ఒక చిన్న అమ్మాయి రాసిన మంచి కథ " భూమి "

| సాహిత్యం | స‌మీక్ష‌లు

ఒక చిన్న అమ్మాయి రాసిన మంచి కథ " భూమి "

- పలమనేరు బాలాజీ | 16.10.2019 10:28:42am

కథా సాహిత్యంలో కొత్త రచయితలు వచ్చినప్పుడు వారితో పాటు కొత్త కథావస్తువులు, కథా శిల్పాలు వెలుగు చూడడం మామూలే.

తెలుగు రచయితలు ఎందరో వారి మొదటి కథలతోనే గుర్తింపు పొందడం తెలిసిన విషయమే. కథల పోటీలలో చాలావరకు కొత్త కథకులు మెరుస్తూ ఉంటారు. ప్రతిసారి కథల పోటీల ద్వారా కొత్త కథకులు పాఠకులకు పరిచయం అవుతుంటారు. చాలా సందర్భాలలో కొత్త కథకులు రాసిన వారి కొత్త కథలకు లేదా మొదటి కథలకు కథల పోటీలలో బహుమతి రావడం తెలిసిన విషయమే. అయితే కథా లోకంలో ఆ తర్వాత చాలామంది కొత్త రచయితలు కనబడక పోవటం ఒక విశేషం, విషాదం.

ముఖ్యంగా చిన్న పిల్లలు కథలు రాయటం ,విద్యార్థులు కథా ప్రక్రియలోకి అడుగు పెట్టడం ఒక మంచి విశేషం.కొత్తగా కథలు రాసిన విద్యార్థుల కథల్ని ప్రచురించే సంప్రదాయం తెలుగు సాహితీ లోకంలో ముందునుండి ఉన్నది. చాలామంది సంపాదకులు కొత్త కథకులను, కొత్త యువ రచయితల్ని, కొత్తగా కథలు రాసే విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయం.

బాలసాహిత్యం విషయానికి వచ్చినప్పుడు బాలల కోసం ప్రత్యేకంగా రాసిన కథ, నవల ,నాటకం, పద్యం ,పాట ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులు కొత్త రచయితలు గా మారి మొదటిసారి రాసిన కథలు ప్రత్యేకంగా ఉంటాయి .వారి అనుభవాలు ,వారి పరిశీలనా దృష్టి, వారి ఆలోచనా విధానం, వారి భావ వ్యక్తీకరణ ప్రత్యేకంగా ఉంటాయి. పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి.
ఈ క్రమంలోఆంధ్రప్రదేశ్ మాసపత్రిక 2016 జూన్ సంచికలో పులగుర్త సాయి మల్లిక అనే ఇంటర్మీడియట్ చిన్నారి రాసిన కథ " భూమి " రెండు మూడు సార్లైనా చదివించే మంచి కథ.

ఈ కథ ఇట్లా మొదలవుతుంది.

" ఒక్కోసారి నాకు అనిపిస్తూంటుంది .అందరూ మంచి చేయాలి. పేదవారికి సహాయం చేయాలి. దానాలు చేయాలి.వీటి వల్ల పుణ్యం వస్తుందని కొందరు అన్నప్పుడు , ఇవన్నీ నిజమేనా ? వీటిని నమ్మాలా వద్దా ? పుణ్యం కోసం ఇవన్నీ చేయాలా? లేదా మన జీవితం మనదంటూ గుంపుతో సాగిపోవాలా అని నా మనసులో ఎన్నో ప్రశ్నలు తన్నుకు వచ్చేవి."

సూటిగా కథలోకి రావడం రావడం తోటే పాత్ర వ్యక్తిత్వాన్ని పరిచయం చేసే ప్రయత్నాన్ని చేస్తుంది రచయిత్రి.

జరిగిన వాటిని కథలుగా రాస్తారా? కథలోని సంఘటనలన్నీ నిజ జీవితంలో జరిగినవేనా? అనే ప్రశ్నలు పాఠకుల్ని ఎప్పుడూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఈ కథలోని సంఘటనలు కూడా నిజంగా రచయిత్రి జీవితంలో తనకు సంబంధించినవో లేక తనకు తెలిసిన వారికి కానీ జరిగినవేమో.. అని అనిపిస్తుంది పాఠకులకు.

కొత్త రచయిత్రి రాసిన కథను చదివే కొత్త పాఠకులకు ఈ సందేహం తప్పకుండా వస్తుంది. నిజ జీవితంలోని సంఘటనలను కథలుగా మార్చే క్రమంలో , కల్పించే కల్పనలు ,ఊహలు కథను చెప్పే పద్ధతి ఆ కథను మంచి కథా? కాదా అని నిర్ణయిస్తాయి.

ప్రస్తుతం భూమి అనే అమ్మాయికి సంబంధించిన కథ ఇది.అమ్మాయి పేరును కథలో ఎక్కడా చెప్పకుండా, కథ చివర్లో చాలా గడుసుగా చెబుతుంది రచయిత్రి.

" ఆ పిల్లలు ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు అని నాకు తెలుసు ‌.ఎందుకంటే వారికి సుఖం అంటే ఏమిటో తెలియదు కనుక, వారు ఎలాంటి పరిస్థితులనైనా సంతోషంగా ఎదిరించ గలరు. వారు నాకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా నా మొహంలో చిరునవ్వు మిగిలేది. ఇంతకీ ఆ పిల్ల పేరు చెప్పనేలేదు. భూమాత అంత సహనం ఉన్న ఆ పిల్ల పేరు భూమి. పూర్తి పేరు భూమిక ".
ఇది ఆ కథ ముగింపు.!

సమాజంలోని ఆర్థిక అసమానతలు మానవ సంబంధాలని ఎంతగా ప్రభావితం చేస్తాయో, ఉదాహరణగా ఎన్నో ఉత్తమ రచనలు వెలువడ్డాయి. సమాజ వికాసానికి ,సమాజ ప్రక్షాళనకు నడుం బిగించిన రచయితలెందరో వారి రచనల ద్వారా కొత్త రచయితలకు ఉత్సాహాన్ని పాఠకులకు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటారు.

ఈ క్రమంలో మంచి సాహిత్యం మంచి పాఠకులను కొత్తకథకులుగా మారుస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ ఈ కథ.

సమాజంలోని అసమానతలు బాల్యం నుండే పిల్లల పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆర్థికపరమైన స్థాయి బేధాలు పిల్లలను సమానంగా ఎదగనివ్వకుండా ఆటంకాలను కలిగిస్తాయి. ఒకే సమాజంలో ఒకే కాలంలో జీవిస్తున్న మనుషుల మధ్య గల సంఘర్షణాత్మక వాతావరణానికి, తనతో తనకు ,తన చుట్టూ ఉన్న వారితో తనకు,సమాజంతో తనకు ఏర్పడే ఘర్షణలకు మూలకారణమైన ఆర్థిక అసమానతలు సమాజంలోని దిగువ,అట్టడుగు వర్గాలకు కలిగించే నష్టం మాటల్లో చెప్పలేనిది.

అందరూ సమానం కాదు హక్కులు సమానం కావు సంపదలు సమానం కావు అవకాశాలు సమానం కావు - అనే భావనలు బాల్యం పైన చూపించే ప్రభావం చాలా తీవ్రమైనది.
సమదృష్టి లోపం వల్ల సమాజం అట్టడుగు వర్గాలను చిన్నచూపు చూస్తుంది. అయితే పేదల కోసం వారి హక్కుల కోసం వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించే దిశగా అటు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు కుల సంఘాలు నిరంతరం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అనాదిగా అనేక ప్రభుత్వ పథకాలు అమలులో ఉన్నప్పటికీ అందరికీ విద్యావకాశాలు కల్పించడంలో సమాజం ఎప్పుడూ విఫలమవుతూనే ఉన్నది.

అనేక ప్రభుత్వ పథకాలు అమల్లో ఉన్నప్పటికీ చిత్తశుద్ధి లోపించిన కొందరు అధికారులు, కింది స్థాయి సిబ్బంది కారణంగా చాలామంది విద్యార్థులు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వివక్షతకు గురి కావడమే కాకుండా అక్షరాస్యతకు దూరం అవుతున్నారు. నిరుపేద పిల్లలకు వారి ఆర్థిక స్థితిగతుల తో సంబంధం లేకుండా సమానంగా చదువుకునే హక్కును కల్పించడం గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సమాజంలో దోపిడీకి, వివక్షతకు గురైన కొందరు పిల్లలు అటు తర్వాత సమాజంలోని సంఘర్షణలకు వైపరీత్యాలకు కారణం అవుతూ ఉంటారు.

ఒక చిన్న అమ్మాయి తనకు సమీపంలోని భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన చిన్నపిల్లల్ని చేరదీయడం, తనకు ఉన్నంతలో తన తినుబండారాలను తన ఆటవస్తువులను ఆ పిల్లలకు అందజేయటం, అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ సందర్భంగా నిరాశ్రయులైన ఆ పేద కుటుంబం వలస పోవడంతో ,ఆ పిల్లలు ఆ అమ్మాయికిదూరం కావడం , కనపడని ఆ పిల్లల కోసం ఆ అమ్మాయి పడే ఆరాటం, మళ్లీ ఆ పిల్లల్ని చూడాలని, వారిని దగ్గరకు తీసుకోవాలని ,ప్రేమతో లాలనగా ఆ పిల్లలతో ముచ్చటించాలని ఆ అమ్మాయి పడే తపన పాఠకులకు మానవ సంబంధాల పట్ల ఒక ఎరుకను చైతన్యాన్ని కలిగిస్తుంది.

పేద వారైన ఆ పిల్లలు ఈ అమ్మాయి ఇచ్చిన కానుకలను ఎంత భద్రంగా, అపురూపంగా దాచుకున్నారో, ఆ అమ్మాయి వారిపట్ల కనపరిచే శ్రద్ధ ,ప్రేమ ,ఆప్యాయత, వారిలో ఎంత జీవనోత్సాహాన్ని నింపాయో‌ ఈ కథలో గమనించవచ్చు. తనకు ఉన్నది అది అవసరమైన వారికి ఇవ్వడం ద్వారా ఆ అమ్మాయి పొందే తృప్తి , ఆనందం అంతులేనిది.

ఇద్దరు పిల్లలను చూసి వారి దుస్థితికి స్పందించి, వారి పట్ల బాధ్యతతో నిజాయితీగా ఆ అమ్మాయి స్పందించిన విధానం వారి గురించి ఆమె కనబరిచిన శ్రద్ధ కథలోని మంచి అంశం.
ఇతరులను సంతోష పెట్టడం వల్ల ,సమానంగా చూడటం వల్ల కలిగే సంతోషాన్ని తృప్తిని ఇంటర్మీడియట్ చదివే ఒకఅమ్మాయి కథ గా రాయటం మంచి పరిణామం.

ఈ కథ కేవలం పిల్లలకు సంబంధించిన కథ మాత్రమే కాదు. ఈ కథ పెద్దలకు సంబంధించిన కథ .ఈ కథ వర్తమాన సమాజానికి సంబంధించిన కథ. సమాజంలోని అసమానతలను తొలగించడానికి ,అందరికీ విద్యను అందించే క్రమంలో అందరికీ ఉపాధి కలిగించే క్రమంలో ఇంకా రావాల్సిన చైతన్యం గురించీ ఈ కథ హెచ్చరిస్తుంది.

ఒక అమ్మాయి దృష్టికోణం నుంచి ఈ కథను వ్రాసిన కొత్త కథకురాలు మల్లిక చేసిన ప్రయత్నం అభినందనీయం. కొత్త కథకులని గుర్తించడం, కొత్త కథకులకు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రచురణ సంస్థలు పత్రికలు పాఠకులకు మెరుగైన రచనలతో చేరువ కావడం సులభమవుతుంది.

చదువుకోవడం కోసం పేద పిల్లలు పడే తపన, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతల కారణంగా పిల్లలు విద్యకు దూరమై ఉపాధి కోసం పనుల్లోకి కూరుకుపోవడం , తద్వారా వారి భవిష్యత్తు మొదట్లోనే విచ్ఛిన్నం కావటం, చదువుకున్న అమ్మాయి ఆ చిన్ని పేద అమ్మాయికి అక్షరాలు నేర్పించడం , తను దాచుకున్న చిన్ననాటి ఆటవస్తువులను రోజుకు ఒకటి చొప్పున ఆ అమ్మాయికి ఇవ్వాలి అనుకోవడం, ఆ పేద అమ్మాయి తనకు ఏమిచ్చినా ముందు తన తమ్ముడికి ఇవ్వాలి అనుకోవడం, తమ్ముడి పట్ల మంచి ఆపేక్ష కనపరచడం, ఎందుకు నువ్వు బడికి వెళ్లలేదమ్మా అని అంటే, తమ్ముని చూసుకోవడానికి తను ఇంటివద్దే ఉండాలని అప్పుడే తల్లిదండ్రులు కూలీ కి వెళ్లగలుగుతారని అనటం, ఏమ్మా ఇంతకీ నువ్వు పెద్దయ్యాక ఏం చేస్తావు అని అడిగితే దానికి ఆ పిల్ల "నేనా నేను .. పెద్దగైనాక ఊడుస్తా "అని అనటం, ఈ అమ్మాయి ఊరు వెళ్లి వచ్చేలోగా, ఆ పిల్లలిద్దరూ కనబడక పోయేసరికి , ఆ తర్వాత కనిపించే ఏ పిల్లలకైనా వాళ్ళ మొహాల్లోని సంతోషం కోసం వారికి ఏదో ఒకటి కొనివ్వడం ఈ కథలోని కీలకాంశాలు.

చిన్న పిల్ల రాసినా ఇది పిల్లల కోసం రాసిన కథ కాదని, ఈ కథ పెద్దల కోసం అని, ఇంకా చెప్పాలంటే ఈ కథ ఒక పాఠం అని అనిపిస్తుంది. గొప్ప వాళ్ళు రాసినంత మాత్రాన అవి గొప్ప కథలు కానట్లే, కొత్త బాల రచయితలు రాసినంతమాత్రాన అవి గొప్ప కథలు కాకుండా పోవు.

No. of visitors : 930
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •