సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన

| సంపాద‌కీయం

సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన

- విరసం | 17.12.2019 01:51:02pm

బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం దేశాన్ని చుట్టేస్తోంది. అల్లకల్లోలం చేస్తోంది. గాలి పారాడకుండా చీకటి కొట్టులా మార్చేస్తోంది. కశ్మీర్‌ను బందీఖానాలోకి తోసేసింది. బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదంలో అత్యున్నత న్యాయస్థానం హిందుత్వ తీర్పును ప్రకటించింది. రాజ్యంగ వ్యతిరేకంగా ముస్లిం పౌరసత్వ సవరణ బిల్లును మూక బలంతో తీసుకొచ్చింది. చీకటి న్యాయానికి ఉరితాళ్లను పేనుతోంది. అన్ని సమస్యలకు, పోరాటాలకు, ధిక్కారాలకు హింసాత్మక సమాధానాలు చూపిస్తోంది. మూకుమ్మడి ఎన్‌కౌంటర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేజేలు పలుకుతున్నాయి. నాలుగు వైపుల నుంచి ఫాసిజం చుట్టుముడుతున్న వేళ విరసం యాభై ఏళ్ల సభలు జరుగుతున్నాయి. ఉత్పత్తి కులాలు, ముస్లింలు, ఆదివాసులు, మహిళలు నెత్తురోడుతున్న సందర్భం ఇది. పశ్చిమ కనుమల నుంచి దండకారణ్యం, ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతాల దాకా లక్షల సైన్యం విప్లవోద్యమ నిర్మూలనకు తలపడుతున్న యుద్ధ సన్నివేశంలో ఈ సభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కన్నీళ్లు, ధ్వంసమైపోతున్న మానవ దేహాలు, కలుషితమవుతున్న సాంస్కృతిక విలువలతో చీకటి ఆవరిస్తున్న సన్నివేశంలో ఈ సభలకు తెలుగు సాహిత్యలోకం సిద్ధమవుతోంది. సారాంశంలో మావోయిస్టు రహిత, ముస్లిం రహిత అఖండ భారత్‌ కోసం బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం బరితెగించిన సంక్షోభ సందర్భంలో విరసం తన యాభై వసంతాల మహా సభలు జరుపుకోబోతోంది.

అందుకే ఇది వసంతాలు పూచే కాలమా? కవులు గొంతెత్తి స్వేచ్ఛాగానం చేసే దేశమా? విరసం చరిత్రలో కూడా యాభై వసంతాలతోపాటు యాభై శిశిరాలు కూడా ఉన్నాయి. ప్రతి వసంతమూ మానవులు పరిమళించే తీరం వైపు వొరిగిపోయిందే. ప్రతి సంక్షోభమూ రేపటి మీద పైచేయి కోసం సాచినదే. శిశిర వసంతాల కలనేతలోంచే మానవ జాతి సుందర భవితవ్యం కోసం విరసం తన కాల్పనికశక్తినంతా ధారపోస్తున్నది.

విరసం ఏర్పడ్డాక ఆర్నెల్లకల్లా విప్లవ రచయితల అరెస్టులు, పుస్తక నిషేధాలు మొదలయ్యాయి. ఇప్పటి దాకా మూడు తరాల విరసంలో కనీసం ఒక్క అక్రమ కేసైనా మోయని, ఒక్కసారైనా ఖైదు కాని సభ్యులు లేకపోవచ్చు. రచన కోసం, విశ్వాసం కోసం చిత్రహింసలు అనుభవించిన సభ్యులు ఎందరో. ఏండ్ల తరబడి జైలు జీవితం గడిపిన వారెందరో. ఈ యాభై ఏళ్ల సందర్భంలో కూడా వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు, సీనియర్‌ సభ్యుడు జిఎన్‌ సాయిబాబ, కార్యవర్గ సభ్యుడు జగన్‌ దీర్ఘకాలంగా జైల్లో ఉంటున్నారు. కార్యవర్గ సభ్యుడు కాసిం మీద ఏడు కుట్ర కేసులు ఉన్నాయి. ఎందరో విరసం సభ్యుల మీద ఇలాంటి కేసులు ఉన్నాయి. ప్రతి సృజన స్వరం మీద కత్తి వేలాడుతేనే ఉన్నది. అయినా ధిక్కారమే తన నైజమని విరసం చాటి చెప్తోంది. రచన కోసం, ఆలోచన కోసం, అంతిమంగా ఈ దేశ ప్రజల విముక్తి కోసం ఎడతెగని రాపిడిని యాభై ఏళ్లుగా అనుభవిస్తున్నది. విరసంలోని ఈ శక్తి అంతా అట్టడుగు ప్రజల వర్గపోరాటాలలో ఉన్నది. సాంఘిక స్వేచ్ఛా ఉద్యమాలలో ఉన్నది. అందుకే తరతరాల ఈ నేల బిడ్డల ధిక్కారానికి తనను తాను వారసురాలిగా విరసం మొదట్లోనే ప్రకటించుకున్నది. నిర్బంధాలు, అణచివేతలు, ఆటుపోట్ల మధ్య విస్తారమైన అనుభవాలను గడించింది. ప్రపంచ సాహిత్య చరిత్రలో ఇలాంటి రచయితల సంఘంగా తానే ఒక ఉదాహరణగా నిలబడింది. అక్షరం కోసం అణచివేతను ఎదుర్కొంటున్నది.

ఇవాళ దేశవ్యాప్తంగా ప్రగతిశీల బుద్ధిజీవులు, రచయితలు ఇలాంటి హింసను అనుభవిస్తున్నారు. ఎందరో ఆలోచనాపరులను ఫాసిజం బలి తీసుకున్నది. దేశవ్యాప్తంగా అపూర్వమైన మేధావులను ఫాసిస్టు రాజ్యం ఖైదు చేస్తున్నది. వాళ్ల కంఠస్వరానికి, కలం పదునుకు భయపడిపోతున్నది. ఇక అసంఖ్యాక ఆదివాసులు, ముస్లింలు, దళితులు వేల సంఖ్యలో జైళ్లలో ఉన్నారు. ʹప్రశాంతʹ పాలన కోసం ఫాసిజం మరిన్ని అప్రజాస్వామిక చట్టాలను తీసుకొస్తోంది. బ్రాహ్మణీయ పార్లమెంటరీ విధానం ద్వారానే ఫాసిజం పెచ్చరిల్లుతున్నది.

సమాజాన్ని భయానికీ, అభద్రతకు, నిరాశకూ లోనుచేయడమే ఫాసిజం లక్షణం. ఇక మనమేమీ చేయలేమనే నిస్సహాయతను పోరాటశక్తులపై పులమడమే ఫాసిజం. సమాజమంతా మౌనంలోకి జారిపోవడమే ఫాసిజానికి కావాలి. ఇదీ ఇవ్వాల్టి కవి సమయం. హృదయాన్ని సాచి మానవ ప్రేమను ప్రకటించదల్చుకున్నావా? జైలుపాలు కావాల్సి వస్తుందని ఫాసిజం హెచ్చరిస్తున్న సాహిత్య సందర్భం.

ఈ విపత్కర పరిస్థితిల్లో కూడా విరసం తన అచంచలమైన నిర్భయ ప్రకటన చేయడానికే ఈ సభలు నిర్వహిస్తోంది. ఫాసిజం ఓడిపోతుందని, ప్రజలు జయిస్తారని, భవిష్యత్‌ కార్మికవర్గానిదేనని చెప్పడానికి ఈ సభలు జరుపుతోంది. చరిత్రలో ఫాసిజం ముసిరిన వేళ సాహసోపేతంగా జీవించి, మరణించిన రచయితలు, కళాకారులు తనకు ఆదర్శం. రాజ్యం నిరంకుశంగా మారినా, సామాజిక హింస పెచ్చరిల్లినా, ప్రగతిశీల మార్పులు సంక్షోభంలో పడినా విప్లవ రచయితలకు కల చెదిరపోదు. గుండె చెమ్మగిల్లవచ్చుగాని విషాదాన్ని ఆలింగనం చేసుకోరు. నిస్పృహ గీతాలను ఆలపించరు. ఇది మొండి ధైర్యం కాదు, చారిత్రక పరిణామాల మీద తార్కిక అంచనా. ఈ కల్లోలాన్ని రద్దు చేసే శాస్త్రీయ ఆచరణకు సిద్ధం కాగలమనే విమర్శనాత్మక వైఖరి.

చరిత్ర పొడవునా ఎన్నో భావజాల యుద్ధాలు జరిగాయి. ఇప్పుడది తీవ్రస్థాయికి చేరుకుంది. రాజ్యమే మత భావజాలానికి అధికార ప్రతినిధి అయింది. పైకి ఇది ఎట్లా కనిపించినా దేశంలోని ఆర్థిక సంక్షోభమే ఈ ఫాసిజానికి మూలం. ఆస్తి సంబంధాల సంఘర్షణలో దోపిడీ వర్గ ప్రయోజనాల కోసం ఇదంతా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిణామాల్లో భాగంగా మన దేశంలో ఫాసిజం వచ్చింది. ఇది సమాజాన్నే భౌతిక, భావజాల యుద్ధాల మధ్యలోకి తీసికెళ్లింది.

విరసం నక్సల్బరీ శిశువుగా ఈ పరిణామాలను మొదటి నుంచి అర్థం చేసుకొని విశ్లేషిస్తోంది. మతాన్ని మతవర్గతత్వంగా చూడాలని, మన దేశంలో ఫాసిజాన్ని బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజంగా చూడాలని చాలా కాలం కిందే సూత్రీకరించింది.

సనాతన సంప్రదాయాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, రివిజనిజాన్ని తిరస్కరిస్తూ ముందుకు వచ్చిన నక్సల్బరీ పంథాను సామాజిక పీడనలన్నిటికీ, ఫాసిస్టు అణచివేత రూపాలన్నిటికీ వ్యతిరేకంగా సాహిత్య సాంస్కృతిక మేధో రంగాల్లోకి తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలో శ్రామిక ప్రజల సాయుధ పోరాటానికి సృజనాత్మక వ్యక్తీకరణ అయింది. అట్టడుగు కులాల, శ్రామికుల నిర్దిష్ట జీవితాన్ని సాహిత్య ఇతివృత్తం చేసింది. ప్రజల పలుకుబళ్లను, మాండలికాలను సమున్నతంగా ఎత్తిపట్టింది. జానపద, మౌఖిక కళారూపాలకు, దేశీయ సంప్రదాయాలను ఎనలేని ప్రాధాన్యతను తీసుకొచ్చింది. సాహిత్య విమర్శను తత్వశాస్త్రం, చారిత్రక భౌతికవాదం, రాజకీయార్థిక శాస్త్రం, చరిత్ర తదితర సామాజిక శాస్త్రాల పునాది మీద శక్తివంతం చేసింది. విప్లవానికి ఉండే బహుముఖీన కళాత్మకతనంతా తన రచన, ఆలోచన, ఆచరణల ద్వారా ప్రపంచానికి చాటి చెప్తున్నది.

తన లక్ష్య ప్రకటనకు, దృక్పథానికి కట్టుబడి ఐదు దశాబ్దాల తెలుగు సమాజ చరిత్రలో విరసం భాగమైంది. విప్లవ సాహిత్య సంస్థగా ఇదొక అరుదైన సందర్భం. అన్ని రకాల ప్రజా పోరాటాలను, ధిక్కారాలను తనలో సంలీనం చేసుకొని సమకాలీన ప్రజా ఆంక్షలకు సృజనాత్మక వేదికగా నిలబడింది. నూతన ఆలోచనలకు అవసరమైన ప్రజాస్వామిక భూమికను ఏర్పరిచింది. దీని వల్ల తెలుగు సాహిత్యంలో అనేక ధిక్కార స్వరాలు వెల్లువెత్తడానికి విరసం కూడా కారణమైంది. తరతరాల సాంఘిక విముక్తి ఆకాంక్షలు, ఉద్యమాలు వర్గపోరాట ప్రేరణ వల్ల బలోపేతం అయ్యాయి. వ్యవస్థ మార్పుతోపాటు పితృస్వామ్యం, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన చైతన్యాలు తెలుగు సాహిత్య రంగాన్ని ప్రజాస్వామికీకరించాయి. ఆధిపత్య శక్తులకు, భావజాలానికి వ్యతిరేకంగా సమానత్వం ఒక ప్రధాన విలువగా స్థిరపడింది. వర్గపోరాటం కళా సాహిత్యాలతోపాటు ఉపరితల జీవన రంగాలన్నిటినీ కుదిపివేస్తుందనడానికి తానే ఒక సజీవ చారిత్రక సాక్ష్యం.

ఈ విజయాలన్నీ విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమం ఒక్కటే సాధించలేదు. ధిక్కారం, రాజ్య వ్యతిరేకత గీటురాయిగా గల సోదర సాహిత్య కళా సంస్థలు, అద్భుతమైన సృజనకారుల అండదండలతోనే ఇవన్నీ చేయగలిగింది. ఉమ్మడి కృషి వల్లనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. అన్ని సంక్షోభాల్లో అండగా నిలిచే మూడు తరాల మిత్రులు విరసానికి అసంఖ్యాకంగా ఉన్నారు. స్నేహపూర్వక విమర్శలతో కొత్త వెలుగును అందించిన సన్నిహితులు ఎందరో ఉన్నారు. తమ రక్తతర్పణతో వర్గపోరాటాలను పదునెక్కిస్తున్న ప్రజలు అందించే ఉత్తేజం లేకుండా, దిశా నిర్దేశం లేకుండా విరసం ఏ పనీ చేయగలిగేది కాదు. ఆ ప్రజలతో నడుస్తూ కలిసి రచించడమే విరసం బలం.

యాభై ఏళ్ల పోరాటంలోని సంక్షోభాలను, సవాళ్లను, చీకటి వెలుగులను, విజయ దరహాసాలను, కన్నీటి చారికలను, చీకటి జైలు అనుభవాలను విరసం ఈ యాభై ఏళ్ల సందర్భంలో తరచి చూసుకుంటోంది. సమీక్షించుకుంటోంది. మార్క్సిజంలోని విమర్శనాత్మకతే విరసం చైతన్యం. చరిత్రపట్ల అంతులేని తార్కిక విశ్వాసంతోపాటు వినయం, వినడం, నేర్చుకోవడం, తనలోని తాను తొంగి చూసుకోవడం, పున:సంఘటితం కావడం విరసం జీవధాతువు. దీని వల్లే చారిత్రక శక్తుల సంఘర్షణలోంచి పుట్టిన విరసం తానే సాహిత్యరంగంలో చరిత్ర కాగలిగింది.

(విరసం 27వ మహా సభల సంధర్భంలో , 11, 12 జనవరి 2020, హైదరాబాదు)

No. of visitors : 758
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


Message from US Coalition to Free Professor Saibaba

US Coalition to Free Professor Saibaba | 17.01.2020 01:43:27pm

Virasamʹs work has been a true inspiration to people in the United States. We in the US Coalition to Free Professor Saibaba hope to continue to engage with ...
...ఇంకా చదవండి

Noam Chomsky Message

Noam Chomsky | 17.01.2020 01:36:26pm

the 50th anniversary conference will carry this project forward while also helping to build resistance to Modiʹs cruel and destructive policies....
...ఇంకా చదవండి

చీక‌టి కాలంలో అరుణారుణ అక్ష‌ర వెలుగుదారి

విర‌సం | 17.01.2020 01:50:17pm

విర‌సం 50 ఏళ్ల చ‌రిత్ర అంటే యాభైఏళ్ల దుఃఖం, నిర్భంధం అంత‌కంటే ఎక్క‌వ స్పూర్తి మంత‌మైన ప్ర‌యాణం అని యాభై వ‌సంతాల విప్ల‌వ సాహిత్యోద్య‌మంపై మాట్లాడిన కాశీం అన్...
...ఇంకా చదవండి

నా ఆలోచ‌న‌లు, ఉద్వేగాలు మీతోనే

వరవరరావు | 17.01.2020 01:55:30pm

ఈ దేశపు పోరాడే ప్రజల హృదయాల్లో మనం సాధించుకున్న పేరుకు తగినట్లుగా మనం నిలబడవలసి ఉంది. మావో చెప్పినట్టు మనం ఎప్పుడూ వర్గ పోరాటాన్ని విస్మరించకుండా ఉండ వలసి ఉ...
...ఇంకా చదవండి

యుద్ధ స్వప్నాలు - దండకారణ్యం కథలు

అనిశెట్టి రజిత | 17.01.2020 01:19:33pm

ఆడవాళ్ళు అన్ని వేళలా అన్ని సమజాల్లోనూ గొడ్లకంటే హీనంగా చూడబడుతారు. 2009 కాలంలో నాటి ఆదివాసుల సంప్రదాయాలు, ఆచారాలు దానికి బలయ్యే ఆడవాళ్ళు, ఆ వాతావరణాన్ని చిత...
...ఇంకా చదవండి

మూడు తరాల నవయవ్వనం

పాణి | 17.01.2020 01:40:43pm

ఈ యాభై వసంతాల్లో ఆ నవ్యత విరబూయాలనుకుంటున్నది. దాని కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ తరానికి విరసం చరిత్రను పరిచయం చేయడానికే ఈ పుస్తకం. అట్లని ఇది చరిత్ర ...
...ఇంకా చదవండి

మాయమైపోయిన కథానాయకుడ్ని విరసమే వెదికి తేవాలి...!

కుప్పిలి పద్మ | 17.01.2020 01:22:39pm

యీ కనిపించే సమాజానికి సమాంతరంగా తీవ్ర నిర్బంధాల నడుమ ప్రవహిస్తోన్న సాహితీధార విలువైనది. అద్భుతమైనది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంఘిక వుద్యమాలుంటేనే సాహిత్య...
...ఇంకా చదవండి

గోడ మీది బొమ్మ

దాదా హయత్ | 17.01.2020 01:25:42pm

ఈసారి వెకిలి నవ్వు కాదు. గర్జించడానికి రష్యా లేదు. గాండ్రించడానికి చైనా లేదు. అయినా ఆ గొంతు వుంది - ఇప్పటికీ వుంది. ఈ యాభై ఏళ్ళ కాలంలో కూలిపోనిది ఒకటే వ...
...ఇంకా చదవండి

ఒక మానవునిగా నన్ను ప్రభావితం చేసిన సాహిత్య ఉద్యమం

బాలసుధాకర మౌళి | 17.01.2020 01:30:04pm

ఒక భావజాలం ఇంత సుదీర్ఘకాలం రేపుపై అచంచల విశ్వాసంతో, కలలతో సాగటం- అదీ అనేకమంది సాహిత్యజీవులను ప్రభావితం చేస్తూ కలుపుకుంటూ సాగటం- ఎన్ని అవాంతరాలెదురైన విప్లవ...
...ఇంకా చదవండి

ఫాసిజానికి వ్యతిరేకంగా...

విర‌సం | 17.01.2020 01:10:23pm

ఏ నాగరికతను, సంస్కృతిని ఫాసిజం ఆధారం చేసుకున్నదో దానిలోని ప్రజాధారను ఆయుధంగా మలిచి దాని మీద ఎక్కుపెట్టవలసి ఉన్నది. దేశీయమైన హేతుచింతనా క్రమాలను ప్రగతి అనే గ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •