ఎంఎన్‌సి మార్కెట్ల కోసం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు

| సాహిత్యం | వ్యాసాలు

ఎంఎన్‌సి మార్కెట్ల కోసం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు

- ఎ. నర్సింహా రెడ్డి | 02.12.2019 10:10:44pm

ప్రపంచ మానవాళిని ఇప్పుడు శాసిస్తున్న అంశం మార్కెట్‌, ఆయా దేశాలు ఉత్పత్తి చేసిన వస్తువులను, వస్తు సామాగ్రిని అమ్ముకోవడం ఎలా అన్న అన్వేషణలో సిద్దాంతాలనకు, మానవ విలువలను వదలి స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్నాయి. గతంలో మనిషికి కావలసిన సహజమైన అవసరాలు తిండి, గుడ్డ, గూడు, నీరు, విద్య, వైద్యం తదితర అంశాలపైన దేశాలు కేంద్రీకరించేవి. 21వ శతాబ్దంలో ఇప్పుడు దేశాలకు కావలసింది పరిమిత దైనందిన అవసరాలు కాదు. తమ పారిశ్రామిక ఉత్పత్తులను అమ్ముకొని లాభాలు గడించేందుకు మార్కెట్ల కోసం దేశాలు అన్వేషిస్తున్నాయి. మార్కెట్ల నియంత్రణ కోసం యుద్ధాలకు సిద్ధమవుతున్నాయి. కారణం మనిషికి కావలసిన సాధారణ అవసరాలు తీరాయి. అదనంగా వసతులు, వనరుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఆ అన్వేషణలో మనిషికి అతని మనుగడకు విలువలేదు. కేవలం లాభార్జన మిగులు వస్తువులను అమ్ముకొనడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. అందులో భాగంగానే బలమైన దేశాలు బలహీన దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇలాంటి ఒప్పందాలు అన్ని అసమాన ఒప్పందాలేనన్నది స్పష్టం.

ఆసియాన్‌లోని పది సభ్యదేశాలు (బ్రూనీ, కంబోడియా, ఇండోనేషియా, మయన్మార్‌, లావో స్‌, మలేషియా, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయిలాండ్‌, వియత్నాం) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో చేతులు కలిపిన మరో ఆరు దేశాల (ఆస్ట్రేలియా, చైనా, జపాన్‌, న్యూజిలాండ్‌, దక్షిణ కొరియా, భారత్‌) మధ్య ఆధునిక, సమగ్ర, అత్యంత మెరుగైన పరస్పర లబ్దిదాయక ఆర్థిక భాగస్వామ్య ఒడంబడికను సాధించడమే ధ్యేయంగా ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సెప్‌) వేదిక ఏడేళ్ల క్రితం నవంబర్‌ 2012లో ఏర్పడింది. 29-11-2019 చివరిలోగా తుది ఒప్పందం ఖరారుకు సభ్యదేశాలు సంకల్పం ప్రకటించినా ప్రవచిత మార్గదర్శక సూత్రాలకు, ఆర్‌సెప్‌ స్థాపిత స్ఫూర్తికి పూర్తిగా మన్నన దక్కులేదంటూ బ్యాంకాక్‌ వేదిక నుంచి నవంబర్‌ 5న భారత ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ్య ఒప్పందం పరిధి నుంచి ఇండియా వైదొలగినట్లయింది. ఆర్‌సెప్‌ ఒప్పందానికి చెందిన ప్రణాళికాబద్దమైన మూలాలు అప్రజాస్వామిక స్వభావం నిజంగా నిర్ఘాంతపరిచేదిగా ఉంది. చర్చలు పూర్తిగా రహస్యంగా జరుగుతున్నాయి.

భారతదేశం సహా ఈ దేశాలన్నింటిలోని ప్రజలందరూ తమ ప్రమేయం లేకుండా జరిగిన ఈ ఒప్పందం ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. భారతదేశానికి సంబంధించి అత్యంత అప్రజాస్వామికంగా ప్రభుత్వం దేశాన్ని ఎఫ్‌టిఎలో భాగం చేయటమే కాకుండా మరో అదనపు కారకం కూడా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలను నిర్వచించే రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌ ప్రకారం వ్యవసాయ రాష్ట్రాల అధికార పరిధిలోకి వస్తుంది. ఆర్‌సిఈపి, నిజానికి అటువంటి ఎఫ్‌టిఎ ఏదైనా, ఆవశ్యకంగా వ్యవసాయరంగాన్ని ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ ఈ ఒప్పందం షరతుల గురించి ఇప్పటివరకూ రాష్ట్రాలను సంప్రదించలేదు. రాష్ట్రాల అధికార పరిధిలోని అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు చేయటం రాష్ట్రాల రాజ్యాంగ మౌలిక హక్కులకు భంగం కలిగించటమే అవుతుంది. భారత్‌ మినహా తక్కిన పదిహేను దేశాలూ కుదుర్చుకున్న ఒడంబడికపై వచ్చే ఏడాదికి సంతకాలు అవుతాయని ఆర్‌సెప్‌ సంయుక్త ప్రకటన చాటుతోంది.

బ్యాంకాక్‌ తీర్మానం ద్వారా 1967లో ఏర్పడిన ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్‌) రెండేళ్లనాడు స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకొంది. 2005 నుంచి తూర్పు ఆసియా సదస్సుల ద్వారా ఇండియా, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను భాగస్వాములుగా పరిగణిస్తూ మొత్తం 360 కోట్ల జనావళితో పరిపుష్టమైన బృహత్‌ స్వేచ్ఛా విపణి విస్తృతికి ఏడేళ్లుగా కృషి చేస్తోంది. 2016 ఫిబ్రవరి 4న అమెరికా ప్రతిపాదించిన పసిఫిక్‌ తీరప్రాంత దేశాల (టిపిపి) భాగస్వామ్య వాణిజ్య కూటమిలో తనకు చోటు లేకపోవడంతో దానికి ప్రతిగా చైనా ఆర్‌సెప్‌ను 2012లో ప్రతిపాదించింది. 2016లో డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక పసిఫిక్‌ వాణిజ్య కూటమికి మంగళం పాడటం తెలిసిందే. బీజింగుతో వాణిజ్య అసమతూకంపై కన్నెర్ర చేసిన ట్రంప్‌ సుంకాల కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో, చైనాకు ఆర్‌సెప్‌ అవసరం మరింతగా పెరిగింది. ఐరోపా మాదిరిగా ఆసియాన్‌ ఆర్థిక సహజ స్వప్నం సత్వరం సాకారం కావాలంటూ 2015లో కౌలాలంపూర్‌ వేదిక నుంచి ఆర్‌సెప్‌ చర్చల్లో ఉత్సాహాన్ని ఉరవడినీ పెంచింది ప్రధాని మోదీయే. ఆసియాన్‌ సహా తక్కిన అయిదు దేశాలతో 2013-14లో 5,400 కోట్ల డాలర్లుగా ఉన్న ఇండియా వాణిజ్యలోటు 2018-19లో దాదాపు రెట్టింపు 10700 కోట్ల డాలర్లకు చేరింది.

పరస్పర ప్రయోజనదాయకం కావాల్సిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ధృతరాష్ట్ర కౌగిలిలా మారి కొన్ని దేశాల ప్రగతి కాంక్షల్ని ఎలా పిండి పిప్పి చేస్తాయో తెలియనిది కాదు. ఆ మాటకొస్తే ఆసియాన్‌ సహా మరో నాలుగు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టిఎ) ఇండియా ఇప్పటికే కుదుర్చుకొంది. వాటి తాలూకు ఆటుపోట్లతోనే సతమతమవుతున్న భారత్‌ పరిస్థితి ఆర్‌సెప్‌ ముసుగునీడన చైనా తన చౌక ఉత్పత్తుల్ని నిరాఘాటంగా గుమ్మరించడం మొదలుపెడితే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లవుతుంది. దేశీయంగా వర్తకులు, రైతులు, వృత్తి నిపుణులు, పలు పరిశ్రమల వర్గాలు, శ్రామికులు, వినియోగదారులు కొన్ని నెలలుగా ఆర్‌సెప్‌తో ఒప్పందం కుదుర్చుకోవద్దని డిమాండు చేశారు. 2010లో ఆసియాన్‌లోని ఆరు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినప్పుడు చైనాతో ఆయా దేశాలకు గల వాణిజ్య మిగులు 5,300 కోట్ల డాలర్లు, అదికాస్తా 2016 నాటికి 5,400 కోట్ల డాలర్ల వాణిజ్య లోటుగా మారిపోవడాన్ని బట్టే డ్రాగన్‌ మార్కెట్‌ మాయాజాలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆర్‌సెప్‌ బాటలో భారతావనిలో సహస్ర వృత్తుల శ్రమజీవుల పొట్టగొట్టేలా విదేశీ వాణిజ్య చొరబాట్లను అనుమతించకూడదు.

పెద్ద దేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, చైనాలు ఆయా ప్రాంత దేశాలలో ఆధిపత్యం కోసం పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ దేశాలు వనరుల కొరకు యురేనియం, బొగ్గు, ఉక్కు, ఇనుము, అబ్రకం, అల్యూమినియం లాంటి వాటిమీదను అతి ముఖ్యమైన ఆధునిక అవసరమైన చమురు కొరకు అన్వేషణలు చేస్తున్నాయి. అంటే పేద దేశాలు, పారిశ్రామికంగా వెనుకబడిన దేశాలు, సాంకేతిక పరిజ్ఞానం లేని దేశాలు, పెట్టుబడిలేని దేశాలు సహజవనరులు ఎగుమతి చేస్తే సంపన్న పారిశ్రామిక దేశాలు తయారీ వస్తువులు దిగుమతులు సుంకాలు లేకుండా దిగుమతి చేస్తాయి. లేదా తమ పెట్టుబడులు పేద దేశాలలో పెట్టి ఉత్పత్తి పన్ను లేకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాయి. అంటే ఎగుమతి చేసినా, దిగుమతి చేసినా సంపన్న దేశాలకు లాభాలే వస్తాయి.

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటివో) చర్చల ప్రారంభ దినాల్లో కూడా, సంపన్న వాణిజ్య మండలి అయిన ఒఈసిడి (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించిన వ్యవసాయ సబ్సిడీల భారీ కుదింపు వల్ల భారతీయ వ్యవసాయానికి నష్టదాయకమవుతోందన్న ఆందోళన వ్యక్తమయింది. ఈ వ్యవసాయ సబ్సిడీలను ప్రపంచ వాణిజ్య సంస్థ విధానాల ప్రకారం ఆకుపచ్చ, కాషాయం, నీలం అనే మూడు రంగుల బాక్సులలో వ్యవసాయ సబ్సిడీలను పేర్కొనడం జరిగింది. అమెరికా ఇస్తున్న సబ్సిడీల కంటే 28 సభ్యదేశాల యూరోపియన్‌ యూనియన్‌ మూడు రెట్లు ఎక్కువగా (65 బిలియన్‌) డాలర్ల మేరకు వ్యవసాయ సబ్సిడీలను అందిస్తోంది. ఈ రెండు దిగ్గజ కూటములతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు పెట్టేముందు భారతీయ వ్యవసాయంపై సబ్సిడీలు కలిగించే నష్టం గురించి జాగ్రత్తగా ఆలోచించాలి.

అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ గతంలో విమర్శించిన చైనా ఇప్పుడు అవే పద్దతులను అనుసరిస్తోంది. అన్ని దేశాల్లోకి తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న చైనా పొరుగు దేశాలనుంచే కాకుండా అమెరికా, యూరప్‌ వంటి సంపన్న దేశాల నుంచి కూడ దిగుమతులను తగ్గించేసింది. బ్రిక్స్‌, షాంఘై సహకార సంస్థ, యురేషియా వంటి బహుళ పక్ష కూటములు ఆర్థిక వాణిజ్య రంగంలో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని చైనా సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తూనే ఉంటుంది. ఆచరణలో మాత్రం చైనా ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యలకు ఏమాత్రం పొంతన ఉండదు. ద్వైపాక్షిక సంబంధాల్లో సహకారం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, పారదర్శకత ఉంటేనే వాణిజ్య ఒప్పందాలు ఉభయ ప్రయోజకరంగా ఉంటాయి. లేకుంటే వాణిజ్యంలో లోటు పెరిగిపోతుంది. ఇప్పుడు అమెరికా, భారత్‌ ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగిపోతున్నాయని గగ్గోలు చేస్తోన్నాయి. చైనా భారత్‌తో వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకొని భారత్‌ లాంటి పెద్ద మార్కెట్‌లో చౌకగా తన ఉత్పత్తులను చైనా బజార్‌ల ద్వారా భారత్‌లో డంప్‌ చేస్తూ ఇండియా ఉత్పత్తులకు మార్కెట్‌ను తగ్గిస్తోంది.

ఆర్‌సెప్‌ ఒప్పందంలో భారత్‌ భాగస్వామి అయిఉంటే చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ నుంచి దిగుమతి చేసుకొనే 74 వస్తువులపై టారిఫ్‌ను ఎత్తివేయాల్సి ఉంటుంది. అలాగే జపాన్‌, దక్షిణ కొరియా, ఏషియన్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకొనే 90 శాతం వస్తువులపై టారిఫ్‌ను ఎత్తివేయాల్సి వచ్చేది. చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వద్దేవద్దని రైతాంగం, పలు రాజకీయ పార్టీలు, స్వదేశీ జాగరణమంచ్‌లు వ్యతిరేకిస్తున్నాయి. చైనా ఉత్పత్తులు భారత్‌ మార్కెట్లోకి అనుమతిస్తే భారత్‌ తయారీరంగానికి చావుదెబ్బే అని హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌ చైనాల మధ్య వాణిజ్యలోటు 5,700 కోట్ల డాలర్లు ఉంది. ఇదే భారత విధానకర్తలకు ఆందోళనకు గురిచేస్తోంది. అయితే వాణిజ్య సమాఖ్యకు చెందిన సిఐఐ మాత్రం ఆర్‌సెప్‌ ఫ్రేంవర్కులోనే చైనాతో ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుతున్నారు. పోటి ఉంటేనే ఉత్పాదకత, వస్తు నాణ్యత పెరుగుతుందని వారు పెట్టుబడి లాభాపేక్ష కోణంలో ఆలోచిస్తున్నారు. కానీ నిరుద్యోగం పెరుగుతుందని గుర్తించడం లేదు.

ʹఆసియాన్‌ʹ సభ్య దేశాల అభివృద్ధి స్థాయి రీత్యా ఈ ఒప్పందం వలన అన్ని దేశాలకూ ఒకే విధంగా ప్రయోజనాలు చేకూరవు. కొన్ని దేశాలు ఎక్కువ లాభపడితే మరికొన్ని తక్కువ లాభపడతాయి. మరికొన్ని దేశాలు నష్టపోతాయి. నష్టపోయే దేశాల జాబితాలో మనదేశం ఉంటుంది. ఒప్పందం ఫలితంగా వివిధ దేశాల నుండి సుంకాలు లేకుండా దిగుమతులు రావటంతో దేశంలోని చిన్న పరిశ్రమలు, రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. ఒప్పందం వలన నష్టపోతామని కొందరు పెద్ద పెట్టుబడిదారుల కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా సముద్ర ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, మందులు, రసాయనాలు, బట్టల ఉత్పత్తిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ నుండి వచ్చే దిగుమతులతో దేశంలోని ఉక్కు పరిశ్రమ, పాల ఉత్పత్తిదారులు నష్టపోతారు.

వ్యవసాయం అంతర్భాగంగా ఉన్న ఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమైనా ఆవశ్యకంగా రైతాంగానికి వ్యతిరేకమైనదిగానే ఉంటుంది. ఈ రంగం ఇప్పటికే ప్రపంచీకరణ విధానాల కారణంగా చాలా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు, నోట్ల రద్దువంటి బిజెపి ప్రభుత్వ విధానాలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నప్పుడు ఆర్థిక వ్యవస్థను నష్టపరిచే శక్తి ఆర్‌సిఈపికి ఊహాతీతంగా ఉంటుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల నుంచి అక్కడి ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీల మద్దతుతో వచ్చే పాల ఉత్పత్తుల దిగుమతులతో భారతీయ రైతులు నష్టపోతారనే విషయం ఇప్పటికే అందరి దృష్టినీ ఆకర్షించింది. అలాగే ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి వచ్చే చౌక వంట నూనె దిగుమతులతో కేరళలోని ఉత్పత్తిదారులు దెబ్బతింటారు.

దేశంలో 60 శాతం మందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగంలో సంక్షోభం నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చడానికి దారి తీస్తుంది. ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరిగితే దేశీయ పారిశ్రామిక రంగం ముఖ్యంగా చిన్న మధ్య తరగతి పరిశ్రమలు మూత పడతాయి. నిరుద్యోగ సమస్య మరింతగా పెరగడానికి దారి తీస్తుంది. 90 శాతం దిగుమతులపై సుంకాలు తగ్గింపు, పెట్టుబడులు, పేటెంట్‌ హక్కులు, ఈ కామర్స్‌, సేవల రంగాలకు సంబంధించిన చాప్టర్లలో భారత్‌కు హాని కలిగించే అనేక అంశాలున్నాయి. అలాగే ఆర్‌సిఈపి కింద మేధో హక్కుల వ్యవస్థను అమలు చేయాలని పట్టుబట్టడం కూడా ఉంది. దానివల్ల రైతాంగం చట్టపరమైన చర్యలను ఎదుర్కోకుండా తమ విత్తనాలను ఉపయోగించుకోవటం కూడా దుస్సాధ్యమౌతుంది. పేటెంట్ల వ్యవస్థ విధించే తీవ్రమైన పరిమితుల వల్ల ఫార్మారంగం తప్పకుండా ప్రభావితం అవుతుంది. దీనితో మందుల ధరలు మరింతగా పెరుగుతాయి. ఆర్‌సిఈపి కారణంగా వినియోగదారులకు కావలసిని వస్తువులు చౌకగా దిగుమతి కావటంతో అవి చౌకగా దొరుకుతాయనే వాదనకు వ్యతిరేకంగా అటువంటి దుష్పలితాలకు అవకాశం ఒక వైరుధ్యంగా ముందుకు వస్తుంది.

చౌక దిగుమతులతో రైతాంగానికి ఏర్పడిన దుస్థితివల్ల శ్రామిక రిజర్వ్‌ సైన్యం పరిమాణం పెరుగుతుంది. దానితో మొత్తం కార్మిక వర్గం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. అది వేతనాల కోసం వారి బేరమాడే శక్తిని బలహీనపరుస్తుంది. అంతేకాకుండా రైతుల, ఇతర కష్టజీవుల ఆదాయాలు తగ్గిపోవటం కారణంగా ఉద్బవించే వివిధ ప్రభావాల వల్ల ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం తీవ్రతరం అవుతుంది. రైతాంగం దారిద్య్రంలో కూరుకుపోయినా చౌక దిగుమతుల కారణంగా లాభపడినవారి ఆదాయాలు తగ్గిపోయి ఉండకపోవచ్చు. అయితే పెరిగిన రైతుల పేదరికం వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థే కుదేలవుతున్న స్థితిలో కార్మికులలో ఆదాయం తగ్గనివారంటూ ఉండరు. వేరే మాటల్లో చెప్పాలంటే రైతుల భవితవ్యం అందరి భవితవ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రైతుల దారిద్య్రం సమాజాన్ని గణనీయమైన స్థాయిలో ప్రభావితం చేస్తుంది.

ఆర్‌సియిపి వంటి అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భారత్‌ లేకపోవడం వల్ల తూర్పు ఆసియా ప్రాంతీయ బలాబలాలు ఎట్లా ఉంటాయనే ప్రశ్న తలెత్తుతున్నది. భారత్‌కు మిత్రదేశాలైన జపాన్‌, సింగపూర్‌ ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఆర్‌సిఈపిలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు భారత్‌ అవసరమని ఈ దేశాలు భావిస్తున్నాయి. భారత్‌ లుక్‌ ఈస్ట్‌ పాలసీని అమలు చేస్తున్నప్పటి నుంచి, ప్రాంతీయ కూటమిలో ఉండాలని ఆగ్నేయాసియా దేశాలు కోరుతున్నాయి. ఆర్‌సిఈపిలో భారత్‌ లేకపోవడం వల్ల ఇండో పసిఫిక్‌ భావనపై సందేహాలు తలెత్తుతున్నాయి. అమెరికామాత్రం చైనా వాణిజ్యాన్ని అడ్డుకోవాలని, అందుకు భారత్‌ను పావుగా వాడుకోవాలని చూస్తోంది. ఆర్‌సెప్‌ ఒప్పందం కుదరకూడదన్న భావనతోనే అమెరికా ఉన్నది.

ఆర్‌సెప్‌ ఒప్పందంలో చేరరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం, దీనిపై తదుపరి చర్చలు కొనసాగుతాయని చెప్పడం, ఆర్‌సిఇపి చర్చల్లో కీలక పాత్ర పోషించిన ఆస్ట్రేలియా, చైనాలు భారత్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పడాన్ని బట్టి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నుంచి భారత్‌ పూర్తిగా వైదొలగినట్లు భావించలేము. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంలో భారత్‌ చేరాలని కార్పొరేట్‌ శక్తులు ఒత్తిడి చేస్తున్నాయి. చైనాతోసహా ఆర్‌సిఇపిలోని చాలా దేశాలతో భారత్‌ ఇప్పటికే ద్వైపాక్షిక ఒప్పందాలనో, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలనో కుదుర్చుకుంటుంది. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల భారత్‌కు ఒనగూడిందేమీ లేదు. ప్రస్తుత రూపంలో ఉన్న ఆర్‌సిఇపి ఒప్పందం భారతదేశ ఆర్థిక ప్రయోజనాలకు హానికరం.

ఈ ఒప్పందానికి శాశ్వతంగా చెల్లుచీటీ ఇవ్వాలి. అదే సమయంలో చైనాకు వ్యతిరేకంగా ట్రంప్‌ పన్నుతున్న పన్నాగంలో భారత్‌ భాగస్వామి కారాదు. ఆర్‌సిఇపిని పక్కన పెట్టి మాతో కలసిరండంటూ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనను ఈ నేపథ్యంలోనే చూడాలి. 2012 నుంచి ఏడేళ్ల పాటు చర్చించి ఖరారు చేసిన ఈ మెగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్‌ నుంచే అమలు కావాలి. కానీ, భారత్‌ సంతకం కోసం వచ్చే ఏడాది వరకు వాయిదా వేశారు. కాబట్టి ఆర్‌సిఇపి ప్రమాదం పూర్తిగా తొలగిందని అనుకోలేము. కార్పొరేట్‌ శక్తుల ఒత్తిడికి తలొగ్గి అరకొర రాయితీలను చూపి ఈ ఒప్పందంలో మోడీ ప్రభుత్వం చేరదన్న గ్యారంటీ ఏమీ లేదు. కాబట్టి రైతాంగం, కార్మికవర్గం చిన్న పరిశ్రమల వారు సదా అప్రమత్తతతో ఉండాలి.

ఏదైనా సమాజం తాను ఉత్పత్తి చేసే వస్తువులు వనరులపరంగా ఎంత వ్యయమైనప్పటికీ వినియోగించుకుంటే ఆ సమాజంలో ఉద్యోగిత, వినియోగం ఉన్నతస్థాయిలో ఉంటాయి. కానీ ఒకవేళ అదే సమాజంలో నివసించే ప్రజలు ఆ సమాజం ఉత్పత్తి చేసే వస్తువులను కాకుండా వేరే వస్తువులను డిమాండ్‌ చేస్తే ఉద్యోగిత, ఉత్పత్తి తగ్గుతాయి (అదేస్థాయిలో లేక పరిమాణంలో ఆ సమాజం తన వస్తువులను ఎగుమతి చేస్తే తప్ప అటువంటి పర్యవసానాన్ని నివారించలేం). కానీ మనం నిరుద్యోగితకు కారణభూతమైన లేక నిస్పృహకు కారణభూతమైన ఆర్‌సిఈపిని చూస్తాం. అంతేకాకుండా విస్తృతమయ్యే నిస్పృహతోపాటుగా దేశానికి చెందిన కరెంటు ఖాతా లోటుకూడా పెరుగుతుంది. (నిజానికి అది ఈ నిస్పృహకు ప్రతిబింబం). ఇండో ఆసియన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల వినియోగానికి సంబంధించిన కరెంటు ఖాతా లోటు పెరిగింది. వేరేమాటల్లో చెప్పాలంటే ʹస్వేచ్ఛా వాణిజ్యంʹ, ʹసామర్థ్యంʹ వంటి వాదనలు ఏ మాత్రం విలువలేని బూర్జువా అర్థశాస్త్ర భావజాల వారసత్వమే తప్ప మరొకటి కాదు. దీనిని మనం ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచింది.

ప్రపంచంలో నేడు అన్ని దేశాలు విదేశాలతో వాణిజ్య లోటు తమకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాయి. ఇది ఆచరణీయం కాదు, అసాధ్యం. విదేశీ వాణిజ్య లోటు తీర్చడం కోసం ఎగుమతులకు ప్రోత్సాహాల్ని యిస్తూ అవసరమైతే స్వదేశీ కరెన్సీల రేటు కృత్రిమంగా దిగజార్చుతుండడంతో అమెరికా డాలరు దోపిడీకి హద్దూ అదుపూ లేకుండా పోతున్నది. సగటు మనిషి కొనుగోలు శక్తి పెరిగిననాడే దేశాల ఆర్థిక వ్యవస్థలు వృద్ధిపథంలో నడుస్తాయి. ఇందుకు ఆర్థిక అసమానతలు సమసిపోవాలి. అయితే, ఇది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ విధానానికి వ్యతిరేకం. చైనాతో మన లోటుతోపాటుగా ఆర్‌సిఈపి కింద ఆసియన్‌ కూటమి పరిమాణం పెరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఆర్‌సిఈపి ఒప్పందంపై సంతకం చేయటమంటే పెరిగిన కరెంటు ఖాతా లోటును పూడ్చటానికి మరింతగా అప్పుచేయటం అవసరం అవుతుంది. అది దేశంలో మరింత నిస్పృహకు కారణభూతమవుతుందని వేరే చెప్పనక్కరలేదనుకుంటా!

No. of visitors : 226
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నేను దీపాలు ఆర్పను.. కొవ్వొత్తులు వెలిగించను.. ఏం చేస్తావ్?
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  ఆ కన్నీటిని ఈ శిక్ష తుడిచేయగలదా?
  మీరెప్పుడూ అర్బన్‌ మావోయిస్టులనే మాట వాడలేదా?
  మనుషులకే అర్థమయ్యేదీ, పంచుకునేదీ దుఃఖమే అంటున్న పద్మకుమారి కథలు
  The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  Students and the Revolution
  గోడలమనుషులు
  దగ్ధహృదయమా !
  మూడో కన్ను

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •