మార్పును కోరేదంతా విప్ల‌వ క‌విత్వ‌మే

| సాహిత్యం | వ్యాసాలు

మార్పును కోరేదంతా విప్ల‌వ క‌విత్వ‌మే

- క‌వి యాకూబ్‌ | 31.10.2019 07:31:46pm


1. విప్లవ కవిత్వాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు? దానికి చోదకం ఏమిటి?

విప్లవ కవిత్వం మానవ వికాసాన్ని, మార్పును కోరుకుంటుంది. విప్లవమంటే మార్పు. ఈ సమాజం బాగా లేదని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ పరిణామాలు జరగాల్సిన దిశలో జరగడం లేదని అందరికీ తెలుసు. దీని గురించి రోజువారీ సమస్యల్లో ఉన్న వాళ్లంతా ఆలోచిస్తున్నారు. విప్లవ కవిత్వం అనే మాట యాభై ఏళ్ల కింద ఎలా వచ్చినా, ఇప్పుడది కేవలం కమ్యూనిస్టులదే కాదు. విరసందే కాదు. ఇప్పుడు విప్లవం అంటే మార్పు కోరుకునే మనుషులందరిలో ఉండే భావన. ఎక్కడ సమస్య ఉన్నదో, ఎక్కడ మార్పు కోరుకుంటున్నారో అదంతా విప్లవం కిందికే వస్తుంది. అట్లా రాసినది అంతా విప్లవ కవిత్వమే. దానికి చోదకం ఏమంటే అణచివేత, వంచన, దోపిడీ. వీటికి వ్యతిరేకంగా పోరాటం. ఇవన్నీ విప్లవ కవిత్వానికి ప్రేరణ అవుతాయి. సమకాలీన ప్రపంచంలోని సమస్యలపై ఆలోచిస్తూ మార్పు కోరుతూ రాసేదంతా నా దృష్టిలో విప్లవ కవిత్వమే.

2. విరసం ఏర్పడిన తర్వాత కవిత్వంలో వచ్చిన మార్పు ఏమిటి? తొలి దశ విప్లవ కవిత్వాన్ని ఎలా విశ్లేషిస్తారు?

తొలి దశ విప్లవ కవిత్వం వెనుక నేపథ్యం ఉన్నది. ఆ పరిస్థితులు చాలా ప్రత్యేకమైనవి. స్వాతంత్య్రం వచ్చాక ప్రజలకు దాని ఫలాలు అందలేదు. అట్లాగే స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే కమ్యూనిస్టు ఉద్యమాలు, అభ్యుదయ సాహిత్యం మొదలైంది. పైజ్‌, కైఫియాజ్కి, సర్దార్‌ జాఫ్రీ వంటి సాహిత్యకారులు ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేశారు. ఆ దశ తర్వాత స్వాతంత్య్రం అనేది వచ్చింది. దాన్నుంచి చాలా కొత్త దనం ఆశించారు. అయితే అవేమీ జరగలేదు. అభ్యుదయ రచయితల సంఘం, దీని చుట్టూ ఉన్న కవులు ప్రభుత్వ విధానాలతో లొంగిపోయిన స్థితిలో ఒక ఆశను కల్పించడానికి విప్లవ రచయితలు వచ్చారు. రచయితలారా మీరెటువైపు? అనే ప్రశ్న సామాజిక రంగంలో ఒక సంచలనం. ఒక ఆశ.

అంతకుముందే సమాజంలోని డొల్లతనాన్ని దిగంబర కవులు ప్రశ్నించారు. దిగంబర కవులు ఎత్తి చూపిన అంశాలు అప్పటి స్థితిని తెలియజేస్తాయి. అనంతరం రచయితలా మీరెటువైపు అనే ప్రశ్న అనేక నిరాశల నుంచి, కోపాల నుంచి మనిషి చేసిన ఆక్రందన. దాన్ని రెండు వాక్యాల్లో వివరించలేం. సృజన జీవులు సమాజం నాడి పట్టుకోవాలి. దాన్ని గుర్తించమని ఆ తరం వేసిన ప్రశ్న అది. తెలుగు సాహిత్యాన్ని ఆ ప్రశ్న ఒక మలుపు తిప్పింది. అప్పటి పరిస్థితులను విమర్శనాత్మకం చూస్తూ రచయితలను నిలదీసిన ప్రశ్న అది. ఆ పక్కన శ్రీకాకుళ పోరాటం నడుస్తోంది. ఈ సమాజంలోకి ఏదో కొత్త మార్గం దొరుకుతుందనే విశ్వాసం ఆ పోరాటం అందించింది. మనిషి ఉన్నతంగా నిలబడతాడు.. సమసమాజం నిర్మాణం అవుతుంది.. సమాజం విముక్తం అవుతుందనే ఆశ లుగుతున్న కాలంలో, దానికి సంఘీభావంగా రచయితలు ముందుకు వచ్చారు. శ్రీకాకుళం మార్గంలో నడవాలనే ఆకాంక్షతో విరసం ఏర్పడింది. కాళీపట్నం, రావిశాస్త్రి, శ్రీశ్రీ, శివసాగర్‌ మొదలైన వాళ్లు తెలుగు సాహిత్యం రూపురేఖలు మార్చారు. తొలి తరం విప్లవ కవిత్వం మనకు అందించిన కంట్రిబ్యూషన్‌ చాలా గొప్పది. దాన్ని తెలుగు సమాజానికి అందించిన ఘనత విప్లవ కవిత్వానిదే. విరసానిదే.

3.1980ల నాటి విప్లవ కవిత్వాన్ని ఎలా అంచనా వేస్తారు?

శ్రీ కాకుళ పోరాటం ఒక పెద్ద ఆశతో మొదలై సమాజాన్ని మారుస్తుందనే భరోసా ఇచ్చింది. అనేక మంది తుపాకులు పట్టుకొని విప్లవోద్యమంలోకి వెళ్లారు. గొప్ప త్యాగాలు చేశారు. అయితే కవులు కలగన్న సమసమాజం చేరువ కాలేదు. ఈలోగా ఇంకో కొత్త తరం ముందుకు వచ్చింది. పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరం మనిషి కేంద్రంగా కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది. మనిషి ఒంటరివాడైపోయాడనే భావన వచ్చింది. 1980ల కవిత్వాన్ని ఇది ప్రభావితం చేసింది. మనిషి శకలాలు శకలాలుగా మారిపోతున్న తీరు చర్చనీయాంశం అయింది. ఇంకో పక్క విప్లవోద్యమం చాలా త్యాగాలు చేస్తోంది. దానికి తగినట్లు అనేక పోరాటాలు నడుస్తున్నాయి. ఇవేవీ తక్కువ కాదు. అయితే మనిషి ఎలా నిలబడాలి? అనే సమస్య వచ్చినప్పుడు విప్లవ కవిత్వం మొదటిలాగా ధైర్యాన్ని ఇవ్వలేకపోయింది.

ఈ కాలంలోనే విప్లవ కవిత్వం కూడా చాలా మారింది. 1980లలో శివసాగర్‌ విప్లవ సాహిత్యోద్యమం అందించిన ఒక గొప్ప ఆశ. ఆయన్ను చాలా మంది ఫాలో అయ్యారు. అలాగే వరవరరావు అప్పటి నుంచి ఇప్పటి దాకా సమాజం మార్పు పట్ల నమ్మకాన్ని ఇస్తూ రాస్తున్నారు. ఆరోజుల్లో ఆయన ప్రభావం చాలా ఉన్నది. అయితే మనిషి శకలాలుగా మారుతున్నాడని అనుకున్న తరం విరసం వైపు వెళ్లకుండా తనదైన కవిత్వం రాసుకుంటూ పోయింది.

అయితే విరసంలోనే అప్పట్లో వచ్చిన కొత్త కవులు మొత్తం తెలుగు కవిత్వం మీద గొప్ప ప్రభావం వేశారు. 1980లలో తిరుపతి, ఉత్తరాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో బలమైన విప్లవ కవిత్వం వచ్చింది. అదే కాలంలో బైట ఈ వొరవడిలో దర్భశయనం, సిధారెడ్డిలాంటి కవులు శక్తివంతంగా రాయడం మొదలుపెట్టారు. 1980లలో వ్యక్తి కేంద్రంగా వచ్చిన వేగుంట, ఇస్మాయిల్‌, అఫ్సర్‌ లాంటి కవులు, రెండో తరం విప్లవ కవులు సమాంతరంగా సాగారు.

4. 1990ల తర్వాత విప్లవ కవిత్వంలో వచ్చిన మార్పును ఎలా అంచనా వేస్తారు? శిల్పంలో కూడా.

ఒకప్పుడు విప్లవ కవిత్వమంటే కొట్టు చంపు నరుకు అనేవే ఉంటాయనే ప్రచారం ఉండేది. దీన్ని రారా తీసుకొచ్చాడు. 1990ల తర్వాత విప్లవ కవిత్వంలోకి ఇంకో కొత్త తరం వచ్చింది. ఉదాహరణకు వడ్డ్డెబోయిన శ్రీనివాస్‌, కెక్యూబ్‌ వర్మ, రివేరా, అరసవెల్లి కృష్ణ, కూర్మనాథ్‌, కాశీం లాంటి వాళ్లు ఒక కొత్త వ్యక్తీకరణ తీసుకొచ్చారు. ప్రధాన స్రవంతి కవిత్వం అనబడే దానికి ఏమీ తీసిపోని పద్ధతులు రాశారు. ప్రజా పోరాటాలు, సంక్షోభాలు, మార్పు మొదలైనవి తీసుకుంటూనే ..అంటే విప్లవ వస్తువులోనే అనే కోణాలు తీసుకొని తాజా పద్ధతుల్లో రాశారు. అరుణతారలో ఇలాంటి కవిత్వం చాలా కనిపిస్తుంది. అంతకుముందు నారాయణ స్వామి విప్లవ వస్తువునే తీసుకొని సమాజాన్నంతా అప్పీల్‌ చేసే దృక్పథంతో, శిల్పంతో రాశాడు. కవిత్వం కోసమే కవిత్వం అనే పద్ధతిలో కాకుండా ప్రజలు కేంద్రంగా ప్రజా ఉద్యమాలను విస్తృతంగా అప్‌డేటెడ్‌ శిల్పంతో ఎప్పటికప్పుడు విప్లవ కవులు రాస్తూ వచ్చారు. దీన్ని గమనించాలి.

ఇట్లా విరసం నుంచి వచ్చిన కవిత్వాన్ని ప్రత్యేకంగా చూడాలి. ఈ సమయంలో తెలుగులో దళిత, స్త్రీ, ముస్లిం, మైనారిటీ కవిత్వ స్రవంతులు వచ్చాయి. అస్తిత్వ చైతన్యం చాలా సూక్ష్మస్థాయిలోకి వెళ్లింది. ఈ దశలో విరసం ఒక కుదుపుకు గురైంది. అయితే ఈ అస్తిత్వ విషయాలను విరసం కవులు వెంటనే తీసుకున్నారు. విప్లవ దృక్పథం నుంచి మంచి శిల్పంతో రాశారు. ఏదైనా ఒక పుస్తకం తీసుకుని విశ్లేషిస్తే ఇవన్నీ కనిపిస్తాయి. ఒకే కంఠస్వరంతో అటు నేరుగా దండకారణ్య విప్లవోద్యమాన్ని, విప్లవ రాజకీయాలను చెప్తూ సూక్ష్మస్థాయిలో అస్తిత్వ సంవేదనల్ని 1990ల నుంచి విప్లవ కవులు బాగా వినిపిప్తున్నారు. దీన్ని గుర్తించాల్సి ఉంది. ఈ పరిణామాన్ని వెలికి తీసి చర్చించాలి. దీనికి అవసరమైన ఒక మంచి డైలాగ్‌ నడవాలి. విప్లవ కవులంటే విప్లవోద్యమం గురించే రాస్తారనే అపోహ ఉన్నది. ఇది నిజం కాదు. విప్లవకవి కూడా ఈ సమాజంలో భాగం. విప్లవోద్యమం కూడా ఈ సమాజంలో భాగం. విప్లవంతోపాటు సమాజంలోని అన్ని అంశాలను విప్లవ కవులు రాస్తున్నారు. విప్లవం, మిగతా అంశాలు విడివడి లేవు. నా పాయింట్‌ ఏమంటే - విప్లవ కవులు ఇక్కడ జరుగుతున్న అన్ని ఉద్యమాలకు, ముఖ్యంగా అస్తిత్వ ఉద్యమాలకు, అన్ని పరిణామాలకు అతీతంగా లేరు. వేరేగా లేరు. విప్లవ కవిత్వం ఆరంభంలో ఉన్నవాటికి క్రమంగా అనేక విషయాలు చేర్పు అయ్యాయి. తమ దృక్పథంతో చేర్చుకోవాల్సిన వాటన్నిటినీ చేర్చుకున్నారు.

ఉదయమిత్ర కవిత్వం పుస్తకం పేరే చూడండి. నదిలాంటి మనిషి అన్నాడు. పదేళ్ల కవిత్వం ఇది. ఇందులో ఉండే మనిషి ఒకరు కాదు. అనేక రకాల పీడనలు, వెలి, దోపిడీ వంటివన్నీ అనుభవిస్తున్న, వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్న మనుషులు మనకు కనిపిస్తారు దళితులు, సామ్రాజ్యవాద బాధితులు, శకలాలుగా మారిపోతున్న మనుషులు కూడా ఈ కవిత్వంలో ఉన్నారు. విరసం కవి వీటన్నిటిని చిత్రించాడు. అట్లాగే ఉదయభాను పిల్లనగాలి తుఫాను సంపుటిని చూడండి. గ్రీన్‌హంట్‌ వ్యతిరేక కవిత్వం మాత్రమే ఇందులో లేదు. గ్రీన్‌హంట్‌ వెనుక ఉన్న సమాజ విధ్వంసం అంతా సూక్ష్మస్థాయిలో ఉన్నది. అలాగే క్రాంతి కవిత్వంలో, చంద్రయ్య కవిత్వంలో, షహీదా కవిత్వంలో అనేక వస్తువులు, పీలింగ్స్‌ కొత్త శిల్పాల్లో కనిపిస్తాయి.

ఒకప్పుడు విప్లవ కవిత్వ పుస్తకం వస్తే ʹఅందులో విప్లవం ఉంటుంది మనకెందుకు?ʹ అని ఇతరులు అనుకోవచ్చేమో. కానీ ఇప్పుడు అట్లా కాదు. విప్లవ కవులు సమాజ చలనాలన్నిటినీ పట్టుకుంటున్నారు. అంబేద్కర్‌ గురించి విప్లవ కవులు రాశారు. అదే సమయంలో మార్క్సిస్టు తాత్వికతను కవిత్వం చేస్తున్నారు. స్థానిక పోరాటాల్లో భాగమైన ప్రజల గురించీ రాస్తున్నారు. విప్లవ కవులు చాలా ఎక్స్టెండ్‌ అయ్యారు.

5. కొత్త తరం విప్లవ కవులలో వస్తు వైవిధ్యం?

రివేరా, స్వాతి, సూర్యచంద్ర, క్రాంతి, చంద్రయ్య , ఉదయభాను మొదలైన వాళ్లను కొత్తతరం విప్లవ కవులు అనుకుంటే వీళ్లల్లో వస్తు వైవిధ్యాన్ని శ్రద్ధగా చూడాలి. ఇప్పుడు చేరా లాంటి వాళ్లు ఈ కవిత్వాన్ని చూస్తే చాలా ఆధునిక కవిత్వ నిర్మాణ పద్ధతులు, శిల్పరీతులు వీళ్ల కవిత్వంలో ఉన్నాయని అంగీకరిస్తారు. ఇంకో అంశం కూడా ఉంది. ప్రపంచ కవిత్వంతో మొదటి తరం, రెండో తరం విప్లవ కవులకు బాగా పరిచయం ఉండేది. ఈ తరం విప్లవ కవులలో అంత ఉండకపోవచ్చు. అయితే ప్రపంచ పరిణామాలు దగ్గరిగా గమనిస్తున్నారు. అమెరికా దుర్మార్గాలను సున్నితంగా గమనిస్తున్న ఈ తరం కవులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. దాన్ని చెప్పడానికి మన దగ్గర విప్లవ కవులు ప్రయత్నిస్తున్నారు. వస్తువు, శిల్పం దానికి సంబంధించిన మార్పులు చాలా ఈ తరం కవులు తీసుకొచ్చారు. దీన్ని ఒక్కో పోయెం తీసుకొని వివరిస్తూపోవచ్చు. ఇప్పుడు రారా ఉండి ఈ కవిత్వం పరిశీలిస్తే తన అభిప్రాయం మార్చుకొనేవారు.

బహుశా విప్లవ కవిత్వం తొలి రోజుల్లో ఆనాటి కాల వ్యక్తీకరణగా, అవసరంగా అలా వచ్చి ఉంటుంది. జరుగుతున్న విప్లవోద్యమాలకు బాసటగా నిలబడటం, వాటిని ప్రచారం చేయడం ఆనాటి విప్లవ కవి బాధ్యత. ఈ కర్తవ్యంలో శిల్పాన్ని అందరు కవులూ పట్టించుకుని ఉండకపోయాను. ఇది వాస్తవం కావచ్చు. దానిమీద రారా పెద్ద విమర్శ పెట్టాడు. ఆయన దిగంబర కవిత్వాన్ని కూడా అలాగే అన్నాడు. అయితే కాలావసరంగా ఆనాటి కవిత్వం అలాంటి శిల్పంలో వచ్చింది. కానీ దిగంబర కవిత్వమైన, తొలినాళ్ల విప్లవ కవిత్వం అయినా మొత్తంగా తెలుగు కవిత్వ రూపు రేఖల్ని మార్చేశాయి. సమాజాన్ని కదిలించాయి.

నిజానికి స్త్రీవాద కవిత్వంలో కూడా ఇలాంటి షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చే ధోరణి ఉన్నది. శరీర అవయవాల ప్రతీకగా తెచ్చి స్త్రీల బాధను కవిత్వం చేశారు. అలాగే దళిత కవిత్వం ఊరిబైట ఉండే అంటరానితనంలోని వ్యధను చాలా తీవ్రంగా వ్యక్తీకరించింది. దిగంబర కవిత్వం, తొలినాళ్ల విప్లవ కవిత్వం శిల్పానికి, వ్యక్తీకరణకు, వస్తువుకు కూడా ఇవన్ని ఎక్స్‌టెన్షన్‌ అనుకోవాలి. విషయాన్ని ధాటిగా, సూటిగా, పదునుగా చెప్పే ధైర్యాన్ని విప్లవ కవిత్వం తెలుగు కవులకు ఇచ్చింది. అస్తిత్వ కవిత్వాలన్నీ దాన్ని అందుకున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యంలో, ఉద్యమాల్లో, భావజాలాల్లో వచ్చిన మార్పులను విప్లవ కవులు గుర్తించి, ఇక్కడ జరుగుతున్న పోరాలాల వెలుగులో, మన కవిత్వంలో వచ్చిన అన్ని అస్తిత్వ చైతన్యాలు ఆహ్వానించారు. దీనివల్ల విప్లవ కవులకు ఒక స్పష్టత వచ్చిందని అనుకుంటున్నాను. అందుకే ఫూలేని తమ గుండెల్లో నింపుకున్నారు. అంబేద్కర్‌ను స్వీకరించారు. ఈ విస్తృతితో విప్లవ కవులు అన్నిటినీ రాశారు. రాయనివి ఏదీ లేని దశకు చేరుకున్నారు.

6. విప్లవ కవిత్వ లక్ష్యం - శిల్ప ప్రయోగాలకు సంబంధం గురించి చెప్పంది.

విప్లవ కవిత్వ లక్ష్యం కేవలం ఇక్కడ నడుస్తున్న విప్లవోద్యమమే కానవసరం లేదు. అన్ని రకాల మార్పులకు సంబంధించిన విషయం. మనిషిని ఉన్నతంగా నిలబెట్టి, అన్ని అసమానతలు రద్దు చేసేందుకు సాగే మార్పులన్నీ విప్లవమే. మనిషి వెనుక మనిషి ఉండటం కాదు. మనిషి పక్కన మనిషి ఉండాలి. ఇప్పుడు అందరూ అది కోరుకుంటున్నారు. విప్లవ కవిత్వం దాన్ని అందిపుచ్చుకున్నది.

కొంత మంది ఇలాంటి విప్లవం కోసమే నిలబడి పని చేయవచ్చు. మిగతా వాళ్లు దాని చుట్టుపక్కల ఉండి పని చేయవచ్చు. పక్కన ఉన్నవాళ్లు చేస్తున్న పని కూడా విప్లవమే. దానితోనే నిలబడి పనిచేస్తున్న రచయితలు ఒక సంఘంగా ఉన్నారు. లక్ష్యం ఒకటే కాబట్టి అవసరం అయినప్పుడల్లా వాళ్లు, వీళ్లు కలుస్తున్నారు. ఇదంతా లక్ష్యం చేరుకోడానికి చేసే పద్ధతులు.

కవిత్వం విషయంలోకి వస్తే శిల్పం అంటున్నాం. కానీ వస్తువు - శిల్పం వేర్వేరుగా లేవు. నీవు బాధతో పలికే ప్రతి మాట, అవతలి వాళ్లును అప్పీల్‌ చేయగల ప్రతి వాక్యం తప్పక రూపం, సారం మమేకం అయిన దశలోనే వస్తాయి. చాలా చేయి తిరిగిన కవి కూడా ఒక కవిత రాసినప్పుడు మూడ్‌ను బట్టి అది కవిత కాకపోవచ్చు. అంతకుముందే రాసిన కవిత్వాన్నిబట్టి ఆ కవికి బాగా శిల్పం తెలుసని అనుకోడానికి లేదు. కొన్ని కవితల్లో శిల్పం తేలిపోతుంది. ఇవాళ విప్లవ లక్ష్యాన్ని పెట్టుకున్న కవి కొన్ని సందర్భాల్లో.. అక్కడ ఒక ఎన్‌కౌంటర్‌ జరిగి ఉండవచ్చు.. దాని గురించి రాస్తున్నప్పుడు రెండు వాక్యాలు బలహీనంగా ఉండవచ్చు. అయితే ఆ విషయాన్ని బట్టి - అది పాఠకులు మొత్తంగా ఎట్లా అప్పీల్‌ చేయగలుగు అనే దాన్ని బట్టి ఆ రెండు బలహీన వాక్యాలు పక్కకు పోతాయి. ఆ కవిత పాఠకులకు బలంగా చేరుతుంది. ఇప్పుడు కవిత్వాన్ని ప్లాట్‌గా ఎవ్వరూ రాయడం లేదు. బైట కూడా కొందరు కవులు కవిత్వం కాని దాన్ని రాసి కవిత్వం అని ప్రచారం చేసుకుంటున్నారు. విప్లవ కవులు చాలా అప్రమత్తంగానే వస్తువులు, శిల్పాన్ని, రెంటినీ కలిపి కవిత్వాన్ని డెవలప్‌ చేస్తున్నారు. అలాంటి కవిత్వం రాస్తున్న విప్లవ కవులకు జయహో చెప్పాల్సిందే.

7. ఈ తరం విప్లవ కవులు విప్లవాన్ని ఎలా ప్రతిపాదిస్తున్నారు?

ఇప్పుడు విప్లవమనే భావనను అదే పదాల్లో చెప్పడం లేదు. చాలా విశాలంగా, ఇక్కడ జరుగుతున్న పోరాటాలను కళ్లకు కట్టే శిల్పం ద్వారా రాస్తున్నారు. ఏ దిశగా మార్పు జరగాలి అనే దాన్ని చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా చెప్తున్నారు. ఇది ఒక గొప్ప టెక్నిక్‌. ఒకప్పుడు సూటిగా ఉండేది. ఇప్పుడు తన చుట్టూ ఉన్న స్థితిని, వాతావరణాన్ని, మార్పులను విప్లవ కవులు తమలో జీర్ణం చేసుకుని రాస్తున్నారు. ప్రపంచాన్ని అంతా స్వీకరించి తనదైన రక్తమాంసాలను అద్ది, తనదైన అనుభవంతో వ్యక్తం చేస్తున్నారు. కవి చేయాల్సిన పని ఇదే.

దీనికి కారణం ఏమంటే 70ల తరువాత సాంప్రదాయ కవులను సమాజం తిరస్కరించింది. వస్తువు మారాల్సిన అవసరాన్ని ఆ కాలం డిమాండ్‌ చేసింది. క్రమంగా శిల్పంలోనూ మార్పు కనిపించింది. విప్లవ ద క్పథాన్ని ప్రధానంగా తీసుకువచ్చిన ప్రతి సాహిత్య ప్రక్రియనూ సమాజం సొంతం చేసుకుంది. అది జాషువా నుంచి గోరటి దాకా మార్పును కాంక్షించిన సాహిత్యాన్ని ఎవరు స ష్టించినా దానికి ఆదరణ ఉంటూ వచ్చింది. అన్ని ప్రక్రియల్లోనూ విరసం ఆది నుంచీ ఆ కొనసాగింపుని నిలబెట్టుకుంటూ వచ్చింది. అరసవిల్లి క ష్ణ, కాశీం లాంటి వాళ్లు ఆధునిక కవిత్వంలో మంచి మెలకువ గల కవులు. ఇలాంటి ఎందరో కవులు, రచయితలను విరసం అందించింది. ఇది విరసం అపారమైన కంట్రిబ్యూషన్‌.

8. విప్లవ కవుల తాత్విక వ్యక్తీకరణను ఎలా చూస్తారు?

విప్లవ కవులు సున్నితత్వాన్ని పునికిపుచ్చుకున్నవాళ్లు. ప్రతి అలజడినీ అక్షరీకరించిన వాళ్లు. మనిషి కన్నీళ్ల వెనకగల కార్యకారణాలను చూడగల లక్షణం విప్లవ కవికి ఉంది. పైపై విషయాలే కాదు.. అందుకు గల మూలాల్ని అన్వేషించడం, వాటిని సాహిత్యంలో ప్రతిఫలింపజేయడం విప్లవ రచయితకు గల ఎరుక. ఆ ఎరుకను ఇచ్చింది విప్లవ తాత్వికత. విరసం కవుల్లో ఎవరి కవిత్వాన్ని పట్టుకున్నా అది స్పష్టంగా కనిపిస్తుంది. యువ కవుల్లోనూ ఆ తాత్వికత సుస్పష్టంగా కనిపిస్తుంది.

చంద్రయ్య ఒక చోట...
కవిత్వమెప్పుడూ గోడలను బద్ధలు కొడుతూనే ఉంది
మూడు అక్షరాలను మూటకట్టి ప్రేయసికి పంపుతూనే ఉంది
కవిత్వానిదంతా త్యాగాల చరిత్రే
అది గతమూ, వర్తమానము, భవిష్యత్తు.. అంటాడు.

విప్లవ సాహిత్యం చేయాల్సిన పని ఆధిపత్యాన్ని బద్దలు కొట్టడం.. దాన్ని గోడలు బద్దలు కొట్టడంగా చెప్పాడు. కవిత్వానిదంతా త్యాగాల చరిత్రే అన్నాడు.. నిజమే మనిషి కోల్పోతున్నదంతా త్యాగమే. విప్లవ కవి ఎక్స్‌టెండ్‌ అయిన తీరు ఇది. విప్లవ తాత్వికత ఎక్స్‌టెండ్‌ అయిన తీరు ఇది.

చివరకు స్మ తి కవిత్వంలోనూ కొత్తదనాన్ని తీసుకొచ్చారు విప్లవ కవులు. క్రాంతి కవిత్వంలోనూ అలాంటి ఎక్స్‌ప్రెషన్‌ కనిపిస్తుంది. రియాజ్‌ను గురించి రాస్తూ.. నాలో స్నేహ ప్రవాహానివి నీవే కదా / నా జ్ఞాపకాల్లో నీ రూపమే కదా / నిన్ను నా నుండి వేరు చేయడం ఎవరి తరం అంటాడు. పాఠకులను క్షణకాలం ఆలోచింపజేస్తాడు. గడిచిన యాభై ఏళ్లలో శిల్పంలో ఎంత మార్పు వచ్చినా, ఆ మొత్తం విప్లవ కవిత్వంలో ఒక అంతస్సూత్రంగా కనిపిస్తుంది.

శివారెడ్డి లాంటి వారికి సైతం అలాంటి ఎరుకను ఇచ్చింది ఈ తాత్వికతే. ఆమాటకొస్తే.. అలాంటి చూపు గల కవులంతా విప్లవ కవులే. మైనార్టీ వేదనను, దళిత వేదనను చెబుతున్న కవులంతా విప్లవ కవులే. అలాంటి సృజన చేసే ఏ రచయితనూ విరసం దూరంగా ఉంచలేదు. అలాంటి సాహిత్యాన్ని విరసం ఎత్తిపట్టింది కూడా. విరసం ఆశించే మార్పు ఏ రచయిత పలికించినా విరసం ఆ సాహిత్యాన్ని సొంతం చేసుకొంది. శివసాగర్‌ విప్లవ కవిత్వానికి వందేళ్లకు సరిపడ దారులు వేశాడు. అది విప్లవ తాత్వికత వల్లే సాధ్యమైంది. విప్లవం చేసిన కంట్రిబ్యూషన్‌.

విరసం నడుస్తున్న కాలంలో, విరసం ఏర్పర్చిన వాతావరణంలో... దాని పక్కన నిలబడి రాసిన కవులు, చిద్రమైన మనిషి గురించి రాస్తున్న అజంతా లాంటి వాళ్లకు ఆ ఎరుకను ఇచ్చింది విప్లవ సాహిత్యోద్యమం. గుడిహాళం రఘునాథం, ఖాదర్‌ మొహియొద్దీన్‌ లాంటి ఎందరో కవులపై విరసం ప్రభావం ఉంది. అందుకే... విప్లవ రచయితలతో వీళ్లందరికీ స్నేహం, పరస్పర గౌరవం ఉంది. పక్క పక్కన నడుస్తుండొచ్చు కానీ... వాళ్లకు సమాజం పట్ల, మార్పు పట్ల ప్రేమను పెంచడంలో విరసం పాత్ర ఉంది.

విప్లవ కవులంతా... కరుకుగా రాస్తారనే విమర్శ కొనసాగుతూ వచ్చింది. కానీ, ఇప్పటి దాకా రాసిందంతా చూస్తే, సమాజంలోని కలతను చూసి దుఃఖపడే ఏ కవికీ విప్లవ కవి వేరు కాదు.

9. విప్లవ కవిత్వ ప్రభావం సామాజిక ఉద్యమ కవులపై ఎలా ఉంది. సామాజిక అస్థిత్వాలను విప్లవ కవులు ఎలా చిత్రించారు?

విప్లవ కవులు చేస్తున్న పనే అది. ప్రతి అక్షరం కూడా.. సామాజిక ఉద్యమాలకు అండదండగా వచ్చినదే. ఎక్కడా సామాజిక ఉద్యమాలకు దూరంగా లేదు. విరసం చరిత్రే అది. కానీ, ఆయా సామాజిక అంశాలపై మొదటి నుంచీ విరసం రాస్తూ వచ్చింది. అయితే అలాంటి సాహిత్యానికి విరసం ప్రత్యేకంగా ఒక పేరునివ్వలేదు. అల్లం రాజయ్య లాంటి వాళ్లు విరసం రచయితలే. వాళ్లకు పెద్ద గుర్తింపు ఉంది. వాళ్ల సాహిత్యంలో అనేక రకాల పీడితులు కనిపిస్తారు. కానీ ప్రత్యేకంగా అలాంటి పేరు పెట్టి గుర్తించలేదు. విప్లవ సాహిత్యంగానే ప్రొజెక్ట్‌ అయ్యింది. ఇంకోవైపు... దళిత సాహిత్యోద్యమం శివసాగర్‌ను తన ఐకాన్‌గా చూపించింది. కానీ ఆ సాహిత్యమంతా ఆయన విరసం వేదిక నుంచే రాశాడు.

అలాగే ఝల్‌ ఝలా కంటే ముందే జిహాద్‌ పేరుతో ముస్లిం కవిత్వ సంపుటిని విరసం తీసుకొచ్చింది. కానీ చెప్పుకోవడంలో, ఓన్‌ చేసుకోవడంలో విరసం వైపు నుంచి గ్యాప్‌ ఉంది.

దళిత, స్త్రీవాద, మైనార్టీ సాహిత్యోద్యమాలకు కావల్సిన ఎరుకను విరసం ఏదో ఒక రూపంలో అందించింది. ఇది వాస్తవం. అంతే కాదు.. గత యాభై ఏళ్లలో మొత్తం అస్థిత్వ ఉద్యమాల పట్ల విరసం దృక్పథం విస్త తమవుతూ వచ్చింది.

10. పాణిగ్రాహి, శివసాగర్‌, అజ్ఞాత సూరీడు తరువాత వచ్చిన అజ్ఞాత విప్లవ కవిత్వంలో మార్పును ఎలా చూస్తారు?

అజ్ఞాత రచయితల సాహిత్యం పట్ల మొదటి నుంచి ఒక సానుభూతి ఉండింది. అది వాళ్లు చేస్తున్న త్యాగం వల్ల. సమాజంలో ఆ ఆదరణా ఉంది. అయితే.. కాలం మారుతున్నా కొద్ది ఈ పరిస్థితి మారుతూ వచ్చింది. తొలినాళ్లలో అజ్ఞాత కవుల కవిత్వం కోసం సాహిత్య రంగం ఎదురు చూసేది. హీరోయిక్‌ ఆరాధన ఉండేది. వర్తమాన పరిస్థితుల్లో అలాంటి వాతావరణం లేదు. అయితే.. ఇవాల్టికీ వస్తున్న అజ్ఞాత కవిత్వంలో గొప్ప వైవిధ్యం కనిపిస్తుంది. నిజానికి అది వాళ్లకు మాత్రమే సాధ్యమయ్యే స జన. కదిలించే గుణం, రగిలించే గుణం అజ్ఞాత కవిత్వంలో కనిపిస్తుంది. పరిపక్వమైన కవిలోని ఎక్స్‌ప్రెషన్స్‌ అజ్ఞాత కవిత్వంలో కనిపిస్తుంది. షహీదా కవిత్వం అందుకు ఓ ఉదాహరణ. అయితే... లోపలి నుంచి సాహిత్యం బయటి సమాజానికి ఎంత రీచ్‌ అవుతున్నదనేది ప్రశ్న. ఈ సాహిత్యాన్ని మరింత ప్రజలకు చేర్చే ప్రయత్నాలు జరగాలి.

11. విప్లవ వచన కవిత్వంపై పాట ప్రభావం?

విప్లవ వచన కవిత్వం, పాట ఒకదానితో ఒకటి ఒరుసుకొని నడిచాయి. నడుస్తున్నాయి. గద్దర్‌ పాట, శివసాగర్‌ కవిత్వం రెంటికీ ఆ గుర్తింపు, ఆదరణ ఉంది. కవిత్వంలో ఎక్స్‌ప్రెస్‌ చేయలేని భావాలను పాట ఒడిసి పట్టుకుంది. కవిత్వం తనదైన శైలిలో వ్యక్తీకరించింది. పాట ప్రభావం విప్లవ కవిత్వంపై నూరు శాతం ఉంది.

12. విప్లవ కవిత్వంలోని సూటిదనం, సంక్లిష్టతలను ఎలా విశ్లేషిస్తారు?

విప్లవ కవిత్వంలో సంక్లిష్టత పాలు తక్కువే. ఎందుకంటే.. పాఠకుడి చేరడం అనే లక్ష్యం దానికి ఉంది. ఇది దాని ప్రధాన గుణం. విషయాన్ని ఇంకా ఇంకా సూటిగా బోధపరచాలనే స్ప హ వల్ల తొలినాళ్లలో విరసం అనేక విమర్శలను ఎదుర్కొన్నది. జీవితపు సంక్లిష్టతలే సాహిత్యంలో ప్రతిఫలిస్తాయి. విప్లవ కవిత్వం మార్పుకు , త్యాగాలకు సంబంధించింది కావడం వల్ల ఎప్పటికప్పుడు సంక్లిష్టతకూ లోనవుతుంది. సూటిదనానికీ లోనవుతుంది. ఈ రెంటికీ సంబంధం ఉంది

No. of visitors : 802
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •