అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

- విరసం | 13.11.2019 12:03:43pm


విప్లవ రచయితలు కా. అనూరాధ, కా. రవిశర్మ అక్రమ అరెస్టును ఖండించండి

ఈ విడత మరో ఇద్దరు రచయితలను అరెస్టు చేశారు. హైదరాబాదులో అనూరాధ, రవిశర్మ ఇంటి మీద పోలీసులు 12వ తేదీ ఉదయం దాడి చేసి రోజంతా 14 గంటలు సోదాలు చేశారు. రాత్రికి ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు. తెలంగాణ ప్రజా భద్రతా చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యుఎపిఏ), రాజద్రోహ నేరం మొదలైన కేసులు పెట్టారు. ఈ అక్రమ అరెస్టులను ఖండించాలని విరసం పిలుపు ఇస్తోంది.

అయోధ్య తీర్పుకు వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా పని చేస్తున్న హిందుత్వ ఫాసిస్టు దాడి వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో 12వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేఖరుల సమావేశం జరగవలసి ఉన్నది. ఈ కమిటీలో అనూరాధ, రవిశర్మ పని చేస్తున్నారు. అయోధ్య ఏకపక్ష ఫాసిస్టు తీర్పు మీద ప్రజా అసమ్మతి వినిపించకుండా అడ్డుకోడానికి కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం ఉదయమే మన్సూరాబాద్ లోని రవిశర్మ, అనూరాధ ఇంటి మీద దాడి చేశారు. ఇంకో పక్క పత్రికా సమావేశం జరగకుండా ప్రైస్ క్లబ్ దగ్గర పోలీసులను మోహరించారు. ఈ సమావేశానికి వెళుతున్న వేదిక సభ్యులు, మోహన్ బైరాగి, వేములపల్లి వెంకటరామయ్య, సూర్యం తదితరులను అదుపులోకి తీసుకున్నారు. సాయంకాలం అనూరాధను, రవిశర్మను అరెస్టు చేశారు.

అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలం గురించి అత్యున్నత న్యాయస్థానంలో సుదీర్ఘకాలంగా విచారణ జరుగుతున్నది. ఆ తీర్పు వెలవడనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పదిహేను రోజుల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేత సన్నాహాలు చేశాయి. తీర్పు మీద అసమ్మతి స్వరం వినిపించకుండా పోలీసులు బెదిరించడం మొదలు పెట్టారు. తీర్పును వ్యతిరేకిస్తూ మాట్లాడినా, రాసినా కేసులు పెడతామని హెచ్చరించారు. చివరికి సోషల్ మీడియాలో ఆలోచనలు పంచుకున్నా నేరమని ప్రకటించారు.

తీర్పు న్యాయబద్ధంగా ఉండి ఉంటే ప్రభుత్వానికి ఇంత భయం దేనికి? ఈ తీర్పు హిందూ ఫాసిస్టు తీర్పు అనడానికి ఈ అణచివేతే నిదర్శనం. దేశంలోని అత్యున్నత న్యాయస్థానాన్ని ఫాసిస్టు శక్తులు దురాక్రమించాయనడానికి ఇంతకంటే ఏం కావాలి? కేంద్రంలోని సంఘ్ పరివార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును లొంగదీసుకొని తనకు అనుకూలమైన తీర్పు రాయించింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ తీర్పు ఇప్పించింది. దీని మీద సహజంగానే విప్లవ ప్రజాస్వామిక లౌకిక శక్తులకు భిన్నాభిప్రాయం ఉంటుంది. దాన్ని వ్యక్తీకరించడానికి వీల్లేదని నిర్బంధం ప్రయోగిస్తోంది.

ఈ తీర్పు సరిగ్గా కశ్మీర్ సమస్య ʹపరిష్కారంʹలాంటిదే. తరతరాల ఒక స్వతంత్ర దేశాన్ని భారత పాలకులు 370 ఆర్టికల్ ను రద్దు చేసి దురాక్రమించుకొని సమస్యను పరిష్కరించినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించడం ద్వారా సమస్యను పరిష్కరించానని, ఇక దీని మీద ఎవ్వరూ నోరెత్తడానికి వీల్లేదని బరితెగించి హెచ్చరికలు జారీ చేస్తోంది. అందులో భాగమే అనూరాధ, రవి శర్మ అక్రమ అరెస్టు. -

ఈ సందర్భంగా పోలీసులు ఆ ఇద్దరి మీద అన్యాయమైన ఆరోపణలు చేశారు. గతంలో వారిద్దరి మీద అనేక తప్పుడు కేసులు మోపి జైలుపాలు చేశారు. ఆ కేసుల్లో బెయిలు తీసుకొని బైటికి వచ్చారు. అనురాధ మీద ఉన్న అన్ని కేసులు కొట్టివేశారు. రవి మీద ఒక్క కేసు మాత్రమే పెండింగులో ఉంది. ఇప్పుడు తెలంగాణ పోలీసులు మరొక తప్పుడు కేసు వీరి మీద బనాయించారు. బెయిలు మీద ఉంటూ విప్లవ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణ చేశారు. బెయిలు మీద ఉంటే ప్రజా జీవితం గడపరాదనే ఆంక్షను పోలీసులు కొత్తగా తీసుకొని వస్తున్నారు. అనూరాధ, రవిశర్మ జైలు నుంచి విడుదలయ్యాక ప్రజా సమస్యల పై రాస్తున్నారు. మాట్లాడుతున్నారు. చట్టబద్ధ బహిరంగ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లౌకిక ప్రజాస్వామిక శక్తులతో ఏర్పడ్డ హిందూ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదికలో పని చేస్తున్నారు. ఇప్పుడు పోలీసుల ఆరోపణ ఏమంటే- హిందుత్వ వ్యతిరేక వేదిక ద్వారా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అంటున్నారు. అంటే ఇది హిందూ రాజ్యమని, హిందుత్వను వ్యతిరేకిస్తే రాజ్యాన్ని వ్యతిరేకించినట్లే అనే విషయాన్ని పోలీసులు చెప్పకనే చెబుతున్నారు.

హిందుత్వను వ్యతిరేకించడం భావ ప్రకటనా స్వేచ్చలో భాగం. అది ఎన్నటికీ నేరం కాదు. సుప్రీం కోర్టు ఇచ్చిన అయోధ్య తీర్పును పౌరులందరూ నోరుమూసుకొని అంగీకరించాల్సిన అగత్యం ఏమీ లేదు. దాని మీద భిన్నాభిప్రాయాన్ని ఎవరైనా వినిపించవచ్చు. ఎలాంటి తీర్పునైనా శిరసావహించాలని, భిన్నాభిప్రాయం చెప్పకూడదనే మాట ఆధునిక యుగాల్లో చెల్లదు. అది రాజరికం నాటి మొరటు నిరంకుత్వంలో చెల్లుబాటైందేమో గాని ప్రజాస్వామ్యంలో ఈ వాదన చెల్లదు. తీర్పుకు పదిహేను రోజుల ముందు నుంచే అయోధ్య విషయంలో ఏ తీర్పు వచ్చినా స్వాగతించాలనే ప్రచారాన్ని ప్రభుత్వం చేసింది. ప్రజలను అలాంటి కట్టడి చేయడానికి లేదు. చేస్తే అది ప్రజాస్వామ్యం కాదు. ఫాసిజం అవుతుంది.

ఈ ధోరణులకు వ్యతిరేకంగా అనూరాధ, రవిశర్మ దశాబ్దాల తరబడి ఉద్యమిస్తున్నారు. వీళ్లు మహిళా, విద్యార్థి ఉద్యమాల్లోంచి ఆలోచనాపరులుగా, రచయితలుగా, కార్యకర్తలుగా రూపొందారు. ఒక క్రమంలో విప్లవోద్యమంలోకి వెళ్లారు. అరెస్టయి సుదీర్ఘ జైలు జీవితం తర్వాత బహిరంగ జీవితంలోకి వచ్చారు. అప్పటి నుంచి వాళ్లు రచన, అధ్యయనం, ఫాసిస్టు వ్యతిరేక ప్రచారం మొదలైన పనుల్లో ఉన్నారు. అనూరాధ తన జైలు అనుభవాలతో అద్భుతమైన కథలు రాసింది. జైలు జీవితపు అంతర్లోకాలను అత్యంత సునిశిత దృష్టితో కథలుగా మలిచింది. ʹఏది న్యాయంʹ అనే పేరుతో విరసం ప్రచురించిన ఈ కథల సంకలనం పాఠక అదరణ పొందింది. ఇవేగాక మరెన్నో కథలు, వ్యాసాలు రాసింది. అనువాదాలు చేసింది.

రవిశర్మ విద్యార్థి దశ నుంచే మేధో రంగంలో కృషి చేస్తున్నాడు. సామాజిక రాజకీయార్థిక విశ్లేషణ వ్యాసాలెన్నో రాశాడు. అనువాదాలు చేశాడు. ఇద్దరూ జైలు నుంచి విడుదలయ్యాక చేంజ్ పబ్లికేషన్స్ అనే ప్రచురణ సంస్థను ప్రారంభించి వర్ణం నుంచి కులం దాకా అనే ప్రామాణిక పుస్తకాన్ని అచ్చేశారు. యలవర్తి నవీన్ బాబు పరిశోధన గ్రంథం ఇది. దీన్ని తెలుగులోకి రవిశర్మ అనువదించాడు. కులసమస్య గురించి లోతైన చర్చలు జరుగుతున్న ఈ కాలానికి అవసరమైన రచన ఇది. అనూరాధ రాసిన హిందుత్వ ఫాసిజం-ప్రతిఘటన అనే పుస్తకాన్ని కూడా చేంజ్ పబ్లికేషన్స్ ప్రచురించింది. అలాగే ఫాంజ్ ఫనాన్ సుప్రసిద్ధ రచన(The Wretched of the Earth )ను అభాగ్యజీవులు పేరుతో అనూరాధ, రవిశర్మ తెలుగులోకి అనువదించారు. దీన్ని విరసం ప్రచురించింది. అలాగే ఫెమినిస్టు అంబేద్కర్ అనే పుస్తకంలో కొన్ని వ్యాసాలను అనూరాధ అనువదించింది. దీన్ని హైదరాబాదు బుక్ ట్రస్టు ప్రచురించింది. బేబీ కాంబ్లీ ʹ మా బతుకులుʹ పుస్తకాన్ని అనురాధ అనువదించింది. ఇది మలుపు ప్రచురణగా వచ్చింది. ఈ ఇద్దరూ ప్రజాస్వామిక ఉద్యమాల నుంచి ఎదిగి, తిరిగి ఆ ఉద్యమాలకు అవసరమైన ఆలోచనలు, రచనలు, అనువాదాలు, ప్రసంగాలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఫాసిస్టు రాజ్యంతో తప్ప మరెక్కడా నేరం కాని పనులు ఇవి.

ఫాసిస్టు అణచివేతను ప్రతిఘటించడం తప్ప వేరే దగ్గరి దారి లేదు. ఫాసిస్టులు మాట్లాడవద్దంటారు. తమ తీర్పులను శిరసావహించాలంటారు. తాము చేసిన చట్టాలకు లోబడి బతకమని ఆదేశిస్తారు. నోరు తెరిస్తే నేరాలు ఆపాదిస్తారు. అయినా మాట్లాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. రచయితలు, బుద్ధిజీవులైన అనూరాధ, రవిశర్మ అరెస్టు ఫాసిస్టు నిర్బంధాన్నేగాదు, దానికి ప్రత్నామ్నాయాన్ని కూడా సూచిస్తోంది. ఈ అరెస్టులను ఖండించాలని, వారి విడుదలకు పోరాడాలని విరసం విజ్ఞప్తి చేస్తోంది.


పాణి

విరసం కార్యదర్శి 13. 11. 2019

No. of visitors : 576
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


భూమిపుత్రుడు అరవింద్‌

రవి నర్ల | 17.04.2018 12:43:14am

2007లో సిపిఐ మావోయిస్టు 9వ (ఐక్యతా) కాంగ్రేసు జరిగిన తరువాత కా||అరవింద్‌ ఆరోగ్యం బాగా క్షీణించింది. మధుమేహంతో పాటు రకరకాల అనారోగ్యాలకు గురయ్యాడు. రోజుకు డజన...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •