురేశ్‌ ʹలైఫ్‌హాలిడేʹఅన్నాడు. గతఇరవైఏళ్ళలో రైతుల ఆత్మహత్యలమీద కొన్నివందల కవితలు వచ్చిఉంటాయి. ఆ కవితలలో ఎక్కడా ʹలైఫ్‌హాలిడేʹఅనేమాట నాకు కనిపించలేదు. బహుశా, ఆంగ్లపదమైనా, రైతుల ఆత్మహత్యలను నిర్వచించడానికి సరిపోయేమాట ఇదేననిపిస్తుంది. ఉచితమైన పదాన్ని సృష్టించిన కవికి అభినందనలు.

ʹలైఫ్‌హాలిడేʹకావ్యంలోని కవితలలో వర్తమాన సామాజిక వాస్తవికత వస్తువు. దానిని సురేశ్‌ బలమైన, వస్తువుకు తగిన భావుకతతో, విమర్శనాత్మకస్వరంతో అభివ్యక్తంచేశాడు. అనంతపురం జిల్లాలో ఇటీవల కవిత్వం రాస్తున్న యువకవులను చూస్తుంటే తెలుగుకవిత్వ భవిష్యత్తుమీద నమ్మం పెరుగుతున్నది. ఈనమ్మకం కలిగిస్తున్నవాళ్ళలో సురేశ్‌ ఒకరు. సురేశ్‌కు అస్తిత్వవాద రాజకీయదృక్పథముంది. బహుజనదృక్పథంతో సురేశ్‌ వేసిన ప్రశ్న చాలాబలమైనది. బహుజనులు నిరంతరం శ్రమిస్తున్నా వాళ్ళకు దక్కుతున్నది బానిసత్వమే. కాని వాళ్ళకు దక్కవలసింది రాజ్యాధికారం. అదెందుకు దక్కడంలేదు అన్నది కవి ప్రశ్న.

నువ్వు చాకిరేవులో, మగ్గంగుంతలో
క్షవరం బంకులో, పశువుల మేపులో
ఇంకాఇంకా సమస్తతావుల్లో.....
ఈరుడూ! ఇలుకాడవూకదా!
మరి రాజ్యం ఎందుకు
నీది కాకుండా పోయింది? (పు 44)

కవికి కవిత్వజీవితం తొలిదశలోనే నిర్దిష్టమైన రాజకీయదృక్పథమేర్పడడం చాలా ఉపయోగకరం. సురేశ్‌ ఇతర భావజాలాలను ఏదో అనబోయాడు. అది వేరేచర్చ. సురేశ్‌కు ఈ రాజకీయదృక్పథమున్నా, ఈదృష్టితో ఎక్కువ కవితలు రాయలేదు.

సురేశ్‌ ప్రాంతీయ అస్తిత్వదృక్పథంతోనే, రాయలసీమ జీవితంమీదనే ఎక్కువ కవితలు రచించాడు. పల్లెల్లో ఉద్యోగంచేస్తున్న కవిని అనంతపురం గ్రామీణజీవిత సంక్షోభం బాగా కలచివేయడమే ఇందుకు కారణం. కోస్తా,ఉత్తరాంధ్రులకున్నట్లు రాయలసీమకు నదుల సౌకర్యం లేదు. ఉన్నవి ఎప్పుడో ఎండిపోయి కబ్జాలకు గురౌతున్నాయి. కొంతకాలానికి అవి అదృశ్యమైనా ఆశ్చర్యంలేదు. రాయలసీమలో నదులస్థితిని సురేశ్‌, రైతుచెమటప్రవాహంతో పోల్చి విచిత్రసమ్మేళనం సాధించాడు.

పొలంపనుల్లో సొమ్మసిల్లిన
వృద్ధదేహం మీద చెమటచారికల్లా
నా సీమనదులు (పు 27)

కృష్ణానది నీళ్ళను రాయలసీమ వదులుకోవడాన్ని కూడా సురేశ్‌ వళ్ళు జలదరించే పోలికతో కవిత్వీకరించాడు.

ఇలా రాయలసీమ నీటిరాజకీయాలను చిత్రించిన కవి, దీనికి పరిష్కారం యుద్ధప్రాతిపదికమీద నదీజలాలను మళ్ళించడమేనని చెప్పాడు.

గుండెకు దారులు చూపే పంటకాలువలో
స్తంభించిన ప్రాణానికి
ఇప్పుడు బైపాస్‌సర్జరీలే జరగాలి, స్టంట్లుకాదు
మాఅందరి అవయవమూలాల్లోకి
నదులు ప్రవహించాలి
అందరి పెదాలపైనా
పంటలు పురివిప్పిన వాలి (పైది)

ప్రజాదృక్పథంగల కవుల ఆశలు ఆశయాలు ఎంత ఉదాత్తంగా ఉంటాయో సురేశ్‌ కవిత్వం రుజువు చేస్తుంది. ʹపంచకంʹ కవితలో అయిదు మూడేసి పాదాల క్లుప్తమైన వాక్యాలలో సురేశ్‌ వ్యవసాయ రంగాన్ని ఆవిష్కరించాడు. రైతును రామాయణంలో రెక్కలు తెగగొట్టబడే జటాయువుతో పోల్చడం కొత్త ఉపమానమే. వర్షం ప్రాంతాల మధ్య రెండు భిన్నమైన అభిప్రాయాలను కలిగిస్తుందని గుర్తించాడు కవి

వర్షం కురిసినరోజు
అక్కడ తిట్లదండకం
ఇక్కడ పర్వదినం (పు 71)

రాకరాక రాయలసీమలో వానకురిస్తే ఎంత సందడిగా ఉంటుందో శాంతినారాయణ చాలాకాలం క్రితం వర్ణించాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు సురేశ్‌ ʹవానచెట్టుʹకవిత రాశాడు. రానివాన మీద సీమకవుల దృష్టి ఎక్కువ, అది అవసరమూ అనివార్యమూ కూడా. వాన వచ్చినప్పుడు రాయలసీమలో సందడేసందడి.

చిందరవందరగా చిందులేస్తూ
కురుస్తున్న చినుకులు
మా పల్లెచెట్టు
రాలుస్తున్న మెతుకులు (పు 48)

అని ఉపమించాడు సురేశ్‌. వర్షాధార ప్రాంత జీవనం ఎలా ఉంటుందో ఈ వాక్యం ధ్వనిస్తున్నది. ఈ వానే ఒక్కోసారి సీమప్రజలకు నిరాశ మిగిలిస్తుంది. పడీ పడని, చాలీచాలని వాన రైతుకు నష్టమే చేస్తుంది. సురేశ్‌ ʹనది వెళ్ళిపోయాకʹ కవితలో ఇదే చెప్పాడు.

చుట్టపుచూపు వాన
ఆకలి భూముల్లో
అప్పు పంటల్ని పండిస్తోంది (పు 75)

కరువు పేరుమీద, వర్షాభావం మీద చాలా రాజాకీయాలు నడుస్తాయి. చాలా బడ్జెట్టు ఖర్చవుతుంది. కాని అదంతా స్వాహా రాజకీయమే. కరువుప్రాంత ప్రజల పేరుమీద నాయకులే బాగుపడతారు. ఈ రాజకీయం కవికి బాగా తెలుసు. అందుకే

రాజకీయం గడపపంచన మాత్రం
కొన్నినోట్ల చినుకులు రాల్తాయి
ఇన్ని పచ్చని కలలు దొరుకుతాయి
ఎందుకో ఆ రెండుపొలాలే
ఎప్పుడూ పచ్చగా ఉంటాయి (పైది)

రాయలసీమ కరువువల్ల రైతుల ఆత్మహ్యత్యలు జరుగుతుంటే, మరోవైపు ఆకలిచావులు సంభవిస్తుంటాయి. ప్రపంచీకరణ ఈరెండురకాల చావులను వేగవంతం చేసింది. సురేశ్‌ ʹహంగ్రీస్టోన్స్‌ʹ కవితలో రాయలసీమ ఆకలిని ఆర్ద్రంగా చిత్రించాడు.

బిడ్డలకడుపు నింపి
అమ్మ తన ఆకలిని
ఆనందబాష్పంగా అనువదించుకుంటుంది
ఆకలి
అమ్మ రెప్పలమాటున
నొక్కిపట్టిన కన్నీటిచుక్క (పు 53)

ఆకలితత్వం కవి అనుభవించినంత వాస్తవికంగా ఉంది. ఉపాధ్యాయుడుగా గ్రామీణ ప్రజలతో మమేకమైన కవి అనుభవం ఈ కవితలో కనిపిస్తుంది.

ʹఇంక్రెడిబుల్‌గాడెస్‌ʹఅని డా.పి.కేశవరెడ్డి వెనక ఒక నవల రాశాడు. సురేశ్‌ ʹఇంక్రెడిబుల్‌ ఫెస్టివల్‌ʹ కవిత రాశాడిప్పుడు. ఇది ఉగాదిపండగ కవిత. తెలుగులో ఉగాది కవితలు వేెలకొలది వచ్చిఉంటాయి. కానీ సురేశ్‌ కవిత విభిన్నంగా ఉంది. అత్యంత ఆధునిక సాంకేతిక పదజాలాన్ని ఉపయోగించుకున్న కవి అనేకరకాల ఉగాదిని నిర్వచించాడు. చివరకి రైతు దగ్గరికేవచ్చి ఆగాడు.

తెలుగుకవులలో అధికసంఖ్యాకులు ప్రపంచీకరణను మూడు దశాబ్దాల తర్వాత కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దానిప్రభావం భారతీయుల అనుభవంలో భాగమైపోతున్నా కవులు మాత్రం దానిని వెంటాడుతూనే ఉన్నారు. సురేశ్‌ ఈమార్గంలోనే పయనిస్తున్నాడు. ʹనేలమాలిʹ అనడం కొత్తగా ఉంది. వనమాలి, తోటమాలి వంటి మాటలు మనకు బాగా పరిచయం. ʹనేలమాలిʹ అని రైతును నిర్వచించాడు సురేశ్‌. ఇది కొత్తనిర్వచనం. అక్షరమాలి సురేశ్‌ రైతును ʹనేలమాలిʹ అనడం ఒక చమత్కారం. పాశ్చాత్యదేశాల పెట్టుబడిదారులను కార్పొరేట్‌ దొంగలు, తెల్లకొంగలు అని వర్ణించి తనప్రపంచీకరణ వ్యతిరేకతను చాటుకున్నాడు.

ఆకుపచ్చని ఆకాశంలో
జయకేతనమై ఎగరాల్సినరైతు
నేడు పొలంగనిలో
ఊపిరాడని కార్మికుడైపోయాడు
పైరగాలికి పంచనామా జరిగిపోయాక
రైతుకిక శ్వాస ఎలా అందుతుంది! (పు 70)

కార్పొరేట్‌ విద్య ప్రపంచీకరణకు ఆయుధం. విద్యద్వారానే కార్పొరేట్‌ శక్తులు తమకార్యకలాపాలు ప్రారంభించాయి. విద్యను వ్యాపారవస్తువుగా చేసి ధనసంపాదన చెయ్యడమే కార్పొరేట్‌ విద్య లక్ష్యం. ప్రజాదృక్పథం గల కవిగా

సురేశ్‌ కార్పొరేట్‌బడి
నాగరదేహం మీద మొలచిన రాజపుండు (పు 51)

అని నిర్వచించి తన నిరసనను వినిపించారు. కార్పొరేట్‌ పాఠశాలలో విద్యార్థులను బాలవృద్ధులు అని వర్ణించిన కవి, ఆపాఠశాలలు ʹʹపాలబుగ్గల బాల్యాన్ని నలిపేస్తున్నచిత్రంʹʹ అనిప్రకటించి, ప్రభుత్వ పాఠశాలలను ఉదాత్తంగా చిత్రించాడు. ʹʹకార్పొరేట్‌ బడి వింతరాకాసిʹʹఅన్న కవి, ప్రభుత్వపాఠశాలను పూలతోటగా ఉపమించాడు. అక్కడ పిల్లలు సితాకోక చిలుకలై విహరిస్తుంటారన్నారు. నిజానికీ ఈ తేడాలు నిజమే. ప్రభుత్వపాఠశాలలు పేదపిల్లలకు నిలయాలుగా మారిన వైనాన్ని కూడా కవిగుర్తు చేశాడు.

సురేశ్‌కు స్త్రీమీద, స్త్రీపురుష సంబంధాలమీద ప్రత్యేక దృష్టి ఉంది. అది ఉదాత్తమైన దృష్టి. వీటిమీద ఆయన దాదాపు అయిదు కవితలు రాశాడు. భారతదేశంలో ఘల ప్రవర్తనను ʹఆమెకు సెలవిద్దాంʹ కవితలో చిత్రించాడు. స్త్రీలు తిరగబడకముందే పురుషులను మారమని ప్రబోధించాడు.

గాంధీ కన్న కలిల్ని భుజాన వేసుకొని
తను నిర్భయంగా అడుగు ముందుకేస్తే
అడుగడుగునా కామ పిడుగుల్ని కురిపించి
పురుషాధిక్య భాస్వరాన్ని రగులుగొల్పుతున్నాం (పు 41)

అని పురషక్రౌర్యాన్ని అధిక్షేపించాడు.

ప్రపంచీకరణ ప్రవేశించినాక తెలుగుకవులు నగరం పల్లె జీవితాలలోని వైరుధ్యాలను గుర్తించడం ప్రారంభించారు. ఈదృష్టితో కొన్ని వందల కవితలు వచ్చాయి. ʹశకలాలమూటʹ, (పు 29) ʹఊరిచివరి ఆకాశంʹ (పు 46) కవితలలో సురేశ్‌ ఈ వైరుధ్యాలను చిత్రించాడు. నగరాన్ని ʹమిశ్రమలోహంʹ అనడం కొత్తగాఉంది. ʹఊరిచివరి ఆకాశంʹ కవితలో పల్లెలనుండి పనికోసం పట్నం చేరేఅవస్థను వర్ణించాడు సురేశ్‌. ఈసందర్భంగా పల్లె నగరజీవిత వైరుధ్యాన్ని ఆవిష్కరించాడు.

పల్లె నేర్పిన ఆత్మీయతలు
యిక్కడ చాదస్తాలుగా చలామణిలో వుంటాయి (పు 46)

బహుజనులను మీకు రాజ్యాధికారం వచ్చేదెప్పుడు అని అస్తిత్వప్రశ్న వేసిన సురేశ్‌, నాగేశ్వరాచారిని కమ్యూనిస్టు మేనిఫెస్టో, కామ్రేడ్‌, రెడ్‌ఆర్మీ-అని హృదయపూర్వకంగా వర్ణించడం, ప్రొ. సాయిబాబామీద ʹచలిʹ కవిత రాయడం-ఆయన స్నేహ హస్తానికి నిదర్శనం.

శ్రామిక కుటుంబంలో పుట్టిన సురేశ్‌ తన అమ్మ,నాన్న, అన్నల మీద రాసిన కవితలు శ్రామిక సంస్కృతినే ప్రతిబింబిస్తున్నాయి. ʹఎన్నిరోజులైందో అమ్మను చూసిʹ (పు 25) కవితలో అమ్మబహుముఖ పాత్రను చిత్రించాడు. ʹనాయనʹ (పు 54) కవితలో తండ్రి మూర్తిని బొమ్మకట్టాడు. అర్ధాంతరంగా మరణించిన సురేశ్‌ అన్న నరేంద్రబాబు స్మృతిలో ʹనువ్వువిడిచిన వేలు నేనుʹ కవితరాశాడు (పు 64) ఈమూడు కవితల్లో తనవారిపట్ల ఆత్మీయత, గౌరవం తొణికిసలాడుతున్నాయి, ʹʹఎన్నిరోజులైందో అమ్మప్రేమలో తడిసిʹʹ అన్నది ఆర్ద్రమైనమాట.

చేనంతా పరుచుకున్న గురగుపూలకింద
పదునెక్కిన కన్నీటినేల
నాయన

పల్లెమనిషిబొమ్మ ఇది. సురేశ్‌ అన్నకు తగిన తమ్ముడు. అందుకే ʹʹబతుంతా నీ తలపుల్లో దీపమై వెలుగుతానుʹʹ అని ప్రతిజ్ఞా చేశాడు. ఆప్రతిజ్ఞను నెరవేరుస్తున్నాడు.

చాలాకాలం క్రితం అనతపురంలోని ఆరాంహోటలును కవితలోకి తీసుకొచ్చారు ʹఅనంతʹ కవులు. అంతకుముందే. గుర్రం జాషువ ʹకళాశాలʹ పేరుతో ఆర్ట్స్‌కాలేజి మీద పద్యాలు రాశారు. ఈమధ్య ʹచంʹసుజాతహోటల్‌ మీద కవిత రాశాడు. ఇ.రాఘవేంద్ర టవర్‌క్లాక్‌, ఆర్ట్స్‌ కాలేజి హాస్టల్‌ మధ్య కవితల్ని నడిపించాడు. సురేశ్‌ అనంతపురంమీద ʹరాత్రిని భుజానికెత్తుకొని, (పు 38) ఎ రెయినీడే (పు 73) వంటి కవితలు రాశాడు. పల్లె ప్రియుడయిన కవి అనంతపురం ఫ్లైఓవర్‌ను

పల్లెను పట్నానికి మోసిమోసి
వంగిపోయిన
హమాలీ నడుములాంటి ఓవర్‌బ్రిడ్జి (పు 39)

అనడం సహజమే అయినా పల్లెలశ్రమ మీద ఆధారపడి బతుకుతున్న పట్టణ, నగర వాస్తవికతను ఆవిష్కరించడమే. ఫ్లైవోవర్లమీద ఇటీవల మూడు దశాబ్దాలలో చాలా కవితలు వచ్చయిగానీ, ఇలాంటి ఉపమానం నేను చదవలేదు. ʹʹరాత్రిని భుజానికెత్తుకొనిʹʹ అన్నది మనకు అనంతపురం సందర్శనం చేయిస్తుంది. ఇది ఒక టొపొగ్రఫికల్‌ కవిత.

సురేశ్‌ ప్రపంచాన్ని చదువుతున్నాడు. అర్థంచేసుకుంటున్నాడు. అస్తిత్వస్పృహను అభివృద్ధి చేసుకుంటున్నాడు. వర్తమానం పట్ల అసంతృప్తిలోంచే ఆయన వస్తువును చేదుకుంటున్నాడు. కొడుకుగా, తమ్ముడుగా, భర్తగా, అధ్యాపకుడుగా, పౌరుడుగా సమాజాన్ని అధ్యయనం చేస్తున్నాడు. సరైన పునాదితో కవిత్వరచన ప్రారంభించాడు. వస్వువును కవిత్వతీగగా ఎగబాకించడానికి ప్రయత్నిస్తున్నాడు. కవిత్వాన్ని కవిత్వం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

సురేశ్‌ కవిత్వం కవిత్వశిల్ప ప్రియులకు నిరాశ కలిగించదు. వస్తువును వచనంలో కవిత్వంగా మలచడానికి ఆయన అడుగడుగునా నిజాయితీగా ప్రయత్నించారు. భావుకత, కవిత్వనిర్మాణం చెట్టపట్టాల్‌ వేసుకొని పయనిస్తాయి. ఈకావ్యంలో పాఠకుల్ని మొట్టమొదట గిలిగింతపెట్టే శిల్పాంశం ఒకటిఉంది. వాన కోసం పరితపించే ప్రాంతకవి కవిత్వంలో నది, నావ వంటి మాటలు విరివిగా కనిపించడం.

నా ఆకాశం కళ్ళల్లో
నువ్విప్పుడు
ఒక ఎడతెగని వాన (పు 64)
నా సాయంత్రపునాదిలోకి
నావనై వస్తానన్నావు (పు 65)
సత్యం
హత్యకు గురైన సీమనది (పు 74)

సురేశ్‌ కవిత్వంలో నిర్మాణపరంగా ఆయన కొన్నిచోట్ల వేసుకున్న ప్రణాళిక ముచ్చటగొలుపుతుంది. ఒక కవితను అయిదు ఖండికలుగా విభాగించుకొని, ఒక్కొక్క ఖండికను ఒక వాక్యంలో గానీ, రెండు వాక్యాలలోగానీ రాయడం. కొన్ని కవితలలో ఒకే వస్తువుండగా, మరికొన్ని కవితలలో అయిదు వేరువేరు వస్తువులుంటాయి. ʹఅనశ్వరంʹలో సత్యం అనేభావనను అయిదు రకాలుగా నిర్వచించాడు. ʹపంచకంʹ, ʹపూలవానʹ,ʹబహుళంʹ వంటి కవితలలో అయిదేసి అంశాలను అయిదు వాక్యాలుగా చిత్రించాడు. ʹకొందరు మనుషులుంటారుʹలో ఒకేవస్తువును అయిదురకాలుగా దర్శించాడు. ʹపదనిసలుʹ కవితను రెండేసి వాక్యాల అయిదు ఖండికలుగా రాశాడు. మొదటిభాగం ఉద్దేశం, రెండోభాగం ఫలితం అనే పద్ధతిలో ఈ కవిత రాశాడు.

ʹకౌముదిʹ కవితలో మరోరకమైన నిర్మాణముంది. ఇందులో నాగేశ్వరాచారి వస్తువు. ఆయన వినయం, గాంభీర్యం, వర్ణనీయాంశం. ఈ కవితలో మూడు పాత్రలున్నాయి, అతడు, మీరు, నేను. మూడు ఖండికల కవిత ఇది. ఇది ఒక వ్యక్తి మూర్తిత్వ చిత్రణ. మొదటిపాదంలో కవి నాగేశ్వరాచారిని ఒకరకంగా నిర్వచిస్తాడు, రెండో పాదంలో దీనిని ఆచారి ఆమోదించడు. మూడో పాదంలో తానేమిటో విన్నవించుకుంటాడు. నాలుగో పాదంలో అతన్ని ʹమీరుʹ అంటే ఇతరులు ఏమంటారో చెప్తాడు. అయిదోపాదంలో కవి దానిని ఆమోదించడు. ఆరవపాదంలో అతడేమిటో కవి నిర్వచిస్తాడు. మొదటి పాదంలోను, చివరిపాదంలోనూ కవి తన వస్తువును నిర్వచించడమే ఉంది మొదటి నిర్వచనంకన్నా రెండవ నిర్వచనం ఉదాత్తంగా తాత్వికంగా ఉంటుంది. మూడు ఖండికలూ పరిణామాత్మకంగా ఉంటాయి. ఇలాంటివి చూసినప్పుడు సురేశ్‌కు కవిత్వనిర్మాణంపట్ల ప్రత్యేక స్పృహ ఉన్నదని అర్థమౌతుంది.

సురేశ్‌ కవిత్వంలో అక్కడక్కడా పల్చగానైనా విరుద్ధపద సమ్మేళనం పాఠకుణ్ణి ఆకర్షిస్తుంది. నీటిఎడారులు, నిశ్చలజలధి, శ్వేతరుధిరధార వంటివి. ఇలాంటి ప్రయోగాలు ప్రాచీన కవి తిక్కనలో కనిపిస్తాయి. సురేశ్‌లో అవి కనిపించడం గుర్తించాల్సిన అంశం. ఈయన కవిత్వంలో పురాణాంశాల వినియోగం చాలా తక్కువగా ఉండడం మనం చూడవచ్చు.

రాక్షస కన్నెలమధ్య సీతలాగ

దేదీప్యమానంగా వెలుగు లీనుతున్న

టవర్‌క్లాక్‌ (పు 39)

వంటి ఉపమానాలు ఒకటి రెండింటికి మించి కనిపించవు. తొలికావ్యం మంచి పునాది వేసింది. భవిష్యత్తులో మరిన్ని మంచికావ్యాలు రాస్తారని ఆశిస్తున్నాను.

No. of visitors : 274
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •