సుదూర స్వప్నవీధులలో సంచరించిన ʹఖ్వాబ్ʹ

| సాహిత్యం | స‌మీక్ష‌లు

సుదూర స్వప్నవీధులలో సంచరించిన ʹఖ్వాబ్ʹ

- ఉణుదుర్తి సుధాకర్ | 02.12.2019 11:11:07pm

చిన్నతనంలో మా తరంవాళ్లం కొంతమందిమి ʹశ్రీశ్రీ తరవాత తెలుగు కవిత్వం ఏమైపోతుందో?ʹ అని – కొంత అమాయకంగా, కొంత అవివేకంగా – బెంగ పెట్టుకొనే వాళ్లం. అయితే శ్రీశ్రీ ఇంకా బతికి ఉండగానే – రాబోయే కాలాలకు సంబంధించి కొన్ని బలమైన సూచనలు కనిపించాయి. అప్పట్లో వాటి ప్రాముఖ్యతను మేము పూర్తిగా తెలుసుకోలేకపోయాం. అటువంటి ముందస్తు హెచ్చరికలకు ఉదాహరణలు – ఒక తిలక్, ఒక చెరబండరాజు, ఒక శివసాగర్, ఒక ఇస్మాయిల్, ఒక అజంతా; అలాగే ఒక గద్దర్, ఒక ఓల్గా, తరువాత ఒక సావిత్రి, ఒక కొండేపూడి, ఒక కలేకూరి. ఆయా తోవల్లో ఇంకా ఎంతోమంది నడిచివచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీశ్రీ నిష్క్రమించాక అస్తిత్వవాద రచనలు తెలుగు సాహిత్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసాయి; కొత్త ద్వారాలను తెరిచాయి.

కొత్త సాహితీ ధోరణులన్నీ మొదట యువతరం చిలికే కవితారూపాలలోనే వెలువడతాయి. లిఖిత సంప్రదాయానికి దూరం చేయబడ్డ శ్రామిక జాతులు పాడుకొనే పాటలుగా, డప్పుల మోతగా కూడా వినవస్తాయి. అవి బాధితుల హృదయపు లోతుల నుండి వెలువడ్డ ఆవేశపూరితమైన ఆక్రందనలు. అవి ʹప్రధాన స్రవంతిʹలో ధ్వనించినపుడు పాఠకుల, శ్రోతల విశ్వాసాల పునాదుల్ని సమూలంగా కదిలిస్తాయి. ఆ తరవాత దశలో – వాటిల్లోని సంఘర్షణాత్మక వాస్తవికత, సర్వజనీన లక్షణాలు ఆధారంగా అవి ప్రధానంగా ఆత్మకథలుగా తెరపైకి వస్తాయి. అంతవరకూ మనకు (అంటే మర్యాదస్తులకి, బెంగాలీలో ʹభద్రలోక్ʹకి) తెలియని జీవితాల వ్యధలను, వ్యక్తుల వేదనలను, చుట్టూతా ఉన్న పరిస్థితులపై వారు సాగించిన పోరాటాలను వివరిస్తాయి. ఆ తరువాత సృజనాత్మకతను జోడించుకొని కథలుగా, నవలలుగానూ అవతరిస్తాయి. దీని వెనుక ఒక కారణం ఉంది. బాధితుల తొలి స్పందన వైయుక్తికంగా, భావోద్వేగ భరితంగా ఉంటుంది. అప్పుడు మనకి ప్రధానంగా వినబడేవి, మనల్ని లోతుగా డిస్టర్బ్ చేసేవి బాధితుల స్వరాలే. పరిష్కారాలు కనుగొనే దిశగా చేసే ప్రయాణంలో ఆయా సమూహాలు తమ చారిత్రకతనీ, సార్వజనీనతనీ తామే గుర్తించుకుంటాయి; ఒక అంతర్గత హేతుబద్ధతని ఏర్పరచుకుంటాయి. సమూహాలు తాము తరతరాలుగా దాటివచ్చిన మైలురాళ్లను సమిష్టిగా గుర్తుచేసుకుంటాయి. సరిహద్దు రేఖలు నిర్వచింపబడతాయి. ʹఅటో, ఇటో తేల్చుకోʹ అంటాయి. యుద్ధ సన్నాహాలు మొదలవుతాయి. ఈ క్రమంలో బాధితుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది; ధిక్కార స్వరం వినవస్తుంది.

ఒకానొక సందర్భంలో ప్రొ. ఆర్. ఎస్. రావు గారు, ʹమార్క్సిజం అంటే వైయుక్తిక భావోద్వేగత నుండి సామాజిక హేతుబద్ధతవైపుగా చేసే చైతన్యవంతమైన ప్రయాణంతప్ప వేరొకటి కాదుʹ అన్నారు. (Marxism is but a conscious journey from individual emotional responses to collective rational actions). ఇందుకు ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. శ్రీశ్రీ కవిత్వం చదివి వామపక్ష భావాలవైపు మళ్లిన వాళ్లు వేల సంఖ్యలో ఉంటారు. అలాగే గద్దర్ పాటలు విని విప్లవకారులుగా మారినవాళ్లు ఎంతోమంది ఉంటారు. కానీ ఇవేవీ లేకుండా ఒక శుభ ముహూర్తాన తిన్నగా లైబ్రెరీకి వెళ్లి దాస్ కేపిటల్ తెచ్చుకొని చదివి రాత్రికి రాత్రే మార్క్సిస్టులుగా మారిపోయిన వాళ్లని నేనింకా చూడలేదు.

అయితే ఇక్కడ మరో మాట చెప్పుకోవాలి. తొలి దశలో భావోద్వేగం, మలి దశలో హేతుబద్ధత – అలాగే మొదట్లో వైయుక్తిక అనుభవం, తరువాత సామాజిక ఆచరణ అన్నప్పుడు – భావోద్వేగత స్థానంలో హేతుబద్ధత ప్రవేశిస్తుందనిగానీ, అలాగే సామాజిక ఆచరణ వ్యక్తుల అనుభవాల్ని మరుగుపరుస్తుందనీ కాదు. నిజానికి భావోద్వేగత తన స్థానాన్ని మరింత బలంగా కొనసాగిస్తుంది – అదీ ప్రధానంగా కవిత్వం రూపంలో. దాన్నే రివల్యూషనరీ రొమాంటిసిజం అని కూడా అనవచ్చు. విప్లవంలాంటి పెద్ద సామాజిక మార్పు వచ్చాక కూడా సోషలిస్ట్ రియలిజంతో బాటు అది ప్రయాణిస్తుంది (కనీసం తొలి దశలో). నిజానికి ఈ ప్రయాణం నిత్యం కొనసాగుతూనే ఉండాలి. లేకపోతే మానవీయత లేకుండా, వ్యక్తుల అనుభవాలనూ, అనుభూతులనూ గుర్తించకుండా, చర్చించకుండా సాగే రచనలు రాజకీయ ప్రచారానికి బాకాలుగా మారిపోతాయి. చివరికి అమానుషత్వానికీ, క్రూరత్వానికి దారితీస్తాయి. కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వచ్చిన ప్రతీ ఒక్క దేశంలోనూ ఇదే జరిగింది.

తిరిగి మన వర్తమాన సంధికాలానికి వస్తే – నేటి అస్తిత్వవాద సాహిత్యం బాధితుల స్వరం, ధిక్కారం – వీటిని దాటుకుంటూ పాటలు, కవితలతో మొదలుపెట్టి ఆత్మకథలలోకీ, కథా ప్రపంచంలోకీ, అలాగే నవలా ప్రక్రియలోకీ ప్రవేశించింది. ఇప్పుడు ప్రయోగాత్మక రూపాలలోకి కూడా విస్తరిస్తున్నది. తొలి దశలో ఉపయోగించిన ప్రక్రియల్ని వదులుకోకుండానే ఈ ప్రయాణం ముందుకి సాగుతున్నది.
రాబోయే రోజుల్లో అస్తిత్వవాద సాహిత్యమే ప్రధాన స్రవంతి కాబోతున్నది. ఆధిపత్య భావజాలాల్ని నెత్తినపెట్టుకొనే సాహిత్యానికి రోజులు చెల్లిపోయాయి. పీఠాధిపతుల అమోదముద్ర ఇకపై ఎవరికీ అవసరంలేదు. అయితే కొత్త పీఠాధిపతులు వారిపై పెత్తనం చెలాయించకుండా యువ రచయితలు, కళాకారులు జాగ్రత్త పడాలి.

ఈ నేపథ్యంలో సోదరుడు అరుణాంక్ లత వ్రాసిన ʹఖ్వాబ్ʹ సంకలనాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ పుస్తకంలో నన్ను ఆకట్టుకున్న ఒకటి రెండు అంశాల గురించి ప్రస్తావిస్తాను. మొదట నాకు కలిగిన అనుభూతిని చెప్పాలి. ఇందులోని రచనలు ఒక ప్రణాళిక అంటూ లేకుండా ఏరోజుకారోజు వ్రాసుకున్న డైరీలాగా, అప్పటికప్పుడు నమోదు చేసుకున్న ఆలోచనల్లాగా, నోట్సులాగా అనిపిస్తాయి. ఒక సున్నితమనస్కుడైన స్నేహితుడి అంతరంగంలోకి తొంగి చూసినట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి అతని ప్రైవసీని అతిక్రమిస్తున్నామేమో అని మనం జంకు కలుగుతుంది కూడా. అతనిలో జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన సత్యాన్వేషకుల vulnerability మనకు కనిపిస్తుంది.

సత్యాన్వేషకులు మృదు స్వభావులు. వాళ్లు కవచాలు ధరించరు; వాళ్ల చర్మం దళసరిగా ఉండదు. అయినా యుద్ధరంగంలోకి దూకుతారు. అందుచేత వాళ్లను గాయపరచడం అటు శత్రువులకూ, ఇటు సన్నిహితులకూ కూడా చాలా సులభం. అయినా వాళ్లు, రక్తం ఓడుతూనే తమ అన్వేషణను కొనసాగిస్తారు. ఎందుకంటే వాళ్ల కళ్ల ఎదుట భవిష్యత్తును గురించిన కలలు నిత్యం నాట్యమాడుతూనే ఉంటాయి; వాళ్లను ముందుకి నడిపిస్తూనే ఉంటాయి. అరుణాంక్ ఈ తరానికి చెందిన స్వాప్నికుడు, అన్వేషి అని నాకు బలంగా అనిపించింది.

ఈ పుస్తకంలో అరుణాంక్ ఎంతో ప్రేమతో పలవరించి ప్రస్తావించిన ఫైజ్ కవిత్వం, తలత్ పాటలూ, సాహిర్ లుధ్యాన్వి గీతాలూ, మంటో కథలూ ముందు తరాల్ని కూడా ప్రభావితం చేసాయి. అయితే వాటిని తిరిగి నేడు తల్చుకోవడంలో వాటి ఆశావాదం కన్నా విషాదమే ఎక్కువ పాళ్లలో ధ్వనించింది నా చెవులకి. నేడు ముసురుకున్న చీకట్లు ఇందుకు కారణం కావచ్చు. బహుశా ప్రతీ తరం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడల్లా ʹIt was the best of times; it was the worst of timesʹ అనే అనుకుంటుంది. అరుణాంక్ కూడా అదే అంటాడు.

ఈ రచనలు ఒకే వ్యక్తి యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించినప్పటికీ శకలాలుగా కనిపించడానికి కారణం ఏక కాలంలో అవి ఎన్నో కక్షలలో ప్రయాణిస్తూండడమే. అత్యంత దూరాన ఉన్న కక్షలో మనకు చే గెవారా, పాబ్లో నెరూడా ఎదురవుతారు; శ్రామికవర్గ ఐక్యతా నినాదం వినిపిస్తుంది. మరికొంత దగ్గరలో ఫైజ్, మంటో, సాహిర్, తలత్ లు ఉంటారు. అత్యంత సమీపాన ఉన్న కక్షలో మాత్రం కులవ్యవస్థ, పితృస్వామ్యం, భూస్వామ్య వ్యవస్థ ఎదురవుతాయి; అతడ్ని అడ్డుకుంటాయి. వీటినుండి బయటపడాలనీ, సుదూర సుందర స్వప్నలోకాల్ని చేరుకోవాలనీ అతని తపన. ఈ కక్షలన్నింటినీ సంధించే గురుత్వాకర్షణ శక్తి అతనిలో ఉన్న అపారమైన ప్రేమ. ఆ ప్రేమే ఈ పుస్తకంలోని కలల్నీ, ఆశల్నీ, ఆశయాల్నీ సంధించే అంతస్సూత్రం. పాఠకుడు దీన్ని పట్టుకుంటే రచయిత విహరించిన అంతర్-బాహ్య ప్రపంచాలు స్ఫురణలోకి వస్తాయి.

చివరిగా ఒక మాట. ఈ పుస్తకం ఒక ప్రయోగం; ఒక తొలి అడుగు; రాబోయే రోజుల్లో అరుణాంక్, అలాగే కొత్త తరం రచయితలు అనేకులు ఆవిష్కరించబోయే రచనల ముడి సరుకుకి మచ్చుతునక. ఈ ముడి సరుకు విస్తారమైనది. అది ముందుతరాల అభ్యుదయశక్తుల సారాన్ని గ్రహించినది; శ్రామికవర్గ అంతర్జాతీయతని అవగతం చేసుకున్నది. అందుకే ఇప్పుటి యువతరం జల్లుతూన్న ఈ విత్తనాలు భవిష్యత్తులో మహావృక్షాలుగా మారి రాబోయే తరాల వారు చేసే ప్రయాణల్లో వారికి నీడనిస్తాయి, సేద తీరుస్తాయని నేను నమ్ముతాను.

మొదట్లో చెప్పినట్లు ʹశ్రీశ్రీ తరువాత ఎవరు?ʹ అని మాతరం వాళ్లం, అతడు సృష్టించిన మహాప్రవాహంలో కొట్టుకుపోయిన వాళ్లం కొందరం బెంగపెట్టుకున్నాం. ఇప్పుడెవరూ అంత ఇరుకుగా ఆలోచిస్తారని నేను అనుకోవడం లేదు. కానీ ʹశ్రీశ్రీ, చలం వీళ్లిద్దరి ప్రస్తావన కూడా ఎక్కడా లేకుండా ఒక తెలుగు రచనలో విప్లవం గురించీ, ప్రేమను గురించీ చర్చించడం ఎలా సాధ్యపడుతుంది?ʹ అనే ప్రశ్న నాకు కలిగింది. ఈ ప్రశ్నకు ఇంకా జవాబు వెతుక్కుంటున్నాను.

No. of visitors : 142
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార డిసెంబర్ 2019
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •