ఇంగ్లీషు మీడియం ఉండాలి. అలాగే తెలుగు, ఉర్దూ తదితర మాధ్యమాలు కూడా ఉండాలి.

| సాహిత్యం | వ్యాసాలు

ఇంగ్లీషు మీడియం ఉండాలి. అలాగే తెలుగు, ఉర్దూ తదితర మాధ్యమాలు కూడా ఉండాలి.

- పి.వరలక్ష్మి | 02.12.2019 09:35:49pm

తెలుగు మీడియం అంటే కొట్టేలా ఉంది పరిస్థితి. పేద పిల్లలు చదువుకోడానికి ప్రభుత్వ సూళ్ళలో ఇంగ్లీషు మీడియం ఉండాలి సరే, మరి తెలుగు, ఉర్దూ తదితర మాధ్యమాలు ఎందుకు రద్దు చేయాలి? ఇంగ్లీషు కావాలనడం, తెలుగు వద్దనడం ఒకటి కాదు. ఇంగ్లీషు మీడియం అన్ని వర్గాల పిల్లలకు అందుబాటులో ఉండాలని కోరుకోవడం ఎంత సహజ న్యాయమో, అది మాత్రమే ఉండాలనడం అన్యాయం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2006 నుండి ఇంగ్లీషు మీడియం ఉంది. అయినా ఇప్పటికీ 25,66,339 మంది విద్యార్థులు తెలుగు మీడియంలో, 79,880 మంది ఉర్దూ, 9,933 మంది ఒడియా, 9,626 మంది కన్నడ, 3,122 మంది తమిళ మీడియంలలో చదువుకుంటున్నారు. ఒడియా, కన్నడ, తమిళ మాధ్యమాల్లో చదివే విద్యార్థులు ఆయా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవారు కాగా, ముస్లిం పిల్లలు కొంత మంది ఉర్దూ మీడియంలో చదువుకుంటున్నారు. వీళ్లందనికీ ఇంగ్లీషు మీడియం ఎంపిక చేసుకునే అవకాశం ఆయా స్కూళ్ళలో లేకపోతే కల్పించవచ్చు. కానీ ప్రభుత్వ జీవో ప్రకారం వచ్చే ఏడాది నుండి మీడియం ఎంపిక అవకాశం ఉండదు. అందరూ నిర్బంధంగా ఇంగ్లీషు మీడియంలోనే చదవాల్సి ఉంటుంది.

రెండు మీడియంలు నడపాలంటే ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఒకే మీడియం ఉంచేసి బరువు తగ్గించుకోదలచింది. తెలుగు మీడియంలో బోధించే టీచర్లు ఇక ఇంగ్లీషులో చెప్పడానికి తయారవ్వాలి. అందుకు ప్రభుత్వం వేసవి శిక్షణనిస్తానంటోంది. ఉన్నఫలంగా వాళ్లేం నేర్చుకుంటారు, ఎలా చెబుతారు అనే విషయం అలా ఉంచితే... ఒకే మీడియం ఉంచితే టీచర్ల సంఖ్య తగ్గించుకోవచ్చు. తెలుగు మీడియం వద్దనే వద్దు అని దెబ్బలాడేవాళ్లు ఇలా ప్రభుత్వానికి సాయం చేస్తున్నారు. అచ్చంగా ప్రభుత్వ భాషలో మాట్లాడుతున్నామనే స్పృహలో ఉండే మాట్లాడుతున్నారు. నిజంగా ప్రభుత్వమేదో మంచి చేస్తోందని మిత్రులు భ్రమిస్తుండవచ్చు. కానీ ఇంగ్లీషు తప్ప మిగిలిన మాధ్యమాలు రద్దు చేయడం వల్ల ఒనగూడే ప్రయేజనం కొత్తగా ఏమీ లేకపోగా నష్టం జరిగే అవకాశం ఉంది. తెలుగుభాషకు జరిగే నష్టం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. (ఇప్పటి తరగతి గదుల్లో ఏ భాషైనా బతుకుతుందని ఆశించడం దురాశ.) ఆ మాటకొస్తే తెలుగు భాషోద్ధారకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు నోరూ, వనరులూ ఎంతో కొంత ఉన్నాయి కానీ మైనార్టీ భాషలకు అంత నోరు లేదు. తెలుగు సహా వాటిని రద్దు చేయొద్దనడం ఇంగ్లీషును (బడుగువర్గాలకు ఇంగ్లీషులో చదువుకునే అవకాశం) వ్యతిరేకించడం కాదు. ఏ కొద్దిమందైనా అమ్మ భాషలో చదువు నేర్చుకోవాలనుకుంటే ఆ అవకాశం ఉండాలని అడగడం ఘోరమైన విషయమేమీ కాదు. ఎవరూ కోరుకోరా, అప్పుడవి సహజంగానే కనుమరుగవుతాయి. పత్రికల్లో, సోషల్‌ మీడియాలో చాలా వాదోపవాదాలు జరుగుతున్నాయి. పరమ అసంబద్ధవాదనతో, మతవికృతత్వంతో బిజెపి కూడా మాతృభాషా పరిరక్షణ పేరుతో ప్రవేశించింది. మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారనే నైతిక చర్చ ఇంగ్లీషు మీడియమే కావాలనే వాళ్ళ వైపు నుండి మొదలైంది. ఇంతకూ పిల్లల పరిస్థితి ఏమిటి? వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోలేరు గానీ వాళ్ళ వైపు నుండి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని మావరకు మేము కనీసం మా ఊర్లో (ప్రొద్దుటూరు) ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చూసి వద్దామనుకున్నాం. అలా అనుకోడానికి కూడా ఒక చిన్న అనుభవం మమ్మల్ని ప్రేరేపించింది.

2017లో మునిసిపల్‌ స్కూళ్ళలో తెలుగు మీడియం తీసేస్తున్నామని, ఇక అందరూ ఇంగ్లీషు మీడియంలోనే చదువుకోవాలని ఒక అస్పష్ట జీవో వచ్చింది. అస్పష్ట జీవో అని ఎందుకనాల్సి వచ్చిందంటే అందులో 1 నుండి 9 వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నట్లు ఉంది కానీ తెలుగు మీడియం ఇక ఉండదు అని స్పష్టంగా చెప్పలేదు. ఆగస్టు నెలకు కూడా తెలుగు మీడియం పుస్తకాలు రాకపోతే విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ విషయం అడిగితే అందర్నీ ఇంగ్లీషు మీడియం వైపు ప్రోత్సహించండి అని హెడ్‌మాస్టర్లకు ఆదేశాలు. మనిసిపల్‌ గల్స్‌ హైస్కూల్‌ పిల్లలు ఆందోళన చేస్తున్నారని విని మేం స్వయంగా అక్కడికి వెళితే అమ్మాయిలు తెలుగు మీడియం కావాలని అడుగుతున్నారు. వాళ్ళు చెప్పిందేమిటంటే ʹʹమేం చదవలేక ఫెయిలైపోతాం. మా అమ్మానాయనా బడి మాన్పిస్తారుʹʹ. ఊర్లో ఉన్న మునిసిపల్‌ స్కూళ్ళ విద్యార్థులు మునిసిపల్‌ ఆఫీసు ముట్టడించి నిరసన తెలిపారు. ప్రొద్దుటూరులో జరిగిన ఈ ఆందోళనలో అప్పడు పతిపక్షంలో ఉన్న వై.సి.పి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్వయంగా పాల్గొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. ఆనాడు సాక్షి పత్రిక తెలుగు భాషా పరిరక్షణ కర్తవ్యాన్ని తన భుజస్కందాల మీద మోసింది. బడుగులకు ఇంగ్లీషులో చదివే అవకాశం లేకుండా చేస్తారా అని ఆంధ్రజ్యోతి పత్రికలో వ్యాసాలు. రెండేళ్ళ తర్వాత సీన్‌ రివర్స్‌ అయిందనుకోండి.

జయశ్రీ (మానవహక్కుల వేదిక), సుబ్బారాయుడు (సి.పి.ఐ.), నేను (వరలక్ష్మి, విరసం) ప్రొద్దుటూరు శివారు ప్రాంతంలో, పట్టణం నడిబొడ్డున, స్లమ్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి నిర్బంధ ఇంగ్లీషు మీడియం ఎలా ఉండవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ భిన్న ప్రాంతాల్లో ఇంగ్లీషు మీడియం మాత్రమే ఉన్న ప్రైమరీ స్కూల్‌, తెలుగు మీడియం మాత్రమే ఉన్న ప్రైమరీ స్కూల్‌, ఇంగ్లీషు, తెలుగు మీడియంలు రెండూ ఉన్న మునిసిపల్‌ హైస్కూల్‌, ఇంగ్లీషు మీడియం మాత్రమే ఉన్న మునిసిపల్‌ హైస్కూల్‌ వెళ్ళి టీచర్లతో, విద్యార్థులతో మాట్లాడాం. అవకాశం ఉన్న చోట తల్లిదండ్రులతో మాట్లాడాం. ఉపాధ్యాయ వృత్తిలో నిబద్ధతతో పని చేసే టీచర్లను విడిగా కలిసి మాట్లాడాం.

మునిసిపల్‌ గర్ల్స్‌ హైస్కూల్‌ విద్యార్థినిలు టెన్త్‌ క్లాస్‌లో ఏ ప్రైవేటు స్కూల్‌ విద్యార్థులకు తీసిపోని విధంగా మార్కులు సాధించారు. వీళ్ళు రెండేళ్ళ క్రితం తెలుగు మీడియం కోసం ఆందోళన చేసినవాళ్ళు. ఇప్పుడా స్కూల్లో రెండు మీడియంలు సుమారుగా సమాన సంఖ్యలో విద్యార్థులు కలిగి ఉన్నాయి. సరిపడా ఉపాధ్యాయులు, స్కూలును కంటికి రెప్పలా చూసుకునే మంచి హెడ్‌మాస్టర్‌ ఉన్నారు. తెలుగు మీడియం చదివే పిల్లల్ని అడిగాం, మీరు ఇంగ్లీషు మీడియంలోకి మారతారా అని. లేదని ఖరాఖండీగా చెప్పారు. కాలేజీలో మారాలంటే కష్టమవుతుంది కదా అన్నాం. ఐ.ఎ.ఎస్‌. పరీక్ష కూడా తెలుగులో రాయోచ్చు అని రెండేళ్ళ క్రితం చెప్పిన సమాధానంతో దృఢంగా ఉన్నారు.

2017లో వచ్చిన జీవోతో తెలుగు మీడియం నుండి ఇంగ్లీషు మీడియంలోకి మారిన డిబిసియస్‌ స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ వేణుగోపాలరావు గారు పదవ తరగతి ఫలితాల పట్ల అంతృప్తిగా ఉన్నారు. స్కూల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున టీచర్లు కూడా తక్కువగా ఉన్నారని, తరగతి గదులు కూడా సరిపడా లేవని, రెండు మీడియంలు నడిపే అవకాశం లేక అందర్నీ ఇంగ్లీషు మీడియంలోకి మార్చామని అన్నారు. మంచిదే కదా అంటే, పిల్లలందరూ ఒకే స్థాయిలో ఉండరని, ఇంగ్లీషులో అర్థం చేసుకొని, ఇంగ్లీషులో విశ్లేషించి రాసే శక్తి అందరికీ ఉండదని అన్నారు. ఈ మాట చెప్తూ ʹనా గొప్ప కోసం చెప్పడం లేదు గానీ, మా అమ్మాయిని తెలుగుమీడియంలో చదివించానుʹ అన్నారు. ఆయన కూతురు నాలుగో తరగతి వరకు ఒక ప్రైవేట్‌ స్కూల్లో ఇంగ్లీషు మీడియం చదివింది. చదువులో వెనకబడుతోందని అర్థమై తనను తెలుగు మీడియంలోకి మార్పించారు. 5వ తరగతి మునిసిపల్‌ ప్రైమరీ స్కూల్లో, 6 నుండి 10 వరకు అప్పట్లో ఆయన పనిచేసే వసంతపేట మునిసిపల్‌ హైస్కూల్లో చదివించారు. ఆ అమ్మాయి ఇంటర్‌మీడియట్‌ కూడా తెలుగుమీడియమే చదివింది. తర్వాత బిటెక్‌ చేసి గేట్‌లో ర్యాంకు సాధించింది. తన కాలేజీలో గేట్‌ ర్యాంకుతో, స్కాలర్‌షిప్‌తో ఎంటెక్‌ చదివిన మొదటి అమ్మాయి తనే. ఇప్పుడామె ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తోంది. మీడియం మార్పుకోసం ఇంట్లో భార్యతో గొడవపడ్డానని, బలవంతంగా ఒప్పించానని చెప్పాడు.

2017లో మీడియం మార్పు తర్వాత స్కూల్లో ఎప్పుడూ లేనంతగా ఉత్తీర్ణత శాతం తగ్గిందిని, అంతకు ముందు సంవత్సరాల్లో ఎంతో కష్టపడి నూరు శాతం ఉత్తీర్ణత సాధించామని, అదిప్పుడు 70 శాతానికి పడిపోయిందని చెప్పారు. స్కూల్లో పరీక్షలు పెడితే బాగానే రాస్తున్నారనిపించిందట. పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోడానికి ఆయన పదవ తరగతి జవాబు పత్రాలు జిరాక్స్‌ కాపీలు తెప్పించుకున్నారు. అందరూ ఇంగ్లీషులో వ్యక్తీకరించలేకపోతున్నట్లుగా అర్థమైంది. ఇంగ్లీషు పదాలు, వాక్యాలు రాయడం చేతకాలేదు. మార్కులు బాగా రావడానికి తన పరిధిలో చేయగలిగినంత చేశారు. స్టడీ అవర్లు పెట్టడం, చేతి రాత మెరుగుపడితే మార్కులు పెరుగుతాయని 10 వేలు ఖర్చు పెట్టి ఒక మాస్టారును స్కూలుకి పిలిపించి కోచింగ్‌ ఇప్పించడం చేశారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచడానికి ఏమైనా చేయాల్సింది అంటే అది హ్యాండ్‌ రైటింగ్‌లాగా నెలలో, రెండు నెలల్లో అయ్యేది కాదని, దానికి ప్రత్యేకంగా టీచర్‌ను నియమించుకోవాలని, ఆపని ప్రభుత్వం చేయాలని అన్నారు. స్కూల్లో మౌలిక సదుపాయాల కోసమే అనేక లెటర్లు పెట్టానని చెప్పుకొచ్చారు.

పిల్లల స్టాండర్డ్స్‌ గురించి మాట్లాడుతున్నపుడు టెన్త్‌ క్లాస్‌ మహేశ్వరి గురించి చెప్పారు. మహేశ్వరి రోజూ ఇళ్ళలో పని చేసి స్కూలుకు వస్తుంది. ఇంటికెళ్ళాక కూడా పని చేయాల్సి ఉంటుంది. ఇద్దరు చెలెళ్ళు, రోజంతా పనిచేసే తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళకు చదువే గగనం. కానీ మహేశ్వరి ఫెన్సింగ్‌ ఆటలో ఛాంపియన్‌. ప్రొద్దుటూరు వంటి చిన్న పట్టణంలో మారుమూల మోడంపల్లె ప్రభుత్వ పాఠశాలలో పిఇటి మాస్టారు పిల్లలకు ఫెన్సింగ్‌, రైఫిల్‌ షూటింగ్‌ వంటి ఆటల్లో శిక్షణ ఇస్తున్నాడు. అందరి పిల్లలకూ ఉండే అవకాశాలు వీళ్ళకు ఉండవు కాబట్టి, ఇటువంటి అరుదైన అవకాశాలు కల్పించి వాళ్ళను పైకి తీసుకురావాలని తపన పడే పిఇటి, హెడ్‌ మాస్టర్‌లకు అభినందనలు తెలిపి వచ్చాం. రెండురోజుల తర్వాత జరిగిన పోటీల్లో మహేశ్వరి రాష్ట్ర స్థాయికి ఎంపికైందని తెలిసింది.

నడింపల్లి మునిసిపల్‌ హైస్కూల్లో తెలుగు, ఇంగ్లీషు మీడియం రెండూ ఉన్నాయి. మామూలుగా స్కూలుకుండే గ్రౌండు లేదు, కిక్కిరిసిన ఆవరణ. ఇంగ్లీషు మీడియం కొన్నేళ్ళ క్రితం వచ్చింది. అంతవరకు తెలుగులో పాఠాలు చెప్పే టీచర్లు ఇంగ్లీషులో చెప్పాల్సి వచ్చింది. పిల్లలకు అర్థం కావడం అటుంచి టీచర్లకే రాదు. తెలుగు, ఇంగ్లీషు మీడియం పుస్తకాలు పక్కపక్కన పెట్టుకొని చదువుకుని క్లాసులకు పోతున్నట్లుగా బయాలజీ టీచర్‌ చెప్పారు. ఇంగ్లీషులో చెప్పి, తెలుగులో వివరించి, ఇంగ్లీషులో రాయడం నేర్పించాలి. అందుకోసం ఆమె సెలవుల్లో కూడా క్లాసులు తీసుకుంది. స్టడీ క్లాసులు పెట్టి, ఇంగ్లీషు ట్రైనింగ్‌ ఇచ్చే స్పెషల్‌ టీచర్లను పెడితేగాని పిల్లల్ని పైకి తీసుకురావడం కష్టమని హెచ్‌ఎం అంటున్నారు. అన్నిటి కన్నా ముందు స్కూలుకు సరిపడా గదులు లేవు. హాస్టల్‌ గదులు కూడా తీసుకోవాల్సి వస్తోంది అన్నారు. మధ్యాహ్న భోజనం వండి వడ్డించడానికి ఆ ఇరుకు స్థలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. జగనన్న తెలుగు మీడియం తీసేసి గదుల సమస్య పరిష్కారం చేస్తున్నాడు! 5 నుండి 10 వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో చదువుతున్న పిల్లలకు ఇంగ్లీషు వాక్యం చెప్పడం రాదని మాకు అనేక చోట్ల అర్థమవుతోంది. జ్వరమొస్తోంది అనడానికి ʹఅయామ్‌ ఫీవర్‌ʹ, చాక్లెట్‌ కావాలి అనడానికి ʹఅయామ్‌ చాక్లెట్‌ʹ అంటున్నారు. వీళ్ళకెవరికీ ఇంట్లో చదివే వాతావరణం లేదు. తెలుగులో పరిచయమైన పరిసరాలను ఇంగ్లీషులో పరిచయం చేసే పని ఇంట్లో చదువురాని తల్లిదండ్రులు చేయలేరు. ట్యూషన్లకు పంపలేరు.

ఏ తల్లిదండ్రులనైనా అడగండి మా పిల్లలు ఇంగ్లీషు మీడియంలోనే చదవాలంటారు. ఇందులో సందేహమే లేదు. నిరుపేదలుండే సంజీవనగర్‌ అందుకు మినహాయింపు కాదు. అక్కడ 2017 నుండి ఇంగ్లీషు మీడియం మునిసిపల్‌ ప్రైమరీ స్కూలుంది. పిల్లలు మాత్రం టెక్స్ట్ బుక్‌లో పదాలు చదవలేకున్నారు. ʹఅసలు వీళ్ళు బడికే రారు మేడంʹ అంటారు టీచర్లు. తల్లిదండ్రులు పట్టించుకొని, ఇంట్లో చదివించి, రోజూ స్కూలుకు పంపకపోతే మేమేం చేస్తాం అని వాళ్ళ జవాబు. కోఆపరేటివ్‌ కాలనీలో మరో ఇంగ్లీషు మీడియం మునిసిపల్‌ ప్రైమరీ స్కూలుంది. అక్కడ కూడా 2017 నుండి ఇంగ్లీషు మీడియం అమల్లో ఉంది. చెమ్మ పట్టిన గోడల మీద ఎప్పుడో నీలం రంగుతో రాసిన తెలుగు పాఠాలు అలానే ఉన్నాయి. మీడియం మార్చారు గానీ కనీసం గోడలకు సున్నం కూడా కొట్టించలేదు. నగరంలో ఉండడం వల్లేమో ఇక్కడ పిల్లలు కొంచెం ఫరవాలేదనిపించింది. కానీ వీళ్ళకు కూడా ఇవియస్‌ (పర్యావరణ శాస్త్రం) చాలా కష్టంగా ఉందట. లెక్కల్లో ఎక్కువ అంకెలే ఉంటాయి. ఇవియస్‌లో ఇంగ్లీషులో వివరణలు రాయవలసి ఉంటుంది. క్లాసు నుండి బైటికొస్తూనే ఆవరణలోపల జామపండ్లు, దోసకాయలు, చాక్లెట్లు ఆమ్ముతున్న పెద్దావిడ కనిపించింది. ఆ స్కూల్లో కుర్‌కురేల వంటి ప్యాకెట్లు అమ్మకుండా బ్యాన్‌ చేశారట. టీచర్లందరూ ఒకే మాట -ఆ చెత్తంతా పిల్లలు తింటే ఎట్లా అని. ప్రభుత్వ టీచర్లంటేనే ఏ మాత్రం గౌరవం లేని సమాజంలో మాకు మాత్రం చాలా మంది మంచి టీచర్లు తారసపడ్డారు.

ప్రకాశంనగర్‌లో ఎక్కువగా పూసలోళ్ళు ఉంటారు. అక్కడ తెలుగు మీడియం ప్రైమరీ స్కూలుంది. ఇప్పటికీ బాల్యవివాహాలున్న సమూహం అది. సుమారుగా ఏడో తరగతి రాగానే పెళ్ళిళ్ళు చేసేస్తారట. తల్లిదండ్రులు పొద్దుననగా పోతే సాయంత్రానిగ్గాని ఇంటికి రారు. పిల్లలు సరిగా స్కూలుకు రారు. అక్కడ ఇంగ్లీషు మీడియం పెట్టేస్తే ఇప్పుడొచ్చే పిల్లలు కూడా రారని హెడ్‌మాస్టర్‌ అంటారు. దొరసానిపల్లెలో జంగమోళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలకొస్తారు. వీళ్ళు స్కూలుకొచ్చే రోజులు చాలా తక్కువ. ఇప్పటికీ అన్నం అడుక్కోను పోతుంటారు. స్లమ్‌ ఏరియా అమృతానగర్‌ ప్రైమరీ స్కూల్లో రెండు మీడియంలు ఉన్నాయి. ఇది మాడల్‌ స్కూల్‌గా ఎంపికై రెండేళ్ళ నుండి ఇంగ్లీషు మీడియం పెట్టారు. ఇప్పుడు 1,2 తరగతులు ఇంగ్లీషు మీడియంలో, మిగిలినవి తెలుగు మీడియంలో నడుస్తున్నాయి. క్రమంగా ఏడాదికి ఒక్కో తరగతి ఇంగ్లీషులోకి మారుతుంది. ఇంగ్లీషు మీడియం చేశారు కానీ ఆ స్కూలుకు కనీసం తరగతి గదుల వసతి లేదు. వరండాలో పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి. ఆ ఏరియా వాతావరణం భయంకరంగా ఉంటుంది. ఎక్కువ మంది మగవాళ్ళు తాగొచ్చి భార్యను చావగొట్టేవాళ్ళే. కొట్లాటల్లో జైలుకు పోయెచ్చేవాళ్ళు కూడా ఎక్కువే. పిల్లల్ని వయసును బట్టి తరగతిలో చేర్చుకుంటారు గానీ వాళ్ళకు చాలా కాలం దాకా అక్షరాలు కూడా రావు. ఇప్పటికే కొంతమంది పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవలేమంటున్నారు. అమ్మఒడి పథకం వచ్చాక 75 శాతం హాజరు ఉంటేనే డబ్బు వస్తుంది కాబట్టి రోజూ పిల్లల్ని బడికి పంపుతున్నారని లేదంటే చాలా మంది పిల్లలు రెగులర్‌గా రారని తెలిసింది.

మేం చూసిన స్కూళ్ళు ఒక చిన్న శాంపుల్‌ మాత్రమే. ఒకే టీచర్‌ ఉన్న పాఠశాలలు రాష్ట్రంలో సుమారు ఏడు వేలున్నాయి. సంచార జాతులు, ఇప్పుడిప్పుడే స్కూలుకు వచ్చే అట్టడుగు వర్గాల పిల్లల భౌతిక వాతావరణం చదువులకు ఎంతో అననుకూలంగా ఉంటుంది. ప్రాథమిక స్థాయిలోనే వాళ్ళు బెంబేలు పడేలా, ఏ మాత్రం అర్థం కాని పాఠాలు బట్టీవేయిస్తే వాటిని అందుకోలేక వెనకబడిపోతారు. క్రమంగా చదువుకే దూరమయ్యే పరిస్థితి రావొచ్చు. కాబట్టి తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లోనే కాదు, ఆదివాసీ భాషల్లో కూడా విద్యాబోధన ఉండాలి. అప్పుడే విద్య అందరికీ చేరువవుతుంది.

విద్యావ్యాపారస్తులు డిమాండు మేరకు కోర్సులు నడుపుతారు. కాబట్టి డిమాండు లేని తెలుగు మీడియంను వాళ్ళు ఎత్తేశారు. అందరి అవసరాలు గుర్తించి చదువు చెప్పాల్సిన అగత్యం వారికి లేదు. కానీ ప్రభుత్వానికుంటుంది. పరిస్థితి ఏమిటంటే ఎడ్యుకేషన్‌ మాఫియాను నియంత్రించాల్సిన ప్రభుత్వం పూర్తిగా దాని చేతుల్లోకి వెళ్ళిపోయింది. నిజంగా పిల్లలకు మంచి విద్యను అందించాలనుకునే ప్రభుత్వమే అయితే అది చేయాల్సింది ఇంగ్లీషేతర మీడియంల రద్దు కాదు. ఇప్పుడున్న తప్పులతడక విద్యా ప్రమాణాలను సరిదిద్దడం. పసి పిల్లలకు ఐఐటి ఫౌండేషన్‌ వంటి పరమ అసంబద్ధ శిక్షణా పద్ధతులను రద్దుచేసి పిల్లలపై అమలవుతున్న హింసను అరికట్టడం. అదేమీ అసాధ్యం కాదు. దానిక్కావలసింది నిజాయితీ, చిత్తశుద్ధి మాత్రమే. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం 25 శాతం బడ్జెట్‌ కేటాయింపులు చేసి ప్రభుత్వ స్కూళ్ళ తీరుతెన్నులే మార్చేసింది. ఇప్పుడక్కడ గవర్నమెంట్‌ స్కూళ్ళలో పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రలు పోటీపడుతున్నారు. అతికొద్ది సంవత్సరాల్లో వాళ్ళీ మార్పు సాధించగలిగారు. ప్రభుత్వం అనుకుంటే ఏ కార్పొరేట్‌ సంస్థా పెట్టలేని స్థాయిలో నిధులు వెచ్చించి స్కూళ్ళు, కాలేజీలు పెట్టగలదు. తల్లిదండ్రులకు పిల్లల చదువు పట్ల దిగులు తొలగిపోతే ఏ నవరత్నాలూ అవసరం లేదు. పోనీ అంతకూడా వద్దు. మీమీ విద్యా కమిషన్లు చెప్పిన ప్రకారంగా విద్యా ప్రమాణాలు పాటించేలా ప్రైవేట్‌ స్కూళ్ళను నియంత్రించండి. ఆ పని చేయరు. కార్పొరేట్‌ కమిషన్లు తినమరిగినారు కదా! మీడియం చర్చపెట్టి అసలు విషయం పక్కదారి పట్టించి ప్రభుత్వ విద్యను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. అటు టీచర్ల సంఖ్య తగ్గించడం, ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌంట్స్‌ పెరిగి బడుల సంఖ్య కూడా తగ్గించడం, అమ్మఒడి లాంటి పథకాలు పెట్టి పిల్లలందర్నీ విద్యావ్యాపారులకు బలిచేయడం- ఇదీ అసలు కుట్ర. లేదంటే ఇంగ్లీషు మీడియం పెట్టండి కానీ, తెలుగు, తదితర మీడియంలు రద్దు చేయకండి అన్నంతనే ప్రజాద్రోహులుగా ముద్రవేసి విరుచుకుపడడం ఏమిటి?

No. of visitors : 392
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నేను దీపాలు ఆర్పను.. కొవ్వొత్తులు వెలిగించను.. ఏం చేస్తావ్?
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  ఆ కన్నీటిని ఈ శిక్ష తుడిచేయగలదా?
  మీరెప్పుడూ అర్బన్‌ మావోయిస్టులనే మాట వాడలేదా?
  మనుషులకే అర్థమయ్యేదీ, పంచుకునేదీ దుఃఖమే అంటున్న పద్మకుమారి కథలు
  The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  Students and the Revolution
  గోడలమనుషులు
  దగ్ధహృదయమా !
  మూడో కన్ను

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •