గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"

| సాహిత్యం | క‌థ‌లు

గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"

- పలమనేరు బాలాజీ | 02.11.2019 10:25:30pm


జీవితం తెలిసిన కథకుడు రాసిన కథ జీవితం లాగే కఠోరంగా ఉంటుంది. అవును సత్యం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. సత్య వంతంగా చెప్పిన కథలు కూడా కఠోరంగానే ఉంటాయి. ఆ కథలోని మాటలు, పాత్రలు ,మలుపులు ,కథా చిత్రాలు సంఘటనలు, సందర్భాలు, సన్నివేశాలు తీవ్రంగానే ఉంటాయి.

బహుశా ఎన్నటకీ మనిషిని వెంటాడే ఒంటరితనం, దుఃఖం, పోరాటం మంచికథను అల్లుకుని ఉంటాయి. ఇక్కడ కథకుడు తీర్పు చెప్పటానికి ఏమీ ఉండదు. ఉన్నది ఉన్నట్లుగా జీవితంలోని ఒక దృశ్యాన్ని తీసుకొని కథగా అల్లటమే.

మానవ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశం కరువు. అతివృష్టి కావచ్చు ,అనావృష్టి కావచ్చు .వర్షం పడక పోవడం కావచ్చు ,అకాల వర్షం కావచ్చు. ఏదేమైనా ప్ర కృతి వైపరీత్యాలు మానవ జీవితాన్ని అల్లకల్లోలం చేసి, మానవ సంబంధాల్ని దెబ్బతీసే విధంగా , అంత తీవ్రమైన పేదరికంలో సైతం విలువలు దెబ్బతినకుండా మానవ సంబంధాల్ని పదిల పరచుకొని మనుషుల మధ్య అనుబంధంతో ఆత్మీయతతో పెనవేసుకునే జీవన చిత్రిక ను చూపించిన ఒక మంచి కథ "గుండెలో వాన".

తెలంగాణ జీవన చిత్రకారుడు పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ఈ కథ నమస్తే తెలంగాణ పత్రికలో 2016 జనవరి 24 సంచికలో మొదట అచ్చయింది .తర్వాత కథాసాహితి వారి కథ 2016 కథా సంకలనంలో ప్రచురించబడింది.

బతుకమ్మ పండుగ ముందు రోజుల్లో ఒకనాడు స్కూల్ నుంచి రచయిత ఇంటికి వస్తుండగా పల్లెలో ఒక రైతక్క బండి ఎక్కింది. బవర్క్ బ్లౌజ్ కుట్టించుకోవాలని, తెలిసిన టైలర్ ఉంటే చెప్పమని బతిమాలిందట. రెండు మూడు చోట్ల తిరిగి చివరికి ఒక టైలర్ని రచయిత ఒప్పించాడు. తీరా తర్వాత తెలిసింది ఏమిటంటే ఆమె అంత ఇష్టంగా అప్పగించిన జాకెట్ ను తీసుకపోలేదట. ఆమెను కలిసి కారణం అడిగినప్పుడు చెప్పిన వలపోతనే ఈ కథ అంటారు రచయిత ,ఈ కథానేపథ్యాన్ని వివరిస్తూ.

కథ నేరుగా ఇలా ప్రారంభమవుతుంది.

" రేపేరా ...నువ్వు ఏడాదికే రా... ఇక్కడేం పడిపోత లేదు" కోపంగా అంటూ కట్ చేసి సెల్ ఫోన్ పక్కన పెడుతుంటే , చెల్లెలు జ్యోతి యాదికొచ్చింది. పాణం జల్లుమంది.

" అయ్యల్ల...ఎంత పనాయె.. ఇప్పుడెట్ల" అనుకున్న.

ఆనాడు మా టేలర్ కు వచ్చినప్పుడు తప్ప ఆమెను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు.

తను మాత్రం ఆ రోజు కలుపుగోలుగా నవ్వుతూ "అదేందన్నా కొత్తగా చూస్తున్నవు .మాది ఎముడాల గాదా, తిప్పారం గడ్డకే ఉంటం. మీ సిరిసిల్ల మార్కెట్ లనే కొత్తిమీరు కట్టలమ్ముత. నువ్వు ఎన్నిసార్లు కొనుక్కపోలేదు.కొనేది రెండు కట్టలుగని కొసిరేది నాలుగు కట్టలు" అన్నది.

నాకు ఆమెను చూసినట్టు యాదికి రాలేదు. అవునా అని తలూపి పరిశీలనగా చూసిన.

చామన ఛాయ, గుండ్రటి మొహం, మిలమిల మెరిసే కండ్లు. కొంత బోలతనం.. కొంత మొండితనం.. ముక్కు మీదనే రేషం. పాతికేళ్ళకు మించి ఉండదు. బక్కపలుచగా అయినా నిండుగా ఉంది.

ఆరోజు ఎంగిలిపూల బతుకమ్మ, ఇమిటేషన్ పట్టుచీర, మ్యాచింగ్ జాకెట్ పీసు తో మా టేలర్ కు వచ్చింది .జాకెట్ కి మగ్గం వర్క్ చేసి డబ్బ గల్ల పెట్టి అక్కడక్కడ చిన్న అద్దాలు కుట్టమంది. చీరకు మాత్రం కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసి పెద్ద అద్దాలు, అంచులకు చెమ్కీలు ,చందన ఫాల్ కుట్టమంది.

టైలర్ ఎప్పుడు కావాలి ?అని అడిగితే సద్దుల బతుకమ్మ నాడు కావాలంటుంది. పండుగనాడు అయితే కుదరదు వేరే ఎక్కడన్నా కుట్టించుకో అంటాడు. ఆమె ఏడుపు గొంతుతో బతిమలాడుతుంది. ఆ వేడుకోలు ఆమె మాటల్లో వినటమే మంచిది. ఆమె ఆశ, ఆమె బాధ, ఆమె బతుకు మొత్తం కలగలసిన మాటలవి.

సమాజం లోని విభిన్న రకాల మనుషుల్ని అతి దగ్గరగా గమనించి వారిని దగ్గరగా విన్నప్పుడు, సహజంగా వాళ్ళు మాట్లాడుకునే సజీవ భాష కథలోకి వస్తే ఆ కథలో జీవం ఉంటుంది. కథకు సజీవత్వం వస్తుంది. పెద్దింటి అశోక్ కుమార్ రాసిన కథల్లో ,నవలల్లో ముఖ్యంగా భాష పాఠకుల్ని నేరుగా కథలోకి కాదు, జీవితం లోకి తీసుకు వెళుతుంది.

ఆమె ఏమందో ముందుగా విందాం.

" నువ్వు తప్ప ఈ ఊర్లో నాకు ఎవలు తెలవదన్నా. సద్దుల బతుకమ్మ నాడు పోతవోసిన బట్టలు కట్టుకోవాలని ఎన్నేండ్ల నుంచో అనుకుంటున్న. ఎప్పటికప్పుడు ఏదో పని పడి దాసుకున్న పైసలు తాకట్లకే వోతున్నయి. అట్లగాదని ఈసారి సేటు దగ్గరనే దాసుకున్న. ఆయిన తింపుకొని తింపుకొని ఇయ్యల్ల ఇచ్చిండు. నువ్వు కాదన్నవనుకో, ఇవి కరంటు మోటార్ కే పోతయి. మల్ల నా జీవితంలో ఇంత మోఖ రాదు"అన్నది.

కానీ కాదని కచ్చితంగా చెప్పబోతూ ఆమె దిక్కు చూసిన. ఎంతో నమ్మకంతో వచ్చినట్టుంది నా దిక్కు బతిమిలాడుతున్నట్లు చూసింది. నాకు బాధగా అనిపించింది .కొద్దిసేపు ఆలోచించి "సద్దుల బతుకమ్మ రేపనంగ పొదుగూకే జాముల ఇస్తా .అంతకు అద్దగంట ముందన్నా, అస్సలు కుదరదు మరి"అన్న.

అదే మహాభాగ్యం అన్నట్టు నవ్వి "సరే అన్నా, ఆనాడు ఎట్లైనా మార్కెట్టుకు వత్త గదా. పొద్దు గూటికి పోయేటప్పుడు తీసుకుపోతా" అన్నది.

పేరు అడిగిన .జ్యోతి అని చెప్పింది.

మా చెల్లి పేరే యముడాల కి ఇచ్చిన అంటూ డిజైన్లు బుక్ ముందేసిన .సెలెక్ట్ చేసుకుంది.

‌‌‌ఈ కథలోని జ్యోతి కి ఒక అక్క ఉంటుంది. ఈ కథ మొత్తం ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య అనుబంధానికి , వాళ్ళిద్దరి జీవితాల్లో పేదరికం ఏర్పరచిన సంక్షోభాలకు కేంద్రం గా నిలుస్తుంది.
పేదరికాన్ని జయించాలనే తపన ,కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవాలనే కోరిక , సమాజంలో తన కుటుంబానికి విలువ గుర్తింపు గౌరవం ఉండాలనే ఆరాటం ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ల లో అడుగడుగునా కనిపిస్తుంది.

తను ఎంత కష్టపడి సంపాదించినా, ఆ సంపాదనను తనకోసం అనుభవించనీయని కుటుంబ కష్టాలు, ఆర్థిక సమస్యలు జ్యోతిని కలవర పెడతాయి.

టైలర్ ఎందుకైనా మంచిదని ఆ తర్వాత ఆమె బేరం చేస్తుందేమో అన్న ముందు చూపుతో, కొంచెం ఎక్కువగా కూలి మూడువేల రూపాయలు అని అంటాడు. అయితే ఆమె ఎంత మాత్రం బేరం చెయ్యదు. ఒక మాట కూడా ఎదురు మాట్లాడక ఆరు వందల రూపాయలు ఇచ్చి మిగతాది తీసుకువెళ్ళేటప్పుడు ఇస్తాను అని అంటుంది.

కార్లలో వచ్చి వాళ్ళు సైతం పది రూపాయల దగ్గర బేరం ఆడటాన్ని చూసిన ఆ టైలర్ కు ఆమె వాలకం ఆశ్చర్యం కలిగిస్తుంది .అయినా ఒకవేళ కుట్టిన తర్వాత తీసుకువెళ్ళేటప్పుడు అయినా ఆమె బేరం చేస్తుందేమో అని అనుమాన పడతాడు .అయితే అతడి సందేహానికి ఆమె ఖచ్చితమైన జవాబు చెబుతుంది.

"చెప్పిన కదా నాది మాటంటే మాటే అని .కుట్టించుకోవాలి అంటే కుట్టించుకోవాలి‌ గంతే. కానీ మంచిగా కుట్టాలె .మా అక్క నా బట్టలు జూసి కుళ్ళుకోవాలి .చెబితే నమ్ముత
లేదు. నీ బతుక్కు పోత బట్టలా అని ఎక్కి‌రిత్తంది "అని అన్నది.

టైలర్ చెల్లెలు పేరుకూడా జ్యోతి .ఫోన్లో మాట్లాడటమే తప్ప ,మంచికి చెడుకు రాదు ఆమెకు రాకపోవడానికి కారణం ఇంటి పనులు, పొలం పనులు .వీటి మధ్యలో తీరిక లేకుండా ఉంటుంది.
" అవ్వకు ఎట్లుంది అడుగుతున్నావ్ కానీ ఒకసారి వచ్చి చూసి పోతే తప్పా? ఆమె చనిపోయినాక అవ్వా అని ఏడుస్తావా ? ఆమేమో బిడ్డ బిడ్డ అని కలవరిస్తుంది" అని అంటాడు టైలర్.
అతడి చెల్లెలు జ్యోతి ఇలా అంటుంది...

" ఏం జెయ్యాలన్నా... నిన్నటి వానకు పత్తి మొత్తం నాని పోయింది .ఈసారన్నా కొంత అప్పు తీరుదనుకున్న. వాన పాడుగాను... ఎటూ కాకుండా చేసె. బతుకు వడ్లు పెరుగు గలిపినట్టుందన్నా. బాధ బాధగుంది ...".

ఇంకా ఏదో బాధ చెప్ప బోయింది ."

జ్యోతి మాటలకు అతనికి విసుగు వస్తుంది.

" ఆ..నీకు బాధ లేనిదెన్నడు చెప్పు. ఓసారివడ్లు‌నానినయంటావు. ఓసారి వరి ఎండిందంటవు, ఓ సారి ఇంకోసారి మోటార్ కాలింది అంటావు ఇంకో సారి ప్రాణం బాగ లేదంటవు." అన్న.

అప్పుడు ఆమె ఆ రోజు సద్దుల బతుకమ్మ పండుగ కదా రేపు వస్తాను అంటుంది .అప్పుడు గుర్తుకు వస్తుంది టైలర్ కు అన్ని ఊర్లలో సద్దుల బతుకమ్మ తొమ్మిది రోజులు అయితే , ఎముడాలలో మాత్రం ఏడు రోజుల్లోనే చేస్తారు. ఆ విషయం గుర్తుకు వచ్చి జాకెట్టు కుట్టడానికి ఇచ్చిన ఆమె రాకపోయేసరికి, ఇప్పుడు గనుక ఆ బట్టలు ఇవ్వకపోతే 2400 రూపాయలు వదులుకోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో అతను తనే వెళ్లి జాకెట్ ఇచ్చి చి డబ్బులు తీసుకురావాలి అని అనుకుంటాడు.

అంతేకాక ఇప్పుడు దాకా బట్టలు ఇవ్వకపోతే తనకు నష్టం వస్తుందని ,అరగంటలో ఆ ఊరికి వెళ్లి రావచ్చని అనుకుంటాడు.

అయినా టైలర్ ఇంటికి వచ్చి బట్టలు ఇచ్చి వెళ్లాడు కదా, అని పేరు ఉంటుందని డబ్బులు వస్తాయని చుట్టాలు పక్కాలకు తనను టైలర్ గా పరిచయం చేస్తుందని , ఆ రకంగా గిరాకీలు వస్తాయి అని అనుకుంటూ టైలర్ స్కూటర్ లో జ్యోతి వాళ్ల ఊరికి బయలుదేరతాడు.

పెళ్లి బట్టల కోసం వేచి ఉన్న వాడిని పక్కన పెట్టి టైలర్ బయలుదేరేస్తాడు.వర్షానికి బురద మైన బురదమయం అయిన ఆ రోడ్డులో పావుగంట అనుకున్న ప్రయాణం అర్ధ గంట పడుతుంది అప్పటికే వీరేశం నుండి వస్తూ ఉంటాయి ఎలాగైనా సరే బట్టలు ఇచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో..ఆ ఆ వూరికి వచ్చి జ్యోతి వాళ్ల ఇంటికి ...సున్నం వెయ్యని ఆఇందిరమ్మ ఇంటికి చేరుకుంటాడు టైలర్.

ఇతను వెళ్ళేసరికి ఇంటికి తాళం వేస్తూ ఉంటుంది జ్యోతి.

"వచ్చినవా అన్నా రా. దేవుని లెక్క సరిగ్గా సమయానికి వచ్చినవు. బట్టలు తెచ్చినట్టున్నవు. నువ్వు అన్నది "చేతులు చాపుతూ జ్యోతి.

తను అదే దారిలో వస్తానని చంద్రంపేట కాడ దిగి డబ్బులు ఇస్తాను అని అంటూ టైలర్ బండి ఎక్కి కూర్చుంటుంది.

అటు ఎందుకు వెళ్లాలి ,ఈ రోజు పండగ కదా అంటాడు టైలర్.

" పండుగేగని ఏం చేస్తాం .ఈ బట్టలు మా అక్కబొంద కు పెట్టి రావాల. దొంగ మొఖంది" అంటుంది జ్యోతి.

ఇక్కడ మొదలవుతుంది అసలు కథ. కథంతా జ్యోతి అక్క గురించే.

అక్క గురించి చెల్లెలు తన మాటల్లో చెప్పుకుంటూ వస్తుంది. మాటల మధ్య నిష్ఠూరంగా తన ప్రేమను
ఆప్యాయతను తెలియజేస్తూ అక్క కథ మొత్తం చెప్పుకుంటూ వస్తుంది.

ఈ కథను మళ్ళీ చెప్పడం కంటే ఈ కథను కథగా చదువుకోవడమే మంచిది. ఇది కథ కాదు, జీవితం. జ్యోతి అక్క ఒక్కరి జీవితమే కాదు. కరువు బారిన పడిన అమాయకపు పల్లెటూరి పడుచు భూమిని నమ్ముకొని ఎన్ని రకాలుగా నానా అవస్థలు పడిందో ప్రవాహానికి ఎదురుగా ఈ దిందో, కష్టాలు ఆమెను ఎంతగా కలవరపెట్టాయో, భారత గ్రామీణ వ్యవసాయ మహిళా రైతు కు సంబంధించిన జీవన చిత్రిక ఈ కథ.

వ్యవసాయం పైన ఆధారపడిన సాధారణ మనుషుల జీవితాలు ఎంత అల్లకల్లోలంగా ఉంటాయో, సామాజికపరంగా ,ఆర్థిక పరంగా ఎంత అభద్రతకు వాళ్లు లోనవుతున్నారో ఈ కథలో స్పష్టంగా ఉంది. ఈ కథలో జీవితం మాత్రమే ఉంది. సిద్ధాంతాలు లేవు. వాదోపవాదాలు లేవు. నిక్కచ్చిగా జీవితాన్ని వడకట్టి మన ముందుంచాడు రచయిత.

ఈ ప్రయాణం సాఫీగా సాగదు. రోడ్డు తిన్నగా ఉండదు. ఆ రోడ్డు జీవితాని,సమాజానికి ప్రతీక. ముండ్ల దారి, ఇరుకు దారి, ఒక పట్టాన
ప్రయాణం ముందుకు కొనసాగనివ్వని దారి.

భారతీయ వ్యవసాయ రంగం ఎన్ని ఆటుపోట్లకు అవుతుందో ,రైతు జీవితం ఎంత అభద్రతకు లోను అవుతుందో, వాతావరణం మార్కెట్ ధరలు, యాంత్రికీకరణ, నకిలీ విత్తనాలు ఎరువులు, వ్యాపారులు, మధ్యవర్తులు, దళారులు ప్రకృతి పగ పట్టినట్లు రైతు జీవితాన్ని కలవర పెడుతున్న వైనం మొత్తం జ్యోతి మాటల్లో వ్యక్తమవుతుంది.
ఎన్ని అప్పులు ఉన్నా ,మళ్ళీ బిడ్డ కాన్పుకు, ఆడంబరాలకు అప్పు చేసి మరీ కొండంత పండుగ చేయడం మరింత అప్పుల్లోకి రైతు కుటుంబాన్ని నెట్టివేస్తుంది.

కథలో పాఠకులను విస్మయ పరిచే విషయం ఒక్కటే. కలవరపరిచే విషయం ఒకటే. బాధపెట్టే విషయం ఒకటే. దుఃఖాన్ని కలిగించే విషయం ఒకటే. రావాల్సిన ఖచ్చితమైన మార్పుని బలంగా
డిమాండ్ చేసే విషయం ఒకటే.
అదే సగటు మనిషి జీవితం!
కథ ముగింపు ఇలా ఉంది

అతికష్టం మీద ప్రయాణించి జ్యోతి వల్ల అక్కయ్య ఇంటి వద్దకు చేరితే వాళ్లను చూడగానే ఎవరో అంటారు. "ఆ..ఇంకేంది .తల్లిగారోళ్లచ్చిండ్రు. కొత్తబట్టలు గూడా తెచ్చిండ్రు. జెట్ట జెట్టన కానీయిండ్రి"

లోపలి నుంచి సన్నగా ఏడుపులు. నాకు నోట్లే తడారిపోయింది. తల దిమ్మెక్కింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. పిచ్చి వేసినట్టు చుట్టూ చూసిన..

"ఎవుసంల మన్నంవడ. ఆర్నెల్లు జేస్తే మల్లుగట్టే మిగలక పాయే. బిడ్డ అరిగోస ఎళ్లదీసే. వానల మన్నువాడ .నిన్న వాన గొట్టకపోతే ఇంత బెంగటిల్లక పోవు. పత్తి వెట్టి పత్తి వెట్టి పత్తి మందే తాగి సచ్చే. మనగతి ఎంతకుందో..." ఎవలో పెద్దమనిషి అలతేరుతుండు.

" నిన్నటి వానొక్కటేనా బాపూ... ఇరవయ్యోండ్ల నుంచి ఎన్ని దెబ్బలు. ఒకటా రెండా.
మనిషి ఎంత గనమని తట్టుకుంటడు, గిట్లనే నోరు దెరుత్తడు" ఇంకెవలో బాధగా అన్నరు.

జ్యోతి నా ముందుకొచ్చింది. ఏడవడానికి కూడా నీళ్లు లేనట్టు కండ్లు సీసపు లెక్క ఉన్నాయి. పులుకు పులుకున మొఖం జూసింది.

"అన్నా... చెప్పుకునే దిక్కులేక నిన్నటి నుంచి కుమిలిపోతున్న. తోడపుట్టిన తోడు లెక్క యాల్లకచ్చినవు. అది తప్ప నాకు ఈ లోకంల ఎవ్వలు లేరన్నా. దొంగ మొఖంది. నన్ను ఒంటిదాన్ని చేసి పోతదా .అడుగన్నా దాన్నడుగు." చిన్న ఓదార్పు కోసం చూస్తూ పక్కన పలిగింది జ్యోతి.

ఎందుకో మా చెల్లె యాదికచ్చింది. నాకు కాళ్ళ కింద భూమి కదులుతుంది.

ఇందులో ఇంక చెప్పడానికి ఏమీ లేదు. ప్రకృతి సహాయ నిరాకరణ, మార్కెటీకరణ , ప్రపంచీకరణ తో పాటు ఆడంబరాలు , సంప్రదాయాల పేరిట భేషజాలకు పోతున్న దిగువ ,మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభాల చిత్రణతో సహా , ఎన్ని సంక్షోభాలు ఎదురైనా చెక్కుచెదరని మానవ సంబంధాల సంవేదనకు అక్షర రూపం ఈ కథ

No. of visitors : 214
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ

పలమనేరు బాలాజీ | 17.09.2019 08:46:21am

భారతదేశంలో స్థల కాలాలను బట్టి కులాన్ని బట్టి సామాజిక స్థితిగతులను బట్టి చావుకు అర్థం, విలువ మారిపోతూ ఉంటుంది. అంతో ఇంతో ఉన్నవాడి చావుకి ,గొప్ప వాడి .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •