ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి

| సాహిత్యం | వ్యాసాలు

ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి

- పాణి | 17.11.2019 12:10:34pm

పిల్లలు నిద్రలో భయపడి ఉలుకుపాటుతో లేచి ఏడుస్తుంటే ఊళ్లో ఉండే పీరుసాయిబుతోనే, ఆచారితోనే తాయత్తు కట్టిస్తారు. దాని వల్ల పిల్లలకు ఏమోగాని, పిల్లల విషయంలో పెద్దలకు భయం తీరుతుంది.

భాషా మాధ్యమం చర్చలో ఇంగ్లీషువాదులకు మొదట ఒక తాయత్తు కట్టాలి. అదేమంటే ప్రగతిశీలవాదులు ʹఇంగ్లీషును వ్యతిరేకించడం లేదు.. ఇంగ్లీషు మీడియాన్ని వద్దనడం లేదు..ʹ అని ముందుగా చెప్పేస్తే వాళ్లకు ఇక భయం ఉండదు. అప్పుడైనా కాస్త నింపాదిగా భాషా చర్చలో పాల్గొంటారు. ఇంగ్లీషు వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కడ దూరమవుతాయో అనే ఆందోళన విరమించుకుంటారు. ఉపశమనం పొందుతారు. భాష కేవలం ఉద్వేగాలకు సంబంధించిందే కాదు, ఇంకా లోతైన విషయమనే సంయమనంతో ఆలోచిస్తారు.

నిజానికి ఇప్పుడు ఇంగ్లీషును ఎవరైనా భావోద్వేగాలతో వ్యతిరేకించే స్థితి లేదు. తెలుగు కోసం సెంటిమెంట్‌తో పోరాడే అవకాశమూ లేదు. మాతృ భాషలో విద్యా బోధన చేయాలనేవారు ఇప్పుడు మైనారిటీలో ఉన్నారు. తెలుగు భాషా మాధ్యమాన్ని కూడా ఉంచండని అభ్యర్థించే స్థితిలో ఉన్నారు.

అంత మాత్రాన వాళ్ల వాదనను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిలాగా వేళాకోళం చేయడానికి లేదు. ʹమీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారనిʹ ఎదురు ప్రశ్న వేసి సంబరపడాల్సిన పని లేదు. అందులో ఏ ప్రశ్నా లేదు, వాదనా లేదు. దురహంకారం మాత్రమే ఉంది. అధికారమదం మాత్రమే ఉంది. మాతృభాషా మాధ్యమాన్ని కూడా ఉంచండని కోరుతున్న వాళ్లతో రాష్ట్ర అధినేతగా ఆయన హేతుబద్ధతకు వాదనకు దిగాలి. ఆయనకు మొరటు ముఠా రాజకీయాలే తెలుసు. అలాంటివాడికి భాషా సామాజిక సాంస్కృతిక చర్చ చేయగల వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? అంత సున్నితత్వం ఎక్కడ అరువు తెచ్చుకుంటాడు?

జగన్‌మోహన్‌రెడ్డికి ఇవి ఎలాగూ లేవు, రావు. కానీ ʹమీ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుతున్నారʹనే ఎదురు ప్రశ్న నైతిక సంబంధమైనదనే జ్ఞానం కూడా ఉన్నట్లు లేదు. ఇలా ఎదుటి వాళ్ల నోరు మూయించే నైతికత ఏ విషయంలోనూ తనకు లేదని ఆయనకు ఎవరు చెప్పాలి? కాస్త పాలిష్‌డ్‌ వీధి రౌడీ అయిన తనకు ప్రజాస్వామ్యం, ప్రగతి, చట్టబద్ధపాలన, అభివృద్ధిలాంటి పదాలు ఉచ్చరించే నైతికత కనీసంగా లేదని ఎలా అర్థమవుతుంది? ఆయనకు ఈ మాట చెప్పగలిగే సమఉజ్జీలు బహుశా తెలుగుదేశం పార్టీ, ఆంధ్రజ్యోతి మాత్రమే కావచ్చు.

నిజానికి జగన్మోహన్‌రెడ్డి మీడియం చర్చ మీద ఇన్ని మాటలే అక్కర్లేదు. ఆయనతో గొంతు కలిపిన పెద్ద మనుషుల కోసమే ఇదంతా. సగటు మనుషుల సంగతి అలా ఉంచుదాం. విద్యావంతులు, లోకాన్ని విశ్లేషించేవాళ్లు, భావావేశంతో మాట్లాడే కవులు రచయితలు అందరూ ఇంగ్లీషు మీడియం మాత్రమే ఉండాలని వాదిస్తున్నారు.

గతంలో ప్రగతిశీలవాదులు నిర్బంధ ఉచిత విద్యలాగే మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని కోరుకునేవారు. ఇది సెంటిమెంట్‌గా కాదు. మూర్ఖత్వం కాదు. ఆధునిక యుగంలో విద్యా బోధనా శాస్త్రం ముందుకు వచ్చింది. దాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా బుర్రబుద్ధీ ఉన్న వాళ్లందరూ ఇదే వైఖరి తీసుకున్నారు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. ఇదది మానవ నైజంలో, ఉనికిలో భాషకు ఉండే స్థానానికి సంబంధించింది. ప్రకృతిలోని మిగతా జీవరాసుల కంటే మనుషులకు ఉండే ప్రత్యేకతల్లో భాష నిర్వహించే పాత్ర మీద ఆధారపడింది. ఇక్కడ భాష అన్నామంటే మాతృభాష అనే అర్థం.

దీన్ని మామూలు మాటల్లో ఇలా చెప్పవచ్చు. మనుషులకు ఎన్ని భాషలు వచ్చిన వాళ్లయినా మాతృభాషలోనే ఆలోచిస్తారు. మాతృభాష ద్వారానే కొత్త విషయాలు నేర్చుకుంటారు. అందునా వేరే భాషల ప్రభావం లేని బాల్యంలో ఇంటి భాషలో చదువు చెబితే సులభంగా నేర్చుకుంటారు. సృజనాత్మకంగా కొత్త విషయాలను స్వీకరిస్తారు. తద్వారా వాళ్ల మేధస్సు సృజనాత్మక అన్వేషణలకు తగినట్లు వికసిస్తుంది. ఇదీ ఆధునిక విద్యా బోధనా శాస్త్రం చెప్పే విషయాలు.

మాతృభాషలో విద్యా బోధన ఉండాలనే వాళ్లు ఇంత లోతుగా ఆలోచిస్తారు. ఇంగ్లీషు మాధ్యమం మాత్రమే కావాలనే వారు ఇదంతా తప్పా ఒప్పా తేల్చాలి. ఇంగ్లీషు మీడియంలో చదివితే ఉద్యోగాలు వస్తాయనే వాదనను కాసేపటికి అంగీకరిద్దాం. ఈ వాదన చేసే వాళ్లు మనిషికి-మాతృభాషకు ఉన్న ఈ సంబంధాన్ని అంగీకరిస్తారా? లేదా?

ఉద్యోగాల కోసమే భాష అనే వాళ్లు దీన్ని ఎలాగూ అర్థం చేసుకోలేరు. దీనికి కొంత సాంస్కృత స్థాయి ఉండాలి. అది బొత్తిగా లేని జగన్‌మోహన్‌రెడ్డి సరే. మాతృభాషా వాదన వల్ల ఎక్కడ ఇంగ్లీషుకు దూరం అవుతామో అని కంగారు పడేవాళ్లు కాస్త స్థిమితంగా ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో చెబితే వినాలని ఉంది. బతుకు తెరువు కోసం ఇంగ్లీషు మీడియంలోనే పిల్లలను చదివించుకుందాం. తెలుగు మీడియంలో చదివితే ఉద్యోగాలు రావనే భయమే కారణమైతే అర్థం చేసుకోవచ్చు. ఇదికాక తెలుగు పట్ల వ్యతిరేకతకు, చిన్న చూపుకు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి.

మాతృభాషతో మనుషులకు ఉండే సంబంధం మీద చాలా లోతుగా ఆలోచించే వాళ్లు క్రమంగా ప్రాథమిక తరగతుల వరకైనా మాతృభాషలో చదువు చెప్పమని కోరే దాకా వచ్చారు. ఇప్పుడు ఇంగ్లీషు మీడియంతోపాటు తెలుగు మాధ్యమాన్ని కూడా ఉంచండని అడుగుతున్నారు. అసలు ఒక భాషగా ఇంగ్లీషు మీద ఎవ్వరికీ వ్యతిరేకత ఉండకూడదు. అసలు ఏ పరాయి భాషనూ వ్యతిరేకించకూడదు. చిన్నబుచ్చకూడదు. కానీ ఇంగ్లీషు మాధ్యమం మాత్రమే కావాలనుకొనే వారు మాత్రం తెలుగును వ్యతిరేకిస్తున్నారు. తెలుగు మీడియం వల్ల కొంపలు మునిగిపోతాయని ఆందోళనపడుతున్నారు. దాన్నుంచి తమ మాతృభాషా వ్యతిరేకతను స్పష్టంగా చాటుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఇంగ్లీషు మీడియం ఉండాలా లేదా అని కాకుండా తెలుగు మీడియాన్ని ఉంచాలా? తీసేయాలా? అనే కోణంలో చర్చ జరుగుతోంది. అంతా ఇంగ్లీషు మీడియమే అని ప్రభుత్వం ఉత్తర్వులు తెచ్చినప్పుడు చర్చ జరగవలసింది ఇలా కాదు. ఇంగ్లీషు మీడియం అవసరం గురించి కాదు. తెలుగు మీడియం కూడా ఎందుకు అవసరమో చర్చించాలి. ముఖ్యంగా మాతృభాషలోనే విద్యా బోధన అనే వాళ్లు ఇంగ్లీషు, మాతృ భాషా మీడియాలు ఉండాలనే వైఖరి తీసుకున్నాక తెలుగు మీడియం అవసరం గురించే చర్చింలి. కానీ తెలుగు వ్యతిరేకత చాలా పెరిగిపోతోంది. దీన్ని ఇలా ఊహించవచ్చు. ఇంగీషు మీడియం స్కూళ్లలో తెలుగు మాట్లాడిన పిల్లలకు ఫైన్‌ వేస్తారు కదా..అట్లా సమాజంలో కూడా తెలుగు మాట్లాడే వాళ్లకు ప్రభుత్వం ఫైన్‌ వేయాలనే స్థాయిలో ఉంది.

ఈ దృష్ట్యా తెలుగు మీడియం మీద ఉన్న వ్యతిరేకతను, అపోహను ఇలా వివరించవచ్చు.

1. ఇంగ్లీషు మీడియంతోపాటు తప్పక తెలుగు మీడియాన్ని ఉంచాలి. ఎందులో చదవాలో ఎంచుకొనే స్వేచ్ఛ పిల్లలకు, వాళ్ల తల్లిదండ్రులకు ఉండాలి. సమాజంలో ఇంగ్లీషు మీడియం పట్ల ప్రేమ పెరిగిన మాట వాస్తవమే. కానీ గ్రామీణ నేపథ్యం ఉన్న పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకోడానికి భయపడతారు. దీని వల్ల పరీక్షల్లో ఫెయిల్‌ అవుతారు. ఆ తర్వాత చదువుకు శాశ్వతంగా దూరమవుతారు. ఈ పరిస్థితి అమ్మాయిలకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంగ్లీషు మీడియంతోపాటు మాతృభాషా మాధ్యమాలన్నీ ఉండాల్సిందే.

2. ఏ మీడియంలో చదివినా భాష వస్తుందనే గ్యారెంటీ లేదు. ఇది ఇంగ్లీషుకే కాదు. తెలుగుకు కూడా వర్తిస్తుంది. తెలుగు మాతృభాష అయినా, ఇంటా బైటా తెలుగు మాట్లాడుతున్నా సొంతంగా ఒక వాక్యం తెలుగులో రాయలేని విద్యావంతులే ఎక్కువ మంది ఉన్నారు. అంటే మీడియాన్ని బట్టి భాష రాదన్నమాట. మీడియం వల్ల కలిగే వేరే ప్రయోజనాలను అంగీకరిస్తూనే ఈ మాట అనడానికి మోమాటపడాల్సిన పని లేదు. కాబట్టి తెలుగు, ఇంగ్లీషు భాషలు క్షుణ్ణంగా నేర్పించేందుకు చర్యలు తీసుకోవాలి. అసలు మన విద్యా విధానమే అస్తవ్యస్తంగా ఉంది. ఏండ్ల తరబడి సైన్స్‌ చదివినా శాస్త్రీయ దృక్పథం వంటపట్టడం లేదు. అదంతా పెద్ద చర్చ. ఇప్పుడు జరుగుతున్న భాషా చర్చలో భాగంగా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషలు శుభ్రంగా నేర్పించాలి.

3. భాషా చర్చ అమూర్తంగా ఉండదు. మన దేశంలో కులం వల్ల ఉన్న అంతరాలు భాషకూ వర్తిస్తాయి. దళితులు, వృత్తి కులాల వాళ్లు ఇంగ్లీషు నేర్చుకుంటేనే అగ్రకులాల పిల్లలతో, సంపన్న వర్గాల పిల్లలతో పోటీ పడగలరు. కనీస అవకాశాలు పొందగలరు. కాబట్టి దళిత నేపథ్యం ఉన్న వాళ్లు ఇంగ్లీషు కావాలని కోరుకోవడం న్యాయం. ఇంగ్లీషు మీడియంలో చదివితే ఎంతో కొంతయినా ఇంగ్లీషు వస్తుందనే వాళ్ల ఆకాంక్షను తక్కువ చేయడానికి లేదు. అది వాళ్ల అసర్షన్‌లో భాగం. ఈ కోణంలో కూడా ఇంగ్లీషు మీడియం వద్దని ఎవ్వరూ అనడం లేదు. ఈ సామాజిక నేపథ్యం ఉన్న వాళ్లు ఇంగ్లీషు మీడియాన్ని తమ ఛాయస్‌గా కోరుకోవచ్చు. కానీ తెలుగు మీడియం ఎత్తేయమని కోరడం తగదు.

4. దళిత, ఉత్పత్తి కులాల వాళ్లు ఇంగ్లీషు మీడియం కోరుకోవడంలో అస్తిత్వ స్పృహ ఉన్నది. అయితే వాళ్లు ఒక విషయంలో స్పష్టంగా ఉండాలి. తాము ఇంగ్లీషు మీడియాన్ని, మొత్తంగా ఇంగ్లీషు భాషను కోరుకుంటున్నారా? లేక తెలుగు భాషను వ్యతిరేకిస్తున్నారా? అనేది తేల్చుకోవాలి. దేనికంటే పీడిత కులాల అస్తిత్వమూలాల్లో భాష ఒక ముఖ్యమైన అంశం. అది తెలుగు మాండలికాలకు, కులాల భాషకు, ఇంటి భాషకు సంబంధించింది. సమాజంలో హోదా, ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధిలో న్యాయమైన వాటా కోరుకోవడం న్యాయమే. వాటిని పొందడం కోసం తమ సాంఘిక అస్తిత్వంలో కీలకమైన సొంత భాషను వదులుకోనవసరం లేదు. ప్రామాణిక తెలుగును, బ్రాహ్మణ తెలుగును తిరస్కరించినా తమదైన తెలుగును అస్తిత్వంలో భాగంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ దృష్ట్యా భాషా చర్చలో పాల్గొంటే అర్థవంతంగా ఉంటుంది. అలాగే ఇంగ్లీషు మీడియం వస్తే తెలుగు భాష పూర్తిగా అంతరించి పోతుందని ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. ప్రైవేట్‌ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ఎప్పుడో వచ్చేసింది. తెలుగా, ఇంగ్లీషా అనే చర్చ ఇక మిగిలింది ప్రభుత్వ పాఠశాలల విషయంలోనే. కాబట్టి ఈ పరిస్థితిలో తెలుగును కాపాడుకోడానికి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాత్రమే ఉండాలని ఎవరైనా అనడమంటే.. తెలుగును కాపాడే బాధ్యత దళిత, వెనుకబడిన కులాల పిల్లల మీద పెట్టినట్లవుతుంది. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఈ కులాల పిల్లల్లో చాలా మంది వాళ్ల ఇండ్లలో వాళ్లే మొదటి అక్షరాస్యులు. వాళ్ల మీద తెలుగును కాపాడే భారం మోపనవసరం లేదు. ఇది సామాజికంగా అన్యాయమవుతుంది.

5. రెండు మీడియాలు ఉంటే పిల్లల తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం వైపే మొగ్గుతారు అనే వాదన ఉంది. ఒక వేళ అదే జరిగితే చేయగలిగింది ఏమీ లేదు. క్రమంగా తెలుగు మీడియం అదృశ్యమవుతుంది. అసలు ప్రశ్న ఏమంటే ప్రభుత్వం తెలుగు భాష క్షుణ్ణంగా నేర్పించే ఏర్పాటు చేస్తుందా? లేదా? అప్పుడే మీడియం చర్చను నేల మీదికి వస్తుంది. అశాస్త్రీయమైన విద్యా విధానం మీద చాలా పెద్దది. తెలుగు జాతి ప్రజలం కదా? ఉద్యోగాల కోసం ఇంగ్లీషు మీడియం తెచ్చే పథకం ఉన్నట్లే తెలుగు నేర్పించే కార్యక్రమం ఏమైనా ఉన్నదా? లేదా? అని ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఉంటే అది ఏమిటి? తెలుగు భాషా సాహిత్యాలు నేర్పించేందుకు అనుసరించే విధానాలను ప్రకటించాలి. అలాగే విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో చదివే తెలివితేటలు లేవని ఉపాధ్యాయులే పిల్లలను తెలుగు మీడియంలోకి తోసి వేస్తారనే భయపడుతున్న వాళ్లు కూడా ఉన్నారు. అది జరిగిందంటే తెలుగు మీడియం పిల్లలకు ఇంగ్లీషు క్షుణ్ణంగా నేర్పించాలి. ఇంగ్లీషు మీడియం తీసుకుంటారా? లేదా అనేదానికంటే ఇంగ్లీషు అంటే భయం పోగొట్టి ఆ భాషను నేర్చుకొనే వాతావరణం నెలకొల్పాలి. ఆ దిశగా ప్రోత్సహించాలి. తద్వారా ప్రపంచంలో నెగ్గుకరాగలిగేలా తయారు చేయాలి.

6. ఇంగ్లీషు నేర్చుకోకపోతే ఉద్యోగాలు రావని జగన్‌రెడ్డే కాదు. తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు. ఇదేమీ అపోహ కాదు. అయితే తెలుగు మీడియం కూడా ఉండాలనే చర్చ కేవలం ఉద్యోగాలకు సంబంధించిందే కాదు. చాలా లోతైన అంశం. ఒక జాతి ఉనికికి కేవలం ఉద్యోగాలే పరమార్థం కాదు. ʹఅమ్మ భాష గొప్పదే, అన్నం పెట్టే భాష మరీ గొప్పది..ʹ లాంటి దిక్కుమాలిన సూత్రీకరణలు చేస్తే అసహ్యంగా ఉంటుంది. దీనికంటే సిగ్గు విడిచి నేరుగా ʹమేం జగనన్న భాషా వాదాన్ని సమర్థిస్తాంʹ అని చెబితే సరిపోతుంది. తెలుగు మాధ్యమం కూడా ఉండాలని అంటున్న వాళ్ల లోతైన చర్చను ఒకసారి పరిశీలించండి. వాళ్లు చాలా శాస్త్రీయంగా సంస్కృతి, విలువలు, కళా సాహిత్యాలు, జాతి అస్తిత్వం దాకా ఆలోచిస్తున్నారు. దేనికంటే పాలకులు మాధ్యమంగా తెలుగును తీసేయడం దగ్గర ఆగిపోరు. మొత్తంగా విద్యారంగంలో తెలుగునే నిర్మూలించేస్తారు. ఇది అపోహ కాదు. గత కొన్ని దశాబ్దాల ప్రభుత్వ విధానాలు ఇలాగే ఉన్నాయి. తెలుగు భాషకు వ్యతిరేకంగా తయారయ్యాయి. ఇంగ్లీషు మాధ్యమంలో చదివితే ఉద్యోగాలు వస్తాయని మాత్రమే మామూలు జనాలు అనుకోవచ్చు. కాబట్టి తెలుగును ఈసడించుకోవచ్చు. కానీ ప్రభుత్వం తెలుగును నిర్మూలించే దిశగా సాగిపోతున్నదని గుర్తించాలి. ఉద్యోగాలనే గీటురాయి మీద తెలుగు మీడియాన్నే కాదు, తెలుగు భాషనే నిర్లక్ష్యం చేసే ధోరణి గురించి సమాజం లోతుగా ఆలోచించాలి.

7. ఇంగ్లీషు మీడియంలో చదవకపోతే ఉద్యోగాలు రావని ముఖ్యమంత్రి అంటున్నాడు. బాగానే ఉంది. 1990ల తర్వాత నిరుద్యోగ సమస్య తీవ్రమైంది. దీనికి పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవకపోవడమే కారణమా? నిజానికి ఈ ముప్పై ఏళ్లలో రెండు తరాల విద్యావంతులు తయారయ్యారు. వాళ్లలో లక్షలాది మంది ఇంగ్లీషు మీడియంలో చదివినవాళ్లే. ఊయల లోంచి నేరుగా కాన్వెంట్లకు, కార్పొరేట్‌ స్కూళ్లకు వెళ్లి ఇంగ్లీషు చిలకపలుకులు వల్లించినవాళ్లే. వీళ్లలో చాలా మందికి ఎంతో కొంత ఇంగ్లీషు మీద పట్టు కూడా ఉండి ఉండవచ్చు. మరి వీళ్లంతా నిరుద్యోగులుగా ఎందుకు ఉన్నారు? ఇంగ్లీషు మీడియంలో చదివితే లక్షల్లో జీతాలు ఇచ్చే కార్పొరేట్‌ ఉద్యోగాలు దొరుకుతాయనే అబద్ధాలు నిస్సిగ్గుగా పాలకులు చెబుతున్నారు. ఈ ముప్పై ఏళ్లలో అందరికీ అలాంటి ఉద్యోగాలు ఎందుకు రాలేదు. అసలు ఇంకో విషయం ఏమంటే.. ఇంగ్లీషు మాధ్యమం ద్వారా ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్లకు కూడా ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో తెలియని అనిశ్చితి ఎందుకు వెంటాడుతోంది? ఏ కంపెనీ ఎప్పుడు మూతపడుతుందో, ఏ పూట ఇంటికి పంపించేస్తారో ఊహించలేని నిత్య నిరుద్యోగత ఎందుకు ముంచుకొచ్చింది. కేవలం ఇంగ్లీషు మీడియంలో చదివితేనే జగన్‌ రెడ్డి అన్నట్లు అంతర్జాతీయ మార్కెట్‌లో గొప్ప ఉద్యోగాలు వచ్చేస్తాయా? అదే నిజమైతే ఇంత చిన్న సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు. వెయ్యి రూపాయల నిరుద్యోగభృతితో ఎందుకు యువతను జోకొట్టాలని అనుకుంటున్నారు? నిరుద్యోగమనే అతి పెద్ద విపత్తు ఇప్పటికే రెండు తరాల్లో ఇంగ్లీషు మీడియం చదువుకున్న వాళ్లును దిగమించేసింది. ఈ వాస్తవాలను కప్పి పెట్టి ఇప్పుడు ఇంగ్లీషు మీడియం అనే మంత్రంతో అందరి బతుకు మార్చేస్తానని అనడానికి జగన్‌కు సిగ్గనిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పాలకుల దిక్కుమాలిన రాజకీయార్థిక విధానాల వల్ల నిరుద్యోగ సంక్షోభం వచ్చింది. రూపాయి రూపాయి దాచి పిల్లల్ని ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదివించే పేద, మధ్య తరగతి మామూలు జనాలకు ఈ సంగతి తెలికపోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీషు మీడియం వస్తోందంటే ఆనందిస్తున్న సగటు తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. కాస్త లోకజ్ఞానం ఉన్న వాళ్లకు ఈ సంగతి తెలియకుండాపోతుందా?

8. ఇంతకూ ప్రజలందరికీ ఇంగ్లీషు మీడియంలో చదువు చెప్పాలనే కోరిక జగన్‌కు ఎందుకు కలిగింది? నిజానికి ఇది చంద్రబాబు పథకం. అప్పుడు జగన్‌ వ్యతిరేకించాడు. ఇప్పుడు చంద్రబాబు వ్యతిరేకిస్తున్నాడు. ఇది చాలు వీళ్ల ఉద్దేశాలను అర్థం చేసుకోడానికి. తెలుగును అన్ని రకాలుగా పతనం చేసిన చంద్రబాబు ఇప్పుడు భాషా ఉద్ధారుకుడు కావడమే అతి పెద్ద సాంస్కృతిక, నైతిక విషాదం. ఇప్పుడు ఆయన పక్షాన భాషా పరిరక్షణ బాకా ఊదుతున్న వాళ్లందరికీ ఈ సంగతి తెలుసు. అయినా వంచనను అద్భుతమైన నైపుణ్య విద్యగా అభ్యసించే వాళ్లకు కొదువ లేదు. అప్పుడు చంద్రబాబు అయినా, ఇప్పుడు జగన్‌ అయినా విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి ప్రైవేట్‌ శక్తులకు అప్పగించాలనే లక్ష్యంతోనే మీడియం గోల లేవదీశారు. క్రమంగా తెలుగు పాఠశాలలు రద్దు చేసి కార్పొరేట్లకు అప్పగించే వ్యూహం ఇందులో ఉంది. తెలంగాణలో ఆర్టీసీ సరిగా లేదు కాబట్టి దాన్ని మూసేసి ప్రైవేట్‌ సంస్థలకు రవాణా రంగాన్ని అప్పగించాలనే వ్యూహంలాంటిదే ఇదే. గత ముప్పై ఏళ్లుగా అన్ని రంగాల్లో ఈ వ్యూహాన్ని అన్ని ప్రభుత్వాలు సాధన చేస్తున్నాయి. అయితే పాలకులు ఇంగ్లీషు ఏకైక మీడియానికే కాదు, ప్రైవేట్‌ విద్యకు కూడా ప్రజలను మానసికంగా సిద్ధం చేశారు. అమ్మవడిలాంటి పథకాలతో పిల్లలు ఎక్కడ చదువుతున్నా సరే ఏటా ఇంత డబ్బు ఇస్తే చాలు.. అది ప్రైవేట్‌ అయితేనేమి? ప్రభుత్వ బళ్లయితేనేమి? అనే దుర్భర స్థితికి జనాన్ని తోసేశారు. లోకంలో నెట్టుకరావడానికి, ప్రపంచ జ్ఞానం అందుకోడానికి ఇంగ్లీషు కావాలని కాకుండా ఇంగ్లీషులో మాట్లాడితే చాలనుకొనే స్థితికి సమాజాన్ని తెచ్చాక తెలుగు మీడియాన్ని రద్దు చేసి ఇంగ్లీషు మీడియం ఒక్కదేన్నే పెట్టడం ప్రభుత్వాలకు చిటికలో పని. ఇంగ్లీషు భాషను అంగీకరించడం ఎంత మాత్రం బానిస మనస్తత్వం కాదు. అన్నీ తెలిసి ప్రైవేటైజేషన్‌ అనే రాజకీయార్థిక విధానాలను అంగీకరించడం నిస్సందేహంగా బానిస మనస్తత్వమే. ఇప్పుడు ఇంగ్లీషు మీడియం మాత్రమే కావాలనే వాళ్లు ఈ తెగకు చెందిన వాళ్లు. బానిస భావాలను ఏ భాషలోనైనా ప్రకటించుకోవచ్చు. దానికి అంతేముంది? హద్దేముంది?

No. of visitors : 646
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •