ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

- లెనిన్ | 02.12.2019 11:46:32pm

1895 ఆగస్టు 5వ తేదీన (నూతన కేలండర్) ఫ్రెడరిక్ ఏంగెల్స్ లండన్ లో చనిపోయాడు. ప్రఖ్యాతి పొందిన మహాపండితులలోనూ, నాగరిక ప్రపంచమంతటా ఉన్న యావత్తు ఆధునిక శ్రామిక వర్గానికి గురువర్యులైన వారిలోనూ, తన మిత్రుని కారల్ మార్క్స్ (1883లో చనిపోయాడు) తరువాత ఏంగెల్సే ద్వితీయ స్థానాన్ని అలంకరిస్తున్నాడు. విధికృతంగా కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్సు ఒకరితో ఒకరికి పరిచయం కలిగిన నాటి నుండి, ఈ మిత్రులిద్దరి జీవిత కార్యం సమిష్టి కర్తవ్యంగా పరిణమించింది. ఈ కారణం వల్ల ఫ్రెడరిక్ ఏంగెల్స్ శ్రామికవర్గానికి చేసిన సేవను తెలుసుకోవాలంటే, సమకాలిక కార్మికోద్యమాభివృద్ధికి గాను మార్క్స్ గావించిన కృషి యొక్క, ఉపదేశాల యొక్క ప్రాముఖ్యతను గూర్చి స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. బూర్జువా వర్గంతో కలిసి శ్రామికవర్గాన్ని సృష్టించి, నిర్మాణయుతం గావించుతున్నట్టి నేటి ఆర్థిక విధానం యొక్క తప్పనిసరైన ఫలితమే కార్మికవర్గమూ, దాని కోర్కెలూ అని మార్క్స్, ఏంగెల్స్ లే ప్రప్రథమంగా నిరూపించారు. కేవలం ఉదాత్త మనస్కులైన ఎవరో కొందరు వ్యక్తులు సదుద్దేశ్యంతో సలిపిన ప్రయత్న ఫలితం కాకుండా, సంఘటితపడిన శ్రామికవర్గం సాగించే వర్గపోరాటమే ఇప్పుడు మానవాళిని దోపిడీ చేస్తున్న దుర్మార్గం నుండి విముక్తి చేయగలుగుతుందని వారు నిరూపించారు. తాము రచించిన శాస్త్రీయ గ్రంథాల్లో, సోషలిజం అనేది స్వాప్నికుల ఆవిష్కరణ కాదనీ, ఆధునిక సమాజంలో ఉన్న ఉత్పాదక శక్తుల క్రమాభివృద్ధి యొక్క అంతిమ ఆశయమూ, అనివార్యమైన ఫలితమనీ మొట్టమొదటిసారిగా మార్క్స్, ఏంగెల్స్ లే వివరించి చెప్పారు. లిఖితపూర్వకమైన మానవ చరిత్ర అంతా కూడా వర్గపోరాటం యొక్క నిర్దిష్ట కొన్ని సామాజిక వర్గాలపై విజయాన్ని సాధించి, వారిపై సాగించిన పరిపాలనా పరంపర యొక్క చరిత్రే తప్ప మరొకటి కాదు. వర్గపోరాటానికీ, వర్గపాలనకూ పునాదులైనట్టి వ్యక్తిగత ఆస్తి, అరాచక సామాజిక ఉత్పత్తి అదృశ్యం కానంత వరకూ ఇది ఇలా సాగుతూనే ఉంటుంది. శ్రామికవర్గ ప్రయోజనాలు క్షేమంగా ఉండాలంటే ఈ పునాదులు నిర్మూలించబడాల్సిందే; కాబట్టి వీటి నిర్మూలనకై సంఘటితపడిన కార్మికుల చైతన్యవంతమైన వర్గపోరాటం కొనసాగి తీరాలి. అంతే కాదు, ప్రతి వర్గపోరాటమూ రాజకీయ పోరాటమే.

తమ విముక్తికై పోరాడుతున్న శ్రామికులందరూ మార్క్స్, ఏంగెల్స్ ల అభిప్రాయాలను నేడు అవలంభించి ఆచరణలో పెడుతున్నారు. కాని 1840లలో ఈ మిత్రులిద్దరూ ఆనాటి సోషలిస్టు సాహిత్య సృష్టిలోనూ, సామాజికోద్యమాలలోనూ పాల్గొన్న కాలంలో అట్టి అభిప్రాయాలు కేవలం నూతనంగా ఉండేవి. ఆ రోజుల్లో తెలివితేటలు గలవారు, తెలివి తక్కువ వారూ, నిజాయితీపరులూ, దగాకోరులూ అనేకులు రాజకీయ స్వేచ్చా పోరాటంలోనూ, ఏకఛత్రాధిపతుల, పోలీసుల, మతగురువుల నిరంకుశత్వాన్ని ప్రతిఘటించే పోరాటంలో నిమగ్నులైనప్పటికీ, వారెవ్వరూ కూడా బూర్జువా వర్గ ప్రయోజనాలకూ, శ్రామికవర్గ ప్రయోజనాలకూ ఉన్న వైషమ్యాన్ని గ్రహించలేక పోయారు. ఒక స్వతంత్రమైన సామాజిక శక్తిగా కార్మికులు వ్యవహరించగలుగుతారనే తలంపును ఈ వ్యక్తులు ఏ మాత్రం సహించలేక పోయేవారు. ఆ కాలంలో అమలులో ఉన్న సామాజిక వ్యవస్థ యొక్క అధర్మాన్ని గురించి రాజులకూ, పాలకవర్గాల వారికీ నచ్చచెప్పి వారిని ఒప్పించగలిగితే ఇక ఆపైన ప్రపంచంలో శాంతినీ, సర్వమానవ శ్రేయస్సునూ సులువుగా స్థాపించవచ్చని కలలుగన్న స్వాప్నికులు, మహామేధావులు కూడా అనేకులు ఉండేవారు. వీరందరే కాక, ఆ కాలపు సోషలిస్టులూ, కార్మికవర్గపు శ్రేయోభిలాషులూ ఇంచుమించు అందరూ కూడా శ్రామికవర్గాన్ని ఒక పుండులాగా చూస్తూ, పారిశ్రామికాభివృద్ధితో పాటు ఈ పుండు కూడా పెరుగుతుండడం చూసి భయంతో హడలెత్తి పోయేవారు. ఈ కారణం చేత, పారిశ్రామికాభివృద్ధినీ, శ్రామికవర్గాభివృద్ధినీ ఏ విధంగా నిలిపివేయడమా అని వీరందరూ యోచించ సాగారు. శ్రామికవర్గం యొక్క దినదినాభివృద్ధిని చూసి, అందరితో పాటు తాము కూడా భయపడడానికి మారుగా శ్రామికవర్గం యొక్క నిరంతరాభివృద్ధి పైనే మార్క్స్, ఏంగెల్స్ లు తమ ఆశలన్నింటినీ పెట్టుకున్నారు. శ్రామికుల సంఖ్య ఎంత పెరిగితే విప్లవవర్గంగా వారి శక్తి అంత అభివృద్ధి పొందుతుందనీ, సోషలిజం అవతరణ అంత దగ్గర పడుతుందనీ, అందుకు అంత సదవకాశం ఏర్పడుతుందని వారు విశ్వసించారు. కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవంతంగా తెలుసుకోవడం ఎలాగో వారు బోధించారు; కలల స్థానే విజ్ఞానశాస్త్రాన్ని నెలకొల్పారు.

ఈ కారణం వల్లనే ప్రతి కార్మికునికీ ఏంగెల్స్ పేరు, అతని జీవిత చరిత్ర తెలిసి ఉండడం ఎంతైనా అవసరం. రష్యన్ కార్మికులలో వర్గచైతన్యాన్ని కలిగించడమే మన ప్రచురణల లక్ష్యం కాబట్టి, ఈ వ్యాస సంపుటిలో ఆధునిక శ్రామికవర్గపు ఇద్దరు మహోపాధ్యాయులలో ఒకడైన ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్రనూ, ఆయన చేసిన కృషినీ తెలియజేయడం మన విద్యుక్త ధర్మం.

ఏంగెల్స్ 1820లో ప్రష్యా రాజ్యానికి చెందిన రైన్ రాష్ట్రంలోని బార్మెన్ నగరంలో జన్మించాడు. అతని తండ్రి ఒక కార్ఖానా స్వంతదారుడు. కుటుంబ పరిస్థితి మూలంగా హైస్కూలు చదువు పూర్తి చేయకుండానే ఏంగెల్స్ 1838లో బ్రేమెన్ పట్టణంలో ఒక వర్తక కంపెనీలో గుమాస్తాగా చేరవలసి వచ్చింది. వర్తక వ్యాపారానికి చెందిన కార్యకలాపాలలో అతడు నిమగ్నుడై ఉండినప్పటికీ విజ్ఞానశాస్త్ర, రాజకీయ అధ్యయనానికి ఏ విధంగానూ వాటిని అడ్డుపడనిచ్చేవాడు కాదు. హైస్కూలులో చదువుతుండే రోజుల్లోనే ప్రభుత్వ నిరంకుశ పరిపాలన పట్లా, అధికారుల ప్రజాపీడన పట్లా అతనికి ద్వేషం ఏర్పడింది. తత్వశాస్త్ర అధ్యయనం అతనిని మరింత ముందుకు తీసుకొని పోయింది. ఆ రోజుల్లో జర్మన్ తత్వశాస్త్రంలో హెగెల్ ఉపదేశాలకే అత్యంత ప్రాబల్యం ఉండేది. అందువల్ల ఏంగెల్స్ కూడా హెగెల్ అనుచరులలో చేరాడు. బెర్లిన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తూ ప్రష్యన్ కొలువులో ఉన్న హెగెల్ నిరంకుశ పాలనను సాగిస్తున్న ప్రష్యన్ రాజ్యాన్ని చూసి తన వరకు తాను మెచ్చుకొన్నప్పటికీ, హెగెల్ బోధనలు మాత్రం విప్లవకరమైనవే. మానవ హేతువాదనా సామర్థ్యం పైనా, దాని హక్కుల పైనా హెగెల్ కి ఉన్న పరిపూర్ణ విశ్వాసమూ, నిరంతరం జరిగే మార్పుకూ, క్రమాభివృద్ధికి ప్రపంచం లోనవుతూ ఉంటుందనే అతని తత్వశాస్త్రానికంతటికీ మూలసిద్దాంతమైన సూత్రమూ, ఈ రెండు విషయాలూ, ఆ బెర్లిన్ ప్రొఫెసర్ యొక్క అప్పటి పరిస్థితులతో రాజీపడలేని శిష్యవర్గంలో కొందరికి, ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడడం, నాడు ప్రబలి ఉన్న అన్యాయానికీ, చలామణీ అవుతున్న దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడడం అనేవి శాశ్వతాభివృద్ధి అనే విశ్వవ్యాప్త నియమంలో ఒక భాగమనేది వారికి అర్థమవడం మొదలైంది. విశ్వంలో ఉన్న అన్ని వస్తువులకు క్రమాభివృద్ధి ఉన్నప్పుడు, పాత సంస్థలు మార్పుచెంది, వాటి స్థానే నూతన సంస్థలు ఏర్పడే స్థితిలో ప్రష్యా రాజు, రష్యన్ జారుల నిరంకుశ పాలనే ఎల్లకాలమూ ఎందుకు శాశ్వతంగా ఉండాలి? అత్యధిక సంఖ్యలో ఉన్నవారి పొట్టలు కొట్టి అత్యల్ప సంఖ్యలో ఉన్న ఏ కొద్దిమంది వ్యక్తులో భోగభాగ్యాలను అనుభవించడం కలకాలమూ ఎందుకు శాశ్వతంగా సాగాలి? హెగెల్ తత్వశాస్త్రం మనస్సు యొక్క భావాల యొక్క క్రమాభివృద్ధిని గురించి చెప్పింది; అది భావవాద పంథాలో ఉంది. మనస్సు క్రమాభివృద్ధిని పొందుతుందనే సూత్రం నుండి, ప్రకృతి, మానవుడు, మానవ, సామాజిక సంబంధాలు, వీటన్నిటి క్రమాభివృద్ధిని హెగెల్ తత్వశాస్త్రం తార్కిక పద్ధతిలో వివరించింది. హెగెల్ శాశ్వత క్రమాభివృద్ధి అభిప్రాయాన్ని మార్క్స్, ఏంగెలు అంగీకరించి, అతడు అకారణంగా ఊహించుకున్న భావవాద అభిప్రాయాలను మాత్రం వారు తిరస్కరించారు; మానవ జీవిత విషయాల వైపు వారు తమ దృష్టిని సారించినప్పుడు, ప్రకృతి క్రమాభివృద్ధిని వివరించేది మనస్సు యొక్క క్రమాభివృద్ధి కాదనీ, తద్భిన్నంగా మనస్సు యొక్క వివరణ ప్రకృతి నుండే, పదార్థం నుండే గ్రహించాల్సి ఉంటుందని వారికి స్పష్టంగా అర్థమైంది. మార్క్స్, ఏంగెలు హెగెల్ లేదా ఇతర హెగెల్ వాదుల వంటి వారు కాదు. మార్క్స్, ఏంగెల్స్ లు భౌతికవాదులు. ప్రపంచాన్నీ, మానవాళినీ భౌతికవాద దృష్టితో పరిశీలించి చూడగా, ప్రకృతిలో ఉన్న ఘటనలన్నింటికీ భౌతిక కారణాలే ఏ విధంగా మూలాధారాలుగా ఏర్పడి ఉన్నాయో, సరిగా ఆ విధంగానే మానవ సామాజిక క్రమాభివృద్ధి కూడా భౌతిక ఉత్పాదక శక్తుల క్రమాభివృద్ధికి పరిమితమై నిర్దేశించబడుతున్నది. మానవ అవసరాలను తీర్చుకోవడానికి అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేసుకునేందుకు మానవులు ఒకరితో మరొకరు ఏర్పరచుకొనే పరస్పర సంబంధాలు, ఉత్పాదకశక్తుల క్రమాభివృద్ది పైనే ఆధారపడి ఉంటాయి. ఈ సంబంధాలలోనే అన్ని సామాజిక జీవిత ఘటనలూ, అన్ని మానవ ఆశయాలూ, అభిప్రాయాలూ, అలవాట్లూ వీటన్నిటి వివరణ కూడా ఇమిడి ఉంది. ఉత్పత్తి శక్తుల క్రమాభివృద్దే స్వంత ఆస్థి ప్రాతిపదిక పైన ఏర్పడిన సామాజిక సంబంధాలను సృష్టిస్తుంది; కాని కేవలం ఈ ఉత్పాదక శక్తుల క్రమాభివృద్దే, అధిక సంఖ్యాకవర్గీయుల నుండి వారి ఆస్తిని గుంజుకొని, దానిని అత్యల్ప సంఖ్యాక వర్గీయులైన బహుకొద్దిమంది చేతుల్లో సాంద్రీకృతం చేస్తున్నది. కాని ఈ ఉత్పాదక శక్తుల క్రమాభివృద్దే ఆధునిక సామాజిక వ్యవస్థకు మూలమైన వ్యక్తిగత ఆస్తిని నాశనం చేసి, సోషలిస్టులందరూ తమ ఆశయసిద్ధికి ఏ గమ్యాన్నయితే ఏర్పరచుకున్నారో, పూర్తిగా ఆ గమ్యపు దిశగానే ఇది కూడా పాటుపడుతుంది. సామాజిక శక్తులలో ఏ శక్తి అయితే ఆధునిక సమాజంలో దానికున్న స్థానాన్ని బట్టి సోషలిజం అవతరణ పట్ల అభిలాషను కనబరుస్తున్నదో, ఆ శక్తిని గుర్తించి, ఆ శక్తి దాని ప్రయోజనాలను, దాని చారిత్రక కర్తవ్యాన్ని గుర్తించేలా దానికి చైతన్యాన్ని కలుగజేయడంలోనే ఉంది సోషలిస్టుల కర్తవ్యం అంతా. ఈ శక్తీ శ్రామికవర్గం.

తన తండ్రి భాగస్వామిగా ఉన్న ఒక వ్యాపార సంస్థలో 1842లో ఏంగెల్స్ ఉద్యోగిగా ప్రవేశించి, బ్రిటీష్ పారిశ్రామిక కేంద్రమైన మాంచెస్టర్ లో ఉన్నప్పుడు, ఇంగ్లండులోని ఈ శక్తి (శ్రామికవర్గం)తో పరిచయం చేసుకున్నాడు. మాంచెస్టర్ లో ఏంగెల్స్ తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీ ఆఫీసులోనే కూర్చొని ఉండిపోకుండా, కోళ్ల గూళ్లలా ఉన్న ఇళ్లల్లో నివశిస్తున్న కార్మికులున్న మురికిపేటల్లో తిరుగుతూ, వారి పరిస్థితులనూ, వారి దారిద్ర్యాన్నీ, వారి దౌర్భాగ్యపు జీవితాన్ని కళ్లారా చూశాడు. తన స్వంత పరిశీలనలతోనే తృప్తి పడక, బ్రిటీష్ కార్మికుల దురవస్థను గురించి తాను స్వయంగా చూసిన దానినంతా పుస్తకాల్లో చదివి, తనకు దొరికిన ప్రభుత్వ ప్రచురణలనన్నింటినీ ఏంగెల్స్ అధ్యయనం చేశాడు. ఈ అధ్యయన, పరిశీలనల ఫలితమే 1845లో ʹఇంగ్లండులో కార్మికవర్గ స్థితిగతులుʹ అనే రచన. ఈ గ్రంథాన్ని రచించడం మూలంగా అతడు చేసిన గొప్ప సేవ గురించి ముందే పేర్కొన్నాం. ఏంగెల్స్కు ముందే అనేకులు శ్రామికవర్గం అనుభవిస్తున్న కష్టాలను వర్ణించి, కార్మికవర్గానికి సహాయం చేయాల్సిన అవసరాన్ని గూర్చి రాశారు. అయితే శ్రామికవర్గం బాధలను అనుభవిస్తున్న వర్గమవడంతో పాటు, అవమానకరమైన ఈ ఆర్థిక దుస్థితే శ్రామికవర్గాన్ని నిరాఘాటంగా ముందుకు తీసుకొనిపోతూ, ఇక విధిలేక అది తన అంతిమ విముక్తికై యుద్ధం చేసేలా వాస్తవంగా నిర్బంధం చేయబడి తీరుతుందని అందరి కంటే ముందు ఏంగెల్సే చెప్పాడు. అంతేకాదు, యుద్ధం చేయడానికి భయపడని ఈ శ్రామికవర్గం తన స్వయం సహాయం పైనే ఆధారపడుతుంది. కార్మికవర్గం యొక్క రాజకీయోద్యమం ఫలితంగా సోషలిజం ఒక్కటే తమకు పరిష్కారాన్ని చేకూర్చగలదని కార్మికులు తప్పనిసరిగా గ్రహించి తీరుతారు. ఇక రెండో వైపున, ఎప్పుడైతే సోషలిజమే కార్మికవర్గ రాజకీయ పోరాటం యొక్క లక్ష్యం అవుతుందో, అప్పుడే సోషలిజం ఒక శక్తిగా రూపొందగలుగుతుంది. ఇంగ్లండులోని కార్మికవర్గపు స్థితిని గురించిన తన రచనలో వెల్లడించిన అభిప్రాయాల్లో ఇవి ముఖ్యమైనవి. వివేచనా శక్తిని కలిగినట్టీ, పోరాటాన్ని సాగించుతున్నట్టీ శ్రామికులంతా నేడు ఈ అభిప్రాయాలను స్వీకరించారు. కాని ఆ రోజుల్లో అవి కొత్తగా ఉండేవి. ఈ భావాలన్నీ మనస్సులో నాటుకొని పోయే శైలిలో రచించబడి, ఇంగ్లండులోని శ్రామికవర్గ దుస్థితిని ప్రామాణికంగానూ, హృదయవిదారకంగానూ వర్ణించబడి ఈ గ్రంథంలో విపులంగా వివరించబడ్డాయి. పెట్టుబడిదారీ విధానంపైనా, బూర్జువా వర్గం పైనా ఒక ఘోరమైన నేరారోపణపత్రమే ఈ గ్రంథం. ఈ గ్రంథం గొప్ప సంచలనాన్ని కలిగించింది. ఆధునిక శ్రామికవర్గ స్థితిగతులను యథార్థంగా చిత్రించిన గ్రంథం ఇదొక్కటేనంటూ ప్రతిచోటా అందరూ ఉదాహరిస్తుండేవారు. వాస్తవానికి 1845కు ముందుగానీ, తర్వాతగానీ కార్మికవర్గపు దౌర్భాగ్యస్థితిని ఇంత అద్భుతంగానూ, యథార్థంగానూ ప్రదర్శించిన రచన మరేదీ నాటికీ, నేటికీ వెలువడలేదు.

ఏంగెల్స్ సోషలిస్టు కావడం అతడు ఇంగ్లండుకు వచ్చిన తర్వాతనే. మాంచెస్టర్ లో ఆ రోజుల్లో బ్రిటీష్ కార్మికోద్యమంలో చురుకుగా పనిచేస్తున్న వ్యక్తులతో అతను సంబంధాలు పెట్టుకొని, ఇంగ్లీషు సోషలిస్టు పత్రికలకు వ్యాసాలు రాయడం మొదలుపెట్టాడు. 1844లో అతను జర్మనీకి తిరిగి ప్రయాణం చేస్తున్నప్పుడు అతనికి మార్క్స్ తో పరిచయం ఏర్పడింది; అంతకు ముందే అతను మార్క్స్ తో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతుండేవాడు. మార్క్స్ పారిస్ లో ఉన్నప్పుడు, ఫ్రెంచి సోషలిస్టులూ, ఫ్రెంచి జీవితమూ - వీటి ప్రభావ ఫలితంగా అతడు సోషలిస్టు అయ్యాడు. పారిస్ లోనే మిత్రులిద్దరూ కలిసి సమిష్టిగా "పవిత్ర కుటుంబం, లేక విమర్శనాత్మక విమర్శనకు విమర్శʹ అనే గ్రంథాన్ని రచించారు. "ఇంగ్లండులో కార్మికవర్గం యొక్క స్థితిʹ వెలువడడానికి ఒక ఏడాది ముందే వెలువడినట్టీ, అత్యధిక భాగం మార్పే రచించినట్టే ఈ పుస్తకంలో, పైన మనం దేని ప్రధాన అభిప్రాయాలనైతే వ్యాఖ్యానించామో ఆ విప్లవాత్మక సోషలిజం యొక్క పునాదులు వివరించబడ్డాయి. "పవిత్ర కుటుంబంʹ అన్నది తత్వశాస్త్రజ్ఞులైన బౌవర్ సోదరులనూ, వారి అనుచరులనూ ఎద్దేవ చేసేందుకు వారికి మార్క్స్, ఏంగెల్స్ లు పెట్టిన మారుపేరు. యావత్తు వాస్తవికతకూ, రాజకీయాలకూ, పార్టీలకు అతీతమైనట్టీ, ఎట్టి క్రియాశీల కార్యాచరణనైనా నిరాకరించే, చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ, ప్రపంచంలో జరుగుతున్న ఉదంతాలను కేవలం ʹవిమర్శనాత్మకంగాʹ నిర్వికల్పంగా ధ్యానిస్తూ ఉండాలనే తత్వాన్ని ఈ పెద్ద మనుషులు బోధించారు. ఈ పెద్ద మనుష్యులు, బౌవర్ సోదరులు శ్రామికవర్గాన్ని అహంకారంతో చూస్తూ, దానిని విమర్శనా జ్ఞానంలేని ముక్కడిమూక కింద జమకట్టారు. అసందర్భమైనట్టి, హానికరమైనట్టి ఈ పోకడను మార్క్స్, ఏంగెల్స్ లు అతి తీవ్రంగా ఎదిరించారు. వాస్తవమైన ఒక మానవ వ్యక్తి తరపున - పరిపాలనాధికారాన్ని చెలాయిస్తున్న వర్గాల యొక్క రాజ్యాంగయంత్రం యొక్క పాదాల కింద పడి నలిగిపోతున్న కార్మికుని తరపున - నిలబడి, నిర్వికల్ప ధ్యానం కాదు చేయాల్సింది; చేయాల్సిందల్లా ఉత్తమ సామాజిక వ్యవస్థ స్థాపనకై పోరాటమే మార్గమని ఎలుగెత్తి చాటారు మార్క్స్, ఏంగెలు. ఈ పోరాటాన్ని సాగించటానికి స్తోమత కలిగిన శక్తి, ఈ పోరాటంపై శ్రద్ధాసక్తులను కలిగినది శ్రామికవర్గమే అని వారు సహజంగానే గుర్తించారు. "పవిత్ర కుటుంబంʹ వెలువడక ముందే, మార్క్స్, రూగేల సంపాదకత్వం కింద ప్రచురించబడిన "జర్మన్ ఫ్రెంచి ఇతిహాస వార్షిక సంచికలుʹ అనే పత్రికలో, "అర్థశాస్త్ర విమర్శనా వ్యాసాలు 28 అనే శీర్షికతో ఏంగెల్స్ కొన్ని వ్యాసాలు రాశాడు. ఈ వ్యాసాల్లో, సోషలిస్టు దృక్పథంతో సమకాలిక ఆర్థిక వ్యవస్థలో ప్రత్యక్షంగా కనిపిస్తున్న ప్రధానమైన ఘటనలను పరిశీలించి, ప్రైవేటు ఆస్టి చెలాయించుతున్న రాజ్యాధికారం యొక్క అనివార్య ఫలితాలే ఇవి అని అతడు పర్యవసానం తేల్చాడు. ఏ శాస్త్రంలోనైతే మార్క్స్ రచించిన గ్రంథాలు వాస్తవమైన ఒక విప్లవాన్నే తీసుకొచ్చాయో, అట్టి అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయాలని మార్క్స్ కృతనిశ్చయుడవడానికి ఏంగెల్స్ సాహచర్యమే ఒక ప్రబల కారణమని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు.

1845 నుండి 1847 వరకు ఏంగెల్స్ బ్రస్సెల్స్ లోనూ, పారిస్ లోనూ నివసిస్తూ, తన విజ్ఞానశాస్త్ర అధ్యయనాన్ని బ్రస్సెల్స్ లోనూ, పారిస్ లోనూ ఉన్న జర్మన్ కార్మికుల మధ్య ఆచరణాత్మక కార్యకలాపంతో మిళితం చేస్తూ జీవించాడు. ఈ పట్టణాల్లో ఉన్నప్పుడే రహస్యంగా పనిచేస్తున్న జర్మన్ "కమ్యూనిస్టు లీగ్ʹతో మార్క్స్, ఏంగెల్స్ లు సంబంధాలు ఏర్పరచుకొన్నారు. మార్క్స్, ఏంగెల్స్ లు అప్పటికే రూపొందించినట్టి సోషలిజం ముఖ్యసూత్రాలకు ఒక వ్యాఖ్యానం రాయాలని వారిని ఈ సమితి కోరింది. మార్క్స్, ఏంగెల్స్ లచే రచించబడి 1848లో ప్రచురించబడిన ప్రఖ్యాత "కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికʹ ఈ విధంగా అవతరించింది. ఈ చిన్న పుస్తకం ఎన్నో గ్రంథాలకు సరిసమానమైనది. దీని భావమే మొత్తం నాగరిక ప్రపంచమంతటా సంఘటితమవుతున్న శ్రామికవర్గాన్ని ఈనాటికీ కూడా ఉత్తేజపరుస్తూ నడుపుతోంది.

ఫ్రాన్స్ లో మొదట ఆరంభమై తరువాత పశ్చిమ యూరప్ దేశాలకు వ్యాపించిన 1848 విప్లవం ఫలితంగా మార్క్స్, ఏంగెలు తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. స్వదేశానికి వెళ్లిపోయిన తర్వాత, ప్రష్యా రాజ్యపు రైన్ రాష్ట్రంలో ఉన్న కలోన్ పట్టణంలో ప్రచురితమవుతున్న ప్రజాస్వామ్య పత్రిక అయిన ʹ నోయె రైనిషె సైటుంగ్ʹను నడపడానికి పూనుకున్నాడు. ఆనాడు ప్రష్యా దేశపు రైన్ రాష్ట్రంలో విజృంభించినట్టి విప్లవాత్మక ప్రజాస్వామిక ఆశయాలన్నింటికీ ఈ మిత్రులిద్దరూ ఆయువు పట్టుగానూ, గుండెకాయ గానూ ఉంటూ పనిచేశారు. ప్రజా ప్రయోజనాలనూ, ప్రజాస్వేచ్ఛను అభివృద్ధి నిరోధక శక్తుల బారి నుండి అడుగడుగునా చిట్టచివరి వరకూ వీరు రక్షిస్తూ వచ్చారు. ఆ పోరాటంలో అభివృద్ధి నిరోధక శక్తులదే పైచేయి అవడం మనకు తెలిసిన విషయమే. ʹ

నోయె రైనిషె సైటుంగ్ʹను ప్రభుత్వం నిషేధించింది. వెనుక ప్రవాసంలో ఉన్న కాలంలో మార్క్స్ తన పౌరసత్వాన్ని కోల్పోయి ఉండడం చేత, అతనిని ఇప్పుడు దేశాన్నుండి వెళ్లగొట్టేశారు. ఏంగెల్స్ ప్రజాతిరుగుబాటులో పాల్గొని, మూడు యుద్ధాల్లో పోరాడి, తిరుగుబాటు ఓడిపోయిన తర్వాత స్విట్జర్లెండుకు తప్పించుకొని, అక్కడి నుండి లండన్ చేరుకున్నాడు.

అప్పటికే మార్క్స్ లండన్లో నివాసం ఏర్పరచుకొని అక్కడ స్థిరపడిపోయాడు. ఏంగెల్స్ మాంచెస్టర్ వెళ్లి, వెనుక తాను 1840లలో పనిచేసిన వర్తకపు కంపెనీ లోనే మళ్లీ గుమస్తాగా ప్రవేశించి, ఆ కంపెనీలోనే తర్వాత భాగస్థుడయ్యాడు. మార్క్స్ లండన్లోనూ, 1870 వరకు ఏంగెల్స్ మాంచెస్టర్ లోనూ నివసించినప్పటికీ, అత్యంత ఉల్లాసకరమూ, మేధోసంపన్నమూ అయిన వారిద్దరి ఉత్తర ప్రత్యుత్తరాల సాంగత్యానికి ఇదేమీ ప్రతిబంధకం కాలేదు. వారిద్దరూ ఒకరి పేర ఒకరు ఇంచుమించు ప్రతిరోజూ ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవారు. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలలో వారిద్దరూ విజ్ఞానాన్నీ, పరస్పరం ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకుంటూ శాస్త్రీయ సోషలిజాన్ని స్థాపించే కృషిలో ఒకరికొకరు సహాయపడుతూ తమ పనిని సాగిస్తూ వచ్చారు. 1870లో ఏంగెల్స్ తన నివాసాన్ని లండన్‌కు మార్చుకున్నాడు. అత్యంత శ్రమోత్సాహాలతో కూడిన వారిద్దరి ఉమ్మడి వైజ్ఞానిక జీవితం 1883లో మార్క్స్ చనిపోయే వరకూ నిరాఘాటంగా సాగింది. మార్క్స్ వంతు, మన యుగంలో అర్థశాస్త్రంపై అద్వితీయమై మహోత్కృష్టమైన ʹపెట్టుబడిʹ అనే గ్రంథమూ, ఏంగెల్స్ వంతు చిన్న పుస్తకాలు మొదలుకొని పెద్ద గ్రంథాల వరకూ అనేక రచనల రూపంలోనూ ఈ సమిష్టి శ్రమ ఫలించింది. పెట్టుబడిదారీ విధానపు ఆర్థిక వ్యవస్థ యొక్క క్లిష్ట సంఘటనల విశ్లేషణ, పరిశీలనపై మార్క్స్ కృషి చేశాడు. ఏంగెల్స్ తరచూ వాదోపవాదపూరితములైన గ్రంథాలనూ, సర్వసాధారణ శాస్త్రీయ సమస్యల పైననూ, భౌతిక చారిత్రక భావనా దృక్పథం నుండి, మార్నియన్ ఆర్థిక సిద్ధాంత దృక్పథం నుండి, గత, వర్తమాన కాలాల వివిధ ఘటనలను పరిశీలించి సులభశైలిలో గ్రంథాలను రచించాడు. ఏంగెల్స్ రచనలలో ఈ కింది వాటిని మనం పేర్కొనాలి: డ్యూరింగ్ ని ఖండిస్తూ రాసిన వాదోపవాద పూరితమైన గ్రంథం (తత్వశాస్త్ర, ప్రకృతిశాస్త్ర, సాంఘిక శాస్త్రాలలో అత్యంత ప్రధానమైన అనేక సమస్యలు ఈ గ్రంథంలో పరిశీలించబడ్డాయి)*, "కుటుంబం, వ్యక్తిగత ఆస్థి, రాజ్యాంగాల పుట్టుకʹ (రష్యన్ భాషలో అనువదించబడి సెంట్ పీటర్స్బర్గ్ లో ప్రచురించబడింది, 3వ కూర్పు, 1895), "లుడ్విగ్ ఫొయెర్ బాఖ్ 31 (జి. ప్లెహానోవ్ చే వివరణ సహితమైన రష్యన్ అనువాదం, జెనీవా, 1892), రష్యన్ ప్రభుత్వం యొక్క విదేశాంగ విధానంపై ఒక వ్యాసం (జెనీవాలో ʹసోత్సియాల్ డెమోక్రాట్ʹ పత్రిక 1,2 సంచికలలో రష్యన్ అనువాదం ప్రచురించబడింది), 32 గృహవసతి సమస్యపై అద్భుతమైన వ్యాస పరంపర; 3 ఇక ఆఖరున పేర్కొనవలసింది: రష్యా ఆర్థికాభివృద్ధి గురించి, చిన్నవైనప్పటికీ అత్యంత విలువైన రెండు వ్యాసాలు (ʹరష్యాను గూర్చి ఫ్రెడరిక్ ఏంగెల్స్ రచనలుʹ పేరుతో జసూలి చే రష్యన్ లోకి అనువాదం, జెనీవా, 1894). 84 పెట్టుబడిపై తాను రచించిన బ్రహ్మాండమైన గ్రంథాన్ని పూర్తి చేసే లోపలనే మార్క్స్ చనిపోయాడు. చిత్తు ముసాయిదా రూపంలో మాత్రం మార్క్స్ గ్రంథరచన పూర్తి చేశాడు. తన మిత్రుని మరణానంతరం ʹపెట్టుబడిʹ గ్రంథం యొక్క 2, 3 సంపుటాలను ముద్రణకు సిద్ధం చేసి ప్రచురించడమనే అత్యంత ప్రయాసభరితమైన కార్యాన్ని ఏంగెల్స్ స్వీకరించి, 2వ సంపుటాన్ని 1885లోనూ, 3వ సంపుటాన్ని 1894లోనూ ప్రచురించాడు (4వ సంపుటం ప్రచురణార్థం సిద్ధం చేయగలిగే లోపునే ఏంగెల్స్ చనిపోయాడు). ఈ 2 సంపుటాలను ప్రచురించడానికి అతడు బ్రహ్మాండమైన కృషి చేయాల్సి వచ్చింది. ఆస్ట్రియా దేశపు సోషల్ డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు ఆడ్లర్ ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ, ʹపెట్టుబడిʹ గ్రంథం యొక్క 2వ సంపుటాన్నీ, 3వ సంపుటాన్ని ప్రచురించడంలో తన మిత్రుడైన ప్రతిభాశాలి జ్ఞాపకార్థం మహనీయమైన చిహ్నాన్ని అతడు నిర్మించి, ఆ చిహ్నం పైన అప్రయత్నంగా తన పేరునే శాశ్వతంగా మలచుకొన్నాడు ఏంగెల్స్ అని అన్నాడు. వాస్తవానికి ʹపెట్టుబడిʹ గ్రంథం యొక్క ఈ 2 సంపుటాలు ఇద్దరు వ్యక్తుల - మార్క్స్, ఏంగెల - రచన. పురాతన గాథలలో ఇద్దరు స్నేహితులను గురించి మనసు కరిగించేటట్టి అనేక దృష్టాంతాలున్నాయి. మానవ మైత్రిని కీర్తిస్తూ రచించబడి హృదయాన్ని ద్రవింపజేసే వివిధ కథల నన్నింటినీ మించిపోయినట్టి స్నేహపాశాలతో బంధింపబడిన పండితులూ, యోధులూ ఇరువురు తన శాస్త్రాన్ని సృష్టించారని యూరప్ ఖండపు శ్రామికవర్గం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఏంగెల్స్ ఎల్లప్పుడూ కూడా - మొత్తం మీద సబబుగానే - మార్క్స్ పేరు ముందు చెప్పి తరువాత తన పేరు చెప్పుకునేవాడు. పాత స్నేహితుడు ఒకతని పేర రాస్తూ: ʹమార్క్స్ జీవించిన రోజుల్లో నేను వెనకపాట పాడేవాణ్ణిఅని రాశాడు ఏంగెల్స్. మార్క్స్ బతికున్నప్పుడు మార్క్స్ మీద అతనికున్న ప్రేమ, మార్క్స్ చనిపోయిన తర్వాత ఆయనను తల్చుకొని అతను చూపిన భక్తి గౌరవాలు అపారం. సాహసుడైన ఈ యోధునిలో, ఖచ్చితమైన ఈ తత్వజ్ఞానిలో ప్రేమపూరితమైన హృదయం స్పందించుతూండేది.

1848-1849 ఉద్యమం అనంతరం ప్రవాసంలో ఉన్న రోజుల్లో మార్క్స్, ఏంగెల్స్ లు శాస్త్రీయ పఠనా వ్యాసంగంలోనే కాలం గడపలేదు. 1864లో మార్క్స్ "అంతర్జాతీయ కార్మికుల సంఘంʹ అనే సంస్థను స్థాపించి, ఒక దశాబ్దం పాటు దానిని నడిపాడు. ఈ సంఘ కార్యకలాపాల్లో ఏంగెల్స్ చాలా చురుకైన పాత్రనే వహించాడు. మార్క్స్ ఉద్దేశాల ప్రకారం అన్ని దేశాలలో ఉన్న శ్రామికులనూ సంఘటితపరచడానికి స్థాపించబడిన ఈ అంతర్జాతీయ సంఘం, కార్మికవర్గపు క్రమాభివృద్ధిలో బృహత్తర ప్రాధాన్యత వహించింది. 1870 సంవత్సరాల్లో ఈ అంతర్జాతీయ సంఘం అంతమొందినప్పటికీ, ఐక్యతా సాధనలో మార్క్స్, ఏంగెల పాత్ర అంతటితో ఎంత మాత్రమూ ముగియలేదు. తద్భిన్నంగా కార్మికోద్యమమే నిరవధికంగా అభివృద్ది పొందుతూండడం కారణంగా కార్మికోద్యమం యొక్క ఆధ్యాత్మిక నాయకులుగా వారి ప్రాముఖ్యత నానాటికి మరింతగా పెరిగిందనే చెప్పాలి. మార్క్స్ మరణానంతరం ఏంగెల్స్ ఒక్కడే యూరప్ లోని సోషలిస్టులకు బోధకుడూ, నాయకుడూ అయ్యాడు. ప్రభుత్వం క్రూర నిర్బంధం సాగించినప్పటికీ, నిరంతరాయంగా దినదినాభివృద్ధి నొందుతూ పటిష్టమవుతున్నట్టి జర్మన్ సోషలిస్టులే కాకుండా, స్పెయిన్, రుమేనియా, రష్యా మొదలైన వెనుకబడిన దేశాల యొక్క - తాము తీసుకొనే ప్రాథమిక చర్యల ముందు వెనుకలు పునారాలోచించి ఆచి తూచి తీవ్రంగా ఆలోచించిన పిమ్మటే కార్యాచరణలోకి దిగవలసినట్టి - సోషలిస్టు ప్రతినిధులు కూడా సలహా కొరకూ, ఆదేశాల కొరకూ అతని వద్దకు వస్తుండేవారు. వయోవృద్ధుడైన ఏంగెల్స్ యొక్క విజ్ఞానానుభవ భాండారాన్ని వారందరూ స్వేచ్చగా వినియోగపరచుకునేవారు.

రష్యన్ భాషను పఠించి, రష్యన్ గ్రంథాలను చదవగలిగిన మార్క్స్, ఏంగెల్స్ లు, ఆ దేశం పట్ల ఔత్సుకమైన ఆసక్తిని చూపుతూ, రష్యన్ విప్లవోద్యమ గమనాన్ని సానుభూతితో గమనిస్తూ, రష్యన్ విప్లవకారులతో సంబంధాలను నెలకొల్పుకుంటుండేవారు. సోషలిస్టులు కాకముందు వారిద్దరూ కూడా ప్రజాతంత్రవాదులు; ఆ కారణం చేత రాజకీయ నిరంకుశత్వం పట్ల ప్రజాస్వామ్య ప్రియులకుండే ద్వేషం వారి హృదయాల్లో గాఢంగా నాటుకు పోయింది. ప్రత్యక్షమైన ఈ రాజకీయానుభవంతో మేళవించిన ప్రగాఢమైన సిద్ధాంత పరిజ్ఞానం వల్ల రాజకీయ నిరంకుశత్వానికీ, ఆర్థిక దోపిడీకి గల అవినాభావ సంబంధాన్ని గుర్తెరిగిన వారవడం చేతనూ, అపారమైన జీవితానుభవాన్ని సముపార్జించడం చేతనూ, ఖచ్చితంగా రాజకీయ దృక్పథాన్ని అవలంభించుతూనే అతిసున్నితమైన సహృదయానుభూతిని మార్క్స్, ఏంగెల్స్ ప్రదర్శింపగలిగేవారు. అచ్చంగా ఈ కారణం వల్లనే, అత్యంత బలోపేతమైనట్టి జారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టెడుమంది రష్యన్ విప్లవకారులు చేస్తున్న వీరోచిత ప్రతిఘటన, ఎన్నో అగ్ని పరీక్షలకు నిలిచిన ఈ విప్లవకారుల హృదయాల్లో గాఢమైన సానుభూతిని రేకెత్తించింది. ఇక రెండో వైపున, కేవలం భ్రమాజనితమైన ఆర్థిక ప్రయోజనాల కోసం ఆశపడి, రష్యన్ సోషలిస్టుల ప్రధాన కర్తవ్యమూ, తక్షణ కర్తవ్యమూ అయిన రాజకీయ స్వేచ్ఛను సాధించే లక్ష్యం పట్ల పెడముఖం పెట్టే వైఖరి సహజంగానే వారికి అనుమానాస్పదంగా కనపడడమే గాక, మహత్తరమైన సోషలిస్టు విప్లవోద్యమానికే ప్రత్యక్ష ద్రోహాన్ని తలపెట్టడమని వారు భావించారు. "శ్రామికవర్గ విమోచనను శ్రామికవర్గమే సాధించాలి" అని మార్క్స్, ఏంగెల్స్ లు నిరంతరం బోధిస్తూ ఉండేవారు. కాగా తన ఆర్థిక విమోచన సాధనకై పోరాడాలంటే, శ్రామికవర్గం కొన్ని రాజకీయ హక్కులను తన కోసం సంపాదించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా, రష్యాలో రాజకీయ విప్లవం సంభవించే పక్షంలో పాశ్చాత్య యూరప్ దేశాల కార్మికోద్యమానికి కూడా అది మహత్తర ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని వారు స్పష్టంగా గ్రహించారు. నిరంకుశ పరిపాలనను సాగిస్తున్న రష్యా సర్వసాధారణంగా యూరప్ లోని అభివృద్ధి నిరోధకాన్నంతటినీ నిరంతరం పరిరక్షిస్తున్న ఒక అభేద్యమైన బురుజు వలే ఉంటున్నది. అనేక సంవత్సరాలుగా జర్మనీ, ఫ్రాన్ల మధ్య వైషమ్య బీజాలను నాటినట్టి 1870 యుద్ధం ఫలితంగా, అంతర్జాతీయ రంగంలో రష్యా ఆక్రమిస్తున్న అత్యంత ఆశ్చర్యాన్ని గొలిపే అనుకూలమైన స్థానం, అభివృద్ధి నిరోధక శక్తిగా నిరంకుశ రష్యా యొక్క ప్రాముఖ్యతను సహజంగా మరింత ఇనుమడింపజేసింది. స్వేచ్ఛాయుతమైన రష్యా మాత్రమే, పోలెండ్, ఫిలాండ్, జర్మనీ, ఆర్మీనియా దేశస్థులనే కాకుండా మరేఇతర చిన్న జాతులనైనా సరే పీడించడానికిగానీ, ఫ్రాన్స్, జర్మనీలను ఒకదానిపై మరొక దానిని నిరంతరం ఉసిగొల్పడానికిగానీ అవసరంలేని రష్యా మాత్రమే, ఆధునిక యూరప్ ఖండాన్ని యుద్ధభారం నుండి తప్పించి, యూరలో ఉన్న అభివృద్ధి నిరోధక శక్తులనన్నింటినీ బలహీనపరిచి, యూరప్ దేశాలలోని కార్మికవర్గ శక్తిని పెంపొందించగలుగుతుంది. ఈ కారణం వల్లనూ, పాశ్చాత్య దేశాలలో ఉన్న కార్మికోద్యమ అభ్యుదయానికి సైతం రష్యాలో రాజకీయ స్వేచ్చ స్థాపనను ఏంగెల్స్ ప్రగాఢంగా వాంఛించాడు. ఏంగెల్స్ చనిపోవడంతో రష్యన్ విప్లవకారులు తమ ముఖ్య స్నేహితుణ్ని కోల్పోయారు.

శ్రామికవర్గ యోధుడూ, శ్రామికవర్గ ప్రవక్త అయిన ఏంగెల్స్ కీర్తి చిరస్మరణీయమై శాశ్వతంగా వర్ధిల్లుగాక !

-1895 శరత్కాలం.
(మార్క్స్ - ఏంగెల్స్ - మార్క్సిజం పుస్తకంలో నుండి)


No. of visitors : 887
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


లెనిన్-లెనినిజం

మడ్కం విజయ్ | 21.04.2020 11:26:59pm

లెనిన్ రివిజనిస్టులను కార్మికవర్గ ఉద్యమ శ్రేణులలో దాగిన సామ్రాజ్యవాద ఏజెంట్లుగా పరిగణించారు. ʹ....సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం, అది గనుక అవకాశవాద వ్యతిరేక.....
...ఇంకా చదవండి

లెనిన్

స్టాలిన్ | 21.04.2020 07:47:01pm

లెనిన్ ఓటమి పాలయ్యాడని నేను అన్నాను. కానీ అది ఎటువంటి ఓటమి? మీరు ఆయన ప్రత్యర్థులను అంటే స్టాక్ హోం కాంగ్రెస్ విజేతలైన ప్లెహనోవ్, ఆక్సల్ రాడ్, మార్టోవ్.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •