తెలుగు రాష్ట్రాల వ్యవసాయరంగం - 50 ఏళ్ళ విప్లవోద్యమం

| సాహిత్యం | వ్యాసాలు

తెలుగు రాష్ట్రాల వ్యవసాయరంగం - 50 ఏళ్ళ విప్లవోద్యమం

- కె.రవి, గ్రామీణ కార్యకర్త | 15.10.2019 05:47:23pm

దోపిడీ, పీడనలు, సామాజిక వివక్ష, సాంస్కృతిక పతనం లేని సమసమాజాన్ని సాధించడం విప్లవోద్యమ లక్ష్యం. అత్యున్నత ప్రజాస్వామిక వ్యవస్థగా కమ్యూనిస్టు సమాజాన్ని తీర్చిదిద్దుకోవడం కూడా ఇందులో భాగమే. వర్గదోపిడీ నిర్మూలనకు వర్గపోరాటాల అవశ్యకత ఉంటుంది. కమ్యూనిస్టు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థను సాధించడానికి సుదీర్ఘ ప్రయాణం చేయవలసిన అవసరం వుంది. ఈ ప్రయాణం నిరంతరం కొనసాగాలి. వివిధ దశల గుండా కొనసాగాలి.

ప్రస్తుతమున్న వ్యవస్థ స్వభావం, వర్గాల పొందిక, ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి శక్తుల మధ్య సంఘర్షణ, సమాజ సాంస్కృతిక స్థాయి ఇవన్నీ లోతుగా అర్థం చేసుకున్నప్పుడు, నడవాల్సిన దారి స్పష్టంగా కనపడుతుంది. కార్యాచరణ ప్రణాళిక నిర్థిష్టంగా రూపొందుతుంది. వర్గ శత్రువులకూ, వర్గ మిత్రులకూ మధ్య విభజన రేఖ మొదట అస్పష్టంగా వున్నా,  నడిచే క్రమంలో ఆ విభజన రేఖ స్పష్టంగా కనపడుతుంది. విప్లవోద్యమ శక్తులు చాలా సార్లు గందరగోళానికి గురయ్యేది, ఈ విభజన రేఖను నిర్ధిష్టంగా నిర్వచించుకోకనే. ఉద్యమకారులు అప్పుడప్పుడూ దోపిడీ వర్గాల ముందు సాగిలబడడం, మిత్ర వైరుధ్యాలను పరిష్కరించుకోవాల్సిన చోట, శత్రు పూరితంగా యుద్దాలు చేసుకోవడం మనం గమనిస్తున్నాం. వైరుధ్యాలను అర్థం చేసుకోవడం, పరిష్కరించుకోవడాన్ని గురించి మ¬పాధ్యాయుడు మావో జెడాంగ్‌ స్పష్టంగా మన ముందు ఉంచాడు. వాటిని ఆచరణలో అన్వయించుకోవడం, పరిపక్వత సాధించడం మరింతగా నేర్చుకోవాల్సి వుంది.

భారతదేశ వ్యవస్థ స్వభావాన్ని అర్థవలస - అర్థ భూస్వామ్య వ్యవస్థగా విప్లవోద్యమం నిర్వచించింది. అందుకే వ్యవసాయక విప్లవం ఇరుసుగా, నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గంలో ముందుకు పోవాలనీ, తద్వారా అనేక వర్గపోరాటాలు, సాంస్కృతిక విప్లవాల మధ్య నడక సాగించి. సోషలిస్టు సమాజాన్ని నిర్మించాలనీ, వర్గపోరాటాన్ని కొనసాగిస్తూనే, దోపిడీ వర్గ భావజాలంపై, ఆవశేషాలపై ఉక్కుపాదం మోపుతూ, శ్రామిక వర్గానికి అత్యున్నత స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు కల్పిస్తూ, వర్గ రహిత, రాజ్యరహిత కమ్యూనిస్టు సమాజాన్ని నిర్మించాలనీ విప్లవోద్యమం కార్యక్రమం రూపొందించుకుంది. వినడానికి, చదవడానికి ఈ క్రమం సాఫీగానే కనపడుతుంది. కానీ ఆచరణలో ఏం జరిగిందో, అక్టోబర్‌ విప్లవాలు సాధించిన విజయాలను తుడిచిపెట్టేసి దోపిడీ వర్గాలు, తిరిగి అధికారాన్ని ఎలా హస్తగతం చేసుకున్నాయో, బోల్షివిక్‌ పార్టీలు, ఎలా రివిజనిస్టు పార్టీలుగా రూపాంతరం చెందాయో, మన కళ్ళతో చూశాం. మ¬పాధ్యాయుల పేర్లు వల్లెవేస్తూనే, వారి బోధనలకు విరుద్ధంగా ప్రజల హక్కులను హరిస్తూ, అధికారంలోకి వచ్చిన కమ్యూనిష్టు పార్టీలు వ్యవహరించిన తీరు ఈ పరిణామాలకు ఒక ముఖ్య కారణమైతే, దోపిడీ వర్గాల నిజ స్వభావాన్ని, దోపిడీ వర్గ పార్టీల నిజ రూపాన్ని అర్థం చేసుకోవడంతో వైఫల్యం కూడా, వాటి పట్ల ప్రదర్శించిన ఉదాసీనత కూడా మరో ముఖ్య కారణం.

ఈ అనుభవాల నుండి మనం పాఠాలు నేర్చుకున్నప్పుడే భారతదేశ నిర్ధిష్ట పరిస్థితులను మనం సరిగ్గా విశ్లేషించగలుగుతాం. భారత దేశం లాంటి అతిపెద్ద దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక స్థితిగతులు ఒకే స్థాయిలో, ఒకే రూపంలో మనకు కనపడవు. ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి శక్తులు ఒకే రకంగా వుండవు. శ్రామిక వర్గ ప్రజల శత్రువుగా వుండే ప్రభుత్వాలు, వాటి విధానాలు ఒకే రకంగా వుండవు. అంతిమంగా అవి దోపిడీ వర్గాల ప్రయోజనాలను కాపాడే స్వభావాన్ని కలిగి వున్నా, ప్రజల సంఘటిత శక్తి, చైతన్య స్థాయి, విప్లవోద్యమ ప్రభావం ఫలితంగా వాటి పాలనా తీరు కూడా మారిపోతుంటుంది. అవి ప్రవేశపెట్టే పథకాలు, ఇచ్చే హామీలు, బడ్జెట్లలో కేటాయింపులు - మనకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంటాయి.

ఈ నేపధ్యంలో... తెలుగు రాష్ట్రాలలో సాగిన విప్లవోద్యమం గ్రామీణ ప్రజలపై, వ్యవసాయ రంగంపై వేసిన ప్రభావాన్ని, నిర్భంధం తదితర కారణాల వల్ల విప్లవోద్యమం బలహీనపడిన దశలో, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల గ్రామీణ ప్రాంతంలో వచ్చిన మార్పులను అర్థం చేసుకోగలిగితే, రానున్న కాలానికి విప్లవోద్యమ లక్ష్యమేమవుతుందో, కార్యాచరణ ప్రణాళిక ఎలా వుండాలో అర్థమవుతుంది.

1930 దశకం నుండీ తెలంగాణ ప్రాంతంలో వెట్టికి, దొరల జులుంకు, రజాకార్ల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా సాగిన ఆంధ్ర మహాసభ కృషి, కమ్యూనిష్టు పార్టీ నేతృత్వంలో సాగిన సాయుధ పోరాటం గ్రామీణ ప్రజల ఆకాంక్షలను బలంగా ముందుకు తెచ్చింది. దొరలను గ్రామాల నుండి తరిమేసింది. వేలాది గ్రామాల ప్రజలను వెట్టి నుండి విముక్తి చేసింది. జమీందారీ, జాగీర్ధారీ, దేశముఖుల, దొరల గడీల పాలనను కూల్చి 3 వేల గ్రామాలలో గ్రామ రాజ్యాలను నిర్మించింది. లక్షలాది ఎకరాలను ప్రజలు హస్తగతం చేసుకొని సాగు చేసుకునే ధైర్యాన్ని ఇచ్చింది. సంఘం జండాకు ఒక గుర్తింపును, కమ్యూనిష్టు పార్టీకి ఒక ప్రతిష్టను తెచ్చింది. ఈ సాయుధ పోరాటమే, 1950 ప్రత్యేక అధికారుల పాలనలో హైదరాబాద్‌ రాష్ట్రంలో సాగుదారుల రక్షణ కోసం ఒక ప్రగతిశీల ప్రత్యేక చట్టం రావడానికి కారణమైంది.

1952 ఎన్నికలలో కమ్యూనిష్టు పార్టీ అత్యధిక స్థానాలను గెలవడానికి ప్రాతిపదిక వేసింది కూడా ఈ సాయుధ పోరాటమే. కొంత మంది భావించినట్లు ఈ పోరాటం ఒకటిన్నర జిల్లాలలోనే బలంగా సాగిందని అనుకున్నా, మొత్తం తెలంగాణా ప్రజలపై, కోస్తా, ఆంధ్ర ప్రజలపై విస్తృతమైన చైతన్యవంతమైన ప్రభావాన్ని వేసింది. దేశవ్యాపితంగా రైతాంగ పోరాటాలు ప్రజ్వరిల్లడానికి కారణమైంది. తెలంగాణా సాయుధ పోరాటం ఫలితాలు, గ్రామీణ ప్రాంతంలోని ఆధిపత్య కులాల వారికే అత్యధికంగా అందాయని విమర్శ వున్నా, కమ్యూనిష్టు పార్టీ తన వర్గ స్వభావాన్ని కోల్పోయి, సాయుధ పోరాటాన్ని విరమించి, మొత్తంగా విప్లవోద్యమ ప్రస్తానంపై కోలుకోలేని దెబ్బ తీసిందని విమర్శ వున్నా, మనం తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం సాధించిన విజయాలను తక్కువ చేయకూడదు. 1967 నాటికి సి.పి.ఐ., సి.పి.ఎం.లుగా విడిపోయిన రెండు రివిజనిస్టు పార్టీలూ, చివరికి మరింత దిగజారి, పూర్తి పాలకవర్గ స్వభావం కలిగిన పార్టీలుగా దిగజారిపోయిన వైనాన్ని కూడా మనం చూస్తూనే వున్నాం. విప్లవోద్యమ లక్ష్యాలను, శ్రామికవర్గ ప్రజల ప్రయోజనాలను విడనాడి, పార్లమెంటరీ ఎన్నికల ఊబిలో కూరుకుపోయి ఎన్నికల పోరాటాలు తప్ప, వర్గ పోరాటాలు కూడా నిర్మించని స్థితిలో వున్నప్పుడే, విప్లవోద్యమ ప్రయాణం మళ్లీ రెండోసారి పురుడు పోసుకుని 1969లో విప్లవ పార్టీ నిర్మాణంతో, సాహసోపేతమైన ప్రయాణాన్ని ప్రారంభించి కొనసాగుతున్నది.

శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటం, సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాట జైత్రయాత్రలు,గోదావరి లోయ అటవీ ప్రాంతం పొడవునా నిర్మాణమైన ప్రతిఘటనా పోరాటం, బలమైన విప్లవ విద్యార్థి, యువజన, కార్మిక ఉద్యమాలు, విప్లవ కవుల, రచయితల కవాతులు-ఇవన్నీ గత 50 ఏళ్ళ విప్లవోద్యమ ప్రయాణంలో మైలురాళ్ళు.

ఈ దశ అంతా అన్ని పోరాటాలూ - గ్రామాలూ, అడవీ కేంద్రగానే సాగాయి. తెలంగాణా సాయుధ పోరాట విరమణ తరువాత, కాంగ్రేస్‌ పార్టీ ముసుగుతో, మళ్ళీ గ్రామాలలోకి ప్రవేశించిన దొరలను, నయా జమీందారులను, తిరిగి గ్రామాల నుండి తరిమి వేయడంలో విప్లవోద్యమం కీలక పాత్ర పోషించింది. అనేక జిల్లాలలో పేద ప్రజలు, దొరల భూముల్లో జండాలు పాతారు. పంటలు సాగు చేశారు. అడవిలో ఆదివాసీలు ఫారెస్టు అధికారుల దోపిడీ, అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రతిఘటనను నిర్మించారు. వేలాది ఎకరాల పోడు కొట్టారు. పంటలను సాగు చేశారు. వెట్టికి ప్రతి రూపంగా వున్న పాలేర్ల వ్యవస్థ ధ్వంసమైంది. ఈ దశలోనే వ్యవసాయ కూలీలు, కూలీ రేట్ల పెంపుదల కోసం పోరాటాలు చేశారు. ఫలితాలు సాధించారు.

విప్లవ విద్యార్థి ఉద్యమాల ఫలితంగా, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రజల పిల్లలకు మరింత చేరువయ్యాయి. గ్రామీణ రైతు కూలీ కుటుంబాల పిల్లలనేకమంది చదువు బాట పట్టారు. స్కూల్ళు దాటి, యూనివర్శిటీల దాకా సాగివచ్చారు. ఈ యువతీ, యువకులే తిరిగి మళ్ళీ ʹʹగ్రామాలకు తరలండిʹʹ పేరున గ్రామీణ విప్లవోద్యమానికి బలమైన గొంతును, చురుకు తనాన్ని ఇచ్చారు.

1973లో భూ సంస్కరణల చట్టం వచ్చినా, 1970లో షెడ్యూల్‌ ఏరియా ప్రజల హక్కుల రక్షణ కోసం 1/70 చట్టం వచ్చినా, ప్రభుత్వాలు వేరు వేరు పేర్లతో భూ పంపిణీ కార్యక్రమాలు చేపట్టినా, అసైన్డ్‌ భూముల రక్షణ కోసం చట్టం తెచ్చినా, ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం కనీస వేతనాలు ప్రకటించే స్థితి వచ్చినా, ఇవన్నీ విప్లవోద్యమం గ్రామీణ ప్రజల కోసం నేరుగా సాధించిన విజయాలుగా చెప్పుకోవచ్చు.

అంటరానితనం తగ్గిందన్నా, చాలా గ్రామాలలో దళితులను అవమానిస్తూ కొనసాగిన రెండు గ్లాసుల పద్ధతి సమసిపోయిందన్నా, గ్రామీణ మహిళలకు దొరల దౌర్జన్యాల నుండి, లైంగిక దోపిడీ నుండి విముక్తి లభించిందన్నా కారణం విప్లవోద్యమమే.

అణచివేతకు గురైన దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాల నుండి ʹకొత్తగొంతులుʹ పురుడు పోసుకుని ప్రజల ఆకాంక్షలను ఎలుగెత్తి చాటాయంటే, దోపిడీ గుండెల్లోకి పాట తూటాలా దిగబడిందంటే, విప్లవోద్యమం అందించిన చైతన్యం వుంది. ఆయా సామాజిక వర్గాల నుండి ఎదిగివచ్చిన కార్యకర్తలు, నాయకులు చేసిన త్యాగాలు వున్నాయి. ʹఅడవిపై హక్కు మాదేʹ అంటూ ఇంద్రవల్లి నుండి గోదావరి లోయ దాకా ఆదివాసీలు సాగించిన ప్రతిఘటనా, సాయుధ పోరాటాలు అందించిన స్ఫూర్తి సామాన్యమైనది కాదు. మైదాన ప్రాంత గ్రామీణ ఉద్యమాలకు, నగరాల, పారిశ్రామిక పాంత్రాల కార్మికోద్యమాలకు, విద్యార్థి ఉద్యమాలకు, అడవి ఉద్యమాలు నిరంతరం స్పూర్తిని అందిస్తూనే వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతమెప్పుడూ, అన్ని రకాల దోపిడీ పీడనలపై, వివక్షపై ఒక ప్రతిఘటనా రూపంలో వుంటూ వచ్చింది. నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమాలు రాజ్య నిర్భంధానికి గురై బలహీనపడినా, తెలంగాణ ప్రాంత విప్లవోద్యమం మాత్రం దేశ వ్యాపితంగా విప్లవోద్యమం విస్తరించడానికి తగిన పునాదిని వేసింది. నాయకులను, కార్యకర్తలను అందించింది.

1969 నుండీ 2019 వరకూ గత 50 ఏళ్ళలో తెలుగు సమాజ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక స్థితిగతులలో అనేక మార్పులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో అధికారం చెలాయించిన వర్గాలు, ప్రభుత్వాలు - వాటి విధానాలు, కొన్ని ఆధిపత్య సామాజిక వర్గాలలోని సంపన్న వర్గాలకు అదనపు విలువను సమకూర్చి పెట్టాయి. ముఖ్యంగా భూ సంబంధాలలో పెద్ద మార్పులు ఏమీ జరగకుండానే, పెరిగిన నీటి పారుదల సౌకర్యాలు, హరిత విప్లవ నమూనాలో ముందుకు వచ్చిన వ్యవసాయ పద్ధతులు, విస్తరించిన వాణిజ్య పంటలు ఈ వర్గాలకు ʹమిగులుʹను పోగు చేశాయి. ఈ మిగులు పెద్ద పారిశ్రామికీకరణకు దారి తీయకుండా, సాంస్కృతిక, సేవారంగాలలో పెట్టుబడులకు బాటలు వేసింది. ఇదే సమయంలో దేశవ్యాపితంగా నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాల పేరుతో ముందుకు వచ్చిన ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, ఈ సంపన్న వర్గాలకు మరిన్ని అవకాశాలను ముందుకు తెచ్చాయి. గ్రామీణ ప్రాంతంలో వున్న ఆధిపత్య సామాజిక వర్గాలు, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పరుగులు తీశాయి. వాస్తవానికి ఈ మిగులు పెట్టుబడి గ్రామీణ ప్రాంత ఉత్పత్తి సంబంధాలలో పెద్దగా మార్పులు తీసుకురాలేదు. మరీ ముఖ్యంగా వర్షాధార ప్రాంతాలలో గ్రామీణ ఉత్పత్తి సంబంధాలు స్థంభించిపోయి వున్నాయి. చేతివృత్తులు, కుల వృత్తులు దెబ్బతిని, గ్రామీణ కుటుంబాల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. హరిత విప్లవ నమూనాతో ముందుకు వచ్చిన రసాయనాలు, యంత్రాలు, గ్రామీణ ఉపాధి అవకాశాలను మరింత దెబ్బతీశాయి. గ్రామీణ ప్రాంతం నుండి వలసలు భారీగా జరిగాయి. ఈ వలసలు అత్యంత దారిద్య్రం నుండీ, నిరాశా, నిస్పృహల నుండీ జరిగాయి. మెరుగైన ఆదాయాలనూ, గ్రామీణ ప్రాంతానికి బయట ఉపాధి అవకాశాలనూ వెతుక్కుంటూ జరిగాయి.

ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతంలో కొత్త సామాజిక వర్గాలు కౌలు రైతులుగా వ్యవసాయ రంగంలోకి ప్రవేశించాయి. వర్షాధార ప్రాంతాల్లోకి ప్రవేశించిన పత్తి లాంటి వాణిజ్య పంటలు పంటల ఉత్పత్తి ఖర్చుల పెంచాయి. కానీ ఆదాయాలు పెరగలేదు. ఆహార పంటల విస్తీర్ణాన్ని తగ్గించేసి ఆహార భద్రతను ప్రశ్నార్ధకం చేశాయి. గ్రామాలలో ʹపెట్టుబడిʹ ప్రవహిస్తున్నట్లుగా కనిపించినప్పటికీ ఆ పెట్టుబడి గ్రామీణ వ్యవసాయ కుటుంబాల జీవనోపాధిని మెరుగు పరచలేదు. ఆదాయాలకు గ్యారంటీ ఇవ్వలేదు. పైగా ఈ పెట్టుబడి వ్యవసాయ కుటుంబాలను ప్రైవేట్‌ అప్పుల ఊబిలో దించింది. ఆత్మహత్యల పాలు చేసింది. గ్రామీణ జిల్లాల స్థూల ఉత్పత్తి విలువ చూసినా, తలసరి ఆదాయాలు చూసినా, గ్రామీణ ప్రజల ఆదాయాలు, వారి ఉత్పత్తులకు, సేవలకు విలువ ఎంత తక్కువగా ఉన్నాయో అర్థమవుతుంది.

ఈ పరిణామాలు జరుగుతున్న దశలోనే విప్లవోద్యమం తీవ్రమైన నిర్భంధానికి గురై, ఆత్మరక్షణ స్థితిలో పడింది. గ్రామీణ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పని చేసే కార్యకర్తల సంఖ్య గణనీయంగా పడిపోయింది. అడవి ఉద్యమం కూడా సాపేక్షికంగా దెబ్బతింది. సరళీకరణ విధానాల వల్ల వచ్చిన సాంస్కృతిక సామ్రాజ్యవాదం, వినియోగదారీ సంస్కృతి కూడా నిజాయితీగా పనిచేస్తూ వచ్చిన నాయకుల, కార్యకర్తల స్థానంలో వాగాడంబర, పడక్కుర్చీ, నాగరీకరణ చెందిన కార్యకర్తలనూ, నాయకులనూ ప్రవేశపెట్టింది. గ్రామాల అధ్యయనం కుంటుపడడం వల్ల సామాజిక, ఆర్థిక పరిస్థితులలో వచ్చిన మార్పులు, గ్రామీణ ఉత్పత్తి శక్తుల పొందికలో వచ్చిన మార్పులను లోతుగా పరిశీలించి, విశ్లేషించుకుని, విప్లవోద్యమ నిర్మాణ బాటలో కొత్త కార్యాచరణను రూపొందించుకునే అవగాహన కూడా లోపించింది. ఫలితంగా గ్రామీణ ప్రాంతం కేంద్రంగా సాగాల్సిన రైతుకూలీ ఉద్యమం, అడవి కేంద్రంగా సాగాల్సిన ఆదివాసీ ప్రజల హక్కుల ఉద్యమం వెనుక పట్టు పట్టాయి.

తెలంగాణా సాయుధ పోరాట కాలంలో 4,000 మంది గ్రామీణ పేదలు, గెరిల్లా యోధులై పోరాడి ప్రాణాలర్పించగా, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన తర్వాత, తెలంగాణా ప్రాంతంలో నిస్సహాయత, నిస్పృహతో 4,000 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ప్రాంతంలో 1995 నుండీ 2018 వరకూ మొత్తంగా 30,000 మందికి పైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కనీసం 10 వేల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. విప్లవోద్యమం బలంగా సాగిన జిల్లాలలోనూ, మండలాలలోనూ, గ్రామాలలోనూ కూడా ఈ బలవన్మరణాలు జరిగాయంటే పరిస్థితిలో వచ్చిన మార్పును అర్థం చేసుకోవచ్చు.

ఈ స్థితిలో విప్లవోద్యమ పునర్నిర్మాణం జరగాలంటే, తెలుగు రాష్ట్రాల గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో వచ్చిన మార్పులను లోతుగా అర్థం చేసుకోవాలి. సామాజిక, ఆర్థిక అంశాలే కాకుండా పర్యావరణ పరమైన అంశాలను కూడా అధ్యయనం చేయాలి. విప్లవోద్యమ ఎజెండా స్పష్టంగా వుండాలంటే, భేషజాలకు పోకుండా, వాస్తవాల ప్రాతిపదికన అధ్యయనం చేయాలి. ఈ అధ్యయన ఫలితాలను విశ్లేషించుకుని, నిర్ధిష్ట పరిస్థితులకు అనుగుణమైన కార్యాచరణ రూపొందించుకోవాలి.

గత 35 సంవత్సరాలుగా విప్లవోద్యమ నిర్మాణ కార్యకర్తగా, మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా గ్రామీణ రైతాంగ ఉద్యమ కార్యకర్తగా పని చేస్తున్న నేను, నా అనుభవాలనుండి వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను, కార్యాచరణ క్షేత్రాన్ని చర్చకు పెడుతున్నాను. ఈ ప్రతిపాదనల లక్ష్యం ఒక్కటే. గ్రామీణ ప్రజల జీవనోపాధుల రక్షణ, జీవన ప్రమాణాల పెరుగుదల. ఈ లక్ష్య సాధనకు అనుసరించే పద్ధతులూ, ఎదురయ్యే ఆటంకాలూ, సాధించే ఫలితాలూ - అంతిమంగా కార్యాచరణకు ఒక ఎజెండా రూపొందుతుంది. అది తప్పకుండా రాజకీయ ఎజండా మాత్రమే అవుతుంది. ʹʹదున్నేవారికి భూమి కావాలి,ʹʹ ʹʹవ్యవసాయక విప్లవం వర్థిల్లాలి,ʹʹ ʹʹఅడవిపై హక్కు ఆదివాసీలదేʹʹ. అనే నినాదాలు కేవలం నినాద ప్రాయంగా మిగిలిపోకుండా, కార్యాచరణకు ప్రాతిపదికగా ఉండాలి. నగరీకరణ జరుగుతున్నదనీ, పట్టణాలలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయనీ ఎంతగా చెప్పుకున్నా గ్రామీణ నిరక్షరాశ్యులను, అనిపుణ శ్రామికులను పూర్తి స్థాయిలో శ్రమలో ఇముడ్చుకోగలిగిన పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందలేదు. సేవారంగాలకు ఒక పరిమితి ఉంది. అసంఘటిత రంగంలో కొన్ని అవకాశాలు పెరిగినా అవి రక్షణ లేనివి. ఈ స్థితిలో గ్రామీణ జీవనోపాధులు, ఆదాయాలు మరింత మెరుగయ్యేలా మనం పోరాటాలను ఎక్కుపెట్టాల్సి వుంది.

1. సహజ వనరులపై స్థానిక ప్రజలకే హక్కులు:

గ్రామీణ ప్రజల చేతుల్లో ముఖ్యంగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుందామన్న సాగుదారుల చేతుల్లో సాగు భూములు వుండాలి. భూ సంస్కరణలు అమలు జరిగి, భూ గరిష్ట పరిమితి చట్టం అమలై, మిగులు భూములు గ్రామీణపేదలకు హక్కుగా అందాలి. వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున వ్యవసాయేతర అవసరాలకు, వ్యవసాయేతరుల చేతుల్లోకీ మళ్ళి పోతున్నాయి. వ్యవసాయేతరుల చేతుల్లోకి వ్యవసాయ భూములు వెళ్లకుండా ఆపగలిగితేనే దున్నేవాడికి భూమి దక్కుతుంది. 1/70 చట్టం అమలవుతున్న, షెడ్యూల్‌ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున ఆదివాసీయేతరులు చొచ్చుకువెళుతున్నారు. ఆదివాసీ కుటుంబాలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు కూడా ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం లేదు. గ్రామాల మధ్య వుండాల్సిన ఉమ్మడి భూములు కూడా తరిగిపోవడం వల్ల, పశుపోషకుల, సన్న జీవాల పెంపకందారుల జీవనోపాధికి కష్టమవుతున్నది. ఇవన్నీ ఒకే స్వభావానికి చెందిన సమస్యలు. సహజ వనరులపై స్థానిక ప్రజలకు హక్కుల సాధన లక్ష్యంగా గ్రామీణ కార్యకర్తలు, ఆదివాసీ ప్రాంతాల కార్యకర్తలు కేంద్రీకరించి పని చేయాల్సి వుంది. ఇది సాధారణ పోరాటం కాదు. వ్యవసాయేతర ధనిక, సమాజమూ, ప్రభుత్వాలూ, ఆదివాసీయేతర సమాజమూ కూడా ఈ లక్ష్య సాధనలో అడ్డుగా నిలిచే శక్తులు. కానీ గ్రామీణ ప్రజల పక్షాన పని చేయాలంటే ఈ శక్తులతో పోరాడాల్సిందే. మిత్రవైరుధ్యాలు ఎదురైన చోట, సంయమనంతో వ్యవహరించి ముందుకు సాగాలి. శత్రువైరుధ్యం ఎదురైనచోట, సాధారణ ప్రచార కార్యక్రమాల నుండి, మిలిటెంట్‌ పోరాటాల వరకూ సిద్దపడాలి.  

ʹʹపేదలకు పంచడానికి భూమి లేదుʹʹ అని ప్రభుత్వాలు నిర్ధారణకు వచ్చిన దశలో, భూమి స్వభావంలో వచ్చిన మార్పును లోతుగా అర్థం చేసుకుని డిమాండ్ల రూపకల్పన చేయాల్సి వుంది. రివిజనిస్టు పార్టీలు అప్పుడప్పుడూ ప్రస్తావించే భూపోరాటాలు కూడా పూర్తిగా అడుగంటి పోయిన దశలో, భూమి సమస్యపై కొత్తగా పని ప్రారంభించాల్సి వుంది. వ్యవసాయక విప్లవానికి భూమి సమస్య ఇరుసు వంటిది. రెండు తెలుగు రాష్ట్రాలలోని కోటి మంది వ్యవసాయ కూలీల సమస్య కూడా భూమి సమస్యతో ముడిపడి వుంది. నాన్‌షెడ్యూల్డ్‌ ఆదివాసీ గ్రామాలను, ప్రాంతాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలనే డిమాండ్‌తో ఉద్యమం సాగించడం కూడా ఆదివాసీల హక్కుల కోణం నుండీ అత్యంత విలువైనది.

2. పర్యావరణ సుస్థిరత:

రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గ్రామీణ ప్రాంతం వాతావరణంలో వచ్చిన మార్పులతో ఎక్కువ ప్రభావిత మవుతున్నది. కరువులు, వర్షాభావ పరిస్థితులు, భారీ వర్షాలు, వరదలు, వడగండ్లు, కొన్ని జిల్లాలలో విస్తరిస్తున్న ఎడారీకరణ ఇవన్నీ గ్రామీణ ప్రజలను, ఆదివాసీలను పెద్ద ఎత్తున వేధిస్తున్న పర్యావరణ సమస్యలుగా వున్నాయి. ఇసుక మాఫియా, పెద్ద ఎత్తున అడవుల నరికివేత (ఆదివాసీయేతర ఫారెస్ట్‌ మాఫియా) పర్యావరణ సమస్యలను మరింత పెంచుతున్నాయి. వ్యవసాయంలో బాగా పెరిగిన రసాయన ఎరువుల వినియోగం, విషపూరిత పురుగుమందులు, కలుపు మందుల వినియోగం మొత్తం పర్యావరణాన్ని విషకాలుష్యానికి గురి చేస్తున్నది. భూగర్భ జలాలు, గాలి, నదీ జలాలు, పంట పొలాలు పూర్తిగా విషపూరితమై పోయాయి. అనుమతి లేకపోయినా, గ్రామీణ, అటవీ ప్రాంతాలకు విస్తరిస్తున్న జన్యుమార్పిడి పంటలు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి.

ఈ సమస్యలు, వాటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నా, విప్లవోద్యమం వీటిపై పూర్తిగా దృష్టి సారించలేదు. విప్లవ నిర్మాణ సంస్థలు ఈ అంశాలను ఎజెండాగా స్వీకరించడం లేదు. మొత్తం సమాజాన్ని ముఖ్యంగా సహజ వనరులను విధ్వంసం చేస్తున్న, ఈ సమస్యలు కూడా ప్రజలను సంఘటిత పరచడానికి ప్రధాన ప్రాతిపదికగా వుండాలి. ఇవేవో స్వచ్ఛంధ సంస్థలు చేపట్టే అంశాలుగా చూసినంత కాలం సమస్య లోతు మనకు అర్థంకాదు. ఈ సమస్యలపై పని చేయాలంటే నిర్థిష్ట కార్యాచరణ అవసరమవుతుంది. కార్యక్షేత్రం విభిన్నంగా వుంటుంది. అవగాహనను, నిపుణతను పెంచుకోవాల్సి వుంటుంది. ప్రజలను, కొత్త నినాదాలతో సమీకరించాల్సి వుంటుంది. చాలా సందర్భాలలో ఈ కృషి, ఉద్యమ రూపంలో కాకుండా నిర్మాణాత్మక కృషి రూపంలో వుంటుంది. జన్యుమార్పిడి, హైబ్రిడ్‌ విత్తన కంపెనీలకు వ్యతిరేకంగా మనం సాగించే పోరాటం కొనసాగిస్తూనే, నిర్మాణాత్మక రూపంలో గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి, స్థానిక విత్తన రకాలకు ప్రోత్సాహం, తదితర అంశాలపై కూడా పని చేయవలసి వుంటుంది. భారీ డ్యాములు, భారీ ఎత్తిపోతల పథకాలు, అవి సృష్టించే విధ్వంసాన్ని అర్థం చేసుకుంటూనే, వాటిని వ్యతిరేకిస్తూనే ప్రత్యామ్నాయంగా స్థానిక నీటివనరుల అభివృద్ధి, వాననీటి సంరక్షణ లాంటి కార్యక్రమాలలో ప్రజలను భాగస్వాములను చేయవలసి వుంటుంది. అటువంటి వాటి కోసం ప్రభుత్వం నుండి నిధులు రాబట్టడానికి కూడా పోరాడాల్సి వుంటుంది.

ఈ అంశాల సారాంశం ఒక్కటే. ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాడుతూనే, ప్రజలను సమీకరించడానికి ప్రత్యామ్నాయ కార్యక్రమాల రూపకల్పన జరగాలి. గ్రామ స్థాయిలో రైతులు విత్తనోత్పత్తి స్వయంగా చేసుకోవడానికి పూనుకోకుండా ʹʹమోన్‌శాంటో క్విట్‌ ఇండియాʹʹ లాంటి ఉద్యమాలు విజయవంతం కావు.

3. గ్రామీణ కుటుంబాలకు ఆదాయ భద్రత:

యన్‌.ఎస్‌.ఎస్‌.ఓ. నివేదికల ప్రకారమే, భారతదేశంలో గ్రామీణ ప్రాంత వ్యవసాయ కుటుంబాల నెలసరి సగటు ఆదాయం 6 వేల రూపాయలు. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 7వ వేతన కమీషన్‌ ప్రకారం సగటు ఉద్యోగి కనీస వేతనం నెలకు 18 వేల రూపాయలు. అంటే గ్రామీణ కుటుంబాల సగటు ఆదాయం అతి తక్కువగా వుందన్న మాట. వ్యవసాయ కుటుంబాలకు భూముల పంపిణీ చేయడంతో పాటు వడ్డీలేని పంట రుణాలు, పంటల బీమా, వివిధ సబ్సిడీ పథకాలు, న్యాయమైన గిట్టుబాటు ధరలు, అందించకపోతే, గ్రామీణ కుటుంబాలకు ఆదాయం పెరిగే అవకాశమే లేదు. పంటల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న దశలో ఇవన్నీ సాగుదారులకు అందకపోతే రైతు కుటుంబాలు అప్పుల ఊబి నుండి బయటపడవు. ఆదాయాలు పెరగవు. విప్లవోద్యమ నిర్మాణ క్రమంలో ఈ అంశాలపై పని చేయడం కూడా తక్షణ అవసరమే. తెలంగాణాలో రైతుబంధు, ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా, కేంద్ర ప్రభుత్వం అందించే పి.ఎం. కిసాన్‌ లాంటి పథకాలు కేవలం భూమిపై పట్టాహక్కులు కలిగిన భూ యజమానులకు కాకుండా వాస్తవ సాగుదారులకు మాత్రమే అందాలంటే కూడా పెద్ద పోరాటమే చేయాలి. కౌలు రైతులకు గుర్తింపు, మహిళా రైతులకు గుర్తింపు కోసం చేసే పోరాటాలు గ్రామీణ వ్యవసాయ కుటుంబాల ప్రయోజనాల కోసం చేసే పోరాటాలలో అత్యంత కీలకమైనవి.

వ్యవసాయ కూలీల వలసలను ఆపి, ఎంతో కొంత ఆదాయం గ్రామీణ పేద కుటుంబాలకు అందాలంటే, ʹʹజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద 100 రోజుల పని దినాలు ఈ కుటుంబాలకు హక్కుగా అందేలా మనం కార్యాచరణ రూపొందించి పోరాడాల్సి వుంటుంది. డా|| బాలగోపాల్‌ ఒక మాట చెబుతారు. ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు, ప్రజల పోరాటాల ఫలితంగా ఉనికిలోకి వచ్చాయి. వాటిని సవ్యంగా అమలు చేయించుకోవలసిన బాధ్యత కూడా విప్లవోద్యమ కార్యకర్తల మీద ఉంది. సంక్షేమ పథకాలు ప్రజల చైతన్య స్థాయిని మొద్దుబారుస్తాయనే అవగాహనతో, సాధారణంగా వాటి అమలుకోసం పని చేయకపోవడం ఒక ధోరణిగా వుంది. కానీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలకు ఖర్చు చేసే నిధులు ప్రజల బడ్జెట్‌ నుండి వస్తున్నవే. వాటిని పొందడం ప్రజల హక్కు. ఆ పథకాలు ఏ మేరకు ప్రజల జీవన ప్రమాణాలను పెంచినా, మనం తిరస్కరించవలసిన అవసరం లేదు. ప్రజల రాజకీయ చైతన్య స్థాయిని పెంచే కృషి ఎప్పుడూ విడిగా నిరంతరాయంగా కొనసాగించవలసే వుంటుంది.

రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కులను, రాజ్యాంగం పరిధిలో రూపొందిన కొన్ని చట్టాలను వినియోగించుకోవడానికి కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి.

ముఖ్యంగా భూ పోరాటాల సమయంలో పేదలు భూమి స్వాధీనం చేసుకుని దున్నుకున్న తర్వాత, ఆ భూములపై చట్టబద్ధ రికార్డులు సాధించే వరకూ పోరాటాన్ని కొనసాగించాల్సి వుంటుంది. లేనట్లయితే పేదల చేతుల్లో ఆ భూములు మిగలడం కష్టం. తెలంగాణాలో పేదలు విప్లవ పార్టీల నేతృత్వంలో వేలాది ఎకరాలను ఆక్రమించి జండాలు నాటినా, అవి చివరి వరకు పేదల చేతుల్లో నిలవలేదు. విప్లవోద్యమం దెబ్బతిన్నప్పుడు భూస్వాములు తిరిగి ఆ భూములను ఆక్రమించుకున్నారు. లేదా అవకాశం వచ్చినప్పుడు ఆ భూములను చట్టబద్ధంగా అమ్ముకుని లాభాలు చేసుకున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ఆదివాసీలు పోడు కొట్టుకున్న భూములకు కూడా అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు సాధించడానికి విప్లవ పార్టీలు తగినంత దృష్టి పెట్టలేదు. క్రమ పద్ధతిలో చేయాల్సిన ఆ పని తమది కాదన్నట్లుగా వ్యవహరించాయి. విప్లవ పదజాలం మాటున, రాజ్యాంగంపై, చట్టాలపై తమకు భ్రమలు లేవనే పేరున, పేదల హక్కులను సంపూర్ణంగా నిలబెట్టడంలో మనం వైఫల్యం చెందాం. ఈ ధోరణిని విడనాడితేనే పేదలకు లాభం.

బహుముఖాలుగా గ్రామీణ ప్రాంత, అటవీ ప్రాంత కృషిని కొనసాగించడం ద్వారా, గత 2 దశాబ్దాలుగా స్థబ్ధతకు గురైన విప్లవోద్యమాన్ని మరింత క్రియాశీలంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ ప్రక్రియలో ప్రజల ఆలోచనాశక్తిని మొద్దుబారుస్తున్న ʹʹమద్యాన్ని నిషేధించాలనేʹʹ డిమాండ్‌ కూడా మన ఉద్యమ కార్యాచరణలో భాగం కావాలి. ఈ ఉద్యమ నిర్మాణ క్రమంలో ఎదురయ్యే అన్ని ప్రతీప శక్తులను మనం ఓడించాలి. మిత్రులను మరింతగా కూడగట్టాలి.

ʹʹసమస్య, ప్రజల చైతన్య స్థాయి, ప్రభుత్వాల వైఖరి - వెరసి ఆ సమస్య పై మన పోరాట రూపాన్ని నిర్ధేశిస్తాయి. అన్ని చోట్లా, అన్ని వేళలా ఒకే కార్యాచరణ రూపం ఉండకపోవచ్చు. లక్ష్య సాధన పట్ల నిబద్ధతతో, విచక్షణతో, బాధిత ప్రజల భాగస్వామ్యంతో, మొత్తం శ్రామిక సమాజ సంఘీభావంతో ముందుకు సాగవలసి వుంటుంది.ʹʹ

No. of visitors : 382
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •